Showing posts with label క్రీస్తు సంఘము. Show all posts
Showing posts with label క్రీస్తు సంఘము. Show all posts

యేసు ఎవరు?👤 – నిత్యత్వం నుండి నిత్యజీవం వరకు

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏


ప్రస్తుతమున్న విభిన్నమైన బోధల కారణంగా ప్రభువైన యేసుక్రీస్తు నందున్నవారికి తమ హృదయములో మెదిలే అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమనగా “యేసు ఎవరు?” మరియు “యేసును ఎలా విశ్వసించాలి?”. అయితే ఈ ప్రశ్నలను తేలికగా చూసేవారు లేకపోలేదు కానీ ఇలాంటివారికి తెలియని వాస్తవం ఏమిటంటే ఈ ప్రశ్నల యొక్క సమాధానం మీదే వారి నిత్యజీవము నిర్ణయించబడుతుందని. ఎవరైతే తమ జీవితాలను అపోస్తులు బోధలో కట్టుకొని నిత్యజీవం కొరకు ఆరాటపడతారో  వారికి ఈ ప్రశ్నల యొక్క సమాధానాలు  అత్యంత కీలకమై ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రశ్నల యొక్క సమాధానం మీదనే సంఘ స్థాపన మరియు నరుని యొక్క రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం, నిత్యత్వ గమ్యం అనేది నిర్ణయించబడుతుంది గనుక. 


1️⃣. యేసును గూర్చి ఆనాటి జనుల యొక్క విశ్వాసం

"యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి– మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి." (మత్తయి. 16:13-14)


వ.13–14 – ప్రజలు యేసును విభిన్నంగానే గుర్తించారు (బాప్తిస్మ మిచ్చు యోహాను, ఏలీయా, యిర్మీయా, ప్రవక్తలలో ఒకడు) 

నేడు కూడా ప్రజలు యేసును విభిన్నంగానే గుర్తించేవారు లేకపోలేదు, ఇట్టి వారి విశ్వాసం వాక్యానుసారమైన విశ్వాసం అనబడదు/కాదు ❌


2️⃣. యేసును గూర్చి పేతురు యొక్క విశ్వాసం 

"అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు– సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు." (మత్తయి. 16:15-17)


వ.15 – యేసు అడిగిన కీలక ప్రశ్న: "మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు?"


వ.16 – పేతురు విశ్వాస ప్రకటన:

“నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని”


వ.17 – ఇది మానవ జ్ఞానం/ఆలోచన కాదు — పరలోకపు నా(తన) తండ్రి చేసిన ప్రకటన


ఇది వాక్యానుసారమైన విశ్వాసం ✔️


📖 "మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను." (మత్తయి. 16:18)


వ.18 – అట్టి విశ్వాసపు పునాది మీద అనగా యేసు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అనే విశ్వాసం పైన కట్టబడేదే సంఘము అనబడును. అది క్రీస్తు(నా) సంఘము(church of Christ) అని అనబడును. దానికి కర్త క్రీస్తే అయ్యుంటారు. ఆయన సంఘము యెదుట పాతాళలోక ద్వారములు నిలువవు. 


సంఘపు యొక్క పునాది(విశ్వాసం) వ్యక్తి మీద కాదు (పేతురు మీద కాదు) ❌

సంఘము క్రీస్తు సత్యంపై నిలబడింది ✔️

యేసు ఎవరో అన్న సత్యమే సంఘపు పునాది✔️


3️⃣. ఆదిలేని నిత్యత్వములో యేసు

యేసుక్రీస్తు భూమిమీద జన్మించినప్పటి నుండి మాత్రమే ఉన్నవాడు కాదు. ఆయన ఆదిలేని నిత్యత్వములోనే(అనాదిలోనే) ఉన్నవాడు. "తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను. 17:5) "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.౹ ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,౹ కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు.౹" (యోహాను. 1:1-3) "ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానత్వం కలిగినవాడు” (ఫిలిప్పీయులకు 2:6) "ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹" (కొలస్సీయులకు. 1:16-17). 


➡️ అర్థం: యేసు సృష్టింపబడినవాడు కాదు, సృష్టికర్తయే. యేసు ప్రారంభమున్నవాడు కాదు, నిత్యుడే. యేసు కేవలం దేవునితో ఉన్నవాడు కాదు, దేవుని యొద్ద దేవుడై ఉన్నవాడు. వాక్యము(యేసు) దేవుని యొద్ద ఉండెను కదా (యోహాను. 1:1,14) ఇది యేసు యొక్క ఉనికిని(existence) గూర్చి తెలియజేయబడే విషయాలు.


4️⃣. యేసుక్రీస్తు భూమిమీదికి వచ్చిన తరువాత (Incarnation Phase)

ఆదిలేని నిత్యత్వములో దేవుని యొద్ద వాక్యమై(దేవుడై) ఉన్న యేసుక్రీస్తు, దేవుని అనాది సంకల్పం నిమిత్తం, మనుష్యుల రక్షణ కొరకు, మనిషిని దేవునితో సమాధానపరచుటకు, నరులకు దేవునికి మధ్యవర్తిగా ఉండుటకు, తండ్రి చేత శరీరధారిగా లోకంలోనికి పంపబడ్డారు. ఇది బైబిల్‌లో సశరీరుడుగా (Incarnation) అని పిలవబడుతుంది.


— "...ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను….” (1 తిమోతి. 3:16)

— "ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;...” (యోహాను. 1:14)

— "అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;...” (గలతి. 4:4)

— "యేసు– నీతో మాటలాడుచున్న నేనే ఆయననని(మెస్సయ్య) ఆమెతో చెప్పెను." (యోహాను. 4:26)

— "...ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.౹" (యోహాను. 1:29)

— “సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువని” (మత్తయి 16:16)

— "మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹" (అపో కార్య. 3:22-23)

— "దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు." (లూకా. 2:11)

— "మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.౹" (1యోహాను. 4:14)

— “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹" (1తిమోతి. 2:5)

— "నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.౹" (యోహాను. 10:30) "ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి,...” (హెబ్రీ. 1:3)


➡️ భూమిమీద ఆయన యొక్క గుర్తింపు:

దేవుని కుమారుడు

క్రీస్తు (మెస్సయ్య)

ప్రభువు

లోకరక్షకుడు

దేవుని గొఱ్ఱెపిల్ల

మధ్యవర్తి

ప్రవక్త

దేవత్వం గలవాడు, 


5️⃣. యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత (Post‑Ascension State)

దేవుని అనాది సంకల్పంలో భాగముగా మనము పాపమునుండి విమోచింపబడి, నీతివిషయమై జీవించునట్లు, యేసు తానే తన శరీరమందు మనమందరి పాపములు విషయమై (రోమా. 6:18; 1 పేతురు. 2:24; యెషయా 53:4-5; 12). మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచి(1 కొరింది. 15:3-4), అనాది దేవుని సంకల్పం నెరవేర్చి(1పేతురు. 1:18:19-20; అపో.కార్య. 2:23). తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). తన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33). 


తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన కుమారున్ని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి, ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3-4; 9).

📖 Note : పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తరువాత యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చొనెను. (హెబ్రీ మొదటి అధ్యాయం అనాదిలో జరిగిన సంఘటన కాదు). 


అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి, ఆ కుమారునియందు విశ్వాసముంచు వారిని ఏలుబడి చేయుటకు యెహోవా దేవుడే తన కుమారుడును మనకు "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. - (లూకా. 1:32; యోహాను. 3:36; అపో.కార్య. 2:32-36; 10:36). ఈ సంగతి ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని పరిశుద్ధాత్ముడే చెప్పెను కదా!! (అపో.కార్య. 2:36).


యేసు భూమిమీద కార్యం ముగిసింది, పరలోకంలో అధికార సేవ ప్రారంభమైంది. ఆయన యొక్క ప్రస్తుత కార్యాలు


1) పరలోకాధిపత్యం (Heavenly Authority)

సమస్త అధికారములపై అధిపతిగా కూర్చున్నాడు. (ఎఫెసీయులకు 1:20–22)

➡️ ఆయన రాజుగా పరిపాలిస్తున్నాడు.

2) మధ్యవర్తిత్వ సేవ (Intercessory Ministry)

తన ద్వారా దేవునియొద్దకు వచ్చువారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాడు. (హెబ్రీ 7:25)

➡️ ఆయన మన పక్షాన మధ్యవర్తిగా ఉన్నాడు.

3) సంఘమునకు శిరస్సు/అధికారి (Head of the Church)

ఆయన సంఘమునకు శిరస్సు. (కొలస్సీయులకు 1:18)

➡️ సంఘం ఆయన అధికారంలో ఉంది.

4) పరలోక ప్రధాన యాజకుడు (Heavenly High Priest)

ప్రధాన యాజకుడు. (హెబ్రీ 4:14)

➡️ ఆయన నిత్య యాజక సేవ చేస్తున్నాడు.

