యేసుక్రీస్తు యొక్క దేవత్వము(The Divinity of Jesus Christ)


 యేసుక్రీస్తు యొక్క దేవత్వము

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


 తెలుగు ≈  దేవత్వము (లేదా) దైవత్వము

➺ Greek ≈ theotēs, (G2320); theiotēs, (G2305) 

➺ English ≈ Godhead, divinity, God, deity


🔘 దేవత్వము Click Here అనగా  దేవుని స్వభావము, దేవుని తత్వము, దేవుని యొక్క గుణ లక్షణాల సముదాయమని అర్థం.

ఈ లోకములో తరుచుగా వాడబడే పదాలు క్రూరత్వము, మృదుత్వము, దృఢత్వము, మానవత్వము మొదలైనవి . తత్వము  స్వభావము(Nature) అని అర్థం.


✍ మనకు దేవుడొక్కడే ఆయనే తండ్రి/యెహోవా /పరమదేవుడు. ఆ దేవుని యొక్క తత్వము (స్వభావము) దేవత్వము. ఈయన అదృశ్యుడు అనగా కంటికి అగోచరుడు) కంటికి కనబడని వాడు.

"సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. … "సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్." (1 తిమోతి. 1:17; 6:16); "ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ...(యోహాను. 1:18). ... ''మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.౹" (యోహాను. 5:37). "ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు;  (1యోహాను. 4:12).

✍ దేవత్వము అనేది ఆ అదృశ్య దేవుని(యెహోవా) యొక్క అదృశ్య లక్షణమైయుంది. "ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.౹" (రోమా. 1:20).


పైన పేర్కొన్న వాటిని బట్టి ఆ అదృశ్యడైన యెహోవా దేవున్ని ఎవరైననూ ఎప్పుడైననూ  చూసెనా? [ లేదు కదా ] మరి ప్రభువైన యేసు ఆ అదృశయదేవుని గూర్చి ఏమి చెప్తున్నాడో ఆయన మాటల్లోనే చూద్దాం ...

  • "నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.౹" (యోహాను. 12:45)
  • "అప్పుడు ఫిలిప్పు– ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా౹ యేసు– ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?౹" (యోహాను. 14:8-9) 

ఫిలిప్పు అడిగిన ప్రశ్నకు యేసు ఇచ్చే సమాధానం "నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే" అనే ఈ వచనములో  తండ్రి ఏలాంటి తత్వము గలవారో తాను కూడా అలాంటి తత్వము (దేవత్వము/దైవ స్వభావం) గలవాడని మన ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెపుతున్నారు. "తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు.౹" (యోహాను. 14:10) ఈ లేఖానాలు బట్టి తండ్రి మరియు యేసు ఒకేలాంటి తత్వము(దేవత్వము) గలవారని ఓ చదువరి... నీకు తోచుట లేదా!?


అయినప్పటికీ ఇంకా తమ సొంత ఊహలను పరిశుద్ధ గ్రంధానికి ఆపాదించి అపవాది యొక్క  కాడి మోస్తూ "క్రీస్తు యొక్క దేవత్వము" పై బురద జల్లేవాళ్లు నేటికి లేకపోలేదు. ఇటువంటి క్రీస్తు విరోధులు నేటి నుండి కాదు ఆది నుండి ఉన్నారనేది గ్రంథము ఇచ్చు సమాచారమైయుంది. క్రీస్తు దేవత్వము మీద దాడి చేస్తే క్రైస్తవ్యం నాశనం చేయచ్చు, వారిలో గలిబిలి సృష్టింపవచ్చు అనే ఆ దౌర్భాగ్యుని (దుష్టుని ) ఆలోచనలకు కొందరు పడిపోయి నేటి వరకు విషం కక్కుతూనేవున్నారు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఆది నుండే ప్రారంభమైంది. కావున  క్రీస్తుకు తన దేవుని తత్వము లేదు అనగా క్రీస్తునకు దేవత్వము లేదు అనేవారికి లేఖనాలు ఆధారముగా సమాధానముగా ఇచ్చుటకై ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయుంది. 


 ప్రభువైన యేసుక్రీస్తు , అపవాది ఆగర్భ శత్రువులే. వారిమధ్య ఈ శత్రుత్వమును ఏర్పాటు చేసినవాడు  తండ్రియైన దేవుడే(యెహోవాయే).

"మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది (స్త్రీ సంతానము) నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.౹" (ఆది. కాం. 3:15) 

 ఆదిలో మనుష్య జాతిని మోసగించడములోను( ఆది.కాం. 3:13; 1 తిమోతి. 2:14), దైవాజ్ఞను అతిక్రమించుటలో ఏదో విజయం సాధించానని ఉర్రూతలు ఊగుతున్న అపవాది  యొక్క క్రియలను శాశ్వతంగా లయపరచడానికే వాడికి మరియు క్రీస్తునకు మధ్య విరోధాన్ని యెహోవాయే ప్రతిపాదించాడు. "అపవాది మొదటనుండి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.౹" (1 యోహాను. 3:8)

☀ యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన ఆ వైరము(ఆది.కాం. 3:15) యేసునకు మరియు అపవాది మధ్య మాత్రమే కాక వారి ఇరు వర్గాలు వారికి కూడా ఆది నుండే విస్తరించినందున ఇది ఆనాటి  నుండి నేటి వరకు సజీవముగానే ఉంది. 


క్రీస్తు దేవత్వము మీద దాడి చేస్తున్న క్రీస్తు విరోధులలో ప్రధానమైన వారు 


𒐕 యూదా మత నాయకులు (30 AD)

𒐖 గ్రీకు తత్వ శాస్త్రం లేదా గ్రీకు తత్త్వవేత్తలు ( 58 - 99 AD)

𒐗 నేటి క్రీస్తు విరోధులు (AD 99 నుండి ...  )


𒐕 యూదా మత నాయకులు : 


మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారియైయున్న దినములలో అపవాది  ఆయన్ను శోధించినప్పటికీ వాడి మాటలను, లేఖనాల ఆధారముగా  వాడికే మరల తిప్పి కొట్టడంతో ఆ దౌర్భాగ్యుడు ఓటమిని అంగీకరించి ఆయన్ను విడిచిపోయాడు(మత్తయి. 4:1-11cf) 


ఆ తరువాత అపవాది తన ఆయుధములు ధరించి(మత్తయి. 12:29; లూకా. 11:20-22cf) తన అనుచరులైన యూదా మతనాయకులను యుద్ధ రంగమునకు సిద్ధపరిచి యేసు చేసిన  బోధ పైన దాడి చేయించాడు. అదేమనగా... మొట్టమొదటగా, యూదా మత నాయకులతో యేసు ముఖాముఖిగా సంభాషించినప్పుడు(యోహాను.8:31-47cf) ఇలా అన్నారు., "మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.౹"(37వ) "దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే;..(40వ) అంటూ వారిని  ఇలా సంభోదించారు - "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.౹" (యోహాను. 8:44). 


ఈ విధంగా  తన బోధ మీద తిరుగుబాటు చేసిన వారి నోళ్లు మూయించి  సవాలు  విసిరారు - "నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.౹ నాయందు పాపమున్నదని మీలో ఎవడు సాప్థిచును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?౹"(యోహాను. 8:45-46) చివరికి క్రీస్తు విరోధులు ఆయన్ని జయించలేక నిష్క్రమించారు.


చివరికి ఆయన బోధ మీద దాడి చేస్తే ఎటువంటి ప్రయోజనం లేకపోలేదని గుర్తించిన క్రీస్తు విరోధులు ఈసారి ఆయన వ్యక్తిత్వం మీద అనగా ఆయన దైవత్వము మీద కూడా దాడి చేశారు. అది ఎలాగునో చూద్దాం. (యోహాను. 10:22:33 చూడుము).


"ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.౹ అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా౹ యూదులు ఆయనచుట్టు పోగై– ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.౹ అందుకు యేసు– మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.౹ అయితే మీరు నా గొఱ్ఱెలలోచేరినవారుకారు గనుక మీరు నమ్మరు.౹ నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.౹ వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;౹ నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.౹ యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేతపట్టుకొనగా౹ యేసు— తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.౹ అందుకు యూదులు– నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.౹" (యోహాను. 10:22-33).


నేనును తండ్రియును ఏకమై యున్నామని(30వ)

ఏకమై యున్నాము అంటే దేవత్వపు ఏకత్వమే కానీ వ్యక్తిత్వపు ఏకత్వము కానేకాదు. 


