మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
క్రైస్తవులు యేసును ఆరాధన చేస్తారని, క్రైస్తవులకు దేవుడు యేసు అని లోకము అనుకుంటూ ఉంటుంది. వారు మాత్రమే కాక క్రైస్తవులు అనబడే అనేక వారిలో వాస్తవమైన సమాచారం తెలియక ఈ విషయాన్ని నమ్ముతూ అనేక వివిధ కార్యాలు, బోధలు జరిగిస్తూ ఉన్నారు. కారణం సత్యవాక్యమును సరిగా విభజించు వానిగా లేకపోవడం మరియు ఆరాధన గూర్చి సరైన అవగాహన లేకపోవడమే. ఇందుకోసమే పరిశుద్ధ గ్రంథములో నిజముగా "యేసు ఆరాధింపబడ్డారా?" లేక "యేసు ఆరాధన చేశారా?" అనే రెండు విషయాలు గూర్చి బైబిల్ ఏమి సెలవు ఇస్తుందో మనం వివరముగా ఆలోచించి నేర్చుకొనుటకై ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కావున చదువుతున్న ఏ ఒక్క సత్యాన్వేషి కూడా తొందరపడకుండా ఈ అంశమును కాస్త చివరి వరకు చదివి, ఆలోచించి, వాక్య పరిశీలన చేసి సత్యాన్ని స్వీకరించవలసిందిగా మా మనవి.
A. ఆరాధన యొక్క నిర్వచనం?
B. యేసు ఆరాధింపబడ్డారా?
C. యేసు ఆరాధన చేశారా?
A. ఆరాధన యొక్క నిర్వచనం?
యెహోవా మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మహోన్నతుని ఆదేశాల ప్రకారము క్రమబద్ధమైన విధానములో జరిగించేది ఆరాధన అనబడుతుంది". (2 దినవృత్తా. 29:20-30 పోల్చి చూడుము).
మోషే/ధర్మశాస్త్రము కాలములో ఆరాధించిన విధానం గూర్చి మనం 2దినవృత్తా. 29:20-30 వచనములు వరకు స్పష్టముగా చూడగలం. 1). బలులు అర్పించుట, 2) లేవీయులు వాయిద్యములు వాయించుట, 3) యాజకులు బూరలు ఊదటం, 4). నాదము చేయుట, 5). గాయకులు పాడటం, 6). స్తుతి గానము ఆరంభము 7). యాజకులు బలిపీఠము మీద రక్తం ప్రోక్షించుట, 8). తలలు వంచి ఆరాధించటం... ఈలాగున ధర్మశాస్త్రము కాలములో యెరూషలేము లోనున్న యెహోవా మందిరంలో దేవుడు ఆజ్ఞాపించిన విధంగా, దేవుడు కోరిన విధంగా జరిగించుటయే ఆరాధన అవుతుంది.
ఇలాగే జరిగించాలని దేవుడే తన ప్రవక్తల ద్వారా ముందుగా ఆజ్ఞాపించియుండెను కదా(25వ). అట్టి ఆరాధన పై లక్ష్యంముంచి ఆయన తన అంగీకారాన్ని ప్రసాదిస్తాడు. యెహోవా దేవుడు కోరనది జరిగిస్తే అది ఎన్నటికి ఆరాధన అనబడదు. వీలైతే మరింత వివరణ కోసం "ధర్మశాస్త్రం కాలములో ఆరాధన" అనే అంశము ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నము చేయుము.
