మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻
దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ఒక వచనాన్ని విడిగా తీసుకొని దాని అర్థాన్ని నిర్ణయించకూడదు. ఆ వచనం ఏ సందర్భంలో చెప్పబడిందో, దాని ముందు తరువాత ఉన్న విషయాలు ఏమిటో, ఇతర లేఖనాలు ఆ విషయాన్ని ఎలా వివరిస్తున్నాయో పరిశీలించినప్పుడు మాత్రమే వాక్యంలోని భావం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా పరిశీలించవలసిన ముఖ్యమైన వచనాలలో మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ఒకటి.
ప్రవక్తయేన మీకా గారు, “బేత్లహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను” అని ప్రకటించాడు. ఈ ప్రవచనంలో మెస్సియా బేత్లహేములో పుడతాడనే విషయం మాత్రమే కాకుండా, ఆయనకు సంబంధించిన పూర్వ ఉనికిని అనగా “పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము” అని కూడా గమనించవచ్చు. కాబట్టి బేత్లహేములో పుట్టిన యేసుక్రీస్తు ఉనికి బేత్లహేములో పుట్టినప్పుడే ప్రారంభమైందా? లేక ఆయన అంతకుముందే ఉన్నాడా? అనే ప్రశ్నకు క్రొత్త నిబంధన తెలిపిన ఆధారాలను పరిశీలన చేద్దాం.
ఈ అంశంలో మూడు ప్రధాన విషయాలను చూద్దాం
1. మెస్సియా ఎక్కడ పుడతాడు?
2. ఆయన ఏ రాజ్యాన్ని ఏలుతాడు?
3. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ప్రత్యక్షత
1️⃣ *మెస్సీయ ఎక్కడ పుడతాడు?*
మీకా 5:2లో కనిపించే బేత్లెహేము ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రవక్త మీకా జీవించిన కాలాన్ని గమనించాలి. మీకా 1:1 ప్రకారం ఆయన యూదా రాజులైన యోతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో ప్రవచించాడు. ఈ కాలం క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దానికి చెందుతుంది. మీకా ప్రవచన సేవకు ఖచ్చితమైన ఒక్క సంవత్సరం చెప్పడం కష్టం; చారిత్రక ఆధారాల ప్రకారం ఆయన సేవ సుమారుగా క్రీ.పూ. 740–700 మధ్యకాలంలో, ముఖ్యంగా క్రీ.పూ. 8వ శతాబ్దం చివరి భాగంలో కొనసాగినట్లు అర్థమవుతుంది.
మీకా గారు ఎవరికీ చెప్పారు? ఆయన ప్రధానంగా ఇశ్రాయేలు మరియు యూదా ప్రజలను, ముఖ్యంగా యూదాలోని ప్రజలను ఉద్దేశించి దేవుని సందేశాన్ని ప్రకటించాడు (మీకా 1:1). ఆయన కాలంలో పరిస్థితి సాధారణంగా ప్రశాంతంగా లేదు. అష్షూరు సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తూ ఇశ్రాయేలు, యూదా దేశాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజధాని క్రీ.పూ. 722/721లో అష్షూరీయుల చేతిలో పడిపోయింది తరువాత క్రీ.పూ. 701లో సన్నెహెరీబు యూదాపై దండెత్తి యెరూషలేమును తీవ్రంగా బెదిరించాడు. ఇదే సమయంలో దేశంలో సామాజిక అన్యాయం, అధికారుల దోపిడీ, ధనవంతులు బలహీనుల భూములను స్వాధీనం చేసుకోవడం, నాయకుల అవినీతి వంటి విషయాలను మీకా తీవ్రంగా ఖండించాడు (మీకా 2:1–2; 3:1–12).
