![]() |
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
📖 లేఖనం :
(1తిమోతి 2:1-3): "మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును౹ రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.౹ ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది.౹"
🔎 వివరణ :
క్రైస్తవ విశ్వాసి తాను బ్రతుకు దినాల్లో "నెమ్మదిగాను సుఖముగాను" ఉండగోరిన వాడైతే తాను చేయవలసిన సంగతిని 1 తిమోతి 2:1-3 వచనాలు స్పష్టముగా తెలియజేశాయి. అదేమనగా "నెమ్మదిగా, సుఖముగా బ్రతుక నిమిత్తము..."
1. సంపూర్ణ భక్తి & మాన్యత కలిగి
2. మనుష్యులందరి కొరకు
3. రాజుల కొరకు
4. అధికారులు కొరకు
5. విజ్ఞాపనలు
6. ప్రార్థనలు
7. యాచనలు
8. కృతజ్ఞతాస్తుతులు
ఇది క్రైస్తవ విశ్వాసికి హెచ్చరికతో కూడిన నియమం. ఇలా చేయుట దేవుని దృష్టికి అనుకూలమైనదని గ్రంథం తెలియజేస్తుంది.
📖 సంపూర్ణ భక్తి & మాన్యత కలిగి :
🍂సంపూర్ణ భక్తి అనేది గ్రీకు భాషలో "యూసేబియా" అంటారు. దాని అర్థం దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి, ఆయన్ను మాత్రమే ఆరాధించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడమే.
ఇది దేవుని యెడల భయం, ప్రేమ, మరియు విధేయతతో కూడిన జీవితాన్ని గడపడం, నిరంతరం ప్రార్థిస్తూ, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం, పేదలకు లేదా తన తోటి విశ్వాసులలో అవసరమైన వారికి సహాయం చేయడం, దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయడం, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని యెరిగి అనుసరించడం, ఆయన చూపిన ప్రేమ, కనికరము, క్షమాపణ మొదలైన వాటిని అనుకరించడం ద్వారా దేవుని యెడల సంపూర్ణ భక్తిని వ్యక్తపరచగలం. యధార్థమైన భక్తి కలిగి ఉండాలని బైబిల్ బోధిస్తుంది.
🍃"మాన్యత" అనేది గ్రీకు లో సెమ్నోటెస్ అంటారు. దాని అర్థం మన శరీరాన్ని, మన మనస్సును, మన ఆత్మను జాగ్రత్తగా చూసుకోవడం, మంచి పనులు చేయడమే. దైవ దృష్టికి నీచమైన చర్యలు శరీరమునకు అంటకుండా గౌరవనీయతగా, నిజాయితీగా జీవించుటయే మాన్యత. అట్టి జీవితాన్ని కలిగి ఉండాలని బైబిల్ బోధిస్తుంది.
(A) మనుష్యులందరి కొరకు..
క్రైస్తవులు కేవలం తమకు లేదా తమ సమూహానికి చెందిన వారి కొరకు మాత్రమే ప్రార్థన చేయుట కాదు కానీ సమాజంలో మనుష్యులందరి కొరకు.., అనగా యావత్తు భూమ్మీద ప్రజా జనం కోసం మతం, జాతి, కుల లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రార్థన చేయాలనే నియమం క్రైస్తవ విశ్వాసికి ఇవ్వబడింది.
(B) రాజుల కొరకు..
రాజులు గ్రీకు లో "బాసిలియస్" అని అర్థం. భూ రాజులకు(మత్తయి 17:25) అనగా పరిపాలన చేయువారి కోసం, ప్రపంచ నాయకులు, దేశ నాయకులు కొరకు ప్రార్థనలు చేయాలనే నియమం మనకు ఇవ్వబడింది . దీని వెనుక ఉన్న కారణం ప్రశాంతంగా మంచి పాలనలో జీవించుటకు.
(C) అధికారులందరి కొరకు..
అధికారులు అంటే గ్రీకు లో "హైపెరాక్స్" అని అర్థం. గ్రీకు అనువాదం బట్టి ఉన్నత స్థానములోనున్న వారందరు అని. ఇది స్థానిక అధికారాలు లేదా అత్యున్నతమైన వారు అని అర్థం రావచ్చు. (అపో.కార్య. 19:31,35,38 చూడుము). ఈ పదజాలము మన రాష్ట్ర, ప్రాంతీయ, స్థానిక, సహా ఉద్యోగులకు వర్తిస్తుంది. వీరి కొరకు కూడా ప్రార్థనలు చేయాలనే నియమం మనకు ఇవ్వబడింది.
1. విజ్ఞాపనలు
2. ప్రార్థనలు
3. యాచనలు
4. కృతజ్ఞతాస్తుతులు చేయాలని గ్రంథం హెచ్చరించింది. (1తిమోతి2:1-3)
🔘 విజ్ఞాపన:
విజ్ఞాపన అనగా “ఇతరులపట్ల అనగా నీ పొరుగువాడిని మరియు నీ సహోదరులు గూర్చియు దేవునికి చేయు మనవిని విజ్ఞాపన అందురు. (1 తిమోతి. 2:2; హెబ్రీ. 7:25; ఫిలేమోను. 1:4; 1 దేస్స. 1:2. cf..). క్రైస్తవులు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలని బైబిల్ సెలవిచ్చింది.
