Showing posts with label క్రిస్టమస్. Show all posts
Showing posts with label క్రిస్టమస్. Show all posts

క్రిస్మస్ అయిపోయిందా!? (Is Christmas done!?)

క్రిస్మస్ అయిపోయిందా!?

నమస్తే మిత్రమా.., మిద్దె మీద స్టార్ పెట్టావా, ఇంట్లో చెట్టు పెట్టావా, ఇంటి చుట్టూ డెకరేషన్ చేసావా, పిండి వంటలు వండి అందరికీ పంచిపెట్టావా, కొత్త బట్టలతో అలంకరించుకుని చర్చిలో హంగామా చేసావా, అబ్బో ఇంకా బోలెడన్ని ఉంటాయి కదా ఒక్కటేమిటి పాటలు, డాన్సులు ఇలా చాలా చేసే ఉంటావు కదా! అయిపోయిందా..? ఈ సంవత్సరానికి నీ క్రిస్మస్ సందడి... 

మరి నాదో సందేహం మిత్రమా ఇవన్నీ చేసావు కదా వీటన్నిటి వలన నీకేమి ఒరిగింది? దేవునికి ఏమి ఒరిగింది? అసలు నువ్వు చేసిన పుట్టినరోజే క్రీస్తుది కదా మరి ఆయనకి ఏమి ఒరిగింది???

చాలామంది ఈ ప్రశ్నలకు ఏం చెప్తారో తెలుసా! మేము ఇవన్నీ చేయటం వలన దేవుని మహిమపరిచాము అని చెప్తారు. ఒక్కసారి  నీ మనస్సాక్షిని అడుగు మిత్రమా నువ్వు నిజంగా దేవుని మహిమపరిచావా?🤔 ఎప్పుడూ దేవుని సన్నిధికి రానివారు ఆరోజు వస్తారు, ఏనాడు నీకు వందనములు చెప్పనివాడు ఆరోజు నీకు విష్ చేస్తాడు, సంవత్సరమంతా లోకంలో భయంకరంగా బ్రతికినవాడు ఆరోజు మాత్రం స్టేజీలు ఎక్కి పాడుతాడు, డాన్స్ చేస్తాడు… ఇది ప్రతీ సంవత్సరం రిపీట్ అవుతూనే ఉంటుంది అయినా కూడా నువ్వు సమర్ధిస్తావు..

మరి ఇలాంటి వ్యక్తులను సమర్థించే నీవు దేవుని ఎలా మహిమ పరుస్తావు..? అబ్బే లేదు.. లేదు.. మేము ఇలా చేయడం వలన సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అని చెప్పాలనుకుంటున్నావా? అసలు సువార్త అంటే ఏంటో తెలుసా నీకు..  ఆనాడు క్రీస్తు ఇలాగే దేవుని రాజ్యసువార్త చేశాడా? అపోస్తులులు ఇలాగే ప్రకటించారా? ఆదిమ క్రైస్తవులు ఈ రకంగానే ఏటేటా క్రీస్తు పుట్టినరోజుని చేసి అన్యుల మధ్య నడుచుకున్నారా? లేదు కదా మరి నువ్వేంటి మిత్రమా నీకు తోచిన సమాధానం చెప్పి నిన్ను నీవు సమర్ధించుకుంటున్నావు….

నిజంగా దేవుడు ఇదే కోరుకుంటున్నాడా!!  క్రిస్మస్ పేరుతో అన్యాచారాలు చేస్తే ఆయన సంతోష పడతాడా? నీ సంతోషాల కోసం, పండగ పేరుతో నువ్వు ఎంజాయ్ చేయడం కోసం ఆయన పేరును ఎందుకు మధ్యలోకి లాగుతావు...  ఇలాంటి లోకానుసారమైన పద్ధతులు పాటించడం వలన ఆనాటికి నీకు సంతోషం కలగచ్చు కానీ దేవుని సముఖంలో నీకు  ఏమాత్రం మేలు కలగదు.. నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే సత్యం. 


క్రీస్తు మానవాళి పాపక్షమాపణ నిమిత్తం భూమి మీదకు వచ్చాడు. (మత్తయి. 1:21; లూకా 5:24; 24:47) కానీ భూమి మీద తాను ఎటువంటి ఆడంబరాలు చేసుకోవడానికి రాలేదు. అంతేకాదు మిత్రమా ఆయన శరీరాధారిగా ఈ భూమిమీద ఉన్నపుడు ఏ అడంభరము చేసుకోలేదు చేయమని ఎవ్వరినీ కోరలేదు ఇంకా వాస్తవమేమిటంటే తలదాల్చుకొనుటకైననూ ఆయనకు స్థలము లేదు. (మత్తయి. 8:20; లూకా. 9:58)  ఆ మహానుభావుడు సర్వోన్నతుడైన దేవునికి కుమారుడై ఉండి దరిద్రతను అనుభవించాడు కదా.  దేనికోసం...? (2 కోరింథీ. 8:9) ఈరోజు నువ్వు ఇవన్నీ చేసి ఆయన చేసిన త్యాగాన్ని నవ్వులపాలు చేయడానికా?!!!

నీవు ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు మిత్రమా,! నీవు ఆ త్యాగమూర్తి చేత అంగీకరింపబడాలంటే ఆయన చెప్పిన మార్గంలో నడచుకోవాలా లేక ఈ లోకం కొరకు అంటే కేవలం ఈ లోకం వరకు మాత్రమే అట్టహాసలతో బ్రతికితే సరిపోతాదా? (లూకా. 6:46-49)

ఈ లోకంలో తాము గొప్ప సేవకులమని చెప్పుకొనువారు, మా తాత ముత్తాతల నాటి నుండి మేము క్రైస్తవులమని గర్వంతో చెప్పుకునే తిరిగేవారు, ఇంకా క్రీస్తు గురించి, బైబిలు గురించి అసలు అవగాహన లేనివారు క్రిస్మస్ పేరుతో చేసే పనులు నీకు కానరావట్లేదా? నీ మనసును గద్ధించట్లేదా? కొందరేమో గొప్పలకోసం పెద్ద పెద్ద స్టేజీలు కట్టిస్తారు, కొందరేమో మనకేదో దేవుని పాటలు కొదువైనట్టు తెలిసి తెలియని జ్ఞానంతో పాటలు రాసి వాటిని సినిమా పాటల స్టైల్లో పాడుతున్నారు ఇంకొంతమంది ఏకంగా సినిమా పాటల ట్యూన్లే వాడేస్తున్నారు.. ఇది ఎంతవరకు సమంజసం? ఏనాడైనా ఆలోచించావా? నువ్వు నిజంగా క్రైస్తవుడవైతే నిజంగా నీ గమ్యం పరలోకం అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తావు. (రోమా. 12:17; 13:14; 1 యోహాను. 4:1-3)