అటువంటి భయంకరమైన రాజకీయ, సామాజిక పరిస్థితిలో మీకా కేవలం తీర్పు గురించి మాత్రమే మాట్లాడలేదు దేవుడు తన ప్రజలకు భవిష్యత్తులో ఒక పరిపాలకుడిని ఇస్తాడనే నిరీక్షణను కూడా ప్రకటించాడు. అదే మీకా 5:2లో, “బేత్లెహేము ఎఫ్రాతా... నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును” అని చెప్పబడింది. బేత్లెహేము యూదా వంశాలలో చిన్నదిగా కనిపించినప్పటికీ, అక్కడి నుండే ఇశ్రాయేలును ఏలబోవు అధిపతి వస్తాడని ప్రవక్త ప్రకటించాడు. ఈ ప్రవచనం కేవలం ఒక పట్టణం పేరు చెప్పడం కాదు సుమీ! దేవుని ప్రజలకు భవిష్యత్తులో వచ్చే పరిపాలకుని గురించి ఇచ్చిన నిరీక్షణ సందేశం మాత్రమే. అదే వచనంలో ఆయనకు సంబంధించినది “పురాతన కాలము మొదలుకొని...” అని కూడా చెప్పబడుతుంది. అందువల్ల ఈ వచనం ఆయన జన్మస్థలంతో పాటు ఆయనకు సంబంధించిన పురాతనత్వాన్ని కూడా ప్రస్తావిస్తుంది.
🔴 *మీకా 5:2 ప్రవచనం యొక్క నెరవేర్పు*
మీకా ఈ మాటలు చెప్పిన కొన్ని శతాబ్దాల తరువాత, యేసుక్రీస్తు యూదయలోని బేత్లెహేములో జన్మించాడు. మత్తయి 2:1లో “యూదయలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు” అని స్పష్టంగా నమోదు చేయబడింది. యేసు జన్మించిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, “యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?” అని హేరోదును అడిగారు. ఈ విషయం విని హేరోదు కలవరపడ్డాడు. అప్పుడు ఆయన ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి మెస్సియా ఎక్కడ పుట్టాలి? అని అడిగాడు. వారు మీకా 5:2లోని ప్రవచనాన్ని ఆధారంగా చేసుకొని “యూదయలోని బేత్లెహేములో” అని సమాధానమిచ్చారు (మత్తయి 2:3–6).
మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మీకా ముందుగా “బేత్లెహేము” అని ప్రకటించాడు మత్తయి తరువాత యేసు బేత్లెహేములో జన్మించాడని నమోదు చేశాడు. అంతేకాక మత్తయి 2:6లో ఆ సంఘటనను నేరుగా మీకా 5:2 ప్రవచనంతో అనుసంధానించాడు. అంటే క్రీస్తు జన్మస్థలం గురించి మీకా చెప్పిన ప్రవచనం, యేసు జననంలో నెరవేరిందని మత్తయి సువార్తకుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. "అందుకు వారు — యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి." (మత్తయి. 2:5-6)
2️⃣. *ఆయన ఏ రాజ్యాన్ని ఏలుతాడు?*
మీకా 5:2లో కేవలం మెస్సీయా ఎక్కడ జన్మిస్తాడు అనే విషయమే కాదు. ఆయన ఎవరు, ఎవరిని ఏలుతాడు, ఆయన రాజ్యం ఏ స్వభావం కలది, ఆయనకు ఉన్న పూర్వ ఉనికి ఏమిటి అనే గొప్ప సత్యాలు కూడా కనిపిస్తాయి. ఈ ప్రవచనాన్ని క్రొత్త నిబంధన వెలుగులో పరిశీలిస్తే, బేత్లెహేములో జన్మించిన యేసుక్రీస్తే దావీదు వంశానికి చెందిన రాజు, ఆయన రాజ్యమే దేవుని రాజ్యం, ఆ రాజ్యంలోకి ప్రజలు ప్రవేశించుట క్రీస్తు సంఘంలో చేరుటతో సంబంధమున్నదని స్పష్టమవుతుంది.
“ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు” (మీకా 5:2) అని ఉంది. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని కచ్చితంగా పరిశీలించాలి. దేవుడు దావీదుతో, అతని సింహాసనం మరియు రాజ్యానికి సంబంధించి ఇలా వాగ్దానం చేశాడు. "కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము– సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా— గొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.౹ నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.౹ మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్టపట్టకయుండునట్లుగా చేసి నీ శత్రువులమీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగా– నేను నీకు సంతానము కలుగజేయుదును.౹ నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతోకూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.౹ అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;౹ నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతునుగాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.౹ నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.౹" (2 సమూయేలు. 7:8-16).
పరలోకమందున్న దేవుడు దావీదుతో చేయబడిన నిబంధన విషయములో నాలుగు ముఖ్యమైన సంగతులు చూడగలం.
1. నీవు నీ పితరులతోకూడ నిద్రించిన తరువాత…
2. నీ సంతతిని హెచ్చించి…
3. అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను,.. (నిత్యం అనగా ఎల్లప్పుడూ… సోలోమాన్ గూర్చి ఐతే కాదు)
4. నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడైయుండును.
ఈ వాగ్దానం కేవలం దావీదు జీవించిన కాలంలోని భౌతిక రాజ్యానికి లేదా తదనంతరం తన కుమారుడైన రాజైన సోలోమాన్ కి మాత్రమే పరిమితం కాదని దావీదు వంశం నుండి వచ్చే మెస్సీయా ద్వారా నెరవేరబోయే గొప్ప రాజ్యాన్ని అది సూచిస్తుంది అని గుర్తించుము. దావీదు సింహాసనానికి వారసుడైన యేసు గురించి దేవదూత ఇలా ప్రకటించాడు. "ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను." (లూకా 1:31-33).
ఇప్పుడైతే యేసు దావీదు సింహాసనంపై రాజుగా కూర్చున్నాడు. ఆయన రాజ్యానికి అంతము ఉండదు. అయితే ఆ రాజ్యం ఎక్కడ ప్రత్యక్షమైంది? యేసు స్వయంగా చెప్పాడు “ఈ బండమీద నా సంఘమును కట్టుదును… పరలోకరాజ్యపు తాళపుచెవులు నీకిచ్చెదను.” (మత్తయి 16:18–19) ఇక్కడ సంఘం మరియు రాజ్యం అనే రెండు పదాలు ఒకే సందర్భంలో క్రీస్తుతో సంబంధించి ఉపయోగించబడ్డాయి. కొద్ది వచనాల తరువాత యేసు “రాజ్యము వచ్చుట” గురించి మాట్లాడుతున్నాడు (మత్తయి 16:28). క్రీస్తు పునరుత్థానానంతరం అపొస్తలులు రాజ్యాన్ని ప్రకటించారు. పౌలు క్రీస్తులో ఉన్నవారిని గురించి "ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.౹.”(కొలొస్సయులకు 1:13) అలాగే యోహాను గారు “నేను… యేసునందలి శ్రమలోను, రాజ్యములోను…”(ప్రకటన 1:9) "... నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.౹"(ప్రకటన. 5:9) అందువల్ల క్రీస్తు రాజ్యం అనేది కేవలం భవిష్యత్తులో భూమిపై స్థాపించబడబోయే రాజకీయ రాజ్యం కాదు లేదా మరల వచ్చి రాజ్యం స్థాపించి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారని కాదు. తండ్రియైన దేవుని చేత తన ప్రజలకు ప్రభువుగా క్రీస్తు(అభిశక్తుడుగా) నియమించబడిన(అపో కార్య 2:36) ప్రస్తుతం క్రీస్తు రాజుగా ఉన్నాడు ఆయన రాజ్యమైన సంఘం ఇప్పటికే ఉనికిలో ఉంది. అయితే “రాజ్యం” అనే పదం ప్రతి సందర్భంలో కేవలం “సంఘ భవనం” అనే అర్థం కాదు. రాజ్యం అంటే రాజు యొక్క పరిపాలన, రాజాధికారం, మరియు ఆ పరిపాలనకు లోబడిన ప్రజలు అనే భావం కూడా కలిగి ఉంటుంది. క్రొత్త నిబంధనలో క్రీస్తు రాజ్యానికి సంబంధించిన ప్రజలు సంఘంగా అదే క్రీస్తు సంఘముగా(చర్చ్ ఆఫ్ క్రైస్ట్) ప్రత్యక్షమవుతారు.
