మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
“మనిషి జన్మతః పాపి”🚼 అనే బోధ నేడు ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం పొందుతోంది. అయితే ఈ బోధకు పరిశుద్ధ గ్రంథములో నిజంగా స్పష్టమైన ఆధారం ఉందా? ఉంటే అది ఎక్కడ ఉంది? ఏమి చెప్పబడింది? బైబిల్ నిజంగా మనిషి జన్మతః పాపి అని బోధిస్తుందా? ఇది దేవుని బోధనా? క్రీస్తు స్వయంగా బోధించాడా? లేక ఆదిమ అపోస్తలులు బోధించాడా?.. లోకములో చలామణి అవుతున్న ఇలాంటి అనేక కీలక ప్రశ్నలకు సమాధానము కావాలంటే వాక్యాన్ని లోతుగా పరిశీలించడం అత్యంత అవసరం.
వాస్తవానికి “మనిషి జన్మతః పాపి” అనే పదప్రయోగం గానీ, దానికి ఇవ్వబడుతున్న అర్థం గానీ మన పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించదు. అయినప్పటికీ, నేటి సమాజంలో ఈ విషయాన్ని అర్ధరహితంగా ఊహించుకొని బోధించేవారు అనేకమంది ఉన్నారు. వారి బోధల ప్రకారం మనిషి జన్మతః పాపి అనగా — “నా జన్మే పాపము”, లేదా “పుట్టుకతోనే దోషి”, లేదా “జన్మించిన క్షణం నుండే పాపము చేసినవాడు”, లేదా “పుట్టడమే పాప స్థితి” అని అర్థం చేసుకుంటున్నారు. ఈ బోధతో పాటు మరొక తీవ్రమైన అపార్థమైన ఆలోచన కూడా ప్రజల మధ్య ప్రచారం పొందుతోంది. అదేంటంటే — తల్లిదండ్రుల కలయిక పాపమని, వివాహమే పాపమని, పిల్లలు పాపపు సంతానమని భావించడం. ఈ విధమైన బోధలు పరిశుద్ధ గ్రంథ సత్యానికి విరుద్ధమైనవిగా ఉండి, దేవుని సృష్టి విధానాన్ని మరియు ఆయన ఏర్పాట్లను అవమానపరచే దిశగా నడిపిస్తున్నాయి.
ఈ బోధలు నిజమా? ఇవి నిజంగా దేవుని వాక్యము బోధించుచున్న సత్యమా లేక మనుషుల ఆలోచనల నుండే పుట్టిన అభిప్రాయాలా? పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తున్నది ఏమిటంటే — పాపం అంటే ఏమిటి, మనిషి ఎలా పాపి అవుతాడు, పాపానికి మరణానికి ఏ సంబంధం ఉంది, వివాహం దేవుని ఏర్పాటా లేక పాపమా, పిల్లల స్థితి దేవుని దృష్టిలో ఏమిటి అన్న విషయాలు కేవలం వాక్యాధారంతోనే అర్థం చేసుకోవాలి.
ఈ అంశంలో మనము మానవ నిర్మాణం, ఆదాము పాపం చేసినప్పుడు ఏం జరిగినది, పాపం లోకములోనికి ప్రవేశించిన విధానం, ఆత్మీయ మరణం యొక్క అర్థం, పుట్టుకకు పాపానికి సంబంధం ఉందా లేదా, వివాహం మరియు భార్య–భర్తల బంధంపై దేవుని సెలవు, పిల్లల విషయములో యేసు ప్రభువు బోధ— ఈ అన్నింటినీ ఏ అభిప్రాయాలకు లోబడకుండా, ఏ సంప్రదాయాలకు కట్టుబడి కాకుండా, వాక్యాన్ని వాక్యంతో పోల్చుకుంటూ పరిశీలించబోతున్నాము. మన లక్ష్యం ఎవ్వరినీ నిందించుట కాదు, సత్యమును స్పష్టంగా ప్రకటించుట మాత్రమే. ఎందుకంటే, “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును కదా”
కాబట్టి ఈ అంశాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరూ మనుషుల మాటలను కాదు, భావోద్వేగాలను కాదు, బోధించేవారి యొక్క బోధలు కాదు, దేవుడు తన వాక్యములో ఏమి చెప్పాడో అదే తుది ప్రమాణంగా తీసుకొనే మనం పరిశీలించాలి.