5) రానున్న రాజు (Coming King)

మళ్లీ రానున్నాడు. (అపొ.కా. 1:11; 1కోరింది. 15:24-25)

➡️ ఆయన రాజ్యంతో తిరిగి వస్తాడు.


👤 యేసు ఇప్పుడు:

ప్రభువు, రాజు, దేవుని కుమారుడు

సంఘమునకు శిరస్సు

మధ్యవర్తి

ప్రధాన యాజకుడు

రానున్న రాజు


“...యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను... ” (రోమా. 1:7).


➡️ భూమిమీద ఆయన రక్షకుడు

➡️ పరలోకంలో ఆయన ప్రభువు

➡️ సంఘానికి ఆయన శిరస్సు

➡️ విశ్వాసులకు ఆయన మధ్యవర్తి

➡️ లోకానికి ఆయన రానున్న రాజు


6️⃣. యేసుక్రీస్తును ఏమని విశ్వసించాలి? (Faith Content)

యేసుక్రీస్తును కేవలం ఒక చారిత్రక వ్యక్తిగానో, ఒక ప్రవక్తగానో, ఒక బోధకుడిగానో, గురువుగానో  మాత్రమే గుర్తించడం సరిపోదు. నరుడు తాను రక్షణ పొందుటకు బైబిల్ ప్రకారం ఆయనను సరిగ్గా గుర్తించి, సరిగ్గా విశ్వసించవలసిన అవసరం ఉంది.


— “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” (మత్తయి. 16:16)

— “యేసు దేవుని కుమారుడు, క్రీస్తు అని విశ్వసించాలి”. (యోహాను 20:31)

— "నేనే ఆయననని(మెస్సయ్యా)" విశ్వసించనియెడల పాపములోనే చనిపోవుదురు. (యోహాను 8:24)

— "అదేమనగా– యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.౹ ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.౹" (రోమా. 10:9-10)

— “...మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;...” (1 పేతురు. 3:15)

— "దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే." (1యోహాను. 5:12)

యేసే దేవుని కుమారుడని (అపో కార్య 8:37; 9:20)

— "అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి,... (హెబ్రీ. 9:11)


➡️ విశ్వాసపు సారాంశం

యేసు సజీవుడైన దేవుని కుమారుడు

క్రీస్తు (అభిషిక్తుడు/మెస్సయ్య)

ప్రభువు

ఏకైక రక్షకుడు

యాజకుడు

ఇశ్రాయేలు రాజు

ప్రవక్తగా


7️⃣. ఆదిలేని నిత్యత్వములో/ఉనికి(Existence) మరియు విశ్వాసం(Faith) మధ్య వ్యత్యాసం


🔴 ఆదిలేని నిత్యత్వపు విషయములో యేసు దేవుడై ఉన్నాడు – ఇది 100% వాస్తవం. “వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను” (యోహాను. 1:1-2). ఆయన దైవ స్వభావం గలవాడు — దేవత్వం గలవాడు.


🟢 విశ్వాసం విషయములో మనం ఆయనను మెస్సయ్యా గా నమ్మాలి, దేవుని కుమారుడిగా, ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, హృదయం లో ప్రభువుగా ప్రతిష్టించవలసిందే.(యోహాను. 20:31; రోమా 10:8-10, 1 పేతురు 3:15-16). ఇట్టి విశ్వాస విషయమనేది నిత్యజీవమునకు ఖచ్చితంగా అవసరం. 


➡️ వ్యత్యాసం:

◾ఉనికి = సత్యం (objective reality)

◾విశ్వాసం = స్పందన (personal response)


ఉనికి నిజమైనదైనప్పటికి వాక్యానుసారముగా ఏమని విశ్వాసముంచాలో అట్టి విశ్వాసం లేకపోతే….


రక్షణ లేదు❌

పాపక్షమాపణ లేదు❌

సంఘప్రవేశం లేదు❌

నిత్యజీవం లేదు ❌


“విశ్వాసం ఒక్కటే” (ఎపేసి. 4:4)

“అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹" (యోహాను 17:3)


8️⃣. యేసు బిరుదులు —  నిత్యత్వం నుండి నిత్యజీవం వరకు

— వాక్యము(Logos) – యోహాను 1:1,14

— దేవుడు (యోహాను. 1:1)

— ఆల్ఫా మరియు ఓమెగా (ప్రకటన 1:8; 22:13)

— క్రీస్తు (మెస్సయ్య) (మత్తయి 16:16)

— అభిషక్తుడు (లూకా 4:18)

— దావీదు కుమారుడు (మత్తయి 1:1)

— ఇశ్రాయేలు రాజు (యోహాను 1:49)

— సీయోను రాజు (జెకర్యా 9:9; మత్తయి 21:5)

— దేవుని గొర్రెపిల్ల (యోహాను 1:29)

— విమోచకుడు (గలతీయులకు 3:13)

— మధ్యవర్తి – (1 తిమోతి 2:5)

— ప్రధాన యాజకుడు (హెబ్రీ 4:14)

— పరలోక ప్రధాన యాజకుడు (హెబ్రీ 9:11)

— ప్రవక్త (ద్వితీ. 18:15; అపొ.కా. 3:22)

— ప్రధాన కాపరి (1 పేతురు 5:4)

— వరుడు (Bridegroom) (మత్తయి 9:15)

— స్నేహితుడు (యోహాను 15:15)

— గురువు (రబ్బీ) (యోహాను 1:38)

— ఉపాధ్యాయుడు  (మత్తయి 23:8)

— ....ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెషయా. 9:6)

— యేసు సర్వాధికారియైన దేవుడైయుండి (రోమా 9:5)

— మహా దేవుడు (తీతుకు 2:13)

— ప్రభువు/రాజు (అపో.కార్య. 2:36; 10:36)


🧱 Note :

▪️మనకు(క్రైస్తవులకు) దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి — 1కోరింది 8:6 ✔️

▪️మనకు(క్రైస్తవులకు) దేవుడు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు — వాక్యము లేదు ❌

▪️యేసుక్రీస్తు అందరికి ప్రభువు — అపో కార్య. 10:36 ✔️

▪️అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే — ఎఫెసి 4:6 ✔️

▪️మనకు దేవుడొక్కడే ✔️

▪️మనకు(క్రైస్తవులకు) ముగ్గురు దేవుళ్లు ❌

▪️దేవుడు(θεός) అనే పదం లో ముగ్గురు ఉన్నారు ❌


9️⃣. నిత్యజీవమునకు మార్గం

బైబిల్ ప్రకారం నిత్యజీవం అనేది కేవలం మరణానంతర జీవితం కాదు. అది దేవునితో సంబంధం, రక్షణలో జీవితం, క్రీస్తులో జీవితం, అపోస్తలుల బోధ కలిగిన జీవితం.


నిత్యజీవ మార్గం = యేసుక్రీస్తు ✔️


(యోహాను 14:6): "యేసు —నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹"


🔎 నిత్యజీవానికి ఉండవలసిన విశ్వాసం

1. యేసును సజీవుడైన దేవుని కుమారుడిగా, క్రీస్తుగా, ప్రభువుగా విశ్వసించుట.(యోహాను. 20:31; అపో కార్య 2:36; 1 యోహాను. 5:12)

2. పాప జీవితం విడిచి దేవునివైపు తిరుగుట. (అపొ.కా. 2:38; లూకా 13:3)

3. యేసును ప్రభువుగా నోటితో ఒప్పుకొని, హృదయంతో విశ్వసించి, ఆయన్ను వెంబడించాలి, జీవితం అప్పగించుకోవాలి. (రోమా. 10:9-10; లూకా. 9:23)

4. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. (యోహాను 17:3)

5. తండ్రియైన దేవుని ఆరాధిస్తూ(worship), యేసును సేవిస్తూ(వెంబడిస్తూ) జీవించుట వలన నిత్యజీవము. (యోహాను. 4:23-24; యోహాను 12:26)


🔴 ముగింపు సారాంశం


యేసుక్రీస్తు :

నిత్యత్వములో దేవుడు ✔️

భూమిమీద లోకరక్షకుడు/దేవత్వం గలవాడు/మధ్యవర్తి/ప్రవక్త ✔️

ఆరోహణమైన తరువాత ప్రభువు/అభిషక్తుడు ✔️

నేడు మనకు(క్రైస్తవులకు) ప్రభువు/మధ్యవర్తి/ప్రధాన యాజకుడు ✔️

రేపు రానున్న రాజు/ప్రభువు ✔️


కేవలం "యేసు ఆదిలో ఉన్నాడు, ఆదిలో దేవుడు" అని నమ్మడం సరిపోదు. "యేసును క్రైస్తవులు ఏమని విశ్వాసముంచాలో అనే విషయములోనే నిత్యజీవము ఉందని గుర్తించు.


