Showing posts with label యేసుక్రీస్తు. Show all posts
Showing posts with label యేసుక్రీస్తు. Show all posts

క్రీస్తు ఒక్కడే మీ గురువు!? 👤



పరిచయం :

క్రీస్తు ఒక్కడే మీ గురువు” అనే మాట యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట. కాబట్టి క్రీస్తును మన గురువుగా అంగీకరించడం అంటే కేవలం ఆయనను “గురువు” అని పిలవడం కాదు; ఆయన ఏమి బోధించాడు? ఎవరిని గూర్చి బోధించాడు? ఏమి చేయమన్నాడు? తాను చెప్పినదాన్ని తానే ఎలా ఆచరించాడు? అనే విషయాలను నాలుగు సువార్త పుస్తకాలలో మనం  పరిశీలించాలి. మత్తయి 23:10 లో యేసు పరిసయ్యులు, శాస్త్రులు కోరుకున్న మతపరమైన గౌరవం, బిరుదులు, పై స్థానాలు, మనుష్యులచే గొప్పగా పిలువబడాలనే కోరికను గద్దిస్తున్న సందర్భంలో “మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు” అని చెప్పాడు. కాబట్టి ఈ మాటను ఒంటరిగా తీసుకొని అర్థం చేసుకోవడం సరిపోదు. అదే నాలుగు సువార్త పుస్తకాలలో యేసు చేసిన బోధనను పరిశీలించినప్పుడు, ఆయన ఎందుకు తన శిష్యులకు “క్రీస్తు ఒక్కడే మీ గురువు” అని ఎందుకు చెప్పాడో మరింత స్పష్టంగా తెలుస్తుంది.

యేసు ప్రజలకు తన దేవుని రాజ్యాన్ని బోధించాడు, దేవుని చిత్తాన్ని ప్రకటించాడు, అద్వితీయుడైన దేవుని గూర్చి బోధించాడు, తండ్రిని ఆరాధించమని చెప్పాడు, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని బోధించాడు. మారుమనస్సు, పరిశుద్ధ జీవితం, ప్రేమ, క్షమాపణ, ప్రార్థన, విశ్వాసం, వినయం, సేవ, ధనం విషయంలో జాగ్రత్త, శిష్యత్వం, నిత్యజీవం మొదలైన విషయాలను బోధించాడు. అంతేకాదు—తాను బోధించినదాన్ని తన జీవితంలో తానే చేసి చూపించాడు. అందువల్ల “క్రీస్తు ఒక్కడే మీ గురువు” అనే అంశాన్ని నాలుగు సువార్త పుస్తకాలలో యేసు చేసిన బోధన ఆధారంగా మనం నేడు పరిశీలిద్దాం.


A. దేవుని రాజ్యాన్ని బోధించిన గురువు :

1. దేవుని రాజ్యము సమీపించిందని ప్రకటించాడు

యేసు తన పరిచర్య ప్రారంభంలోనే దేవుని రాజ్యము సమీపించిందని ప్రకటించాడు. - మత్తయి 4:17; మార్కు 1:14–15

2. మారుమనస్సు పొందమని బోధించాడు. దేవుని రాజ్య ప్రకటనతో పాటు మారుమనస్సును కూడా బోధించాడు. - మత్తయి 4:17; మార్కు 1:15

3. దేవుని రాజ్యాన్ని ఉపమానాల ద్వారా వివరించాడు. విత్తువాని గూర్చి, ఆవగింజ, పులిసిన పిండి మొదలైన ఉపమానాల ద్వారా దేవుని రాజ్య విషయాలను బోధించాడు. - మత్తయి 13:1–52; మార్కు 4:1–34; లూకా 8:4–15

4. దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వమని బోధించాడు. - మత్తయి 6:33; లూకా 12:31

5. రాజ్యంలో ప్రవేశానికి నీటిములముగాను, ఆత్మములముగాను క్రొత్తగా జన్మపొంది, చిన్నవానివలె మారాలని బోధించాడు - యోహాను 3:1-6; మత్తయి 18:1–4; మార్కు 10:13–16; లూకా 18:15–17


B. దేవుని చిత్తాన్ని బోధించిన గురువు

6. తండ్రి చిత్తాన్ని బోధించాడు. తన బోధ తనది కాదని, తనను పంపినవాని బోధ అని చెప్పాడు. - యోహాను 7:16–17; 12:49–50

7. తండ్రి యొక్క పని చేయడమే తన ఆహారమని చెప్పాడు - యోహాను 4:34

8. తండ్రి చిత్తాన్ని చేయడానికి తనను తాను అప్పగించాడు - మత్తయి 26:39; మార్కు 14:36; లూకా 22:42

9. తన ఆజ్ఞలను పాటించమని బోధించాడు - యోహాను 14:15,21; 15:10

10. మానవ యోచనలు/పద్దతులు కంటే దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యత ఇచ్చాడు - మత్తయి 15:1–9; మార్కు 7:5–13


C. వాక్యాన్ని సత్యంగా బోధించిన గురువు

11. “వ్రాయబడియున్నది” అని దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నాడు - మత్తయి 4:1–11; లూకా 4:1–13

12. “మీరు చదువలేదా?” అని శాస్త్రాన్ని పరిశీలించమని ప్రశ్నించాడు - మత్తయి 12:3,5; 19:4; 21:16,42; 22:31

13. ఎమ్మాయికి వెళ్తున్న శిష్యులకు మోషే మొదలుకొని ప్రవక్తల వరకు తనను గూర్చిన సంగతులను వివరించాడు. - లూకా 24:27

14. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు - మత్తయి 5:17–18

15. వాక్యాన్ని వినడమే కాక ఆచరించమని బోధించాడు - మత్తయి 7:24–27; లూకా 6:46–49


D. పరిశుద్ధ జీవితం బోధించిన గురువు

16. హృదయ పరిశుద్ధతను బోధించాడు - మత్తయి 5:21–22

17. మోహదృష్టిని కూడా పాపానికి సంబంధించిన విషయంగా బోధించాడు - మత్తయి 5:27–30

18. మాటలో నిజాయితీ ఉండాలని బోధించాడు - మత్తయి 5:33–37

19. శత్రువులను ప్రేమించమని బోధించాడు - మత్తయి 5:43–48; లూకా 6:27–36

20. ప్రతీకారానికి బదులు సహనాన్ని బోధించాడు - మత్తయి 5:38–42


E. ప్రార్థన బోధించిన గురువు

21. రహస్యంగా ప్రార్థించమని బోధించాడు - మత్తయి 6:5–6

22. వ్యర్థమైన మాటలను ప్రార్థనగా భావించవద్దని బోధించాడు - మత్తయి 6:7–8

23. ప్రభువు ప్రార్థనను నేర్పించాడు - మత్తయి 6:9–13; లూకా 11:1–4

24. విసుగు చెందకుండా ప్రార్థించమని బోధించాడు - లూకా 18:1–8

25. ప్రార్థనలో ఇతరులను క్షమించమని బోధించాడు - మత్తయి 6:14–15; మార్కు 11:25


F. ప్రేమను బోధించిన గురువు

26. తన దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించమని బోధించాడు - మత్తయి 22:37–38; మార్కు 12:29–30

27. పొరుగువానిని తనవలె ప్రేమించమని బోధించాడు - మత్తయి 22:39–40; మార్కు 12:31

28. మంచి సమరయుని ఉపమానం ద్వారా పొరుగువాని గురించి బోధించాడు - లూకా 10:25–37

29. శత్రువులను ప్రేమించమని బోధించాడు - మత్తయి 5:44–45

30. శిష్యులు పరస్పరం ప్రేమించుకోవాలని ఆజ్ఞాపించాడు - యోహాను 13:34–35; 15:12


G. క్షమాపణ బోధించిన గురువు

31. సహోదరుని క్షమించమని బోధించాడు - మత్తయి 18:21–22

32. క్షమించని దాసుని ఉపమానం ద్వారా క్షమాపణను బోధించాడు - మత్తయి 18:23–35

33. ఇతరులను క్షమించని హృదయాన్ని హెచ్చరించాడు - మత్తయి 6:14–15

34. సిలువపై తనను హింసించినవారి కోసం తండ్రికి  క్షమాపణ కోరాడు - లూకా 23:34

35. తప్పు చేసిన సహోదరునితో ఎలా వ్యవహరించాలో క్రమంగా బోధించాడు - మత్తయి 18:15–17


H. వినయం మరియు సేవ బోధించిన గురువు

36. మీలో గొప్పవాడు సేవకుడిగా ఉండాలని బోధించాడు - మార్కు 10:42–45; మత్తయి 20:25–28

