మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏
నేటి క్రైస్తవ విశ్వాసములో “దేవత్వమా? త్రిత్వమా? త్రియేకమా?” అనే ప్రశ్నలు క్రైస్తవ చరిత్రలో అత్యంత లోతైన, ఆలోచనాత్మకమైన అంశాలలో ఒకటి. ఈ పదములు ఒకే అర్థమా? లేక వేర్వేర్వేరు భావములను సూచిస్తున్నాయా? ముఖ్యంగా, వీటిలో దేని గురించి దేవుని వాక్యము బోధించుచున్నది? ఏది విశ్వాస సంబంధమైనది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనుట అత్యంత అవసరము. దేవుడు ఎవరు? ఆయన స్వరూపము ఎలా ఉంది? అటువంటి స్వరూపము గలవారు ఎందరు? ఆయన ఒక్కడా? లేక ముగ్గురా? లేక ఒక్క వ్యక్తే ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమయ్యాడా?(త్రిపాత్రాభినయం చేశారా?) లేక ఏకత్వములో త్రిత్వమా? లేక దేవత్వం గల ముగ్గురు వేరు వేరుగా ఉన్నారా? లేక దేవత్వములో ముగ్గురు అనగా త్రిత్వమా? అనే ప్రశ్నలు విశ్వాసుల మనస్సులను ఎన్నో శతాబ్దాలుగా పరిశీలనలో ఉంచుతున్నాయి. ఈ ప్రశ్న కేవలం సిద్ధాంతపరమైనది మాత్రమే కాదు; ఇది దేవుని స్వభావమును, ఆయన మనుష్యులతో కలిగిన సంబంధమును, మరియు దేవుని అనాది సంకల్పంలో ఆయన పాత్రను అర్థం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యమైనది. ఎందుకంటే మన విశ్వాసము మనుష్యుల అభిప్రాయముల మీద కాకుండా దేవుని వాక్యముపైనే నిలవాలని ఈ విధముగా అబద్ధ బోధనలను/బోధకులను త్రోసిపుచ్చి అపోస్తులుల బోధను గుర్తించాలనేది ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
1️⃣. దేవత్వమా?
A : దేవత్వము యొక్క అర్ధం.
దేవత్వము/దైవత్వం(Godhead/Deity) అనగా దేవుడు + తత్వము = దేవుని యొక్క గుణ లక్షణాల సముదాయం లేదా దేవుని యొక్క స్వభావం లేక దేవుని యొక్క అదృశ్య లక్షణం అని అర్థం. ఈ పదము ఒక వ్యక్తిని కాదు, ఒక లక్షణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు మానవులకు “మానవత్వము” అనే లక్షణం ఉన్నట్లు, క్రూరులకు “కూరత్వం” అనే లక్షణం ఉన్నట్లు, జారులకు “జారత్వం” అనే లక్షణం ఉన్నట్లు,... దేవునికి “దేవత్వము” అనే లక్షణము ఉంది. కాబట్టి దేవత్వము అనేది ఒక స్వభావము, ఒక గుణము, ఒక మహిమను సూచిస్తుంది కానీ వ్యక్తిని కాదు.
B : దేవత్వము అనే పదం గ్రంథములో ఉందా?
దేవత్వము/దైవత్వం అనే ఈ పదాలు పరిశుద్ధ గ్రంథంలో ఐదు సారులు వాడబడ్డాయి.
▪️*దేవత్వము లేని దయ్యములకు*
(ద్వితీయోపదేశకాండము 32:17): "వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమపితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి."