అందువల్ల బేత్లెహేములో యేసు జన్మించాడు అనేది ఆయన ఉనికి అక్కడ మొదలైందని కాదు. బేత్లెహేములో శరీరధారణ జరిగింది; కానీ వాక్య ప్రకారం క్రీస్తు అంతకుముందే ఉన్నాడు. ఆయన దావీదు సింహాసనానికి రాజు, ఆయన రాజ్యానికి అంతము లేదు, ఆయన సంఘానికి శిరస్సు, ఆయన తన ప్రజలను తన రక్తంతో సంపాదించాడు. మీకా 5:2ను క్రొత్త నిబంధన వెలుగులో చదివినప్పుడు బేత్లెహేములో జన్మించిన శిశువు కేవలం ఒక మానవ శిశువు కాదు పూర్వ ఉనికి కలిగిన మెస్సీయా, దావీదు సింహాసనానికి రాజు, అంతము లేని రాజ్యానికి అధిపతి, తన రక్తంతో ప్రజలను సంపాదించిన క్రీస్తు అని వాక్యాల సమగ్ర సాక్ష్యం తెలియజేస్తుంది.
📝 *పురాతనకాలము* అనగా గతకాలం, పూర్వకాలం, గడిచినకాలం, ఎంతో ముందటి కాలం, ఆదియందు మరియు అనాదిలో(కాలము, సమయం ఏర్పాటు చేయబడక మునుపు) అనే భావం.
📝 *శాశ్వతకాలము* అనగా అంతము లేనికాలం, యుగయుగములు, నిత్యత్వం అనే భావం.
ఇవి కాలానికి సంబంధించిన రెండు భిన్న భావాలను సూచిస్తున్నాయి. కావున “పూర్వకాలము = శాశ్వతకాలము” అని చెప్పడం సరైనది కాదని మొదటగా గుర్తించుకోవాలి.
3️⃣. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము
🔴𒐕. *సృష్టికి పూర్వము — తండ్రియొద్ద క్రీస్తు*
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మనిషిగా జన్మించినప్పుడే ఆయన ఉనికి ప్రారంభమైందని బైబిలు బోధించదు. ఆయన బేత్లెహేములో శరీరధారణ చేసి మనుష్యుల మధ్యకు వచ్చాడు(యోహాను 1:14) అయితే అంతకుముందే ఆయన ఉనికిలో ఉన్నాడు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు స్వయంగా తన మాటల ద్వారా స్పష్టంగా తెలియజేశాడు. "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹ చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.౹ తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను 17:3-5) ముఖ్యముగా 5 వ వచనములో లోకం పుట్టకముందే తండ్రియొద్ద తనకు మహిమ ఉందని క్రీస్తు తెలియజేస్తున్నాడు.
కాబట్టి క్రీస్తు సృష్టిలో భాగంగా తరువాత ఉనికిలోకి వచ్చినవాడు కాదు మరియు తండ్రి చేత సృష్టించబడినవాడు కాదు. సృష్టికి పూర్వమే ఉన్నవాడు. వీలైతే ఆదిసంభూతుడు అనే అంశము చదవండి.