👤 “యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు” అని  పరలోక దేవుడు మొదటగా పేతురుకి బయలు పరిచిన విశ్వాసం. ఇట్టి విశ్వాసం నీకు లేకపోతే నీవు ఇంకా రక్షణలో లేనట్టే, నిత్య జీవమునకు దూరముగా ఉన్నట్టే… ఇట్టి విశ్వాసం(పునాది) మీదనే సంఘము స్థాపించబడాలి. అదే దేవుని దృష్టిలో క్రీస్తు సంఘము(చర్చ్ ఆఫ్ క్రైస్ట్)  అనబడును. 


ఇట్టి విశ్వాసం లేకపోతే – మనిషికి నిత్యజీవం లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. 


ఇదే సత్యం. ఇదే మార్గం. ఇదే నిత్యజీవం.
మీ ఆత్మీయులు 👪

ఆది - అనాది - దేవుని అనాది సంకల్పము📖


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻

1️⃣. పరిచయం

మనము ఈ దినమున ధ్యానించబోయే అంశము “ఆది - అనాది - దేవుని అనాది సంకల్పము”. ఈ అంశము దేవుని యొక్క మనస్సును సరిగా అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైనది. ఎందుకంటే దేవుడు కాలం ప్రకారం యాదృచ్ఛికంగా పని చేసే వాడు కాదు; ఆయన ఆదికి ముందే, అనగా అనాదిలోనే, తన కార్యములన్నిటిని లెక్కచూసి నిర్ణయించుకున్న దేవుడు. 

బైబిలు మనకు రెండు ముఖ్యమైన స్థితులను తెలియజేస్తుంది— ఆది మరియు అనాది.

☑ ఆది అనగా సృష్టి ప్రారంభం;

☑ అనాది అనగా సృష్టికి ముందున్న నిత్య స్థితి.

ఆ అనాది స్థితిలో దేవుడు కేవలం ఉన్నవాడే కాదు, తన చిత్తాన్ని, తన ఉద్దేశ్యాన్ని, తన సంకల్పాన్ని ముందుగానే నిర్ణయించినవాడై ఉన్నాడు.


ప్రభువైన యేసు లూకా 14:28–30లో ఒక గోపురము కట్టే ఉపమానం ద్వారా ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధించాడు— పని మొదలుపెట్టే ముందు లెక్కచూడాలి; లేకపోతే పునాది వేసి మధ్యలో ఆగిపోతే అపహాస్యం కలుగుతుంది. ఈ ఉపమానం మనుషుల విషయములో ఎంత సత్యమో, దేవుని విషయములో అంతకంటే ఎక్కువ సత్యం. దేవుడు పునాది వేసి మధ్యలో ఆగిపోయే వాడు కాదు. ఆయన ఏ పని మొదలుపెడితే, దానిని సంపూర్ణంగా పూర్తి చేయుటకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నవాడు. అందుకే దేవుని రక్షణ కార్యము ఒక సంఘటనగా కాక, ఐదు ప్రధాన సంకల్పాలుగా అనాదిలోనే ఏర్పాటు చేయబడింది.

ఈ ఐదు సంకల్పాలు విడివిడిగా ఉన్నట్లు కనిపించినా, అవన్నీ కలసి ఒకే నిత్య ఉద్దేశ్యాన్ని వెల్లడిచేస్తాయి. వాటన్నిటికీ కేంద్రబిందువు క్రీస్తు. ఈ ఐదు సంకల్పాలను మనము వాక్యాధారముగా పరిశీలించినప్పుడు, మన రక్షణ యాదృచ్ఛికమైంది కాదని, మన విశ్వాసం సంప్రదాయాల మీద కాదు గానీ దేవుని నిత్య సంకల్పం మీద ఆధారపడి ఉందని, మన సంఘ జీవితం ఒక మతాచారం కాదు గానీ దేవుని శాశ్వత ప్రణాళికలో భాగమని స్పష్టంగా గ్రహించగలుగుతాము.

కాబట్టి ఈ పరిచయంతో మనము ఇప్పుడు, దేవుడు అనాదిలో లెక్కచూసి ఏర్పాటు చేసిన ఐదు ప్రధాన సంకల్పాలను ఒక్కొక్కటిగా, క్రమంగా, వాక్యాధారముగా ధ్యానించుటకు ముందుకు సాగుదాం. 


2️⃣.  ఆది = సృష్టి ప్రారంభం

A]. ఆది అంటే ఏమిటి?

ఆది అనగా సృష్టి ప్రారంభమైన సమయం.

కాలం మొదలైన స్థితిని, జగత్తు ఉనికిలోకి వచ్చిన మొదటి క్షణాన్ని “ఆది” అని వాక్యం పిలుస్తుంది.

▪️(ఆది.కాం. 1:1): "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.౹

▪️ “ఆది” అనగా దేవుడు సృష్టిని ప్రారంభించిన సమయం

▪️ఆ సమయంలోనే కాలం, స్థలం, పదార్థం మొదలయ్యాయి

▪️“ఆది” అనేది దేవునికి ఆరంభం కాదు, సృష్టికి ఆరంభం మాత్రమే.

▪️ఆదికి ముందు కాలం లేదు.

▪️కాలం, దినములు, సంవత్సరాలు అన్నీ సృష్టితో పాటు వచ్చాయి. (ఆది. కాం. 1:5,14-15)

▪️దేవుడు కాలానికి ముందు ఉన్నవాడు. ఆది ద్వారా కాలంలోకి వచ్చి సృష్టి చేశాడు. (ఆది.కాం. 1:1; కీర్తనలు. 90:1-2)


B]. ఆదిలో ఎవరెవరున్నారు?

▪️మన తండ్రియైన దేవుడు(YHWH) ఉన్నాడు — (ఆది కాం. 1:1; యోహాను 1:1-2)

▪️మన ప్రభువైన యేసుక్రీస్తు(వాక్యము) ఉన్నాడు — (యోహాను. 1:1-2,14)

▪️ మన సత్యస్వరూపియైన ఆత్మ(పరిశుద్ధాత్ముడు) ఉన్నాడు — (ఆది కాం. 1:2; యోహాను 15:26).

▪️ఆదిలో దేవదూతలు ఉన్నారు — (యోబు. 38:4,7; ప్రకటన. 5:11)

▪️ఆది నుండే అపవాది ఉన్నాడు — (యోహాను. 8:44; ప్రకటన 12:9) — దేవదూత కాదు సుమీ.


3️⃣. అనాది = సృష్టికి పూర్వం

A]. అనాది అంటే ఏమిటి?

అనాది అనగా  ప్రారంభం లేని స్థితి/జగత్తు పునాది వేయబడకమునుపు. అంటే సృష్టి మొదలుకాకమునుపు, కాలం/సమయం ఏర్పడకమునుపు ఉన్న నిత్య స్థితి.


ఆది = సృష్టి ప్రారంభం

అనాది = సృష్టికి పూర్వం


▪️(కీర్తనలు. 90:2): "పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు"

▪️సృష్టి కంటే ముందే దేవుడు ఉన్నాడు.

▪️దేవునికి ఆరంభం లేదు. ఆయన నిత్యుడు

▪️దేవుడు కాలానికి లోబడినవాడు కాదు

▪️అనాదిలో కాలం లేదు—దినాలు, సంవత్సరాలు లేవు. 

▪️“నేనే మొదటివాడను, నేనే కడపటివాడను”

(యెషయా 44:6) ఇది కాల పరిమితి కాదు, నిత్యతను సూచిస్తుంది.

▪️అనాది ≠ శూన్యత అనగా అనాదిలో శూన్యత లేదు/కాదు. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని చిత్తం ఉంది, దేవుని సంకల్పం ఉంది. 

▪️దేవుని సంకల్పాలు అనాదిలోనే నిర్ణయించబడ్డాయి.


B]. అనాదిలో ఎవరెవరున్నారు?

▪️మన తండ్రియైన దేవుడు(YHWH) ఉన్నాడు — (కీర్తనలు. 90:2)

▪️మన ప్రభువైన యేసుక్రీస్తు(వాక్యము) ఉన్నాడు — (యోహాను. 17:5)

▪️ మన సత్యస్వరూపియైన ఆత్మ(పరిశుద్ధాత్ముడు) ఉన్నాడు — (హెబ్రీ. 9:14; ఆది కాం. 1:2).

▪️ అనాదిలో దేవదూతలు ఉన్నారు — (యోబు. 38:4,7; ప్రకటన. 5:11)

▪️ అనాదిలో అపవాది లేడు — వాడు ఉన్నాడు అనుటకు ఒక్క వాక్య ఆధారము లేదు. 


4️⃣. దేవుని అనాది సంకల్పము – ఐదు ప్రధాన విషయాలు

దేవుడు జగత్తు పునాది వేయబడకమునుపే మానవజాతి విషయమై…

➡ కొన్ని కార్యాలను తన మనసులో నిర్ణయించుకున్నాడు.

