క్రిస్టమస్ |
ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ప్రియులారా, నేటి క్రైస్తవ్యములో అనేక శతాబ్దాలుగా జరుగుతున్న ఆచారాలలో క్రిస్టమస్ ఒకటి. పలురకాల క్రైస్తవ విశ్వాసులు క్రిస్టమస్ ని క్రీస్తు జన్మదినమని, మరి కొంతమంది క్రీస్తుని ఆరాధాన చేయు దినముగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్టమస్ వాతావరణం నవంబర్ నెల ప్రారంభము నుండి జనవరి నెల వరకు మనము చూస్తున్నాము.
నేటి 20వ శతాబ్దపు క్రైస్తవుడా, ఏటేటా ఈ కార్యక్రమమును ఒక ఆచారముగా జరిగిస్తున్న నీవు ఈ పండుగను గూర్చిన వాస్తవమేమిటో ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అసలు ఈ క్రిస్టమస్ పండుగ మొదట ఎవరు ఆచరించారు? ఈ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? అనే కొన్ని విషయాలను మనము లోతుగా ఆలోచన చేయగలిగితే...
క్రిస్టమస్ యొక్క చరిత్ర
● ఈ పండుగను గూర్చిన ఆధారములను దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంధములో చూడలేము కనుక చరిత్ర పుస్తకాలలో చూసినట్లయితే, యేసు మరణించి, మూడవ దినమున సమాధి నుండి తిరిగి లేచిన 300 సంవత్సరాల తరువాత ఆయన యొక్క జన్మదినమును జ్ఞాపకము చేసుకుంటూ సంవత్సరములో ఒక దినమును ప్రత్యేకముగా కేటాయించడం జరిగింది.
● ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను కొంతమంది క్రైస్తవులు Merry Christmas, X-MAS , Noël , Nativity, Xmas, Yule అని పిలుస్తుంటారు.
● యేసుక్రీస్తు మరణించిన తరువాత 354వ సంవత్సరములో మొట్ట మొదటగా రోమ్ నగరంలో క్రిస్టమస్ ను జరుపుకున్నారు. ఆ తరువాత 379వ సంవత్సరములో కాన్స్టాంటినోపుల్, 388వ సంవత్సరములో ఆంటియోచ్లో అనే నగరాలలో జరుపుకోవడం జరిగింది.
● ఆ రోజుల్లో ఐరోపా ఖండములో కొన్ని దేశాలవారు పలు రకాల అన్య పండుగలను ఆచరించేవారు. జర్మన్లు యూలే పండుగను, యూదులు దీపాల పండుగను, మరి కొంతమంది సూర్య భగవానుడి పండుగను, ఇంకా అనేక అన్య పండుగలను ఏటేటా చేసేవారు. ఈ పండుగలన్నీ శీతాకాలములోనే జరుపుకోవడం వారియొక్క శైలి. ఆ సమయములో అనగా ఆరవ శతాబ్దములో డియోనస్ ఎక్సిగ్యుస్ అనే సన్యాసి ఈ పండుగలను గమనించి అన్య పండుగలను జరుపుకునేకంటే మా ప్రభువుకు ఒక దినమును ప్రతేకముగా కేటాయించాలని భావించి, వారి సంప్రదాయాలకు అనుగుణముగా డిసెంబర్ నెలలో క్రీస్తు యొక్క జన్మదినమును జరుపుకోవాలని అక్కడి ప్రజలకు ప్రకటించడం జరిగింది.
● మొదట్లో రోమన్లు క్రిస్టమస్ పండుగను డెసెంబర్ 21వ తేదీన జరుపుకునేవారు. కాని ఆరేలియన్ అనే రోమా చక్రవర్తి ఈ పండుగను డిసెంబర్ 25వ తేదీకి మార్చడం జరిగింది ఎందుకనగా అప్పటికే రోమన్లు డిసెంబర్ 25వ తేదీన సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు కాబట్టి ఆయొక్క ప్రతేక దినమునే ప్రభువైన క్రీస్తు జన్మ దినముగా జరుపుకోవాలని ఉద్దేశించి డిసెంబర్ 25వ తేదీనే క్రిస్టమస్ గా ఖరారు చేసారు.