B. యేసు ఆరాధింపబడ్డారా?
లేదు ≈ మీరు సమాధానం విని ఉలిక్కి పడకుండా జాగ్రత్తగా ఆలోచన చేయుటకు పరమదేవుని కృప అనుగ్రహింపబడాలని నా ప్రార్థన. 🙏🏿
దేవుడు తన కుమారుడిని పంపాలని ముందుగా సంకల్పించిన ప్రణాళికను(1 పేతురు. 1:18-20) కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకములోనికి స్త్రీయందు జన్మింపజేసి, ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విడిపించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడుగా జేసెను కదా(గలతీ. 4:3). పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. (రోమా. 9:5). యేసు ఒక యూదుడు/యూదా గోత్రపు వాడు (లూకా. 1:32; రోమా. 1:3; యోహాను. 4:9). ఒక యూదుడుగానే బ్రతుకుతూ తన గూర్చి ముందుగా పలికిన వాటిని అనగా ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల లేఖనాలను నెరవేర్చుటయే దేవుడు అనుగ్రహించిన పని (మత్తయి. 5:17) దానిని నెరవేర్చి తండ్రిని మహిమ పరిచారు.(యోహాను. 17:4).
ఇట్టి పనిని జరిగించే సమయములో తన యందు విశ్వాసులైన వారిని లేక శిష్యులైన వారి నుండి ప్రభువైన యేసు కోరింది ఆరాధన కాదు. మరి ఏమి కోరారు? యేసు ఇలా ఆదేశించాడు: "ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును." (యోహాను. 12:26). "సేవించుట(Serve)" అంటే "ఆరాధించుట(Worship) కాదు" అనే విషయాన్ని ముందుగానే వ్రాసాను ఈ అంశము చివరిలో పెడతాను క్లిక్ చేసి చదవండి.
ప్రభువైన యేసును జనులు సేవించాలనేది ధర్మశాస్త్రం కాలములో దేవుడే ముందుగా యూదులకు స్పష్టం చేశారు. "సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– నీకున్న కాడి నీ మెడ నుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించు కొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.౹" (యిర్మీయా. 30:8-9) ఈ ప్రవచన వాక్యములోని ఈ దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తే!! మరొక్క విషయాన్ని కూడా గమనిద్దాం. "నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను.౹ వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.౹ యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను." (యెహెజ్కేలు. 34:22-24). ప్రభువైన యేసును దావీదుగా ప్రవచించిన సందర్భమే కానీ అప్పటికే దావీదు చనిపోయి రమారమి 500సం. అయ్యింది మరల తిరిగివస్తాడని కాదు. కావున ప్రవక్తలైన యిర్మీయా, యెహెజ్కేలునకు వారి ప్రవచనంలో దావీదుగా చెప్పబడిన క్రీస్తును సేవించడం తండ్రి యొక్క చిత్తమని ఇకనైనా గుర్తించుము.
మీరు యేసును ఎంతగా ప్రేమిస్తున్నారో అంతగానే మేము ప్రేమిస్తున్నాం. ఆయన మాటకు లోబడుతున్నాం. ఐతే బైబిల్లో యేసు ఆరాధింపబడలేదు అనే విషయం వినగానే మీ మదిలో మెదిలే ఆలోచనలు, వచనాలు మాకు తెలియంది కాదు. ఈ విషయములో మీ ఆలోచనలు బట్టి యేసును మేము తక్కువ చేయడం లేదు, మా ఆలోచనలు బట్టి మేమేమీ ఎక్కువ చేయుట లేదు. బైబిల్ ప్రకారం ఆయన ఆరాధింపబడ్డారా లేదా అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తున్నాం.
