మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻
మానవుడి భూ జీవితకాలం ఒక యాత్ర జీవితమే. "మేము ఇక్కడ పరదేశులము, యాత్రికులమే” (హెబ్రీయులు 11:13). నీ దృష్టిలో మన జీవము నీడవంటి యాత్ర. (కీర్తనలు 39:12). ఈయాత్ర యొక్క తుది గమ్యములోపు దేవుని సన్నిధి, అంటే నిత్యజీవమై ఉండాలి. (యోహాను 17:3). కానీ ప్రతి యాత్రికుడు ఆ గమ్యానికి చేరతాడా? లేదా? ప్రతి విశ్వాసి పరలోకమునకు యోగ్యుడా? కాదా? చనిపోయిన తర్వాత నా పరిస్థితి? నా యాత్ర జీవితం సరిగ్గా ముగించనున్నాన, లేదా? మరియు నా భక్తి, ప్రేమ, ఆరాధన, సమాధానం, ఐక్యత, విధేయత, మాటతీరు, ప్రవర్తన, విశ్వాసం, బోధ, కానుక, మాదిరికరమైన జీవితం..etc. ఇట్టి ప్రశ్నలను మనం ఈ యాత్ర కాలములోనే ఎవరికి వారు పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది కదా!
“యెహోవా పర్వతమునకు ఎవడు ఎక్కును? ఆయన పరిశుద్ధస్థలమున నిలుచునది ఎవడు?” (కీర్తనలు 24:3)
ఈ ప్రశ్న మన ఆత్మకు సవాల్ చేస్తుంది. దేవుని సన్నిధిలో నిలబడటానికి శరీరపరమైన శక్తి కాదు, ఆత్మపరమైన శుద్ధత, విధేయత, నీతి, ప్రేమ, మాదిరి మరియు విశ్వాసం అవసరం.
శుద్ధహస్తులును పరిశుద్ధహృదయులును, మోసములో తలపెట్టనివారే యెహోవా పర్వతమునకు ఎక్కుదురు. (కీర్తనలు 24:4)
పరమదేవుడు మనలో పరిశుద్ధతను కోరుతున్నాడు. అయితే, మన ఆత్మలో ఉన్న “లోపాలు” — ప్రేమలో, విశ్వాసంలో, ప్రార్థనలో, నడవడిలో, బోధలో… ఇవి మనలను ఖచ్చితంగా దేవుని సన్నిధి నుండి దూరం చేస్తాయి అనుటకు ఎటువంటి సందేహం లేదు. ఈ లోపాలే మన ఆత్మీయ అయోగ్యతకు కారణం. దేవుడు మనలను త్రోసివేయడం ఆయన సంకల్పం కాదు. ఇందుకే నీకు ఇవ్వబడిన సంవత్సరాలు, నెలలు, దినాలు, సమయం, అనేది మనలోని లోపాలను సరిచేసుకోవడానికి ఇవ్వబడుతున్నాయి కానీ వాటిని నీకు నచ్చిన విధముగా ఉపయోగించుకొని ఆయన కృపను త్రోసి పుచ్చడానికి అయితే కాదు. అలా చేస్తే శాశ్వతముగా ఆయన కృపను కోల్పోతాము.
“నేడు అనబడుచున్నప్పుడు మీ హృదయములను కఠినపరచకుడి.” (హెబ్రీయులు 3:15)
దేవుడు “నేడు” అనే అవకాశాన్ని మనకు ఇచ్చాడు అనేది గుర్తిస్తే మనలోని ప్రతి లోపాన్ని సరిచేసుకొని, ఆయన వాక్య ప్రకారం పరిపూర్ణత వైపుగా నడవమని పిలుస్తున్నాడు అనే సంగతి కూడా గమనించు. కావున ఈ అంశము ద్వారా మనం మనలోని ఆత్మీయ లోపాలను పరిశీలించి, తెలుసుకొని, వాటిని దేవుని కృపతో ఎలా సరిచేసుకోవాలో అనునదే ఈ అంశము యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ పరిశీలన మన జీవితాన్ని క్రీస్తు ప్రత్యక్షత కొరకు సిద్ధం చేయటానికి సహాయపడుతుంది. ఎందుకంటే పరలోకం పరిశుద్ధులకు సిద్ధమై ఉంది, లోపము లేనివారికే అక్కడ స్థానం కలదు అని ఎన్నటికి మరవకు సుమీ!
