మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
1️⃣. పరిచయం
1. క్రైస్తవ విశ్వాసం — దేవుని నిర్మాణం (ఆత్మీయ రాజ్యం).
2. కుల భావన — మనుషుల నిర్మాణం (సాంఘికం).
3. ప్రశ్న: క్రైస్తవుడు మరియు కులం ఒకే మనసులో నిలవగలవా? (లేదా) ఈ రెండూ కలియుట సాధ్యమా?
4. సమాధానం — బైబిల్ ఆధారంగా.
మనం పరిశీలించబోయే ప్రశ్న చాలా సున్నితమైనది, ఆత్మీయమైనది, నిత్యజీవితాన్ని నిర్ణయించే హృదయ ప్రశ్న మరియు క్రీస్తు సంఘానికి అత్యంత సంబంధించినది. అదేమనగా... “క్రైస్తవుడు – కులము రెండూ కలిసి నడవగలవా?” (లేదా) “క్రీస్తును అనుసరించడం మరియు కులాన్ని పట్టుకోవడం ఒకేసారి సాధ్యమా?”
మనము నివసిస్తున్న సమాజం చాలా విభజనలతో నిండిపోయింది. మనుషులు తమ తమ వర్గాలు, కులాలు, సంప్రదాయాలు, భేదాలు, ఇతరులపై పైచేయి అనే భావాలను నిర్మించుకున్నారు. జన్మ ఆధారంగా, కుటుంబ పేరుతో, సామాజిక స్థితిపై ఆధారపడి మనుషులను విడదీసే ప్రపంచం ఇది.
కుల భేదాలను నిర్మించినది మనుష్యులే అయితే ఈ విభజనకు విలువను ఇచ్చింది మాత్రం సమాజమే. క్రైస్తవ విశ్వాసంలో/పరిశుద్ధ గ్రంథములో — కుల విభజన, వివక్ష , గర్వం, వినయం; పాత స్వభావం లాంటి వాటికి తావు లేదు. అయినప్పటికీ నేటి సమాజంలో కొందరు క్రైస్తవులని పిలువబడుతూ, క్రీస్తు పేరును వాడుతూ, కులం, గర్వం అనే వాటిని ప్రోత్సహిస్తూ దేవుని గ్రంథానికి విరోధంగా విపరీత ధోరణి కలిగియున్నారు. అట్టివారికి ఈ అంశం అంకితం చేయనున్నాము.
క్రైస్తవులకు ప్రామాణికమైన పరిశుద్ధ గ్రంథము ఈ విషయం గూర్చి ఏం చెప్పుచున్నదో, ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం.
2️⃣. క్రైస్తవుడిగా పిలిపించుకోవడం అంటే ఏమిటి?
☑ A. క్రీస్తు సంఘం యొక్క స్వరూపం
1. సంఘం — ఒక స్థితి నుండి వేరొక స్థితికి పిలువబడిన వారు అని అర్థం. "A calling out off" ఇది గ్రీక్ భాష నుండే అనువదింపబడింది. గ్రీక్ లో ἐκκλησία (ekklesia), meaning "called-out ones" (from ek 'out of' + kaleo 'to call').
2. సంఘము — క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. (1కొరింథీ. 1:2)
3. సంఘము — "ఆ సంఘము ఆయన(క్రీస్తు) శరీరము; (ఎపేసి. 1:23). " సంఘము అను శరీరమునకు ఆయనే(క్రీస్తే) శిరస్సు (కొలొస్సి. 1:18). శరీర మొక్కటే (ఎపేసి. 4:4).
4. సంఘము — కులం, జాతి, భాషలకు అతీతం.
5. క్రీస్తు నందు ఉన్నవారిలో ఎలాంటి కుల భేదాలు, వివక్షతలు లేవు/ఉండకూడదు. (గలతీ. 3:28)
6. అందరూ ఒక ఆత్మలో క్రీస్తు శరీరమై(సంఘమై) ఉండుటకై బాప్తిస్మ పొందినవారు. (1 కొరింథీ 12:13)
☑ B. క్రైస్తవుడు అనే పేరు అమలు
1. యేసును తమ నోటితో ప్రభువని అంగీకరించడం, దేవుడు ఆయన్ను(యేసును) మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసించడం. (రోమా 10:9).
