మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻
పరలోకమందున్న దేవుడు క్రీస్తుయేసు నందు మహా ఘనమైన కార్యాలను చేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలమైన యాగమును బట్టి క్రీస్తు నందు ఉన్నవారు బహుగా ఘనపరచబడతారు. బలియాగము క్రీస్తు ప్రభువుది. ఆ బలియాగం నందు విశ్వాసముంచిన వారు క్రీస్తు ప్రభువుకు లోబడిన వారు, క్రీస్తును తమకి ప్రభువుగా నోటితో ఒప్పుకొనిన వారు, క్రీస్తు శరీరముగా (లేదా) క్రీస్తు సంఘముగా(church of Christ) ఉన్నవారు. వీరు దేవుని సముఖంలో అత్యధికముగా గౌరవించబడతారు. పరలోకమందున్న దేవుడే వారిని గొప్పగా ఘనపరిచారు.
ఈ మానవజాతిలో క్రీస్తుయేసు ప్రభుత్వం క్రింద ఉన్నవారికి సాటియైన వారు ఎవరు లేరు దానర్థం, క్రీస్తు ప్రభువుగా ఉండి పరిపాలన చేస్తున్న క్రీస్తు సంఘములో నీవు ఉంటే నీకు సమానులు ఈ భూమి మీద ఎవరూ లేరు. అయితే ఈ లోకానికి దేవుడు ఎవరో తెలీదు, క్రీస్తు ప్రభువు ఎవరో తెలియదు, క్రీస్తు ప్రభువులో ఉన్నవారు ఎవరో తెలియదన్న విషయము వాస్తవమే. అసలు ఇంతకీ "నీవెవరివో నీకు తెలుసునా?" మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.౹ (1 యోహాను. 3:1)
దేవుని ఎరుగని గుడ్డిలోకం ఆయన పిల్లలను ఎరుగక పోవడం గొప్ప విశేషమేమీ కాదు. కాబట్టి ఈ భూమి మీద నీవు క్రీస్తు ప్రభువుని ధరించుకొని జీవిస్తున్నావంటే అది అద్భుతమైన జీవితం. నీవు క్రీస్తులో బ్రతుకుతున్నావంటే ఈ గుడ్డి లోకానికి నీవెవరో తెలీదు. కారణం అది ఆయనను ఎరుగలేదు. "యేసు లోకంలో ఉండెను లోకము ఆయన మూలంగా కలిగెను కానీ లోకము ఆయనను ఎరుగలేదు" (యోహాను. 1:2-3,11)
కాబట్టి ఈ రోజున క్రీస్తుయేసులో ఉండి, ఆయన రక్తంతో కడగబడి, పరిశుద్ధపరచబడి, నిర్దోషిగా తీర్చబడి, పవిత్రం చేయబడిన మనుషులు ఎవరో, వారి ఘనస్థితి ఏమిటో ఈ లోకానికి తెలియదు. ఈ లోకానికి తెలియకపోవడం వేరే సమాచారం కానీ నేను క్రీస్తులో ఉన్నానని, నేను ఒక క్రైస్తవుడు అని చెప్పుకునే నీకు "నీవెవరివో నిజముగా నీకు తెలుసునా? " "నీవేమైయున్నావో నీకు తెలుసునా?"
నీవు ఎవరివో నీకు స్పష్టముగా తెలియాల్సిన అవసరం ఉంది. నీకేలాంటి గౌరవం ఉందో, ఎంతటి ఘనముందో, పరలోకంలో ఉండే కోట్లాది దేవదూతలు నిన్ను ఎలా చూస్తారో, ఎలాంటి గుర్తింపు ఉందో, నీ యొక్క ఔనత్యం గూర్చి నీకు తెలియాల్సిన అవసరత ఎంతో ఉంది. ఒకవేళ ఇవన్నీ ముందే తెలుసుకున్న కూడా నీవు తెలియనట్లుగా బ్రతుకుతున్నావా? ఐతే ఈ క్షణమే మరల చదివి, ఆలోచించు ఎందుకంటే… ఈ లోకం దేవుని గ్రంథాన్ని నమ్మదు, సత్యదేవున్ని ఎరుగదు. కావున భవిష్యత్ లో ఈ లోకానికి పట్టే దుర్గతి దేవుని పిల్లలకు(నీకు) పట్టకూడదనేదే దేవుని కోరిక మరియు ఈ అంశము వ్రాయుటకు గల ముఖ్య ఉద్దేశ్యం.
