“వివాహము” (పార్ట్ - 03) Wedlock


సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసు నామములో వందనములు. 

            మునుపు వ్రాయబడిన రెండు  అంశములలో వివాహము అనగా ఏమిటి?,  వివాహము ఎందుకు?  వివాహం ఎవరెవరికి? (వివాహము పార్ట్ 01) మరియు వివాహములో ప్రాముఖ్యతలు (వివాహము పార్ట్ 02) అనే విషయాలను గూర్చి గ్రంధానుసారమైన ఆధారాలతో నేర్చుకోగలిగాము. అవి మీ దైవిక జీవితమునకు ఉపయోగపడుతున్నాయని మన ప్రభువునందు విశ్వసిస్తున్నాము. 

ఇప్పుడు (వివాహము పార్ట్ 03) ఈ అంశములో వివాహానికి ముందు జరుగుతున్న లేదా జరుపబడుతున్న లోపాలను గూర్చి మరియు వాటి యొక్క పరిణామాలు గూర్చి క్లుప్తముగా పరిశుద్ధ గ్రంథ ఆధారాలతో నేర్చుకుందాము. 

వివాహానికి మునుపు జరుగుచున్న క్రియలు లేక లోపాలు :

1) మనస్సుకు నచ్చిన వారిని చేసుకోవడం 
2) అన్యులను(అవిశ్వాసులను) చేసుకోవడం 
3) ప్రేమించి/ఇష్టపడి చేసుకోవడం 
4) అందం, ఆస్తి, కులం, ధనము చూసి చేసుకోవడం 
5) వివాహానికి ముందు భార్యభర్తలుగా వ్యవహరించడం 

1). మనస్సుకు నచ్చిన వారిని చేసుకోవడం :


ప్రస్తుతమున్న ఈ కాలములో మనస్సుకు వచ్చిన వారిని చేసుకోవాలనే ఆలోచన చాలామంది యవనస్తులలో చూడగలము. అయితే ఇందులో తప్పేముంది మనసుకు నచ్చితేనే కదా జీవితాంతము కలిసి ఉండగలం అనే వాదన కూడా వినిపిస్తుంది. అలా ఆలోచించే క్రైస్తవుడా నీకు నువ్వే ఒక ప్రశ్న వేసుకో. నీ మనసు ఎటువంటి వారిని కోరుతుంది దైవికమైన వ్యక్తినా?, నిన్ను తనతో పాటు నిత్యత్వంలోకి నడిపే వ్యక్తినా?, లేక నిన్ను తనతో పాటు ఈ లోకానికి బానిస చేసే వ్యక్తినా? 

"దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.౹" (ఆది. కాం. 6:2).

ఇది దైవ చిత్తమా?  కేవలం పైరూపాన్ని  చూచి లేదా మాటలు ద్వారా నీవు ఇష్టపడి చేసుకుంటే అది దైవిక వివాహం కాబడదు. నోవాహు కాలములో యావత్తు భూమి మీదనున్న నరులు ఇదే కార్యక్రమం జరిగించారు. దాని పరిణామం వారి ఊహకు కూడా అందలేదు. 


పరిణామం : 

"దేవుడు సంతాపం నొంది, తన హృదయములో నొచ్చుకొనెను దానికి ఫలితమే మహా జలప్రళయం ద్వారా తన ఉగ్రతను చూపారు". (ఆది. కాం. 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు). 

దేవుని సంబంధులు లోక సంబందులతో వివాహం చేసుకోవడం(mixed marriages), లేదా తమ మనస్సుకు నచ్చిన వారిని చేసుకోవడం జల ప్రళయం (దేవుని ఉగ్రతకు) మూల కారణం.

2) అన్యులను(అవిశ్వాసులను) చేసుకోవడం :


ఈ విషయము గురించి ప్రత్యేకముగా మాట్లాడాల్సిన పనిలేదు ఎందుకనగా నీవు క్రైస్తవుడవైతే నీవు ఎవరిని వివాహమాడాలో ఈపాటికే నీకు తెలిసుండాలి. అలా కాకుండా నీవు అన్యులతో వివాహానికి సిద్ధపడితే అది దేవునికి విరోధమైన పనియే. నేను అన్యుడిని/అన్యురాలిని చేసుకుని అ వ్యక్తిని మార్చుకుంటాను నాకు అట్టి విశ్వాసం ఉందని నీకు నీవు సర్దిచెప్పుకోకు. నీవు నిజముగా విశ్వాసుడివి అయితే అసలు అన్యుల జోలికే పోవు. 

