"వివాహము" (పార్ట్ - 06) Wedlock



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻 

*పరిచయం* 

వివాహము మానవ జీవితంలో ఒక ముఖ్యమైన బంధము. అయితే బైబిల్ దృష్టిలో వివాహము కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి చేసుకునే సామాజిక ఒప్పందం కాదు. అది దేవుని ఉద్దేశంలో ఏర్పడిన నిబంధనాత్మక బంధము. అందువల్ల వివాహానికి సంబంధించిన విషయాలను మనుష్యుల అభిప్రాయాలు, సంప్రదాయాలు లేదా సమాజపు ఆచారాల ఆధారంగా కాకుండా దేవుని వాక్యము ఆధారంగా పరిశీలించాలి కదూ. మునుపే అట్టి విషయాలను 5 భాగాలుగా వ్రాసితిని వాటిని ఈ అంశము చివరిగా పొందుపరుస్తాము వీలైతే వాటిని క్లిక్ చేసి చదివి ఆలోచన చేయగలరు.

వివాహం అంటే కేవలం ఇద్దరు మనుషులు కలిసి జీవించడం మాత్రమేనా?, లేక దేవుని సన్నిధిలో ఏర్పడే పవిత్రమైన నిబంధనా?, ఒకసారి ఏర్పడిన వివాహ బంధాన్ని మనిషి తన ఇష్టానుసారంగా ముగించి, మరొక వివాహంలోకి అనగా రెండో వివాహంలోకి ప్రవేశించగలడా?, ఒకరు విడాకులు తీసుకున్నప్పుడు రెండో వివాహానికి అర్హుడవుతాడా?, భార్యాభర్తలు విడిగా జీవిస్తే వారి వివాహ బంధం ముగిసినట్టేనా?, భర్త లేదా భార్య మరణించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?, అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామి విడిచిపోతే విశ్వాసి ఏమి చేయాలి?, యేసు చెప్పిన “వ్యభిచార నిమిత్తము తప్ప” అనే మాటకు అర్థం ఏమిటి?, రెండో వివాహానికి బైబిల్‌లో ఉన్న పరిస్థితులు ఏమిటి? ఈ విధంగా మొత్తం వాటిని బైబిల్ బోధను సమగ్రంగా పరిశీలించినప్పుడే, వివాహము ఎందుకు ఘనమైనదో, వివాహ బంధం విషయంలో ఎందుకు జాగ్రత్త అవసరమో, రెండో వివాహం విషయంలో ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదో స్పష్టమవుతుంది. వీటితో పాటు మరికొన్ని విషయాలను జాగ్రత్తగా నేర్చుకొనుటకు ప్రయత్నము చేద్దాం..


1️⃣. *వివాహ బంధము — దేవుని ముందు ఏర్పడిన బంధము*

పురుషుడు + స్త్రీ = ఏక శరీరము అవ్వటం పరిశుద్ధ వివాహం బంధము. ఈ వివాహంలో నిబంధన అనే భావన ఉంది. "....నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.౹" (మలాకీ 2:14) కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు." (ఆదికాండము 2:24) "ఆయన— సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు –ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను." (మత్తయి 19:4–6) యేసుక్రీస్తు ఇదే సృష్టి క్రమాన్ని ఇలా ధృవీకరించాడు. కాబట్టి వివాహాన్ని మనుష్యుల అభిప్రాయాల ప్రకారం కాకుండా దేవుని వాక్య ప్రకారం మనం పరిశీలించాలి.

అలాగే "వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.౹" (హెబ్రీయులకు 13:4). ఈ వాక్యం వివాహానికి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. వివాహము ఘనమైనదిగా ఉండాలి; వివాహ పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. కాబట్టి వివాహ బంధంలోకి ప్రవేశించడం ఎంత ముఖ్యమో, ఆ బంధాన్ని దేవుని నియమాల ప్రకారం కొనసాగించడం కూడా అంతే ముఖ్యము.

