ఆరాధన కోరిన దేవుడు? (A God who seek worship)

ఆరాధన కోరిన దేవుడు



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


📖 వాక్యము :

(యోహాను. 4:20-24): "మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹"


🔎 వివరణ :

ప్రభువైన యేసు తన బాప్తిస్మము అనంతరం దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించు తరుణములో అనేకమంది ఆయన్ను వెంబడిస్తున్నారని, తన పరిచర్య వ్యాప్తి చెందుతుందని పరిసయ్యులు గమనించారని గుర్తించిన యేసు పరిసయ్యులతో ఢీకొనడానికి ఇది సరైన సమయం కాదని యెరిగి యూదయ దేశము విడిచి గలలియ దేశమునకు తిరుగు ప్రయాణములో యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.౹ అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.౹ సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు– నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.౹" 


అటు తరువాత యేసు ఆమెతో చేసిన సంభాషణ భాగముగానే "ఆరాధన కోరిన దేవుడు" అను ఈ అంశమును వ్రాసి మీ యెదుట పెడుతున్నాం కావున శోత్రులు చివరి వరకు చదివి, పరిశీలించి, ఆలోచన చేసి సత్యాన్ని స్వీకరించవలసిందిగా మనవి. ఇందులో ఏదియు అసందర్భంగా, పిట్ట కథలతో, కట్టుకథలతో, ఊహించుకొని చెప్పబడిన మాటలు కాదని స్వయముగా ప్రభువైన యేసే పలికిన మాటలని చదువుతునప్పుడు జ్ఞాపకం ఉంచుకో...


మన యెదుట ఉంచబడిన ప్రశ్నలు...

A. సమరయులు ఎవరు?

B. ఆరాధన కోరినది ఎవరు? 

C. ఎవరు ఆరాధించాలి?

D. ఎలా ఆరాధించాలి?

E. క్రైస్తవుల ఆరాధన స్థలమేది?

వీటితో పాటుగా మరి కొన్ని ప్రశ్నలకు సమాధానమును పరిశుద్ధ గ్రంథము నందు వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం.



A.  సమరయులు ఎవరు?

క్రీస్తుపూర్వం పదవ శతాబ్దంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను - సొలొమోను రాజు 40సం. పరిపాలించి చనిపోయిన తరువాత(1 రాజులు 11:42-43), అతని కుమారుడు రెహబాము యొక్క తెలివితక్కువ చర్యలు చీలికకు దారితీశాయి,(1 రాజులు 12:25- 33) దీని ఫలితంగా రాజ్యం ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు మరియు దక్షిణ రాజ్యమైన యూదాగా విభజించబడింది. (1 రాజులు. 11:31-39) ఉత్తర భాగం, "ఇశ్రాయేల్", షెకెమ్ మరియు సమారియా నగరాలను కలిగి ఉంది, దీనికి యరొబాము రాజు అయ్యాడు. దక్షిణ భాగం, "యూదా", జెరూసలేం మరియు యూదుల దేవాలయంను కలిగి ఉంది, దీనికి రెహబాము రాజు అయ్యాడు. (1రాజులు 12:1-33) ప్రతి దానికి స్వంత రాజు ఉన్నాడు. 721 BC లో, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం అష్షూరీయుల చేతిలో పతనమైంది. ఇశ్రాయేలు ప్రజలలో చాలామందిని బందీలుగా అష్షూరీయులకు తీసుకెళ్లారు.(2 రాజులు 18:9-10) ఈ సమరయులు కూడా ఇశ్రాయేలీయులే(ఉత్తర భాగం). షోమ్రోను అను హీబ్రూ పదానికి అర్థమే సమరయ పట్టణము. ఇవి రెండు వేరు వేరు పట్టణాలు కాదు. ఇశ్రాయేలు రాజు ఒమ్రీ ఈ పట్టణాన్ని కొని, దానికి షోమ్రోను అని పేరు పెట్టాడు. (1 రాజులు 16:24) ఈ పట్టణం యొక్క హీబ్రూ పేరు "షోమ్రోను" (שֹׁמְרוֹן). 