ఈరోజు మనం క్రీస్తుని ఎరిగామంటే దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఈనాడు పేరు చెప్పుకునే సేవకుడని అనుకోకు, లేదా నీ తల్లి తండ్రి అని అనుకోకు లేదా ఇంకెవరో అని భ్రమ పడకు. దానికి కారణం ఆ అపోస్తులలు కన్నీటి ఫలితం. క్రీస్తు తమకు ఏదైతే చెప్పాడో అది మాత్రం ఈ లోకంలో ప్రకటన చేసి తాము కూడా  అలాగే జీవించి తమ ప్రభువు నిమిత్తం హతసాక్ష్యులగా మారి, క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమను కడవరకు చూపించి ఘోరంగా హింసింపబడిన వారి త్యాగఫలం. నిజంగా వారు పడిన పాట్లు, వారు పొందిన హింస, వారు అనుభవించిన శ్రమ నీవు ఎరిగి ఉంటే, క్రీస్తు నిమిత్తం శ్రమపడినప్పుడు, శోధింపబడినప్పుడు  వారు పొందిన ఆనందము, వారి అనుభవం జ్ఞానపూర్వకంగా నీవు ఎరిగి ఉంటే ఈ(లోక) రీతిగా జీవించవు మిత్రమా! 

నువ్విలా అన్యాచారలతో బ్రతకడానికా క్రీస్తు సిలువ మరణం నొందాడు, నువ్విలా అపవాదితో చేతులు కలపడానికా ఆనాటి భక్తులు హతులయ్యారు? నిజంగా ఇందుకేనా క్రీస్తు ఈలోకానికి వచ్చాడు ? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో మిత్రమా! 

క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు చేయడం, గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు మరణాన్ని ప్రచారం చేయడం ఇదేనా క్రైస్తవ్యం?! ఇవి చేస్తే చాలు మేము క్రైస్తవులమైపోతాం అని చెప్పుకున్నవారు లేకపోలేదు.. మరి  మనుష్యుల పద్ధతి చొప్పున చేసిన నువ్వు ఒక క్రైస్తవుడవని చెప్పుకుంటే  మరి హతులైన అపొస్తులులు ఎవరు, హింసింపబడిన ఆదిమ సంఘస్తులు ఎవరు? ఏ ఆడంబరాలు లేకుండా కేవలం క్రీస్తు నిమిత్తం బ్రతికిన వారికి నీకు ఒకటే పేరా? ఆలోచించు.. 

కేవలం నీ సంతోషం కొరకు నువ్వు ఇవన్నీ చేసావని, చేస్తున్నావని నీ మనస్సాక్షి ఇప్పటికే సెలవిచ్చి ఉండచ్చు అయినా కూడా నిన్ను నీవు సమర్ధించుకుంటే చివరిగా ఒక మాట! 


🔎 ఒక క్రైస్తవుడికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? 

1.  క్రీస్తు యొక్క త్యాగాన్ని ఆత్మానుసారుడై,  హృదయానుసారంగా గుర్తించినప్పుడు. - (ఫిలిప్పీ. 2:4-8; హెబ్రీ. 2:14-15)

2. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా, ఆత్మతోను, సత్యముతోను, హృదయముతో యథార్థముగా దేవుని (తండ్రిని) ఆరాధించినప్పుడు. - (యోహాను. 4:20-24)

3. ఆదివారము ప్రభువుబల్లలో పవిత్రమైన చేతులతో చేయి పెట్టినప్పుడు. - (అపో. కార్య. 20:7; 1 కోరింథీ. 11:17-34)

4.  క్రీస్తు నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు ఓపికతో, సహనంతో ఆ శ్రమను జయించినప్పుడు. - ( యాకోబు. 1:2; 1 పేతురు. 1:7)

5.  శోధన సహించినప్పుడు. - (యాకోబు. 1:12)

6. సహోదరులతో సహవాసం కలిగియున్నప్పుడు. - (అపో.కార్య. 2:42; 1 యోహాను. 1:3; 1 కోరింథీ. 7:24)

7. నీ ప్రవర్తనతో ఇతరులను క్రీస్తు నొద్దకు నడిపించినప్పుడు. - (1 తిమోతీ. 4:12; ఎఫెసీ. 4:22; 1 కోరింథీ. 15:34; యాకోబు. 3:13; 1 పేతురు. 1:14)

8. నీవు దేవునికి దగ్గరగా ఉన్నావని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యమిచ్చినప్పుడు. - (అపో. కార్య. 24:16; రోమా. 2:15; హెబ్రీ. 10:22; 1 పేతురు. 2:19; 3:21)

9. అపవాదిని ఓడించి క్రీస్తు పక్షాన విజయాన్ని పొందుకున్నప్పుడు. - (రోమా. 16:20; 2 కోరింథీ. 10:1-7). 


📖ఇవేమీ నీకు అనుభవం లేకపోతే నీవు క్రైస్తవుడవు కాదు మిత్రమా ఇది నేను చెప్పుటలేదు దేవుని గ్రంథమే సెలవిస్తుంది.


ఇప్పుడు చెప్పు మిత్రమా ఇంత ఖర్చుపెట్టి, అట్టహాసంగా క్రిస్మస్ అనే అన్య పండుగను చేసావు కదా నీకేమి ఒరిగింది? ఏం సాధించావు? నువ్విలా చేయడం వల్ల క్రీస్తుకు ఏమి ఒరగలేదు మిత్రమా ఎందుకంటే ఆయన కోరుకునేది ఆయన పక్షాన నిలబడేవారిని తప్ప ఈ లోకనుసారులను కాదు. క్రీస్తు పక్షాన నిలబడేవారెవరో నీకు ఇప్పటికే అర్ధమయ్యి ఉండాలి. 

దేవుడు ఇటువంటి పండుగలు కోరలేదు, అట్టహాసాలు కోరలేదు, సంబరాలు అంతకంటే కోరలేదు. ఆయనకు కావల్సింది యదార్థ హృదయం మరియు తన కుమారుని పక్షాన సైన్యంలో పోరాడే యోధులు.

సమయం లేదు నీ నిర్ణయం ఏమిటో ఆలోచించుకో క్రీస్తు సైన్యంలో సైనికుడిగా ఉంటావా అపవాది పక్షాన ఉంటావా!?

