మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామములో, ఎంతో ఆసక్తితో అపొస్తలుల బోధ అంశాలను చదువుతూ, ఆలోచిస్తూ, వాటిని తమ జీవితాలకు అన్వయించుకొని, తమ జీవితాలను దిద్దుబాటు చేసుకుంటున్న మీలో ప్రతివారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. 🙏🏻
*పరిచయం*
వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం మాత్రమేనా? లేక దేవుడు స్థాపించిన పవిత్రమైన బంధమా? దేవుడు ఒక పురుషునికి ఒక స్త్రీని జతపరిచినప్పుడు, మనిషి తన ఇష్టానుసారం ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయగలడా? “నాకు నచ్చలేదు”, “నా మాట వినడం లేదు”, “మా మధ్య విభేదాలు ఉన్నాయి”, “ఆర్థిక సమస్యలు ఉన్నాయి”, “మా తల్లిదండ్రులతో కలిసి జీవించడం లేదు”, “భౌతికంగా సహకరించుటలేదు”, “తిడుతున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, కోపగిస్తున్నారు, ప్రేమించడం లేదు” వంటి కారణాలు వివాహ బంధాన్ని తెంచుకోవడానికి దేవుని దృష్టిలో సముచితమైనవా? లేక “దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు” అనే యేసుక్రీస్తు మాటే మనకు ప్రమాణమా? (మత్తయి 19:6). సమస్య వచ్చినప్పుడు మనం విడిపోవడానికి కారణం వెతుకుతున్నామా? లేక సమాధానపడడానికి మార్గం వెతుకుతున్నామా? క్రైస్తవుని హృదయం కఠినంగా ఉండాలా? లేక క్షమించి, ప్రేమించి, దేవుని వాక్యానికి లోబడాలా?అయితే వివాహము (పార్ట్ - 05) గా “విడనాడుట న్యాయమా?” అనే ఈ ప్రశ్నకు మనుష్యుల యొక్క వివిధ అభిప్రాయాలు/కారణాలు బట్టి కాక దీని విషయమై మన ప్రభువైన యేసుక్రీస్తు బోధ ఏమిటో, ఆది నుండి దేవుని సంకల్పం ఏమిటో, మోషే పరిత్యాగ పత్రిక(divorcement/Certificate of divorce) ఎందుకు చెప్పాడో, కొత్త నిబంధనలో భార్యాభర్తల బాధ్యత ఏమిటో, లేఖనమంతటి సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలిద్దాం.
"యేసు ఈ మాటలుచెప్పి చాలించిన తరువాత. గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా ఆయన— సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు –ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. అందుకు వారు– ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను. ఆయన శిష్యులు– భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు." (మత్తయి. 19:1-11)
🛑 1️⃣. దేవుని సంకల్పంలో వివాహం యొక్క మూలం.
వివాహం మనుష్యులు తమ అవసరాల కోసం ఏర్పరచుకున్న ఒక సామాజిక ఒప్పందం కాదు. వివాహానికి మూలం దేవుడే. సృష్టి ప్రారంభంలోనే దేవుడు పురుషుని సృష్టించి, అతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూసి, అతనికి తగిన సహాయకురాలిగా స్త్రీని ఏర్పరచాడు. ఆ తరువాత పురుషుడు తన భార్యతో ఏకమై, ఇద్దరూ ఒక శరీరంగా ఉండాలని దేవుని సంకల్పం వెల్లడైంది. (ఆదికాండము 2:18, 21-24). యేసుక్రీస్తు కూడా వివాహం గురించి బోధించేటప్పుడు మనుష్యుల అభిప్రాయాల వైపు కాకుండా సృష్టి ఆరంభం వైపు మన దృష్టిని తిప్పాడు. “సృష్టించినవాడు ఆది నుండే వారిని పురుషునిగాను స్త్రీగాను సృష్టించెను” అని చెప్పి, “ఇద్దరూ ఏకశరీరమై యుందురు” అనే దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తుచేశాడు (మత్తయి 19:4-6cf). అందువల్ల వివాహం యొక్క అసలు ఉద్దేశం కేవలం కలిసి జీవించడం కాదు దేవుని సమక్షంలో ఒకరికి ఒకరు నిబద్ధులై, ప్రేమతో, విశ్వాసంతో, పవిత్రతతో, ఒక్కటై, మంచి మనస్సు కలిగి, పరిశుద్ధతతో దేవుని నిబంధన ప్రకారం జీవించడం. భార్యాభర్తలు తమ ఇష్టాల ప్రకారం ఈ బంధాన్ని ఏర్పరచుకోలేదు వారు దేవుని సంకల్పంలో ఏర్పడిన వివాహ బంధంలోకి వారు ప్రవేశించారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన సంగతి. కాబట్టి మనం ముందుగా అడగాల్సిన ప్రశ్న “విడాకులు తీసుకోవచ్చా?” లేదా “విడనాడుట న్యాయమా?” అనేది కాదు. “వివాహాన్ని దేవుడు ఎందుకు ఏర్పరచాడు? దేవుని సంకల్పం ఏమిటి?” అనేదే.