➡ వాటినే అనాది సంకల్పములు అంటాము.


📖 (లూకా. 14:28-30): "మీలో ఎవడైనను ఒక గోపురముకట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున చూచువారందరు– ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు."


✅ మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని దేవుని అనాది సంకల్పానికి అన్వయిస్తే:

✝️ క్రీస్తు బలి – పునాది

పాప సమస్యకు శాశ్వత పరిష్కారం ముందుగానే లెక్కచూసి నిర్ణయించబడింది

📖 అపోస్తులుల బోధ – నిర్మాణ విధానం

ఏ బోధ ద్వారా రక్షణ జరుగాలో ముందే నిర్ణయం

👨‍👩‍👧‍👦 దత్తత స్వీకారం – కుటుంబ స్థాపన/సంఘ స్థాపన

రక్షించబడినవారిని కుమారులుగా చేయాలనే ఉద్దేశ్యం

⛪ క్రీస్తు సంఘము – గోపుర నిర్మాణం

రక్షణ పొందినవారు ఒంటరిగా కాదు, సంఘంగా కట్టబడాలి

✨ క్రీస్తు స్వరూపములోకి ఎదగడం – పూర్తిస్థాయి ముగింపు

దేవుని పని అర్ధాంతరంగా కాదు; పరిపక్వతతో ముగియాలి


▪️మన దేవుడు ముందుగా లెక్కచూసి పని ప్రారంభించే దేవుడు

▪️ఆయన పునాది వేసి మధ్యలో ఆగిపోయే వాడు కాదు

▪️దేవుని అనాది సంకల్పము అసంపూర్ణమైనది కాదు

▪️అది ఆది నుండి అంతము వరకు పూర్తిస్థాయి ప్రణాళిక


కాబట్టి దేవుని అనాది సంకల్పములోని ఈ ఐదు ప్రధాన విషయాలు అనేవి యాదృచ్ఛికంగా ఏర్పడినవి కావు; అవి అనాదిలోనే అనగా సృష్టికి పూర్వమే లెక్కచూసి, పునాది వేసి, సంపూర్ణంగా పూర్తి చేయబడిన దేవుని నిత్య ప్రణాళిక. 


[A]. మొదటి సంకల్పము – క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం

దేవుని అనాది సంకల్పములో మొట్టమొదటి మరియు అత్యంత ప్రాముఖ్యమైన విషయం

✝️ క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం.

ఇది దేవుడు ఆది తరువాత ఆలోచించిన కార్యం కాదు; ఇది పాపం వచ్చిన తరువాత తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం కాదు. జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు తన మనసులో మానవ జాతి విషయమై నిర్ణయించుకున్న నిత్య సంకల్పము.


1. క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం అనాదిలోనే నిర్ణయించబడింది — (1 పేతురు 1:18–20)

2. క్రీస్తు బలియాగం అనాదిలోనే నిశ్చయించిన సంకల్పము — (అపొస్తలుల కార్యములు 2:23). 

➡ సిలువ = దేవుని సంకల్పము

➡ సిలువ = దేవుని ప్రణాళికలో కేంద్రబిందువు

3. క్రీస్తు బలియాగం ద్వారా దేవుడు ఉద్దేశించిన మూడు విషయాలు :

✝️ పాప ప్రాయశ్చిత్తము : పాపం చేసినవాడు శిక్షకు పాత్రుడు. కానీ దేవుడు మనల్ని శిక్షించకుండా, మన బదులుగా క్రీస్తును శిక్షించాడు. (యెషయా. 53:5; 1 పేతురు. 2:24) సిలువలో పాప సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగింది.


✝️ అపవాది అధికారమునుండి విమోచన : మనిషి పాపం వలన అపవాది అధికారంలో బంధింపబడతాడు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువయాగం, బలియాగం ద్వారా వాడి అధికారాన్ని కూల్చాడు. (హెబ్రీయులు 2:14; కొలస్సయులు 2:15)

➡ సిలువ = అపవాది ఓటమి

➡ సిలువ = మనుషుల విమోచన


✝️ మానవ జాతి యెడల దేవుని శాశ్వతమైన ప్రేమ ప్రకటింపబడింది : ప్రేమాస్వరూపియైన దేవుడు. తన ప్రేమను మానవజాతి యెడల మాటలతో కాకుండా కార్యం ద్వారా అనగా క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం ద్వారానే కనపరచాడు. ఎంత అద్భుతమైన ప్రేమ కదా. “మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మనకొరకు మరణించెను” (రోమా 5:8) దేవుని ప్రేమ చూడాలనుకుంటే సిలువవేయబడిన యేసును మాత్రమే చూడు స్పష్టముగా కనిపిస్తుంది.


4. పునాది లేకుండా గోపురం లేదు అలాగే క్రీస్తు బలియాగం లేకుండా అపోస్తుల బోధ లేదు, దత్తత స్వీకారం లేదు, క్రీస్తు సంఘము లేదు, క్రీస్తు స్వరూపములో ఎదగడం లేదు.

➡ క్రీస్తు బలి = దేవుని అనాది సంకల్పమునకు పునాది ✔️


[B]. రెండవ సంకల్పము – అపోస్తులుల బోధ

దేవుని అనాది సంకల్పములో రెండవ ప్రధాన విషయం

📖 అపోస్తులుల బోధ 📖

దేవుడు క్రీస్తు ప్రభువు యొక్క బలియాగంను అనాదిలోనే నిర్ణయించుకున్నట్లే, ఆ బలి ద్వారా కలిగే రక్షణను ఏ బోధ ద్వారా ప్రకటించాలో కూడా అనాదిలోనే నిర్ణయించాడు. అందుకే క్రీస్తు సిలువ బలి జరిగిన తరువాత, దేవుడు రక్షణను ప్రతి ఒక్కరి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకునేలా వదలలేదు. ఆ రక్షణను ప్రకటించుటకు ఒకే ఒక్క బోధను, అదే అపోస్తులుల బోధను నియమించాడు.


అపోస్తులలు ఏం బోధించారో ఆ బోధ యందే మనుషులు విశ్వాసం ఉంచాలి. ఆ బోధ కాకుండా మరొక బోధ మనుషులను రక్షించలేదు. ఎందుకంటే అనాదిలో సంకల్పించుకున్న తన సంకల్పాన్ని ఎవరి కోసము మార్చబడదు. అయ్యా నేను ఫలానా బోధ విని వచ్చాను, ఫలానా బోధ విని నేను బాప్తిస్మం పొందాను, ఫలానా సహవాసంలో నేను బతికాను అంటే చెల్లదు. కచ్చితముగా అపోస్తులుల బోదె వినాలి.


1. అపోస్తులుల బోధ అనేది అనాదిలోనే నిర్ణయించబడిన బోధ (రోమా 16:25–26). "దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.౹" (1కోరింది 2:7) ఇది మనుషుల ఆలోచన వలన పుట్టినది కాదు, లోక జ్ఞానం కాదు, వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని ప్రకటింపబడేది కాదు, మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనేది కాదు, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపబడేది కాదు. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు అనాదిలోనే తన మనసులో దాచుకున్న ఈ మర్మమును పరలోకం నుండి పంపబడిన ఇద్దరు ఉపాధ్యాయుల ద్వారా అపోస్తలులకు నేర్పబడింది అనే సంగతి తెలుసుకో.


2. యేసు మాటల్లో…. "అందుకు యేసు-నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹" (యోహాను 7:16). "ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.౹" (యోహాను. 14:26) "అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.౹"(యోహాను. 16:13)


3. దేవుడు ఈ బోధను యేసు ద్వారా అపోస్తులులకు అప్పగించాడు. (యోహాను 8:26,38; 12:49; 17:6-8; 16:13)


◾దేవుని బోదె = క్రీస్తు బోధ

◾క్రీస్తు బోదె = పరిశుద్ధాత్మడు బోధ

◾పరిశుద్ధాత్మడు బోదె = అపోస్తలుల బోధ


➡ అపోస్తులుల బోధ = తండ్రి చిత్తం

➡ అపోస్తులుల బోధ = క్రీస్తు బోధ

➡ అపోస్తులుల బోధ = పరిశుద్ధాత్మ సాక్ష్యం


✅ దేవుని బోధ + క్రీస్తు బోధ + పరిశుద్ధాత్ముడు బోధ = అపోస్తలుల బోధ (ఒకే ఒక్క బోధ)


4.  అపోస్తులుల బోధ ఒక్కసారే అప్పగింపబడిన బోధ. — (యూదా 1:3). 