✅ మనలో ఉండే ఆత్మీయ లోపాలు ✅
1 ప్రేమలో లోపము :
"దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.౹" - (1 యోహాను 4:8)
ప్రేమ దేవుని యొక్క స్వరూపం. ప్రేమలేని విశ్వాసి ఆత్మికంగా ఎదగలేడు. దేవుడు మనలను ఆయన ప్రేమతో నింపి, ఆ ప్రేమను ఇతరులకు చూపమని కోరుతున్నాడు. ప్రేమ లేకపోతే మనం నిరర్థకం (1 కొరింథీయులు 13:2).
2విశ్వాసములో లోపము :
"విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము (హెబ్రీయులు 11:6)
విశ్వాసం అనేది దేవుని వాక్యముపై సంపూర్ణ నమ్మకం. సందేహం పాపానికి ద్వారం. విశ్వాసం అంటే అంధంగా నడవడం కాదు, దేవుని స్వభావాన్ని బట్టి నడవడం. ఆయన విశ్వాసయోగ్యుడు అని తెలిసి, మనము నిశ్చయముగా ఆయనపై ఆధారపడటం. క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలనే విశ్వాసం (రోమా. 10:17)
3 బోధలో లోపము :
“నీకు అప్పగించబడిన సత్యవాక్యమును నమ్మకముగా బోధించుము.” — (2 తిమోతికి 2:2)
అపోస్తలుల బోధ లేకపోతే సంఘం బలహీనమవుతుంది. సంఘము అట్టి ఆదిమ బోధలోనే నిలవాలి కానీ మనుషులు ఊహలు, అభిప్రాయాలు, వాక్య వ్యతిరేకమైన పద్ధతులలో కాదు. కావున వినే వాక్యం పరీక్ష చేయు (అపో.కార్య. 17:11) బోధకుడును పరీక్ష చేయు (1 యోహాను 4:1) లేనిచో నష్టపోయేది నీవే… సత్యము మాత్రమే మనలను విమోచిస్తుంది అని గ్రహించు.. (యోహాను 8:32).
4 ఆతిథ్యంలో లోపము :
"పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.౹" (రోమా 12:13)
దేవుడు మనల్ని పరలోక ఆతిథ్యానికి సిద్ధం చేస్తున్నాడు. మనం ఇతరులకు ప్రేమతో ఆతిథ్యము చూపునప్పుడు, దేవుని స్వభావాన్ని ప్రతిబించగలం. "సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.౹" (హెబ్రీయులు 13:2).
5 ప్రవర్తనలో లోపము :
మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి - (ఫిలిప్పీయులు 1:27)
మీ ప్రవర్తన పరలోక పౌరులవలె ఉండవలెను. ప్రవర్తనలో అసత్యం లేదా అసభ్యత ఉన్నచోట క్రీస్తుతో సహవాసం ఉండదు. మన నడవడి మన విశ్వాసానికి అద్దం. మన ప్రవర్తన ద్వారానే దేవుని మహిమను చూపాలి. "మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి." (మత్తయి 5:16).
6 ఆలోచనలలో లోపము :
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి." (రోమా 12:2)
లోపభూయిష్టమైన ఆలోచనలు పాపానికి పునాది. దేవుని వాక్యముతో మన మనస్సు శుద్ధి చెయ్యబడాలి. పరిశుద్ధ ఆలోచనలే పరిశుద్ధ జీవితానికి మూలం.