2. “.... మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి." (అపో.కార్య. 11:26).
3. "ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరునుబట్టియే దేవుని మహిమపరచవలెను.౹" (1 పేతురు. 4:16)
4. నేను క్రైస్తవుడును అంటూ కేవలం పేరును వాడడం రక్షణకు మార్గం కాదు.
5. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయడం ముఖ్యము. (మత్తయి. 7:21) " తండ్రి చిత్తం ఏంటి?" మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹" (అపో.కార్య. 3:22-23)
6. క్రీస్తు యొక్క శిష్యుడే/సేవించువాడే = క్రైస్తవుడు. (యోహాను. 12:26; మత్తయి. 28:19).
3️⃣. క్రైస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు
☑ A. క్రీస్తు ఇశ్రాయేలీయుడు
1. యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుడు అనగా "మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినవాడు. (హెబ్రీ. 7:14). ఆయన గ్రీకు/అరామిక్/హీబ్రూ... భాషలు మాట్లాడినవాడు. ఇది చారిత్రిక సత్యం.
2. క్రీస్తునందు రక్షింపబడినవారు అనగా దేవుని ఉగ్రత నుండి తప్పింపబడినవారు ఒక జాతికి లేదా ఒక భాషకు పరిమితం కాదు.
☑ B. సర్వజనులకు రక్షణ
1. "కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు" (మత్తయి. 28:19) ఈ ఆజ్ఞ ప్రకారం క్రైస్తవ్యం సర్వజనులకు, వివిధ భాషలు గలవారికి వ్యాప్తి చెందింది. మన భారతదేశమునకు కూడా వచ్చింది కావున ఇక్కడ ఏ కులం, ఏ భాష వారైనా క్రీస్తు సువార్త విని, విశ్వసించే హక్కు ఉంది.
2. యేసు లోక రక్షకుడు(లుకా. 2:11; 1 యోహాను. 4:14; యోహాను. 1:29; 4:42).
3. భారతదేశ కులాలన్నీ దేవుని ముందు సమానమే.
4️⃣. మానవ నిర్మిత కుల వ్యవస్థ — బైబిలు దృష్టిలో
☑ A. మనుషుల విభజనను దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించలేదు. కులాలు దేవుని యోచనలో లేవు
1. ఆదిలో దేవుడు ఒకే రక్తమునుండి సమస్త జనులను సృష్టించాడు (అపొస్తలుల కార్యములు 17:26) కానీ మనుషులను, కులాలుగా సృష్టించలేదు. దేవుని సృష్టిలో ఉన్నత–నిమ్న అనే భేదం లేదు. కులం అనే భావన మనుషుల మేథస్సు తయారు చేసినదే.
2. దేవుని సృష్టిలో ఉన్నత-నిమ్న అనే భావనే లేదు. "నరులు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు. (ఆదికాండము 1:27) మరింత వివరణ కోసం "మానవ నిర్మాణము" అనే అంశం చదవండి. దేవుని స్వరూపంలో ఉన్నవారిని కులం ద్వారా కొలవడం అనేది దేవుని రూపాన్ని అవమానించడమే అగును కదా!!
3. పాక్షికత పాపం : కులం అనేది పక్షపాతమే — కాబట్టి పాపమే. "నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి.౹".(యాకోబు
2:1) పక్షపాతము వద్దు. (యాకోబు. 2:9) దేవునికి పక్షపాతము లేదు(అపో.కార్య. 10:34-35; రోమా. 2:11; ఎపేసి. 6:9; 1పేతురు. 1:17) "
☑ B. ప్రపంచపు కుల భావన అనేది సాతాను యొక్క విభజన ఆయుధమే
1. అణచివేత, గర్వం, విభజన, వివక్షత, వ్యతిరేకత, పక్షపాతం — ఇవి సాతాను యొక్క స్వభావాలు — "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు;..." (యోహాను 10:10).
2. దేవుని రాజ్యంలోని ఏకత్వానికి పూర్తి విరుద్ధం
"ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?" (మత్తయి. 12:25-26)
“విభజింపబడిన రాజ్యం నిలువదు" . కులం సంఘాన్ని విభజిస్తుంది — గనుక ఇది దేవుని రాజ్య సూత్రాలకు వ్యతిరేకం.