1️⃣. ఈ లోకస్తులు ఎవరూ నీకు సాటియైనవారు కారు
"స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు." (మత్తయి. 11:11)
ఈ లోకంలో ప్రతి మానవుడు శరీరమందు అనగా రక్త మాంసములలో పుట్టినవాడే. స్త్రీ కంటే పుట్టినవాడే. అలాగే ఈ లోకంలో తాము గొప్ప వారిని చెప్పుకునే వారు ఉన్నారు కానీ వారు ఎవరును కూడా బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవారు కారు. వాస్తవానికి ఈ యోహాను యొక్క గొప్పతనం ఏమిటంటే "దేవుని చేత నేరుగా పంపబడిన చివరి ప్రవక్త" (యోహాను. 1:6) పాత నిబంధనకు ముగింపు సూచిక. యేసు కోసం మొదటగా ప్రకటించిన వాడు "మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి– ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.౹"(యోహాను 1:29). "క్రీ.పూ. యూదులకు ధైర్యంగా సత్యాన్ని ప్రకటించేవాడు మరియు సమాజంగా హెరోదు పాపాన్ని ధైర్యంగా ఎత్తి చూపాడు (మత్తయి. 3:1- 12; 14:1-6). తనకు తాను తగ్గి, యేసును హెచ్చించేలా మాట్లాడే వినయవంతుడు(యోహాను 3:30).
అయినప్పటికి పరలోక రాజ్యంలో వున్న అల్పుడైనవాడు బాప్తిస్మమిచ్చు యోహాను కంటే ఎంతో గొప్పగా ఎంచబడ్డాడు. పరలోక రాజ్యం అంటే — క్రీస్తు తన స్వరక్తముతో స్థాపించిన క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు సంఘము లేదా క్రైస్తవులు (యోహాను 18:36, రోమా 14:17; రోమా 16:16; మత్తయి 16:18; అపో.కార్య. 20:28). ఈ సంఘములో ఉన్నవారు “పునర్జన్మసంబంధమైన స్నానము” చేసినవారు (యోహాను 3:3–6; తీతుకు 3:5).
బాప్తిస్మమిచ్చ యోహాను క్రీస్తు స్థాపించిన రాజ్యములో పునర్జన్మసంబంధమైన స్నానము అనగా నీటిమూలముగాను మరియు పరిశుద్ధాత్మ అనుగ్రహించు నూతన స్వభావం అనగా ఆత్మ మూలముగాను జన్మించనివాడు (యోహాను. 3:3-6; తీతుకు. 3:5) కారణం క్రీస్తు తన సంఘాన్ని స్థాపించక మునుపే(అపో.కార్య. 2:36-42) బాప్తిస్మమిచ్చ యోహాను చంపబడ్డారు(మత్తయి. 14:1-9) కారణం యోహానుకు భయం లేదు.
అతడు రాజు ముందు కూడా దేవుని నీతిని మరియు హేరోదు యొక్క అక్రమమైన సంబంధమును స్ఫష్టముగా బహిరంగముగా ప్రకటించుట చేతనే కదా.(లేవీయకాండము 18:16, 20:21; మత్తయి. 14:4) యోహాను భయపడే వ్యక్తి కాదు సుమీ! ఇది ఒక నిజమైన ప్రవక్త యొక్క లక్షణం.
కావున క్రీస్తు సత్య సువార్త విని, ఆయనకు శిష్యరికం చేయుగోరువాడు, ఆయన పరిపాలన క్రింద నడవాలని ఉద్దేశించే వాడు, తాను మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం, యేసుక్రీస్తు అధికారములో అనగా తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి, క్రీస్తు సంఘములో చేర్చబడివారిలో అల్పుడైనవాడు బాప్తిస్మమిచ్చ యోహానుకంటె గొప్పవాడు అనే సంగతి గుర్తించు.(రోమా. 10:9; మత్తయి. 28:19; అపో.కార్య. 2:38; మత్తయి. 11:11b) ఇది ఎంతో గొప్ప భాగ్యం. ఇది కేవలం ప్రభువైన క్రీస్తు వలన మనకు కలిగింది. ఆయన యందు ఉచితముగా అనుగ్రహింపబడుతున్న కృపవలనే సాధ్యమైంది. ఈ సంగతులు అర్థం కానివాడు, ఆయన సంఘములో లేనివాడికి తాను ఈ లోకంలో ఏదో కోల్పోయిన వాడిగా బలహీనుడిగా ఉంటాడు.