37. తనను తాను తగ్గించుకునే వినయాన్ని బోధించాడు - మత్తయి 18:1–4; మార్కు 9:33–37

38. పిల్లలను స్వీకరించడం ద్వారా వినయాన్ని బోధించాడు - మార్కు 10:13–16; లూకా 18:15–17

39. శిష్యుల పాదాలు కడిగి సేవకు మాదిరి చూపించాడు - యోహాను 13:1–17

40. అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చానని బోధించాడు - మార్కు 10:45


I. ధనం మరియు లోకాసక్తి గురించి బోధించిన గురువు

41. భూమిమీద ధనాన్ని కూడబెట్టవద్దని బోధించాడు - మత్తయి 6:19–20

42. దేవునికీ మరియు ధనానికీ దాసులుగా ఉండలేమని బోధించాడు - మత్తయి 6:24

43. ఆస్తి ఎక్కువగా ఉండటం జీవమునకు మూలము  కాదని బోధించాడు - లూకా 12:13–21

44. ధనంపై ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాన్ని బోధించాడు - మార్కు 10:17–27; లూకా 18:18–27

45. దేవుని రాజ్యాన్ని(క్రీస్తు సంఘమును) మొదట వెదకమని బోధించాడు - మత్తయి 6:25–34; లూకా 12:22–31


J. విశ్వాసం గురించి బోధించిన గురువు

46. దేవునిపై విశ్వాసం ఉంచమని బోధించాడు - మార్కు 11:22

47. విశ్వాసంతో ప్రార్థించమని బోధించాడు - మార్కు 11:23–24

48. భయపడకుండా విశ్వసించమని బోధించాడు - మార్కు 5:35–36

49. దేవునిపై విశ్వాసం ఉంచినట్లే తనపై కూడా విశ్వాసం ఉంచమని చెప్పాడు - యోహాను 14:1

50. తనపై విశ్వాసం ఉంచుట ద్వారా నిత్యజీవం గురించి బోధించాడు - యోహాను 3:16–18; 6:35–40,47


K. పాపం మరియు మారుమనస్సు గురించి బోధించిన గురువు

51. మారుమనస్సు పొందమని ప్రకటించాడు - మత్తయి 4:17; మార్కు 1:15

52. మారుమనస్సు పొందకపోతే నాశనమవుతారని హెచ్చరించాడు - లూకా 13:1–5

53. చెడు హృదయంలోనుండి వస్తుందని బోధించాడు - మార్కు 7:20–23

54. పాపంలో కొనసాగకుండా విడిచిపెట్టమని బోధించాడు - యోహాను 5:14; 8:11

55. ఇతరులను తీర్పు చేసే ముందు తనను తాను పరిశీలించమని బోధించాడు - మత్తయి 7:1–5; లూకా 6:37–42


L. అబద్ద  బోధకుల గురించి హెచ్చరించిన గురువు

56.  అబద్ద ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు - మత్తయి 7:15

57. వారి ఫలాల ద్వారా వారిని గుర్తించమని బోధించాడు - మత్తయి 7:16–20

58. “ప్రభువా ప్రభువా” అని చెప్పేవారందరూ రాజ్యంలో ప్రవేశించరని బోధించాడు - మత్తయి 7:21–23

59. అబద్ద క్రీస్తులు, అబద్ద ప్రవక్తల గురించి హెచ్చరించాడు - మత్తయి 24:4–5,23–25; మార్కు 13:21–23

60. గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి నడిపితే ఇద్దరూ గుంటలో పడతారని బోధించాడు - మత్తయి 15:12–14


M. శిష్యత్వం గురించి బోధించిన గురువు

61. తనను వెంబడించమని పిలిచాడు - మత్తయి 4:19–22; మార్కు 1:16–20

62. తన సిలువను ఎత్తుకొని తనను వెంబడించాలని బోధించాడు - మత్తయి 16:24; మార్కు 8:34; లూకా 9:23

63. తనకంటే ఇతరులను ఎక్కువగా ప్రేమించుట ద్వారా శిష్యత్వం సాధ్యం కాదని బోధించాడు - మత్తయి 10:37–39; లూకా 14:26–27

64. తన బోధలో నిలిచినవారే నిజమైన శిష్యులని బోధించాడు - యోహాను 8:31–32

65. ఒకరిని ఒకరు పట్ల ప్రేమ శిష్యుల గుర్తుగా ఉండాలని బోధించాడు - యోహాను 13:34–35


N. నిత్యజీవం గురించి బోధించిన గురువు

66. నిత్యజీవం గురించి బోధించాడు - యోహాను 3:16; 6:40,47

67. తానే జీవాహారమని బోధించాడు - యోహాను 6:35,48–51

68. తానే లోకానికి వెలుగని బోధించాడు - యోహాను 8:12

69. తానే పునరుత్థానమును జీవమును అని బోధించాడు - యోహాను 11:25–26

70. తానే మార్గము, సత్యము, జీవము అని, తన ద్వారా తప్పా తండ్రి యొద్దకు ఎవరు పోలేరని  ప్రకటించాడు - యోహాను 14:6


O. తనను గురువుగా ప్రకటించిన గురువు

71. తాను బోధకుడనని స్వయంగా చెప్పాడు - “మీరు నన్ను బోధకుడనియు ప్రభువనియు పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును.” - యోహాను 13:13

72. తన మాట విని ఆచరించేవానిని బుద్ధిమంతుడుతో పోల్చాడు - మత్తయి 7:24–27

73. తనను ప్రేమించేవాడు తన ఆజ్ఞలను పాటించాలని బోధించాడు - యోహాను 14:15,21,23–24

74. తన మాటలను నిత్యజీవపు మాటలుగా శిష్యులు గుర్తించారు - యోహాను 6:68

75. తన బోధ తండ్రి నుండి వచ్చినదని స్పష్టం చేశాడు - యోహాను 7:16; 12:49–50


P. అద్వితీయ దేవుని గూర్చి బోధించిన గురువు

ఇది “క్రీస్తు ఒక్కడే మీ గురువు” అనే అంశంలో అత్యంత ప్రాముఖ్యమైన భాగం. యేసు దేవుని గూర్చి బోధించినప్పుడు దేవుడు అద్వితీయుడని స్పష్టంగా ప్రకటించాడు.

76. అద్వితీయుడైన దేవుని గూర్చి బోధించాడు. శాస్త్రజ్ఞుడు ప్రధానమైన ఆజ్ఞ గురించి అడిగినప్పుడు యేసు: వినుము ఇశ్రాయేలూ, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.” అని ప్రకటించాడు. - మార్కు 12:28–30

77.  పరమతండ్రిని తన దేవుడిగా పేర్కొన్నాడు.

పునరుత్థానానంతరం మరియతో మాట్లాడుతూ:

నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును.”

 అని చెప్పాడు. - యోహాను 20:17

78. సిలువపై తన దేవునిని ఉద్దేశించి మొఱ్ఱపెట్టాడు

నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి?” - మత్తయి 27:46; మార్కు 15:34

79. తన తండ్రిని గూర్చి బోధించాడు. యేసు తన బోధలో తండ్రి ఎవరో, తండ్రి చిత్తం ఏమిటో, తండ్రిని ఎలా ప్రేమించాలో, తండ్రి దగ్గరకు ఎలా రావాలో బోధించాడు. - మత్తయి 6:9; యోహాను 14:6–13; 17:1–3


Q. తన తండ్రిని ఆరాధించమని బోధించిన గురువు

80. తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని బోధించాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు:

యధార్ధమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించుదురు.” అని మరియు ఇది తండ్రి యొక్క కోరికనని బోధించాడు. - యోహాను 4:21–24

81. దేవునినే ఆరాధించి ఆయనను మాత్రమే సేవించమని బోధించాడు. సాతాను శోధించినప్పుడు యేసు:

నీ దేవుడైన ప్రభువునకు నమస్కరించి, ఆయనను మాత్రమే సేవింపవలెను.” అని చెప్పాడు. - మత్తయి 4:8–10; లూకా 4:5–8

82. తండ్రిని ప్రార్థించమని నేర్పించాడు

యేసు ప్రార్థన నేర్పినప్పుడు:

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక…” అని ప్రారంభించాడు. - మత్తయి 6:9–13; లూకా 11:1–4


R. అపవాది గురించి బోధించిన గురువు

83. అపవాది గురించి బోధించాడు - యేసు అపవాది యొక్క ఆది నుండి ఉండే ఉనికిని, అతని కార్యాలను, అతని మోసాన్ని గురించి స్పష్టంగా బోధించాడు. - మత్తయి 4:1–11; యోహాను 8:44

