మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏
నేడు మనం, మనకు చాలా సాధారణంగా వినిపించే మరియు లోతైన ఒక ప్రశ్నను పరిశీలించబోతున్నాం అదేమనగా… “సిలువలో తనను తాను రక్షించుకోలేని యేసు మనల్ని ఎలా రక్షించగలడు?” ఇదేమీ కొత్త ప్రశ్న కాదు 2000 సంవత్సరాల క్రితం నుండే ఉంది. "ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు –దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు –వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము." (మత్తయి. 27:39-42)
వారు ఎగతాళి చేస్తూ అన్న మాటలు ఇవి. కాని ఆ సిలువలో యేసు ఏమియు మాట్లాడకుండా నిశ్శబ్దముగా ఉండుటలో గొప్ప ఆత్మీయ సత్యం దాగి ఉంది.
👉 యేసు నిజంగా తనను తాను రక్షించుకోలేకపోయాడా?
👉 లేక ఆయన ఉద్దేశపూర్వకంగానే రక్షించుకోలేదా?
వాక్య ఆధారంగా దీనికి సమాధానం తెలుసుకుందాం.
1️⃣. యేసు బలహీనుడు కాదు — అధికారమున్న రక్షకుడు
సిలువపై యేసును చూసినవారు ఒక నిర్ణయానికి వచ్చారు "–నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి." (లూకా 23:37) కాని వారు చూసింది బాహ్య పరిస్థితి మాత్రమే, తెలుసుకోలేకపోయింది అతని అంతర్గత అధికారము, తన దేవుని సంకల్పం.
▪️ సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు - (మత్తయి. 16:16)
▪️యేసు బలహీనుడు కాదు — తన ప్రాణంపై అధికారమున్నవాడు - (యోహాను 10:17-18)
▪️ఆయనను ఎవరూ బలవంతంగా చంపలేదు - (యోహాను. 19:11)
▪️తన తండ్రిని(YHWH) పండ్రెండు సేనా వ్యూహములకంటె(72,000) ఎక్కువ మంది దూతలను వేడుకొనే అధికారం ఆయనకు ఉంది - (మత్తయి 26:53)
▪️ఆయన స్వచ్ఛందంగానే తన ప్రాణమును ఇచ్చినవాడు - (యోహాను 10:18)
▪️దేవుని స్వరూపములో ఉన్నా తన్ను తాను తగ్గించుకున్నాడు - (ఫిలిప్పీయులకు 2:6-7)
▪️మరణమువరకు విధేయుడై సిలువను అంగీకరించాడు - (ఫిలిప్పీయులకు 2:8)
▪️ఒక మాటతో శత్రువులను(యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను) కూల్చగలిగినవాడు - (యోహాను 18:3,5-6)
▪️ప్రకృతి, దయ్యములు, మరణంపై అధికారమున్నవాడు - (మార్కు 4:39; లూకా 4:36; యోహాను 11:43)
▪️సిలువలో ఆయన నిశ్శబ్దం బలహీనత కాదు — అది దేవుని శక్తి - (1 కొరింథీయులు 1:18)
▪️తనను రక్షించుకోలేదు — ఎందుకంటే అది స్వచ్ఛంద త్యాగం - (యెషయా 53:7)
2️⃣. తనను తాను ఎందుకు రక్షించుకోలేదు?
యేసు తనను తాను రక్షించుకుంటే:
✔️ మనుషుల పాపానికి పరిహారం ఉండదు
✔️ దేవుని న్యాయం నిలబడదు
✔️ రక్షణ అసాధ్యం అవుతుంది
మార్కు 10:45 - “అనేకుల కొరకు ప్రాణము విమోచనంగా ఇచ్చెను”
👉 యేసు తనను తాను రక్షించుకోలేదు
👉 ఎందుకంటే నిన్ను రక్షించాలనుకున్నాడు
▪️దేవుని ప్రణాళిక నెరవేర్చుటకై - (మత్తయి 26:54)
▪️మానవ పాపానికి క్రీస్తు రక్తబలి అవసరమైంది కనుకే - (హెబ్రీయులకు 9:16-28)
▪️మన స్థానంలో మరణించుటకై - (2 కొరింథీయులు 5:21)
▪️సిలువలో మానవజాతికి దేవుని ప్రేమను చూపుటకై/పరిచయం చేయుటకై - (రోమీయులు 5:8)
▪️తండ్రి చిత్తానికి విధేయతకై - (ఫిలిప్పీయులకు 2:8)
▪️అపవాది శక్తిని/బలమును ఓడించుటకై - (కొలస్సీయులు 2:15; హెబ్రీయులకు. 2:13)
▪️నిత్య రక్షణను అనుగ్రహించుటకై - (హెబ్రీయులకు 5:9)
▪️ విశ్వాసముంచు వారికి నిత్యజీవము ఇచ్చుటకై - (యోహాను 3:16)
▪️తనను కాదు — మనలను రక్షించుటకై - (మార్కు. 10:45)
3️⃣. సిలువ మరణం — దేవుని ప్రణాళిక
యేసు మరణం ఒక యాదృpచ్ఛిక ఘటన కాదు. ఇది ముందే ప్రవచించబడింది.
