మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻
1️⃣. పరిచయం
మనము ఈ దినమున ధ్యానించబోయే అంశము “ఆది - అనాది - దేవుని అనాది సంకల్పము”. ఈ అంశము దేవుని యొక్క మనస్సును సరిగా అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైనది. ఎందుకంటే దేవుడు కాలం ప్రకారం యాదృచ్ఛికంగా పని చేసే వాడు కాదు; ఆయన ఆదికి ముందే, అనగా అనాదిలోనే, తన కార్యములన్నిటిని లెక్కచూసి నిర్ణయించుకున్న దేవుడు.
బైబిలు మనకు రెండు ముఖ్యమైన స్థితులను తెలియజేస్తుంది— ఆది మరియు అనాది.
☑ ఆది అనగా సృష్టి ప్రారంభం;
☑ అనాది అనగా సృష్టికి ముందున్న నిత్య స్థితి.
ఆ అనాది స్థితిలో దేవుడు కేవలం ఉన్నవాడే కాదు, తన చిత్తాన్ని, తన ఉద్దేశ్యాన్ని, తన సంకల్పాన్ని ముందుగానే నిర్ణయించినవాడై ఉన్నాడు.
ప్రభువైన యేసు లూకా 14:28–30లో ఒక గోపురము కట్టే ఉపమానం ద్వారా ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధించాడు— పని మొదలుపెట్టే ముందు లెక్కచూడాలి; లేకపోతే పునాది వేసి మధ్యలో ఆగిపోతే అపహాస్యం కలుగుతుంది. ఈ ఉపమానం మనుషుల విషయములో ఎంత సత్యమో, దేవుని విషయములో అంతకంటే ఎక్కువ సత్యం. దేవుడు పునాది వేసి మధ్యలో ఆగిపోయే వాడు కాదు. ఆయన ఏ పని మొదలుపెడితే, దానిని సంపూర్ణంగా పూర్తి చేయుటకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నవాడు. అందుకే దేవుని రక్షణ కార్యము ఒక సంఘటనగా కాక, ఐదు ప్రధాన సంకల్పాలుగా అనాదిలోనే ఏర్పాటు చేయబడింది.
ఈ ఐదు సంకల్పాలు విడివిడిగా ఉన్నట్లు కనిపించినా, అవన్నీ కలసి ఒకే నిత్య ఉద్దేశ్యాన్ని వెల్లడిచేస్తాయి. వాటన్నిటికీ కేంద్రబిందువు క్రీస్తు. ఈ ఐదు సంకల్పాలను మనము వాక్యాధారముగా పరిశీలించినప్పుడు, మన రక్షణ యాదృచ్ఛికమైంది కాదని, మన విశ్వాసం సంప్రదాయాల మీద కాదు గానీ దేవుని నిత్య సంకల్పం మీద ఆధారపడి ఉందని, మన సంఘ జీవితం ఒక మతాచారం కాదు గానీ దేవుని శాశ్వత ప్రణాళికలో భాగమని స్పష్టంగా గ్రహించగలుగుతాము.
కాబట్టి ఈ పరిచయంతో మనము ఇప్పుడు, దేవుడు అనాదిలో లెక్కచూసి ఏర్పాటు చేసిన ఐదు ప్రధాన సంకల్పాలను ఒక్కొక్కటిగా, క్రమంగా, వాక్యాధారముగా ధ్యానించుటకు ముందుకు సాగుదాం.
2️⃣. ఆది = సృష్టి ప్రారంభం
A]. ఆది అంటే ఏమిటి?
ఆది అనగా సృష్టి ప్రారంభమైన సమయం.
కాలం మొదలైన స్థితిని, జగత్తు ఉనికిలోకి వచ్చిన మొదటి క్షణాన్ని “ఆది” అని వాక్యం పిలుస్తుంది.
▪️(ఆది.కాం. 1:1): "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.౹
▪️ “ఆది” అనగా దేవుడు సృష్టిని ప్రారంభించిన సమయం
▪️ఆ సమయంలోనే కాలం, స్థలం, పదార్థం మొదలయ్యాయి
▪️“ఆది” అనేది దేవునికి ఆరంభం కాదు, సృష్టికి ఆరంభం మాత్రమే.
▪️ఆదికి ముందు కాలం లేదు.