ధర్మశాస్త్రం కాలము మందు లేనివారిలో కొందరు యూదులు ఆ దేశంలోనే ఉండి,  అష్షూరీయుల అక్కడ నాటిన విదేశీయులతో వివాహం చేసుకున్నారు. ఈ సగం యూదులు, సగం అన్యులు కలిగిన ప్రజలే సమరయులు అని పిలువబడ్డారు. సమరయ ప్రజల గురించి మరియు వారి ఆరాధనా పద్ధతుల గురించి మరింతగా తెలుసుకోవడానికి 2 రాజులు. 17:14-41 వరకు చదవగలరు. 


సమరయులు అన్య జనాంగమని భావించి వారు యూదులతో సమానమైన వారు కాదనీ మొదలయిన కారణాలు చెప్పి యూదులు సమరయులను దూరం పెట్టారు. సమరయులకి మరియు మిగతా యూదులకి మధ్య సిద్ధాంత పరముగా కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. ఇందుకు సమరయులు ఏమి చేశారంటే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో అప్పటికి అందుబాటులో ఉన్న హీబ్రూ లేఖనాలను తీసుకుని వాళ్లకి అనుకూలంగా కొన్ని మార్పులు చేసుకున్నారు. 


🌿 ఉదాహరణకు : యూదులు యెరూషలేము దేవాలయములో యెహోవా దేవున్ని ఆరాధిస్తే... సమరయులు ఏమో గెరిజిమ్ అనే పర్వతం మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ యెహోవా దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు.. ఇప్పటికీ ఇది ఒక పవిత్ర స్థలముగా భావించే వారు లేకపోలేదు. మోషే గారు వ్రాసిన పంచకాండాలు(5 పుస్తకాలు) మాత్రమే దేవుని వాక్యం అని సమరయులు నమ్ముతారు. ఇందులో నిర్గమ.కాం. 20:17 వచనము తమకు అనుగుణముగా మార్చుకొని గెరిజిమ్ పర్వతం మీద యెహోవా దేవున్ని(తండ్రిని) ఆరాధించేవారు.


దేవుని చిత్తమైతే వీరి కోసం మరింత వివరముగా సమరయులుత్వరలో అనే అంశము ద్వారా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఇక విషయానికి వస్తే... యూదులను వీరు ఎంతో ప్రేమించేవారు కానీ యూదులే వారి మత పరమైన సిద్ధాంతాలను ధర్మశాస్త్రమునకు ఆపాదించి వీరితో సహవాసం చేయుటకు ఇష్టపడేవారు కాదు. ఇటువంటి ఒక సమరయరాలు తోనే యోహాను 4వ అధ్యాయం యందు యేసు సంభాషణ చేయటం మనం చూడగలం.



B.  ఆరాధన కోరినది ఎవరు?

యోహాను సువార్త 4వ అధ్యాయంలో వాళ్లిద్దరి మాటల మధ్యలో ఆ సమరయ స్త్రీ ఇలా అంటుంది... "మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని.." ఆమె యేసు క్రీస్తుని ప్రశ్నిస్తుంది (యోహాను సువార్త 4:20). గెరిజిమ్ అనే పర్వతాన్ని ఉద్దేశించే ఆ సమరయ స్త్రీ యేసు క్రీస్తుతో అలా మాట్లాడింది.


    సమరయలు ఆరాధన స్థలము - గెరిజిమ్ పర్వతం 

 యూదులు ఆరాధన స్థలము - యెరూషలేములోనున్న దేవుని మందిరం/దేవాలయం.

☑  అటు పితరులైన, ఇటు యూదులైన ఎవరిని మాత్రమే ఆరాధించేవారు? ≈ యెహోవా దేవున్ని(తండ్రిని). 