📜 పాత నిబంధన ప్రవచనలు
యెషయా 53:5-7 - బాధపడే సేవకుడు (Suffering Servant) “మన దోషములకొరకు గాయపరచబడెను”
కీర్తనలు 22 - సిలువ దృశ్యాన్ని ముందే వర్ణించింది
చేతులు, కాళ్లు చీల్చబడుట, ఎగతాళి
జెకర్యా 12:10 - “తాము గుచ్చినవానిని చూచెదరు”
👉 సిలువ సంఘటన — దేవుని శాశ్వత యోచనలో భాగం
👉 యేసు ప్రార్ధన :
"కొంత దూరము వెళ్లి, సాగిలపడి- నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను." (మత్తయి. 26:39)
"మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి" (మత్తయి. 26:42)
▪️దేవుని అనాది సంకల్పం - (1 పేతురు. 1:18-20)
▪️సిలువ మరణం దేవుని ముందస్తు యోచన - (ప్రకటన 13:8)
▪️లేఖనములు నెరవేరుటకై సిలువ మరణం జరిగింది - (లూకా 24:46)
▪️దేవుని నిర్ణయ ప్రకారమే యేసు అప్పగింపబడ్డాడు - (అపొస్తలుల కార్యములు 2:23)
▪️పాపానికి పరిహార బలిగా యేసు నియమించబడ్డాడు - (యెషయా 53:10)
▪️మానవుల దుష్టచర్యలలోనూ దేవుని యోచన నెరవేరింది - (అపొస్తలుల కార్యములు 4:27-28)
▪️మన దోషములు ఆయనమీద మోపబడినవి - (యెషయా 53:5-6)
▪️సిలువ దేవుని రక్షణ ప్రణాళిక యొక్క కేంద్రం - (1 కొరింథీయులు 1:23-24)
4️⃣. సిలువలో ఏమి జరిగింది?
యేసు మరణం ఒక సాధారణ మరణం కాదు అది ప్రతినిధి మరణం (Substitutionary Atonement) అనగా ఒక వ్యక్తి స్థానంలో మరొకరు మరణించడం లేదా వారి పాపాలకు/శిక్షకు బదులుగా తమ ప్రాణాన్ని అర్పించడం. ఇది ప్రధానంగా, యేసు క్రీస్తు మానవాళి పాపాల కోసం శిక్ష అనుభవించి, దేవునితో సమాధానపరిచాడనే విశ్వాసం. ఇది ఒక వ్యక్తి తప్పుకు మరొకరు మూల్యం చెల్లించే ప్రక్రియ.
▪️పాపము లేనివాడు మన కొరకు పాపముగా చేయబడెను - (2 కొరింథీయులు 5:21)
▪️ నీతిమంతుడైన యేసు అనీతిమంతులైన మనలను దేవుని యొద్దకు చేర్చుటకై మరణించాడు - (1 పేతురు 3:18)
▪️మన పాపములను తన శరీరము పైన మోసికొన్నాడు - (1 పేతురు 2:24)
▪️మన దోషములకొరకు ఆయన గాయపరచబడెను - (యెషయా 53:5)
▪️మన యందరి దోషమును ఆయనపై ఉంచెను - (యెషయా 53:6)
▪️ శాపమును మనకొరకు ఆయన భరించాడు - (గలతీయులకు 3:13)
▪️ధనవంతుడైయుండి మనకొరకు దరిద్రుడాయెను - (2 కొరింథీయులు 8:9)
▪️మరణమును రుచి చూచి మనకు జీవము ఇచ్చాడు - (హెబ్రీయులకు 2:9)
▪️సిలువ బలి ద్వారా మనకు క్షమాపణ సంపాదించబడింది - (హెబ్రీయులకు 9:28)
▪️సిలువ మరణం ద్వారా మనకు జీవము, దేవునితో సమాధానం లభించింది - (రోమీయులు 5:8-10).