మీ ఆత్మీయులు👪

Topic Link
1. క్రిస్టమస్ పేరుతో అపవాది మోసం Visit
2. క్రైస్తవులకు ఆజ్ఞాపించని పండుగలు Visit
3. క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చెయ్యరు? Visit
4. మత్తయి, లూకా 2వ అధ్యాయం? Visit

క్రైస్తవులు పుట్టినరోజు జరుపుకోవచ్చా?(Can Christians Celebrate Birthday?)

 

క్రైస్తవులు పుట్టినరోజు జరుపుకోవచ్చా?

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏

                    ఈరోజులలో అనేకమంది పుట్టినరోజు అనగానే అది తనకు ఒక ప్రత్యేక దినముగా భావించి, కొత్తబట్టలు కొనుక్కొని, బంధువులు సన్నిహితులతో కలసి కేక్ మీద క్యాండిల్ వెలిగించి, ఊదిన వెంటనే అందరి నోట నుండి వచ్చే "హ్యాపీ బర్త్ డే టూ యూ" అనే ట్యూన్ ల మధ్య తన కేక్ కట్ చేస్తూ, ఒకరినొకరు తినిపించుకొంటూ, పార్టీ చేసుకొంటూ ఆనందించడం మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పద్ధతి ఇటు క్రైస్తవేతరులలోనూ(అన్యులు) మరియు అటు క్రైస్తవులని పిలువబడిన వారిలోనూ లేకపోలేదు.

క్రైస్తవులని పిలువబడిన వారి విషయానికి వస్తే... మా చుట్టుపక్కల క్రైస్తవులు మరియు ఆయా సంఘాలు వారు చేసుకొంటున్నారుగా.. మా సేవకుడు అతని  కుటుంబములో చేస్తున్నాడు కాబట్టి మేము చేస్తున్నామనేవారు.. కేవలం మేము మా పిల్లలు  లేదా  మా కుటుంబీకుల సంతోషం కొరకై చేస్తున్నామనేవారు..  మరికొందరు ఇలా చేయడం వలన తప్పేమీ? పాపమేమైనా చేస్తున్నామా?  పుట్టినరోజు వేడుకల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యమేముంది? మనం చేసుకోకూడదని బైబిల్ లో ఎక్కడ ఉంది? అనేవారు ఉన్నారు.. మేము ఈ విధంగానైన దేవున్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నామని, ఇది కేవలం మామూలు విషయమే అని దీని గూర్చి ఇంకా ఆలోచించే పని ఏముందంటూ పలురకాల మనుషులు మన మధ్య లేకపోలేదు. 

మరికొందరైతే తాము చేసే దానిని సమర్ధించుకోవడానికే "..మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. (కొలొస్స. 3:17) అనే ఈ వాక్యాన్ని తమ పుట్టినరోజు వేడుకులకు అనుగుణముగా మలుచుకునే వారు కూడా లేకపోలేదు.


           ఐతే ఈ అంశాన్ని చదువుతున్న నీవు ఒక సత్యాన్వేషివైతే...

Ⅰ. పుట్టినరోజు యొక్క చరిత్ర ఎవరు, ఎక్కడ, ఎలా ప్రారంభించారు? 

Ⅱ. ప్రపంచం అంతట ఎప్పుడు వ్యాపించింది? 

Ⅲ. బైబిల్ ఏమి సెలవు ఇస్తుంది?

Ⅳ. నిజ క్రైస్తవుడు పుట్టినరోజు చేసుకోవచ్చా?

పై  విషయాలను ఈ ఒక్క అంశము ద్వారా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 


📚 పుట్టినరోజు చరిత్ర 📚


✅ఐగుప్తీయులు కాలములో : 


⤔ క్రీ.పూ. 3000 సం. క్రితమే ఐగుప్తీయులు(ఈజిప్షియన్స్) ఈ పుట్టినరోజు వేడుకలను మొట్టమొదటిగా ప్రారంభించారు.

⤔ పురాతన ఈజిప్టులో ఈజిప్షియన్  ఫరోలు పట్టాభిషేకం చేసినప్పుడు, ఆరోజు వారు దేవతలుగా రూపాంతరం చెందినట్లు ప్రజలు భావించి, ఇది వారి జీవితంలో ఒక అద్భుతమైన క్షణమని, ఇది వారి భౌతిక పుట్టుక కంటే కూడా ముఖ్యమైనదని నమ్మేడివారు.

⤔ ఐగుప్తీ అంతటా ఫరోలు మాత్రమే చేసుకొనేవారు.

⤔  ఏటేటా ఐగుప్తీ ప్రజలే తమ ఫరోలు గొప్ప దేవుళ్లు అని, వేరొక దేవుడు లేడని నమ్మి వారికే ఘనంగా జరిపే వేడుక భాగమే ఈ "పుట్టినరోజు"(Birthday)

⤔  కేక్, క్యాండిల్ ఊదటం వంటివి వారు ఎన్నడూ చేయలేదు.


✅ గ్రీకు కాలములో : 


⤕ ఐగుప్తీయులు సంప్రదాయం కొంతమట్టుకు ప్రాచీన గ్రీకుల ద్వారా వారి జీవన వాడుకలోకి వచ్చింది. 

⤕ ఐగుప్తీయులు వలె గ్రీకులు కూడా తమ దేవుళ్లకు పుట్టినరోజు వేడుకలు చేసెడి వారు.

⤕ గ్రీకుల యొక్క ఆరాధ్యదైవం చంద్ర దేవతయైన అర్తెమిదేవి(ఆర్టెమిస్‌) 

⤕ మొట్టమొదటగా గ్రీకులు వారి ఆరాధ్యదైవమైన చంద్ర దేవత అర్తెమిదేవికు చంద్రుని ఆకారంలో ఉన్న తెల్లటి కేకులను తయారు చేసి.., మెరుస్తున్న కొవ్వొత్తులతో అలంకరించి ఆమెకు సమర్పించేవారు. ఇలా చంద్రుని ప్రకాశాన్ని మరియు అర్తెమిదేవి అందాన్ని పునఃసృష్టి చేయడానికి వీరు దీనిని ఒక మార్గంగా ఎంచుకున్నారు.

