“వివాహము” (పార్ట్ - 02) Wedlock

“వివాహము” (పార్ట్ - 02) Wedlock

 సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసు నామములో వందనములు. 

మునుపు వ్రాయబడిన అంశములో వివాహము అనగా ఏమిటి?, వివాహము ఎందుకు? మరియు వివాహం ఎవరెవరికి? అనే విషయాలను గూర్చి గ్రంధానుసారమైన ఆధారాలతో  వివాహము పార్ట్ 01 నేర్చుకోగలిగాము. అవి మీ దైవిక జీవితమునకు ఉపయోగపడుతున్నాయని మన ప్రభువునందు విశ్వసిస్తున్నాము. ఇప్పుడు ఈ అంశములో అనగా వివాహము పార్ట్ 02 లో  వివాహములో ప్రాముఖ్యమైన విషయాలను గూర్చి ఆలోచన చేద్దాము.

వివాహములో ప్రాముఖ్యమైన విషయాలు :

1. మధ్యవర్తి
2. ప్రధానము
3. పెండ్లికుమార్తె అలంకరణ
4. వస్త్రధారణ
5. నిబంధన
6. సాక్ష్యులు
7. విందు
8. విందు ప్రధాని
9. పాన్పు

పైన తెలుపబడిన ప్రాముఖ్యతలను గూర్చి క్లుప్తంగా నేర్చుకుందాము.


 I) దేవునియెడల భక్తి, నమ్మకం కలిగిన మధ్యవర్తి :


స్త్రీ, పురుషుడు ఇద్దరు వ్యక్తులు వివాహమనే బంధం ద్వారా ఒక్కటి కావడానికి వారివురు ఉంటే సరిపోదు కానీ వారివురు కుటుంబాలు మధ్య దైవికమైన ఒప్పందం జరగాలి. అలా జరగాలంటే రెండు కుటుంబాల మధ్య వారధిగా ఒక మధ్యవర్తి అవసరం ఎంతైనా ఉంది. ఆ మధ్యవర్తి లోకానుసారుడిగా కాకుండా దేవునియెడల భయభక్తులు కలిగి, రెండు కుటుంబాల అభిప్రాయాలను చాకచక్యంగా ఒకరివి మరొకరికి యదార్ధంగా తెలియజేస్తూ వివాహమును దేవునికి మహిమకరంగా జరిపించాలి.  అలా జరగబడిన వివాహము గూర్చి గ్రంధములో వ్రాయబడినది.
 
"అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.౹ అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసు నితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము;౹ నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.౹ ఆ దాసుడు — ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొని పోవలెనా అని అడుగగా అబ్రాహాము– అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ.౹ నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశమునుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి– నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణముచేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు.౹ అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవుగాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.౹ ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.౹" (ఆది. కాం. 24:1-9). 

అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహం చేయదలచిన వాడైనప్పుడు తన ఇంట సమస్తమును ఏలుచుండిన నమ్మకమైన వ్యక్తి ఎలియాజరును అప్పగించుట. ఎలియాజరు అబ్రాహామునకు నమ్మకమైన వ్యక్తే కాదు దేవునినయెడల భయభక్తులు కలవాడు కూడా. ఒంటెలను సైతము మ్రోకరింపజేసి దేవునికి ప్రార్థించాడంటే అక్కడే ఆయన భక్తి ఏమిటో అర్థమగుతున్నది. అతడు ఎంతో చక్కగా గొప్ప మధ్యవర్తిగా వ్యవహరించి రిబ్కాను మాత్రమే కాదు ఆమె ఇంటివారందరిని ఒప్పించి సమాధానము కలిగి ఆమెను తీసుకువచ్చినట్టుగా చూడగలము. (ఆది 24వ అధ్యాయము అంతా చడవగలరు)

ఈనాటి కాలములో క్రైస్తవులమని చెప్పుకొనుచూ మధ్యవర్తి మరియు ఇరువురు కుటుంబాల ప్రమేయం లేకుండా తమ వివాహానికి తామే అన్నిటిని చూసుకుంటున్నవారున్నారు. అయితే మధ్యవర్తి లేకుండా వివాహం జరగబడిన కుటుంబాలు నేడు సంతోషంగా లేవా అనే ప్రశ్న మీ మదిలో మెదలవచ్చు. కానీ అలా జరగడం దైవిక నియమం ప్రకారం జరిగే వివాహం అనిపించుకోదు. అపోస్తుల బోధలో ఇటువంటి సొంత నిర్ణయాలకు తావులేదు. 