5️⃣. ఎగతాళి చేసిన వారి మాటలలో దాగిన సత్యం
“–వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము." (మత్తయి. 27:42)
ఇది వ్యంగ్యం మాట కాదు — అజ్ఞానపు మాట
👉 అక్కడ కొందరి విశ్వాసం :
యేసు బలహీనుడు — రక్షించుకోలేడు
👉 కానీ వాస్తవం :
యేసు తనను తాను రక్షించుకోలేదు — మనలను రక్షించడానికి సిలువ మరణం/దేవుని సంకల్పం నెరవేర్చుటకు... కావున వారు అన్నది అపహాస్యం. దేవుడు దానిని రక్షణ సత్యంగా మార్చాడు.
📌 దాగిన సత్యం :
🔘 ఆయన దిగితే — తనను రక్షించుకుంటాడు.
🔘 ఆయన దిగకపోతే — మనలను రక్షిస్తాడు అందుకే ఆయన ఎంచుకున్నది సిలువలో ఉండటం… ఇందుకే అక్కడ వారు ఆయన్ను పరీక్షించినప్పటికి ఆయన దేవుని సంకల్పాన్ని మన కోసం విడిచిపెట్టలేదు. ఇది మానవజాతి యెడల ఆయనకు ఉన్న ప్రేమ, తాగ్యం.
▪️ఎగతాళి — అజ్ఞానపు మాటలు, సత్యం ఎరుగని మాటలు - (మత్తయి 27:42)
▪️“ఇతరులను రక్షించెను” — అని వారు ఒప్పుకున్న సత్యం - (మత్తయి. 27:42)
▪️రక్తం చిందింపబడకపోతే(దిగితే) రక్షణ, క్షమాపణ లేదు - (హెబ్రీయులకు 9:22)
▪️ఎగతాళి మాటలే — చివరికి దైవ సంకల్పాన్ని నెరవేర్చింది. - (అపొస్తలుల కార్యములు 2:23)
▪️తనను రక్షించుకోలేదు — మనలను రక్షించుటకై ఈ సిలువ యాగం - (మార్కు. 10:45).
6️⃣. పునరుత్థానం — అంతిమ సాక్ష్యం
యేసుక్రీస్తు సిలువపై మరణించడం క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అయినప్పటికీ, ఆ మరణం యొక్క అర్థం మరియు శక్తి పూర్తిగా వెల్లడించబడింది ఆయన పునరుత్థానంలోనే. సిలువలో ఆయన పాపానికి పరిహారం చెల్లించాడు, కానీ పునరుత్థానం ద్వారా ఆ పరిహారం దేవునిచే అంగీకరించబడిందని నిర్ధారించబడింది.
“....దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందుగా వాగ్దానముచేసెను. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు...” (రోమా. 1:4)
పునరుత్థానం సిలువలో జరిగిన రక్షణ కార్యానికి ధృవీకరణ. రోమీయులు 4:25 ప్రకారం, ఆయన మన నీతీకరణ కొరకు లేపబడెను. అంటే, యేసు మరణం ద్వారా పాప పరిహారం జరిగింది, కానీ ఆయన లేచుట ద్వారా ఆ పరిహారం ఫలితం మనకు వర్తించబడింది. పునరుత్థానం లేకపోతే సిలువ కార్యం పూర్తి కాలేదని భావించవచ్చు. మరియు, పునరుత్థానం మరణంపై సంపూర్ణ విజయం. అపొస్తలుల కార్యములు 2:24 ప్రకారం, మరణము ఆయనను పట్టుకోలేకపోయింది. యేసు మరణాన్ని జయించి, జీవమును తిరిగి పొందినవాడు. అందువల్ల ఆయనకు మరణంపై అధికారము ఉంది (ప్రకటన 1:18). ఇది విశ్వాసులకు గొప్ప ఆశను ఇస్తుంది.
పౌలు స్పష్టంగా చెబుతున్నాడు 1 కొరింథీయులు 15:17 — “క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థము.” అంటే, పునరుత్థానం లేకపోతే క్రైస్తవ విశ్వాసం నిలబడదు. అందువల్ల పునరుత్థానం సువార్తకు కేంద్ర బిందువు.