🔎 వ్యక్తిత్వపు ఏకత్వము అంటే 👇🏿

తండ్రీ, నేను ఒక్కరే/ఒక్కడే అని అర్థం. (లేదా) నేనే తండ్రిని, ఆ తండ్రే నేను అని అర్థమిచ్చును కదా. యేసు ప్రభువు మనకు తండ్రి కాదు. అయన మాటల్లో ఎవరు ఆయనకు తండ్రో ఆయనే మనకు తండ్రి.(యోహాను. 20:17cf) ఈ లోకములో నా తండ్రి, తండ్రీ అని పలికే సందర్భాలు కలవు. 

యోహాను. 17:20-22 లో "మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.౹ మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.౹" ఇది సంకల్పము యొక్క ఏకత్వము. 

మన ప్రభువైన యేసు మాటల్లో "మేము ఇద్దరమూ" అనే విషయాన్ని స్పష్టముగా చూడగలం.(యోహాను. 8:14-17cf) కావున వ్యక్తులుగా ఏకమైయుండలేదు. ఉదాహరణకు ఒక క్రైస్తవుడు, నాలో క్రీస్తు ప్రభువు  ఉన్నారు అని ఎలాగైతే వ్యక్తపరుస్తాడో అలాగే క్రీస్తు ప్రభువు కూడా తనలో తండ్రి ఉన్నారని (ఎఫెసి. 3:15; గలతీ. 2:20) తన మాటల్లో చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. (యోహాను. 8:16). "యేసు-ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.౹" (యోహాను. 14:23). కాబట్టి వ్యక్తులుగా వారు ఇద్దరు కానీ తత్వము విషయంలో ఒక్కటై యున్నారు.


🔎 దేవత్వపు ఏకత్వము అంటే👇🏿 

తత్వము యొక్క ఏకత్వమని, చిత్తము యొక్క ఏకత్వమని, సంకల్పము యొక్క ఏకత్వమని, విమోచన యొక్క ఏకత్వమని అర్థం.

"నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.౹"(యోహాను. 10:30). ఇది దేవత్వపు ఏకత్వమే. దీనికి క్రీస్తు విరోధులు జీర్ణించుకోలేక, ఆయనను కొట్టవలెనని రాళ్లతో కొట్టబోయారు. ఏ మంచి క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని ప్రశ్నించగా వారు, "...నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము...౹" అని వారు చెప్పెను. (యోహాను. 10:31-33cf) కాబట్టి యూదా మత నాయకులు యేసు దేవుడనే విషయాన్ని, తన దేవుని తత్వము(దేవత్వము) గలవాడని అంగీకరించలేరన్నమాట!!


𒐖 గ్రీకు తత్వశాస్త్రం లేదా గ్రీకు తత్త్వవేత్తలు :


"మానవజాతి యావత్తు కొరకు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి కల్వరిగిరిలో అప్పగించిన యేసును క్రీస్తు విరోధులు సిలువ వేసి, చంపి, సమాధిలో పెట్టినప్పటికి పరమాదేవుడు ఆయనను లేపి అపవాదికు మరియు వాడి అనుచరులకు క్రీస్తు మరణం ద్వారా ఓటమి అనుగ్రహించెను. పిమ్మట.., యెరూషలేములో పెంతుకోస్తు పండుగ దినమున మారుమనస్సు కలిగి, పాప క్షమాపణ కొరకు, బాప్తిస్మము పొందిన ఆ 3000 మందితో  క్రీస్తు సంఘము(church of Christ) ప్రారంభమైనది(అపో. కార్య. 2 అధ్యా. చదువుము). నానాటికీ అనేకమంది ప్రభువు వాక్యం విని అయన పక్షమున చేర్చబడే (అపో. 2:47; 4:4; 5:14; 6:1,7; 8:4,12-15; 10:47-48; 11:1,24; 13:48; 14:1,21-22; 16:30-33; 17:3-4,12,34; 18:8; 19:1-4,18; 20:20-21; 21:17-20) ఈ కార్యక్రమాన్ని అపవాది చూసి ఓర్వలేక, జీర్ణించుకోలేక క్రీస్తు దేవత్వముపై మరొక్క రూపములో మోసగించి, బురద జల్లుటకు ఒక తెగను ఎంచుకున్నాడు. వారే ఈ గ్రీకు తత్త్వవేత్తలు లేదా గ్రీక్ ఫిలాసఫర్. 