▪️కాలం, దినములు, సంవత్సరాలు అన్నీ సృష్టితో పాటు వచ్చాయి. (ఆది. కాం. 1:5,14-15)
▪️దేవుడు కాలానికి ముందు ఉన్నవాడు. ఆది ద్వారా కాలంలోకి వచ్చి సృష్టి చేశాడు. (ఆది.కాం. 1:1; కీర్తనలు. 90:1-2)
B]. ఆదిలో ఎవరెవరున్నారు?
▪️మన తండ్రియైన దేవుడు(YHWH) ఉన్నాడు — (ఆది కాం. 1:1; యోహాను 1:1-2)
▪️మన ప్రభువైన యేసుక్రీస్తు(వాక్యము) ఉన్నాడు — (యోహాను. 1:1-2,14)
▪️ మన సత్యస్వరూపియైన ఆత్మ(పరిశుద్ధాత్ముడు) ఉన్నాడు — (ఆది కాం. 1:2; యోహాను 15:26).
▪️ఆదిలో దేవదూతలు ఉన్నారు — (యోబు. 38:4,7; ప్రకటన. 5:11)
▪️ఆది నుండే అపవాది ఉన్నాడు — (యోహాను. 8:44; ప్రకటన 12:9) — దేవదూత కాదు సుమీ.
3️⃣. అనాది = సృష్టికి పూర్వం
A]. అనాది అంటే ఏమిటి?
అనాది అనగా ప్రారంభం లేని స్థితి/జగత్తు పునాది వేయబడకమునుపు. అంటే సృష్టి మొదలుకాకమునుపు, కాలం/సమయం ఏర్పడకమునుపు ఉన్న నిత్య స్థితి.
ఆది = సృష్టి ప్రారంభం
అనాది = సృష్టికి పూర్వం
▪️(కీర్తనలు. 90:2): "పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు"
▪️సృష్టి కంటే ముందే దేవుడు ఉన్నాడు.
▪️దేవునికి ఆరంభం లేదు. ఆయన నిత్యుడు
▪️దేవుడు కాలానికి లోబడినవాడు కాదు
▪️అనాదిలో కాలం లేదు—దినాలు, సంవత్సరాలు లేవు.
▪️“నేనే మొదటివాడను, నేనే కడపటివాడను”
(యెషయా 44:6) ఇది కాల పరిమితి కాదు, నిత్యతను సూచిస్తుంది.
▪️అనాది ≠ శూన్యత అనగా అనాదిలో శూన్యత లేదు/కాదు. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని చిత్తం ఉంది, దేవుని సంకల్పం ఉంది.
▪️దేవుని సంకల్పాలు అనాదిలోనే నిర్ణయించబడ్డాయి.
B]. అనాదిలో ఎవరెవరున్నారు?
▪️మన తండ్రియైన దేవుడు(YHWH) ఉన్నాడు — (కీర్తనలు. 90:2)
▪️మన ప్రభువైన యేసుక్రీస్తు(వాక్యము) ఉన్నాడు — (యోహాను. 17:5)
▪️ మన సత్యస్వరూపియైన ఆత్మ(పరిశుద్ధాత్ముడు) ఉన్నాడు — (హెబ్రీ. 9:14; ఆది కాం. 1:2).
▪️ అనాదిలో దేవదూతలు ఉన్నారు — (యోబు. 38:4,7; ప్రకటన. 5:11)
▪️ అనాదిలో అపవాది లేడు — వాడు ఉన్నాడు అనుటకు ఒక్క వాక్య ఆధారము లేదు.
4️⃣. దేవుని అనాది సంకల్పము – ఐదు ప్రధాన విషయాలు
దేవుడు జగత్తు పునాది వేయబడకమునుపే మానవజాతి విషయమై…
➡ కొన్ని కార్యాలను తన మనసులో నిర్ణయించుకున్నాడు.
➡ వాటినే అనాది సంకల్పములు అంటాము.
📖 (లూకా. 14:28-30): "మీలో ఎవడైనను ఒక గోపురముకట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున చూచువారందరు– ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు."