1️⃣. పాపం అంటే ఏమిటి?
"పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.౹" (1యోహాను. 3:4)
ఇదే పాపానికి తుది నిర్వచనం.
👉 పాపం = ఆజ్ఞను అతిక్రమించుట
👉 దేవుడు ఇచ్చిన హద్దును దాటుట అనగా ఆజ్ఞలు, విధులు, కట్టడలు, ధర్మ నియమాలు అతిక్రమించినప్పుడు పాపం
👉 దేవుడు చెప్పినది చేయకపోవుట లేదా చేయవద్దన్నది చేయుట అనగా "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు."(నిర్గమ. 20:3) ఇది అతిక్రమిస్తే పాపమే.
అందువలన పాపం అనేది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు, వంశపారంపర్యంగా వచ్చే స్థితి కాదు, శరీర సంబంధమైన జీవన ప్రక్రియ కాదు, కానీ మనిషి చేసే ఒక చర్య అదే అపవాది చర్య.
✔️ ఆజ్ఞ లేకపోతే అతిక్రమణ ఉండదు.
✔️ అతిక్రమణ లేకపోతే పాపం ఉండదు.
అందుకే పాపం గురించి మాట్లాడేటప్పుడు “మనిషి జన్మతః పాపి” అని చెప్పడం వాక్యానుసారం కాదు. మనిషి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మాత్రమే పాపి అవుతాడు.
2️⃣. మానవ నిర్మాణం — ఆరంభం
A]. మనిషి = దేవుని స్వరూపం, పోలిక
"దేవుడు– మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము”.... “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.౹" (ఆది కాం. 1:26-27)
దేవుడు మనిషిని పాపిగా కాదు ❌
అపరిశుద్ధముగా కాదు ❌
శాపగ్రస్తుడిగా కాదు ❌
నరుడు దేవుని స్వరూపం ✔️
నరుడు దేవుని పోలిక ✔️
👉 స్వరూపం, పోలిక అంటే ఏమంటావేమో… ఇందుకే “149. మానవ నిర్మాణం” అనే అంశమును చదువుము.
పాపముతో నిండిన దేవుని స్వరూపం ఉండదు. కాబట్టి దేవుని స్వరూపంలో సృజించబడిన మనిషి ఆరంభంలో పాపి అయ్యే అవకాశమే లేదు సుమీ.
B]. దేవుని స్వరూపం ఆదాము ఒక్కడికేనా?
మనిషి దేవుని స్వరూపంలో సృజించబడినాడన్న సత్యాన్ని చాలామంది ఆదాము ఒక్కడికే పరిమితం చేయాలని ప్రయత్నిస్తారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. దేవుని వాక్యం ప్రకారం, ఈ స్వరూపం ఒక్క ఆదాముకే కాదు, మానవజాతి ఆరంభానికే సంబంధించినది.
(ఆదికాండము 5:1-2) : "ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;౹ మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.౹"
ఈ వచనం ఆదాము పాపం చేసిన తర్వాత వ్రాయబడింది. అయినప్పటికీ, దేవుడు ఆదామును దేవుని పోలికగా సృజించాడని స్పష్టంగా చెప్పబడింది. అంటే దేవుని స్వరూపంలో సృజించుట అనేది ఒక క్షణిక సంఘటన కాదు, ఒక వ్యక్తికి మాత్రమే వర్తించే విషయం కాదు, అది మనిషి సృజనకు సంబంధించిన మౌలిక సూత్రం.