ఎందుకంటే వివాహం యొక్క మూలాన్ని అర్థం చేసుకున్నప్పుడే, “దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు” అనే యేసు మాట యొక్క స్పష్టత మనకు అర్థమవుతుంది (మత్తయి 19:6). ఇక్కడ ప్రధానమైన విషయమేంటంటే “దేవుడు జతపరచిన” అనే సత్యం. మనుష్యులు ఒక వివాహాన్ని సామాజికంగా నమోదు చేయవచ్చు. చట్టపరమైన పత్రాలు ఉండవచ్చు. కానీ క్రైస్తవుడు తన వివాహాన్ని కేవలం చట్టపరమైన సంబంధంగా చూడకూడదు. అది దేవుని ముందు బాధ్యతతో కూడిన పరిశుద్ధమైన జీవిత బంధంగా చూడాలి కదా!
🛑 2️⃣. భర్త మరియు భార్య యొక్క ధర్మాలు మరియు వారి బాధ్యతలు
వివాహంలో హక్కుల గురించి మాత్రమే ఆలోచిస్తే కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. కానీ “నా భర్తగా నా ధర్మం ఏమిటి? నా భార్యగా నా ధర్మం ఏమిటి?” అని ఆలోచిస్తే కుటుంబంలో ప్రేమ, సమాధానం, దైవ క్రమం, గౌరవం, మంచి బంధం ఏర్పాటు చేయబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో భార్యాభర్తలకు కేవలం ధర్మాలను మాత్రమే కాకుండా, ఒకరిపట్ల ఒకరు నిర్వహించవలసిన బాధ్యతలను కూడా స్పష్టంగా బోధిస్తుంది.
👤 భర్త యొక్క బాధ్యత :
భర్త తన భార్యను కేవలం కుటుంబాన్ని చూసుకునే వ్యక్తిగా కాకుండా, దేవుడు తనకు అప్పగించిన అమూల్యమైన ముత్యంగా, సహచారిగా, తన్ను ప్రేమించి, సంరక్షించి, పోషించి గౌరవించవలసిన వ్యక్తిగా చూడాలి. "పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.౹" (ఎఫెసీయులకు 5:25) అంటే భర్త ప్రేమ అనేది మాటల్లో మాత్రమే ఉండకూడదు. త్యాగం చేయగల ప్రేమ, క్షమించగల ప్రేమ, అర్థం చేసుకునే ప్రేమ, కష్టకాలంలో తోడుగా నిలిచే ప్రేమ, అనారోగ్య పరిస్థితిలో ప్రేమ కావాలి. భర్త తన భార్యను తనకు నచ్చిన విధంగా కాకుండా క్రీస్తు సంఘమును ప్రేమించిన విధంగా ప్రేమించాలి. భార్య తన మాట వినడం లేదని కోపపడటం సులభం కానీ భార్యను క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించడం నిజమైన భర్త యొక్క ధర్మం.
అలాగే భర్త తన భార్యను గౌరవించాలి, సన్మానించాలి, పర సంబంధమైన జ్ఞానము చొప్పున తనతో కాపురము చేయాలి. "అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి." (1 పేతురు 3:7) భార్యను అవమానించడం, నిర్లక్ష్యం చేయడం, మాటలతో గాయపరచడం, భయపెట్టడం భర్త బాధ్యత కాదు. భార్యను గౌరవించడం కూడా దేవుని ముందు భర్త యొక్క ఆత్మీయ బాధ్యత.