84. అపవాది దేవుని వాక్యాన్నినీ హృదయములో నుండి  తీసివేయడానికి ప్రయత్నిస్తాడని బోధించాడు. విత్తువాని ఉపమానాన్ని వివరించేటప్పుడు మార్గమున పడిన విత్తనం వాక్యాన్ని విన్న వెంటనే సాతాను వచ్చి ఆ వాక్యాన్ని తీసివేస్తాడని యేసు చెప్పాడు. - మార్కు 4:14–15

85. అపవాది అబద్ధికుడని బోధించాడు. యేసు అపవాది గురించి మాట్లాడుతూ అతడు అబద్ధికుడును అబద్ధమునకు తండ్రియునై ఉన్నాడని చెప్పాడు. - యోహాను 8:44

86. అపవాది మనుష్యులను శోధిస్తాడని బోధించాడు

యేసు స్వయంగా అపవాది చేత శోధించబడిన సంఘటన  - మత్తయి 4:1–11; మార్కు 1:12–13; లూకా 4:1–13

87. అపవాదిని ఎదిరించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు

అపవాది శోధించినప్పుడు యేసు ప్రతి సందర్భంలో “వ్రాయబడియున్నది” అని దేవుని వాక్యంతో సమాధానమిచ్చాడు. - మత్తయి 4:4,7,10; లూకా 4:4,8,12

88. సాతాను రాజ్యం తనకు తానే విరోధంగా నిలబడదని బోధించాడు. సాతాను సాతానును వెళ్లగొడితే అతని రాజ్యం నిలువదని యేసు వివరించాడు. - మత్తయి 12:25–26; మార్కు 3:23–26; లూకా 11:17–18

89. సాతాను బలవంతుడైనా అతని మీద విజయం సాధించగల విషయాన్ని బోధించాడు. బలవంతుడైన మనిషిని కట్టి అతని ఇంటిని దోచుకోవడం అనే ఉపమానం ద్వారా సాతాను అధికారంపై తన కార్యాన్ని వివరించాడు. - మత్తయి 12:28–29; మార్కు 3:27; లూకా 11:20–22

90. సాతాను శిష్యులను శోధించడానికి కోరుకున్నాడని బోధించాడు. పేతురుతో మాట్లాడుతూ సాతాను వారిని గోధుమలవలె జల్లించడానికి అడిగాడని యేసు చెప్పాడు. - లూకా 22:31–32

91. అపవాదికి అంతిమ తీర్పు ఉందని బోధించాడు

అపవాది మరియు అతని దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని గురించి యేసు బోధించాడు. - మత్తయి 25:41


S. పరిశుద్ధాత్మ గురించి బోధించిన గురువు

92. పరిశుద్ధాత్మ/వేరొక అదరణకర్త  గురించి బోధించాడు - యోహాను 14:16–17,26

93. పరిశుద్ధాత్మ బోధిస్తాడని చెప్పాడు - యోహాను 14:26

94. పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి నడిపిస్తాడని బోధించాడు- యోహాను 16:13

95. పరిశుద్ధాత్మ క్రీస్తును మహిమపరుస్తాడని బోధించాడు - యోహాను 16:14


T. తన రాకడ గురించి బోధించిన గురువు

96. తన రాకడ గురించి బోధించాడు - మత్తయి 24:42–44; మార్కు 13:33–37

97. సిద్ధంగా ఉండమని బోధించాడు. పది కన్యల ఉపమానం ద్వారా సిద్ధత గురించి బోధించాడు. - మత్తయి 25:1–13

98. అప్పగించిన దానిపై విశ్వాసంగా ఉండమని బోధించాడు. తలాంతుల ఉపమానం ద్వారా బాధ్యతను బోధించాడు. - మత్తయి 25:14–30

99. తన రాకడ సమయం తెలియదని, జాగ్రత్తగా ఉండాలని బోధించాడు - మత్తయి 24:36,42; మార్కు 13:32–37


U. తాను బోధించినదాన్ని తానే చేసిన గురువు

ఇది యేసును  అర్థం చేసుకోవడంలో చివరి, అత్యంత ముఖ్యమైన అంశం. యేసు మాటలతో మాత్రమే బోధించలేదు తాను చెప్పినదాన్ని తన జీవితంలో చేసి చూపించాడు.

100. ప్రార్థన గురించి బోధించి తానే తన దేవునికి ప్రార్థించాడు - మత్తయి 6:5–13; మార్కు 1:35; లూకా 5:16

101. తండ్రి చిత్తం చేయమని బోధించి తానే తండ్రి చిత్తం చేశాడు

గెత్సేమనేలో: “నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును గాక.” అని ప్రార్థించాడు. - మత్తయి 26:39; మార్కు 14:36; లూకా 22:42

102. సేవ చేయమని బోధించి తానే సేవ చేశాడు. శిష్యుల పాదాలను కడిగి తాను చెప్పిన సేవను చేసి చూపించాడు. - యోహాను 13:4–15

103. ప్రేమించమని బోధించి తానే ప్రేమించాడు. తనవారిని చివరి వరకు ప్రేమించాడు. - యోహాను 13:1,34–35

104. క్షమించమని బోధించి తానే క్షమాపణ కోరాడు. సిలువపై తనను హింసించినవారి కోసం: “తండ్రీ, వీరిని క్షమించుము.” అని ప్రార్థించాడు. - లూకా 23:34

105. దేవుని వాక్యంతో జీవించాడు శోధనలో “వ్రాయబడియున్నది” అని దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సమాధానమిచ్చాడు. - మత్తయి 4:1–11; లూకా 4:1–13


ముగింపు :

ప్రియులారా… క్రీస్తే నిజమైన గురువు - ఎందుకంటే ఆయన కేవలం బోధించలేదు; పాపరహితమైన జీవితంతో బోధించినదాన్ని చూపించాడు(యోహాను 13:13–15; హెబ్రీయులు 4:15; 1 పేతురు 2:22cf), మనుష్య గురువు ఎంత గొప్పవాడైనా పాపరహితుడు కాదు క్రీస్తు మాత్రం శోధింపబడినప్పటికీ పాపము చేయలేదు. అందుకే ఆయన బోధకు ప్రత్యేకమైన నైతిక అధికారం ఉంది. (హెబ్రీయులు 4:15; 7:26cf) యేసు మనకు గురువు కాబట్టి ఆయనను కేవలం వినేవారిగా కాక, ఆయన బోధను ఆచరించేవారిగా ఉండాలి. ఆయన మాట వినడం మాత్రమే శిష్యత్వం కాదు; ఆయన మాటలో నిలిచి ఆయనను వెంబడించడమే నిజమైన శిష్యత్వం (మత్తయి 7:24; యోహాను 8:31cf)


కాబట్టి నాలుగు సువార్త పుస్తకాలలో పరిశీలించినప్పుడు, యేసుక్రీస్తే మనకు గురువు అని స్పష్టమవుతుంది. ఆయన దేవుని రాజ్యాన్ని, అద్వితీయ దేవుని, తండ్రిని ఆరాధించడాన్ని, వాక్యాన్ని, మారుమనస్సును, పరిశుద్ధ జీవితం, ప్రేమ, క్షమాపణ, ప్రార్థన, విశ్వాసం, శిష్యత్వం, అపవాది మరియు తీర్పు గురించి బోధించాడు. అంతేకాదు, తాను బోధించినదాన్ని తన జీవితంలో తానే చేసి చూపించాడు. కాబట్టి మనకు క్రీస్తే గురువు. ఆయన్ను మనం గురువుగా స్వీకరిస్తే మనం, ఆయన మాట వినాలి, ఆయన బోధను అనుసరించాలి, ఆయన చూపిన మార్గంలో నడవాలని మమ్మలి మేము హెచ్చరిక చేసుకొనుచు మీకు మనవి చేస్తున్నాము.

మీ ఆత్మీయులు👪

తనను తాను రక్షించుకొనని రక్షకుడు?



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏 


నేడు మనం,  మనకు చాలా సాధారణంగా వినిపించే మరియు లోతైన ఒక ప్రశ్నను పరిశీలించబోతున్నాం అదేమనగా… “సిలువలో తనను తాను రక్షించుకోలేని యేసు మనల్ని ఎలా రక్షించగలడు?” ఇదేమీ కొత్త ప్రశ్న కాదు  2000 సంవత్సరాల క్రితం నుండే ఉంది. "ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు –దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు –వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము." (మత్తయి. 27:39-42)


వారు ఎగతాళి చేస్తూ అన్న మాటలు ఇవి. కాని ఆ సిలువలో యేసు ఏమియు మాట్లాడకుండా నిశ్శబ్దముగా ఉండుటలో  గొప్ప ఆత్మీయ సత్యం దాగి ఉంది.