🕯 ఇలా వారి పూజా పద్ధతులు ప్రకారం ఆమెకు ఒక కొవ్వొత్తు వెలిగించి, కేక్ మీద పెట్టీ, ఆమెకి మొక్కుకొని, కొవ్వొత్తును ఆర్పి కోరుకొంటే ఆర్పిన తరువాత వచ్చే పొగ వారి దేవత యొద్దకు వారి కోరికలను చెరవేస్తాయి అనేది వారి యొక్క విశ్వాసం.  ఇది నేటికీ వారి జీవితాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా మారింది.

🍥 పుట్టినరోజున  కొవ్వొత్తులు & చంద్రుని ఆకారములో కేక్ లు మొట్టమొదటగా అక్కడే అర్తెమిదేవి దేవతకు   ప్రారంభమయ్యాయి. 

⤕ గ్రీకులకు ఆత్మల ఆలోచన కూడా కేంద్ర బిందువు.

⤕ ప్రతి ఒక్కరికి వారి పుట్టుకలోనే ఒక మంచి ఆత్మ లేదా ఒక చెడ్డ ఆత్మ వారిలో ఉందని విశ్వసించేవారు. వారిలో ఏ రకపు ఆత్మ ఉన్నాసరే  ఆ ఆత్మ ఆ వ్యక్తితో ఒక సంబంధాన్ని ఏర్పరుచుకుంటాదని మరియు వారి జీవితకాలము వారిని చూసుకొంటాదనేది వారి గట్టి నమ్మకం. 


✅ రోమా కాలములో :


⤖ కాలక్రమేనా రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తున్న దినాల్లో  రోమా రాజులు ఇండ్లలో కూడా పుట్టినరోజు వేడుకలు జరిగేవి. 

⤖ కొన్ని సంవత్సరాలు తర్వాత రోమా ప్రభుత్వం సామాన్య రోమా పౌరులలో పురుషులకు మాత్రమే పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఇచ్చింది. 

⤖ ప్రసిద్ధిగాంచిన రోమీ పురుషుడు యొక్క పుట్టినరోజును సెలవుదినంగా కూడా ప్రకటించేది.

⤖ 50 ఏళ్ళు నిండిన ఏ రోమా పురుషుడైన గోధుమ పిండి, ఆలివ్ నూనె, తురిమిన చీజ్ మరియు తేనెతో కాల్చిన ప్రత్యేక కేక్‌ను తమ బంధువులు నుండి అందుకునేవాడు. తమ బంధువుల చేత పుట్టినరోజు వేడుకలను చేసుకునేవాడు.

⤖ కానీ ఇక్కడ ముఖ్య విషయమేమంటే కేవలం పురుషులు అది 50 ఏళ్ళు నిండిన వారు  మాత్రమే పుట్టినరోజు వేడుకలు చేసుకునేవారు. 

⤖ ఇలా ప్రపంచవ్యాప్తంగా 12వ శతాబ్దం వరకు ఆడవాళ్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లు చరిత్రలో ఒక్క ఆధారం కూడా లేదు.

⤖ 18వ శతాబ్దం అనంతరం యావత్తు ప్రపంచమంతా కూడా ఈ పుట్టినరోజు వేడుకలు అనేవి అందరిలో మొదలయ్యయి. 


☐ పుట్టినరోజు వేడుకలు మొదటగా ఎలా, ఎక్కడ, ఎవరు ప్రారంభించారో అనే చారిత్రాత్మకముగా కొన్ని సంగతులను మీరు చదవడం బట్టి కొంతమట్టుకు సత్యాన్ని గ్రహించగలిగారని నమ్ముచున్నాను. ఇంకా ఇలా వ్రాసుకుంటూ పోతే చాలా సంగతులే కలవు.  ఇక వీటిని ఇక్కడకి విడిచిపెట్టి  "పుట్టినరోజు వేడుకలు ఎప్పుడు వ్యాప్తి చెందాయో?  ఆయా దేశాల వారు ఎలా జరుపుకునేవారు?" అనే విషయాల పై ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 


🌏ప్రపంచమంతటా ఎప్పుడు వ్యాప్తిచెందాయి?🌍


                    క్రీ.పూ. 3000సం. క్రితం ఐగుప్తీయుల రాజులను దేవునిగా భావించి వారికి చేసిన వేడుకలే ఈ పుట్టినరోజు వేడుకలు. అటు పిమ్మట వారి యొక్క ఆచారాన్ని అనుసరించే గ్రీకులు  అనంతరం రోమీయులు  వారి దేవత దేవుళ్లకు, ప్రసిద్ధికెక్కిన పురుషులకు మాత్రమే ఈ వేడుకలను చేసుకునేవారని పైన పేర్కొన్న చరిత్ర ప్రకారంగా మనం చదివి ఉన్నాం. 


మరి "అంతటా ఎప్పుడు వ్యాపించాయి?" అనే విషయాన్ని కోసం ఆలోచన చేస్తే రమారమీ క్రీ.శ. 1800s చివరి కాలములో జర్మనీ దేశము నుండే పుట్టినరోజు వేడుకలనేవి  విస్తృతంగా అనేక చోట్లకు వ్యాప్తి చెందాయి. జర్మనీలోని పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి మొట్టమొదటగా అందరూ కూడా పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఇక్కడే ప్రారంభమైంది. అక్కడ పిల్లలకు కిండర్‌ఫెస్ట్ (Kinderfeste) లేదా Kids Events పేరుతో పుట్టినరోజు పార్టీలకు కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఒక పిల్ల వాడు తన పుట్టినరోజున తన పెద్దలను గౌరవించాలి అనే ఒక నిర్దిష్టమైన పద్ధతిని జరిపి అనంతరం తనకు పుట్టినరోజు వేడుకలు జరిపేవారు. ఆ వేడుకలో కేక్‌తో(Birthday Cake) మరియు వారి వయస్సు ఎంత అని తెలిపే సంఖ్యా గల కొవ్వొత్తులతో, రాబోయే సంవత్సరానికి ప్రతీకగా అదనపు కొవ్వొత్తితో వేడుకలు చేయడం మొదలయ్యింది. 


🔎గ్రీకుల ఆరాధ్యదైవం చంద్ర దేవతయైన అర్తెమిదేవికి కోరికలు తీర్చడానికి కొవ్వొత్తులను వెలిగించి, ఊదే అభ్యాసమనేది జర్మనీయులు కూడా వారి పుట్టినరోజు వేడుకల్లో ఒక భాగంగా 🎂కేక్ మీద 🕯  కొవ్వొత్తులను వెలిగించి, ఊది చేసుకునేవారు. కాలక్రమేనా అన్ని దేశాల ప్రజలకు ఈ పుట్టినరోజు వేడుకల ఆచారం వ్యాప్తిచెందింది. అది ఇప్పటికీ  మన మద్య లేకపోలేదు.