ఇక మనం అనుకునే పాయింట్ కి వచ్చేద్దాం. ఆరాధన యొక్క నిర్వచనం జాగ్రత్తగా మన మదిలో పెట్టుకొని ఆలోచిస్తే... ధర్మశాస్త్రం కాలములో ఆరాధన అనేది యెరూషలేము మందిరం/దేవాలయములోనే యెహోవా దేవునికే జరిగేది (2 దిన. 29:20,25; యెహెజ్కేలు. 46:3). నీవు చూచిన ప్రతీస్థలమున నీ దహనబలులు అర్పింపకూడదు. యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్ధలముననే నీ దహనబలులు అర్పించి, నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగించవలెను. (ద్వితీయో. 12:13-14) "–యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవామందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాట లన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.౹"(యిర్మీయా. 26:2). "నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపెట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును. ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము. (కీర్తనలు. 55:12-14) ఎక్కడంటే అక్కడ జరిగేది ఆరాధన కాదు. ఎవరికి తోచినట్టుగా వారు జరిగించేది ఆరాధన కాదు కనుక వారి ఆరాధన విధానమనేది దైవ చట్టం ప్రకారముగానే జరిగేది. ఇశ్రాయేలీయులకు తమ ఆరాధ్యదైవం ఎవరో బాగుగా తెలుసు, ఎక్కడ, ఎలా ఆరాధన చేయాలో కూడా తెలుసు. అట్టి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం చట్టం ప్రకారముగానే యేసును ఆరాధన చేశారని (లేదా) యేసు ఆరాధింపబడ్డారని మనం ఎలా అనుకోగలం? ఆలోచించుకోండి.
1. ప్రభువైన యేసు రక్తమాంసములలో పాలివాడైన నాట నుండి ఆయన్ను పశువుల పాకలో దర్శించరావడం(లూకా. 2:8-14), జ్ఞానులు సాగిలపడి ఆయన్ను పూజించడం(మత్తయి. 2:1-11) కుష్టరోగి వచ్చి ఆయనకు మ్రొక్కెడం (మత్తయి. 8:1-2) కనాను స్త్రీ మ్రొక్కడం(మత్తయి. 15:25) జెబెదయి కుమారుల తల్లి ఆయనకు నమస్కారము చేయడం(మత్తయి. 20:20)...Etc ఆయా పదాలు గలవాటికి ఇంగ్లీష్ లో worship ఉన్న, గ్రీకు లో proskuneō(G4352) ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికి వారు చేయునది ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధన అనబడదు. వారు చేసిన స్థలం కూడా ఆరాధన స్థలం కాదు. వారు చేసినది స్వేచ్ఛారాధనే కానీ దేవుని అజ్ఞా పూర్వకముగా చేసిన కార్యక్రమము కాదు. వారు చేసిన పూజ కూడా మనకు ప్రామాణికం కాదు సుమీ!!
2. వారు చేయునది ఆరాధనే, అదిగో అర్థాలు చూడు, పదాలు చూడు, యేసు అడ్డు చెప్పలేదంటే వారి ఆరాధనను అంగీకరించారనే కదా అనే ఆలోచన మీకు ఉంటే... "ధర్మశాస్త్రం యింకను నిలిచియుండగా ఇశ్రాయేలీయులు క్రీస్తు అను వేరొక పురుషుని చేరినట్లయితే వ్యభిచారిణి అనబడును కదా" (రోమా. 7:1-4 వాక్యం చదువు). ప్రభువైన యేసు తన్ను ఆరాధింపమని కోరిన లేదా ఆజ్ఞాపించిన లేదా స్వీకరించిన ఆత్మ సంబంధమైన వ్యభిచారములోనికి అనాటి యూదులను నడిపించాడనే నేరము ఆయన మీద నీవు మోపినట్టు అవుతుంది జాగ్రత్త!!
3. యేసు ≈ ఒక ప్రవక్త(యోహాను. 4:44; అపో.కార్య. 3:22-23) ప్రధానయాజకుడు(హెబ్రీ 4:14; 7:22-24), రాజు(యోహా 18:37), అపోస్తలుడు(హెబ్రీ 3:1)... ఆయా వారు ధర్మశాస్త్రం కాలము యెరూషలేము మందిరములో యెహోవా దేవున్ని ఆరాధించారు కానీ ఆరాధింపబడలేదు.
4. చివరిగా... మరింత గొప్పగా ఆలోచించి యేసుకి సాగిల పడటం, మ్రొక్కటం, నమస్కారం...Etc. ఇది క్రొత్త నిబంధన ఆరాధన అంటావేమో... మీ కోసమే "ఆరాధన కోరిన దేవుడు?" అనే అంశము ముందుగా వ్రాసాను అది చదువుము.