📖 ఒక్కటే బోధ — (యూదా 1:3; అపో కార్య 2:42; 2దేస్స. 2:15)

📖 ఒక్కటే సువార్త — (గలతీ. 1:6-12)

❌ మరొక్క బోధ మరియు మరొక్క సువార్త లేదు, ఉండకూడదు…  ఉంటే శాపగ్రస్తులే. (గలతీ. 1:8-9) పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థం చేసేవారు తమ స్వనాశనానికే కారణమవుతారు. (2 పేతురు 3:16)

✔️ ఆదిమ అపోస్తలలు చెప్పని మాటలు వినొద్దు. ఆఖరికి పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఇలా అలా చెప్పిన సరి వాని మాట కూడా నువ్వు వినొద్దు ఎందుకంటే ఒక్కసారి అప్పగింపబడినది అపోస్తలుల బోధ.  ఆ బోధ యందే విశ్వాసం ఉంచాలనేది దేవుని అనాది సంకల్పం.

➡ అపోస్తులుల బోధ తప్ప

➡ మరొక బోధ నీకు రక్షణ ఇవ్వదు.


"నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు." (1 తిమోతి. 4:16)


5. అపోస్తులుల బోధ = నిర్మాణ విధానం


[C]. మూడవ సంకల్పము – దత్తత స్వీకారం

దేవుని అనాది సంకల్పములో మూడవ ప్రధాన విషయం

➡ దత్తత స్వీకారం.

క్రీస్తు బలి ద్వారా పాపం పరిష్కరించబడింది. అపోస్తులుల బోధ ద్వారా ఆ రక్షణ ప్రకటించబడింది. కానీ దేవుని ఉద్దేశ్యం అక్కడితో ఆగలేదు. దేవుడు కేవలం పాపులను క్షమించడమే కాక,

👨‍👩‍👧‍👦 తన కుటుంబంలోకి చేర్చుకోవాలని,

👨‍👩‍👧‍👦 తన కుమారులు, కుమార్తెలుగా చేసుకోవాలనేది అనాదిలోనే దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయమే దత్తత స్వీకారం.


1. దత్తత స్వీకారం అనాదిలోనే నిర్ణయించబడింది. “జగత్తు పునాది వేయబడకమునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొని…యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకు ముందుగా నిర్ణయించెను” (ఎఫెసీయులు 1:4–5). 


2. దేవుడు ఎవరినీ నేరుగా కుమారులుగా చేయలేదు. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరిగింది. “కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను…మనము దత్తపుత్రులమగునట్లు” (గలతీయులు 4:4–5).

➡ క్రీస్తు లేకుండా కుమారత్వం లేదు

➡ క్రీస్తు బలి లేకుండా దత్తత లేదు


3. పాపం వలన మనిషి దేవుని కుటుంబానికి వెలుపల ఉన్నాడు. పాపంలో ఉన్నవాడు దేవుని కుమారుడు కాదు. విమోచన పొందినవాడే కుమారుడు అందుకే దత్తత అవసరమైంది.


4. దత్తత అనేది భావోద్వేగ నిర్ణయం కాదు;

ఇది చట్టబద్ధమైన చర్య. దేవుడు దీనికి సాక్ష్యంగా పరిశుద్ధాత్మను మన హృదయాలలో పంపించాడు. (గలతీయులు 4:6; 2 కొరింథీయులు 1:21–22)

➡ పరిశుద్ధాత్మ = కుమారత్వానికి ముద్ర

➡ దత్తతకు చట్టబద్ధమైన సాక్ష్యం


5. దత్తత పొందినవాడు ఇకపై దేవునిని “తండ్రి” అని పిలిచే మహత్కారమైన అవకాశం దొరుకుతుంది. దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ఇది మానవజాతికి అనుగ్రహింపబడిన దేవుని కృప. (హెబ్రీయులు 8:10; 2 కొరింథీయులు 6:18)


6. కుమారుడైతే వారసుడే. “కుమారులైతే వారసులము; దేవుని వారసులము, క్రీస్తుతో కూడ వారసులము” (రోమీయులు 8:17) 

➡ దత్తత పొందినవాడు

➡ పరలోక ఆస్తికి హక్కుదారు

అందుకే నిజమైన క్రైస్తవుడు భూసంబంధమైన ఆస్తుల కోసం పాపులాడడు.


7. దత్తత స్వీకారంతో దేవుడు మన హృదయాలలో కొత్త నిబంధనను వ్రాశాడు. “నేను నా ధర్మవిధులను వారి హృదయములలో వ్రాయుదును” (హెబ్రీయులు 8:10)

➡ రాతిపలకల మీద కాదు

➡ మెత్తని హృదయాల మీద 


8. దత్తత పొందిన దేవుని పిల్లల సమూహమే క్రీస్తు సంఘము. 


👉 దత్తత స్వీకారం దేవుని అనాది సంకల్పములో మూడవ ప్రధాన నిర్ణయం. ఇది రక్షణకు లక్ష్యం, కుటుంబ సంబంధానికి ఆధారం. దేవుడు మనలను కేవలం క్షమించలేదు — తన పిల్లలుగా చేసుకున్నాడు. ఇలా దేవుని చేత దత్తత పొందినవారే క్రీస్తు సంఘము.


[D]. నాలుగవ సంకల్పము – క్రీస్తు సంఘము

దేవుని అనాది సంకల్పములో నాలుగవ ప్రధాన విషయం

⛪ క్రీస్తు సంఘము.

క్రీస్తు బలి ద్వారా విమోచన జరిగింది. అపోస్తులుల బోధ ద్వారా రక్షణ ప్రకటించబడింది. దత్తత స్వీకారం ద్వారా విశ్వాసులు దేవుని కుమారులయ్యారు. అయితే దేవుని ఉద్దేశ్యం అక్కడితో ఆగలేదు. దేవుడు తన కుమారులను ఒంటరిగా విడిచిపెట్టలేదు. వారిని ఒక శరీరముగా, ఒక సంఘముగా కట్టాలని అనాదిలోనే నిర్ణయించాడు.


1. సంఘము మానవ ఆలోచన కాదు. మానవ ఆలోచనతో కట్టబడేది కాదు. ఇది తరువాత కాలంలో ఏర్పడిన వ్యవస్థ కాదు. సంఘము దేవుని అనాది సంకల్పములో భాగమే. “ఇది క్రీస్తు యేసునందు దేవుడు చేసిన నిత్యసంకల్పము ప్రకారమే” (ఎఫెసీయులు 3:10–11)


2. సంఘాన్ని కట్టేది : నీవు అనుకున్నట్టుగా పాస్టరు కాదు, అపోస్తులు కాదు, మనుషులు కాదు మరెవరు?  క్రీస్తే సంఘాన్ని కట్టాడు “ఈ బండమీద నా సంఘమును కట్టుదును” (మత్తయి 16:18).

➡ బండమీద = యేసు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అనే విశ్వాసం మీద (16వ)

➡ సంఘము క్రీస్తు సొంతమైనది

➡ సంఘము అన్నారు కానీ సంఘములు అనలేదు. 

➡ నా సంఘము = క్రీస్తు సంఘము


మానవ యోచన, బోధలు, విశ్వాసం ద్వారా సంఘం కట్టే అధికారం దేవుడు మానవులకు అనుమతి ఇవ్వలేదు, ఆఖరికి అపోస్తలలుకి అనుమతి లేదు. "వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.౹" (1 కోరింది. 3:11)

➡ పెంతుకొస్తూ సంఘము ❌  

➡ బాప్టిస్ట్ సంఘము ❌

➡ లూథరన్, హెబ్రోను సంఘం ❌

➡ క్రీస్తు సంఘము(church of Christ) ✔️


(ఎఫెసీయులు 2:20): "క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.౹" నీవు కట్టబడేది ఇలా లేకపోతే అది క్రీస్తు సంఘము కాదు, క్రీస్తుకు చెందినది కాదు అని గుర్తించుము


3. సంఘాన్ని ఎందుకు కట్టాడు? దత్తత స్వీకారం ద్వారా తన కుమారులుగా చేర్చబడినవారు  పాతాళలోకమునకు పోకూడదనేది దేవుని ఉద్దేశ్యం. ఆది నుండి మానవజాతిని ఇబ్బంది పెట్టేది పాతాళలోకమే(షియోల్). "దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు." "మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?" (కీర్తనలు. 9:17; 89:48) "నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే." (యెషయా. 14:15) ఇట్టిదానికి దేవుడు పరిష్కారం చూపుటకే క్రీస్తు ద్వారానే సంఘమనేది  కట్టుబడింది. 


క్రీస్తు సంఘములోనున్న వారికి అనగా అపోస్తలుల విశ్వాస ప్రకారం నడిపింపబడేవారికి “పాతాళలోక ద్వారములు దాని(సంఘము) యెదుట నిలువనేరవు” (మత్తయి. 16:18) మరణం సంఘాన్ని జయించలేదు, సమాధి దేవుని కార్యాన్ని ఆపలేదు, షియోల్ అధికారము దేవుని ప్రజలపై నిలువలేదు. సంఘము మరణానికన్నా బలమైనది, ఎందుకంటే అది జీవముగల దేవుని యోచనపై కట్టబడింది. మరింత వివరణ కోసం "పాతాళలోకము" అను అంశములో నేర్చుకుందాం. 