పితరుల ఆరాధ్యదైవం :

అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. (ఆదికాండము 12:6-7)


అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. (ఆదికాండము 33:18-20)


యూదుల ఆరాధ్యదైవం :

🔖 యెహోవాను ఆరాధించు స్థలయొకటి... (2సమూయేలు. 15:32)

🔖 యెహోవాను ఆరాధించి స్తుతించిరి. - (2దినవృత్తా. 7:3)

🔖యెహోవాకు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి - (2దినవృత్తాంతములు. 29:25-30)

🔖 యెహోవా మందిరములో ఆరాధించుటకై - (యిర్మియా. 26:2)

🔖 యెహోవాకు ఆరాధన చేయవలెను - (యెహేజ్కేలు. 46:3)


[ Note : యూదులకు బాగా తెలుసు తమ ఆరాధ్యదైవం ఎవరో, ఎవరు ఆరాధన చేయమని తమను కోరారో అనే సంగతి.. ]


క్రైస్తవుల ఆరాధ్యదైవం :

(యోహాను. 4:22-23): "మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹"


మీరు అనగా సమరయులు మీకు తెలియనిదానిని ఆరాధించువారు.

☑ మేము అనగా యూదులు మాకు తెలిసినదానిని ఆరాధించువారము. 


👤"మేము" అనే మాటలో ప్రభువైన యేసు కూడా ఆరాధికుడైయున్నట్టు సూచించారే గాని తాను ఆరాధన కోరినట్టుగా చెప్పబడ్డలేదని విషయాన్ని గుర్తించుము. 


పాత నిబంధన అమల్లోనున్న కాలములోనే ప్రభువైన యేసు జన్మించారు. యేసు ఒక యూదుడు(లూకా. 2:27-28) ఆయన జన్మించిన నాటి నుండి మరణించిన వరకు కూడా ఏటేటా లేదా పండుగ దినాల్లో తన తండ్రిని ఆరాధించే ఆరాధికుడు అనే విషయం గుర్తించుము.(లూకా. 2:41-42; 22:1; యోహాను. 2:13; 4:45; 6:4; 7:2; 7:8-14; 10:22; 11:55-56; 12:1-20; మార్కు. 14:1; మత్తయి. 26:17-20). ఇందుకే తన యందు విశ్వాసులైన వారికి, ఆయన శిష్యులకు, తన్ను ఆరాధించమని ఆదేశించినట్టుగా మనకు గ్రంథమందు కన్పించదు. మరి "యేసు ఏమి కోరారు?"క్లిక్ చేయు అనే విషయాన్ని తెలుసుకొనుటకు క్లిక్ చేసి చదువుము. 


యేసే స్వయముగా తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది, తండ్రి కోరుచున్నాడు(23వ) అని చెప్పినప్పుడు క్రైస్తవుల నుండి ఆరాధన కోరిన దేవుడు యెహోవాయే(తండ్రే) అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఆలోచించుకోండి. యేసు ఎన్నడూ కూడా నన్ను ఆరాధించండి లేదా నన్ను ఆరాధించు కాలము వచ్చును అని అనలేదు. ఇంత చెప్పిన "యెహోవా దేవుడే యేసు"క్లిక్ చేయు అనే ఆలోచన ఉంటే నీ కోసమే ముందుగా వ్రాసాను క్లిక్ చేసి చదువుము. 



C.  ఎవరు ఆరాధించాలి?

ఆరాధన కోరినవాడు తండ్రియైన దేవుడే. ఆయనే యథార్థముగా ఆరాధించే ఆరాధికులు కావాలని కోరుకున్నాడు/వెతుకుచున్నాడు అని యేసే స్వయముగా చెప్పెను కదా(యోహాను. 4:23 చూడుము).