👉 యేసు నిజంగా తనను తాను రక్షించుకోలేకపోయాడా?

👉 లేక ఆయన ఉద్దేశపూర్వకంగానే రక్షించుకోలేదా?

 వాక్య ఆధారంగా దీనికి సమాధానం తెలుసుకుందాం.


1️⃣. యేసు బలహీనుడు కాదు — అధికారమున్న రక్షకుడు

సిలువపై యేసును చూసినవారు ఒక నిర్ణయానికి వచ్చారు "–నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి." (లూకా 23:37) కాని వారు చూసింది బాహ్య పరిస్థితి మాత్రమే, తెలుసుకోలేకపోయింది అతని అంతర్గత అధికారము, తన దేవుని సంకల్పం.


▪️ సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు - (మత్తయి. 16:16)

▪️యేసు బలహీనుడు కాదు — తన ప్రాణంపై అధికారమున్నవాడు - (యోహాను 10:17-18)

▪️ఆయనను ఎవరూ బలవంతంగా చంపలేదు - (యోహాను. 19:11)

▪️తన తండ్రిని(YHWH) పండ్రెండు సేనా వ్యూహములకంటె(72,000) ఎక్కువ మంది దూతలను వేడుకొనే అధికారం ఆయనకు ఉంది - (మత్తయి 26:53)

▪️ఆయన స్వచ్ఛందంగానే తన ప్రాణమును ఇచ్చినవాడు - (యోహాను 10:18)

▪️దేవుని స్వరూపములో ఉన్నా తన్ను తాను తగ్గించుకున్నాడు - (ఫిలిప్పీయులకు 2:6-7)

▪️మరణమువరకు విధేయుడై సిలువను అంగీకరించాడు - (ఫిలిప్పీయులకు 2:8)

▪️ఒక మాటతో శత్రువులను(యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను) కూల్చగలిగినవాడు - (యోహాను 18:3,5-6)

▪️ప్రకృతి, దయ్యములు, మరణంపై అధికారమున్నవాడు - (మార్కు 4:39; లూకా 4:36; యోహాను 11:43)

▪️సిలువలో ఆయన నిశ్శబ్దం బలహీనత కాదు — అది దేవుని శక్తి - (1 కొరింథీయులు 1:18)

▪️తనను రక్షించుకోలేదు — ఎందుకంటే అది స్వచ్ఛంద త్యాగం - (యెషయా 53:7)



2️⃣. తనను తాను ఎందుకు రక్షించుకోలేదు?

యేసు తనను తాను రక్షించుకుంటే:

✔️ మనుషుల పాపానికి పరిహారం ఉండదు

✔️ దేవుని న్యాయం నిలబడదు

✔️ రక్షణ అసాధ్యం అవుతుంది


మార్కు 10:45 - “అనేకుల కొరకు ప్రాణము విమోచనంగా ఇచ్చెను”

👉 యేసు తనను తాను రక్షించుకోలేదు

👉 ఎందుకంటే నిన్ను రక్షించాలనుకున్నాడు


▪️దేవుని ప్రణాళిక నెరవేర్చుటకై - (మత్తయి 26:54)

▪️మానవ పాపానికి క్రీస్తు రక్తబలి అవసరమైంది కనుకే  - (హెబ్రీయులకు 9:16-28) 

▪️మన స్థానంలో మరణించుటకై - (2 కొరింథీయులు 5:21)

▪️సిలువలో మానవజాతికి దేవుని ప్రేమను చూపుటకై/పరిచయం చేయుటకై - (రోమీయులు 5:8)

▪️తండ్రి చిత్తానికి విధేయతకై - (ఫిలిప్పీయులకు 2:8)

▪️అపవాది శక్తిని/బలమును ఓడించుటకై - (కొలస్సీయులు 2:15; హెబ్రీయులకు. 2:13)

▪️నిత్య రక్షణను అనుగ్రహించుటకై - (హెబ్రీయులకు 5:9)

▪️ విశ్వాసముంచు వారికి నిత్యజీవము ఇచ్చుటకై - (యోహాను 3:16)

▪️తనను కాదు — మనలను రక్షించుటకై - (మార్కు. 10:45)



3️⃣. సిలువ మరణం — దేవుని ప్రణాళిక

యేసు మరణం ఒక యాదృpచ్ఛిక ఘటన కాదు. ఇది ముందే ప్రవచించబడింది.


📜 పాత నిబంధన ప్రవచనలు

యెషయా 53:5-7 - బాధపడే సేవకుడు (Suffering Servant) “మన దోషములకొరకు గాయపరచబడెను”

కీర్తనలు 22 - సిలువ దృశ్యాన్ని ముందే వర్ణించింది

చేతులు, కాళ్లు చీల్చబడుట, ఎగతాళి

జెకర్యా 12:10 - “తాము గుచ్చినవానిని చూచెదరు”


👉 సిలువ సంఘటన — దేవుని శాశ్వత యోచనలో భాగం

👉 యేసు ప్రార్ధన :

"కొంత దూరము వెళ్లి, సాగిలపడి- నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను." (మత్తయి. 26:39)

"మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి" (మత్తయి. 26:42)


▪️దేవుని అనాది సంకల్పం - (1 పేతురు. 1:18-20)

▪️సిలువ మరణం దేవుని ముందస్తు యోచన - (ప్రకటన 13:8)

▪️లేఖనములు నెరవేరుటకై సిలువ మరణం జరిగింది - (లూకా 24:46)

▪️దేవుని నిర్ణయ ప్రకారమే యేసు అప్పగింపబడ్డాడు - (అపొస్తలుల కార్యములు 2:23)

▪️పాపానికి పరిహార బలిగా యేసు నియమించబడ్డాడు - (యెషయా 53:10)

▪️మానవుల దుష్టచర్యలలోనూ దేవుని యోచన నెరవేరింది - (అపొస్తలుల కార్యములు 4:27-28)

▪️మన దోషములు ఆయనమీద మోపబడినవి - (యెషయా 53:5-6)

▪️సిలువ దేవుని రక్షణ ప్రణాళిక యొక్క కేంద్రం - (1 కొరింథీయులు 1:23-24)



4️⃣. సిలువలో ఏమి జరిగింది?

యేసు మరణం ఒక సాధారణ మరణం కాదు అది ప్రతినిధి మరణం (Substitutionary Atonement) అనగా ఒక వ్యక్తి స్థానంలో మరొకరు మరణించడం లేదా వారి పాపాలకు/శిక్షకు బదులుగా తమ ప్రాణాన్ని అర్పించడం. ఇది ప్రధానంగా, యేసు క్రీస్తు మానవాళి పాపాల కోసం శిక్ష అనుభవించి, దేవునితో సమాధానపరిచాడనే విశ్వాసం. ఇది ఒక వ్యక్తి తప్పుకు మరొకరు మూల్యం చెల్లించే ప్రక్రియ.


▪️పాపము లేనివాడు మన కొరకు పాపముగా చేయబడెను - (2 కొరింథీయులు 5:21)

▪️ నీతిమంతుడైన యేసు అనీతిమంతులైన మనలను దేవుని యొద్దకు చేర్చుటకై మరణించాడు - (1 పేతురు 3:18)

▪️మన పాపములను తన శరీరము పైన మోసికొన్నాడు - (1 పేతురు 2:24)

▪️మన దోషములకొరకు ఆయన గాయపరచబడెను - (యెషయా 53:5)

▪️మన యందరి దోషమును ఆయనపై ఉంచెను - (యెషయా 53:6)

▪️ శాపమును మనకొరకు ఆయన భరించాడు - (గలతీయులకు 3:13)

▪️ధనవంతుడైయుండి మనకొరకు దరిద్రుడాయెను - (2 కొరింథీయులు 8:9)

▪️మరణమును రుచి చూచి మనకు జీవము ఇచ్చాడు - (హెబ్రీయులకు 2:9)

▪️సిలువ బలి ద్వారా మనకు క్షమాపణ సంపాదించబడింది - (హెబ్రీయులకు 9:28)

▪️సిలువ మరణం ద్వారా మనకు జీవము, దేవునితో సమాధానం లభించింది - (రోమీయులు 5:8-10).