5️⃣. క్రీస్తులో కొత్త సృష్టి ≈ కుల భేదాలు పూర్తిగా తొలగింపు
☑ A. క్రీస్తులో సర్వభేదాలు లేని కొత్త సృష్టి
1. 2కొరింథీ. 5:17 — పాతవి గతించిపోయినవి; కులమూ అందులో ఒక భాగమే.
✒ పాత మనిషి — కులం, గర్వం, భేదం
✒ కొత్త మనిషి — ప్రేమ, ఏకత్వం, వినయం, పరిశుద్ధత
2. విభేద గోడలు కూలాయి : "ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.౹ అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.౹ ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.౹ ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,౹ తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.౹ మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.౹" (ఎఫెసీ. 2:17- 22)
పౌలు గారు “గోడ” అని చెప్పింది — జాతి, కుల భేదాల గోడలే.
అట్టి గోడను కూల్చితే, క్రైస్తవుడు దానిని మళ్లీ నిర్మించగలడా? అసాధ్యం.
☑ B. క్రీస్తులో భేదాలు తొలగిపోయాయి, ఎవరు ఉన్నా, అందరూ ఒక్కటై ఉండాలి*
1. “మీరు అందరు క్రీస్తు యేసునందు ఏకమై యున్నారు.” (గలతీయులు 3:28)
ఇక్కడ “భేదాలు లేవు” అని చెప్పినట్టు — కులానికీ క్రీస్తులో స్థానం లేదు.
యూదువాడు/గ్రీకువాడు
దాసుడు/స్వతంత్రుడు
పురుషుడు/స్త్రీ
(ఇవన్నీ “సమాజిక భేదాలు” — కులం కూడా ఇదే జాబితాలో పడుతుంది.)
2. "ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు." (కొలస్సీయులు 3:11)
6️⃣. క్రీస్తు సంఘములో కుల భావనకు స్థానం ఎందుకు లేదు?
☑ A. సంఘం = ఒక శరీరం, ఒక ఆత్మ
1. అనేక అవయవాలు, ఒక శరీరం. (1 కొరింథీ 12:12–27)
2. కుల గర్వం = శరీరాన్ని(సంఘాన్ని) చీల్చి వేయను కదా.
☑ B. సంఘము శరీరంగా, క్రీస్తు అధికారిగా(శిరస్సు) ఉండటం
1. ఆ సంఘము ఆయన(క్రీస్తు) శరీరము; (ఎపేసి. 1:23). " సంఘము అను శరీరమునకు ఆయనే(క్రీస్తే) శిరస్సు (కొలొస్సి. 1:18). శరీర మొక్కటే (ఎపేసి. 4:4).
2. శరీరంలో అవయవాలు ఒకదానిని ఒకటి తక్కువగా చూడవు.
☑ C. విభజనలు దేవుని వాక్యానికి విరుద్ధం
1. విభేదాలు లేని ఏకమనస్సు. (1 కొరింథీ 1:10)
2. "మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుం చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.౹" (ఫిలిప్పీయులు 2:2).
☑ D. కుల గర్వం = శరీరాశ
1. 1 యోహాను 2:16 — శరీరాశ దేవునివద్దనుండి కాదు.
2. సామెతలు 16:18 — గర్వం పతనానికి ముందు.
☑ E. కులపు విభజన = క్రైస్తవ ప్రేమకు విరుద్ధం
1. యోహాను 13:34–35 — “మీరు పరస్పరం ప్రేమించుకొనుడి.” కులం ప్రేమను చంపుతుంది.
2. 1 యోహాను 4:20 — సహోదరుని ద్వేషించి దేవునిని ప్రేమించలేడు.
3. రోమా 12:10 — “సహోదర ప్రేమతో పరస్పరం ప్రీతిగలవారై యుండుడి.”
☑ F. కులం విడవని వారికి దేవుని రాజ్యంలో స్థానం ఉండదు
1. 1 కొరింథీ 6:9–10 — పాపాలలో జీవించే వారు రాజ్యములో ప్రవేశించరు.