✅ మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని దేవుని అనాది సంకల్పానికి అన్వయిస్తే:
✝️ క్రీస్తు బలి – పునాది
పాప సమస్యకు శాశ్వత పరిష్కారం ముందుగానే లెక్కచూసి నిర్ణయించబడింది
📖 అపోస్తులుల బోధ – నిర్మాణ విధానం
ఏ బోధ ద్వారా రక్షణ జరుగాలో ముందే నిర్ణయం
👨👩👧👦 దత్తత స్వీకారం – కుటుంబ స్థాపన/సంఘ స్థాపన
రక్షించబడినవారిని కుమారులుగా చేయాలనే ఉద్దేశ్యం
⛪ క్రీస్తు సంఘము – గోపుర నిర్మాణం
రక్షణ పొందినవారు ఒంటరిగా కాదు, సంఘంగా కట్టబడాలి
✨ క్రీస్తు స్వరూపములోకి ఎదగడం – పూర్తిస్థాయి ముగింపు
దేవుని పని అర్ధాంతరంగా కాదు; పరిపక్వతతో ముగియాలి
▪️మన దేవుడు ముందుగా లెక్కచూసి పని ప్రారంభించే దేవుడు
▪️ఆయన పునాది వేసి మధ్యలో ఆగిపోయే వాడు కాదు
▪️దేవుని అనాది సంకల్పము అసంపూర్ణమైనది కాదు
▪️అది ఆది నుండి అంతము వరకు పూర్తిస్థాయి ప్రణాళిక
కాబట్టి దేవుని అనాది సంకల్పములోని ఈ ఐదు ప్రధాన విషయాలు అనేవి యాదృచ్ఛికంగా ఏర్పడినవి కావు; అవి అనాదిలోనే అనగా సృష్టికి పూర్వమే లెక్కచూసి, పునాది వేసి, సంపూర్ణంగా పూర్తి చేయబడిన దేవుని నిత్య ప్రణాళిక.
[A]. మొదటి సంకల్పము – క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం
దేవుని అనాది సంకల్పములో మొట్టమొదటి మరియు అత్యంత ప్రాముఖ్యమైన విషయం
✝️ క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం.
ఇది దేవుడు ఆది తరువాత ఆలోచించిన కార్యం కాదు; ఇది పాపం వచ్చిన తరువాత తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం కాదు. జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు తన మనసులో మానవ జాతి విషయమై నిర్ణయించుకున్న నిత్య సంకల్పము.
1. క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం అనాదిలోనే నిర్ణయించబడింది — (1 పేతురు 1:18–20)
2. క్రీస్తు బలియాగం అనాదిలోనే నిశ్చయించిన సంకల్పము — (అపొస్తలుల కార్యములు 2:23).
➡ సిలువ = దేవుని సంకల్పము
➡ సిలువ = దేవుని ప్రణాళికలో కేంద్రబిందువు
3. క్రీస్తు బలియాగం ద్వారా దేవుడు ఉద్దేశించిన మూడు విషయాలు :
✝️ పాప ప్రాయశ్చిత్తము : పాపం చేసినవాడు శిక్షకు పాత్రుడు. కానీ దేవుడు మనల్ని శిక్షించకుండా, మన బదులుగా క్రీస్తును శిక్షించాడు. (యెషయా. 53:5; 1 పేతురు. 2:24) సిలువలో పాప సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగింది.
✝️ అపవాది అధికారమునుండి విమోచన : మనిషి పాపం వలన అపవాది అధికారంలో బంధింపబడతాడు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువయాగం, బలియాగం ద్వారా వాడి అధికారాన్ని కూల్చాడు. (హెబ్రీయులు 2:14; కొలస్సయులు 2:15)
➡ సిలువ = అపవాది ఓటమి
➡ సిలువ = మనుషుల విమోచన
✝️ మానవ జాతి యెడల దేవుని శాశ్వతమైన ప్రేమ ప్రకటింపబడింది : ప్రేమాస్వరూపియైన దేవుడు. తన ప్రేమను మానవజాతి యెడల మాటలతో కాకుండా కార్యం ద్వారా అనగా క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం ద్వారానే కనపరచాడు. ఎంత అద్భుతమైన ప్రేమ కదా. “మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మనకొరకు మరణించెను” (రోమా 5:8) దేవుని ప్రేమ చూడాలనుకుంటే సిలువవేయబడిన యేసును మాత్రమే చూడు స్పష్టముగా కనిపిస్తుంది.
4. పునాది లేకుండా గోపురం లేదు అలాగే క్రీస్తు బలియాగం లేకుండా అపోస్తుల బోధ లేదు, దత్తత స్వీకారం లేదు, క్రీస్తు సంఘము లేదు, క్రీస్తు స్వరూపములో ఎదగడం లేదు.