5️⃣. ఎగతాళి చేసిన వారి మాటలలో దాగిన సత్యం 

“–వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము." (మత్తయి. 27:42)


ఇది వ్యంగ్యం మాట కాదు — అజ్ఞానపు మాట 


👉 అక్కడ కొందరి విశ్వాసం :

యేసు బలహీనుడు — రక్షించుకోలేడు


👉 కానీ వాస్తవం :

యేసు తనను తాను రక్షించుకోలేదు — మనలను రక్షించడానికి సిలువ మరణం/దేవుని సంకల్పం నెరవేర్చుటకు... కావున వారు అన్నది అపహాస్యం. దేవుడు దానిని రక్షణ సత్యంగా మార్చాడు.


📌 దాగిన సత్యం :

🔘 ఆయన దిగితే — తనను రక్షించుకుంటాడు.

🔘 ఆయన దిగకపోతే — మనలను రక్షిస్తాడు అందుకే ఆయన ఎంచుకున్నది  సిలువలో ఉండటం… ఇందుకే అక్కడ వారు ఆయన్ను పరీక్షించినప్పటికి ఆయన దేవుని సంకల్పాన్ని మన కోసం విడిచిపెట్టలేదు. ఇది మానవజాతి యెడల ఆయనకు ఉన్న ప్రేమ, తాగ్యం. 


▪️ఎగతాళి — అజ్ఞానపు మాటలు, సత్యం ఎరుగని మాటలు - (మత్తయి 27:42)

▪️“ఇతరులను రక్షించెను” — అని వారు ఒప్పుకున్న సత్యం - (మత్తయి. 27:42)

▪️రక్తం చిందింపబడకపోతే(దిగితే) రక్షణ, క్షమాపణ లేదు - (హెబ్రీయులకు 9:22)

▪️ఎగతాళి మాటలే — చివరికి దైవ సంకల్పాన్ని నెరవేర్చింది. - (అపొస్తలుల కార్యములు 2:23)

▪️తనను రక్షించుకోలేదు — మనలను రక్షించుటకై ఈ సిలువ యాగం - (మార్కు. 10:45).



6️⃣. పునరుత్థానం — అంతిమ సాక్ష్యం

యేసుక్రీస్తు సిలువపై మరణించడం క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అయినప్పటికీ, ఆ మరణం యొక్క అర్థం మరియు శక్తి పూర్తిగా వెల్లడించబడింది ఆయన పునరుత్థానంలోనే. సిలువలో ఆయన పాపానికి పరిహారం చెల్లించాడు, కానీ పునరుత్థానం ద్వారా ఆ పరిహారం దేవునిచే అంగీకరించబడిందని నిర్ధారించబడింది.


“....దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందుగా వాగ్దానముచేసెను. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు...” (రోమా. 1:4)


పునరుత్థానం సిలువలో జరిగిన రక్షణ కార్యానికి ధృవీకరణ. రోమీయులు 4:25 ప్రకారం, ఆయన మన నీతీకరణ కొరకు లేపబడెను. అంటే, యేసు మరణం ద్వారా పాప పరిహారం జరిగింది, కానీ ఆయన లేచుట ద్వారా ఆ పరిహారం ఫలితం మనకు వర్తించబడింది. పునరుత్థానం లేకపోతే సిలువ కార్యం పూర్తి కాలేదని భావించవచ్చు. మరియు, పునరుత్థానం మరణంపై సంపూర్ణ విజయం. అపొస్తలుల కార్యములు 2:24 ప్రకారం, మరణము ఆయనను పట్టుకోలేకపోయింది. యేసు మరణాన్ని జయించి, జీవమును తిరిగి పొందినవాడు. అందువల్ల ఆయనకు మరణంపై అధికారము ఉంది (ప్రకటన 1:18). ఇది విశ్వాసులకు గొప్ప ఆశను ఇస్తుంది.

పౌలు స్పష్టంగా చెబుతున్నాడు  1 కొరింథీయులు 15:17 — “క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థము.” అంటే, పునరుత్థానం లేకపోతే క్రైస్తవ విశ్వాసం నిలబడదు. అందువల్ల పునరుత్థానం సువార్తకు కేంద్ర బిందువు.

ఇంకా, పునరుత్థానం ఒక కొత్త సృష్టి ప్రారంభం. 1 కొరింథీయులు 15:20 ప్రకారం, యేసు “మొదటి ఫలము.” ఆయన లేచినట్లు విశ్వాసులు కూడా లేవబోతున్నారు. ఇది భవిష్యత్తులో మన పునరుత్థానానికి హామీ.

యోహాను 11:25 లో యేసు చెప్పినట్లు, “నేనే పునరుత్థానమును జీవమును.” ఆయనను నమ్మినవారు శాశ్వత జీవం పొందుతారు. ఇది క్రైస్తవ ఆశ యొక్క కేంద్రం. అంతేకాక, యేసు పునరుత్థానమైన తర్వాత కూడా సజీవ రక్షకుడిగా కొనసాగుతున్నాడు. హెబ్రీయులకు 7:25 ప్రకారం, ఆయన సదాకాలము జీవించి విశ్వాసుల కొరకు మధ్యవర్తిత్వం చేయుచున్నాడు. రోమీయులు 8:34 ప్రకారం, ఆయన దేవుని యెదుట మనకొరకు ప్రార్థించుచున్నాడు.

అందువల్ల, పునరుత్థానం కేవలం ఒక అద్భుతం కాదు; అది రక్షణ యొక్క అంతిమ సాక్ష్యం. ఇది యేసు చేసిన పని సత్యమని, సంపూర్ణమని, మరియు శాశ్వతమని నిరూపిస్తుంది. సిలువలో యేసు పాపానికి ధర చెల్లించాడు. పునరుత్థానంలో దేవుడు ఆ ధరను అంగీకరించాడు.


🔥 పునరుత్థానం ద్వారా :

పాపం → శిక్ష చెల్లించబడింది

సాతాను → అధికారమును కోల్పోయాడు

మరణం → ఓడిపోయింది


📖 (1 కొరింథీయులు 15:55-57)

“ఓ మరణమా, నీ గెలుపు ఎక్కడ?” 


7️⃣. ముగింపు

సిలువను మనుష్యులు ఓటమిగా చూశారు, కానీ అది దేవుని ప్రణాళికలో విజయానికి మార్గమైంది. యేసు తనను తాను రక్షించుకోలేకపోయాడని కాదు, ఆయన రక్షించుకోలేదు — ఎందుకంటే ఆయన మనలను రక్షించాలనుకున్నాడు. ఆయన సిలువపై ఉండటం బలహీనత కాదు; అది నియంత్రిత శక్తి, సంపూర్ణ విధేయత, మరియు అతి గొప్ప ప్రేమ యొక్క వ్యక్తీకరణ.

సిలువలో ఒక మార్పిడి జరిగింది: మన పాపం ఆయనపై పడింది, ఆయన నీతి మనకు లభించింది. ఎగతాళి చేసిన వారి మాటలలో కూడా దాగి ఉన్న సత్యం ఇదే — ఆయన తనను రక్షించుకోకుండా ఉండడం ద్వారా ప్రపంచానికి రక్షణ ద్వారం తెరిచాడు.

ఈ సత్యానికి అంతిమ ధృవీకరణ పునరుత్థానం. యేసు మరణాన్ని జయించి లేచినందువల్ల, ఆయన చేసిన త్యాగం సంపూర్ణమైందని, దేవుడు దానిని అంగీకరించాడని, మరియు రక్షణ నిజమని నిరూపించబడింది. ఇప్పుడు ఆయన సజీవ రక్షకుడిగా నిలిచి, ఆయనయందు విశ్వాసముంచువారికి నిత్యజీవాన్ని అందిస్తున్నాడు.


👉 కాబట్టి సిలువ ఒక ముగింపు కాదు — అది రక్షణ ప్రారంభం.

👉 పునరుత్థానం ఒక అద్భుతం కాదు — అది రక్షణకు అంతిమ సాక్ష్యం.

👉 “యేసు తనను తాను రక్షించుకోలేకపోయాడు” అనేది అపార్థం

👉 తనను తాను రక్షించుకొనని యేసు, నిన్ను సంపూర్ణంగా రక్షించగలడు/రక్షించగలిగాడు.

మీ ఆత్మీయులు 👪

దేవుని అనాది సంకల్పంక్లిక్ చేయు

యేసు ఎవరు?క్లిక్ చేయు

దేవత్వమా? త్రిత్వమా? త్రియేకమా?క్లిక్ చేయు

మధ్యవర్తి – ఆరాధ్యుడా!?