B. యేసు ఆరాధన చేశారా?
అవును ≈ ఈ భూనివాస కాలములో మన ప్రభువైన యేసు తన తండ్రిని (లేదా) తన దేవుడును ఆరాధించినవాడనేది నిరాక్షేపం!! సుఖారు అనే ఒక ఊరిలో నున్న బావి యొద్ద సమరయ స్త్రీతో యేసు మాట్లాడినప్పుడు ఈ విషయం తేటపరచబడింది. (యోహాను. 4:1-22). "–అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹" (21,22వ) నేను ఆరాధన చేయువాడినే... "నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను."(కీర్తన. 55:13). "మేము" మాకు తెలిసినదానిని ఆరాధించువారము అనే మాటలోనే తాను తన తండ్రికి ఆరాధన చేయువాడనే సంగతి మరుగైయున్నది అని గుర్తించుము.
ఆయన జన్మించిన నాటి నుండి మరణించిన వరకు కూడా ఏటేటా లేదా పండుగ దినాల్లో తన తండ్రిని ఆరాధించే ఆరాధికుడు అనే విషయం చివరిగా తెలుసుకో. (లూకా. 2:27-28; 2:41-42; 22:1; యోహాను. 2:13; 4:45; 6:4; 7:2; 7:8-14; 10:22; 11:55-56; 12:1-20; మార్కు. 14:1; మత్తయి. 26:17-20).
ఇప్పటికి తన శరీరమైన సంఘముతో కలసి తండ్రిని ఆరాధించుటకు వస్తున్నాడు అంటే ఏ మాత్రం ఆశ్చర్యపడనక్కర్లేదు. అది ఎలా? ఏ విధముగా? అనేది తదుపరి అంశము ద్వారా నేర్చుకుందాం. ఆరాధికుడైన తాను... ఇందుకే తన యందు విశ్వాసులైన వారికి, ఆయన శిష్యులకు, తన్ను ఆరాధించమని ఆదేశించినట్టుగా మనకు గ్రంథమందు కన్పించదు.
🔎 సారాంశము :
ఓ చదువరి... ఇక ఆలోచించి సత్యమేంటో, అసత్యమేంటో అనేది నిర్ణయించుకోవలసిన బాధ్యత నీదే... మన ప్రభువైన యేసు ఏనాడు తనను ఆరాధించమని కోరలేదని, తాను ఎవరి చేత ఆరాధింపబడలేదని మరియు తన తండ్రినే ఏటేటా లేదా పండుగ ఉత్సవ సమయాల్లో ఆరాధన చేయుటకు యెరూషలేముకి పోయేవాడని ఇంకను నీకు కానరాలేదా. సమస్తమైన విషయాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి, ఆయనకి లోబడి, ఆయన్ను ఆరాధించి(ఆరాధిస్తూ...) పరలోకము యెదుట ఈ లోకము యెదుట ఆయన్ను మహిమ పరిచి మనకు మాదిరి ఉంచిపోయిన ఆ యేసు యొక్క జీవితాన్ని నీవు మాదిరిగా తీసుకొంటే ఖచ్చితంగా వాస్తవాలను గ్రహించగలవు. ఎవరిని ఆరాధించాలో, ఎవరి ద్వారా ఆరాధించాలో తెలుసుకొని దైవ చిత్తానుసారుడవై జీవించగలవు.
మీ ఆత్మీయులు 👪
1. ధర్మశాస్త్రం కాలములో ఆరాధనత్వరలో
2. "సేవించుట(Serve)" అంటే "ఆరాధించుట(Worship) కాదు"క్లిక్ చేయు
3. ఆరాధన కోరిన దేవుడు?క్లిక్ చేయు
4. యెహోవా దేవుడే యేసు?క్లిక్ చేయు
5. నేటి ఆరాధనలో క్రీస్తు మనతో(సంఘము) కలసి తండ్రిని ఆరాధిస్తాడా?త్వరలో
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com