▪️*దేవత్వము లేని దేవతలకు*
(యిర్మియా 2:11): "దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.౹"
▪️*దేవత్వము లేని విగ్రహాలకు*
(అపొస్తలుల కార్యములు 17:29): "కాబట్టి మనము దేవుని సంతానమై యుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.౹"
▪️*దేవత్వము కలిగిన దేవునికి(YHWH)*
(రోమీయులకు 1:20): "ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.౹"
▪️ దేవత్వము కలిగిన యేసుక్రీస్తుకు
(కొలస్సయులకు 2:9): "ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;౹"
C : దేవత్వము గలవారు Vs దేవత్వములో
దేవత్వము అనేది ఒక అదృశ్య లక్షణమే కానీ వ్యక్తి కాదు.(రోమా. 1:20) కాబట్టి “దేవత్వము గలవారు/దైవ స్వభావం గలవారు” ఎందరున్నారో వారిని “దేవత్వములో ఉన్నవారు” అని అనకూడదు. బైబిల్లో ఎక్కడా “దేవత్వములో ముగ్గురు వ్యక్తులు” అని చెప్పలేదు కానీ దేవత్వము కలిగిన వ్యక్తులు ముగ్గురు అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ మూడు వ్యక్తులు వేర్వేరుగా పేర్కొనబడ్డారు:
✔️ దేవుడు ఒక్కడే
✔️ ప్రభువు ఒక్కడే
✔️ పరిశుద్ధాత్ముడు ఒక్కడే - (1 కొరింథీయులకు 12:4-6; ఎపేసియులకు. 4:4-6 చూడుము)
1. తండ్రి — దేవుడు(YHWH)
2. కుమారుడు — ప్రభువైన యేసుక్రీస్తు
3. పరిశుద్ధాత్ముడు — దేవుని ఆత్మ
🔴 ఉదాహరణ : “మనుష్యత్వము”
మనుష్యత్వము = ఒక స్వభావము. అది వ్యక్తి కాదు.
🕂పేతురు మనుష్యత్వము కలవాడు
🕂 యోహాను మనుష్యత్వము కలవాడు
🕂 పౌలు మనుష్యత్వము కలవాడు
మనము ఇలా అనము:
❌ “మనుష్యత్వములో ముగ్గురు వ్యక్తులు”
కాని ఇలా అంటాము:
✔️ “మనుష్యత్వము కలిగిన ముగ్గురు వ్యక్తులు”
అదేవిధంగా:
▪️దేవత్వము = స్వభావము/అదృశ్య లక్షణం
▪️వ్యక్తులు = దేవత్వము కలవారు అనాలి ✔️ దేవత్వములో ఉన్నవారు ❌
D : దేవత్వము గలవారు ముగ్గురు?
▪️*మొదట - మన తండ్రియైన దేవుడు*
🕂మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి(1కొరింథీయులకు. 8:6a)
🕂వాక్యము దేవుని(తండ్రి) యొద్ద ఉండెను (యోహాను. 1:1)
🕂తండ్రి(YHWH) స్వర్వాధిపతియైన దేవుడు (1తీమోతి. 6:15-16)
🕂తండ్రి(YHWH) అద్వితీయ సత్యదేవుడు (యోహాను. 5:44; 17:3)
🕂పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు (కీర్తనలు. 90:2)
🕂తండ్రియైన దేవుడు దేవత్వము కలవాడు. (రోమా. 1:20)
▪️*రెండు - మన ప్రభువైన యేసుక్రీస్తు*
🕂మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు;(1 కొరింథీయులకు 8:6b)
🕂ఆయన(వాక్యము) ఆదియందు దేవునియొద్ద ఉండెను. - (యోహాను. 1:2)
🕂యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడు (రోమా 9:5)
🕂యేసు అద్వితీయ కుమారుడు (లేదా) సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు (మత్తయి. 16:16; యోహాను. 1:14,18; 3:16; 1యోహాను. 4:19)
🕂తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము. (యోహాను. 17:5)
🕂యేసుక్రీస్తు దేవత్వము కలవాడు. (కొలస్సయులకు 2:9)
⚫ మన ప్రభువైన యేసుక్రీస్తుకు దేవత్వం లేదు అంటూ ఆయన మీద బురద జల్లేవారు ఆనాటి నుండి లేకపోలేదు అట్టివారికి సమాధానముగా *యేసుక్రీస్తు యొక్క దేవత్వం అనే అంశము పూర్తిగా చదవగలరు.