2️⃣. "నీవు తేజోవాసివి.., పరలోక వాసివి…"
క్రీస్తు రాజ్యంలో అనగా ఈ భూమి మీద "క్రీస్తు సంఘములో" నీవెంత గొప్పవాడివో చూసాం కదూ అయితే రెండవదిగా నీ స్థితి పరలోకంలో ఎలా ఉంటుందో/ఉండనుందో అనే విషయాన్ని రెండవదిగా ప్రయత్నం చేద్దాం.
⭐ పరలోకము తేజోవాసులకు నివాస స్థలము.
⭐ “తేజో” = ప్రకాశము, వెలుగు, మహిమ, దేవుని తేజస్సు
⭐ “వాసి” = నివసించేవాడు, ఆ స్థితిలో ఉండేవాడు
⭐ తేజస్సు - దేవుని మహిమ, దేవుని ఉనికి, దేవుని పరిశుద్ధత
⭐ “తేజోవాసి” అంటే — వెలుగులో నివసించువాడు, మహిమలో స్థిరముగా ఉన్నవాడు, దైవ తేజస్సుతో నిండినవాడు, అమరత్వము గలవాడు, ఆత్మీయ స్వరూపముని సూచిస్తుంది
⭐ ఇది చీకటి లేదా అపవిత్రత లేనివారు అని అర్థం. పవిత్రతతో, పరలోక కాంతితో, పరిశుద్ధతతో నిండిన స్థితి కలిగినవారు అని
⭐ "తేజోవాసులు" అనగా — దేవుని వెలుగులో నివసించే వారు, ఆయన మహిమను ధరించిన వారు, ఆయనతో సమాగమములో ఉన్నవారు, ఆ తేజస్సును లోకములో ప్రతిఫలింప చేసేవాడు.
👤🔥 "మొదటిగా మన తండ్రియైన దేవుడు తేజోవాసి*
"శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.౹ సమీ పింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్." (1 తిమోతి. 6:15-16)
◾ దేవుడు తేజస్సులో నివసించువాడు.
◾దేవుడు వెలుగు — ఆయన వెలుగుకంటే ఎక్కువ కాంతిమంతుడు (1 యోహాను 1:5)
◾ఉదాహరణకు : మోషే దేవుని తేజస్సులో కొంత భాగాన్ని చూశాడు; దాని ఫలితంగా అతని ముఖం ప్రకాశించింది (నిర్గమకాండము 34:29–35). అంటే దేవుని సమీపంలో ఉండడం వలన కూడా మనిషి కాంతివంతమౌతాడు.
👤🔥 రెండవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు తేజోవాసి
"ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి,... " (హెబ్రీ. 1:3)
"తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను 17:5)
◾ యేసు దేవుని కుమారుడు మాత్రమే కాదు దేవుని తేజస్సును, మహిమను ధరించినవాడు (లేదా) క్రీస్తు తన దేవుని తేజస్సు యొక్క ప్రతిరూపము.
◾తేజోవాసి యేసు! ఈ భూమి మీద జీవించు కాలములో యేసు తన రూపాంతర సమయంలో ఆ తేజస్సును చూపించాడు.