4. ఏదైనా మనిషి ప్రాణం పెట్టేది తనకు అత్యంత విలువైనదానికే. అదే క్రీస్తు దేనికోసం ప్రాణం పెట్టాడు? సంఘముకోసం కదా. "దేవుడు తన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును….” (అపో కార్య 20:28) అదిగో యేసు మనకు దేవుడు అంటావు ఏమో… ఇది అపోస్తలుల విశ్వాసం కాదు. దేవుడు అనే పదం ఉన్నచోట "ప్రభువు" అని ఉంది చూడు. 


5. సంఘము భవనము కాదు, సంస్థ కాదు. సంఘము అనగా క్రీస్తు శరీరము. (ఎపేసి 1:23) సంఘానికి అధికారి(శిరస్సు) క్రీస్తు (కొలస్సి 1:18) క్రీస్తు అవయవాలు సభ్యులు (1 కొరింథీయులు 12:27) క్రీస్తు శరీరం ఒక్కటే(ఎపేసి 4:4) క్రీస్తు శరీరమే = క్రీస్తు సంఘము(రోమా 16:16).


6. దేవుడు ఈ సంఘాన్ని కేవలం శరీరంగా మాత్రమే కాదు, వధువుగా కూడా పోల్చి అభివర్ణించి చూచుతున్నాడు. 

(ఎఫెసీయులు 5:22–32): "స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.౹ క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.౹ సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.౹ పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.౹ అటువలెనే పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.౹ తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.౹ ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.౹ ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.౹"


➡ సంఘము = వధువు

➡ క్రీస్తు = వరుడు

కాబట్టి సంఘము పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండాల్సిందే... 


7. “మీరు జీవముగల దేవుని ఆలయమై ఉన్నారు” (2 కొరింథీయులు 6:16)

➡ సంఘము = దేవుని నివాసము

➡ దేవుని సన్నిధి ఉన్న స్థలం = పరిశుద్ధ జనం మధ్య లేదా క్రీస్తు బలి, అపోస్తలుల బోధ ప్రకారం, దత్తత స్వీకారం జరిగినవారి మధ్యనే కదా. 


8. సంఘము లోకానికి వేరైన సమూహము అనగా లోకానికి చెందినది కాదు. “ఈ మూర్ఖమైన తరమునుండి వేరై రక్షణ పొందుడి” (అపొస్తలుల కార్యములు 2:40). లోకానికి వేరుగా అంటే లోక ఆచారాలు, పితృ పారంపర్యాలు, భూసంబంధ జీవితమునకు వేరై ఉండటం. లోకానికి దగ్గర ఉండి జీవించేవాడు రక్షణ పొందనివాడు. క్రీస్తు సంఘస్తుడు కాదు.


9. ఒక రోజున క్రీస్తు తన సంఘాన్ని(రాజ్యాన్ని) తన దేవునికి అప్పగించనున్నాడు. "అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.౹ ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.౹" (1 కొరింథీయులు 15:24-25). 


➡ క్రీస్తు సంఘమే = దేవుని రాజ్యం ✔️

➡ తన తండ్రికి అప్పగింపబడే రాజ్యం

➡ క్రీస్తు రాజ్యం లేదని, ఇంకా రానుంది అని, 1000సం. ఏలుబడి జరుగును అనేది పూర్తిగా అపోస్తలుల బోధకు వ్యతిరేకమైన బోధ 📖❌


👉 క్రీస్తు సంఘము దేవుని అనాది సంకల్పములో

నాలుగవ ప్రధాన విషయం

క్రీస్తు రక్తముతో కొనబడిన శరీరము(సంఘము), దేవుని నివాసస్థానం, తండ్రికి అప్పగించబడే రాజ్యము, సంఘము లేకుండా దేవుని అనాది సంకల్పము సంపూర్ణం కాదు.


[E]. ఐదవ సంకల్పము – క్రీస్తు స్వరూపములోకి ఎదగుట

దేవుని అనాది సంకల్పములో ఐదవ మరియు తుదిముఖ్యమైన విషయం

✨ క్రీస్తు స్వరూపములోకి ఎదగుట.

క్రీస్తు బలి ద్వారా విమోచన జరిగింది. అపోస్తులుల బోధ ద్వారా రక్షణ ప్రకటించబడింది.

దత్తత స్వీకారం ద్వారా మనము దేవుని కుమారులయ్యాము. క్రీస్తు శరీరములో అనగా క్రీస్తు సంఘములో మనము కట్టబడ్డాము.

అయితే దేవుని ఉద్దేశ్యం ఇక్కడితో పూర్తికాలేదు.

దేవుడు తన పిల్లలు పరిపక్వులై, క్రీస్తువలె మారాలని అనాదిలోనే నిర్ణయించాడు.


1. దేవుడు మనలను కేవలం రక్షించడానికే కాదు, క్రీస్తు స్వరూపమునకు సమానులుగా చేయడానికే ముందుగా నిర్ణయించాడు.  "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.౹ మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను." (రోమీయులు 8:29-30)


📖 ఇది దేవుని అనాది లక్ష్యం

ఎవరిని ముందుగా నిర్ణయించెనో

                    ⬇️

వారిని పిలిచెను

                    ⬇️

నీతిమంతులుగా తీర్చెను

                    ⬇️

వారిని మహిమ పరచెను


2. క్రీస్తు స్వరూపములోకి ఎదగడం అనగా మాటలలో క్రీస్తువలె, ఆలోచనలలో క్రీస్తువలె, ప్రవర్తనలో క్రీస్తువలె, విధేయతలో క్రీస్తువలె మారుట. ఇది నిరంతర ప్రక్రియ ఒక్క రోజులో జరిగేది కాదు మరియు వ్యక్తిగతంగా మాత్రమే కాదు ఈ కార్యక్రమం సంఘములోనే జరుగుతుంది. “సంపూర్ణులగునట్లు… క్రీస్తు శరీరమును అభివృద్ధి చేయుటకు” (ఎఫెసీయులు 4:11–13) “మరియు ఇకమీదట పిల్లలుగా ఉండక… ప్రతి విషయంలో ఆయనయందు ఎదుగుదము” (ఎఫెసీయులు 4:14–15) సంఘము లేకుండా పరిపక్వత లేదు. ఒంటరి విశ్వాసం బైబిలు బోధ కాదు. 


3. క్రీస్తు స్వరూపములోకి ఎదగుట = శ్రమతో కూడిన పని. ఈ ఎదుగుదల సులభమైనది కాదు.

ఇది అంతర్గత పోరాటాన్ని కలిగి ఉంటుంది. "నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడువరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.౹" (గలతి. 4:19)

➡ శ్రమ

➡ శిక్షణ

➡ సరిదిద్దుట

➡ సహనం

ఇవన్నీ ఈ సంకల్పంలో భాగమే.


4. ఐతే రెండు విషయాల్లో క్రీస్తు స్వరూపములోకి ఎదగుటకు సాధ్యపడును. 

మొదటిది  “మీరు ఆయన అడుగుజాడలలో నడవునట్లు ఆయన మీకు మాదిరి విడిచిపెట్టెను” (1 పేతురు 2:21) క్రీస్తు స్వరూపములోకి ఎదగుట అనేది ఆయన జీవితాన్ని అనుసరించడం ద్వారానే జరుగుతుంది.


➡ నీ జీవితం క్రీస్తు అడుగు జాడలు మీద లేకపోతే

➡ ఆ క్షణమే ఎదుగుదల ఆగిపోతుంది


రెండోవది “... విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము…”. (హెబ్రీ. 12:2)

➡ నీ చూపు క్రీస్తు మీద లేకపోతే

➡ ఆ క్షణమే ఎదుగుదల ఆగిపోతుంది


5. క్రీస్తు స్వరూపములోకి ఎదిగిన ఆ ఒక్క క్రీస్తు సంఘాన్ని మాత్రమే క్రీస్తు తన ప్రత్యక్షతలో తండ్రికి  అప్పగించనున్నాడు. “ఆయన రాజ్యమును దేవుడైన తండ్రికి అప్పగించును” (1 కొరింథీయులు 15:24)

➡ అపరిపక్వ సంఘం కాదు

➡ పరిపక్వమైన, క్రీస్తువలె మారిన క్రీస్తు సంఘమునే. 


👉 క్రీస్తు స్వరూపములోకి ఎదగుట

దేవుని అనాది సంకల్పములో రక్షణకు లక్ష్యం మరియు సంఘ జీవితం యొక్క ఉద్దేశ్యం. దేవుడు మనలను కేవలం రక్షించలేదు, కేవలం సంఘములో చేర్చలేదు, క్రీస్తువలె మారాలని అనాదిలోనే నిర్ణయించాడు.