▪️*మూడు - మన ఆత్మయునైన పరిశుద్ధాత్ముడు*
🕂మనకు ఆత్మయు ఒక్కడే(1 కొరింథీయులకు 12:4,9,13,18; ఎపేసి. 2:18; 4:4)
నిత్యుడగు ఆత్మ (హెబ్రీ. 9:14)
🕂పరిశుద్ధాత్ముడు దేవత్వము కలవాడు. (అపొస్తలుల కార్యములు 5:3–4)
E : దేవత్వము గలవాడు దేవుడేనా?
అవును 💯 — తండ్రి + కుమారుడు + ఆత్మయు = ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవుడు అనే పదముతోనే పిలువబడే సందర్భాలును పైన మనం చూశాం కదూ ఐతే… మనకు/అందరికి/క్రైస్తవులకు దేవుడు?
▪️*క్రైస్తవులకు దేవుడొక్కడే*
ఈ ముగ్గురులో “మనకు/అందరికి/క్రైస్తవులకు దేవుడు ఒక్కడే” అనే విషయం కూడా బైబిల్ స్పష్టముగా తెలియజేస్తుంది. ఇదే అనాటి నుండి క్రైస్తవుల యొక్క విశ్వాస పునాది.
🕂(ఎపేసి 4:6): "అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.౹"
🕂(1 కోరింది 8:6) ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి
🕂(మలాకి 2:10) మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా?
🕂(1 తిమోతి 2:5): "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹"
⚫ “ఒక్కడే అంటే ఒక్కడే అని అర్ధం”. ఒక్కడే అనే స్థానములో ఇద్దరిని, ముగ్గురిని పెట్టడం పరిశుద్ధాత్ముని మీద తిరుగుబాటు చేసినట్టే అగును కదా!!
మరింత విశ్లేషణ కోసం దేవుడొక్కడే అంటే —ఎవరికి దేవుడు? అంశము పూర్తిగా చదవండి.
2️⃣. త్రిత్వమా?
“త్రిత్వము” అనే పదము క్రైస్తవ లోకములో విస్తృతంగా వినబడుతున్న ఒక సిద్ధాంత పదము. “త్రిత్వము” అనే పదము లాటిన్ భాషలోని “Trinitas” అనే పదము నుండి వచ్చింది. దీనిని ఇంగ్లీష్ లో Trinity అంటాం. దీని అర్థము “ముగ్గురిలో దేవత్వము/ఏకత్వము” లేదా “మూడు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు” అనే భావన.
“త్రిత్వ వాదం” ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో నున్న ఒక్క దేవుడు మరియు ఒక్క స్వభావమే. తండ్రి పూర్తిగా దేవుడు, కుమారుడు పూర్తిగా దేవుడు, పరిశుద్ధాత్మ కూడా పూర్తిగా దేవుడు. దేవుడు అనే పదములోనే ముగ్గురు మిళితం అయ్యి ఉన్నారు అంటూనే మనకు ఒక్క దేవుడు ఉన్నారు అనే రకమైన వాదులు ఉన్నారు. మరియు మనకు ఒక్కడే దేవుడు ఆయనే యేసు అనే త్రిత్వ వాదులు ఉన్నారు. ఇందులోనే తిరిగి యెహోవాయే యేసు, యేసే పరిశుద్ధాత్ముడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు కూడా ఉన్నారు. కాలక్రమేణా “త్రిత్వ వాదం” వారికి నచ్చిన రీతిలో మార్పు చెందుతూనే వచ్చింది.
అయితే ఈ పదమును పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైన విషయం గమనించవలెను — “త్రిత్వము”(Trinity) అనే పదము బైబిల్లో ఎక్కడా కనిపించదు. పాత నిబంధనలో గాని, క్రొత్త నిబంధనలో గాని, క్రీస్తు బోధలో గాని, అపొస్తులుల బోధలో గాని ఈ పదము ఉపయోగించబడలేదు.