◾ "మరల యేసు– నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹" (యోహాను 8:12)
◾ రూపాంతరములో ≈ "ఆయన రూపాంతరము పొందెను; ఆయన ముఖము సూర్యమువలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు కాంతివలె తెల్లగా మారెను." (మత్తయి. 17:2)
◾ పునరుత్థానములో ≈ "ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు జరిగిన ఈ సంగతులన్నిటినిగూర్చి యొక రితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను." (లూకా. 24:13-16) "ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.౹" (యోహాను. 20:14)
◾ "అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.౹ అప్పుడతడు నేలమీదపడి —సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.౹ –ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన– నేను నీవు హింసించు చున్న యేసును;౹" (అపో.కార్య. 9:3-5)
👤🔥 మూడవదిగా మన ఆత్మయు/ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు
"ప్రభువే ఆత్మ. ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్యమునుండును.౹ మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము." (2 కొరింథీయులు 3:17–18)
◾ పరిశుద్ధాత్ముడు కూడా తేజోవాసినే
◾ ఇది బాహ్యగా కనపడే దృష్టి కాదు; ఆత్మీయ దృష్టి
◾పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడు, మన ఆలోచనలు, మనసు, స్వభావం, నడవడి — అన్నీ ఆయన రూపమునకు దగ్గరవుతాయి. (రోమా. 12:2; ఫిలిప్పీయులకు 3:21)
◾దేవుని తేజస్సు మనలోకి రావడం అంటే ఆయన ఆత్మ మనలో పనిచేయడం.
ఈ మార్పు కేవలం ప్రవర్తనలో కాదు — దైవ స్వరూపంలో మార్పు కలుగుతుంది. (2 పేతురు 1:4)
◾పరమదేవుడు తేజోవాసి. మన ప్రభువైన యేసు ఆ తేజస్సు యొక్క ప్రతిబింబం. మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు ఆ తేజస్సును మనలో ప్రతిబింబింపజేయువాడు.
◾ మనలో స్వాతంత్ర్యం, తేజస్సు, మహిమను నింపుతాడు.
👥🔥 నాలుగవదిగా దేవదూతలు తేజోవాసులు
"—తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు... " (హెబ్రీ. 1:7)
◾దేవదూతలు తేజోవాసులు ఎందుకంటే వారు దేవుని సముఖంలో నిరంతరముగా నిలిచి సేవచేస్తారు.
◾యేసు పునరుత్థాన పిమ్మట సమాధి దగ్గర దేవదూతలు మెరుపులవలె ప్రకాశించే వస్త్రములతో కనబడ్డారు (లూకా 24:4).
👬👭 ఐదవది క్రీస్తు సంఘ సభ్యులు అనగా క్రైస్తవులు కూడా తేజోవాసులే
◾క్రీస్తు సంఘ సభ్యులు(church of Christ) అనగా గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంధమందు ఎవరి పేరు వ్రాయబడునో వారే… వీరు క్రీస్తు నందు ఉన్నవారు అనగా చీకటిలో కాదు, వెలుగులో నడిచేవారు/ వెలుగు యొద్దకు పిలువబడిన వారు (ఎఫెసి. 5:8; 1 పేతురు. 2:9) ఇట్టి వారి “పౌరత్వము పరలోకమందున్నది.” (ఫిలిప్పీయులకు 3:20) "తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను చేసెను.” (కొలస్సి 1:12) కావున నీవు తేజోవాసివే అని తెలుసుకో.
"... దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను... " పరిశుద్ధాత్ముడు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ...పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో (ఎఫెసి 1:11,14,17). "మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.౹" ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.౹"
(1 పేతురు 1:3,5)
✨ క్రీస్తు రాజ్యములో(సంఘములో) నున్నవాడు భూనివాసి కాదు. "భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.౹" (ప్రకటన. 13:8) గొఱ్ఱెపిల్లయొక్క జీవ గ్రంథములో పేరు లేనివారు భూనివాసులే కానీ పరలోక నివాసులుకారు.
✨ ఆయన(క్రీస్తు) రాజ్యములో(సంఘములో) ప్రవేశించువారందరూ పరలోక సంబంధులే. ప్రభువైన యేసును ధరించుకున్న వాడు భూమి వాసిగా లెక్కించబడడు. ప్రస్తుతం నీవు ఈ భూమ్మీద ఉండవచ్చు కానీ నీవు పరలోక వాసిగా లెక్కింపబడతావు. అంతేకాకుండా నీకు స్వాస్థ్యము ఇచ్చాడు.
⭐ తేజోవాసులు ≈ పరలోకవాసులు ⭐
✨ తేజోవాసులు మాత్రమే పరలోకంలో నివసిస్తారు.