🔎 రాబర్ట్ కోల్మన్ అనే వ్యక్తి  HAPPY BIRTHDAY TO YOU అనే "బర్త్ డే సాంగ్"  యొక్క రచయిత. ఈయన 1924 లో ఈ పాటకు ట్యూన్ ను (నేడు వాడుకులో ఉన్న..)  1893లో కెంటుకీ అనే స్కూల్ యొక్క ఇద్దరు ఉపాధ్యాయియులు "ప్యాటీ హిల్ మరియు మిల్డ్రెడ్  హిల్" వ్రాసిన  GOOD MORNING TO YOU అనే పాట యొక్క ట్యూన్ నుండే వెలువడింది.  


కొన్ని దేశాల ప్రజలు ఎలా చేసుకునేవారనే విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం

🍥 జపాన్ ప్రజలు : 

వీరు జనవరిలో రెండవ సోమవారం కమింగ్ ఆఫ్ ఏజ్ డేని జరుపుకుంటారు. ఆరోజున  20 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ అభినందించి , ప్రోత్సహించి మరియు గొప్పగా వారి పుట్టినరోజు వేడుకను  జరిగించడమే  వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 

🍥 కెనడా ప్రజలు :

వీరు పుట్టినరోజు వ్యక్తి యొక్క ముక్కు అంతటికి వెన్న పూస్తారు. ఇలా రాయడం వలన అతని జీవితంలో దురదృష్టం రాకుండా దానికి దూరంగా ఉంచబడతాడని వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 

🍥 చైనా ప్రజలు :

వీరు పుట్టినరోజులను గొప్ప వేడుకగా జరుపుకుంటారు. పుట్టినరోజు వ్యక్తికి పువ్వులు మరియు పుస్తకాలను బహుమతులుగా ఇస్తారు. అతను దీర్ఘాయుష్మంతుడుగా ఉండుటకు తాను తినే గిన్నెలో పొడవాటి నూడిల్ ను అనగా "దీర్ఘాయువు నూడిల్" ను  అతనికి ఇచ్చి తినిపిస్తారు. ఈ పొడవాటి నూడిల్ అనేది సుదీర్ఘమైన మరియు సంపన్నమైన జీవితాన్ని సూచిస్తుందనేది వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 

🍥 రష్యా ప్రజలు :

మీరు పుట్టినరోజు వ్యక్తికి కేకులనే బహుమతిగా ఇస్తారు. తాము ఇచ్చే కేకులను తినిపించి, పుట్టినరోజు వ్యక్తి చెవిని నొప్పి కలిగించే విధముగా లాగి శుభాకాంక్షలు తెలుపడం వీరి ఆనవాయితీ. "తమ చెవులు భూమికి చేరుకునేంతగా పెరుగుతాయని వారి  ఆశ!"  వీరే కాదు ఇటలీ, బ్రెజిల్, అర్జెంటీనా వంటి ఇతర దేశాలు కూడా ఈ చెవి లాగే  సంప్రదాయాన్ని పాటిస్తాయి.

🍥 వియత్నాం ప్రజలు :

ఈ దేశ ప్రజలందరూ సంవత్సరంలో మొదటి రోజునే పుట్టినరోజు జరుపుకుంటారు. ఇలా చేయడం వారి పూర్వీకుల యొక్క ఆచారము. ఆరోజును టెట్ అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరుగుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. 

🍥 మెక్సికో ప్రజలు : 

Pinatas అనేది వీరి యొక్క ప్రసిద్ధ పుట్టినరోజు వేడుక. పుట్టినరోజు వ్యక్తికి కేక్ ను ముఖం అంతటా రాసి శుభాకాంక్షలు తెలుపుతారు.

🍥 ఇండియా ప్రజలు :

అర్థరాత్రి నుండే వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిస్తారు.  పుట్టినరోజు బంప్‌లంటూ, తన్నడం, కొట్టడం, క్రూరంగా ప్రవర్తించడం, కేక్ మొఖానికి వ్రాయడం, నగ్నంగా ఉంచడం, ర్యాగింగ్ చేయడం...Etc జరిగిస్తారు.  కొందరైతే కొత్త బట్టలు వేసుకొని, అందరి మధ్య కొవ్వొత్తులని ఊది, కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకోవడం, లెక్కకు మించి ధనాన్ని ఖర్చు చేయడం, పుట్టినరోజు వ్యక్తి యొక్క పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం, పూజలు/ ప్రార్థనలు నిర్వహించడం వంటివి మనం చూస్తూ ఉంటాం..


📖 బైబిల్ ఏమి సెలవు ఇస్తుంది? 📖 


సర్వమానవజాతికి ప్రామాణికముగా ఉండుటకు దేవుని యొద్ద నుండి మనుషులకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ గ్రంథము(బైబిల్) 🕮 సత్యమే అని చెప్పుటకు మీ యెదుట వెనకడుగు వేయడం లేదు. కారణమేమనగా.., పైన మనం చదివిన చరిత్ర ప్రకారంగా ఆలోచిస్తే... 


🎂 మొదటి ఆధారం :

👤 ఫరో జన్మదినము ≈ ఐగుప్తీయులు రాజు

(ఆది. కాం. 40:18-22): "అందుకు యోసేపు– దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడుదినములు ఇంక మూడుదినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీదనుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను. మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందుచేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.౹ మరియు యోసేపు వారికి తెలిపిన భావముచొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.౹"


🎂 రెండో ఆధారం :

👤 హేరోదు జన్మదినము ≈ రోమా రాజు

(మత్తయి. 14:6-10): "అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై– బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతోకూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను."


☀ పైన పేర్కొనబడిన చరిత్ర ప్రకారం పుట్టినరోజు వేడుకలు అనేవి అన్యులైన ఐగుప్తీయ రాజులకు చెందినవేనని గ్రహించగలం.

☀ వారి ఇద్దరి జన్మదినోత్సవము నాడు రెండు మరణాలు సంభవించాయి. 

    ☀ ఫరో జన్మదినమున - భక్ష్యకారుల అధిపతిని ఉరి. 

    ☀ హేరోదు జన్మదినము - బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికించడం. 


☀ ఐగుప్తీయులు(అన్యుల) యొద్ద నుండి ప్రారంభము కాబడిన ఆ పుట్టినరోజు వేడుకలే నేటికీ మన మధ్య జరుగుతున్నాయని తెలుసుకొనగలరు.