📌ఇశ్రాయేలీయుల దేశములో తెగులు సంభవిస్తే దావీదు దేవునికి బలిపీఠము కట్టి ప్రజల కొరకు విజ్ఞాపన చేసినట్లుగా చూడగలము. (2సమూ. 24:25)
📌 తమ జాతివారు బహుగా శ్రమను అనుభవిస్తున్నారని, తన దేశము యొక్క ప్రాకారాలు కాల్చివేయబడ్డాయని ఆకాశమందలి దేవునికి నెహెమ్యా విజ్ఞాపన చేసినట్లుగా గ్రంధములో దాఖలు చేయబడింది. (నెహెమ్యా 1:2-4)
📌 పౌలు సంఘములు కొరకు విజ్ఞాపన చేశాడు. (1థెస్స1:2; ఫిలేమోను1:5)
📌ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు (హెబ్రీ7:25 ; రోమా 8:34)
📌 పరిశుద్ధాత్ముడు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. (రోమా. 8:26-27)
🔘 ప్రార్థనలు :
ప్రార్థన అనగా శోధనలో అస్థిరత (లూకా. 22:40; మత్తయి. 6:13)., శ్రమలో నిరాశ (కీర్తన. 16:4; 40:17). మొదలగు మానవుని దౌర్భల్యములయందు మాత్రమేగాక సంతోష సమృద్దులయందును (పిలిప్పీ. 1:3) మన హృదయాలోచనలు దేవునికి తెలుపుకొనుటకు ఒక ప్రత్యేకమైన విధానమును ఆయన ఏర్పరచెను. ఇట్ల దేవునితో మానవుడు తన విన్నపములను తెలియజేసికొను విధానమునే "ప్రార్థన" అందురు.
📌 ప్రార్థన మన దినచర్యలో ఒక భాగమై ఉంది. భక్తి కలిగిన వాడు మాత్రమే మోకరించి ప్రార్ధన చేస్తాడు.
📌దానియేలు యెరూషలేము వైపు తన గది కిటికీలు తెరిచి రోజుకు ముమ్మారు ప్రార్ధించేవాడు. (దానియేలు 6:10)
📌 దావీదు రోజుకు ముమ్మారు- ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్ధించేవాడు. (కీర్తనలు 55:17).
📌 యేసుక్రీస్తు వారు ఉదయం పెందలకడనే ప్రార్ధించేవారు. (మార్కు1:35)
🔘 యాచన :
యాచన అనగా శోధన, శ్రమ, అపాయము మొదలగు విపత్కర పరిస్థితులలో నున్నప్పుడు తాను సహాయము కొరకే దేవునికి విన్నవించుకొను మనవిని “యాచన” అందరు. (1 తిమోతి. 2:2; హెబ్రీ. 5:7 cf..).
📌 తన కొరకు చేసుకొనేది యాచన. దీనిని వాడుక భాషలో చెప్పాలంటే అడుక్కోవడం.
📌 భూ నివాస కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దేవునికి యాచనలు అర్పించినట్లుగా చూడగలము. (హెబ్రీ. 5:7).
🔘 కృతజ్ఞతాస్తుతులు :
కృతఙ్ఞతాస్తుతులు అనగా మన జీవితములో దేవుని కృపాకార్యములను గుర్తించి, సమస్తమైన దీవెనలు ఆయన వలననే పొందితిమని హృదయపూర్వక స్తుతులను ఆయనకు చెల్లించుటనే “కృతఙ్ఞతాస్తుతులు” అందురు. (1 దేస్స. 5:16; 2 దేస్స. 2:3; 1 తిమోతి. 2:2 cf..)
📌మనల్ని కలుగజేసిన విధానాన్ని బట్టి అనుదినం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి (కీర్తనలు 139:14)
📌 ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి (1థెస్స 5:18)
📌 మనకు దేవుడు అనుగ్రహించే అనుదినం ఆహారం, ఆయుస్సు, ఊపిరి, జీవం, సమస్తమును ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
📌ప్రభువుబల్ల నిమిత్తము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు వారు మనకొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు అనే విషయాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. (1కొరింథీ 11: 23-27).
📖 చివరిగా... "నెమ్మదిగా, సుఖముగా బ్రతుకుట" అంటే ఈ ఆత్మీయ జీవిత యాత్రలో అస్థిరమైన ధన, బల, జ్ఞానము పైన ఆధారపడక మనకు వచ్చే ప్రతి శ్రమల్లో దేవుడు తన కృపను, మనకు కావలసిన వాటిని సమకూరుస్తాడని, ఆయన మార్గంలో నడిచినప్పుడు మన ఆత్మీయ జీవితం మెరుగుపడతాయని విశ్వసించడం. నిత్యత్వం వైపు ఏ మాత్రం తీసుకుపోని వాటి మీద దృష్టి నిలపక పైనున్న వాటి మీద దృష్టి నిలపడం, ఆయన మార్గదర్శకత్వం కోరినప్పుడు, ఆయన మాటలను అనుసరించినప్పుడు, ఇతరులకు మేలు చేయుట వలనే కదా!!
📝 సారాంశం
ఓ చదువరి... పరిశుద్ధ గ్రంథం హెచ్చరించిన ప్రకారంగా మనం సుఖముగా, నెమ్మదిగా బ్రతుకునుద్దేశించి కోరితే... మొదటగా పరిపూర్ణ దైవ భక్తి & మాన్యత కలిగి.., అటు పిమ్మట మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారానే సాధ్యమని గుర్తించుకుందాం. ఇది మంచిది మరియు దేవునిదృష్టికి గొప్పది. వీటిని దైవ నియమం ప్రకారముగా నడుచుకునే క్రైస్తవ విశ్వాసి మాత్రమే కలిగి అనుసరించగలడని యెరిగి మనం మహోన్నతుని దృష్టికి అలా ఉండుటకు, వాక్యపు వెలుగులో జీవితాలు దిద్దుబాటు చేసుకొని, ఆయన కృపకు మనం అర్హులు కావాలని కోరుతున్నాము.
మీ ఆత్మీయులు 👪
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com