👤 భార్య యొక్క బాధ్యత :
భార్య తన భర్తను తన్ను/కుటుంబాన్ని సంరక్షించే, పోషించే, అధికారి అని కేవలం అలా చూసుకునే వ్యక్తిగా కాకుండా, ప్రతీ విషయములో లోబడే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా, యజమానుడిగా, భయము కలిగి యుండునట్లు చూడాలి. "స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.౹ క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.౹" (ఎఫెసీయులకు 5:22-24). ఇక్కడ లోబడటం అంటే భయంతో జీవించడం లేదా అన్యాయాన్ని సహించడం కాదు దేవుని క్రమాన్ని గౌరవిస్తూ భర్తకు తగిన గౌరవం చూపించడం. కాబట్టి భార్య భర్తను తక్కువ చేసి మాట్లాడటం, ఎప్పుడూ అవమానించడం, ఇతరులతో పోల్చడం లేదా అతని లోపాలను ఎగతాళి చేయడం దేవుని ఉద్దేశానికి సరిపోదు. గౌరవం, సహకారం, నమ్మకత్వం, విశ్వాసం, ప్రేమతో కుటుంబాన్ని నిర్మించడంలో భార్యకు కూడా ముఖ్యమైన పాత్ర ఉంది.
👤 ఇద్దరి బాధ్యత 👤
అయితే వివాహంలో బాధ్యతలు ఒకరి మీద మాత్రమే ఉండవు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించాలి, గౌరవించాలి, క్షమించాలి, సహించాలి, ఒకరి బలహీనతలను మరొకరు భరించాలి. (కొలస్సయులకు 3:13cf) కాబట్టి భార్యాభర్తలు ప్రతిరోజూ ఒక ప్రశ్న వేసుకోవాలి. “నా భాగస్వామి నాకు ఏమి చేయాలి?” అని కాదు.. “దేవుని వాక్యం ప్రకారం నేను నా భాగస్వామి కోసం ఏమి చేయాలి?” అని. భర్త తన భార్యను క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి. ఇద్దరూ దేవునికి విధేయులై ఒకరినొకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ, సమాధానంతో జీవించాలి. అప్పుడు వివాహం కేవలం ఒక బంధంగా కాకుండా, దేవుని సంకల్పాన్ని ప్రతిబింబించే పవిత్రమైన జీవనంగా మారుతుంది.
🛑 3️⃣. పరిసయ్యుల ప్రశ్నలు మరియు యేసుక్రీస్తు సమాధానం
🔴 పరిసయ్యుల మొదటి ప్రశ్న*
మత్తయి 19:3లో పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, “ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా?” అని అడిగారు. వారి ప్రశ్న కేవలం వివాహం గురించి తెలుసుకోవడానికి కాదు యేసును శోధించడానికి వారు ఈ ప్రశ్న వేశారు. ముఖ్యంగా “ఏ హేతువు చేతనైనా” అని అడగడం గమనించాలి. అంటే భార్యలో ఏదైనా తప్పు కనిపించినా, తనకు నచ్చకపోయినా, ఏ కారణమైనా చూపించి భార్యను విడనాడవచ్చా? అనే ఆలోచన ఉంది.
🟢 యేసు యొక్క సమాధానం*
కానీ యేసుక్రీస్తు వారి ప్రశ్నకు వెంటనే “అవును” లేదా “కాదు” అని చెప్పకుండా, వారిని వివాహం ప్రారంభమైన దేవుని సంకల్పం వైపు తీసుకెళ్లాడు. "ఆయన— సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు”(మత్తయి. 19:4) అన్నాడు. అంతే యేసు మత్తయి 19:4-5లో ఆదికాండము 1:27, 2:24లోని సత్యాన్ని గుర్తుచేశాడు. దేవుడు పురుషుని, స్త్రీని సృష్టించి, వారిద్దరూ ఏకమై ఒక శరీరంగా ఉండేలా వివాహాన్ని ఏర్పరచాడు.
అందువల్ల యేసు చెప్పిన మొదటి విషయం ఏమిటంటే “వివాహాన్ని అర్థం చేసుకోవాలంటే మనుష్యుల ఆలోచనలతో కాదు, దేవుని ఆది సంకల్పంతో ప్రారంభించాలనీ”. తరువాత యేసు ఎంతో పవిత్రమైన మాట చెప్పాడు "కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను."(మత్తయి 19:6) ఇక్కడ యేసు పరిశుద్ధమైన వివాహాన్ని సాధారణమైన మానవ ఒప్పందంగా కాకుండా, దేవుని సమక్షంలో ఏర్పడిన పవిత్రమైన బంధంగా చూపిస్తున్నాడని మనం గుర్తించాలి.