5️⃣. ముగింపు

మన తండ్రియైన దేవుడు(YHWH) క్రీస్తు బలి ద్వారా మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి, మనలను విమోచించాడు ↪ అపోస్తులుల బోధలోకి పిలిచాడు ↪ దత్తతలో కుమారులయ్యాము ↪ సంఘముగా కట్టబడ్డాము/కట్టాడు ↪ చివరిగా క్రీస్తు స్వరూపములోకి ఎదగుటే తుదిలక్ష్యం.

మీ ఆత్మీయులు👪

ఆరాధ్య దైవం ఒక్కడే 👤



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


పరిశుద్ధ గ్రంథము సూచించిన కాలములు అనగా "పితరుల కాలం" (ఆదికాండం 1వ అధ్యా. To నిర్గమకాండం 19వ అధ్యా.), "మోషే కాలం/ధర్మశాస్త్ర కాలం"  (నిర్గమకాండం 20వ అధ్యా. To అపోస్తులుల కార్యములు 1వ అధ్యా), మరియు "క్రైస్తవుల/క్రీస్తు కాలం" (అపోస్తులుల కార్యములు 2వ అధ్యా. నుండి నేటి వరకు…) లో గల విశ్వాసులు ఒకే దైవమును ఆరాధించారు. ఆయనే – యెహోవా(YHWH).


ఇది గ్రహించక, ఆలోచించక, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రామాణికంగా తీసుకొనలేక  కొందరు క్రైస్తవులు తమకు బహు(ఇద్దరు/ముగ్గురు) ఆరాధ్య దైవములు కలరని బోధిస్తూ, వాక్యమును వక్రీకరిస్తూ, మనకు తోచినట్టుగా ఆరాధించవచ్చు అనే భావనలో ఉండి, అపవాది యొక్క తంత్రములను ఎరుగక వాడి ఉద్దేశ్యమును నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇటువంటి స్వేచ్ఛారాధికుల భారిన పడకుండా సత్యాన్ని ఎల్లప్పుడూ అన్వేషించే శోత్రులకు అర్థమగుటకు లేఖనములను ఆధారముగా చూపిస్తూ "ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH) తండ్రి మాత్రమే" అని తెలుపుటయే ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది. 


ఆరాధన యొక్క నిర్వచనం :

యెహోవా మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మహోన్నతుని ఆదేశాల ప్రకారము క్రమబద్ధమైన విధానములో జరిగించేది ఆరాధన అనబడుతుంది". (2 దినవృత్తా. 29:20-30 పోల్చి చూడుము).


1️⃣.  పితరుల కాలం :

ఆరాధన అనే ఆలోచన మనిషి యొక్క ఆలోచనలు నుండి పుట్టలేదు. దేవుడైన యెహోవాయే దీనిని స్వయంగా స్థాపించాడు. ఆదాము నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వరకు మనుష్యులు ఆరాధించిన దైవం ఒక్కడే ఆయనే యెహోవా.


👤ఆదాము :  "చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని,... " (ఆది.కాం. 3:8). ఆదాము మరియు అతని భార్య యెహోవాతో సంప్రదింపులు/ అంత గొప్ప సహవాసం కలిగి ఉండేవారు. ఆరాధన అనే పదం అక్షరార్ధముగా లేకపోయినప్పటికి ఆదాము తన దేవుడికి లోబడే స్థితి, స్వభావం, సహవాసం మరియు  క్రమశిక్షణను  బట్టి నిర్ణయించుకోగలం. వారికి బాగుగా తెలుసు తమ సృష్టికర్త ఎవరో, తమ దేవుడు ఎవరో, తమ ఆరాధ్య దైవం ఎవరో అనే సంగతులు. మరి ముఖ్యముగా దేవుడే ఆదాముకు బలిపద్దతి నేర్పించాడు. ఆదాము తాను స్వయముగా దేవునికి బలి అర్పించినట్టుగా గ్రంథములో వ్రాయబడనప్పటికీ తన బిడ్డలైన హేబెలు & కయీను దేవునికి బలి అర్పించారు.


👤 హేబెలు & కయీను : హేబేలు కయీను లు తమ దేవుడైన యెహోవాకు తమ అర్పణలు అర్పించిన ఆరాధికులే. అయితే హృదయపూర్వకంగా అర్పించిన హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు అయితే యదార్థమైన హృదయముతో కాక తనకు నచ్చినట్టుగా అర్పించిన అర్పణ దేవుడు లక్ష్యపెట్టలేదు .... ఆదాము కుమారులైన హేబేలు కయీను  దేవుని ఆరాధన చేశారు అని చెప్పుటకు వారు అర్పించిన అర్పణలే నిదర్శనం... (తండ్రి నేర్పించకుండా బిడ్డలకు ఏలాగున తెలియును!?). 

 "హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను;౹" (ఆది.కాం. 4:4). 

"కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.౹" (ఆది.కాం. 4:3). 


👤ఎనోషు : "...షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది." (ఆది.కాం. 4:26)


👤నోవాహు : తనను జల ప్రళయము నుండి కాపాడిన దేవునికి  పవిత్రమైన వాటిని దహనబలిగా అర్పించుట ద్వారా నోవాహు  దేవున్ని ఆరాధించెను. అతను అర్పించినది దేవునికి అంగీకారమైనది. 

"అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.౹ అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి– ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.౹" (ఆది.కాం. 8:20-21)


ఇలా చూస్తుపోతే దేవున్ని ఆరాధించిన పితరుల జాబితాలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు  కూడా ఉన్నారు. ఈ ముగ్గురు యెహోవా పేరిట బలిపీఠములు కట్టారు. తమను నడిపించిన దేవునికి ప్రార్థన చేశారు. తమ దేవుడైన యెహోవానే  ఆరాధించారు.


👤అబ్రహాము : "యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి— నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.౹ అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹" (ఆది.కాం. 12:7-8) "నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.౹" (ఆది.కాం. 24:4)


👤ఇస్సాకు : "అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై– నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.౹ అక్కడ అతడొక బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.౹" (ఆది.కాం. 26:23-25)


👤యాకోబు : "దేవుడు యాకోబుతో– నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుటనుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన యింటివారితోను తనయొద్దనున్న వారందరితోను– మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమదినమున నా కుత్తర మిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.౹ వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.౹ వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.౹ యాకోబును అతనితోనున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.౹ అతడు తన సహోదరుని యెదుటనుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరుపెట్టిరి.౹" (ఆది.కాం.35:1-7). "విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.౹" (హెబ్రీ. 11:21). 


"మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా అని..."(నిర్గమ. 3:15) చెప్పినమాట మీరు చదువలేదా? పితరుల కాలం దేవుడు తన్ను తాను ఇలా కనపరుచుకొనెను కదా.



2️⃣. ధర్మశాస్త్రము/మోషే కాలం :

పితరుల కాలంలో  అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తాను సర్వశక్తిగల దేవుడనని పరిచయం చేసుకున్న దేవుడు  మోషేతో తన నామమును "నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని" పరిచయం చేసుకొనెను. (నిర్గమ. 3:14) "నేను యెహోవాను…(YHWH)". 

"నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.౹" (నిర్గమ. 6:3).


ఇశ్రాయేలీయులు తమది కానీ  ఐగుప్తు దేశములో 4౦౦ సం. పైబడి  బానిసలుగా నున్న(నిర్గమ. 12:40-41) పిమ్మట దేవుడు  మోషేకు నాయకత్వ బాధ్యతను అప్పగించి  వారిని  ఫరో బానిసత్వం నుండి విడిపించి, ఎర్ర సముద్రం గుండా నడిపించి, సీనాయి పర్వతము యొద్దకు చేరిన  తరువాత ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనలో ముఖ్యమైన ఆజ్ఞను వారికి జారీ  ఏమనగా… "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.౹" (నిర్గమ. 20:3-4).

అప్పటినుండి వారు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేస్తూ వచ్చారు.,,


✅ యూదులు/ఇశ్రాయేలీయుల  యొక్క ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH).

🔖 "ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.౹ నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.౹" "నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.౹" (ద్వితీయో. 6:4-5; 10:20)


🔖 "యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీపితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.౹" (యెహోషువ. 24:15)


🔖యెహోవాను ఆరాధించు స్థలమొకటి….(2సమూ. 15:32)

🔖యెహోవాను ఆరాధించి స్తుతించిరి. (2దిన. 7:3)

🔖యెహోవాకు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి (2దినవృత్తాంతములు. 29:25-30)

🔖యెహోవా మందిరములో ఆరాధించుటకై (యిర్మియా. 26:1-2)

🔖యెహోవాకు ఆరాధన చేయవలెను (యెహెజ్కేలు. 46:3). 