     

క్రీస్తు విరోధులలో ప్రధానమైన వారు వీళ్లే. వీళ్లు అనుసరించే వాదం జ్ఞానతత్వవాదం(Gnosticism) coming soon . ఇది ఒక తత్వశాస్త్రం. అపోస్తలుడైన పౌలు గారు ఈ గ్రీక్ తత్వశాస్త్రమును "మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము" అని పేర్కొన్నారు.(కొలొస్సీ. 2:8) సుమారు క్రీ.శ. 58 కాలములో లవొదికయ, కొలొస్సీ ప్రాంతాల్లో  కొలొస్సీ క్రీస్తు సంఘము సువార్తికుడిగా పని చేసిన ఎపఫ్రా తాను ఎదుర్కొంటున్న ఈ క్రీస్తు విరోధుల బోధను వినిన అపో. పౌలు గారు దానికి పరిష్కారంగా ఈ కొలొస్సీ పత్రిక వ్రాయుటకు గల ముఖ్య ఉద్దేశ్యమైయుంది. 


ఈ తత్వశాస్త్రములో మూడు రకాలైన తత్వములు కలవు. 

1). యూదా మత శాసనాలు

2). గ్రీకు తత్వశాస్త్రం

3). తూపు దేశపు సంబంధమైన గూఢత్వము


ఈ  పై  మూడు కలయిక ప్రకారంగా  మరొక్క తత్వశాస్త్రం కలిగింది. 


1 ). శరీరములో దేవత్వము అనేది అసాధ్యం, శరీరమునకు పునరుద్ధానం లేదు. కావున  "నరావతారం నమ్మశ్యం కాదు"

2). సద్గుణము కంటే జ్ఞానము గొప్పదని

3). లోకములో చెడు అనేది ఉంది కాబట్టి దేవుడు మాత్రమే సృష్టికర్త కానక్కర్లేదు.

4). లేఖనాలకు అక్షరముల యంతరార్థము కాని దాని భావము సరైనది అది కొందరికి మాత్రమే అర్థం అవ్వచ్చు.


Source : "రైనీ స్టడీ బైబిల్" - న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ 1995 - చార్లెస్ కాల్డ్‌వెల్ రైనీ Dh.D., Ph.D. - మూడీ ప్రెస్, చికాగో.


ఇదే నేటి  క్రీస్తు విరోధులు నమ్మేది అనగా క్రీస్తునకు దేవత్వము లేదు అనే బోధను ప్రకటన చేసే క్రీస్తు విరోధుల యొక్క విశ్వాసము. ఇది ఈ   జ్ఞానతత్వవాదులు యొక్క పునాదులపై స్థాపించబడిన బోధయైయుంది. ఇటువంటి అబద్ధపు బోధను వ్యతిరేకించడానికి అపోస్తలుడైన పౌలు గారు ఇలా అన్నారు.


"ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.౹ ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;౹" (కొలొస్సీ. 2:8-9)


🔎 దేవత్వములో ఎలాంటి పరిపూర్ణత ఉందో అది అంతయు క్రీస్తు శరీరమునందు నివాసం చేస్తుంది.

🔎 ఈ వచనములో "శరీరముగా" అనే పదము పట్టుకొని "సంఘముగా" అనే భావన ఉంటే ≈ క్రీస్తు శరీరములో లేనిది క్రీస్తు సంఘములో ఎలా ఉంటుంది? క్రీస్తు సంఘములో ఉండేది తన శరీరములో ఉండదని ఎలా అనగలము? నీకు శిరస్సు క్రీస్తు అయ్యుంటే , నీవు క్రీస్తు శరీరము 'లో' (క్రీస్తు సంఘము) అవయమైతే  క్రీస్తు దేవత్వము పై దాడి చేయుటకు భయపడతావు.

🔎 నరావతరం నమ్మశఖ్యం  కాదు(Incarnation is incredible) అనే జ్ఞానతత్వవాదుల నోళ్లు మూయించడానికే పరిశుద్ధాత్ముడే అపోస్తులుడైన పౌలు గారు ద్వారా కొలొస్సీ. 2:9 వచనం వ్రాయించాడు.