🔴 పరిసయ్యుల రెండో ప్రశ్న*
పరిసయ్యులు వెంటనే యేసును మరొక్క ప్రశ్న అడిగారు అదేమనగా "అందుకు వారు– ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా" (మత్తయి..19:7)
🟢 యేసు యొక్క సమాధానం :
"ఆయన మీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు." (మత్తయి. 19:8)
ఇక్కడ రెండు విషయాలను వేరు చేస్తూ యేసు బోధించాడు.
1. ఆదినుండి ఆలాగు జరుగలేదు అంటే సృష్టి ప్రారంభం నుండి ఇది దేవుని ఉద్దేశ్యం కాదని
2. మనుష్యుల హృదయ కాఠిన్యం కారణంగా మోషే కాలంలో నియంత్రించబడిన పరిస్థితని.
📝 హృదయ కాఠిన్యం అంటే దేవుని మాట విన్నప్పటికీ తన ఇష్టానుసారం జీవించడం, క్షమించడానికి ఇష్టపడకపోవడం, పశ్చాత్తాపపడకపోవడం, మారుమనస్సు లేకపోవడం, తన తప్పును అంగీకరించకపోవడం, దిద్దుబాటు చేసుకోకపోవడం, ఎదుటివారి తప్పును మాత్రమే చూస్తూ ఉండటం. యిర్మీయా 16:12లో ఇశ్రాయేలీయులు తమ దుష్ట హృదయ కాఠిన్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని దేవుడు చెప్పాడు. అలాగే ఎఫెసీయులు 4:17-18లో అన్యజనులు తమ హృదయ కాఠిన్యము వలన దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన స్థితిలో ఉన్నారని పౌలు చెబుతున్నాడు. కానీ క్రీస్తులోకి వచ్చిన మనిషి అదే కఠినమైన హృదయంతో కొనసాగడానికి పిలువబడలేదు.
మోషే పరిత్యాగ పత్రిక గురించి అర్థం చేసుకోవాలంటే ద్వితీయోపదేశకాండము 24:1-4 మరియు మత్తయి 19:7-8 రెండింటినీ కలిసి చూడాలి. మోషే పరిత్యాగ పత్రికను ఇచ్చినది అట్టి వివాహాన్ని ప్రోత్సహించడానికి కాదు అప్పటికే ఉన్న హృదయ కాఠిన్యాన్ని నియంత్రించడానికి. "ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసికొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను.౹ ఆమె అతని యింటనుండి వెళ్లినతరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును.౹ ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు ఆలాగు చేయకూడదు." (ద్వితీయోపదేశకాండము 24:1-4) అందుకే యేసు “ఆది నుండి ఆలాగు జరుగలేదు” అని చెప్పాడు.(మత్తయి. 19:8)
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గుర్తించాలి “మోషే విడాకులకు అనుమతి ఇచ్చాడు” అనేది ఒక విషయం. “పరమదేవుడు ఆది నుండే విడాకులను కోరుకున్నాడు” అనేది మరో విషయం. అందుకే యేసు “ఆది నుండి ఆలాగు జరుగలేదు” అని చెప్పాడు (మత్తయి 19:8). అంటే దేవుని అసలు ఉద్దేశం వివాహం కాబడిన పురుషుడు, స్త్రీ ఏక శరీరంగా ఐక్యంగా తమ జీవితాంతం జీవించవలసిందే కానీ విడనాడకూడదు. కావున నేటి క్రైస్తవ్యము మోషే పరిత్యాగ పత్రికను విడాకులకు స్వేచ్ఛా అనుమతిగా ఉపయోగించకూడదు.
🟢 యేసు చెప్పిన మరొక్క సమాధానం*
"మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను." (మత్తయి. 19:9)
ఈ మత్తయి 19:9 వచనంలో యేసు తన బోధను మరింత స్పష్టంగా చెప్పాడు. “తన భార్యను విడనాడి మరొకరిని వివాహం చేసుకునే విషయాన్ని ప్రభువు వ్యభిచారంతో సంబంధపరచి బోధించాడు. అక్కడ లైంగిక దుర్నీతి విషయంలో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అలాగే మత్తయి 5:31-32లో కూడా యేసు పరిత్యాగ పత్రికకు సంబంధించిన ధర్మశాస్త్ర నియమాన్ని ప్రస్తావించి, భార్యను విడనాడే విషయాన్ని తీవ్రంగా హెచ్చరించాడు. కావున నచ్చలేదని భార్యను విడనాడడం కాదు, మాట వినడం లేదని విడనాడడం కాదు, అందంగా లేదని విడనాడడం కాదు, డబ్బు విషయంలో సమస్య ఉందని విడనాడడం కాదు, నా తల్లిదండ్రుల మాట వినడం లేదని విడనాడడం కాదు, వ్యక్తిగత అభిప్రాయ భేదాల కారణంగా విడిపోవడం కాదు.