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


1️⃣. మధ్యవర్తి యొక్క నిర్వచనం

మధ్యవర్తి (Mediator) అనగా దేవునికి మరియు మనుష్యులకు మధ్య నిలిచి, దేవుని చిత్తాన్ని మనుష్యులకు తెలియజేసి, మనుష్యుల పరిస్థితిని దేవుని ఎదుట ప్రాతినిధ్యం వహిస్తూ, నిబంధనను స్థాపించుటకు లేదా అమలు చేయుటకు దేవుడు నియమించిన వ్యక్తి/సేవకుడు.


(ద్వితీయోపదేశకాండము 5:5): "గనుక యెహోవామాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను."


(1 తిమోతి 2:5): "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹"


(గలతీ 3:19): "ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు?..... అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.౹"


(హెబ్రీయులకు 8:6): "ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు.౹"


👉 మధ్యవర్తి పాత్ర = సేవ & దేవునికి ప్రతినిధిత్వం ✔️

👉 మధ్యవర్తి పాత్ర ≠ ఆరాధన స్వీకరణ ❌

👉 రెండు పక్షాల మధ్య నిలిచేవాడు ✔️


2️⃣. “పాత నిబంధనలో మధ్యవర్తి – మోషే”

పాత నిబంధనలో మధ్యవర్తి పాత్రను స్పష్టంగా, సమగ్రంగా ప్రతిబింబించిన వ్యక్తి మోషే. ఈయన దేవునికి ↔ ఇశ్రాయేలు ప్రజలకు మధ్య నిలిచి, దేవుని వాక్యాన్ని(ధర్మశాస్త్రమును) ప్రజలకు తెలియజేసి, ప్రజల తరపున దేవుని ఎదుట నిలిచిన దేవుని సేవకుడు.


A. దేవునికి మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య నిలిచినవాడు — (ద్వితీయోపదేశకాండము 5:5)

B. ప్రజల భయము వల్ల ఏర్పడిన మధ్యవర్తిత్వం — (నిర్గమకాండము 20:18–19; ద్వితీయోపదేశకాండము 18:16)

C. నిబంధనను తెలియజేసినవాడు — (నిర్గమకాండము 19:3–8; 24:7-8)

D. ఉగ్రత సమయములో ప్రజల తరపున దేవుని ఎదుట నిలిచినవాడు — (నిర్గమకాండము 32:11–14; కీర్తనలు 106:23)

E. ఆరాధన కోరనివాడు – ఆరాధనను కాపాడినవాడు — (నిర్గమకాండము 20:3–5; 32:19-20; ద్వితీయోపదేశకాండము 6:13)

F. దేవుని సేవకుడు — (మలాకీ. 4:4)


మోషే = మధ్యవర్తి✔️

మోషే ≠ ఇశ్రాయేలు ప్రజల ఆరాధ్యుడు❌

ఆరాధన = యెహోవాకే(𝗬𝗛𝗪𝗛)✔️


3️⃣. “కొత్త నిబంధనలో మధ్యవర్తి – యేసుక్రీస్తు”

కొత్త నిబంధనలో మధ్యవర్తి అనే పాత్ర మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్పష్టంగా నిర్వహించబడింది. ఆయన దేవుడికి మరియు సమస్త మనుష్యులకు మధ్యగా నిలిచినవాడు, తన రక్తముతో నిబంధనను స్థాపించి మనుష్యులను దేవుని యొద్దకు  చేర్చుటకు నియమించబడిన దేవుని సేవకుడు.


A. దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి(YHWH) మరియు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే క్రీస్తుయేసను నరుడు. (1 కోరింది. 8:6a; 1 తిమోతి. 2:5). ఈయన దేవునికి మరియు క్రైస్తవులకు మధ్య నిలిచినవాడు. 

B. క్రీస్తునందు ఉన్నవారితో అనగా క్రైస్తవులతో నిబంధన చేసింది దేవుడు, ఆ నిబంధనను స్థాపించి అమలు చేసినది యేసుక్రీస్తు. (హెబ్రీయులకు. 8:6-13; 9:14-16)

C. తన్ను దేవునిచే పంపబడినవాడిగా, దేవుని చిత్తానికి లోబడినవాడిగా ప్రకటించుకున్నాడు, దేవుని గౌరవ ప్రథముగా  సూచించాడు, ఆయనను తండ్రి అని, (YHWH) “నా దేవుడు” అని పిలిచాడు. (యోహాను. 17:3; 5:44,30; 7:8; 12:49; లూకా 22:42; యోహాను 20:17; మత్తయి 27:46)

D. యేసు తాను చేసిన బోధ తనది కాదని చెప్పిన సందర్భాలు. (యోహాను 7:16; 8:28)

E. యేసు ఆరాధన కోరలేదు – దేవునికే ఆరాధన అని బోధించాడు (మత్తయి. 4:10; యోహాను. 4:23-24)

F. యేసు కోరింది – సేవ (Serve), ఆరాధన కాదు. (యోహాను 12:26)

G. యేసు(మధ్యవర్తి) ద్వారానే దేవునికి కృతజ్ఞతలు, ప్రార్థన, ఆరాధన, ఆత్మ సంబంధమైన బలులు మరియు తండ్రి యొద్దకు ప్రవేశం. (రోమీయులకు 1:8; 5:1-3; ఎఫెసీయులకు 2:18; 3:14;  కొలస్సయులకు 1:3; 3:17; 1 పేతురు 2:3; హెబ్రీ. 13:15; 1పేతురు 3:18)

F. యేసు తన రక్తముతో నూతన(క్రొత్త) నిబంధనను స్థాపించాడు. (లూకా 22:20, మత్తయి 26:28; హెబ్రీ. 9:15; 8:9-10)

G. యేసు తన త్యాగముచేత న్యాయాన్ని సంతృప్తి పరచి కృపను కలిగించాడు. (రోమా 8:34; హెబ్రీ. 7:25; 1యోహాను 2:1)

H. దేవుని సేవకుడు (మత్తయి. 12:18;అపొ. కార్యములు 3:13, 26) యేసు విధేయతలో పరిపూర్ణుడైన దేవుని సేవకుడు. 

I. యేసు దేవుని యొక్క అపోస్తులుడు. 


యేసుక్రీస్తు = మధ్యవర్తి✔️

యేసుక్రీస్తు ≠ క్రైస్తవుల ఆరాధ్యుడు❌

ఆరాధన = తండ్రియైన దేవునికే(𝗬𝗛𝗪𝗛)✔️


4️⃣. ముగింపు

నేను మధ్యవర్తి పాత్రను అర్థం చేసుకున్నానా?

నిబంధనలో ప్రవేశించానా?

ఆరాధన నిబంధన ప్రకారముగా దేవునికే చేస్తున్నానా?

మధ్యవర్తిని ఆరాధించాలా? — కాదు.

మధ్యవర్తి పాత్ర గౌరవమైనది. మధ్యవర్తి ద్వారా నిబంధన, నిబంధన దేవునికే ఆరాధన. మధ్యవర్తి పాత్రను ఆరాధనగా మార్చడం అపోస్తలుల బోధకు వ్యతిరేకమైనది.


➡️ ఆరాధ్యుడు = తండ్రి(YHWH)

➡️ మధ్యవర్తి = క్రీస్తు

మీ ఆత్మీయులు 👪

క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు?

యేసు ఎవరు?👤 – నిత్యత్వం నుండి నిత్యజీవం వరకు

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏


ప్రస్తుతమున్న విభిన్నమైన బోధల కారణంగా ప్రభువైన యేసుక్రీస్తు నందున్నవారికి తమ హృదయములో మెదిలే అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమనగా “యేసు ఎవరు?” మరియు “యేసును ఎలా విశ్వసించాలి?”. అయితే ఈ ప్రశ్నలను తేలికగా చూసేవారు లేకపోలేదు కానీ ఇలాంటివారికి తెలియని వాస్తవం ఏమిటంటే ఈ ప్రశ్నల యొక్క సమాధానం మీదే వారి నిత్యజీవము నిర్ణయించబడుతుందని. ఎవరైతే తమ జీవితాలను అపోస్తులు బోధలో కట్టుకొని నిత్యజీవం కొరకు ఆరాటపడతారో  వారికి ఈ ప్రశ్నల యొక్క సమాధానాలు  అత్యంత కీలకమై ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రశ్నల యొక్క సమాధానం మీదనే సంఘ స్థాపన మరియు నరుని యొక్క రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం, నిత్యత్వ గమ్యం అనేది నిర్ణయించబడుతుంది గనుక. 