క్రీ.శ. 70 సం. తరువాత ఎఫెసులో అపోస్తులుడైన యోహాను గారు కూడా నరావతరం నమ్మశఖ్యం కాదు అనే మోసకరమైన నిరర్థక తత్వశాస్త్రమును ఎదుర్కొన్నారని,  అటువంటి వారిని హెచ్చరించుటకు, ఖడించుటకు,  1వ యోహాను పత్రికను ఇందు నిమిత్తమే వ్రాసియున్నారని తెలుసుకోగలం. వారిని గూర్చి తన పత్రికలో "లోక సంబంధులని", "అబద్ధ ప్రవక్తలని", "క్రీస్తు విరోధులు" అని నామకరణం చేశాడు.


"చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.౹ వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతోకూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లువారు బయలువెళ్లిరి.౹ … యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.౹" (1 యోహాను. 2:18-19,22)  "ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.౹ యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మ ను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.౹ చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹" (1 యోహాను. 4:1-4)


𒐗 నేటి క్రీస్తు విరోధులు (AD 99 నుండి ...  )


నేడు కొందరు తాము  క్రైస్తవులమే/క్రీస్తు సంఘమే అనుకుంటూ యేసుక్రీస్తు యొక్క దేవత్వము పైన నేటికీ కూడా బురద జల్లేవాళ్లు వున్నారు . ఇటువంటి వారిని క్రీస్తు విరోధులని మరియు అబద్ధికులని అనవచ్చు. (1 యోహాను. 4:1-4) వారి బోధలు ఏమనగా.., యేసుకు దేవత్వము లేదని, యేసు కేవలం నరుడు మాత్రమేనని, నరావతారం నమ్మశఖ్యం  కాదని, అనాదిలో యేసు లేరని, తండ్రి ఆలోచనల్లో మాత్రమే ఉన్నారని, యేసు మనుగడ బెత్లెహేములో మాత్రమే ప్రారంభమైందని,..etc ఇలాంటివి  మరెన్నో ప్రకటిస్తూ తమ స్వకీయ నాశనం వైపు నడుస్తూ ఇంకొందరిని నడిపిస్తున్నారు. 

అనాడు గ్రీక్ ఫిలాసఫర్ యొక్క తత్వజ్ఞానమునకు కాస్త వీరి ఆలోచనలను జోడించి ప్రకటన చేస్తున్నారే తప్ప అది సత్యము కాదు సుమీ. నిజానికి.., ఆ దౌర్భాగ్యుడే  అనగా ఆపవాదే వేరోక్క రూపములో ఇలా వాడి అనుచరులను వాడుకొంటున్నాడన్నమాట!


🔎 యేసును ఇమ్మానుయేలు అనటం జరిగింది.   ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము." (యెషయా. 7:14; మత్తయి. 1:22-23cf) యేసు మనకు దేవుడని కాదు సుమీ!  దేవుడు మనకు తోడైయున్నాడు అని మాత్రమే అర్థమే. ఇది దేవదూత యొక్క సందేశం కానీ క్రీస్తు విరోధుల సందేశం కాదు.

🔎 అపో. యోహాను గారు  తన తొలి పుస్తకములో మొదటి వచనాలలోనే  ఇలా వ్రాసెను - "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.౹" (యోహాను. 1:1). యేసు దేవత్వం గూర్చి మాట్లాడెను కదా.  దీనికి ఈ క్రీస్తు విరోధులు సత్యాన్ని అంగీకరించక తిరిగి ఏమంటారంటే యేసు రెండో దేవుడా?, మూడో దేవుడా? అంటూ వ్యంగ్యముగా ప్రశ్నిస్తారు . కారణం  క్రీస్తు విరోధులకు క్రీస్తుకు దేవత్వం ఉందంటే  అసలు అంగీకరించరు. 

🔎 "ఆయన(యేసు) అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై Click Here యున్నాడు.౹" (కొలొస్సీ. 1:15). 


🔎 "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹" (1 తిమోతి. 2:5) 

క్రీస్తు విరోధులు ఈ👆 వచనం పట్టుకొని యేసు కేవలం మనలాంటి ఒక నరుడు మాత్రమే కానీ ఆయనలో దేవత్వం లేదు అని కూడా బోధిస్తారు . 

దేవునికిని + నరులకు మధ్యవర్తి ఎవరు = నరుడే(యేసు) ఉండాలి. నరులకు అని చెప్పినప్పుడు దేవత్వం గల యేసును నరుడు అని సంబోధించడం జరిగింది కానీ ఆ మాటలకు దేవత్వం లేదని అర్థం కాదు . 