● క్రీస్తు వారు చలి కాలములోనే పుట్టారని అప్పటికే ఒక నానుడి ఉంది కనుక యూరప్ దేశాలతో పాటు మిగతా దేశాల వారు కూడా ఈ పండుగను డిసెంబర్ నెలలోనే ఆచరించడం ప్రారంభించారు.
యేసు డిసెంబర్ 25న జన్మించాడా?
ఈ ప్రశ్నకు సమాధానము ఖచ్చితముగా యేసు డిసెంబర్ 25న జన్మించలేదని చెప్పుటకు చాలా బలమైన ఆధారములు కలవు.
● పైన వ్రాయబడిన విషయములనుబట్టి చూస్తే యేసుక్రీస్తు యొక్క జన్మదినము మనుష్యుల చేత నియమింపబడిందని తెలుస్తుంది ఏలయనగా దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంధములోని లేఖనములను ఎంత లోతుగా పరిశీలించినా క్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడనడానికి ఎటువంటి ఒక్క ఆధారము మనకు కనిపించదు.
● లూకా సువార్త 2వ అధ్యాయము 7, 8 వచనములలో రాత్రివేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారికి ప్రతక్ష్యమాయెను అని వ్రాయబడింది కాని డిసెంబర్ నెలలో అని వ్రాయబడలేదు.
» తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. – (లూకా. 2:7-8).
● మరొక ఆధారము ఏంటంటే యేసు తల్లితండ్రులు రోమా జనాభా గణనలో వారి పేర్లు నమోదు చేసుకోవడానికి బెత్లెహేముకు వచ్చినట్టుగా లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలలో మనకు కనబడుచున్నది అయితే ఈ విధమైన జనాభా లెక్కలు శీతాకాలములో నెలలో వ్రాసారనుటకు ఎటువంటి ఆధారము లేదు ఎందుకనగా జనసంఖ్య వ్రాయించుకొనుటకు ఎవరి సొంత ప్రదేశాలకు వారు వెళ్ళుటకు చేసిన ప్రయాణములో వర్షాలు పడుటచేత రోడ్లు బాగాలేక చాల కష్టాలు అనుభవించారని చరిత్ర చెప్తుంది కాబట్టి శీతాకాలములో యేసుక్రీస్తు పుట్టాడని మనము నిర్దారణ చేయలేము.
» ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భ వతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. – (లూకా. 2:1-4).
● యూదుల క్యాలండర్ ప్రకారము వర్షాకాలము తొమ్మిదవ నెల (chisleu) లో వచ్చును వారి క్యాలండర్ ను ఇంగ్లీష్ క్యాలండర్ తో పోల్చి చూస్తే తొమ్మిదవ నెల నవంబర్ డిసెంబర్ మధ్య కాలమును సూచిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ 25 క్రీస్తు జన్మదినము కాదనే చెప్పాలి.
» యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ మూడు దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమ్మిదవ నెల ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి. – (ఎజ్రా. 10:9).
» చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. – (పరమగీతము. 2:11-12).
క్రైస్తవుడు క్రిస్టమస్ పండుగను ఆచరించవచ్చా?
● క్రిస్టమస్ పండుగను ఆచరించవచ్చునో లేదో తెలుసుకునే ముందు అసలు పండుగ అంటే ఏంటో తెలియాలి.
» మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. – (నిర్గ.కాం. 32:6).
» జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. – (1 కొరింధి. 10:7).
● ధర్మశాస్త్ర కాలములో పండుగ అంటే తినడం, త్రాగడం, ఆడటమని తెలుస్తున్నది మరి ఇటువంటి స్థితిని నేటి కాలపు క్రైస్తవుల నుండి దేవుడు కోరుకుంటున్నాడా? ఆలోచన చేయాలి.
● నిజముగా మన తండ్రియైన దేవుడు మనము పండుగలను ఆచరించాలని ఇష్టము కలిగియుంటే యేసుక్రీస్తు యొక్క జనన దినము గూర్చి గ్రంధములో తెలియజేసి, ఆ దినమున యేసుక్రీస్తు పుట్టకను జ్ఞాపకము చేసుకొనమని మనకు ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చును. క్రిస్టమస్ పండుగను గూర్చి ఎటువంటి ఆధారము కాని, ఆ పండుగను గూర్చిన సంభాషణ కాని గ్రంథములో లేదంటే మనకి ఆ పండుగతో ఎలాంటి సంబంధము లేదనే అర్థమగుచున్నది.