C]. దేవుని తుది సాక్ష్యం – మనిషి యదార్థత
"యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను …." (కీర్తనలు 100:3) "ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు." (ప్రసంగి 7:29)
👉 ఇక్కడ “నరులు” అన్న పదం ఆదాము ఒక్కడినే కాదు, మానవజాతి మొత్తాన్ని సూచిస్తుంది అనే సంగతి మొదటగా గుర్తించుకోవాలి.
👉 మనిషి యొక్క పుట్టుక మొత్తం దేవుని స్వరూపం, దేవుని పోలిక, యదార్థత మీదే నిలబడి ఉంది.
👉 ఇక నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు అంటే పుట్టుకతో పాపం లేకుండా పుట్టారనేగా... పాపమ అనేది జన్మలో లేన్నప్పుడు ఇక జన్మ పాపము ఎక్కడ? ఆలోచించుకోండి.
✔ దేవుడు పుట్టించినప్పుడు – యదార్థవంతులు
✔ తరువాత – మనుషులే పాప మార్గం ఎంచుకున్నారు.
3️⃣. పాపం లోకములోనికి ఎలా ప్రవేశించింది?
పాపం మనిషి పుట్టుకతోనే లోకములో ఉన్నదా? లేక దేవుడు సృష్టించినప్పుడు పాపంతోనే మనిషిని సృజించాడా? ఈ ప్రశ్నలకు బైబిల్ చాలా స్పష్టమైన సమాధానం ఇస్తుంది.
❌ పాపం సృష్టిలో భాగం కాదు.
❌ పాపం దేవుని నుండి కాదు,
✔️ పాపం మనిషి చేసిన ఆజ్ఞాతిక్రమణ ద్వారానే లోకములోనికి ప్రవేశించింది.
A]. పాపం లోకములోనికి ప్రవేశించిన మార్గం
"ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ౹" (రోమా. 5:12)
“ఒక మనుష్యుని ద్వారా” అనగా ఆ మనుష్యుడు మొదటి మనిషి ఆదాము అంటే, పాపం లోకములోనికి వచ్చింది జన్మ ద్వారా కాదు. పాపం లోకములోనికి వచ్చింది ఆజ్ఞాతిక్రమణ ద్వారానే...
B]. ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞ
"అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను." (ఆదికాండము. 2:17)
ఈ ఆజ్ఞలో మూడు విషయాలు ఉన్నాయి:
1. దేవుడు ఆదాముకు మాత్రమే స్పష్టంగా ఆజ్ఞ/నిబంధన ఇచ్చాడు.
2. ఆజ్ఞను అనుసరించే మరియు అతిక్రమించే స్వేచ్ఛ కూడా మనిషికి ఇవ్వబడింది.
3. అతిక్రమిస్తే దాని యొక్క ఫలితం ఉందని ముందే తెలియజేశాడు.
C]. ఆదాము చేసిన అతిక్రమణ
"స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొనితిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను;౹ అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.౹" (ఆదికాండము. 3:6- 7)
"ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి …." (యోబు.31:33-34)
"ఆదాము నిబంధన మీరినట్లువారు నాయెడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరియున్నారు.౹" (హోషేయ. 6:7)
ఆదాము కుటుంబముల తిరస్కారమునకు జడిసి ఆజ్ఞను/నిబంధనను అతిక్రమించాడు. దేవుడు అతనికి చేయవద్దన్నది చేశాడు ఇదే పాపం. అందువలన, పాపం మొదటిసారి లోకములోనికి/ఏదేను తోటలోకి వచ్చింది, దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది, ఆత్మీయ మరణం చోటు చేసుకుంది.
D]. ఎటువంటి మరణము?
"... నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను." (ఆదికాండము 2:17b)
ఆజ్ఞాతిక్రమణ — పాపం — ఆత్మీయ మరణం
◾ఆదాము తిన్న రోజే భౌతికంగా చచ్చిపోయాడా? ❌
◾ ఆదాము ఎంతకాలం జీవించాడు? 930 సంవత్సరాలు ✔️
👉 ఇది భౌతిక మరణం కాదు
👉 ఇది ఆత్మ సంబంధమైన మరణం
👥 మరణం రెండు రకాలు:
ఆత్మీయ మరణం – దేవునికి దూరం కావడం
భౌతిక మరణం – శరీరం మట్టిలో కలవడం
ఆత్మీయ మరణం అంటే “.... దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడుట...." అని అర్ధం (ఎపేసి. 4:18) “... నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే౹" (ప్రకటన. 3:1) "మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా,...” (ఎపేసి. 2:1)
కొన్ని ఉదాహరణలు — రోమా 1:18-32 :
* దేవుని సత్యాన్ని అడ్డగించడం (1:18)
* అక్షయ దేవుని మహిమను ప్రతిమలుగా మార్చడం (1:23)
* సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించడం (1:25)
* దేవునికి మనస్సులో చోటు ఇవ్వకపోవడం (1:28)
* చేయరాని కార్యాలు చేయడం (1:29–31)
* “ఇట్టి కార్యములను చేయువారు మరణమునకు తగినవారు.” (రోమా 1:32)
👉 ఇది ఆత్మీయ మరణం
E]. భౌతిక మరణానికి పాపానికి సంబంధముందా?
NO ❌
(హెబ్రీయులు 9:27): "మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.౹"
పాపి అయినా, నీతిమంతుడైనా అందరూ ఒక్కసారే భౌతిక మరణం పొందాలి.
(ప్రసంగి 12:7): "మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును."
శరీరం → మట్టికి చేరుతుంది
ఆత్మ → దేవుని యొద్దకు తిరిగి వెళుతుంది
ఇది పాపం చేసినందుకు వచ్చిన శిక్ష కాదు, దేవుడు సృష్టించిన శరీర స్వభావం/దైవ నిర్ణయం.
✔ నీతిమంతుడైన హేబేలు చనిపోయాడు
✔ పాపి అయిన ఆదాము చనిపోయాడు
👉 భౌతిక మరణం పాపానికి శిక్ష కాదు
👉 అది దేవుడు నిర్ణయించిన సాధారణ నియమం
ఇంకా సంబంధం ఉంది అనే భావన ఉంటే చివరిగా క్రీస్తు మాటల్లో....
"పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను– ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందునవారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు." (లూకా. 13:1-5)
భౌతిక మరణం - మారుమనస్సు లేకపోవడం ✔️
భౌతిక మరణం - పాపము చేయుటవలన ❌
4️⃣. అందరు ఎలా పాపులయ్యారు?
మనుషులందరూ పాపులే అని బైబిల్ చెబుతుంది. కాని వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే – అందరూ ఎలా పాపులయ్యారు? పుట్టుకతోనా? తల్లిదండ్రుల పాపం వల్లనా? లేక వేరే కారణమేదైనా ఉందా?
1. "ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹" (రోమా 3:23)
“పాపము చేసి” అన్న పదం అంటే,
పుట్టినందుకు కాదు/జన్మతః కాదు ❌
వారసత్వంగా కాదు❌
తల్లిదండ్రుల పాపం వల్ల కాదు❌
👉 వ్యక్తిగతంగా పాపం చేసినందునే అందరూ పాపులయ్యారు. ✔️
2. ".... మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ౹" (రోమా 5:12)
“పాపము చేసినందున” అన్న పదం అంటే
పాపం చేయకపోతే పాపి కాడు
పాపం చేసినందునే మరణం వచ్చింది
ఏ మరణం? ఆత్మీయ మరణం.
3. "దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.౹" (రోమా. 2:11)
◾ ధర్మశాస్త్రం ముందు — పితరుల కాలం
◾ ధర్మశాస్త్రం — ఇశ్రాయేలు కాలం
✔ ధర్మశాస్త్రం లేకపోయినా – పాపం చేశారు
✔ ధర్మశాస్త్రం ఉన్నా – పాపం చేశారు
అందువల్ల, 👉 అన్ని తరాల మనుషులు పాపులే
👉 కారణం ఒకటే – ఆజ్ఞ అతిక్రమణ కానీ జన్మతః పాపి కాదు సుమీ.