👤 అసలు దేవునికి మరియు నరులకు మధ్యవర్తిగా నరుడుగానే ఇట్టి పాత్ర ఎందుకు పోషించాడంటే... 👇👇

"కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.౹ ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.౹ కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.౹ తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు."(హెబ్రీ. 2:13-17)


దేవుని పక్షముగా యేసు ఎంతగా దేవత్వం గలవాడో అలాగే నరుల పక్షముగా కూడా అంతగా  రక్తమాంసములలో పాలైయున్నాడు.


"ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.౹ తాను కూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.౹ ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.౹" (హెబ్రీ. 5:1-3).


🔎 యేసు అందరి పాపముల విషయములో శుద్ధీకరణము  చేసిన పిమ్మటమహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంనప్పుడు(హెబ్రీ. 1:3) తండ్రియైన దేవుడే స్వయముగా యేసు దేవత్వం గలవాడు అని సంబోధిస్తే దానికి సాక్షిగా ఉన్న పరిశుద్ధాత్ముడే మనకు వ్రాసి ఇలా ఇచ్చెను అదేమనగా "—తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే –దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు – ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి" (హెబ్రీ. 1:7-10). ఇది కాదనలేని సత్యం. 


🔎 ఆయన రక్తములో దేవత్వం నివసిస్తుంది కారణముగానే తన రక్తముతోనే సంఘాన్ని కొన్నాడు. "దేవుడు తన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తుమందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి.౹" (ఆపో. 20:28). ఆయన రక్తంలోనే దేవత్వం ఉంది కాబట్టి  ఆయన ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసియున్నాడు;..(ప్రకటన. 5:9).


🔎  యేసు తన దేవుని మహిమయొక్క ప్రతిబింబమును మరియు దేవుని తత్వముయొక్క మూర్తి మంతమునైయున్నాడు. (హెబ్రీ 1:3)

🔎 క్రీస్తు దైవస్వరూపము గలవాడు(ఫిలిప్పీ. 2:6) మాత్రమే కాదు దైవ స్వభావము గలవాడు(యోహాను. 3:14-16) అనేది ప్రశ్నించబడని వాస్తవమై ఉంది.


❢ NOTE : మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మలో, దేహములో, సిలువ రక్తములో, నిత్యత్వములో, స్వభావములో, వ్యక్తిత్వములో, స్థాయిలో, చరిత్రలో, ప్రత్యక్షతలో 'దేవుని యొక్క తత్వము అనగా దేవత్వము గలవాడైయున్నారు. (యెషయా. 9:6; మీకా.5:2; మత్తయి. 1:20-23; యోహాను. 1:1-2; 10:30-34; ఆపో.కార్య. 2:36; 20:28; రోమా. 9:5; 10:9; ఫిలిప్పీ.  2:6; కొలస్సి. 1:15; 2:9; తీతుకు. 2:9-13; హెబ్రీ 1:3-4; 7-8; ప్రకటన. 5:9-10).


✍ నీవు నిజముగా ఇదంతయూ లేఖనానుసారముగా పరిశీలన చేస్తే  క్రీస్తు  దేవత్వమును గూర్చిన వ్యతిరేకత నీలో వుండదు. అయితే ఇంకనూ నీలో ఆ వ్యతిరేకత ఉన్నదంటే నీవు లేఖనాలను సరిగా పరిశీలన చేయుటలేదనే అంతరార్థం. 

మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను. (అపో. కార్య. 3:22-23)


క్రీస్తు దేవత్వాన్ని వ్యతిరేకించే అబద్ధికులు విషయమై జాగ్రత సుమా!!

మీ ఆత్మీయులు...👪

యేసుక్రీస్తు యొక్క దేవుడు ఎవరు? Click Here

WhatsApp Join Us   Telegram Join Us

Share this

Related Posts

Latest
Previous
Next Post »

3 comments

comments
Anonymous
June 2, 2024 at 9:18 PM delete

Good Topic Anna

Reply
avatar
Anonymous
June 2, 2024 at 10:58 PM delete

చాలా బాగా వ్రాశావు తమ్ముడు 🙏🏿 క్రీస్తు దేవత్వం మీద బురద వేసేవారికి ఇది మంచి పాఠం.

Reply
avatar
Anonymous
June 3, 2024 at 8:07 AM delete

క్రీస్తు విరోధులు కు మంచి సమాధానం అన్న 👌👌

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16