వివాహ బంధాన్ని తేలికగా చూడకూడదు. అందువల్ల “ఏ కారణమైనా సరే విడాకులు తీసుకోవచ్చు” అనే బోధ యేసు మాటలకు సరిపోదు. అదే సమయంలో మత్తయి 19:9లోని మినహాయింపు వాక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టి “బైబిలులో ఏ పరిస్థితిలోనూ ఎటువంటి మినహాయింపూ లేదు” అని చెప్పడం కూడా ఆ వచనాన్ని సరిగ్గా చదవడం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మొత్తం సందర్భంతోనే అర్థం చేసుకోవాలి. మత్తయి 5:31-32లో కూడా యేసు పరిత్యాగ పత్రిక విషయాన్ని ప్రస్తావిస్తూ, వ్యభిచార కారణము కాకుండా భార్యను విడనాడే విషయాన్ని తీవ్రమైన హెచ్చరికతో చెప్పాడు. అంటే ఒక వ్యక్తి తన భార్యను కేవలం తన ఇష్టానికి విరుద్ధంగా ఉందని విడనాడి, తరువాత మరొక వివాహంలోకి ప్రవేశించడం సాధారణమైన, నిరపరాధమైన విషయం కాదని ప్రభువు బోధించాడు. ఇందు కోసమే వివాహము పార్ట్ 4 లో వివాహము అనంతరం సమస్యలు పరిష్కారం విషయాలను ముందుగా వ్రాయడం జరిగింది.
అలాగే పౌలు గారు 1 కొరింథీయులు 7:10-11లో మరింత స్పష్టంగా చెప్పారు. "మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.౹ ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.౹ ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా– ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.౹ మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్య జింపకూడదు.౹ అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.౹" “నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది” అని చెప్పి, “భార్య భర్తను ఎడబాయకూడదు”, ఒకవేళ ఎడబాసినయెడల మరల పెండ్లి చేసుకోకుండా ఉండాలని లేదా భర్తతో సమాధానపడాలని, అలాగే “భర్త తన భార్యను పరిత్యజింపకూడదు” అని చెబుతున్నాడు. ఇక్కడ ఎడబాటు జరిగినా వెంటనే మరొక వివాహం చేసుకోవడమే పరిష్కారంగా చెప్పబడలేదు సమాధానపడటానికి మార్గం ఉంచబడింది అని గుర్తించగలరు. 🙏🏻
🔴 పరిసయ్యుల మూడో ప్రశ్న*
"ఆయన శిష్యులు– భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి." (మత్తయి. 19:10)
🟢 యేసు యొక్క సమాధానం*
"అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు." (మత్తయి. 19:11) యేసు, వివాహం అందరికీ ఒకే విధంగా సులభమైన విషయం కాదని, దేవుని పిలుపు మరియు కృపకు సంబంధించిన విషయం అని వివరించాడు.
పరిసయ్యులు “విడాకులు తీసుకోవడానికి ఏ కారణం సరిపోతుంది?” అని అడిగారు.
యేసు “వివాహాన్ని దేవుడు ఆది నుండి ఎందుకు ఏర్పరచాడు?” అనే అసలు విషయానికి వారిని తీసుకెళ్లాడు. అందుకే మనం కూడా వివాహ సమస్య వచ్చినప్పుడు మొదటి ప్రశ్నగా “నేను ఎలా విడిపోవాలి?” అని కాకుండా, “ఈ పరిస్థితిలో దేవుని సంకల్పం ఏమిటి? నేను ఎలా ప్రేమించాలి? ఎలా క్షమించాలి? ఎలా సమాధానపడాలి?” అని ఆలోచించాలి. మత్తయి 19లో యేసు ఇచ్చిన ప్రధాన సమాధానం ఇదే. మిత్రమా.... వివాహం మనిషి ఇష్టానుసారం ఏర్పడి, మనిషి ఇష్టానుసారం ముగిసే బంధం కాదు దేవుని సంకల్పాన్ని గౌరవించవలసిన పవిత్రమైన బంధం సుమీ!!