యధార్థవంతులైన ఆరాధికులు అంటే దిద్దుబాటును ప్రేమించేవారు అని అర్థం. పరమదేవుడును ఆరాధించేవారు తన మార్గముల విషయమై  బోధించునప్పుడు, హెచ్చరించినప్పుడు మనలోనున్న లోపాలను, దోషాలను గుర్తించి తిరిగి మరల ఆరాధన దినం లోపు  దిద్దుకొనేవారు కానీ తమ లోపాలను సమర్ధించుకునేవారు కాదు.  లోపాలను సమర్ధించుకునేవారు ఎప్పటికి  యధార్థవంతులుకారు". (c.f. కీర్తనలు. 50:17-22; యెషయా. 2:2-6; రోమా. 2:15; 1తిమోతి 4:3; తీతుకు. 1:15). 


ముందుగా దైవ ఇష్టాన్ని గుర్తించి దైవ సన్నిధికి వచ్చి తండ్రిని ఆరాధించాలి తప్పా తమ ఇష్టాలను, ఆలోచనలను తమ ఆరాధనలో కలిపి జరిగిస్తే దేవుడు ఎన్నటికి అంగీకరించరు. చాలా మంది తమ ఆరాధనను తమ ఇష్టాలతో, అభిప్రాయాలతో, వ్యాపార లావాదేవీలు కోసం, వ్యక్తిగత దూషణలతో, పగలతో, కక్ష్యలతో, ధనాపేక్షతో జరిగించేవారు లేకపోలేదు. మీలో అట్టి వారిని గుర్తించి సత్యాన్ని తెలియజేయండి. వారు వినని యెడల, మిమ్మలి తృణీకరించే ఆలోచన కలిగి ఉంటే అట్టి వారికి మీరు దూరంగా ఉండాలనే కోరుతున్న(రోమా. 16:17-18cf) కారణం ఇట్టి వారిని తండ్రి కోరడం లేదు. ఎందుకంటే యదార్థవంతులైతే అలా ప్రవర్తించరు కదా!! అటువంటి వారికి దూరముగా ఉండుటలో మేము ప్రథములమని చెప్పుటకు సంతోషించుటలో వెనుకడుగు వేయుటలేదు. కావున దేవునికి కావలసింది యధార్థమైన ఆరాధనే/ యధార్థమైన ఆరాధికులే కానీ ఏదో రకమైన ఆరాధన/ ఎవరైతే ఏంటి అనేది కాదు సుమీ!! 



D. ఎలా ఆరాధించాలి?

దేవుని ఆరాధికులు యధార్థవంతులైనప్పటికి ఎలా ఆరాధించాలి? అనే విషయాన్ని దేవుడు వారికి అవకాశమియ్యక తానే స్వయముగా ఆ నియమాన్ని ప్రభువైన యేసు ద్వారా పలికించుట మనం చూడగలం. "అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము...;౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹" (యోహాను. 4:23-24)


📖ఆత్మతోను ఆరాధించుట అనగా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించువారు అని అర్థం.(ఫిలిప్పీ. 3:2-3). వీరు తమ శరీరమును ఆస్పదము చేసుకొనని వారు అనగా వారు  రాజకీయవేత్తలైన, గొప్ప అధికారము గలవారైన, ప్రభుత్వ ఉద్యోగులైన, ఆఖరికి సీఎం, పీఎం అయిన...Etc. శరీర ఆదిక్యతను దైవ సన్నిధికి వచ్చే ముందు విడిచి పెట్టి దేవుని యొక్క ఆత్మతోనే ఆరాధించువారని అర్థం.


📖సత్యముతోను ఆరాధించుట అనగా ఆదిమ అపోస్తులుల బోధన క్రమం చొప్పున(అపో.కార్య. 2:42; 2 దెస్స. 2:15) లేదా సత్య వాక్యాన్ని సరిగ్గా విభజించేవారిగా(యోహాను 17:17; 2తిమోతి. 2:15) అని అర్థం. సత్య లేఖనము ప్రకారముగా కాకుండా ఎంత గొప్పగా చేసిన, చెప్పుకొనిన అది సత్యముతోను ఆరాధించినట్టు కాదు మరియు దేవుడు అంగీకరించే ఆరాధన కాదని గుర్తుంచుకో..