వివాహము అనేది దేవుని ముందు భార్యాభర్తల మధ్య ఏర్పడే ఒక పరిశుద్ధ నిబంధన. ఆ నిబంధనలో ఇద్దరూ పాల్గొంటారు. ఒక ఒప్పందానికి షరతులు ఉన్నట్లే, వివాహ నిబంధనకు కూడా షరతులు ఉన్నాయి. ఆ నిబంధనలో ఇద్దరికీ ఒకే బాధ్యత ఉంటుంది. ఈ నిబంధన వారిమధ్య ఒక్కసారే. భార్య అయినా, భర్త అయినా బ్రతికి ఉన్నంతకాలం ఈ వివాహ బంధము కొనసాగుతుంది. భార్యాభర్తలలో ఒకరు మరణించినప్పుడు మాత్రమే ఆ వివాహ బంధము ముగుస్తుంది. 


ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు:

✅  దేవుడే వివాహాన్ని ఏర్పాటు చేశాడు.

✅ నిబంధన చొప్పున భార్యాభర్తలు ఏకశరీరమవుతారు.

✅ వివాహ పాన్పు నిష్కల్మషమైనదిగా చూసుకోవాలి

✅ దేవుని నియమాల ప్రకారం వివాహ నిబంధనను మరణం వరకు జాగ్రత్తగా కొనసాగించడం

✅ ఏ ఒక్కరూ మరణానికి ముందే తనకి ఇష్టానుసారంగా ఆ వివాహ బంధాన్ని తెంచకూడదు సుమీ!! అప్పుడే అది దేవుని యెదుట ఏర్పడిన వివాహ బంధం అనబడును.

👉 ఇప్పుడు అసలైన ప్రశ్నలోకి వద్దాం…

“అట్టి వివాహ బంధంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు రెండో వివాహం చేసుకోవడానికి అర్హుడు? ఎప్పుడు అనర్హుడు?”

2️⃣. *రెండో వివాహమునకు అర్హతలు*

రెండో వివాహమునకు అనుమతికి మనము ముఖ్యంగా రెండు పరిస్థితులను పరిశీలిస్తున్నాము. 

1.  భార్య లేదా భర్త మరణించినప్పుడు

2. ఇంతవరకు వివాహం చేసుకోని వ్యక్తులు


🔴  భార్య లేదా భర్త మరణించినప్పుడు :

1 కొరింథీయులు 7:39 మరియు రోమా 7:2–3లో పౌలు భార్యాభర్తల సంబంధాన్ని వివరిస్తూ, భర్త/భార్య జీవించి ఉన్నంతకాలం భార్య/భర్త అతనికి బద్ధురాలై ఉంటుందని, భర్త/భార్య మరణించినప్పుడు ఆ బంధం నుండి విడుదల పొందుతుందని తెలియజేస్తున్నాడు. 

"భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలుగాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును.౹ కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభిచారిణియనబడును గాని, భర్త చనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.౹" (రోమా 7:2-3)

"భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.౹" (1 కొరింథీయులు 7:39)


ఈ వాక్యాన్ని బట్టి, మొదటి భర్త మరణించిన స్త్రీకి మరొకరిని వివాహం చేసుకునే స్వాతంత్ర్యం ఉందని తెలుస్తుంది. ఇదే సూత్రం భార్య మరణించిన పురుషునికీ వర్తిస్తుంది.


🗣️ ఉదాహరణ 1: పుల్లయ్యకు పుల్లమ్మతో వివాహమైంది. వారిద్దరూ కలిసి జీవించారు. కొంతకాలానికి పుల్లమ్మ మరణించింది. పుల్లయ్య తన భార్య మరణించిన తరువాత ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడు తిరిగి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, 1 కొరింథీయులకు 7:39లోని సూత్రం ప్రకారం, ప్రభువునందు మాత్రమే వివాహం చేసుకోవడానికి స్వాతంత్ర్యం ఉంది.


🗣️ ఉదాహరణ 2: సూరమ్మకి తన భర్త మరణించాడు. ఆమె కొంతకాలం ఒంటరిగా జీవించిన తరువాత మరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. భర్త మరణించినందున ఆమె మొదటి వివాహ బంధం నుండి విడుదల పొందింది. కాబట్టి ప్రభువునందు మాత్రమే వివాహం చేసుకోవచ్చు.