🛑 4️⃣. భర్త/భార్య అవిశ్వాసి ఐతే… విడనాడుట?
"మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్య జింపకూడదు.౹ అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.౹ అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.౹" (1 కొరింథీయులు 7:13-15)
అపొస్తలుడైన పౌలు, భార్యాభర్తలలో ఒకరు విశ్వాసిగా, మరొకరు అవిశ్వాసిగా ఉన్న పరిస్థితిని గురించి బోధిస్తున్నాడు. ఒకరు క్రీస్తును విశ్వసించినంత మాత్రాన, వారి భర్త లేదా భార్య ఇంకా అవిశ్వాసిగా ఉన్నారని వివాహ బంధాన్ని తెంచుకోవాలని పౌలు చెప్పడం లేదు. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి భాగస్వామి విశ్వాసితో కలిసి జీవించడానికి ఇష్టపడితే, “ఆమె అతని పరిత్యజింపకూడదు” అని స్పష్టంగా చెబుతున్నాడు. అదే సూత్రం అవిశ్వాసి భార్య ఉన్న విశ్వాసి భర్తకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. భర్త లేదా భార్య అవిశ్వాసి కావడం మాత్రమే విడాకులకు కారణం కాదు. ఒకరు క్రైస్తవులుగా మారి, మరొకరు ఇంకా విశ్వాసంలోకి రాకపోయినా, ఆ అవిశ్వాసి వ్యక్తి వివాహ బంధంలో కొనసాగడానికి సిద్ధంగా ఉంటే, విశ్వాసి తన భాగస్వామిని విడిచిపెట్టకూడదు. తన విశ్వాసాన్ని నిజమైన ప్రేమతో, మంచి ప్రవర్తనతో, దేవునికి విధేయమైన జీవితంతో చూపించాలి.
13వ వచనంలో అవిశ్వాసి భర్త భార్యను బట్టి “పరిశుద్ధపరచబడును” అని, 14వ వచనంలో అవిశ్వాసి భార్య విశ్వాసి భర్తను బట్టి “పరిశుద్ధపరచబడును” అని చెప్పబడింది. దీని అర్థం అవిశ్వాసి వ్యక్తి తన జీవిత భాగస్వామి విశ్వాసం వల్ల స్వయంగా రక్షణ పొందుతాడని కాదు. కానీ ఆ వివాహ బంధం దేవుని దృష్టిలో అపవిత్రమైనదిగా పరిగణించబడదు; విశ్వాసి భాగస్వామి కారణంగా ఆ కుటుంబ జీవితం దేవుని కృపకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటుంది. అందుకే వారి పిల్లల గురించి కూడా పౌలు “ఇప్పుడైతే వారు పవిత్రులు” అని చెబుతున్నాడు.
అయితే 15వ వచనంలో మరో పరిస్థితిని పౌలు ప్రస్తావిస్తున్నాడు. అవిశ్వాసి వ్యక్తి స్వయంగా విడిపోయి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే, విశ్వాసి అతనిని లేదా ఆమెను బలవంతంగా పట్టుకుని ఉంచాలని పౌలు చెప్పడం లేదు. “అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును” అని చెబుతూ, అలాంటి సందర్భంలో సహోదరునికైనా సహోదరికైనా “నిర్బంధము లేదు” అని చెప్పాడు. వెంటనే “సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు” అని కారణాన్ని కూడా తెలియజేశాడు. “ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) అయితే “నిర్బంధము లేదు” అంటే వెంటనే మరొక వివాహం చేసుకోవడానికి స్పష్టమైన అనుమతి ఇచ్చాడు అని చెప్పడం వాక్య విరుద్ధమైన బోధ. ఈ వచనం ప్రధానంగా అవిశ్వాసి స్వయంగా విడిపోవడానికి వెళ్లినప్పుడు విశ్వాసిని బలవంతపు వివాహ బంధంలో ఉంచకూడదనే విషయాన్ని చెబుతుంది. పునర్వివాహం విషయంలో 1 కొరింథీయులకు 7లోని 10-11 వచనాలను కూడా కలిపి చూడాలి. అక్కడ ఎడబాసిన వ్యక్తి అవివాహితగా ఉండడం లేదా తిరిగి సమాధానపడడం గురించి పౌలు చెబుతున్నాడు.