➡ క్రీస్తు బలి = దేవుని అనాది సంకల్పమునకు పునాది ✔️
[B]. రెండవ సంకల్పము – అపోస్తులుల బోధ
దేవుని అనాది సంకల్పములో రెండవ ప్రధాన విషయం
📖 అపోస్తులుల బోధ 📖
దేవుడు క్రీస్తు ప్రభువు యొక్క బలియాగంను అనాదిలోనే నిర్ణయించుకున్నట్లే, ఆ బలి ద్వారా కలిగే రక్షణను ఏ బోధ ద్వారా ప్రకటించాలో కూడా అనాదిలోనే నిర్ణయించాడు. అందుకే క్రీస్తు సిలువ బలి జరిగిన తరువాత, దేవుడు రక్షణను ప్రతి ఒక్కరి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకునేలా వదలలేదు. ఆ రక్షణను ప్రకటించుటకు ఒకే ఒక్క బోధను, అదే అపోస్తులుల బోధను నియమించాడు.
అపోస్తులలు ఏం బోధించారో ఆ బోధ యందే మనుషులు విశ్వాసం ఉంచాలి. ఆ బోధ కాకుండా మరొక బోధ మనుషులను రక్షించలేదు. ఎందుకంటే అనాదిలో సంకల్పించుకున్న తన సంకల్పాన్ని ఎవరి కోసము మార్చబడదు. అయ్యా నేను ఫలానా బోధ విని వచ్చాను, ఫలానా బోధ విని నేను బాప్తిస్మం పొందాను, ఫలానా సహవాసంలో నేను బతికాను అంటే చెల్లదు. కచ్చితముగా అపోస్తులుల బోదె వినాలి.
1. అపోస్తులుల బోధ అనేది అనాదిలోనే నిర్ణయించబడిన బోధ (రోమా 16:25–26). "దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.౹" (1కోరింది 2:7) ఇది మనుషుల ఆలోచన వలన పుట్టినది కాదు, లోక జ్ఞానం కాదు, వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని ప్రకటింపబడేది కాదు, మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనేది కాదు, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపబడేది కాదు. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు అనాదిలోనే తన మనసులో దాచుకున్న ఈ మర్మమును పరలోకం నుండి పంపబడిన ఇద్దరు ఉపాధ్యాయుల ద్వారా అపోస్తలులకు నేర్పబడింది అనే సంగతి తెలుసుకో.
2. యేసు మాటల్లో…. "అందుకు యేసు-నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹" (యోహాను 7:16). "ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.౹" (యోహాను. 14:26) "అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.౹"(యోహాను. 16:13)
3. దేవుడు ఈ బోధను యేసు ద్వారా అపోస్తులులకు అప్పగించాడు. (యోహాను 8:26,38; 12:49; 17:6-8; 16:13)
◾దేవుని బోదె = క్రీస్తు బోధ
◾క్రీస్తు బోదె = పరిశుద్ధాత్మడు బోధ
◾పరిశుద్ధాత్మడు బోదె = అపోస్తలుల బోధ
➡ అపోస్తులుల బోధ = తండ్రి చిత్తం
➡ అపోస్తులుల బోధ = క్రీస్తు బోధ
➡ అపోస్తులుల బోధ = పరిశుద్ధాత్మ సాక్ష్యం
✅ దేవుని బోధ + క్రీస్తు బోధ + పరిశుద్ధాత్ముడు బోధ = అపోస్తలుల బోధ (ఒకే ఒక్క బోధ)
4. అపోస్తులుల బోధ ఒక్కసారే అప్పగింపబడిన బోధ. — (యూదా 1:3).
📖 ఒక్కటే బోధ — (యూదా 1:3; అపో కార్య 2:42; 2దేస్స. 2:15)
📖 ఒక్కటే సువార్త — (గలతీ. 1:6-12)
❌ మరొక్క బోధ మరియు మరొక్క సువార్త లేదు, ఉండకూడదు… ఉంటే శాపగ్రస్తులే. (గలతీ. 1:8-9) పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థం చేసేవారు తమ స్వనాశనానికే కారణమవుతారు. (2 పేతురు 3:16)
✔️ ఆదిమ అపోస్తలలు చెప్పని మాటలు వినొద్దు. ఆఖరికి పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఇలా అలా చెప్పిన సరి వాని మాట కూడా నువ్వు వినొద్దు ఎందుకంటే ఒక్కసారి అప్పగింపబడినది అపోస్తలుల బోధ. ఆ బోధ యందే విశ్వాసం ఉంచాలనేది దేవుని అనాది సంకల్పం.