● మరి ముఖ్యముగా దినములు, మాసములు, ఉత్సవకాలములు ఆచరించవద్దని, పండుగలను ఆచరించి ఎదుటివారికి తీర్పు తీర్చే అవకాశము ఇవ్వవద్దని నేటి క్రైస్తవులమైన మనకు ఆజ్ఞనివ్వడం జరిగింది.
» మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. – (గలతీ. 4:10-11).
» కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. – (కొలస్సి. 2:16-17).
● క్రిస్టమస్ పండుగ రోజున మాత్రమే దేవుని మందిరానికి వెళ్లే నామకార్ధపు క్రైస్తవులు నేటి కాలములో అనేకమంది కలరు. చాలా మంది డ్యాన్స్ పోటీలు, నాటకాలు, ఇంకా ఇలాంటి ఇహలోక సంబంధమైన కార్యక్రమములు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. స్త్రీలయితే గ్రంధానికి వ్యతిరేకముగా నడుచుకుంటూ స్టేజీల మీద అన్యులవలె ప్రవర్తిస్తున్నారు.
● ఇంక క్రిస్టమస్ చెట్టు విషయానికొస్తే, దేవుడు ఈ సృష్టిలో సమస్తమును సృజించినప్పుడు అన్నిటికి వాటి వాటి పేర్లు పెట్టాడు కాని ఏ చెట్టుకు కూడా ఇది క్రిస్టమస్ చెట్టు అని చెప్పలేదు. అసలు క్రిస్టమస్ పండుగను గూర్చే ఆధారము లేనప్పుడు క్రిస్టమస్ చెట్టు గూర్చి, నక్షత్రమును గూర్చి, బహుమతులను గూర్చి, క్రిస్టమస్ తాత గూర్చి మాట్లాడుకొనుటలో అతిశయోక్తి లేదు.
» మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు . – (మత్తయి. 15:9).
» జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని. – (యిర్మియా. 10:3).
వాస్తవానికి క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి? ఒక్కరోజు ముచ్చటగా దేవుని మందిరానికి వెళ్ళేది క్రైస్తవ జీవితము కాదు ప్రతి ఆదివారమున తండ్రిని ఆరాధించి (యోహాను. 4:24) ఆయన కుమారుడైన క్రీస్తు మరణాన్ని జ్ఞాపకము చేసుకోవడమే (1 కొరింధి. 11:23-29) నిజమైన క్రైస్తవ జీవితము.
వాస్తవానికి క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ లోకము ఎదుట దేవుని గుణ లక్షణములను కనపరిచేవారముగా ఉండాలి. అణుకువ కలిగి నీతిమంతులుగా, పరిశుద్దత కలిగి జీవించడమే నిజమైన భక్తి.
★ ప్రియమైన సహోదరీ, సహోదరుడా యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనుష్యరీతిగా జీవించిన 33 సంవత్సరాలలో ఎప్పుడు తన పుట్టిన రోజున జరుపుకున్నట్టుగా గ్రంధములో లేదు మరి నీవు నేను ఎందుకు జరుపుకోవాలి? క్రీస్తు పుట్టిన రోజు జరుపుకోవడములో తండ్రికి ఆనందము కలిగి యుంటే అపోస్తులులు అలాగే ఆదిమ క్రైస్తవులు చేసేవారు కాని వారు చేసినట్టుగా ఎటువంటి దాఖలు లేవు.
పరిశుద్ధ గ్రంధములో అన్యులైన ఇద్దరు వ్యక్తులు మాత్రమే పుట్టినరోజును జరుపుకున్నట్టుగా మనము చూడగలము.
★ ఆ దినము ఫరో జన్మదినము. – (ఆ.కాం. 40:20).
★ హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు,.. – (మత్తయి. 14:6).
క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాదించడమా?
● Christmas అనే పేరు లాటిన్ పదమైన Cristes Maesse ను బట్టి తర్జుమా చేయబడింది.
● Christmas అనే పదములో “christ” అంటే క్రీస్తని “mass” అంటే ఆరాధన అని భావించి క్రిస్టమస్ పండుగ రోజున క్రీస్తుని ఆరాధన చేస్తున్నారు. ఈ యొక్క క్రీస్తు నీకే ఆరాధన అనే కొత్త విధానాన్ని క్యాథలిక్ మతశాఖ వారు ప్రవేశపెట్టడం జరిగింది.