మరింత వివరణ కోసం "ఆత్మతోను, సత్యముతోను"క్లిక్ చేయు అనే అంశం క్లిక్ చేసి చదువుము. 



E. క్రైస్తవుల ఆరాధన స్థలమేది?

ఇక చివరిగా "క్రైస్తవుల ఆరాధన స్థలమేది" అనే విషయానికి వస్తే... యోహాను. 4:21లో ప్రభువు ఇలా ముందుగా సూచించెను కదా. "–అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹" ఇక్కడ మనకు చెప్పబడిన కాలము క్రొత్త నిబంధన కాలమే. పితరుల కాలములో పర్వతముల మీద, మోషే కాలములో యెరూషలేము మందిరంలో ఆరాధించేవారు. నేడు(క్రీస్తు కాలములో) ఒక ప్రత్యేకమైన స్థలమునకు ప్రాధాన్యత లేదని గుర్తించుము. 


యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించి, రక్షింపబడువారిని (రోమా. 10:9) క్రీస్తే తన శరీరమను సంఘములో చేర్చుచుండెను కదా(అపో.కార్య. 2:47) ఇలా చేర్చబడిన జనమే క్రీస్తు సంఘము(1 కోరింది. 3:16-17; రోమా 16:16) వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక నుండువారు (అపో.కార్య. 2:42) వీరు క్రీస్తు సంఘమను శరీరములో సభ్యులు అనగా అవయవములు(ఎఫేసి 1:23; రోమా. 12:4; 1 కోరింది. 12:12-14). వీరికి శిరస్సు క్రీస్తే(కొలస్సి 1:18) వీరికి ప్రభువు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు(1 కోరింది. 8:6b) వీరికి దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి(1 కోరింది. 8:6a) వీరు ఒక్క శరీరంగా ఉండుటకు లోకము నుండి పిలువబడిన వారు(1 కోరింది. 1:1; ఎపేసి. 4:4) ఇటువంటి వారి మధ్య అనగా క్రీస్తు ప్రభువై/రాజై (అపో.కార్య. 2:36; 10:36) ఏలుబడి చేయువారు మధ్య జరిగే ఆరాధనే దేవుడు అంగీకరించే ఆరాధన. సంఘానికి శిరసైన క్రీస్తు ఏం చెప్పినా అన్నివిషయాలలో ఆయన మాట వినేవారి సముదాయం గలవారు ఉన్న స్థలమునే దేవుడు నివసిస్తాడు. అది ఆయన కోరిన స్థానము. అక్కడే ఆరాధన జరగాలి. ఇంకే చోట జరిగిన అది ఆరాధన అనబడదు. మరి "అది ఏ ఆరాధన అనబడును?"క్లిక్ చేయు అనే విషయం కోసం క్లిక్ చేసి చదువుము. 



📝 సారాంశము 

ఓ చదువరి... ఆరాధన కోరిన దేవుడు తండ్రియే(యెహోవా) అని యేసే స్వయముగా సమరయ స్త్రీతో జరిగిన సంభాషణలో మనం గుర్తించాం కదా. ఎవరిని ఆరాధించాలో, ఎవరు ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో, ఎక్కడ ఆరాధించాలో అనే విషయాలను యోహాను 4:21-24 వరకు స్పష్టముగా చదివి తెలిసినప్పటికి యేసును ఆరాధించకూడదా? యేసు ఆరాధింపబడ్డారు కదా? అంటూ నీ మదిలో మెదిలితే మరొక్క అంశం రూపములో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకు ఆరాధన కోరిన దేవుడు తండ్రే అని యేసు ఇచ్చే వివరణ బట్టి గట్టిగా విశ్వసించుము అలాగునే చేయుము.


(అపో.కార్య. 3:22-23) "మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹"

మీ ఆత్మీయులు 👪

1. యేసును ఆరాధించాలా లేక సేవించాలా? Click Here

2. యెహోవా దేవుడే యేసు? Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Questions and Comments here!

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16