7 తలంపులలో లోపము :
“ప్రతి ఆలోచనను క్రీస్తుకు విధేయమైనదిగా బంధించు.” (2 కొరింథీయులు 10:5)
మన తలంపులు దేవునికి విధేయమై ఉండాలి. స్వార్థం, అసూయ, కోపం, గర్వం వంటి తలంపులు మన ఆత్మీయతను నాశనం చేస్తాయి. కావున మనలోని తలంపులను మనం మార్చాలి.
8 ప్రార్థనలో లోపము :
“నిరంతరము ప్రార్థన చేయుడి.” — (1 థెస్సలొనీకయులు 5:17)
ప్రార్థన లేకపోతే విశ్వాసి బలహీనుడవుతాడు. ప్రార్థన అనేది దేవునితో నిత్యసంబంధం. మానవ శ్వాసలాగే అది ఆత్మిక జీవనానికి అవసరం. ప్రార్థన లేని జీవితం ఆత్మీయ మరణమే.
9 నమ్మటంలో లోపము :
“మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూడెదరని నేను చెప్పలేదా?” (యోహాను 11:40)
దేవుని వాక్యమును నమ్మకపోవడం ఆయనను అవమానించడమే. నమ్మకము కలిగిన హృదయం అద్భుతాలను చూస్తుంది; అవిశ్వాసం మాత్రం మనలను వెనక్కి లాగుతుంది. భయం మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, కానీ నమ్మకం మనలను నిలబెడుతుంది. భయపడకుము, నేను నీతో ఉన్నాను.” (యెషయా 41:10)
10 వినుటలో లోపము :
"నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.” — (యాకోబు 1:19)
దేవుని స్వరము మృదువుగా ఉంటుంది. మనం వినలేకపోతే ఆయన గూర్చిన సత్యం తెలిసేది కాదు. “జ్ఞానవంతుడు విని మరింత జ్ఞానమును పొందును.” (సామెతలు. 1:5) వినుట అంటే కేవలం వినిపించడం కాదు — వాక్యమును ఆచరించడమే (యాకోబు 1:22).
⃝ వినడం = జ్ఞానం పొందుట
⃝ మాటలను నియంత్రించడం = పరిణతి గుర్తు
⃝ కోపాన్ని అదుపులో ఉంచడం = ఆత్మపరిపూర్ణత
ఈ మూడు లక్షణాలు కలిసినపుడు, మనం యేసు స్వభావాన్ని ప్రతిబింబిస్తాము.
11. సిద్ధపడుటలో లోపము :
“మీరు సిద్ధముగా ఉండుడి; మానవ కుమారుడు మీరు ఊహించని సమయమున వచ్చును.” — (మత్తయి 24:44)
క్రీస్తు రాకడ ఆకస్మికం. విశ్వాసి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి — పాపమును విడిచి, పవిత్రతలో నిలిచి, సేవలో నిమగ్నమై ఉండాలి. సిద్ధబాటు అంటే భౌతిక సిద్ధబాటు కాదు; ఆత్మ, మనస్సు, విశ్వాసంలో సంపూర్ణ సమర్పణ. ఆత్మీయ జీవితములో “తరువాత చూద్దాం/ ఆ తరువాత” అనే ఆలోచన చాలా ప్రమాదకరం. ప్రభువు రాకడకు ప్రతీ క్షణం సిద్ధముగా ఉండటం విశ్వాసి యొక్క ముఖ్య లక్షణం.
