దేవుడు హస్తకృతుడు కాదు… నివాసం?



మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠమైన నామములో మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు.


దేవుడు ఎవరో మనుషుల ఆలోచనలతో నిర్ణయించుకోవలసిన విషయం కాదు దేవుడు తన వాక్యములో తనను తాను ఇలా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన నిత్యుడు అనగా ఎల్లప్పుడూ ఉన్నవాడు, అక్షయుడు అనగా క్షయము కానీవాడు, అదృశ్యుడు అనగా కంటికి అగోచరుడు, అమరత్వము గలవాడు అనగా మరణం లేనివాడు, అద్వితీయుడు అనగా ద్వితీయత లేనివాడు అని అర్థం. (1 తిమోతి 1:17; 1 తిమోతి 6:15-16cf) ఆయన “అమరత్వము కలిగినవాడు, సమీపింపరాని తేజస్సులో నివసించువాడు” అని చెప్పబడింది.


అంతటి సర్వోన్నతుడైన దేవుడు మనిషి చేతులతో తయారుచేయబడినవాడు కాదు. మనిషి చేతులతో మలచబడేవాడు కాదు, చెక్కబడేవాడు కాదు, పోతపోయబడేవాడు కాదు. దేవుడు హస్తకృతుడు కాదు అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. అయితే దేవుడు హస్తకృతుడు కాదనే విషయం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. హస్తకృతుడు కాని దేవుడు హస్తకృతమైన ఆలయములో నివసిస్తాడా? అనే ప్రశ్నను కూడా లేఖనాల వెలుగులో పరిశీలించాలి. జగత్తును, అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు “హస్తకృతములైన ఆలయములలో నివసింపడు” అని స్పష్టంగా ప్రకటించబడింది. (అపొస్తలుల కార్యములు 17:24) సొలొమోను కూడా దేవునికి మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు, “ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన ఈ మందిరము ఏపాటిది?” అని ఒప్పుకున్నాడు (1 రాజులు 8:27).


కాబట్టి ఈరోజు మనం పరిశీలించబోయే ప్రధాన సత్యం ఇదే దేవుడు హస్తకృతుడు కాదు, హస్తకృతుడైన దేవుడు కాదు గనుక హస్తకృతమైన ఆలయములో ఆయన నివసించడు. అయితే దేవుని నిజమైన నివాసము ఏమిటి? ఆయన ఎక్కడ నివసిస్తాడు? దేవుని ఆలయం అని లేఖనాలు ఎవరిని పిలుస్తున్నాయి? ఈ విషయాలను బైబిల్ లేఖనాల ఆధారంగా మనం పరిశీలిద్దాం.


1️⃣. దేవుడు హస్తకృతుడు కాదు

మొదటగా మనం స్పష్టంగా గుర్తించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు హస్తకృతుడు కాదు. “హస్తకృతము” అంటే మనిషి చేతులతో తయారు చేయబడినది, మలచబడినది, చెక్కబడినది లేదా పోతపోయబడినది. దేవుడు అలాంటి మనుష్య నిర్మితమైన రూపం కాదు. ఆయనను ఏ మనిషి తన చేతులతో తయారు చేయలేడు, ఏ శిల్పి ఆయనను చెక్కలేడు, ఏ మనిషి ఆయనకు రూపం ఇవ్వలేడు. ఎందుకంటే ఆ ఒక్క దేవుడే సమస్త సృష్టికి సృష్టికర్త ఆయనే యెహోవా(YHWH)  "ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా— యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు."(యెషయా. 45:18) "... సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై యున్నాను.౹"(యోనా. 1:9) "కాబట్టి మనము దేవుని సంతానమై యుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.౹"(ఆపో.కార్య. 17:29)

"–యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా– ఆమేన్ అనవలెను." (ద్వితీయోపదేశకాండము 27:15) అంటే మనిషి తన చేతులతో తయారుచేసిన ఒక రూపాన్ని దేవునిగా భావించడం దేవునికి హేయమైన విషయం. దేవుడు మనిషి చేతిపని కాదు. దేవుడు హస్తకృతుడు కాదు.


పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.౹ పోతపోసిన దేవతలను చేసికొన వలదు.౹.(నిర్గమా. 34:17; 20:4) మీరు వ్యర్థమైన దేవతలతట్టు తిరుగకూడదు. మీరు పోతవిగ్రహములను చేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను... మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.౹ (లేవి. కాం. 19:4; 26:1) కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమనుగాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశమువైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి.౹ మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.౹ పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందేగాని భూమి క్రిందనున్న నీళ్లయందేగాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు.౹ (ద్వితీయ. 4:16-19,23 5:8)


2️⃣ *హస్తకృతమైన విగ్రహాలు నిష్ప్రయోజనమైనవి.*

హస్తకృతమైన విగ్రహాలు అంటే మనిషి తన చేతులతో తయారుచేసిన రూపాలు. అవి శిల్పి చేతులతో మలచబడవచ్చు, చెక్కబడవచ్చు, పోతపోయబడవచ్చు. కానీ మనిషి చేతులతో తయారైనది దేవుడు కాదు. దానిని దేవుడిగా భావించి ఆరాధించడం లేఖనానుసారమైనది కాదు.


యెషయా గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనం నుండి విగ్రహములను నిర్మించువారిని గురించి మాట్లాడుతూ..., వారు మాయవంటివారని, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములని చెబుతుంది. వారు తమ హస్తాలతో విగ్రహాలను నిర్మిస్తారు కానీ తాము నిర్మించినదానిని దేవుడిగా భావిస్తారు. అందుకే “పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు?” అని ప్రశ్నించబడింది (యెషయా 44:9-10). అక్కడ ఆ విగ్రహం ఎలా తయారవుతుందో కూడా వివరించబడింది. ఒక కమ్మరి గొడ్డలిని పదును చేసి, నిప్పులతో పని చేసి, సుత్తితో దానిని రూపించి, తన బాహుబలంతో దానిని తయారుచేస్తాడు. అయితే అతనికి ఆకలి కలిగితే అతని బలం క్షీణిస్తుంది; నీళ్లు త్రాగకపోతే సొమ్మసిల్లుతాడు (యెషయా 44:12). అలాగే వడ్రంగి నూలు వేసి, చీలంతో గీత గీసి, చిత్రికతో దానిని చక్కగా చేసి, కర్కాటముతో గుర్తుపెట్టి ఒక రూపాన్ని తయారుచేస్తాడు. దానిని మందిరంలో ఉంచడానికి తగిన రూపంగా తయారుచేస్తాడు (యెషయా 44:13). అదే చెట్టు నుండి కొంత భాగాన్ని పొయ్యికట్టెలుగా ఉపయోగిస్తాడు. దానితో నిప్పు రాజేసి రొట్టె కాల్చుకుంటాడు, మాంసం వండుకొని భోజనం చేస్తాడు. మిగిలిన భాగాన్ని తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొని దానికి నమస్కరిస్తాడు (యెషయా 44:14-17).

ఒకే చెట్టు ఒక భాగం వంట చేయడానికి ఉపయోగపడుతుంది, మరొక భాగం నిప్పుకు ఉపయోగపడుతుంది, మిగిలిన భాగాన్ని దేవతగా చేసుకొని ఆరాధిస్తాడు. అయినప్పటికీ తాను చేస్తున్నదానిని ఆలోచించడు. అందుకే “వారు వివేచింపరా? వారికి తెలివి లేదా?” అని ప్రశ్నించబడింది. (యెషయా 44:19) అగ్నిలో సగం కాల్చి, దానితో రొట్టె కాల్చి, మాంసం వండుకొని భోజనం చేసిన తరువాత, మిగిలిన దానితో హేయమైనదాన్ని చేసి, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుతున్నప్పటికీ, ఎవడూ ఆలోచించడని చెప్పబడింది.


3️⃣. హస్తకృతమైన విగ్రహాలకు జీవం లేదు.

హస్తకృతమైన విగ్రహాలు మనుషుల చేతులతో తయారుచేయబడిన వస్తువులు మాత్రమే. వాటికి రూపం ఉన్నప్పటికీ జీవం లేదు. అవి మాట్లాడలేవు, చూడలేవు, వినలేవు, వాసన చూడలేవు, ముట్టుకోలేవు, నడవలేవు, తినలేవు.


"వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు." (కీర్తనలు. 115:4-7) అంటే విగ్రహానికి మనిషి రూపం ఇచ్చినప్పటికీ, దానిలో జీవం పెట్టలేడు. కన్నులు తయారుచేయగలడు కానీ చూపును ఇవ్వలేడు. చెవులు తయారుచేయగలడు కానీ వినే శక్తిని ఇవ్వలేడు. నోరు తయారుచేయగలడు కానీ మాటను ఇవ్వలేడు. చేతులు, పాదాలు తయారుచేయగలడు కానీ వాటికి కదిలే శక్తిని ఇవ్వలేడు.