అందరూ పాపులయ్యారు, ఎందుకంటే అందరూ తమ తమ జీవితాలలో పాపం చేసినందున…
5️⃣. వివాహం పాపమా?
వివాహం గురించి కూడా క్రైస్తవ లోకంలో తీవ్రమైన అపార్థాలు ఉన్నాయి. కొంతమంది వివాహమే పాపం, భార్య–భర్తల బంధం శారీరకమైనది కాబట్టి అపవిత్రమని, దాని ద్వారా పుట్టిన పిల్లలు పాపపు సంతానం అని బోధిస్తున్నారు. కాని ఈ బోధలు దేవుని వాక్యానికి విరుద్ధమైనవి. బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏమిటంటే – వివాహం పాపం కాదు; అది దేవుని ఏర్పాటు.
A]. వివాహ వ్యవస్థ దేవుని ఏర్పాటు
"దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా– మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.౹" (ఆదికాండము 1:28) దేవుడు పాపాన్ని ఆశీర్వదించడు. కాబట్టి వివాహం పాపం కావడం అసాధ్యం. మరింత వివరణ కొరకు “112. వివాహం పార్ట్ 1” అంశము చదవగలరు.
B]. వివాహంపై కొత్త నిబంధన సాక్ష్యం
"వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.౹" (హెబ్రీయులు. 13:4)
✔ వివాహ బంధం పవిత్రం
✔ పానుపు నిష్కల్మషమైనది
◾వివాహం ఘనమైనది
◾భార్య–భర్తల శారీరక బంధం పవిత్రమైనది
◾దేవుడు వివాహాన్ని గౌరవిస్తాడు.
🔴 “వివాహమును నిషేధించుట… అనేది ఇవి దయ్యముల బోధలు.” ఇది పాపం (1 తిమోతి 4:1–3)
🔴 వివాహ వ్యవస్థలో జరిగే పాపం ఏంటంటే… జారత్వం, వ్యభిచారం, భార్యను/భర్తను విడిచిపెట్టి మరొకరిని చేసుకోవడం, బహు భార్యత్వం, బహు భర్తృత్వం, వివాహ నిబంధనను విరిచివేయడం/విడాకులు.
అంతేకానీ వివాహం పాపం కాదు
వివాహానికి బయట జరిగే సంబంధాలే పాపం.✔️
C]. గర్భఫలము – పాప ఫలమా?
NO ❌
"కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే" (కీర్తనలు. 127:3)
◾ ప్రశ్న : దేవుడు పాపాన్ని బహుమానంగా ఇస్తాడా? NO ❌
అసలు కాదు. సంతానం దేవుని బహుమానం అయితే, వివాహం ద్వారా పుట్టిన పిల్లలను పాపపు సంతానం అనడం దేవుని మీద తిరుగుబాటు చేయడమే అగును కదా ఆలోచించుకో .
6️⃣. తల్లిదండ్రుల పాపం పిల్లలకు బదిలీ?
NO ❌
(యెహెజ్కేలు 18:20-21) : "పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోషశిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోషశిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.౹ అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.౹" అంటే ఒకరి పాపం మరొకరికి లెక్కించబడదు.
(యెషయా. 7:16) “పిల్లవాడు మంచి చెడులను ఎరుగకముందు…” పిల్లలు పాపం చేయకముందు పాపులని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఇది పిల్లలకు పాప జ్ఞానం లేకపోవడం స్పష్టంగా చూపిస్తుంది.
(ద్వితీయోపదేశకాండము 24:16): "కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవనిపాపము నిమిత్తమువాడే మరణశిక్ష నొందును." పాపం చేసినపుడు మాత్రమే పాపిగా లెక్కించబడతాడు.
ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. (రోమా. 3:20) పాపం చేయబడినప్పుడు మాత్రమే వస్తుంది కానీ పుట్టుక నుండి పాపులం కాలేము మరియు తల్లిదండ్రుల పాపం పిల్లలకు బదిలీ కాబడదు. కేవలం ఆజ్ఞను అతిక్రమించినపుడు మాత్రమే పాపం.