దేవునితో మనలను సమాధానపరచడానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి ఎంతో గొప్పగా మధ్యవర్తి పాత్ర పోషించి దేవునితో మనలను ఏకము చేసెను.

దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.  (1 మొదటి తిమోతికి 2:5)

పై వచనము ఆధారంగా మధ్యవర్తి చాలా అవసరమని, అతడు దేవునియెడల భయభక్తులు కలవాడై ఉండాలని అర్థమగుతున్నది.

ప్రతి తల్లితండ్రి ముఖ్యముగా గమనించాల్సిన విషయమేమిటంటే మీ బిడ్డల వివాహ విషయములో మీరే బాధ్యత తీసుకుని దేవుని చిత్తములో ఉన్న  మధ్యవర్తిని ఏర్పాటు చేసుకోవాలి ఎలాగయితే ఇస్సాకు విషయములో అబ్రాహామే చొరవ తీసుకుని ఎలియాజరుని పంపినట్టుగా. వివాహము తల్లితండ్రుల బాధ్యతే కానీ పిల్లలు తమంతట తాము అత్యాసక్తి చూపుట వాక్య విరుద్ధమని ఇస్సాకు రిబ్కాల వివాహము ద్వారా మనకు తెలియాలి. 


II). ప్రధానము :


ప్రధానం అనగా పెండ్లి చేసుకొంటానని ఇరువురు కుటుంబాలు కలిసి పరిశుద్దుల యెదుట, సమాజము యెదుట చేసుకునే ఒక ఒప్పందము మాత్రమే కానీ వివాహం కాదు. కేవలం, ప్రధానములో ఇరుగురు కుటుంబాలు ఒకచోటికి చేరి, వారి పిల్లల వివాహల కోసం సంప్రదింపులు చేసుకొనుటకు, పెండ్లి కుమారుని ఇంటివారు పెండ్లి కుమార్తెను ప్రధానం చేసుకొనుటకు కుటుంబ సభ్యులను మరియు మధ్యవర్తిని పెట్టి, వారి ఆర్థిక పరిస్థితి బట్టి పెండ్లి కుమార్తెకు బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తారు. 


ప్రధానములో ఏమి జరుగును? :

1). పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడితో తన భవిష్యత్ జీవితానికి సిద్ధపడటం :

ఇస్సాకునకు రిబ్కాను ప్రధానం చేసిన తరువాత (ఆది. కాం. 24:50-53) రిబ్కా తెలియపరిచిన మాట   "ఆమె సహోదరుడును ఆమె తల్లియు– ఈ చిన్నదాని పదిదినములైనను మాయొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి.౹ అప్పుడతడు– యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పి నప్పుడు వారు– ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి– ఈ మనుష్యునితోకూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు —వెళ్లెదననెను.౹" (ఆది. కాం.24:55-58) ఆమె తన స్వజనమును, తన తండ్రి ఇంటిని విడిచుటలో సిద్ధపడునట్టుగా చూడగలం. 

2). ప్రధానముతో జీవితకాల బంధము నిర్ణయించబడును :

"నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును.౹ నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును.౹" (హోషేయా. 2:19-20)

అయితే ప్రధానం అనంతరం పెండ్లి కుమారుడు తనకు ప్రధానము చేయబడిన ఆమెను వివాహం చేసుకొనుటకు ఎక్కువ సమయం తీసుకోకూడదు.

"ఒకడు స్త్రీని ప్రధానము చేసికొని ఆమెను ఇంకనుపరిగ్రహింపకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.౹" (ద్వితీయో. 20:7).