➡ అపోస్తులుల బోధ తప్ప
➡ మరొక బోధ నీకు రక్షణ ఇవ్వదు.
"నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు." (1 తిమోతి. 4:16)
5. అపోస్తులుల బోధ = నిర్మాణ విధానం
[C]. మూడవ సంకల్పము – దత్తత స్వీకారం
దేవుని అనాది సంకల్పములో మూడవ ప్రధాన విషయం
➡ దత్తత స్వీకారం.
క్రీస్తు బలి ద్వారా పాపం పరిష్కరించబడింది. అపోస్తులుల బోధ ద్వారా ఆ రక్షణ ప్రకటించబడింది. కానీ దేవుని ఉద్దేశ్యం అక్కడితో ఆగలేదు. దేవుడు కేవలం పాపులను క్షమించడమే కాక,
👨👩👧👦 తన కుటుంబంలోకి చేర్చుకోవాలని,
👨👩👧👦 తన కుమారులు, కుమార్తెలుగా చేసుకోవాలనేది అనాదిలోనే దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయమే దత్తత స్వీకారం.
1. దత్తత స్వీకారం అనాదిలోనే నిర్ణయించబడింది. “జగత్తు పునాది వేయబడకమునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొని…యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకు ముందుగా నిర్ణయించెను” (ఎఫెసీయులు 1:4–5).
2. దేవుడు ఎవరినీ నేరుగా కుమారులుగా చేయలేదు. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరిగింది. “కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను…మనము దత్తపుత్రులమగునట్లు” (గలతీయులు 4:4–5).
➡ క్రీస్తు లేకుండా కుమారత్వం లేదు
➡ క్రీస్తు బలి లేకుండా దత్తత లేదు
3. పాపం వలన మనిషి దేవుని కుటుంబానికి వెలుపల ఉన్నాడు. పాపంలో ఉన్నవాడు దేవుని కుమారుడు కాదు. విమోచన పొందినవాడే కుమారుడు అందుకే దత్తత అవసరమైంది.
4. దత్తత అనేది భావోద్వేగ నిర్ణయం కాదు;
ఇది చట్టబద్ధమైన చర్య. దేవుడు దీనికి సాక్ష్యంగా పరిశుద్ధాత్మను మన హృదయాలలో పంపించాడు. (గలతీయులు 4:6; 2 కొరింథీయులు 1:21–22)
➡ పరిశుద్ధాత్మ = కుమారత్వానికి ముద్ర
➡ దత్తతకు చట్టబద్ధమైన సాక్ష్యం
5. దత్తత పొందినవాడు ఇకపై దేవునిని “తండ్రి” అని పిలిచే మహత్కారమైన అవకాశం దొరుకుతుంది. దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ఇది మానవజాతికి అనుగ్రహింపబడిన దేవుని కృప. (హెబ్రీయులు 8:10; 2 కొరింథీయులు 6:18)
6. కుమారుడైతే వారసుడే. “కుమారులైతే వారసులము; దేవుని వారసులము, క్రీస్తుతో కూడ వారసులము” (రోమీయులు 8:17)
➡ దత్తత పొందినవాడు
➡ పరలోక ఆస్తికి హక్కుదారు
అందుకే నిజమైన క్రైస్తవుడు భూసంబంధమైన ఆస్తుల కోసం పాపులాడడు.
7. దత్తత స్వీకారంతో దేవుడు మన హృదయాలలో కొత్త నిబంధనను వ్రాశాడు. “నేను నా ధర్మవిధులను వారి హృదయములలో వ్రాయుదును” (హెబ్రీయులు 8:10)
➡ రాతిపలకల మీద కాదు
➡ మెత్తని హృదయాల మీద
8. దత్తత పొందిన దేవుని పిల్లల సమూహమే క్రీస్తు సంఘము.
👉 దత్తత స్వీకారం దేవుని అనాది సంకల్పములో మూడవ ప్రధాన నిర్ణయం. ఇది రక్షణకు లక్ష్యం, కుటుంబ సంబంధానికి ఆధారం. దేవుడు మనలను కేవలం క్షమించలేదు — తన పిల్లలుగా చేసుకున్నాడు. ఇలా దేవుని చేత దత్తత పొందినవారే క్రీస్తు సంఘము.
[D]. నాలుగవ సంకల్పము – క్రీస్తు సంఘము
దేవుని అనాది సంకల్పములో నాలుగవ ప్రధాన విషయం
⛪ క్రీస్తు సంఘము.