చివరిగా ప్రభువైన యేసు మాటల్లో.... యేసు పిల్లలను పాపులుగా కాదు, దేవుని రాజ్యానికి ఉదాహరణగా చూపించారు."ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి" (మత్తయి. 19:14) "అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి– చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది. చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను."(లూకా 18:16-17) "ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను –మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు."(మత్తయి. 18:2-4)
పిల్లలు పాపులు ❌
తల్లిదండ్రుల పాపం పిల్లలకు బదిలీ ❌
వ్యక్తి తాను స్వతహాగా చేసిన పాపానికి మాత్రమే బాధ్యుడు ✔️
పాపమని తెలిసి చేసినపుడే పాపం
7️⃣. నేను పాపములో పుట్టాను?
(కీర్తనలు 51:5): "నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను."
Ps 51:5: "Behold, I was shapen in iniquity; and in sin did my mother conceive me."
ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని “మనిషి పుట్టుకతోనే పాపి” “తల్లిదండ్రుల కలయక పాపం” అనే బోధను కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ వచనాన్ని సందర్భం లేకుండా తీసుకొని క్రొత్త సిద్ధాంతం నిర్మించడం వాక్యాన్ని వక్రీకరించినట్టే అవుతుంది.
దావీదు చెప్పిన మాట ఇది. అది కూడా ఎలాంటి పరిస్థితిలో? ఘోరమైన పాపం చేసిన తరువాత.... తీవ్రమైన పశ్చాత్తాపంలో ఉన్నప్పుడు...
A]. ఈ కీర్తన యొక్క నేపథ్యం
"ప్రధానగాయకునికి. దావీదు బత్షెబయొద్దకు వెళ్లిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము" (కీర్తనలు. 51:1)
దావీదు చేసిన పాపాలు:
వ్యభిచారం (బత్సెబాతో)
హత్య (ఊరియాను యుద్ధంలో చంపించడం)
మోసం, కుట్ర
ఈ ఘోరమైన పాపాలు వెలుగులోకి వచ్చిన తరువాత ప్రవక్త నాతాను దావీదును గట్టిగా హెచ్చరించాడు (2 సమూయేలు 11–12 అధ్యాయాలు). ఆ సందర్భంలోనే దావీదు తీవ్రమైన బాధతో, తనను తాను పూర్తిగా దిగజార్చుకొని, దేవుని ఎదుట విరిగిన హృదయంతో ఈ కీర్తనను రచించాడు.
B]. సిద్ధాంత వాక్యమా? లేక పశ్చాత్తాప వాక్యమా?
📖 కీర్తన 51 అంతటా గమనిస్తే..,
“ నా పాపము పరిహరింపుము”
“నన్ను శుద్ధి చేయుము”
“నీ పరిశుద్ధాత్మను నాయొద్ద నుండి తీసివేయకుము”
“స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము”
“నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము”
ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? ఇది పాపం చేసిన మనిషి యొక్క విలాపం. ఇది పశ్చాత్తాప ప్రార్థన. ఇది భావోద్వేగ వ్యక్తీకరణ. ఇలాంటి సందర్భాలలో మనిషి తనను తాను పూర్తిగా నిందించుకుంటాడు.
❌అది సిద్ధాంత బోధ కాదు.
✔️పశ్చాత్తాప వాక్యమే.
C]. సిద్ధాంతం నిర్మిస్తే వచ్చే సమస్య
వివాహం పాపమవుతుంది.
గర్భధారణ పాపమవుతుంది.
పిల్లలు పాపపు ఫలమవుతారు.