విగ్రహములను నిర్మించువారు మాయవంటివారని, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములని చెప్పబడింది(యెషయా 44:9-10). అలాగే తాను చేసిన విగ్రహాన్ని చూసి కూడా “వివేచింపరా? వారికి తెలివి లేదా?” అని ప్రశ్నించబడింది. (యెషయా 44:19)

బంగారు, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన హస్తకృతమైన విగ్రహాల గురించి మాట్లాడుతూ, అవి చూడలేవు, వినలేవు, నడవలేవు అని వాటి అసమర్థతను ప్రకటన గ్రంథము 9:20లో తెలియజేస్తుంది. కాబట్టి మర్చిపోవద్దు విగ్రహానికి రూపం ఉండవచ్చు, కానీ జీవం లేదు. నోరు ఉండవచ్చు, కానీ మాట లేదు. కన్నులు ఉండవచ్చు, కానీ చూపు లేదు. చెవులు ఉండవచ్చు, కానీ వినికిడి లేదు. పాదాలు ఉండవచ్చు, కానీ నడిచే శక్తి లేదు.


జీవములేని హస్తకృతమైన విగ్రహాన్ని దేవుడిగా భావించి ఆరాధించడం కంటే, సమస్త జీవులకు జీవమును ఇచ్చిన యెహోవా దేవునినే ఆరాధించాలి.


4️⃣. హస్తకృతమైన ఆలయములలో దేవుడు నివసించడు

దేవుడు హస్తకృతుడు కాదు. కాబట్టి మనుషులు తమ చేతులతో కట్టిన భౌతికమైన ఆలయములో దేవుడు నివసించడు. ఒక భవనం ఎంత పెద్దదైనా, ఎంత అందమైనదైనా, ఎంత విలువైనదైనా, దానిని దేవాలయం, మందిరం లేదా చర్చి అని పిలిచినంత మాత్రాన అది దేవుని నివాసస్థలంగా మారదు.


“జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు.” (అపొస్తలుల కార్యములు 17:24) సమస్త జగత్తును నిర్మించిన దేవుడు ఒక మనిషి చేతులతో నిర్మించబడిన భవనంలో బంధించబడే దేవుడు కాదు. ఆకాశమును, భూమిని సృష్టించినవాడు మనుషులు కట్టిన ఒక భౌతిక కట్టడంలో నివసించవలసిన అవసరం లేదు.


"యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది? అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను." (యెషయా 66:1-2) అంటే మనిషి దేవుని కొరకు ఎంత గొప్ప మందిరాన్ని కట్టినా, ఆ మందిరం దేవుని మహిమను పట్టుకోలదు. ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి మనిషి చేతులతో నిర్మించిన కట్టడాన్ని దేవుని నివాసంగా భావించడం లేఖన బోధకు సరిపోదు. "నేను మీతో చెప్పునదేమనగా– ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము" (మత్తయి. 5:34-35)

సొలొమోను దేవుని కొరకు అద్భుతమైన మందిరాన్ని కట్టించినప్పటికీ, ఆ మందిరాన్ని ప్రతిష్ఠించే సమయంలో తానే ఈ సత్యాన్ని ఒప్పుకున్నాడు. "ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము.౹ నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?" (1 రాజులు 8:26-27) సొలొమోను కట్టించిన మందిరం ఎంతో గొప్పదైనా, అది దేవుణ్ణి పట్టజాలదని సొలొమోనుకే తెలుసు. అందువల్ల భౌతికమైన మందిరాన్ని దేవుని నివాసంగా భావించకూడదు. స్తెఫను కూడా ఇదే సత్యాన్ని ప్రకటించాడు. "అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు." (అపొస్తలుల కార్యములు 7:47-50). 


కాబట్టి ఒక ఇల్లు, ఒక గది, ఒక హాలు, ఒక షెడ్, ఒక పెద్ద భవనం లేదా ఎంతో ఖర్చుతో నిర్మించిన ఒక కట్టడాన్ని “దేవుని ఆలయం” అని పిలిచినంత మాత్రాన అందులో దేవుడు నివసించడు. వేలాది, లక్షలాది, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి భౌతికమైన నిర్మాణం చేపట్టి దానిని దేవుని నివాసంగా భావించడం లేఖన బోధ కాదు. భౌతికమైన కట్టడం యొక్క పరిమాణం, అందం, విలువ దేవుని నివాసాన్ని నిర్ణయించవు.