క్రీస్తు బలి ద్వారా విమోచన జరిగింది. అపోస్తులుల బోధ ద్వారా రక్షణ ప్రకటించబడింది. దత్తత స్వీకారం ద్వారా విశ్వాసులు దేవుని కుమారులయ్యారు. అయితే దేవుని ఉద్దేశ్యం అక్కడితో ఆగలేదు. దేవుడు తన కుమారులను ఒంటరిగా విడిచిపెట్టలేదు. వారిని ఒక శరీరముగా, ఒక సంఘముగా కట్టాలని అనాదిలోనే నిర్ణయించాడు.
1. సంఘము మానవ ఆలోచన కాదు. మానవ ఆలోచనతో కట్టబడేది కాదు. ఇది తరువాత కాలంలో ఏర్పడిన వ్యవస్థ కాదు. సంఘము దేవుని అనాది సంకల్పములో భాగమే. “ఇది క్రీస్తు యేసునందు దేవుడు చేసిన నిత్యసంకల్పము ప్రకారమే” (ఎఫెసీయులు 3:10–11)
2. సంఘాన్ని కట్టేది : నీవు అనుకున్నట్టుగా పాస్టరు కాదు, అపోస్తులు కాదు, మనుషులు కాదు మరెవరు? క్రీస్తే సంఘాన్ని కట్టాడు “ఈ బండమీద నా సంఘమును కట్టుదును” (మత్తయి 16:18).
➡ బండమీద = యేసు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అనే విశ్వాసం మీద (16వ)
➡ సంఘము క్రీస్తు సొంతమైనది
➡ సంఘము అన్నారు కానీ సంఘములు అనలేదు.
➡ నా సంఘము = క్రీస్తు సంఘము
మానవ యోచన, బోధలు, విశ్వాసం ద్వారా సంఘం కట్టే అధికారం దేవుడు మానవులకు అనుమతి ఇవ్వలేదు, ఆఖరికి అపోస్తలలుకి అనుమతి లేదు. "వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.౹" (1 కోరింది. 3:11)
➡ పెంతుకొస్తూ సంఘము ❌
➡ బాప్టిస్ట్ సంఘము ❌
➡ లూథరన్, హెబ్రోను సంఘం ❌
➡ క్రీస్తు సంఘము(church of Christ) ✔️
(ఎఫెసీయులు 2:20): "క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.౹" నీవు కట్టబడేది ఇలా లేకపోతే అది క్రీస్తు సంఘము కాదు, క్రీస్తుకు చెందినది కాదు అని గుర్తించుము
3. సంఘాన్ని ఎందుకు కట్టాడు? దత్తత స్వీకారం ద్వారా తన కుమారులుగా చేర్చబడినవారు పాతాళలోకమునకు పోకూడదనేది దేవుని ఉద్దేశ్యం. ఆది నుండి మానవజాతిని ఇబ్బంది పెట్టేది పాతాళలోకమే(షియోల్). "దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు." "మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?" (కీర్తనలు. 9:17; 89:48) "నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే." (యెషయా. 14:15) ఇట్టిదానికి దేవుడు పరిష్కారం చూపుటకే క్రీస్తు ద్వారానే సంఘమనేది కట్టుబడింది.
క్రీస్తు సంఘములోనున్న వారికి అనగా అపోస్తలుల విశ్వాస ప్రకారం నడిపింపబడేవారికి “పాతాళలోక ద్వారములు దాని(సంఘము) యెదుట నిలువనేరవు” (మత్తయి. 16:18) మరణం సంఘాన్ని జయించలేదు, సమాధి దేవుని కార్యాన్ని ఆపలేదు, షియోల్ అధికారము దేవుని ప్రజలపై నిలువలేదు. సంఘము మరణానికన్నా బలమైనది, ఎందుకంటే అది జీవముగల దేవుని యోచనపై కట్టబడింది. మరింత వివరణ కోసం "పాతాళలోకము" అను అంశములో నేర్చుకుందాం.
4. ఏదైనా మనిషి ప్రాణం పెట్టేది తనకు అత్యంత విలువైనదానికే. అదే క్రీస్తు దేనికోసం ప్రాణం పెట్టాడు? సంఘముకోసం కదా. "దేవుడు తన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును….” (అపో కార్య 20:28) అదిగో యేసు మనకు దేవుడు అంటావు ఏమో… ఇది అపోస్తలుల విశ్వాసం కాదు. దేవుడు అనే పదం ఉన్నచోట "ప్రభువు" అని ఉంది చూడు.