వాస్తవానికి క్రైస్తవులు ఎవరిని ఆరాధన చేయాలి? యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుండి 25 వచనాలలో యేసు మాట్లాడిన మాటలు మనము చూడగలిగితే,
★ ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను ఎవరిని ఆరాధన చేసేవారు..? "తండ్రిని"
★ యధార్ధముగా ఎవరును ఆరాధించాలి..? "తండ్రిని"
★ యధార్ధముగా ఆరాధన చేయువారు కావాలి అని ఎవరు వెదుకుచున్నారు..? "తండ్రిని"
★ ఆత్మతోను, సత్యముతోను ఎవరిని ఆరాధన చేయాలి..? "తండ్రిని".
క్రైస్తవుడు ఏ పండుగను చేయాలి?
నా ప్రియులారా ఆచరించాల్సినవి క్రమము తప్పకుండా ఆచరించుటలో నేటి క్రైస్తవులు వెనకబడియున్నారు. అయితే నేటి క్రైస్తవులు ఆచరించవలసిన దినము ఏమిటి? క్రమం తప్పకుండా మనము ఏమి జ్ఞాపకము చేసుకోవాలి? అని గ్రంధానుసారముగా ఆలోచన చేయగలిగితే సత్యమును అంగీకరించగలము,
» యేసు పునరుత్థాన దినము అనగా ఆదివారము నాడు క్రైస్తవులు ఆ పండుగను లేదా ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి. - (మత్తయి 28:1; మార్క్ 16:2; లుకా 24:1; యోహాను 20:1).
» నా (యేసు) శరీరము నన్ను (యేసును) జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
» నా (యేసు) రక్తము వలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను (యేసును) జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. - (1 కోరింది 11:24-25).
» ఆదివారమును సంఘము స్థాపింపబడింది కనుక ఆ దినమును ప్రత్యేక దినముగా ఆచరించాలి. - (అపో.కార్య. 2:41-42; 20:7).
● ఆదిమ సంఘము వారు ఆదివారము నాడే రొట్టె విరుచుట లేదా పులియని రొట్టెతో పండుగ లేదా ప్రభువు బల్ల కార్యక్రముము యెడతెగక చేశారు కనుక మనము కూడా ఈ విషయములో దేవుని ఆజ్ఞను తప్పక పాటించేవారముగా ఉండాలి.
ఆదిమ క్రైస్తవులు సవoత్సరము ఒక్కసారి అని, క్రిస్టమస్ పేరుతో, మరో విషయములో వారు అయోగ్యముగా ఏ పండుగను జరుపలేదు.
» మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. – (1 కొరింధి. 5:7-8).
నా ప్రియులారా, మరో విశేషమైన సంగతి ఏంటంటే పరిశుద్ధాత్ముడు మానవకోటికి అవసరమైన ప్రతి ఆజ్ఞను, మేలు కలుగు మార్గములను దేవుని గ్రంథములో తెలియజేయడమైనది. యేసుక్రీస్తు జన్మదినము ఆచరించడము కూడా దేవుని ఆజ్ఞ అయితే ఖచ్చితముగా పరిశుద్ద గ్రంధములో మనకు కనబడును కాని గ్రంధములో ఎటువంటి ఆధారములు లేవంటే మనుష్యులు కల్పించిన క్రీస్తు జన్మదినమును ఆచరించకపోవడమే మనకు మంచిది.
★ కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. – (అపో.కార్య. 5:38-39).
నా సహోదరీ, సహోదరుడా కాలములు, సమయములు తండ్రి తన స్వాదీనమందుంచుకున్నప్పుడు ఆ దినము క్రీస్తు పుట్టిన రోజని, ఈ దినము క్రీస్తు మరణించిన దినమని నిర్ణయించడానికి నీవు నేను ఏపాటివారము? ఆలోచన చేయు, వాక్య పరిశీలన చేయు, సత్యాన్ని గ్రహించు, సమయముండగానే నీ తోటి సహోదరులకు సత్య బోధని ప్రకటన చేయు.
★ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. – (అపో.కార్య. 1:7).
3 comments
commentsThanks 4 ur explanation
ReplyReally a wonderful message brother, because few days ago in my church (church of christ) discussed about this Christian festival's,and I understood the truth.....
ReplyNO WORDS TO SAY NOTHING BUT THANKS A LOT
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com