🔘 NOTE :: 

🔎 పాత నిబంధనలో ఒక్క ఇశ్రాయేలుడైన గాని, క్రొత్త నిబంధనలో ఒక్క క్రైస్తవుడైన గాని అన్య ఆచారమైన పుట్టినరోజు వేడుకలను చేసినట్టు ఒక్క ఆధారం కూడా లేదు.

🔎 చివరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తాను పుట్టిన సంవత్సరం, పుట్టిన నెల, పుట్టిన తేది, పుట్టిన సమయమనేది తండ్రి రహస్యంగా తన స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ... యేసు  తన బాల్యం నుండే   తల్లి మరియ యొద్ద ఉండినప్పటికి  అతనికి ఏటేటా పుట్టినరోజును(క్రిస్మస్) తల్లి  చేసినట్టుగా గాని లేదా  తాను చేసుకొనట్టుగా గాని, తన శిష్యులైన వారికి అజ్ఞాపించినట్టుగా గాని, ఆదిమా క్రీస్తు సంఘములు చేసినట్టుగా గాని పరిశుద్ధ గ్రంథంలో ఒక్క ఆధారం కూడా  కానాడదు.

🔎 యేసు పుట్టుక అంటే క్రిస్మస్ అని ఈ లోకానికి పరిచయం చేసినది అపవాదియే. వాడే ఒక తేదీని నిర్ణయించి ఏటేటా అనేకమందిని మోసగిస్తూ క్రిస్మస్ పేరుతో దేవుని గ్రంధానికి లోబడనివ్వకుండా వ్యతిరేకముగా నడిపిస్తున్నాడు. ఇలా ఏటేటా అన్య ఆచారం చేయుట వలన దేవుడు సంతోషించునా? క్రీస్తు అంగీకరించునా? ఆలోచించుకో.. 

🔎 మనలో కొందరు ఏటేటా క్రిస్మస్ చేయనివారు కూడా ఉన్నారు కానీ వారు ఏటేటా తమ పుట్టినరోజు వేడుకలను మాత్రం చేసుకొనేవారు లేకపోలేదు. అటువంటి వారికి క్రిస్మస్ చేయకూడదని చెప్పే నీవు ఎందుకు  అన్య ఆచారమైన నీ  పుట్టినరోజును చేసుకొంటున్నావు? ఇతరులకు బోధించే నీవు నీకు నీవు బోధించుకొనవా? ఆలోచించుకో..



👤క్రైస్తవులు తమ పుట్టినరోజును చేసుకోవచ్చా? 🕯🍥


[ NO ≈ నిజమైన క్రైస్తవులు తమ పుట్టినరోజునే కాదు అన్య ఆచారాలను వేటినైనను జ్ఞాపకం చేసుకోకూడదు. ]


💥 క్రైస్తవుడు అన్యుల స్వరం వినడు :

"మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.౹ అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.౹" (యోహాను 10:4-5): 


💥 క్రైస్తవుడు తిరిగి  లోకముయొక్క మూలపాఠములను అనుసరించడు :

"ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.౹" (కొలస్స 2:8) 

"మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి– చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.౹" (కొలస్స 2:20) 


💥 క్రైస్తవుడు దినము, మాసము, సంవత్సరములను ఆచరించడు :

"ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని౹ యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల?మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?౹ మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.౹ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను." (గలతి. 4:8-11)


💥 క్రైస్తవుడు అన్యజనులాగ జీవించడు : 

"కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.౹" (ఎఫెసీ. 4:17)

"నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. (హెబ్రీ. 13:9)

"... అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,౹" (1 పేతురు. 4:3)


✅ గమనిక :

📖  నేటి బోధకులలో అనేకమంది పుట్టిన రోజుల వేడుకలలో భాగముగా వారి చేత సంఘము యెదుట వాక్య వక్రీకరణ చేయబడుతున్న వచనములో ఒకటి  
కొలస్స 3:17. 

"మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి". 

And whatever you do, in word or in deed, do everything in the name of the Lord Jesus, giving thanks to God the Father through him. 

"καὶ πᾶν, ὅ τι ἐὰν ποιῆτε ἐν λόγῳ ἢ ἐν ἔργῳ, πάντα ἐν ὀνόματι Κυρίου Ἰησοῦ, εὐχαριστοῦντες τῷ Θεῷ Πατρὶ δι’ αὐτοῦ."

📖 ఈ వచనములో "మీరేమి చేసినను" అనే మాటని పట్టుకొను దేవుడు చెప్పని దానిని   తిరిగి దేవుని గ్రంధాన్ని అపాదించడమే తప్పు. పుట్టిన రోజు  వేడుక  వాక్యానుసారమైనది కాదని యేరిగి ఉంటే క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామని అనుకోవడం తప్పే కదా !


🔜మీరేమి చేసినను అంటే  క్రీస్తు మనకు చెప్పిన వాటినే నీ దేహముతో జరిగించినప్పుడు అని అర్ధం.

🔜 సమస్తమును ఆయన పేరట(Onoma) చేయుడి అంటే  ఆయన అధికారము(Onoma) నందు ఉంటూ ఆయన చెప్పేది చేయడమే తప్పా ఆయన చెప్పనది చేయడం కాదు. 



📖  సంఘానికి అధికారి క్రీస్తే కదా (కొలస్స. 1:18) ఇట్టి అధికారి క్రింది ఉన్నవారికి ఒక్కసారే అప్పగింపబడిన అపోస్తులుల  బోధ  విషయాల్లో "ఏదైనను  కల్పినయెడల లేదా ఏదైనను తీసివేసినయెడల" పరమతండ్రియే వానికి పరిశుద్ధ పట్టణములో పాలులేకుండ చేయును కదా(ప్రకటన. 22:18-19)   

📖 ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. (సామెతలు. 30:6)

📖 పుట్టినరోజు వేడుకలు అనేవి అన్యుల పద్ధతులే కానీ దైవ పద్ధతి కాదని గుర్తించండి. ఆది నుండి భక్తులకు తెలిసిన ఈ సత్యము మీకు తెలియకపోవడం బాధాకరమే కదా!

🔎 ఈ అంశము ద్వారా పుట్టినరోజు వేడుకలనేవి అన్య ఆచారలేనని గుర్తిస్తే "నీవు చేసుకోవు, చేసేవారిని 
శుభాకాంక్షలతో ప్రోత్సహించవు మరియు క్రీస్తు మాటలకు వ్యతిరేకముగా నడుచుకోవు".