A : త్రిత్వము - చరిత్ర
చరిత్ర ప్రకారం, “త్రిత్వము” అనే పదమును మొదటిగా క్రీస్తుశకం రెండవ శతాబ్దం చివరలో(AD 200) టెర్టులియన్ (Tertullian) అనే క్రైస్తవ రచయిత ఉపయోగించాడు. అతను “Trinitas” అనే లాటిన్ పదమును ఉపయోగించి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ప్రయత్నించాడు.
తరువాత క్రీస్తుశకం 325లో నైసియా కౌన్సిల్ (Council of Nicaea) అనే సంఘ సమావేశములో యేసుక్రీస్తు స్వభావము గురించి అనగా “యేసుక్రీస్తు సృష్టింపబడినవాడా? లేక నిత్యుడా?” అనే విషయమై చర్చ జరిగింది. అక్కడ “హోమూషియస్” (Homoousios) అనే గ్రీకు పదమును ఉపయోగించారు. ఈ పదము అర్థము “ఒకే స్వభావము” (same substance) అనే భావన. ఈ సమావేశము తరువాత “Nicene Creed” అనే ప్రకటన రూపొందించబడింది.
“Una substantia, tres personae”
అర్థము: “ఒక స్వభావము, మూడు వ్యక్తులు”
తరువాత క్రీస్తుశకం 381లో కాన్స్టాంటినోపుల్ కౌన్సిల్‌లో పరిశుద్ధాత్ముని స్థానం కూడా అధికారికంగా చేర్చబడింది. ఈ విధంగా త్రిత్వ సిద్ధాంతము చరిత్రలో ఒక థియోలాజికల్ వివరణగా అభివృద్ధి చెందింది.
Source : New Catholic Encyclopaedia, 2nd Edition, Volume 14, “Trinity,” pp. 295–299.
“త్రిత్వము” అనే పదము బైబిల్ పదము కాదు; అలాగే “హోమూషియస్” “ఎసెన్స్” అనే పదములు బైబిల్లో కనిపించవు. అది ఒక థియోలాజికల్ పదములు. అపోస్తులులు పరిశుద్ధాత్ముడు ప్రేరణ ద్వారా ఎన్నడూ ఇట్టి “త్రిత్వ బోధను” ప్రకటన చేయలేదు, బైబిల్లో వ్రాయలేదు సుమీ!!
3️⃣. త్రియేకమా?
“త్రియేకము” అనే పదము రెండు పదముల కలయిక :
▪️త్రి (Tri) = మూడు
▪️ఏకము (Une / Eka) = ఒకటి
అంటే “మూడు అయిన ఒకటి” లేదా “మూడు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడు” అనే భావనను సూచించుటకు ఈ పదమును ఉపయోగిస్తారు. ఆంగ్లంలో దీనిని “Triune God” అని పిలుస్తారు.
అయితే ఒక ముఖ్యమైన సత్యము ఏమిటంటే — “త్రియేకము” అనే పదము కూడా బైబిల్లో ఎక్కడా ఉపయోగించబడలేదు. ఇది పాత నిబంధనలో గాని, క్రొత్త నిబంధనలో గాని, అపొస్తలుల బోధలో గాని కనిపించదు.
Source : Encyclopaedia Britannica, 15th Edition, Volume 11, “Trinity,” pp. 928–930.
