“వివాహము” (పార్ట్ - 01) Wedlock

వివాహము” (పార్ట్ - 01)


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రియులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. 

            "వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను” (హెబ్రె. 13:4). వివాహము అనే విషయముపై నేటి కాలములో అనేకులు సరైన అవగాహనా మరియు లేఖనానుసారమైన జ్ఞానములేక తప్పిదము చేస్తూ లోకానుసారమైన జ్ఞానము చొప్పున మరియు వారి స్వనీతిని ఆధారము చేసుకొంటూ  కార్యక్రమమును తప్పుడుగా జరిగిస్తూ పరమదేవుడు ఏర్పాటు చేసిన వివాహం అనే గొప్ప వ్యవస్థను  తప్పుదారి పట్టిస్తున్నారు.   వివాహం అనే అంశమును నాలుగు భాగాలుగా నేర్చుకొందాం ఇది మొదటి భాగము.  

    వివాహ వ్యవస్థ గూర్చి యెరిగి దాని విషయములో లోకజ్ఞానాన్ని అనుసరించే వారి నిమిత్తము ఏమి చేయలేము గాని తెలియక అపార్ధం చేసుకొంటున్న వారు తమ జీవితాలు ఇకనైనా సరిచేసుకోవాలని   అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. 


I. వివాహము అనగా ఏమిటి

భిన్నత్వములో ఉన్న ఇద్దరు వ్యక్తులు(స్త్రీ & పురుషుడు) ఏకత్వమగుటకు దేవునిచే జతపరచబడుటకు జరుగు దైవకార్యమును వివాహము అందురు.

⟹ గ్రీక్ లో - γάμος - gamos - gam'-os (G1060, G1062)

⟹ ఇంగ్లీష్  లో  marriage, wedding, wedlock 


భిన్నత్వము నుండి ఏకత్వము అనగా ఏమిటి

వరుడు, వధువు వివాహానంతరము హృదయము, మనసు, మనసాక్షి లలో భిన్నత్వము నుండి ఏకత్వమగుట.అనగా కోరికలలో, ఆలోచనలలో, ప్రణాళికలలో, నిర్ణయాలలో, కార్యాచరణలలో, అలవాట్లలోఅనుభూతులలో భిన్నత్వము నుండి ఏకత్వమగుట.

➾ మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. (మత్తయి సువార్త  18: 19)

➾ ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను. (1 కోరింథి. 7:2)

 

II. వివాహం ఎందుకు? 

𝗔). పురుషుడు ఒంటరిగా ఉండకూడదని :

పరమదేవుడు ఆదిలో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయకమునుపే నరజాతి కొరకు భూమ్యాకాశములను, వృక్షజాలము, జలచరములను, ఆకాశ పక్షులను, పశువులను, పురుగులను, జంతువులను  సృజించెను. (ఆది.1:1-23. cf). 

➾ అటు తరువాత, "దేవుడుమన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. (ఆది. 1:26-27). 

నరుని నిర్మాణముతో, దేవుని సృష్టి నిర్మాణం కార్యక్రమం ముగిసింది. దేవుడు తన సృష్టి యావత్తును గురించి మాట్లాడినప్పుడు అది మంచిదని చెప్పెను. (ఆది. 1:4,10,12,19,21,25,31). అయినప్పటికీ ఆయన ఒక లోటును కనుగొనెను అదేమనగా, "మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను. (ఆది. 2:18).

సాటియైన సహాయం అనగా జీవిత భాగస్వామి అని అర్ధం.

సృష్టి యావత్తులో నరునికి సాటియైన సహాయం లేదని/అతను ఒంటరిగా ఉండుట మంచిది కాదని యెరిగిన దేవుడు సాటియైన సహాయమును పురుషునికొరకు చేయుదుననుకొనెను. ఐతే  వివాహ ఆలోచన బయటకు రాలేదు.

➾ "అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు." (ఆది. 2:20-24) 

దేవుడే ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి( మొట్టమొదటగా ఏదెను తోటలో జరిగిన ఆపరేషన్) ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చెను. కానీ ఆమె యొద్దకు అతన్ని తీసుకుపోలేదు.

స్త్రీయే  పురుషుని కొరకని  గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. (1 కొరింథి. 11:8-9. cf.)

పురుషుని కొరకై స్త్రీ నిర్మింపబడినదని స్త్రీ కొరకు పురుషుడు కాదని పరిశుద్ధ గ్రంథము ఖండితముగా చెప్పుతుందని విశ్వాసముతో రూఢిగా నమ్మవలసిన అవసరత ఉన్నది . 

వివాహపు  వ్యవస్థాపకుడు పరిశుద్ధ పరమదేవుడే గాని మనిషి కాదు. 

కేవలం దేవుడే పెద్దగా లేదా మధ్యవర్తిగా ఆదాము మరియు అవ్వ ను నిబంధన మేర జత పరుచుటం చూడగలం.


(గమనిక) : ఆదాము/అవ్వకు జననం, బాల్యం, యవ్వనం దశలు యొక్క అనుభవం లేదు.

 ఆదాము కి తల్లి, తండ్రి కలవాడు కాదు. కానీ మాటలు తో వివాహం వ్యవస్థ తల్లితండ్రులు గల తాత్కాలిక లోకములో శాశ్వతంగా ఉద్దేశించబడినట్టుగా చూడగలం. 

వివాహం ద్వారా పురుషుడు తన తల్లిని/తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనుట చేత వారిద్దరూ ఏక శరీరమైన్నారు. 