📖 ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు. (ప్రసంగి 7:1) 

మీ ఆత్మీయులు..👪
9705040236

WhatsApp Join Us   Telegram Join Us

క్రిస్మస్ లో క్రీస్తును ఎవరు ఉంచారు? (Who Was It That Put Christ In Christmas?)


బైబిల్ మాట్లాడే చోట మాట్లాడదాం 

బైబిల్ నిశ్శబ్దంగా ఉన్న చోట మౌనంగా ఉందాం. 

 మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు.🙌

ఏటేటా  అనేకమంది క్రైస్తవులుగా పిలువబడేవాళ్ళు క్రిస్మస్/Xmas/మేరీ క్రిస్మస్ అంటూ డిసెంబర్ 25వ తేదిన సంఘములోనికి అనేకమందిని ఆహ్వానించి "క్రిస్మస్‌లో క్రీస్తును ఉంచుతూ, క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తునకు పుట్టినరోజు వేడుకలు చేస్తూ" ఉంటారు. 

ఈ జగతిలో మానవాళికి తెలిసిన ప్రతి తెగల నుండి మనం ఈ అభ్యర్థనను చూస్తున్నాము. 

అయితే ఒక్క క్షణం ఆలోచించండి..., 🙏

అసలు ఈ "క్రిస్మస్ లో క్రీస్తును ఉంచింది ఎవరు?" క్రిస్మస్ అనేది క్రైస్తవులకు సంభందించిది అని ఎవరు చెప్పారు? అసలు దీనిని ఎవరు ప్రవేశపెట్టారు?📖

దేవుడు ప్రవేశపెట్టాడా? 


➤ "తండ్రి తన కుమారుని ప్రపంచ రక్షకునిగా పంపాడు" అని మనకు తెలుసు. తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము (1 యోహాను 4:14). యేసు తన సొంత ఇష్టానుసారం పని చేయలేదని లేదా మాట్లాడలేదని చెప్పాడు, కానీ తన తండ్రి ద్వారా అధికారం ఇవ్వబడిన వాటిని మాత్రమే చెప్పాడు మరియు చేసాడు. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని, ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞయిచ్చియున్నాడు. (యోహాను 6:39 12:49) 

➤ యేసు జన్మదిన వేడుకలు తండ్రి కుమారునితో మాట్లాడిన విషయమా? కాదు. అయితే యేసు జననం తండ్రి చిత్తం కాదని మేము అనడం లేదు. అది, స్వయంగా యేసే తండ్రియైన దేవునికి ఇలా చెప్పాడు. "మీరు నాకు శరీరాన్ని సిద్ధం చేసారు" కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు.

➤ బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. (హెబ్రీ 10:5). సమయం యొక్క సంపూర్ణత వచ్చినప్పుడు, దేవుడు తన కుమారుని పంపాడు,ఆయన  స్త్రీకి జన్మించాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,.. (గలతీ 4:4). 

💥 యేసు జననం గురించి మత్తయి మరియు లూకా చెప్పినట్లుగా ఎటువంటి వివాదం ఉండదు. అయితే, మేము ఒక ప్రత్యేక ప్రశ్న అడుగుతున్నాము అదేటంటే..., క్రిస్మస్ అని మనకు తెలిసిన నేటి సంప్రదాయంలో దేవుడు క్రీస్తును ఉంచాడా? దేవుడు క్రీస్తును క్రిస్మస్‌లో ఉంచాడని మరియు క్రిస్మస్‌ను సంఘము యొక్క ఆరాధనలో ఉంచాడని ఏ గ్రంథం చూపిస్తుంది? దేవుడు ప్రవేశపెట్టినట్టుగా గాని లేక తానే స్వయంగా క్రిస్మస్ అనే పేరుతో క్రీస్తుకు పుట్టినరోజు వేడుక చేయండని గాని ఎక్కడా చెప్పలేదు. మరి నువ్వెలా ఏ ఆధారంతో దేవుడు క్రీస్తును క్రిస్మస్‌లో పెట్టాడని  నమ్ముతున్నావు? 

యేసు ప్రవేశపెట్టాడా? 

యేసుకు  సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. అందులో ఒకటి యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. (మత్తయి 28:18) ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనియున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.  (ఎఫెసీయులు 1:20-23) సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. (కొలొస్సి 1:18).

💥 యేసు, క్రిస్మస్ అనే సంప్రదాయంలో తనను తాను ఉంచుకున్నాడా? ఆయన మన విశ్వాసానికి స్థాపకుడు మరియు పునాది కాబట్టి  బహుశా, సంఘమునకు అధిపతిగా, యేసే స్వయంగా తన సొంత నిర్ణయం చేత క్రిస్మస్ ను ప్రవేశపెట్టాడా? ఒకవేళ యేసు అలా చేస్తే, ఈ సమాచారాన్ని మనం ఎక్కడ కనుగొనవచ్చు? ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో మనం దానిని కనుగొనగలమా?

💥 యేసు తన శిష్యులకు క్రిస్మస్ అనే సంప్రదాయాన్ని పాటించమని బోధించాడని (లేదా) ఆయన పుట్టిన వార్షిక జ్ఞాపకార్థం చేయమని చూపించే వాక్య ఆధారం  మన వద్ద ఉందా? లేదు ఒకవేళ ఉంటె, అది ఎక్కడ ఉంది? మన పరిశుద్ద గ్రంథములో దొరక్కపోతే క్రిస్టమస్‌లో క్రీస్తు తనను తాను పెట్టుకున్నాడని, సంఘములో క్రిస్మస్ పెట్టాడని చెప్పడం కరెక్టేనా? కాదు

పరిశుద్ధాత్ముడు ప్రవేశపెట్టాడా?

పరిశుద్ధాత్ముడు అపొస్తలులను "సర్వసత్యములోనికి" నడిపిస్తాడని యేసు వారికీ వాగ్దానం చేసెను. యేసు వారితో నేరుగా మాట్లాడని విషయాలను వారికి వెల్లడి చేస్తాడు అని చెప్పాడు.

➦ నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. (యోహాను 16:12-15).

➦ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. (1 కొరి. 2:10-13) ➦ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. (1 థెస్స. 1:5)

"ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.౹ ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి." (2 పేతురు. 1:20-21).