🟢𒐖. సృష్టి ఆరంభంలో — వాక్యముగా ఉన్న క్రీస్తు
యోహాను సువార్త మొదటి అధ్యాయం ఈ విషయాన్ని మరింత స్పష్టంగా వివరిస్తుంది. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.౹ ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,౹ కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు.౹" (యోహాను. 1:1-3) తరువాత అదే అధ్యాయంలో “..వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను” అని యోహాను 1:14 చెబుతున్నాడు. అందువల్ల ఆ వాక్యం శరీరధారిగా మన మధ్య నివసించిన క్రీస్తుతో సంబంధం కలిగివుంది.
అంతేకాదు సమస్తము ఆయన ద్వారా సృష్టించబడిందని "ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹ ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹" (కొలస్సి. 1:15-17)“ఆయనే అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు” అని ప్రకటించబడింది. కాబట్టి సృష్టి ఉనికిలోకి రాకముందే క్రీస్తు ఉన్నాడు. సృష్టి జరిగినప్పుడు ఆయన ఉన్నాడు. సమస్తము ఆయన ద్వారా కలిగింది.
ఇది క్రమం 👇
ఆదిలో వాక్యము ఉంది — ఆ వాక్యము దేవునియొద్ద ఉంది — సమస్త సృష్టి ఆయన ద్వారా కలిగింది — తరువాత ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించింది.
కాబట్టి క్రీస్తు యొక్క ఉనికి మరియ తల్లి గర్భంలో పుట్టడంతో ప్రారంభమైనది కాదు.
🟡𒐗. *అబ్రాహాము కాలంలో — క్రీస్తు ఉనికి*
అబ్రాహాము నుండి యేసుక్రీస్తు వరకు సుమారు 2000 సంవత్సరాల కాలవ్యవధి. కాలక్రమంగా చూస్తే అబ్రాహాము తరువాత యేసుక్రీస్తు జననం. క్రీస్తు వంశాలి చూస్తే 42 తరాలు ఉన్నాయి (మత్తయి. 1:1-17 cf) కానీ యేసు తన పూర్వ ఉనికిని అబ్రాహాముతో సంబంధపెట్టి కూడా ప్రకటించాడు. యోహాను 8:56–58లో యూదులు అబ్రాహాము గురించి మాట్లాడుతున్నప్పుడు, "మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.౹ అందుకు యూదులు— నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,౹ యేసు– అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.౹" ముఖ్యంగా యేసు “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నాను” అని చెప్పాడు. ఇక్కడ యేసు తన ఉనికిని అబ్రాహాము పుట్టిన తరువాత ప్రారంభమైనదిగా చెప్పడం లేదు. అబ్రాహాము కంటే ముందే తాను ఉన్నానని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. “నేను ఉన్నాను” (ἐγώ εἰμι — ego eimi) అని అన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ఉనికి మానవ జననంతో ప్రారంభమైందని చెప్పడానికి ఈ వాక్యం అవకాశం ఇవ్వదు.
✅ బేత్లెహేము = యేసు మానవ జన్మస్థలం
✅ అబ్రాహాము కంటే ముందు = ఆయన పూర్వ ఉనికి
ఇక్కడ మీరు మరొక్క విషయాన్ని లేవనెత్తవచ్చు అదేమనగా… యోహాను 8:56వ లో “అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను” అబ్రాహాము ఏమి చూచెను? ప్రభువు చిత్తమైతే వేరొక్క అంశం ద్వారా మీ యెదుట పెట్టుటకు ప్రయత్నం చేస్తాం.