5. సంఘము భవనము కాదు, సంస్థ కాదు. సంఘము అనగా క్రీస్తు శరీరము. (ఎపేసి 1:23) సంఘానికి అధికారి(శిరస్సు) క్రీస్తు (కొలస్సి 1:18) క్రీస్తు అవయవాలు సభ్యులు (1 కొరింథీయులు 12:27) క్రీస్తు శరీరం ఒక్కటే(ఎపేసి 4:4) క్రీస్తు శరీరమే = క్రీస్తు సంఘము(రోమా 16:16).
6. దేవుడు ఈ సంఘాన్ని కేవలం శరీరంగా మాత్రమే కాదు, వధువుగా కూడా పోల్చి అభివర్ణించి చూచుతున్నాడు.
(ఎఫెసీయులు 5:22–32): "స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.౹ క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.౹ సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.౹ పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.౹ అటువలెనే పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.౹ తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.౹ ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.౹ ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.౹"
➡ సంఘము = వధువు
➡ క్రీస్తు = వరుడు
కాబట్టి సంఘము పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండాల్సిందే...
7. “మీరు జీవముగల దేవుని ఆలయమై ఉన్నారు” (2 కొరింథీయులు 6:16)
➡ సంఘము = దేవుని నివాసము
➡ దేవుని సన్నిధి ఉన్న స్థలం = పరిశుద్ధ జనం మధ్య లేదా క్రీస్తు బలి, అపోస్తలుల బోధ ప్రకారం, దత్తత స్వీకారం జరిగినవారి మధ్యనే కదా.
8. సంఘము లోకానికి వేరైన సమూహము అనగా లోకానికి చెందినది కాదు. “ఈ మూర్ఖమైన తరమునుండి వేరై రక్షణ పొందుడి” (అపొస్తలుల కార్యములు 2:40). లోకానికి వేరుగా అంటే లోక ఆచారాలు, పితృ పారంపర్యాలు, భూసంబంధ జీవితమునకు వేరై ఉండటం. లోకానికి దగ్గర ఉండి జీవించేవాడు రక్షణ పొందనివాడు. క్రీస్తు సంఘస్తుడు కాదు.
9. ఒక రోజున క్రీస్తు తన సంఘాన్ని(రాజ్యాన్ని) తన దేవునికి అప్పగించనున్నాడు. "అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.౹ ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.౹" (1 కొరింథీయులు 15:24-25).
➡ క్రీస్తు సంఘమే = దేవుని రాజ్యం ✔️
➡ తన తండ్రికి అప్పగింపబడే రాజ్యం
➡ క్రీస్తు రాజ్యం లేదని, ఇంకా రానుంది అని, 1000సం. ఏలుబడి జరుగును అనేది పూర్తిగా అపోస్తలుల బోధకు వ్యతిరేకమైన బోధ 📖❌
👉 క్రీస్తు సంఘము దేవుని అనాది సంకల్పములో
నాలుగవ ప్రధాన విషయం
క్రీస్తు రక్తముతో కొనబడిన శరీరము(సంఘము), దేవుని నివాసస్థానం, తండ్రికి అప్పగించబడే రాజ్యము, సంఘము లేకుండా దేవుని అనాది సంకల్పము సంపూర్ణం కాదు.
[E]. ఐదవ సంకల్పము – క్రీస్తు స్వరూపములోకి ఎదగుట
దేవుని అనాది సంకల్పములో ఐదవ మరియు తుదిముఖ్యమైన విషయం
✨ క్రీస్తు స్వరూపములోకి ఎదగుట.
క్రీస్తు బలి ద్వారా విమోచన జరిగింది. అపోస్తులుల బోధ ద్వారా రక్షణ ప్రకటించబడింది.
దత్తత స్వీకారం ద్వారా మనము దేవుని కుమారులయ్యాము. క్రీస్తు శరీరములో అనగా క్రీస్తు సంఘములో మనము కట్టబడ్డాము.
అయితే దేవుని ఉద్దేశ్యం ఇక్కడితో పూర్తికాలేదు.
దేవుడు తన పిల్లలు పరిపక్వులై, క్రీస్తువలె మారాలని అనాదిలోనే నిర్ణయించాడు.