📖 దేవదూతల కంటే క్రీస్తుయేసు శరీరమందు ఉన్నవారు అనగా క్రీస్తు సంఘముగా ఉన్నవారు అధికమైన తేజోవాసులు, ఘనులు మరియు గొప్పవారు. ఇది కేవలం క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన కృపవలన సాధ్యపడింది. కావున ప్రతి క్రీస్తు సంఘ సభ్యుడు నీవెవరివో అనే సంగతి మరవద్దు. 🙏🏻
A). దేవదూతలకు మరియు నీకు ఉన్న తేడా ఏమిటో నీకు బాగా తెలియాలి
దేవదూతలు దేవుని యొక్క సేవకులే (హెబ్రీ. 1:7) సేవకులు ఎప్పుడూ పిల్లలు కాలేరు. బిడ్డలు మాత్రమే తండ్రి స్వాస్థ్యమునకు హక్కుదారులైయుంటారు. భూమి పుట్టక మునుపు నుండి దేవదూతలు దేవుని సముఖములో ఉన్నారు కాని వారికి నీలాంటి హక్కు లేదు, నీకున్న ఘనత లేదు, నీకున్న మహిమ లేదు.
సేవకుడు సేవకుడే కానీ పిల్లలు మాత్రమే దేవుని వారసులు
యజమాని కుర్చీ పక్కన నిలుచుని సేవ చేసేవాడు సేవకుడు. యజమాని కూర్చున్నంతసేపు నిలబడతాడు. యజమాని వెళ్లిపోయాడు కదా కుర్చీ ఖాళీగా ఉంది కదా అని సేవకుడు కూర్చోడు. అట్టి ధైర్యం కూడా చేయలేడు. అయితే ఖాళీగా ఉన్న యజమాని కుర్చీలో ధైర్యంగా వెళ్లి కూర్చోగలడు వారసుడు (యజమాని పిల్లలు). నీవు దేవుని వారసత్వంలో భాగమైనవాడివి. క్రీస్తుతో కూడ వారసుడువి. (రోమా 8:17)
దేవదూతలను ఎన్నడూ నా కుమారులు అని దేవుడు చెప్పలేదు. దేవదూతలు రక్షణ పొందు వారికి పరిచారకులు, సేవకులే. "వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?" (హెబ్రీ. 1:14)
ఇదంతాయు పరలోకమందున్న దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసులో క్రీస్తు సంఘ సభ్యులకు అనుగ్రహించిన భాగ్యం. ఈ సంగతులు ఈ లోకానికి తెలియదు, ఏ మత శాఖలకి తెలియదు/వివిధ నామాలు కలిగిన/అపోస్తుల బోధకు కానీ ఏ శాఖలకి తెలియదు. ఎందుకంటే వారు నడిచేత్రోవ సరైనది కాదు. బోధ సరైనది కాదు. క్రీస్తు సంఘ(church of Christ) సభ్యుడిగా నీకు తెలియక పోవడం ఎంతటి దౌర్భాగ్యం. అయ్యో! ☹️
దేవుని సముఖములో నున్న దేవదూతలకు(సేవకులకు) మరియు నీకు మధ్య వ్యత్యాసముంది. నీ అంతస్తు మానవజాతి కంటే ఎక్కువ. దేవదూతలు కంటే ఎక్కువ. నీకు సేవచేయుటకే దేవతలు ఏర్పాటు చేయబడ్డారు అనే సంగతి నీకు తెలుసునా?
B). *నీవు నేర్పిస్తే దేవదూతలు నేర్చుకునేంతగా నిన్ను హెచ్చించాడు
ఈ భూమికి పునాదులు వేయబడక మునుపే దేవదూతలు ఉన్నారు.* "నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?" (యోబు. 38:4-7) అంటే నరుల కంటే ముందు నుండి దేవుని సముఖములో దేవదూతలు ఉన్నారని వారికి నీ కంటే ఎక్కువగా దేవుని గురించి బాగా తెలుసు అనేగా…
ఐనప్పటికి క్రీస్తు సంఘములో నన్ను వారు దేవదూతల జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానవంతులుగా ఎంచబడ్డారు అనే సంగతి నీకు తెలుసునా? "ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.౹ మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు.౹ ఎట్లనగా —క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచబడినదను సంగతినిగూర్చిమునుపు సంక్షేపముగా వ్రాసితిని.౹ మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.౹ ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.౹ ఈ మర్మమేదనగా– అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.౹ దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.౹ దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.౹" (ఎపేసి. 3:1-8)
సంఘము నేర్పిస్తే దేవదూతలు నేర్చుకునేంతగా నిన్ను(క్రీస్తు సంఘము) హెచ్చించాడు. నీవు క్రీస్తు ప్రభువులో నమ్మకంగా ఉంటే దేవుని నీకిచ్చే కొల పరిమాణం ఇదే. ఈ సంగతి నీకు తెలుసునా?