“త్రియేక వాదం” అనేది ముగ్గురు వ్యక్తులు ఉన్న ఒక్కడే. ఒక్క దేవుడు మూడు రూపాల్లో పాత్ర పోషించారని. ద్వి లేదా త్రి పాత్రాభినయం చేశాడని.. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారని, ముగ్గురిని కలిపితే సంపూర్ణ దేవుడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు కలరు. దీనికి వారు చూపించే వచనం… "నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.౹" (యోహాను 10:30) అదిగో ఏకమై(ONE) ఉన్నారంటే ఒక్కడే.. ముగ్గురు ఒక్క వ్యక్తే అనేవాదన చేయువారు ఇట్టివారిని నేడు “ఏకత్వవాదులు” అందురు. అట్టివారికి మరింత విశ్లేషణ కోసం మా రచనల్లో నున్న “ఏకమైయున్నారు అంటే ఏంటి?” అనే ఈ అంశము పూర్తిగా చదవగలరు.
A : త్రియేకము — చరిత్ర
త్రియేకము అనే పదము “త్రిత్వము” (Trinity) అనే సిద్ధాంతాన్ని వివరించుటకు తరువాత కాలములో ఉపయోగించబడిన ఒక వివరణాత్మక పదము. క్రీస్తుశకం రెండవ మరియు మూడవ శతాబ్దములలో క్రైస్తవులు దేవుని స్వరూపమును/స్వభావమును వివరించుటకు తత్త్వశాస్త్ర సంబంధమైన పదములను ఉపయోగించడం ప్రారంభించారు.
టెర్టులియన్ (Tertullian), ఒరిజెన్ (Origen), మరియు తరువాత కొందరు మత నాయకులు దేవుని గురించి వివరణ ఇవ్వుటకు “Trinitas” మరియు “Triune” వంటి పదములను ఉపయోగించారు.
క్రీస్తుశకం 325లో నైసియా కౌన్సిల్ మరియు క్రీస్తుశకం 381లో కాన్స్టాంటినోపుల్ కౌన్సిల్ తరువాత ఈ భావనలు మరింత స్థిరపడ్డాయి.
అయితే ఈ పదములు బైబిల్ పదములు కాదు; అవి తరువాత కాలములో ఉపయోగించబడిన వివరణాత్మక పదములు మాత్రమే. అపోస్తలుల బోధకు వీరి బోధలకు ఎటువంటి సంబంధం లేదు.
🌿 ముగింపు
దేవత్వము - ✅
త్రిత్వము - ❎
త్రియేకము - ❎
పరిశుద్ధ వాక్యము ప్రకారం దేవత్వము ఒక లక్షణము. ఆ దేవత్వము తండ్రియందు ఉంది, కుమారునందు ఉంది, పరిశుద్ధాత్మునందు ఉంది. కాబట్టి దేవత్వము కలిగిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేది సత్యం. ఐతే దేవత్వములో ముగ్గురు వ్యక్తులు అని అనకూడదు కారణం ఇది త్రిత్వ/త్రియేక బోధకు దారి తీస్తుంది.
అయితే “త్రిత్వము” మరియు “త్రియేకము” అనే పదములు కూడా బైబిల్లో లేవు; అవి తరువాత కాలములో ఉపయోగించబడిన చారిత్రక పదములే కానీ దైవ పూరితమైన సందేశం కావు. వీటిని తల దన్నే బోధలు అనగా జ్ఞానతత్వం వాదన, గతికవాదం లేకపోలేదు. తదుపరి రచనల్లో వాటి కోసం వ్రాయుటకు ప్రయత్నం చేస్తాం. ఏదిఏమైనా మన విశ్వాసము దేవుని వాక్యముపైనే ఉండాలి. “సమస్తమును పరిశీలించి మేలైనదానిని చేపట్టుడి.” (1 థెస్సలొనీకయులకు 5:21)
మీ ఆత్మీయులు 👪
1. దేవత్వముక్లిక్ చేయు
2. యేసుక్రీస్తు యొక్క దేవత్వము క్లిక్ చేయు
3. యేసు ఎవరు?క్లిక్ చేయు
4. ఏకమైయున్నారు అంటే ఏంటి?క్లిక్ చేయు
5. దేవుడొక్కడే అంటే —ఎవరికి దేవుడు?క్లిక్ చేయు


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com