2. ఎఫెసీ 5:5 — హృదయ గర్వం/అహంకారం కూడినవారు రాజ్యానికి బయట.
3. హెబ్రీయులు 12:14 — పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడరు. కులం మనలను పవిత్రులుగా చేయదు సుమీ!
7️⃣. కులాన్ని వదిలి క్రీస్తుయొద్దకు వచ్చినవారు
1. పాత మనిషిని(స్వభావమును) విడిచి క్రీస్తు నందు నూతన స్వభావము ధరించు (ఎఫెసీ 4:22–24)
2. పరస్పరం సోదర ప్రేమతో నడుచు (రోమా 12:10) క్రీస్తు ప్రేమించిన ప్రకారం...
3. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు౹ (ఫిలిప్పీ 2:3)
4. నిజమైన క్రైస్తవ జీవితం — క్రీస్తు బోధకు లేదా అపోస్తలుల బోధకు లోబడటం. నీ వాక్యము సత్యము.(యోహాను. 17:17) "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి, మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి." (2 దేస్స. 2:15)
కులం అనేది సత్యం కాదు, జీవితం కాదు, వ్యవస్థ కాదు, రక్షణ కాదు,
క్రీస్తే మార్గం, సత్యం, జీవితం. (యోహాను 14:6)
5. నీ హృదయాన్ని మార్చుకో. పిల్లలు వలే మారుమనస్సు పొందుము. (మత్తయి. 18:3). శుద్ధ హృదయులే దేవుని చూచుదురు.(మత్తయి. 5:8)
6. మనలో పరిశుద్ధాత్ముడు పని చేసే మార్పు విషయములో ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. (రోమా 8:13–14). ఆత్మఫలాలు ప్రేమ, శాంతి, దయ…(గలతీ 5:22–23).
8️⃣. క్రైస్తవుడు — కులము రెండూ కలసి నడవటం అసాధ్యం.
| కులం |
క్రైస్తవ్యం |
| మానవ నిర్మాణం |
దేవుని నిర్మాణం |
| విభజన |
ఏకత్వం |
| అహంకారం, ద్వేషం |
వినయం, ప్రేమ |
| పాత మనిషి/స్వభావము |
కొత్త సృష్టి/నూతన స్వభావం |
| పాపపు పులిపిండి |
పవిత్రుల కొరకు |
| పక్షపాతం, కక్షలు |
ప్రేమ |
| ద్వేషము |
సమాధానము |
| పగలు, కుట్రలు |
క్షమించే గుణం |
క్రీస్తును ధరించినవారికి కులాన్ని ధరించగల స్థలం లేదు.
క్రీస్తును పట్టుకున్నానో? లేక కులాన్ని పట్టుకొన్నానో? ఒక క్షణం ఆలోచించు.👥
9️⃣. ముగింపు :
ఓ చదువరి… ఈ అంశము యొక్క లక్ష్యం కులాన్ని సమర్థించటం కాదు, ఒక సమాజాన్ని విమర్శించడం కాదు, ఒక వర్గాన్ని తప్పుపట్టడం కాదు. దేవుని రాజ్యంలో అనగా క్రీస్తు సంఘములో కులానికి స్థానం లేదని తెలియజేయడమే... క్రైస్తవుని గొప్పతనం — కులానికి మించి క్రీస్తులో ఏకత్వం కలిగియుండుటయే. కుల భావనను విడిచిపెట్టి, క్రీస్తులో కొత్త సృష్టిగా నడవాలి. సంఘం ప్రేమలో, వినయంలో, పవిత్రతలో ఉండాలి. యేసు కోరేది — “మీరు అందరు ఏకమై యుండవలనేది ప్రభువు యొక్క ప్రార్థన” (యోహాను 17:21).
కుల పిచ్చి, వివక్షత, ద్వేషము, విభజనలు మరియు గర్వముతో జీవించడం దేవుని(YHWH) చిత్తం కాదు. కులం, జాతి, భాషను బట్టి విర్రవీగేవారు ఒకసారి మీ హృదయాలు పరీక్షించుకోవాల్సిందిగా మా మనవి. 🙏🏿
మీ ఆత్మీయులు 👪
Questions and Comments here!
Share this
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com