1️⃣. యేసును గూర్చి ఆనాటి జనుల యొక్క విశ్వాసం

"యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి– మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి." (మత్తయి. 16:13-14)


వ.13–14 – ప్రజలు యేసును విభిన్నంగానే గుర్తించారు (బాప్తిస్మ మిచ్చు యోహాను, ఏలీయా, యిర్మీయా, ప్రవక్తలలో ఒకడు) 

నేడు కూడా ప్రజలు యేసును విభిన్నంగానే గుర్తించేవారు లేకపోలేదు, ఇట్టి వారి విశ్వాసం వాక్యానుసారమైన విశ్వాసం అనబడదు/కాదు ❌


2️⃣. యేసును గూర్చి పేతురు యొక్క విశ్వాసం 

"అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు– సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు." (మత్తయి. 16:15-17)


వ.15 – యేసు అడిగిన కీలక ప్రశ్న: "మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు?"


వ.16పేతురు విశ్వాస ప్రకటన:

నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని


వ.17 – ఇది మానవ జ్ఞానం/ఆలోచన కాదు — పరలోకపు నా(తన) తండ్రి చేసిన ప్రకటన


ఇది వాక్యానుసారమైన విశ్వాసం ✔️


📖 "మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను." (మత్తయి. 16:18)


వ.18 – అట్టి విశ్వాసపు పునాది మీద అనగా యేసు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అనే విశ్వాసం పైన కట్టబడేదే సంఘము అనబడును. అది క్రీస్తు(నా) సంఘము(church of Christ) అని అనబడును. దానికి కర్త క్రీస్తే అయ్యుంటారు. ఆయన సంఘము యెదుట పాతాళలోక ద్వారములు నిలువవు. 


సంఘపు యొక్క పునాది(విశ్వాసం) వ్యక్తి మీద కాదు (పేతురు మీద కాదు) ❌

సంఘము క్రీస్తు సత్యంపై నిలబడింది ✔️

యేసు ఎవరో అన్న సత్యమే సంఘపు పునాది✔️


3️⃣. ఆదిలేని నిత్యత్వములో యేసు

యేసుక్రీస్తు భూమిమీద జన్మించినప్పటి నుండి మాత్రమే ఉన్నవాడు కాదు. ఆయన ఆదిలేని నిత్యత్వములోనే(అనాదిలోనే) ఉన్నవాడు. "తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను. 17:5) "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.౹ ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,౹ కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు.౹" (యోహాను. 1:1-3) "ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానత్వం కలిగినవాడు” (ఫిలిప్పీయులకు 2:6) "ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹" (కొలస్సీయులకు. 1:16-17). 


➡️ అర్థం: యేసు సృష్టింపబడినవాడు కాదు, సృష్టికర్తయే. యేసు ప్రారంభమున్నవాడు కాదు, నిత్యుడే. యేసు కేవలం దేవునితో ఉన్నవాడు కాదు, దేవుని యొద్ద దేవుడై ఉన్నవాడు. వాక్యము(యేసు) దేవుని యొద్ద ఉండెను కదా (యోహాను. 1:1,14) ఇది యేసు యొక్క ఉనికిని(existence) గూర్చి తెలియజేయబడే విషయాలు.


4️⃣. యేసుక్రీస్తు భూమిమీదికి వచ్చిన తరువాత (Incarnation Phase)

ఆదిలేని నిత్యత్వములో దేవుని యొద్ద వాక్యమై(దేవుడై) ఉన్న యేసుక్రీస్తు, దేవుని అనాది సంకల్పం నిమిత్తం, మనుష్యుల రక్షణ కొరకు, మనిషిని దేవునితో సమాధానపరచుటకు, నరులకు దేవునికి మధ్యవర్తిగా ఉండుటకు, తండ్రి చేత శరీరధారిగా లోకంలోనికి పంపబడ్డారు. ఇది బైబిల్‌లో సశరీరుడుగా (Incarnation) అని పిలవబడుతుంది.


— "...ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను….” (1 తిమోతి. 3:16)

— "ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;...” (యోహాను. 1:14)

— "అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;...” (గలతి. 4:4)

— "యేసు– నీతో మాటలాడుచున్న నేనే ఆయననని(మెస్సయ్య) ఆమెతో చెప్పెను." (యోహాను. 4:26)

— "...ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.౹" (యోహాను. 1:29)

— “సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువని” (మత్తయి 16:16)

— "మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹" (అపో కార్య. 3:22-23)

— "దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు." (లూకా. 2:11)

— "మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.౹" (1యోహాను. 4:14)

— “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹" (1తిమోతి. 2:5)

— "నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.౹" (యోహాను. 10:30) "ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి,...” (హెబ్రీ. 1:3)


➡️ భూమిమీద ఆయన యొక్క గుర్తింపు:

దేవుని కుమారుడు

క్రీస్తు (మెస్సయ్య)

ప్రభువు

లోకరక్షకుడు

దేవుని గొఱ్ఱెపిల్ల

మధ్యవర్తి

ప్రవక్త

దేవత్వం గలవాడు, 


5️⃣. యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత (Post‑Ascension State)

దేవుని అనాది సంకల్పంలో భాగముగా మనము పాపమునుండి విమోచింపబడి, నీతివిషయమై జీవించునట్లు, యేసు తానే తన శరీరమందు మనమందరి పాపములు విషయమై (రోమా. 6:18; 1 పేతురు. 2:24; యెషయా 53:4-5; 12). మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచి(1 కొరింది. 15:3-4), అనాది దేవుని సంకల్పం నెరవేర్చి(1పేతురు. 1:18:19-20; అపో.కార్య. 2:23). తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). తన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33). 


తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన కుమారున్ని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి, ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3-4; 9).

📖 Note : పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తరువాత యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చొనెను. (హెబ్రీ మొదటి అధ్యాయం అనాదిలో జరిగిన సంఘటన కాదు). 


అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి, ఆ కుమారునియందు విశ్వాసముంచు వారిని ఏలుబడి చేయుటకు యెహోవా దేవుడే తన కుమారుడును మనకు "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. - (లూకా. 1:32; యోహాను. 3:36; అపో.కార్య. 2:32-36; 10:36). ఈ సంగతి ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని పరిశుద్ధాత్ముడే చెప్పెను కదా!! (అపో.కార్య. 2:36).


యేసు భూమిమీద కార్యం ముగిసింది, పరలోకంలో అధికార సేవ ప్రారంభమైంది. ఆయన యొక్క ప్రస్తుత కార్యాలు


1) పరలోకాధిపత్యం (Heavenly Authority)

సమస్త అధికారములపై అధిపతిగా కూర్చున్నాడు. (ఎఫెసీయులకు 1:20–22)

➡️ ఆయన రాజుగా పరిపాలిస్తున్నాడు.

2) మధ్యవర్తిత్వ సేవ (Intercessory Ministry)

తన ద్వారా దేవునియొద్దకు వచ్చువారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాడు. (హెబ్రీ 7:25)

➡️ ఆయన మన పక్షాన మధ్యవర్తిగా ఉన్నాడు.

3) సంఘమునకు శిరస్సు/అధికారి (Head of the Church)

ఆయన సంఘమునకు శిరస్సు. (కొలస్సీయులకు 1:18)

➡️ సంఘం ఆయన అధికారంలో ఉంది.

4) పరలోక ప్రధాన యాజకుడు (Heavenly High Priest)

ప్రధాన యాజకుడు. (హెబ్రీ 4:14)

➡️ ఆయన నిత్య యాజక సేవ చేస్తున్నాడు.

5) రానున్న రాజు (Coming King)

మళ్లీ రానున్నాడు. (అపొ.కా. 1:11; 1కోరింది. 15:24-25)

➡️ ఆయన రాజ్యంతో తిరిగి వస్తాడు.


👤 యేసు ఇప్పుడు:

ప్రభువు, రాజు, దేవుని కుమారుడు

సంఘమునకు శిరస్సు

మధ్యవర్తి

ప్రధాన యాజకుడు

రానున్న రాజు


“...యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను... ” (రోమా. 1:7).


➡️ భూమిమీద ఆయన రక్షకుడు

➡️ పరలోకంలో ఆయన ప్రభువు

➡️ సంఘానికి ఆయన శిరస్సు

➡️ విశ్వాసులకు ఆయన మధ్యవర్తి

➡️ లోకానికి ఆయన రానున్న రాజు


6️⃣. యేసుక్రీస్తును ఏమని విశ్వసించాలి? (Faith Content)

యేసుక్రీస్తును కేవలం ఒక చారిత్రక వ్యక్తిగానో, ఒక ప్రవక్తగానో, ఒక బోధకుడిగానో, గురువుగానో  మాత్రమే గుర్తించడం సరిపోదు. నరుడు తాను రక్షణ పొందుటకు బైబిల్ ప్రకారం ఆయనను సరిగ్గా గుర్తించి, సరిగ్గా విశ్వసించవలసిన అవసరం ఉంది.