కాబట్టి మీరు మర్చిపోవద్దు దేవుడు హస్తకృతుడు కాదు, అందువల్ల హస్తకృతమైన ఆలయములలో ఆయన నివసించడు.


5️⃣. దేవుడు నివసించే స్థలం — క్రీస్తు సంఘం

దేవుడు హస్తకృతమైన ఆలయములలో నివసించడు అని లేఖనం స్పష్టంగా చెబుతున్నప్పుడు, ఆయన నివాసము ఏమిటో కూడా అదే లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవుడు నివసించే ఆలయం మనుషులు చేతులతో నిర్మించిన భౌతికమైన కట్టడం కాదు, క్రీస్తులో/క్రీస్తు ద్వారా నిర్మించబడిన క్రీస్తు సంఘమే దేవుని ఆలయం.


మన ప్రభువైన యేసుక్రీస్తు, “నీవు పేతురువు; ఈ బండమీద నా(క్రీస్తు) సంఘమును కట్టుదును” అని చెప్పాడు (మత్తయి 16:18). సంఘాన్ని నిర్మించేది క్రీస్తే. అది మనుషులు నిర్మించిన భౌతికమైన భవనం కాదు. సంఘము అనగా క్రీస్తు శరీరము(ఎపేసి. 1:21-23) సంఘానికి శిరస్సు/అధికారి క్రీస్తే (కొలస్సి. 1:18) శరీరము ఒక్కటే(ఎపేసి. 4:4) అదే క్రీస్తు సంఘం(రోమా 16:16)."వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.౹" (1కొరింథీయులకు 3:11)

అయితే అపొస్తలుడైన పౌలు దేవుని నిజమైన నివాసం ఏమిటో తెలియజేస్తున్నాడు. "మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?౹ ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు." 1 కొరింథీయులకు 3:16-17) " ఇక్కడ దేవుని ఆలయం అని భౌతికమైన భవనాన్ని కాకుండా విశ్వాసులను సూచిస్తున్నాడు. దేవుని ఆత్మ వారి మధ్య నివసిస్తున్నందున వారు దేవుని ఆలయముగా ఉన్నారు. కాబట్టి దేవుని ఆలయముగా ఉన్నవారు పరిశుద్ధంగా ఉండాలి. "క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.౹ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.౹ ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు." (ఎఫెసీయులకు 2:20-22)

"మనుష్యులచేత విసర్జింపబడినను, దేవునిదృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,౹ యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.౹" (1 పేతురు 2:4-5) అంటే లో క్రీస్తు “సజీవమునైన రాయి”గా చెప్పబడగా, ఆయనను ఆశ్రయించిన విశ్వాసులు “సజీవమైన రాళ్లవలె ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు” అని చెప్పబడింది. వారు పరిశుద్ధ యాజకులుగా ఆత్మసంబంధమైన బలులను సమర్పించవలసినవారిగా చూపబడుతున్నారు.


కాబట్టి దేవుని ఆలయం అనేది కేవలం ఒక భౌతిక కట్టడం కాదు. ఇటుకలు, రాళ్లు, సిమెంట్, ఇనుము, కలపతో నిర్మించిన భవనం దేవుని నిజమైన నివాసమని లేఖనం చెప్పడం లేదు. క్రీస్తులో రక్షించబడి, ఆయన వాక్యమును/అపోస్తలుల బోధను అనుసరించి, పరిశుద్ధులుగా జీవించే విశ్వాసుల సమూహమే దేవుని ఆలయము/క్రీస్తు సంఘము. 

అందువల్ల భౌతికమైన చర్చి భవనం ఎంత గొప్పదో అనే దానికంటే, దానిలో కూడే ప్రజలు దేవుని ఆలయముగా ఎలా జీవిస్తున్నారన్నదే ముఖ్యమైనది. దేవుని నివాసముగా ఉండే సంఘము పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే “దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది.”

కాబట్టి మీరు మర్చిపోవద్దు. హస్తకృతుడు కానివాడు హస్తకృతమైన ఆలయంలో నివసించడు సజీవమైన రాళ్లతో నిర్మించబడిన తన ప్రజల మధ్య ఆయన నివసిస్తాడు. అదే క్రీస్తు నిర్మించిన క్రీస్తు సంఘం/దేవుని నివాస స్థలం/ దేవుని ఆలయం. పరిశుద్ధాత్ముడు నివసించేది ఆయన ప్రజలలోనే... మనుషులు కట్టిన భవనం దేవుని నివాసస్థలం కాదు.