🔖"...  యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు...." (యోహాను. 4:21)


✅ సమరయులు యొక్క ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH).

సమరయులు కూడా ధర్మశాస్త్ర కాలానికి చెందినవారే. యూదులు యెరూషలేము దేవాలయములో యెహోవా దేవున్ని ఆరాధిస్తే... సమరయులు ఏమో గెరిజిమ్ అనే పర్వతం మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ యెహోవా దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు. మోషే గారు వ్రాసిన పంచకాండాలు(5 పుస్తకాలు) మాత్రమే దేవుని వాక్యం అని సమరయులు నమ్ముతారు. ఇందులో నిర్గమ.కాం. 20:17 వచనము తమకు అనుగుణముగా మార్చుకొని గెరిజిమ్ పర్వతం మీద యెహోవా దేవున్ని(తండ్రిని) ఆరాధించేవారు. 


యేసుకు మరియు సమరయ స్త్రీకి మధ్య జరిగిన  సంభాషణలో సమరయులు కూడా యెహోవా దేవున్నే ఆరాధిస్తారనే విషయం  స్పష్టమైనది .  

"మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹" (యోహాను. 4:20-21).


ధర్మశాస్త్ర కాలములో ప్రజలచేత ఆరాధింపబడిన ఏకైక  దేవుడు యెహోవా (𝐘𝐇𝐖𝐇) మాత్రమే. 



3️⃣.  క్రీస్తు లేదా క్రైస్తవుల కాలం :

ఆనాడు పితరుల  కాలములో నూ, ధర్మశాస్త్ర కాలములోనూ భక్తులచేత/విస్వాసులచేత ఆరాధింపబడిన ఆ యెహోవా దేవుడే, నేడు క్రైస్తవులచేత కూడా  ఆరాధింపబడుటకు పాత్రుడు అని యేసు బోధించాడు. యేసు శరీరధారిగా ఉన్న దినాలలో బోధించిన బోధ నీటి క్రస్తావులకు ప్రామాణికంగా ఉండాలి. యేసు, తాను తండ్రికి ప్రార్థన  చేసాడు మనలను కూడా తండ్రికి ప్రార్థించమని చెప్పాడు. తాను తండ్రికి విధేయత చూపాడు మనలను కూడా తండ్రికి విధేయత చూపమని మనకు మాదిరిని ఉంచాడు. తాను తండ్రిని ఆరాధించాడు మనలను కూడా తండ్రికి ఆరాధన చేయమని, తండ్రికి ఆరాధన చేయువారినే తండ్రి వెదుకుతున్నాడని హెచ్చరించాడు. 


"యేసు వానితో– సాతానా, పొమ్ము — ప్రభు వైన నీ దేవునికి(YHWH) మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను." (మత్తయి. 4:10). పరిశుద్ధుడవైన తండ్రీ,(యోహాను 17:11) నీతి స్వరూపుడవగు తండ్రీ, (యోహాను. 17:25) ఆయన పరిశుద్ధ నామముతోనే ప్రార్థన చేశారు.


"మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹" (యోహాను. 4:22) [ మేము] అనే మాటలో తాను (యేసు) కూడా ఉన్నాడనే సంగతి తెలియడం లేదా? ఇంకా అర్థము కానిచో  యేసు తండ్రిని ఆరాధించాదనుటకు క్రింది లేఖనములే ఋజువులు…


🔖 8వ దినమున/సున్నతి పొందుటకు - లూకా. 2:27-28

🔖 12వ ఏటా - లూకా. 2:41-42

🔖 30వ ఏటా - యోహాను. 2:13,23

🔖 31వ ఏటా - యోహాను. 6:4; 7:2,8- 14; 10:22

🔖 32వ ఏటా - యోహాను. 11:55-56; 12:1-20; 

🔖 33వ ఏటా - మత్తయి. 26:17-20; యోహాను. 19:14; లూకా. 22:1


"ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను, వారములపండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.౹" (ద్వితీయో. 16:16).


✅  సంఘము తో కలసి తండ్రిని ఆరాధించుటలో

తండ్రిచేత ప్రభువుగాను, క్రీస్తుగాను నియమింపబడిన యేసు నేడు తన సంఘముతో (శరీరముతో) కలిసి తండ్రిని ఆరాధిస్తాడు.  

"పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక –నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు –నే నాయనను నమ్ముకొనియుందును అనియు –ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.౹" (హెబ్రీ. 2:11).


✅ క్రైస్తవుల ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే తండ్రి 

ఎవరైతే   యేసును తమ  నోటితో ప్రభువుగా(రాజుగా) ఒప్పుకొని, దేవుడు(YHWH) మృతులలోనుండి యేసును లేపెనని తమ  హృదయమందు విశ్వసిస్తారో వారు  రక్షింపబడుదురు. (రోమా. 10:9; ఫిలిప్పీ. 2:11). ఇలా నోటితో ఒప్పుకొని, బాప్తీస్మం పొంది, క్రీస్తు సంఘముగా చేర్చబడి, ప్రభువైన యేసుక్రీస్తు ఏలుబడి క్రింద ఉంటూ, యేసు బోధను అనుసరిస్తూ, యేసును దేవుని కుమారుడిగా, క్రీస్తుగా, ప్రభువుగా గౌరవించి, యేసు ద్వారా తండ్రిని ఆరాధించి , ప్రార్థన చేసి , భక్తి, విధేయత చూపి, అపోస్తులల బోధలో తమ జీవితాలను సరిచేసుకొంటూ, విశ్వాస యాత్రలో వెనుదిరుగక తమ జీవితాలను  కొనసాగించేవారే క్రైస్తవులుగా పిలువబడుతారు .(అపో. కార్య. 2:36-42; 8:37; 9:20; 10:36; 47, 1కోరింది 1:2; 12:3; రోమా 16:16; 2 దేస్స. 2:15). 


ఇట్టి వారందరికి అనగా క్రైస్తవులకు దేవుడు  ఒక్కడే ఆయనే తండ్రి (1 కోరింది. 8:6). ఆ ఒక్క దేవుడే అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. (ఎపేసి. 4:6). ఆ ఒక్క దేవుడికే క్రైస్తవులు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలనేది ప్రభువైన యేసు యొక్క అజ్ఞా. (యోహాను. 4:21-24) ఆ ఒక్క దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆరాధన మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, పరిశుద్ధాత్మ వలన ఆరాధించాలనేది క్రొత్త నిబంధన స్పష్టత ఇస్తుంది. (కొలస్సి. 3:17; ఎపేసి. 2:18; ఫిలిప్పీ. 2:11; 3:3). 


🔎 Note : మనకు/అందరికి దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే 👤 అని అర్ధం. ఒక్కడే అనే స్థానములో ఇద్దరిని లేదా నలుగురిని 👥 పెట్టడం పూర్తిగా వాక్య వక్రీకరణ అగును కదా.. ఆలోచించుకో… 


📌 ముగింపు

ఓ చదువరి… అన్ని కాలాల్లో ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH) తండ్రి మాత్రమే అనే సంగతి గట్టిగా గుర్తించుము. ఆ యెహోవాయే మన దేవుడు ఆయన ఒక్కడే అనగా అద్వితీయుడు. (ద్వితీయో. 6:4; మార్కు 12:29; యోహాను.17:3) క్రొత్త నిబంధన ప్రకారం ఆయనే అందరికి తండ్రియైన దేవుడు. (ఎపేసి. 4:6). యేసు మాటల్లో దేవుడొక్కడే(లూకా. 18:19) యెహోవాను(తండ్రిని) మాత్రమే ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుము(యోహాను. 4:24). 


🔥 యేసుక్రీస్తుని  కూడా ఆరాధన చేస్తాము/చేయచ్చు   అని  తలస్తున్నవారికి ఒక ప్రశ్న, సంఘముతో అనగా  తన శరీరముతో కలిసి తండ్రిని ఆరాధన చేసే యేసుక్రీస్తు తనని తాను ఏలాగు ఆరాధించుకుంటాడు? అలా ఆరాధించాడు అనుటకు ఋజువులు ఏమిటి? ఆలోచన చేయండి 🙏 

మీ ఆత్మీయులు 👪


▼ మరెన్ని అంశాలు కొరకు ▼

↪  ఆరాధన కోరిన దేవుడు ఎవరు?క్లిక్ చేయు

↪ దేవుడు ఒక్కడే అంటే ఎవరికి?క్లిక్ చేయు

↪ యేసు ఆరాధింపబడ్డారా?క్లిక్ చేయు

↪ యేసు తన్ను సేవించమనే కోరారు క్లిక్ చేయు

↪ యెహోవా దేవుడే యేసుగా వచ్చారా?క్లిక్ చేయు

↪ ఆరాధనలో యేసు యొక్క పని?క్లిక్ చేయు

The churches of Christ greet you - Roma 16:16