12 మాటలలో లోపము :
అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై.. — (యాకోబు 3:2)
మాటలు మన హృదయ స్థితిని బయల్పరుస్తాయి. కఠినమైన, వ్యంగ్యమైన, లేదా గుసగుసల మాటలు ఆత్మీయతను దెబ్బతీస్తాయి. విశ్వాసి మాటలు ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించేలా, కృపతో నిండుకొని, సత్యంతో కూడిన, ఆదరణ కలిగించేలా, సమాధాన పరిచేలా, తప్పు కనపడిన చోట సమర్థించేలా కాకుండా ఖండించేలా/హెచ్చరించేలా ఉండాలి. మన్నాలుగును కాపాడుట భక్తి యొక్క సూచన. (యాకోబు 1:26)
13 గౌరవించటంలో లోపము :
"అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి." (1 పేతురు 2:17)
గౌరవం కేవలం పెద్దలకు మాత్రమే కాదు — ప్రతి మనిషికి అనగా దేవుని స్వరూపంలో సృష్టించబడినవారందరికి… ప్రేమ ఉన్నచోట గౌరవం ఉంటుంది. మనం ఇతరులను గౌరవించకపోవడం దేవుని యొక్క స్వరూపమును నిర్లక్ష్యం చేసినట్టే అగును కదా. కులం, స్థితి, జాతి, మతం వంటివి చూపక సహోదరుల యెడల మనం గౌరవం చూపాలి. "సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.౹" (రోమా 12:10) గౌరవం అనేది వినయానికి ప్రతిబింబం.
14 సన్మానించటంలో లోపము :
ఎవనియెడల సన్మాన ముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి.. (రోమా 13:7)
"నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది." (ఎఫేసి. 6:2)
సత్ప్రవర్తన కలవారిని గుర్తించి సన్మానించడం ఆత్మీయ పరిపక్వతకు సూచన. తల్లిదండ్రులను సన్మానించడం అంటే దేవుని నియమాన్ని గౌరవించడం. సన్మానించుట అంటే కేవలం మాటలతో కాదు; కృతజ్ఞత, సేవ, మరియు విధేయతతో చూపుట. అంతేకాని పూల దండలు వేయటం కాదు, కాలు మొక్కడం కాదు. దేవుడు కూడా తన సేవకులను సన్మానిస్తాడు (1 సమూయేలు 2:30). ఇలా చేయుట వలన మన జీవితం దేవునికి మహిమనిస్తుంది, సమాజానికి సాక్ష్యమవుతుంది.
15 విధేయత చూపటంలో లోపము :
“విధేయత బలులకంటె శ్రేష్ఠము.” — (1 సమూయేలు 15:22)
విధేయత అనేది దేవుని యొక్క స్వభావం. విధేయత లేని హృదయం దేవునికి దూరమవుతుంది. క్రమశిక్షణ కోల్పోయే వారం అవుతాం. విశ్వాసి తన చిత్తాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని చేయాలి. ఇది యేసు చూపిన విధానం "తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్త మైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను." (లూకా 22:42).
16 నీతిని అనుసరించటంలో లోపము :
“ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి.” — (మత్తయి 6:33)
మన ఆత్మీయ ప్రాధాన్యతలు తప్పినప్పుడు నీతి దూరమవుతుంది. దేవుని నీతి అంటే పవిత్రత, సత్యత, న్యాయం, మరియు విశ్వాసం. మనకు కావలసింది మన స్వంత నీతి కాదు, క్రీస్తు ద్వారా లభించే నీతి (ఫిలిప్పీయులకు 3:9). నీతిని వెదకడం అంటే — దేవుని వాక్యమును ఆచరించి జీవించడం. దేవుని వాక్యము ప్రకారం జీవించడం, దైవ చిత్తము యెరిగి సత్యం మరియు సమర్థతలో నడవడం — అదే నీతి.