భార్య లేదా భర్త ఇంకా క్రీస్తును విశ్వసించలేదని వారిని శత్రువులుగా చూడకూడదు. విశ్వాసి తన వివాహ జీవితంలో క్రీస్తు ప్రేమను, సహనాన్ని, పవిత్రతను చూపించాలి. అదే సమయంలో హింస, ప్రాణహాని లేదా తీవ్రమైన దుర్వినియోగం వంటి పరిస్థితులను “అవిశ్వాసి కాబట్టి భరించాలి” అని చెప్పడం కూడా ఈ వచనానికి సరైన అన్వయం కాదు. అలాంటి సందర్భాల్లో తమ ఆత్మీయ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, విశ్వసనీయమైన ఆత్మీయ మరియు అవసరమైన చట్టపరమైన(విశ్వాస పెద్దల/వాక్య అనుభవం కలిగినవారిని) సహాయం కచ్చితంగా పొందాలి. అప్పటికి ఆమె/అతను వినకపోతే రెండో వివాహమునకు అనుమతి లేదు. నీ వివాహము మరణం వరకు ఏర్పాటు చేయబడిన గట్టి బంధం. భర్త బ్రతికి ఉన్నంతకాలం భార్య భర్తకు బద్ధురాలై ఉంటుందని అని గుర్తించాలి(రోమీయులు 7:2-3) భర్త బ్రదికియున్నంతకాలము భార్య బద్ధురాలు(1 కొరింథీయులు 7:39).
ముగింపు
మనుష్యుల చట్టాలు మారవచ్చు. సమాజపు ఆచారాలు మారవచ్చు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మారవచ్చు. కానీ దేవుని వాక్యం మారదు. వివాహాన్ని దేవుడు జతపరిచిన బంధంగా చూస్తున్నప్పుడు దానిని తేలికగా తీసుకోకూడదు. “దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్తయి 19:6). మోషే పరిత్యాగ పత్రిక గురించి చెప్పిన విషయాన్ని యేసుక్రీస్తు స్వయంగా హృదయ కాఠిన్యంతో సంబంధపరిచాడు. కాబట్టి క్రైస్తవుని జీవితం హృదయ కాఠిన్యంతో ఉండకూడదు.
ఒకరినొకరు - క్షమించాలి, ప్రేమించాలి. సహించాలి, సమాధానపడాలి, తప్పు జరిగితే పశ్చాత్తాపపడాలి, తప్పిదం నుండి తిరిగి దేవుని వైపు రావాలి, వైవాహిక పరిశుద్ధతను కాపాడుకోవాలి, భార్యాభర్తలు తమ పిల్లలకు కూడా దేవుని రాజ్యానికి తగిన కుటుంబ జీవితాన్ని చూపించాలి, ఒకవేళ ఎవరైనా తప్పిదంలో ఉన్నట్లయితే, ఆ తప్పిదాన్ని సమర్థించుకోవడం కాదు మారుమనస్సు పొంది, పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి రావాలి.
విడాకులు(ఒకరినొకరు విడనాడుట) తీసుకోవడానికి కారణాలను వెతకడం కంటే, కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుని వాక్యంలో మార్గాన్ని వెతకాలి.
లోకపు చట్టం ఏదైనా అనుమతించినప్పటికీ, క్రైస్తవుని తుది ప్రమాణం దేవుని వాక్యమే. అందువల్ల వైవాహిక పరిశుద్ధతలో జీవిద్దాం. కుటుంబాలను కాపాడుకుందాం. మన పిల్లలకు మంచి మాదిరిగా నిలుద్దాం. మన కుటుంబాల ద్వారా క్రీస్తు ప్రేమను చూపిద్దాం. వివాహం తాత్కాలికమైన ఇష్టం కాదు. అది జీవితాన్ని పంచుకునే పవిత్రమైన బంధం. అందుకే దానిని కోపంతో లేదా తాత్కాలిక సమస్యలతో తేలికగా విరిచివేయకూడదు అనేది మా మనవి 🙏🏻
9705040236
వివాహము (పార్ట్ 01) క్లిక్ చేయు
వివాహము (పార్ట్ 02)క్లిక్ చేయు
వివాహము (పార్ట్ 03)క్లిక్ చేయు
వివాహము (పార్ట్ 05)క్లిక్ చేయు


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com
Note: Only a member of this blog may post a comment.