💥 కాబట్టి, పరిశుద్ద గ్రంథము మనకు పరిశుద్ధాత్ముడు ద్వారానే అనుగ్రహించబడింది. మనకు తెలిసినట్లుగా పరిశుద్ధాత్ముడు క్రిస్మస్ అనే సంప్రదాయాన్ని రూపొందించాడా? లేదు పరిశుద్ధాత్ముడు క్రీస్తును క్రిస్మస్‌లో ఉంచాడా? లేదు.

💥 ఒకవేళ అతను అలా చేస్తే మనం అతని మాటను అంగీకరించాలి మరియు "క్రిస్మస్‌లో క్రీస్తును కొనసాగించాలి" కానీ అయన అలా చేయలేదు. అయన చెయ్యని దానికి నీవు చేస్తే పరిశుద్ధాత్మను  తిరస్కరించడమే కదా. పరిశుద్ధాత్మను  తిరస్కరించడం అంటే దేవున్ని తిరస్కరించడమే.

➦ కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా– మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు." ( మత్తయి. 12:31-32 )

💥 క్రీస్తును క్రిస్మస్‌లో లేక సంఘములో క్రిస్మస్‌ ను ఉంచింది తానేనని పరిశుద్ధాత్మ ఎక్కడైనా లిఖితపూర్వకముగా చెప్పెనా? లేదు

అపోస్తులులు ప్రవేశపెట్టారా?

అపొస్తలుల మాటను తిరస్కరించడం అంటే క్రీస్తు మరియు
దేవుని వాక్యాన్ని తిరస్కరించడమే.

➧ మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను. (లూకా 10:16)

➧ మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. (1 థేస్సాలో4:1). ➧ మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. (గలతీ 1:8)

"అపొస్తలుల బోధ" అనేది "ప్రభువు యొక్క బోధ"

➧ వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. (అపో.కా. 2:42).

➧ కాబట్టి "అపొస్తలుల బోధ" ప్రకారంగా అపొస్తలులు క్రిస్మస్‌లో క్రీస్తును ఉంచడం మరియు ఆదిమ సంఘములో ప్రవేశపెట్టడం మనం కనుగొనగలిగితే, మనం కూడా పరలోకం యొక్క ఆమోదంతో చేయవచ్చు. 💥 అపొస్తలుల ఆదేశానుసారం, క్రిస్మస్ సంప్రదాయాన్ని పాటించిన శిష్యుల గురించి మనం గ్రంధములో చదువుతామా? లేదా ఏ విధంగానైనా యేసు జన్మ తేదిని గమనించామా? లేదు. ఒకవేళ క్రీస్తును క్రిస్మస్‌లో ఉంచడం ఒక ముఖ్యమైన కర్తవ్యం అయితే ప్రభువు యొక్క మొదటి ఉత్సాహభరితులైన ఆదిమ క్రైస్తవులు, అపొస్తలులు మరియు భక్తిగల శిష్యులు క్రిస్మస్ ను చేసినట్టుగా మనకు ఆధారాలు ఉండాలి. పరిశుద్ద గ్రంథములో ఎక్కడా అలాంటి దాఖలు లేవు.

మేము ఏమి కనుగొన్నాం?

పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడి దేవుని మూలముగ పలికిన వారి చేత పరిశుద్ద గ్రంథము సంపూర్ణముగా మానవజాతికి ఇవ్వబడిన AD 98 నాటి నుండి సుమారు 300 సంత్సరాల లోపు ఎన్నడూ క్రిస్మస్ ను ఆచరించలేదు. నిజానికి అతరువాత కాలములో పనిచేసిన చర్చి పాదర్ లు కూడా పుట్టినరోజు వేడుకులు జరుపుకోవడంపై విరుచుకుపడేవారట మరియు వాటిని అన్యజనుల ఆచారంగా భావించేవారంట. 300 సంత్సరాల తరువాత డిసెంబరు 25ని... క్రీస్తు జన్మదినంగా కాథలిక్ సంఘము వారు ప్రవేశపెట్టారు. వీళ్ళు ఇలా చేయడం దేవుని నిర్ణయం కాదు. దేవుని పరిశుద్ద ఆజ్ఞలను మీరారు. ఏమనగా....

★ ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.- (సామెతలు. 30:6).

★ ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును. – (ప్రకటన. 22:18).

⏩క్రిస్మస్ అనేది మొదటి శతాబ్ద కాలపు  క్రీస్తు సంఘము(Church of Christ) యొక్క విధులలో ఒకటి కాదు. నేటికి అపోస్తుల బోధ ప్రకారమైన క్రీస్తు సంఘము క్రిస్మస్ అనే అన్య పండుగకు వ్యతిరేకమే.

⏩ క్రీస్తు జన్మించిన దాదాపు 300 సంవత్సరాల వరకు క్రిస్మస్ జరుపుకోలేదని చరిత్ర చెప్తుంది.


"December 25th began to be celebrated as Christmas, the birthday of Jesus in 354 AD. as ordered by Bishop Liberius of Rome." (The World Book Encyclopedia, Vol. c # 3 p.416). The Catholic church was not fully developed at that time as the first pope was not named until 606 A.D.

The Grolier Encyclopedia adds, “The date was chosen to counter the pagan festivities connected with the winter solstice.” 

The New Schaff-Herzog Encyclopedia of Religious Knowledge indicates that Christmas was adopted from the pagan festivals “Saturnalia” and “Brumalia.”


💥 డిసెంబర్ 25నే ఎందకు ఎంచుకున్నారో ఎవరికీ తెలియదు . ఇది ఖచ్చితమైన తేదీ అని సూచించడానికి కొత్త నిబంధనలో ఆధారము ఏమీ లేదు. "క్రిస్మస్‌ చేయచ్చు/క్రిస్మస్ లో క్రీస్తును పెట్టవచ్చు" అని మీ బోధకుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తే, దానికి సంబంధించిన ఆధారాలు లేఖనం ద్వారా మీకు చూపించమని అడగండి.

💥 దేవుడు గానీ, క్రీస్తు గానీ, పరిశుద్ధాత్మ గానీ, అపొస్తలులు గానీ క్రీస్తును క్రిస్మస్‌లో పెట్టలేదు కాబట్టి మనం కూడా చేయకూడదు!

మీ ఆత్మీయులు...👪
🔍మరిన్ని వివరాలతో కూడిన లేఖన సమాచారం కొరకు ఈ క్రింది అంశములు క్లిక్ చేసి చదవగలరు.
✅ పండుగలు - Click Here
✅ క్రిస్మస్ - Click Here
✅ క్రీస్తు జన్మ ముఖ్య ఉద్దేశ్యము - Click Here

The churches of Christ greet you - Roma 16:16