 

𝗕). జారత్వం జరగకూడదని : 

"జారత్వం" అనగా అవివాహితులు శృంగార కార్యకలాపాలకు పాల్పడడం. గ్రీక్ భాషలో porneia అని ఇంగ్లీష్ లో Fornication (or) Sexual Immorality. వివాహం కానీ స్త్రీ పురుషులు మధ్య మరియు వివాహమైన పురుషుడు/స్త్రీ - - వివాహం కానీ పురుషుడు/స్త్రీ మధ్య జరిగే శృంగారపు ఆలోచనలు/చూపులు/కోరికలు/నిర్ణయాలు జరుగుటయే జారత్వం. 

జారత్వం దేవుని చిత్తం కాదు. (1 దెస్స. 4:3-5)

జారత్వం మనుషుల హృదయములో నుండి పుట్టును. (మార్కు. 7:21).

జారత్వం జరుగకుండా ఉండాలంటే దైవిక వివాహమే పరిష్కారం.

కేవలం వివాహపు పరిధిలోనే శృంగార కార్యకలాపాలనేవి దేవునికి అంగీకార యోగ్యమైనవి. దాని వెలుపల కనీసం పురుషుడు/స్త్రీ ను స్త్రీను/పురుషుడును మోహపు చూపుతో చూడకూడదని (మత్తయి. 5:27-28 cf.) మరియు వారి పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెనని (హెబ్రే. 13:4 cf). వివాహ వ్యవస్థను దేవుడే ప్రారంభించడము జరిగింది.

వివాహ నిబంధనలో బంధింపబడిన స్త్రీ, పురుషులు మాత్రమే భార్యభర్తలౌతారు. (ఆది. 2:25). కాబట్టి అది జారత్వం అనబడదు.

స్త్రీ/పురుషులు వివాహ బంధముచే బంధింపబడకుండా ఇరుగురు కలసి సహజీవనం చేసిన, వివాహమునకు ముందు శారీరకంగా కలసిన, దైవ నిబంధన ప్రవేశం లేకమునుపే, పరిశుద్ధులు అనగా సంఘము యొక్క యెదుట జత చేయబడకుండానే తమకుతాము  భార్యభర్తలుగా ఊహించుకొని, తల్లితండ్రులు మరియు పెద్దలు ప్రమేయం లేకుండా తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొంటూ తమ కోరికలు తీర్చుకొనుట జారత్వమే  అగునుకదా! ఇలా చేయువారు దేవుని దృష్టికి పాపం చేయువారు కానీ పరిశుద్ధులు కాలేరు సుమా. 

నా ప్రియ యవ్వనస్తుడా ఇంత నిష్ఠగా బ్రతకగలరా? అని సందేహం నీకు ఉండునేమో గాని సుందరుడు, రూపవంతుడును మరియు యవ్వనస్తుడైన యోసేపు నీకు కలిగే ఆలోచనలకు గొప్ప ఉదాహరణ. (యోసేపు అంశము కొరకు క్లిక్ చేయు)

➾ "స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను." (1 కోరింథి. 7:1-2).

➾ "జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. (1కోరింథి. 6:18).


𝗖). మానవజాతి విస్తరణ మరియు దైవకుటుంబ నిర్మాణం కొరకు :

➾ "దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను." (ఆది. 1:28). 

➾ "మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు." (అపో.కార్య. 17:26).

యావద్భూమిమీద కాపురముండుటకు, ఫలించి అభివృద్ధి చెందుటకు విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుటకు కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశారు. 

ఇహలోక సంబంధమైన వాటి కొరకు వివాహం కాదు.

 

𝐃). మేలు కలుగుటకు/దైవ చిత్తముగా నడిపింపబడుటకు :

➾ "దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ..." (కీర్తన. 68:6).

➾ "భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు." (సామెతలు. 18:22).

➾ "..... సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము." (సామెతలు. 19:14).

 ➾ "ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడైయుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?" (ప్రసంగి. 4:9-12).

 

III. వివాహము ఎవరికి?

పరిశుద్ధ గ్రంథము భిన్నత్వముగల  ఇద్దరు వ్యక్తులకు  అనగా పురుషుడు  స్త్రీ మాత్రమే  వివాహమనే బంధము చేత జతపరచబడాలని తెలియజేస్తుంది. 

⟿ పురుషుడు + పురుషుడు = ️ 

⟿ స్త్రీ + స్త్రీ =

⟿ పురుషుడు + స్త్రీ =

        ➦ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు. (ఆదికాండము. 2:24)

➦ ఆయనసృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. (మత్తయి సువార్త. 19: 4-6)

➦ సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. (మార్కు సువార్త 10:6-9)

(ముఖ్య గమనిక :) వివాహమనేది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తోటి పరిశుద్ధులను క్రీస్తునకు మరియు  దేవునికి దగ్గర చేయబడుటకే  గాని నీకు జత చేయబడిన వారి సొంత  ఆలోచనలకు లోబడి సంఘానికి మరియు దేవునికి దూరం అగుటకు మాత్రం వివాహ వ్యవస్థ  ఏర్పాటు చేయబడలేదు .  

కాబట్టి సహోదరి/సహోదరుడా.. పైన తెలుపబడిన మాటలను బట్టి  దేవుడు ఏర్పాటు చేసిన ఇంత గొప్ప వివాహం వ్యవస్థ గూర్చి నీ ఆలోచన ఏమైయున్నదో గ్రహించుకో.

NOTE : నీ గురి నిత్యత్వమే  అయ్యిఉండాలి గాని  వివాహం కాదు.  వివాహం చేసుకోవద్దని మా ఉద్దేశ్యము కాదు గాని నీ వివాహం నిన్ను నిత్యత్వమునకు  దూరము చేయకూడదని మా ప్రేమ పూర్వకమైన హెచ్చరిక. (1 కొరింథి. 7:1 cf) నీవు వివాహం చేసుకొనినను, చేసికొనక పోయినను నిత్యత్వం పొందాలనేది దేవుని చిత్తము.

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16