— “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” (మత్తయి. 16:16)

— “యేసు దేవుని కుమారుడు, క్రీస్తు అని విశ్వసించాలి”. (యోహాను 20:31)

— "నేనే ఆయననని(మెస్సయ్యా)" విశ్వసించనియెడల పాపములోనే చనిపోవుదురు. (యోహాను 8:24)

— "అదేమనగా– యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.౹ ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.౹" (రోమా. 10:9-10)

— “...మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;...” (1 పేతురు. 3:15)

— "దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే." (1యోహాను. 5:12)

యేసే దేవుని కుమారుడని (అపో కార్య 8:37; 9:20)

— "అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి,... (హెబ్రీ. 9:11)


➡️ విశ్వాసపు సారాంశం

యేసు సజీవుడైన దేవుని కుమారుడు

క్రీస్తు (అభిషిక్తుడు/మెస్సయ్య)

ప్రభువు

ఏకైక రక్షకుడు

యాజకుడు

ఇశ్రాయేలు రాజు

ప్రవక్తగా


7️⃣. ఆదిలేని నిత్యత్వములో/ఉనికి(Existence) మరియు విశ్వాసం(Faith) మధ్య వ్యత్యాసం


🔴 ఆదిలేని నిత్యత్వపు విషయములో యేసు దేవుడై ఉన్నాడు – ఇది 100% వాస్తవం. “వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను” (యోహాను. 1:1-2). ఆయన దైవ స్వభావం గలవాడు — దేవత్వం గలవాడు.


🟢 విశ్వాసం విషయములో మనం ఆయనను మెస్సయ్యా గా నమ్మాలి, దేవుని కుమారుడిగా, ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, హృదయం లో ప్రభువుగా ప్రతిష్టించవలసిందే.(యోహాను. 20:31; రోమా 10:8-10, 1 పేతురు 3:15-16). ఇట్టి విశ్వాస విషయమనేది నిత్యజీవమునకు ఖచ్చితంగా అవసరం. 


➡️ వ్యత్యాసం:

◾ఉనికి = సత్యం (objective reality)

◾విశ్వాసం = స్పందన (personal response)


ఉనికి నిజమైనదైనప్పటికి వాక్యానుసారముగా ఏమని విశ్వాసముంచాలో అట్టి విశ్వాసం లేకపోతే….


రక్షణ లేదు❌

పాపక్షమాపణ లేదు❌

సంఘప్రవేశం లేదు❌

నిత్యజీవం లేదు ❌


“విశ్వాసం ఒక్కటే” (ఎపేసి. 4:4)

“అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹" (యోహాను 17:3)


8️⃣. యేసు బిరుదులు —  నిత్యత్వం నుండి నిత్యజీవం వరకు

— వాక్యము(Logos) – యోహాను 1:1,14

— దేవుడు (యోహాను. 1:1)

— ఆల్ఫా మరియు ఓమెగా (ప్రకటన 1:8; 22:13)

— క్రీస్తు (మెస్సయ్య) (మత్తయి 16:16)

— అభిషక్తుడు (లూకా 4:18)

— దావీదు కుమారుడు (మత్తయి 1:1)

— ఇశ్రాయేలు రాజు (యోహాను 1:49)

— సీయోను రాజు (జెకర్యా 9:9; మత్తయి 21:5)

— దేవుని గొర్రెపిల్ల (యోహాను 1:29)

— విమోచకుడు (గలతీయులకు 3:13)

— మధ్యవర్తి – (1 తిమోతి 2:5)

— ప్రధాన యాజకుడు (హెబ్రీ 4:14)

— పరలోక ప్రధాన యాజకుడు (హెబ్రీ 9:11)

— ప్రవక్త (ద్వితీ. 18:15; అపొ.కా. 3:22)

— ప్రధాన కాపరి (1 పేతురు 5:4)

— వరుడు (Bridegroom) (మత్తయి 9:15)

— స్నేహితుడు (యోహాను 15:15)

— గురువు (రబ్బీ) (యోహాను 1:38)

— ఉపాధ్యాయుడు  (మత్తయి 23:8)

— ....ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెషయా. 9:6)

— యేసు సర్వాధికారియైన దేవుడైయుండి (రోమా 9:5)

— మహా దేవుడు (తీతుకు 2:13)

— ప్రభువు/రాజు (అపో.కార్య. 2:36; 10:36)


🧱 Note :

▪️మనకు(క్రైస్తవులకు) దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి — 1కోరింది 8:6 ✔️

▪️మనకు(క్రైస్తవులకు) దేవుడు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు — వాక్యము లేదు ❌

▪️యేసుక్రీస్తు అందరికి ప్రభువు — అపో కార్య. 10:36 ✔️

▪️అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే — ఎఫెసి 4:6 ✔️

▪️మనకు దేవుడొక్కడే ✔️

▪️మనకు(క్రైస్తవులకు) ముగ్గురు దేవుళ్లు ❌

▪️దేవుడు(θεός) అనే పదం లో ముగ్గురు ఉన్నారు ❌


9️⃣. నిత్యజీవమునకు మార్గం

బైబిల్ ప్రకారం నిత్యజీవం అనేది కేవలం మరణానంతర జీవితం కాదు. అది దేవునితో సంబంధం, రక్షణలో జీవితం, క్రీస్తులో జీవితం, అపోస్తలుల బోధ కలిగిన జీవితం.


నిత్యజీవ మార్గం = యేసుక్రీస్తు ✔️


(యోహాను 14:6): "యేసు —నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹"


🔎 నిత్యజీవానికి ఉండవలసిన విశ్వాసం

1. యేసును సజీవుడైన దేవుని కుమారుడిగా, క్రీస్తుగా, ప్రభువుగా విశ్వసించుట.(యోహాను. 20:31; అపో కార్య 2:36; 1 యోహాను. 5:12)

2. పాప జీవితం విడిచి దేవునివైపు తిరుగుట. (అపొ.కా. 2:38; లూకా 13:3)

3. యేసును ప్రభువుగా నోటితో ఒప్పుకొని, హృదయంతో విశ్వసించి, ఆయన్ను వెంబడించాలి, జీవితం అప్పగించుకోవాలి. (రోమా. 10:9-10; లూకా. 9:23)

4. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. (యోహాను 17:3)

5. తండ్రియైన దేవుని ఆరాధిస్తూ(worship), యేసును సేవిస్తూ(వెంబడిస్తూ) జీవించుట వలన నిత్యజీవము. (యోహాను. 4:23-24; యోహాను 12:26)


🔴 ముగింపు సారాంశం


యేసుక్రీస్తు :

నిత్యత్వములో దేవుడు ✔️

భూమిమీద లోకరక్షకుడు/దేవత్వం గలవాడు/మధ్యవర్తి/ప్రవక్త ✔️

ఆరోహణమైన తరువాత ప్రభువు/అభిషక్తుడు ✔️

నేడు మనకు(క్రైస్తవులకు) ప్రభువు/మధ్యవర్తి/ప్రధాన యాజకుడు ✔️

రేపు రానున్న రాజు/ప్రభువు ✔️


కేవలం "యేసు ఆదిలో ఉన్నాడు, ఆదిలో దేవుడు" అని నమ్మడం సరిపోదు. "యేసును క్రైస్తవులు ఏమని విశ్వాసముంచాలో అనే విషయములోనే నిత్యజీవము ఉందని గుర్తించు.


👤యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని  పరలోక దేవుడు మొదటగా పేతురుకి బయలు పరిచిన విశ్వాసం. ఇట్టి విశ్వాసం నీకు లేకపోతే నీవు ఇంకా రక్షణలో లేనట్టే, నిత్య జీవమునకు దూరముగా ఉన్నట్టే… ఇట్టి విశ్వాసం(పునాది) మీదనే సంఘము స్థాపించబడాలి. అదే దేవుని దృష్టిలో క్రీస్తు సంఘము(చర్చ్ ఆఫ్ క్రైస్ట్)  అనబడును. 


ఇట్టి విశ్వాసం లేకపోతే – మనిషికి నిత్యజీవం లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. 


ఇదే సత్యం. ఇదే మార్గం. ఇదే నిత్యజీవం.
మీ ఆత్మీయులు 👪

The churches of Christ greet you - Roma 16:16