🔵 *గమనించవలసిన విషయం*: ఈ సందర్భంలో రెండవ వివాహానికి ఆధారం మొదటి జీవిత భాగస్వామి యొక్క మరణం. మొదటి వివాహం నుండి అవిశ్వాసం చేత పారిపోవడం లేదా మరొకరిని ఇష్టపడటం లేదా, వ్యభిచారము కారణమో లేదా అవిశ్వాసి అని కాదు. అలా విడిచి జరిగే రెండో వివాహాలు పరిశుద్ధ వివాహాలే కాదు.


🔴  ఇంతవరకు వివాహం చేసుకోని వ్యక్తులు:

వివాహము చేసుకోని వ్యక్తి వివాహము చేసుకోవడానికి సంబంధించిన విషయాలను క్రొత్త నిబంధనలో పరిశీలించవచ్చు.

"నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.౹ అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.౹" (1కొరింథీయులు. 7:8-9) పెండ్లికాని వారిని, విధవరాండ్రను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. వివాహం చేసుకోకుండా ఉండగలిగితే అలా ఉండవచ్చని, అయితే స్వీయనిగ్రహం లేకపోతే వివాహం చేసుకోవచ్చని తెలియజేస్తున్నాడు.


🗣️ ఉదాహరణ : ఒక యువకుడు/యువతి ఇంతవరకు వివాహం చేసుకోలేదు. అతడు ఒక యువతిని/యువకుడిని వివాహం చేసుకోవాలని కోరుకంటే. వారిద్దరూ క్రైస్తవులుగా ప్రభువునందు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే, అతని/ఆమె గతంలో వివాహం లేనందున రెండవ వివాహానికి సంబంధించిన సమస్యే ఉండదు. అది అతనికి మొదటి వివాహం.


🔵 ముఖ్యమైన స్పష్టత: ఇంతవరకు వివాహం చేసుకోని వ్యక్తి వివాహం చేసుకోవడం మొదటి వివాహమే. అయితే గతంలో వివాహం చేసుకున్న వ్యక్తి విషయంలో మాత్రం మొదటి వివాహం బంధం ఎలా ముగిసిందో కాస్త జాగ్రత్తగా ఆలోచించి, పరిశీలించే రెండో వివాహం వైపు పోవాలి లేదంటే వ్యభిచారులు అయ్యే పరిస్థితి కలుగుతుంది. అది ఏలా అనేది ఈ క్రింది రెండవ వివాహం అనర్హతలలో చివరిలో వ్రాశాము.

3️⃣. రెండవ వివాహము -  అనర్హతలు*

🔴 వ్యక్తిగత ఇష్టాల కారణంగా విడాకులు తీసుకోవడం*

 "కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను." (మత్తయి. 19:6) "సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను." (మార్కు. 10:6-9)


🗣️ ఉదాహరణ: ఒక భర్తకు తన భార్య వంట చేసే విధానం నచ్చడం లేదు. మరొక భర్తకు తన భార్య తన మాటలన్నింటినీ అంగీకరించడం లేదని అసంతృప్తి ఉంది అని లేదా వివాహం అనంతరం వచ్చే సమస్యలు పరిష్కారం కొరకు విడాకులు పోవడం… Etc. ఈ కారణాలతో భార్యను విడిచిపెట్టి మరొక స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, అది వివాహ బంధాన్ని వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా తేలికగా తీసుకున్నట్లవుతుంది. ఈ విషయములో రెండో వివాహం అనుమతి లేదు. 


🔴 *భార్యాభర్తలు విడిపోయినప్పుడు వెంటనే మరొకరిని వివాహం చేసుకోవడం*

"మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.౹ ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.౹" (1కొరింథీయులకు 7:10–11) విడిపోయిన భార్యాభర్తలు అవివాహితులుగానే ఉండాలని లేదా తిరిగి సమాధానపడాలని పౌలు బోధించాడు. ఈ విషయములో కూడా రెండో వివాహం అనుమతి లేదు. 


🗣️ ఉదాహరణ: ఒక భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. చివరకు భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతకాలం తరువాత భర్త మరొక స్త్రీని ఇష్టపడి, మొదటి భార్యతో తిరిగి సమాధానపడటానికి ప్రయత్నించకుండా రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. విడిపోయినంత(విడాకులు తీసుకున్నంత) మాత్రాన వెంటనే రెండో వివాహానికి స్వాతంత్ర్యం వచ్చిందని భావించకూడదు. ఈ విషయములో కూడా రెండో వివాహం అనుమతి లేదు. 