పొలమును దున్నడానికి రెండు ఎద్దులను జంటగా కలిపి కాడిని కడతారు ఆ రెండు సమానముగా ఉండుటచేత చక్కగా భూమి అంతటిని దున్నుతాయి. అలా కాకుండా ఒక కుక్కకి ఒక ఎద్దుకి కాడిని కడితే ఆ కాడి నిలబడగలదా.. ఒక విశ్వాసి అన్యుడు/అవిశ్వాసిని చేసుకుంటే ఆ జీవితం కూడా అలాగే ఉంటుంది.

"కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.౹" (ఎపేసి. 4:17). 

"మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?౹ క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?౹" (2 కోరింధి. 6:14-15)

"సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను". (మొదటి రాజులు  3:1). 

"ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.౹" (1 రాజులు 9:16)

"మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉపపత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు". (మొదటి రాజులు 11:1-6)


పరిణామం :

"నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా-నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను". (మొదటి రాజులు 11:10,11)

3) ప్రేమించి/ఇష్టపడి చేసుకోవడం :

ఈ విషయమును గూర్చి ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. ప్రస్తుతము నూటికి ఎనభైశాతం  మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొంతమంది తమ ప్రేమను పెద్దలకు తెలిపి ఒప్పించి చేసుకుంటున్నారు. సరే ఒక ప్రశ్న ప్రేమించి, పెద్దలను ఒప్పించి ఎంతో శ్రమపడి వివాహాము చేసుకుంటున్న క్రైస్తవుడా చివరి వరకు ఆ ప్రేమను దైవికంగా కొనసాగిస్తున్నావా? కొనసాగించే అవకాశాము నీ జీవిత భాగస్వామి ఇస్తున్నారా? 

"సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చితిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తలిదండ్రులతో అనగా వారునీ స్వజనుల కుమార్తెల లోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదను కొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోనుఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను". (న్యాయాధిపతులు 14:1 - 3)


 పరిణామం :

"సంసోను జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఇక్కడ వ్రాయడం కష్టతరము కనుక ఆ వచనములను తెలుపుతున్నాము చదవగలరు". (న్యాయాధిపతులు 14, 15, 16 అధ్యాయములు) 

4) అందం, ఆస్తి, కులం, ధనము చూసి చేసుకోవడం : 

ఒక క్రైస్తవుడు ఇటువంటి వాటికొరకు ఆశపడి వివాహము చేసుకోవడం ఎంతవరకు సమంజసము నీవే ఆలోచించు. అయినా కూడా నాకు ఇవే ముఖ్యము అనే ధోరణిలో నీవుంటే వాటియొక్క పరిణామాలు ఎలా ఉంటాయో ఉదాహరణలతో వివరించాల్సిన అవసరత లేదు. 

"గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును".  (సామెతలు 31:10,30)

"సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము". (సామెతలు 19:14)

"ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము." (లూకా 18:24)

"మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములుగలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.౹ ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.౹ ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి." (1 తిమోతి. 6:7-10)

"కాబట్టిమునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు౹ ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.౹ అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.౹ ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.౹ ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,౹ తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.౹"  (ఎపేసి. 2:11-16). 

5) వివాహానికి ముందు భార్యభర్తలుగా వ్యవహరించడం  : 

తండ్రియైన దేవునియెదుట, ప్రభువైన క్రీస్తు ఎదుట, పరిశుద్ధుల ఎదుట, సమాజము ఎదుట నిబంధన చేసుకోకుండానే మేము జతపరచబడ్డాము అనే తప్పుడు భావనలోనే నేడు అనేకమంది ఉన్నారు. ఆ ఆలోచనతోనే వివాహానికి ముందు తప్పుడు కార్యకలాపాలు చేస్తున్నారు. ఇలాంటివి క్రైస్తవుడికి తగదు. 

వివాహము కాకుండా ఒకరికొకరు ముట్టుట జారత్వము అవుతుంది.
 
"అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్యయుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్తయుండవలెను". (మొదటి కొరింథీయులకు  7:2)

వివాహము కాకుండా మోహపు చూపుతో చూస్తే వ్యభిచారమవుతుంది. 

"ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును". (మత్తయి సువార్త 5:28)

జారత్వము, వ్యభిచారాము చాలా చిన్న విషయాలే కదా అని అనుకోవద్దు అవి నిన్ను నీ దేవునికి దూరం చేస్తాయి. కాబట్టి ఆలోచన చేసి నీ జీవితాన్ని సరి చేసుకోవాలని మా మనవి.

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16