NOTE: (ప్రధానము గూర్చి లోతైన సంగతులను మరియొక్క అంశము ద్వారా మీముందు ఉంచుతాము)

III). పెండ్లి కుమార్తె అలంకరణ: 


పెండ్లి కుమార్తె తన భర్తకొరకు అనగా తన రాజు కొరకు అలంకరింపబడాలి. రాజుకు నచ్చినవిధముగా ఆమె సిద్ధము చేయబడాలి.

కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. 
విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు. (కీర్తనల 45:10-11)

"మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.౹" (ప్రకటన. 19:8)

"మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.౹" (ప్రకటన. 21:2)

"అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి– ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,౹" (ప్రకటన. 21:9).


IV). అతిధి వస్త్రధారణ : 


వివాహానికి వచ్చువారు సంతోషముతో పెండ్లివస్త్రములను ధరించుకుని నూతన వధూవరులను చూడరావాలి.

 "రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి –స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను. అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను." (మత్తయి. 22:11-13).


V). నిబంధన : 


 వివాహములో అత్యంత ప్రాముఖ్యమైనది నిబంధన. నిబంధన అనగా ఒప్పందము, ఒడంబడిక మరియు ప్రమాణము. అది ఎన్నటికీ మార్చుకోనిది ఎందుకనగా ఇది మనుష్యుల మధ్య మాత్రమే జరిగేది కాదు పరమతండ్రి, సంఘము (క్రీస్తు+శరీరము) యెదుట చేసుకునేది. ఊరికే ఎవరో ఒకరు పక్కనుండి అందిస్తే అవే మాటలు నువు కంఠస్థ పద్యము లాగా చెప్పేస్తే చాలు అనుకుంటున్నావేమో వివాహములో చేసుకునే నిబంధన మరణము ఎడబాయువరకు ఒకరికొకరు దైవిక కుటుంబంగా కట్టబడుతూ అన్ని విషయములలో కట్టుబడి ఉంటానని దేవుని యెదుట ఒప్పుకోవడం. ఎన్ని వచ్చినా, ఏది ఎదురైనా దేవుని నియమానికి విధేయులమై ఉంటామని చేసుకునే ప్రమాణము. ఇది నువు మీరితే వివాహానికి వచ్చేవారు సాక్షులుగా నిలబడతారో లేదో కానీ ఖచ్చితముగా దేవుడు ఇందుకు సాక్షిగా ఉంటాడు.

 "అది ఎందుకని మీ రడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.౹ కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి.౹ భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి." (మలాకి 2:14-16)

"మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.౹" (హెబ్రే. 6:16)

"దావీదు కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలి కానికి కీడుచేయడు తన పొరుగువానిమీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు." (కీర్తనల 15:1-4)


VI). సాక్ష్యులు : 


ఈ లోకములో మనం ఏ చిన్న పని చేసినా దానికి సాక్షి ఉండేలా చూసుకుంటాము ఎందుకంటే మన మాట ఎవరు నమ్మకపోయిన సాక్షి మాటనుబట్టి నమ్ముతారని. న్యాయస్థానాలు కూడా సాక్షి లేనిదే తీర్పును వెలువడించరు. వివాహము పరమతండ్రి యొక్క ప్రణాళిక మరి అంత గొప్ప ప్రణాళికకు సాక్ష్యులు అవసరమై యున్నారు కదా!
 
"ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధనమందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా– మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధనమందసపు ప్రక్కన ఉంచుడి.౹ అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.౹ నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.౹ నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా. మీ గోత్రముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.౹" (ద్వితీయో. 31:24-28)


VII). విందు మరియు విందు ప్రధాని : 


వివాహానికి వచ్చినవారిని సంతృప్తి పరచడానికి విందును ఏర్పాటు చేయాలి. దాని బాధ్యతలు చూడడానికి విందు ప్రధాని అవసరమై యున్నాడు. విందు ప్రాముఖ్యం కదా అని  అందరూ గొప్పగా మాట్లాడుకోవాలని అప్పు చేసి మరీ పెట్టాలని గ్రంధము చెప్పుటలేదు కానీ నీ స్తోమతకు తగినట్టుగా నీకు ఉన్నంతలో ఎవరికి లోటు లేకుండా ఉండేలా చూసుకుంటే చాలు. 