🔴 భౌతిక/ఆత్మీయ సంబంధమైన ఇతర కారణాలను చూపించి విడనాడి రెండో వివాహం చేసుకోవడం

యేసు మాటల్లో... "అందుకాయన– తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను." (మార్కు. 10:11-12). "తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు." (లూకా 16:18) వివిధ కారణాలు చేత విడాకులు తీసుకొని మరొకరిని వివాహం చేసుకోవడం గురించి యేసుక్రీస్తు ఇలా హెచ్చరిక ఇచ్చాడు.


🗣️ ఉదాహరణ 1 : ఒక వ్యక్తి తన భార్యతో కొన్నేళ్లు జీవించిన తరువాత, మరొక స్త్రీ అందంగా ఉందని, ఆమెతో జీవిస్తే తనకు ఎక్కువ సంతోషం కలుగుతుందని భావించాడు. అందువల్ల మొదటి భార్యను విడిచిపెట్టి రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొత్త వ్యక్తి నచ్చడం ఒక్కటే మొదటి వివాహ బంధాన్ని విడిచిపెట్టడానికి బైబిలు ఆధారంగా పరిగణించకూడదు.


🗣️ ఉదాహరణ 2 : ఒక వ్యక్తి తన భర్తతో కొన్నేళ్లు జీవించిన తరువాత, నాకు తెలిసి తెలియని వయస్సు లో వివాహం అయ్యింది, వివాహం కోసం నాకేమి తెలియదు అంటూ, మరొక పురుషుడు అందంగా ఉన్నాడని, అతనితో జీవిస్తే తనకు ఎక్కువ సంతోషం కలుగుతుందని భావించి, అందువల్ల మొదటి భర్తను విడిచిపెట్టి రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొత్త వ్యక్తి నచ్చడం ఒక్కటే మొదటి వివాహ బంధాన్ని విడిచిపెట్టడానికి బైబిలు ఆధారంగా పరిగణించకూడదు. ఇక్కడ కూడా రెండో వివాహం అనుమతి లేదు.


🔴 *అవిశ్వాసియైన జీవిత భాగస్వామి ఉన్నారు అనే కారణంతోనే విడిపోవడం*

అవిశ్వాసియైన భాగస్వామి విశ్వాసితో కలిసి జీవించడానికి ఇష్టపడితే, విశ్వాసి అతనిని లేదా ఆమెను విడిచిపెట్టకూడదని పౌలు బోధించాడు.

"ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా– ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.౹ మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్య జింపకూడదు.౹ అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.౹ అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.౹ ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?౹ అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.౹" (1కొరింథీయులకు 7:13-17)


🗣️ ఉదాహరణ: ఒక స్త్రీ క్రీస్తును విశ్వసిస్తోంది. ఆమె భర్త మాత్రం క్రైస్తవ విశ్వాసాన్ని అంగీకరించడం లేదు. అయినప్పటికీ అతడు ఆమెతో శాంతియుతంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు/లేకపోయినా సరి భర్త అవిశ్వాసి అనే ఒక్క కారణంతోనే అతనిని విడిచిపెట్టి రెండో వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకోకూడదు. ఇక్కడ రెండో వివాహం అనుమతి లేదు.


🔴 *జీవిత భాగస్వామి జీవించి ఉండగానే మరొకరిని వివాహం చేసుకోవడం*

మొదటి వివాహం బంధం నుండి ఎప్పుడూ విడుదల కలుగుతుందో తెలియక అజ్ఞానంతో, మానవ యోచనలతో, పెద్దల ఇష్టా ఇష్టాలతో మరొకరిని వివాహం చేసుకోవాలనేది వ్యభిచారముతో సమానం. భర్త జీవించి ఉన్నంతకాలం భార్య అతనికి బద్ధురాలిగా ఉంటుందనేది సత్యం.

"భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలుగాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును.౹ కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభిచారిణియనబడును గాని, భర్త చనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.౹" (రోమీయులకు 7:2–3)


🗣️ ఉదాహరణ: ఒక వ్యక్తి తన భార్యతో విభేదాల కారణంగా విడిగా నివసిస్తున్నాడు. అయితే అతని భార్య ఇంకా జీవించి ఉంది. ఈ సమయంలో మరొక స్త్రీని వివాహం చేసుకుంటే, విడిగా నివసించడం మాత్రమే తనకు రెండో వివాహానికి స్వాతంత్ర్యం ఇచ్చిందని అతడు భావించినట్లవుతుంది కానీ దాని తుది ఫలితం వ్యభిచారము. 


🔴 విడాకులు తీసుకున్నంత మాత్రాన రెండో వివాహానికి అనుమతి వచ్చిందని భావించడం

"మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.౹ ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.౹" (1కొరింథీయులకు. 7:10-11)


భార్య భర్తను ఎడబాయకూడదు ❌

ఎడబాసినయెడల రెండో వివాహం ❌

సమాధాన పడవలెను ✅

పరిత్యజింపకూడదు ✅


🗣️ ఉదాహరణ: ఒక దంపతులు కోర్టు ద్వారా విడాకులు పొందారు. ఆ తరువాత భర్త, “ఇప్పుడు చట్టపరంగా నా వివాహం ముగిసింది కాబట్టి నేను ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు” అని నిర్ణయించుకున్నాడు. కానీ కోర్టు ఇచ్చిన విడాకుల పత్రం ఒక్కటే కానీ దేవుని వాక్యప్రకారం రెండో వివాహానికి అనుమతి ఉందని నిరూపించదు. ఇక్కడ కూడా రెండో వివాహం అనుమతి లేదు.


"కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను." (మత్తయి. 19:6)అందుకాయన– తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను." (మార్కు. 10:11-12). 


🔴 *వ్యభిచారము జరిగిన సందర్భంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం*

"నేను మీతో చెప్పునదేమనగా– వ్యభిచారకారణమునుబట్టిగాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు." (మత్తయి. 5:32) "మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను."(మత్తయి. 19:9).


నిజమే… యేసు మాటల్లో "వ్యభిచారకారణమునుబట్టిగాక & వ్యభిచారము నిమిత్తమే తప్ప" అనే రెండు విషయాలు చూడగలం వీటిని చూపిస్తూ చాలామంది అదిగో వ్యభిచారము బట్టి రెండో వివాహం చేసుకోవచ్చు అని దుర్బోధ చేసేవారు లేకపోవచ్చు. మన ప్రభువు అక్కడ రెండవ వివాహం కోసం ఏ మాత్రం చెప్పుట లేదని గుర్తించుము. 

వ్యభిచార నిమిత్తమే తప్ప (అంటే వ్యభిచారం జరగడం అనే కారణం తప్ప), తన భార్యను విడనాడి మరొకరిని పెళ్లి చేసుకునే ప్రతివాడు వ్యభిచరిస్తున్నట్లే అని అర్థం. అంటే, కేవలం వ్యభిచారం కారణంతో విడిపోవచ్చు అని చెప్పడం కాదు, ఒకవేళ అలా విడిపోయి రెండో వివాహం చేసుకుంటే అది దేవుని దృష్టిలో పాపమని(వ్యభిచారమని) ఆయన నొక్కి చెప్పారు. చూడండి.. అనే"మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను."(మత్తయి. 19:9). 

వ్యభిచార కారణంతో మొదటి వివాహ బంధాన్ని విడిచిపెట్టి మరొకరిని వివాహం చేసుకోవడం వ్యభిచారంతో సంబంధం కలిగినదిగా యేసు బోధించారు. మిత్రమా!! నీ మదిలో కలిగే ఆలోచన నాకు అర్ధం అయ్యింది. ఇంకా అయిపోలేదు. ఈ క్రింది చూడుము 


మత్తయి 19:10–12లో శిష్యులు వివాహ సంబంధం గురించి “భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదు” అని స్పందించినప్పుడు, యేసుక్రీస్తు నపుంసకుల గురించి బోధించారు. అక్కడ ఆయన మూడు రకాల నపుంసకులను ప్రస్తావించారు 