C). *నీ స్థాయి వేరు — దేవదూతలు స్థాయి వేరు
"మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశో ధించిరి.౹ పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారిద్వారా మీకిప్పుడు తెలుప బడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు." (1 పేతురు. 1:10-12)
📖 “దేవుని జ్ఞానం అన్వేషింపలేనిది!” (రోమా 11:33) పూర్వపు ప్రవక్తలు, దేవదూతలు క్రీస్తు సంఘంలో ఉన్న స్థితిని పొందలేకపోయారు. వారు సంఘము కొరకే పని చేశారు. ప్రవక్తలు తమ కాలంలో దైవ సందేశం పొందినప్పటికి వారి సేవ తమ తరానికి మాత్రమే కాదు, భవిష్యత్తు విశ్వాసులకు అనగా నేడు క్రీస్తు సంఘము సభ్యులకు మాత్రమే ఉద్దేశించబడింది.
➡️ వారు విత్తారు, మనం పంట కోస్తున్నాం.
➡️ వారు ఆశతో చూశారు, మనం నెరవేరిన వాగ్దానాన్ని అనుభవిస్తున్నాం.
రక్షణ అనేది యాదృచ్ఛికం కాదు — దేవుని శాశ్వత ప్రణాళిక. యేసు క్రీస్తు ద్వారా దేవుని కృప మనకు ప్రత్యక్షమైంది. ఇక విషయానికి వస్తే… దేవదూతలు సంఘాన్ని తొంగి చూసే స్థితిలో ఉన్నారు(1 పేతురు. 1:20cf) అది వారి స్థాయి… మరి నీ స్థాయి ఎట్టిదో నీకు తెలుసునా? క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన క్రింద ఉన్న నీకు నీ స్థాయి తెలుసునా? ఆయన పరిపాలన క్రింద ఉన్నవాడు అంతస్థకు తగినట్లుగా బ్రతుకుతాడు(రోమా. 14:8-9), ఘనతకు తగినట్లుగా ప్రవర్తిస్తాడు(ఎపెసి. 4:1), తన స్థాయిని నిలబెట్టుకోవడానికి నిత్యము ముందుకు సాగుతాడు(హెబ్రీ. 12:1-3)
క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము అనగా క్రీస్తు సంఘము ఒక రోజున పరలోకానికి ఆహ్వానింపబడతాది. ఆ ఆహ్వానానికి ఏర్పాట్లు ఆర్భాటముగా జరుగుతాయి, చేయబడ్డాయి. ఏలయనగా… ప్రధాన దూత శబ్దముతో ప్రభువైన యేసు వస్తారు. ఆయన దిగివచ్చిన దినమున వధువైన క్రీస్తు సంఘం(church of Christ) పరలోకానికి కొనిపోబడతాది. దాని అర్థం పరలోకానికి హక్కుదారిగా చేయబడతాది. ఇది క్రీస్తు సంఘానికి ఉండే మహత్కారమైన ఘనత, ఆధిక్యత. క్రీస్తు ప్రభువు యొక్క భార్యగా క్రీస్తుకి ఉండే అన్నిటిలోనూ భాగస్వామ్యం పొందుతాది. నీకు ఒక గుర్తింపు దొరుకుతాది నీకు ఒక మర్యాద దక్కుతాది. ఇంతకుమించి వర్ణించలేము….. ఇకనైనా నీవెవరివో నీకు తెలిసిందా? ఆలోచించు… ఏదో రకముగా తోచినట్టుగా బ్రతికేది క్రైస్తవ జీవితం కాదు సుమీ!!
మీ ఆత్మీయులు👪


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com