17 న్యాయముగా జీవించటములో లోపము :
“న్యాయముగా ప్రవర్తించు, దయను ప్రేమించు, వినయముగా దేవునితో నడుచుకొనుము.” — (మీకా 6:8)
న్యాయము అనగా దేవుని ధర్మసూత్రాల ప్రకారం జీవించడం. మనము ఇతరులను తప్పుడు రీతిలో తీర్పు చేయడం, లాభం కోసం న్యాయం వక్రీకరించడం పాపం. సత్యానికి కట్టుబడి ఉండటం, ఇతరులతో సమానత్వం, నిజాయితీ, మరియు న్యాయం చూపడం. “న్యాయం చేయుడి...” (యెషయా. 1:17) నిజమైన క్రైస్తవుడు పక్షపాతం లేకుండా, నిజాయితీతో నడుస్తాడు.
18 కానుకలలో లోపము :
“ప్రతి మనిషి తన హృదయంలో నిర్ణయించిన ప్రకారమే ఇవ్వవలెను.” — (2 కొరింథీయులు 9:7)
దేవుడు బలిని కాదు — హృదయాన్ని పరిశీలన చేస్తారు. కృతజ్ఞత లేకుండా, నిస్సారంగా ఇచ్చే కానుక దేవునికి ప్రీతికరము కాదు. మన కానుక మన భక్తిని ప్రతిబింబించాలి. దేవునికి ఇచ్చే మన మనసు మన భక్తిని తెలియజేస్తుంది కృపతో, సంతోషంతో, తమ ప్రేమను కానుక రూపంలో కనపరచడమే కనపరచడమే నిజమైన ప్రేమ మరియు కృతజ్ఞత యొక్క రూపము.
19. నీ భక్తిలో లోపము :
"భక్తి లాభముగా ఉన్నది.” (1 తిమోతికి 4:8)
భక్తి అంటే కేవలం ఆచారాలు, ప్రార్థనలు కాదు — దేవుని భయముతో జీవించడం. దేవునితో లోతైన సంబంధం. ఇది మనకు శాంతి, జ్ఞానం, మరియు దేవునితో సంబంధాన్ని ఇస్తుంది. భక్తి లేని జీవితం శాపం.
20. నీ ఆరాధనలో లోపము
“దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను.” — (యోహాను 4:24)
ఆరాధన బాహ్యరు రూప క్రియా కాకుండా హృదయానికి సంబంధించినదై ఉండాలి. ఆత్మతో అనగా శరీరాన్ని ఆస్పదం చేసుకొనకుండా పరిశుద్ధాత్మతో అని, సత్యముతో అనగా అపోస్తుల బోధతో ఆరాధించుటయే.
ఆరాధన అంటే కేవలం గీతాలు కాదు; అది హృదయ సమర్పణ. వచన ఆధారములేని లేదా కేవలం ఆచారపరమైన ఆరాధన దేవునికి ఎన్నటికి ప్రీతిపాత్రం కాదు. నీ ఆరాధ్య దైవం ఎవరో నీకు తెలియాలి? ఎక్కడ ఆరాధించాలో? ఎలా ఆరాధించాలో? తెలియని ఆ ఆరాధన సత్యారాధన అనబడదు.
21. క్షమించుటలో లోపము :
"మీరు క్షమించనియెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు.” — (మత్తయి 6:15)
క్షమించని హృదయం దేవుని కృపకు అవరోధం. యేసు సిలువమీద కూడా క్షమించాడు. క్షమించడం క్రీస్తు యొక్క స్వభావ లక్షణం క్షమించు వాడు దేవుని స్వాతంత్రాన్ని పొందుతాడు.
22. ప్రేమించుటలో లోపము :
“దేవుడు ప్రేమాస్వరూపి.” — (1 యోహాను 4:8)
ప్రేమ లేకుండా విశ్వాసం మృతమైపోతుంది. మనం దేవుని ప్రేమను అనుభవించేవారిగా, ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. ప్రేమ లేనివాడు వ్యర్ధుడు, సహోదరిని ప్రేమించలేని వారు కనబడని దేవుని ఎలాగు ప్రేమించును?