6️⃣. దేవుని ఆలయముగా పరిశుద్ధంగా జీవించాలి

హస్తకృతము కాని సజీవమైన రాళ్లతో, మనిషి ప్రమేయం లేకుండా, దేవుని సంకల్పాన్ని అనుసరించి, పరిశుద్ధ లేఖనాలను అనుసరించి, అపొస్తలుల బోధచేత రక్షించబడి, పాపక్షమాపణ పొంది, మారుమనస్సు పొంది, పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవిస్తూ, రక్షణలో కొనసాగుతూ, పరిశుద్ధతలో కొనసాగుతూ, పవిత్రతలో కొనసాగేవారి మధ్యన ఆయన నివాసం ఉంటుంది. అది విలువైన దేవుని నివాసం. అది ఆయన విశ్రమస్థానం. కాబట్టి అలాంటి విశ్రమస్థానంగా, దేవుని ఆలయంగా నీవు జీవించాలి. నీతో ఉన్న స్థానిక సంఘం కూడా అలా జీవించాలి. దేవుడు కోరుకున్నది భౌతికమైన కట్టడం కాదు. భౌతికమైన కట్టడం చూసి మురిసిపోవద్దు. భౌతికమైన కట్టడం లేదని బాధపడవద్దు, విచారించవద్దు. దేవుని రాజ్యం ఆత్మసంబంధమైనది. రాజు ఆత్మసంబంధమైనవాడు. చట్టం ఆత్మసంబంధమైనది. దానిలోని ప్రజలు ఆత్మసంబంధమైనవారు. దాని పరిధి ఆత్మసంబంధమైనది. ఆత్మసంబంధమైన వ్యక్తులు సజీవమైన రాళ్లవలె పరిశుద్ధ యాజకులుగా కట్టబడుతున్నారు.

కాబట్టి దానికి ప్రాముఖ్యతనిచ్చి, నీ జీవితంలో దేవుడు నివసించడానికి యోగ్యంగా నీవు చేయవలసిన పనిని చేయాలి. అపొస్తలుడైన పౌలు, “నేను నేర్పరి అయిన శిల్పకారునివలె పునాది వేసితిని; మరొకడు దాని మీద కట్టుచున్నాడు” అని చెప్పాడు. “ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను” అని హెచ్చరించాడు (1 కొరింథీయులకు 3:10). కాబట్టి దేవుడు హస్తకృతమైనవాడు కాదు. హస్తకృతమైన గుళ్లు, గోపురాలు, మందిరాలు, దేవాలయాలు, భౌతికమైన కట్టడాలు, చర్చి బిల్డింగులలో ఆయన నివసించడు. ఆయన నివసించేది పరిశుద్ధుల మధ్యన. అలాంటి పరిశుద్ధ సమూహంలో నీవు భాగస్వామివై, నీ చుట్టూ ఉన్నవారు కూడా పరిశుద్ధులుగా ఉండేటట్లుగా నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ ముందుకు పోవాలి. అలా కాని పక్షంలో ప్రమాదంలో ఉన్నామని గుర్తించాలి.


*ముగింపు*

దేవుడు హస్తకృతుడు కాదు, హస్తకృతమైన విగ్రహాలకు జీవం లేదు, హస్తకృతమైన గుళ్లు, గోపురాలు, మందిరాలు, దేవాలయాలు, భౌతికమైన కట్టడాలు, చర్చి బిల్డింగులు వాటిలో దేవుడు నివసించడు, ఆయన నివాసం క్రీస్తు సంఘంలో, పరిశుద్ధుల మధ్యన ఉంటుంది అనే వాస్తవాన్ని గుర్తించమని మా మనవి... కాబట్టి భౌతికమైన కట్టడంపై గర్వించకుండా, దేవుని ఆలయముగా ఉన్న మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాం. పాపాన్ని పట్టుకొని దేవుని ఆలయముగా ఉండలేము. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవుడు మనలో నివసిస్తున్నాడని అనుకోవడం మోసం.

మీ ఆత్మీయులు 

WhatsApp Channel - 2k Join Now
Telegram Group - 600 Join Now
Instagram Page - 500 Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

Note: Only a member of this blog may post a comment.

The churches of Christ greet you - Roma 16:16