బైబిల్ వివాహాన్ని ఘనమైనదిగా ప్రకటించింది (హెబ్రీయులు 13:4) గర్భఫలాన్ని దేవుని బహుమానంగా చెప్పింది (కీర్తన 127:3) పిల్లలదే దేవుని రాజ్యం అన్నది (మత్తయి 18:3) అంటే, బైబిల్ బైబిల్‌కు విరుద్ధంగా ఉండదు కాబట్టి కీర్తన 51:5 ను సిద్ధాంత వాక్యంగా తీసుకోలేం.
D]. పాపములో? లేక పాపముతో?
◾పాపములో in Sin
◾పాపముతో with Sin
בְּעָוֹן חוֹלָלְתִּי וּבְחֵטְא יֶחֱמַתְנִי אִמִּי
Be‘āwōn ḥōlāltî; û·ḇeḥēt’ yeḥĕmaṯnî ’immî
ఇక్కడ రెండుసార్లు వచ్చిన పదం:
בְ (be-) = లో / లోన (in)
హీబ్రూ లో בְ (be-) కు ఈ అర్థాలు ఉంటాయి:
లో (in)
పరిస్థితిలో (in the state/condition of)
పరిసరాల్లో (within an environment)
👉 ఇది “with” (తో) అనే అర్థం ఇవ్వదు.
“with” కు హీబ్రూ లో వాడే పదాలు:
עִם (‘im) = with
אֵת (’ēṯ) = with
👉 కీర్తన 51:5 లో ‘im లేదా ’ēṯ లేవు.
📖 పాపములో పుట్టాను(in Sin) — In sin my mother conceived me” అంటే “పాపం ఉన్న ప్రపంచంలో, పాప ప్రభావం ఉన్న పరిస్థితుల్లో నేను గర్భమున ధరింపబడినవాడను” ఇది పరిస్థితి (environment) గురించి చెబుతుంది. నా స్వభావం లేదా దోషం గురించి కాదు.
ఉదాహరణకు “He was born in poverty” అంటే:
“పేదరిక పరిస్థితుల్లో పుట్టాడు”✔️ “పేదరికంతో పుట్టాడు” కాదు ❌
📖 పాపముతో పుట్టాను(with Sin) — అంటే ముందు నుండే పాపం అతనికి అంటుకొని ఉంది, పాపం అతని స్వభావంలో భాగం. కానీ బైబిల్ ఎక్కడా శిశువు పాపంతో పుట్టాడు అని చెప్పదు
అందుకే: KJV, ESV, NIV, NASB — all say in sin, not with sin.
👤 ఇది:
భావప్రధాన కవిత్వం ✔️
దావీదు చేసిన పశ్చాత్తాప వాక్యం ✔️
వ్యభిచారం, హత్య తరువాత చెప్పిన మాట✔️
పాపములో పుట్టాను (in Sin) ✔️
పాపముతో పుట్టాను (with Sin) ❌
దేవుని ఆజ్ఞ కాదు❌
అపోస్తలుల బోధ కాదు❌
“నేను పాపంలో పుట్టాను” అన్నది దావీదు చేసిన పాపం వెలుగులోకి వచ్చిన తర్వాత, ప్రవక్త చేత హెచ్చరిక చేయబడిన తరువాత బాధతో చెప్పిన మాట; ఇది మనుషులు పుట్టుకతోనే పాపులు అన్న బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతానికి ఇది ఆధారం కాదు.
8️⃣. యేసు కన్యక గర్భంలో పుట్టడమునకు కారణం
మన ప్రభువైన యేసు కన్యక గర్భంలో పుట్టిన విషయం గురించి కూడా అనేక అపార్థమైన బోధలు ఉన్నాయి. “మనుషులు తల్లిదండ్రుల కలయకతో పుట్టినవారు కాబట్టి పాపులు, యేసు అలా పుట్టలేదు కాబట్టి ఆయన పాపరహితుడు” అని ఇలాంటి బోధలు ఉన్నాయి. కానీ ఇట్టి బోధలు వాక్యానుసారమైనవి కావు. యేసు కన్యక గర్భంలో పుట్టడానికి కారణం, శారీరక కలయిక ద్వారా మనుష్యుడు పుట్టుట పాపమని నిరూపించడానికి కాదు గాని ఆత్మీయ మరణంలో ఉన్న మనిషిని రక్షించడానికి మరియు దేవుని అనాది సంకల్పం నెరవేర్చుటకే.
“మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా…” (ఎఫెసీయులు 2:1) పాపం వల్ల మనిషి దేవునికి దూరమయ్యాడు. దేవునికి దూరమవడమే నిజమైన ఆత్మీయ మరణం. ఇటువంటి ఆత్మీయ మరణం నుండి మనిషి తనంతట తానే బయటపడగలడా? లేదు ఎందుకంటే పాపిగా బ్రతుకుచున్న వ్యక్తి మరొక పాపిగా బ్రతుకుచున్న వ్యక్తిని ఆత్మీయ మరణం నుండి రక్షించలేడు మరియు ఆత్మీయంగా చచ్చిన వాడు జీవం ఇవ్వలేడు కాబట్టి రక్షణ మనుషుల ద్వారా రాలేదు. అది దేవుని నుండే రావలసి ఉంది. "అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు.౹ … మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.౹" (ఎపేసి 2:4,8)
ఇందుకు దేవుడు మానవ జాతి విషయమై ముందుగా ఆలోచన చేసి యేసు ద్వారా ఒక ప్రణాళిక రూపొందించారు అదే దేవుని అనాది సంకల్పం. దేవుని సంకల్పంలో భాగముగా యేసు యొక్క పుట్టుక గూర్చి ముందే రమారమి 600సం. క్రితమే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈలాగున పలికించెను. "కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.౹"(యెషయా 7:14) మరియకి ముందుగా దేవదూత యొక్క సందేశం(మత్తయి. 1:21-23). కన్యక గర్భంలో పుట్టడమునకు కారణం ఆత్మీయంగా చచ్చిన మనిషిని రక్షించుటకు, దేవునితో తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించుటకు, నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు, జీవమును ఇచ్చుటకు, నశించిన వారిని వెతికి రక్షించుటకు వచ్చెను కదా. “...గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹" (యోహాను 10:10) “మనుష్య కుమారుడు నశించినవారిని వెదకి రక్షించుటకు వచ్చెను.” (లూకా 19:10)
యేసు పాపరహితుడిగా ఉండటానికి గల కారణం "ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.౹ ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.౹" (1 పేతురు. 2:22-23). "మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.౹" (హెబ్రీ. 4:15) "ఏ కపటమును లేనివాడు(యోహాను. 1:47) "పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును...౹" (హెబ్రీ. 7:26) పాపం చేయలేదు కాబట్టి పాపరహితుడు, తన పుట్టుక విధానం వల్ల కాదు.
యేసు కన్యక గర్భంలో పుట్టడం శారీరక జన్మను నిందించడానికి కాదు, వివాహాన్ని పాపమని నిరూపించడానికి కాదు, పిల్లలను పాపులుగా ప్రకటించడానికి కాదు, జన్మ పాపమును స్థాపించుటకు కాదు. కాని, ఆయన పాపానికి లోబడని మానవ స్వరూపం ధరించుటకు, మనిషి స్థానంలో పరిపూర్ణ బలిగా నిలవుటకు, ఆత్మీయంగా చచ్చిన మనిషికి జీవం ఇవ్వుటకు వచ్చెను. 1Cor 15:20-23: "ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.౹ మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.౹ ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.౹ ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.౹" (1 కొరింథీయులు 15:20-23)
🔴 మొదటి ఆదాము ద్వారా ఆత్మీయ మరణం వచ్చింది.
🟢 చివరి ఆదాము అయిన క్రీస్తు ద్వారా ఆత్మీయ జీవం వచ్చింది.
✅ యేసు కన్య గర్భంలో పుట్టడమునకు కారణం – పుట్టుక పాపమని కాదు, ఆత్మీయ మరణంలో ఉన్న మనిషిని రక్షించుటకు అని ఇకనైనా తెలుసుకో…
మీ ఆత్మీయులు👪


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com