 "పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడినవారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాగా అతడు– ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. … గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను." (మత్తయి. 22:2-6;9)

"యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి.౹ ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి– వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా౹ యేసు ఆమెతో– అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను.౹ ఆయన తల్లి పరిచారకులను చూచి —ఆయన మీతో చెప్పునది చేయుడనెను.౹ యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను.౹ యేసు– ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.౹ అప్పుడాయన వారితో– మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.౹ ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి౹ –ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.౹ గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి." (యోహాను. 2:2-11)


VIII). పాన్పు : 


పాన్పు అంటే దేవుడు, సంఘము మరియు సమాజము సమక్షంలో జతచేయబడిన వారు వివాహ అనంతరం కలుసుకొనుట లేక కూడుకొనుట. 

ఈ విషయమును గూర్చి  నేటి కాలపు యవనస్తులు ఏమనుకుంటున్నారో ఈ విషయములో వారి ఆలోచనలు ఎంతటి పాపానికి దారి తీస్తున్నాయో దేవునికి విరోధముగా ఎంతటి ఘోరమైన దుష్కార్యములు చేస్తున్నారో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు. ఈ లోకపు ఆలోచనలతో బ్రతికేవారి పరిస్థితి అలా ఉందంటే ఏమి మాట్లాడలేము కానీ క్రైస్తవులమని చెప్పుకునే యవనస్తులు కూడా వివాహానికి  ముందే తమ కోరికలను నెరవేర్చుకుంటూ దేవుని నామాన్ని ఘోరంగా అవమానపరుస్తూ వారి నాశనాన్ని వారే కొనితెచ్చుకొంటున్నారు. 

వివాహము చేసుకునేవారు పవిత్రంగా ఉండాలి.వారి పాన్పు కలుషితం కాకుండా, నిష్కళంకంగా ఉండాలి. ఇరువురూ ఒకరియెడల ఒకరు సంతోషన్నీ వ్యక్తపరుస్తూ, నిర్మలమైన మనసాక్షితో ముందుకు కొనసాగబడాలి. ఈ లోకపు చట్టాలు ఏమి చెవుతున్నాయో క్రైస్తవుడికి అనవసరం. నీ చట్టం అనగా పరిశుద్ధ గ్రంధము ఏమి చెప్తుందో దానికి నీవు లోబడాల్సిందే కానీ ఏవేవో కహానీలు చెప్తూ నీ తప్పుని కప్పిపుచ్చుకుంటే నీవు క్రైస్తవుడవి కాదు.

 "వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.౹" (హెబ్రే. 13:4).

పైన తెలుపబడిన ప్రాముఖ్యతలు అన్ని కలిస్తేనే అది దైవిక వివాహమనబడతాది. ఇవన్నీ నేటి కాలములో ఎక్కడ జరుగుతున్నాయి ఇవి సాధ్యపడేవి కాదు అని నిన్ను నీవు సమర్ధించుకుని నీ సొంత జ్ఞానముతో లోకాన్ని ఆశ్రయించి వివాహాన్ని జరిగిస్తే నీవు క్రైస్తవుడవి కాదు. తెలియక నియమాలను తప్పి  వారి వివాహాన్నీ జరిగించి వారి నిమిత్తము కాదు గానీ తెలిసి అలా జరిగించేవారు దేవుని శిక్షకు పాత్రులవుతారు. 

కాబట్టి వివాహము కాని వారు ఇప్పటికైనా మేల్కొని పైన వ్రాయబడినవాటిని గ్రంధపరిశీలన చేసి మీ వివాహ విషయములో ఇకనైనా జాగ్రత్త కలిగియుండాలని అలాగే తల్లితండ్రులు వారి పిల్లల విషయములో జాగ్రత్త వహించి పూర్తి బాధ్యత వారే తీసుకుని లేఖనానుసారంగా ముందుకు కొనసాగాలని మా మనవి.
మీ ఆత్మీయులు...

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments
September 20, 2021 at 11:53 PM delete

Who is విందు ప్రధాని

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16