1.   తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, 

2. మనుష్యులవలన నపుంస కులుగా చేయబడిన నపుంసకులునుగలరు,

3. పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులునుగలరు. ✅


దేవుని నిబంధనను గౌరవించేవారు, విడిపోయిన(ఏ కారణమైన..) తర్వాత వివాహానికి దూరంగా(నపుంసకులుగా) ఉండటం ద్వారా పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటారని యేసుక్రీస్తు బోధన ఉద్దేశ్యం అని గుర్తించండి. నీకు సమాధానం దొరికిందని  అనుకుంటాను. ఇక్కడ కూడా రెండవ వివాహమునకు అనుమతి లేదు ❌ 


🗣️ ఉదాహరణకు: “ఇశ్రాయేలు అనేక వ్యభిచారములు చేసినప్పటికీ, ‘తిరిగిరమ్ము’ అని యెహోవా పిలిచాడు. పాపంలో కొనసాగడం కాదు, చేసిన దోషాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరిగి రావడమే ఆయన పిలుపు.” (యిర్మీయా 3:1–14) ఇశ్రాయేలు దేవుని నిబంధనను విడిచి విగ్రహారాధనలోకి(వ్యభిచారము వైపు) వెళ్లినప్పుడు, దేవుడు తన ప్రజలను ప్రవక్తల ద్వారా తిరిగి పిలిచాడు. యిర్మీయా ద్వారా ‘తిరిగిరమ్ము’ అని పిలిచాడు, హోషేయ ద్వారా తన ప్రేమను చూపించాడు, యెహెజ్కేలు ద్వారా మారుమనస్సు పొందాలని హెచ్చరించాడు. ఈ సంగతులు దేవుని నిబంధన ఎంత పవిత్రమైనదో, అవిశ్వాసం ఎంత తీవ్రమైనదో మనకు తెలియజేస్తున్నాయి కదూ. 


అలాగే వ్యభిచారం జరిగిందని భార్యను లేదా భర్తను విడిచిపెట్టి రెండవ వివాహం వైపు వెళ్లడమే పరిష్కారం కాదు. తప్పు చేసిన వ్యక్తి పాపాన్ని విడిచి పశ్చాత్తాపంతో తిరిగి రావడానికి, మొదటి వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు, ‘తిరిగిరా’ అనే పిలుపుకు మొదటగా స్థానం ఇవ్వాలి. దేవుడు ఇశ్రాయేలును తన ద్రోహం నుండి తిరిగి రావాలని పిలిచినట్లే, భార్యాభర్తలు కూడా పాపాన్ని విడిచి, పశ్చాత్తాపంతో తమ బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. ఆమె/అతను రాకపోతే  ఎంత మాత్రం రెండో వివాహం వైపునకు పోకూడదు, పోతే అది దేవుని యెదుట వ్యభిచారం అగును.

🟣 *ముగింపు*

వివాహము అనేది చిన్న విషయం కాదు. రెండవ వివాహం — మనుష్యుల ఇష్టం కాదు, దేవుని వాక్యమే ప్రమాణం!  మొదటి జీవిత భాగస్వామి మరణించినవారు, ఇంతవరకు వివాహం చేసుకోనివారు/కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు అనే వీరి విషయంలో బైబిలు బోధనను స్పష్టంగా గుర్తించాలి. (1 కొరింథీయులకు 7:8–9, 39) భౌతిక/ఆత్మ సంబంధమైన విషయాలలో ఈ లోక చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నంత మాత్రాన మరియు వ్యభిచారం చేస్తున్నారని రెండవ వివాహానికి అర్హత వచ్చినట్లు కాదు! మనుష్యుల అభిప్రాయాలకు కాదు దేవుని వాక్యానికే లోబడుదాం! 🙏

మీ ఆత్మీయులు

9705040236


వివాహము (పార్ట్ 01) క్లిక్ చేయు

వివాహము (పార్ట్ 02)క్లిక్ చేయు

వివాహము (పార్ట్ 03)క్లిక్ చేయు

వివాహము (పార్ట్ 04)క్లిక్ చేయు

వివాహము (పార్ట్ 05)క్లిక్ చేయు

WhatsApp Channel - 2k Join Now
Telegram Group - 600 Join Now
Instagram Page - 500 Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

Note: Only a member of this blog may post a comment.

The churches of Christ greet you - Roma 16:16