23 సమాధానపడటంలో లోపము :
"సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారు లనబడుదురు." (మత్తయి 5:9)
"శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.౹" (రోమా 12:18)
వివాదం, విభేదం, అసహనం — ఇవి దేవుని రాజ్య లక్షణాలు కావు. నిజమైన క్రైస్తవుడు శాంతిని/సమాధానమును నిర్మించేవాడు. సమాధానం మనం ఇష్టపడిన వారితో మాత్రమే కాకుండా, ప్రతి మనిషితో కలిగి ఉండాలి. క్రైస్తవుని స్వభావం — అసహనముకాదు, సమాధానమే ఉండాలి.
24 ఐక్యత కలిగి ఉండటంలో లోపము :
ఒక మనస్సుతోను, ఒక ఆత్మతోను నిలిచి ఉండుడి.” — (ఫిలిప్పీయులు 1:27)
సంఘ ఐక్యతలో దేవుని శక్తి ఉంటుంది. విభజన సాతానుని ఆయుధం; ఐక్యత పవిత్రాత్మ యొక్క కార్యం.(ఎఫేసి. 4:1). విభేదాలు వర్గాలు సంఘాన్ని బలహీన పరుస్తాయి సత్యములో ఐక్యతను కాపాడటం మన పరిశుద్ధతకు సూచన.
25 మాదిరిగా ఉండటంలో లోపము :
"నాకు మాదిరిగా మీరు ఉండుడి, నేను క్రీస్తుకు మాదిరిగా ఉన్నాను.” (1 కొరింథీయులు 11:1)
ప్రతి విశ్వాసి ఇతరులకు మాదిరిగా ఉండాలి. మన జీవితం వాక్యమును ప్రతిబింబించాలి మాదిరిగా ఉండటం అంటే కేవలం బోధతో కాదు జీవనశైలితో మనం చూపించాలి. ఇలా చేయుట వలన లోపం లేనివారై మన జీవితం, మాటలు, ప్రవర్తన ద్వారా ఇతరులను క్రీస్తువైపునకు నడిపించేవారం అవుతాము.
✅ ముగింపు :
లోపం అనేది పాపం కన్నా ముందే ఉండే ఒక అంతర్గత దౌర్బల్యం. ఉదాహరణకు : ప్రార్థనలో లోపం అనేది విశ్వాసంలో బలహీనతకు దారి తీస్తుంది. ప్రేమలో లోపం అనేది ద్వేషానికి మారుతుంది. విధేయతలో లోపం అనేది తిరుగుబాటుగా మారుతుంది. ఇట్టి ఈ చిన్న లోపాలు గుర్తించకపోతే, అవి పెద్ద పాపాలకు, చివరికి ఆత్మీయ మరణానికి దారి తీస్తాయి సుమా!! మన లోపాలను మనమే సరిచేయలేము. పరిశుద్ధాత్మ మనలో పని చేయకపోతే, మార్పు సాధ్యం కాదు. అందుకే దేవుని కృప మన ఆత్మీయ పునరుద్ధరణకు మూలాధారం. దేవుడు మన హృదయాన్ని పునరుద్ధరించి, అయోగ్యతను యోగ్యతగా, బలహీనతను బలంగా మార్చగలవాడు. “అతడు మిమ్ములను లోపరహితులుగా నిలుపుటకు శక్తిమంతుడు.” — (యూదా 1:24)
పరలోకం అనేది లోపము లేనివారికి సిద్ధమై ఉంది. …"మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని…" (ఎపేసి. 1:4) కాబట్టి, నేడు మనం మన ఆత్మీయ స్థితి పరిశీలించాలి.
మనలో ఉన్న ప్రేమలో, విశ్వాసంలో, ప్రార్థనలో, విధేయతలో, ఆరాధనలో… — ఏమైనా లోపముందా? ఉంటే, నేడే అది సరిచేసుకొనే సమయం అని గుర్తించుము.
మీ ఆత్మీయులు👪

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com