ఇంకా, పునరుత్థానం ఒక కొత్త సృష్టి ప్రారంభం. 1 కొరింథీయులు 15:20 ప్రకారం, యేసు “మొదటి ఫలము.” ఆయన లేచినట్లు విశ్వాసులు కూడా లేవబోతున్నారు. ఇది భవిష్యత్తులో మన పునరుత్థానానికి హామీ.
యోహాను 11:25 లో యేసు చెప్పినట్లు, “నేనే పునరుత్థానమును జీవమును.” ఆయనను నమ్మినవారు శాశ్వత జీవం పొందుతారు. ఇది క్రైస్తవ ఆశ యొక్క కేంద్రం. అంతేకాక, యేసు పునరుత్థానమైన తర్వాత కూడా సజీవ రక్షకుడిగా కొనసాగుతున్నాడు. హెబ్రీయులకు 7:25 ప్రకారం, ఆయన సదాకాలము జీవించి విశ్వాసుల కొరకు మధ్యవర్తిత్వం చేయుచున్నాడు. రోమీయులు 8:34 ప్రకారం, ఆయన దేవుని యెదుట మనకొరకు ప్రార్థించుచున్నాడు.
అందువల్ల, పునరుత్థానం కేవలం ఒక అద్భుతం కాదు; అది రక్షణ యొక్క అంతిమ సాక్ష్యం. ఇది యేసు చేసిన పని సత్యమని, సంపూర్ణమని, మరియు శాశ్వతమని నిరూపిస్తుంది. సిలువలో యేసు పాపానికి ధర చెల్లించాడు. పునరుత్థానంలో దేవుడు ఆ ధరను అంగీకరించాడు.
🔥 పునరుత్థానం ద్వారా :
పాపం → శిక్ష చెల్లించబడింది
సాతాను → అధికారమును కోల్పోయాడు
మరణం → ఓడిపోయింది
📖 (1 కొరింథీయులు 15:55-57)
“ఓ మరణమా, నీ గెలుపు ఎక్కడ?”
7️⃣. ముగింపు
సిలువను మనుష్యులు ఓటమిగా చూశారు, కానీ అది దేవుని ప్రణాళికలో విజయానికి మార్గమైంది. యేసు తనను తాను రక్షించుకోలేకపోయాడని కాదు, ఆయన రక్షించుకోలేదు — ఎందుకంటే ఆయన మనలను రక్షించాలనుకున్నాడు. ఆయన సిలువపై ఉండటం బలహీనత కాదు; అది నియంత్రిత శక్తి, సంపూర్ణ విధేయత, మరియు అతి గొప్ప ప్రేమ యొక్క వ్యక్తీకరణ.
సిలువలో ఒక మార్పిడి జరిగింది: మన పాపం ఆయనపై పడింది, ఆయన నీతి మనకు లభించింది. ఎగతాళి చేసిన వారి మాటలలో కూడా దాగి ఉన్న సత్యం ఇదే — ఆయన తనను రక్షించుకోకుండా ఉండడం ద్వారా ప్రపంచానికి రక్షణ ద్వారం తెరిచాడు.
ఈ సత్యానికి అంతిమ ధృవీకరణ పునరుత్థానం. యేసు మరణాన్ని జయించి లేచినందువల్ల, ఆయన చేసిన త్యాగం సంపూర్ణమైందని, దేవుడు దానిని అంగీకరించాడని, మరియు రక్షణ నిజమని నిరూపించబడింది. ఇప్పుడు ఆయన సజీవ రక్షకుడిగా నిలిచి, ఆయనయందు విశ్వాసముంచువారికి నిత్యజీవాన్ని అందిస్తున్నాడు.
👉 కాబట్టి సిలువ ఒక ముగింపు కాదు — అది రక్షణ ప్రారంభం.
👉 పునరుత్థానం ఒక అద్భుతం కాదు — అది రక్షణకు అంతిమ సాక్ష్యం.
👉 “యేసు తనను తాను రక్షించుకోలేకపోయాడు” అనేది అపార్థం
👉 తనను తాను రక్షించుకొనని యేసు, నిన్ను సంపూర్ణంగా రక్షించగలడు/రక్షించగలిగాడు.
మీ ఆత్మీయులు 👪
☑ దేవుని అనాది సంకల్పంక్లిక్ చేయు
☑ యేసు ఎవరు?క్లిక్ చేయు
☑ దేవత్వమా? త్రిత్వమా? త్రియేకమా?క్లిక్ చేయు


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com