1. దేవుడు మనలను కేవలం రక్షించడానికే కాదు, క్రీస్తు స్వరూపమునకు సమానులుగా చేయడానికే ముందుగా నిర్ణయించాడు. "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.౹ మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను." (రోమీయులు 8:29-30)
📖 ఇది దేవుని అనాది లక్ష్యం
ఎవరిని ముందుగా నిర్ణయించెనో
⬇️
వారిని పిలిచెను
⬇️
నీతిమంతులుగా తీర్చెను
⬇️
వారిని మహిమ పరచెను
2. క్రీస్తు స్వరూపములోకి ఎదగడం అనగా మాటలలో క్రీస్తువలె, ఆలోచనలలో క్రీస్తువలె, ప్రవర్తనలో క్రీస్తువలె, విధేయతలో క్రీస్తువలె మారుట. ఇది నిరంతర ప్రక్రియ ఒక్క రోజులో జరిగేది కాదు మరియు వ్యక్తిగతంగా మాత్రమే కాదు ఈ కార్యక్రమం సంఘములోనే జరుగుతుంది. “సంపూర్ణులగునట్లు… క్రీస్తు శరీరమును అభివృద్ధి చేయుటకు” (ఎఫెసీయులు 4:11–13) “మరియు ఇకమీదట పిల్లలుగా ఉండక… ప్రతి విషయంలో ఆయనయందు ఎదుగుదము” (ఎఫెసీయులు 4:14–15) సంఘము లేకుండా పరిపక్వత లేదు. ఒంటరి విశ్వాసం బైబిలు బోధ కాదు.
3. క్రీస్తు స్వరూపములోకి ఎదగుట = శ్రమతో కూడిన పని. ఈ ఎదుగుదల సులభమైనది కాదు.
ఇది అంతర్గత పోరాటాన్ని కలిగి ఉంటుంది. "నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడువరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.౹" (గలతి. 4:19)
➡ శ్రమ
➡ శిక్షణ
➡ సరిదిద్దుట
➡ సహనం
ఇవన్నీ ఈ సంకల్పంలో భాగమే.
4. ఐతే రెండు విషయాల్లో క్రీస్తు స్వరూపములోకి ఎదగుటకు సాధ్యపడును.
మొదటిది “మీరు ఆయన అడుగుజాడలలో నడవునట్లు ఆయన మీకు మాదిరి విడిచిపెట్టెను” (1 పేతురు 2:21) క్రీస్తు స్వరూపములోకి ఎదగుట అనేది ఆయన జీవితాన్ని అనుసరించడం ద్వారానే జరుగుతుంది.
➡ నీ జీవితం క్రీస్తు అడుగు జాడలు మీద లేకపోతే
➡ ఆ క్షణమే ఎదుగుదల ఆగిపోతుంది
రెండోవది “... విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము…”. (హెబ్రీ. 12:2)
➡ నీ చూపు క్రీస్తు మీద లేకపోతే
➡ ఆ క్షణమే ఎదుగుదల ఆగిపోతుంది
5. క్రీస్తు స్వరూపములోకి ఎదిగిన ఆ ఒక్క క్రీస్తు సంఘాన్ని మాత్రమే క్రీస్తు తన ప్రత్యక్షతలో తండ్రికి అప్పగించనున్నాడు. “ఆయన రాజ్యమును దేవుడైన తండ్రికి అప్పగించును” (1 కొరింథీయులు 15:24)
➡ అపరిపక్వ సంఘం కాదు
➡ పరిపక్వమైన, క్రీస్తువలె మారిన క్రీస్తు సంఘమునే.
👉 క్రీస్తు స్వరూపములోకి ఎదగుట
దేవుని అనాది సంకల్పములో రక్షణకు లక్ష్యం మరియు సంఘ జీవితం యొక్క ఉద్దేశ్యం. దేవుడు మనలను కేవలం రక్షించలేదు, కేవలం సంఘములో చేర్చలేదు, క్రీస్తువలె మారాలని అనాదిలోనే నిర్ణయించాడు.
5️⃣. ముగింపు
మన తండ్రియైన దేవుడు(YHWH) క్రీస్తు బలి ద్వారా మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి, మనలను విమోచించాడు ↪ అపోస్తులుల బోధలోకి పిలిచాడు ↪ దత్తతలో కుమారులయ్యాము ↪ సంఘముగా కట్టబడ్డాము/కట్టాడు ↪ చివరిగా క్రీస్తు స్వరూపములోకి ఎదగుటే తుదిలక్ష్యం.
మీ ఆత్మీయులు👪


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com