🟣𒐘. *నోవహు కాలంలో — క్రీస్తు ఉనికి*
క్రీస్తు ఉనికి బేత్లెహేములో ఆయన జన్మించినప్పుడే ప్రారంభం కాలేదని ఇప్పటికే చూశాము. సృష్టికి ముందే ఆయన ఉన్నాడని యోహాను 1:1–3, యోహాను 17:5 వంటి వాక్యాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు నోవహు కాలాన్ని పరిశీలించినప్పుడు... నోవహు కుటుంబం మినహాయించి యావత్తు మానవజాతి వివాహ బాంధవ్యం విషయములో దేవునికి విరోధంగా నడిచింది.(ఆది.కాం. 6:1-9) అప్పుడు దేవుడు లోకంపై తీర్పు తీర్చాలని నిర్ణయించాడు. (ఆది.కాం. 6:11-13) నోవహు దేవుని చేత హెచ్చరింపబడి ఓడను సిద్ధం చేశాడు. (ఆది.కాం. 6:14-22; హెబ్రీ. 11:7) అట్టి ఆ కాలంలో కూడా క్రీస్తుకు సంబంధించిన కార్యం ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఇచ్చిన వివరణలను పరిశీలించాలి. అందులో నోవహు కాలానికి సంబంధించిన ముఖ్యమైన వాక్యం 1 పేతురు 3:18–20.
"దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.౹" ఈ వచనాన్ని జాగ్రత్తగా చదవాలి. పేతురు చెప్పే పూర్తి సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోకుండా “యేసు భౌతిక శరీరంతో నోవహు దగ్గరకు వెళ్లాడు” అని చెప్పడం సరైనది కాదు. క్రీస్తు అప్పటికే ఉనికిలో ఉన్నాడనే సత్యానికి ఇది విరుద్ధం కాదు. మనం గుర్తించవలసింది“ క్రీస్తు పూర్వ ఉనికి — ఆత్మ సంబంధమైన కార్యం — నోవహు కాలంలోని అవిధేయత”. కాబట్టి ఈ వచనాన్ని అతిగా విస్తరించకుండా, లేఖనం చెప్పినంతవరకే చెప్పాలి.
🟢 𒐙. అరణ్యంలో ఇశ్రాయేలీయులతో — క్రీస్తు ఉనికి
పాత నిబంధన కాలంలోని సంఘటనలను క్రొత్త నిబంధన కొన్నిసార్లు మరింత లోతుగా వివరిస్తుంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో పొందిన ఆధ్యాత్మిక ఆహారం, ఆధ్యాత్మిక పానీయం గురించి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణచేత ఇలా వ్రాశారు. "సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;౹ అందరును మోషేనుబట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;౹ అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;౹ అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.౹ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.౹ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి." (1 కొరింథీయులకు 10:1-6)
ముఖ్యముగా “తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.” అనే విషయానికి వస్తే అరణ్యంలో ఇశ్రాయేలీయులతో జరిగిన సంఘటనను క్రీస్తుతో అనుసంధానిస్తున్నాడు. అందువల్ల బేత్లహేములో క్రీస్తు మానవునిగా పుట్టకముందే ఆయనకు పూర్వ ఉనికి ఉందనే విషయం నూతన నిబంధన సాక్ష్యంతో స్పష్టమవుతుంది.
ముగింపు:
ఓ చదువరి… మీకా గ్రంథము 5వ అధ్యాయం మెస్సియా గురించి ముందుగానే ప్రకటించిన సంగతి ఆయన బేత్లహేములో పుడతాడు (మీకా 5:2) దావీదు సింహాసనంతో సంబంధం కలిగిన ఆత్మ సంబంధమైన రాజు (లూకా 1:30–33) ఆయన రాజ్యం శాశ్వతమైనది (దానియేలు 2:44) ఆయన రక్తంతో ప్రజలను దేవుని కొరకు కొనుగోలు చేశాడు (ప్రకటన 5:9–10) ఆయన పూర్వకాలం నుండి ఉన్నవాడు (మీకా 5:2; యోహాను 1:1; 8:56–58; 17:5; 1 కొరింథీయులకు 10:1-6; 1 పేతురు 3:18–20) ఆయన అందరికీ ప్రభువుగా ఉండుటకు తండ్రియైన దేవునిచేత నియమింపబడినవాడు అని గుర్తించుము (అపొస్తలుల కార్యములు 2:36; 10:36)
మీ ఆత్మీయులు


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com
Note: Only a member of this blog may post a comment.