యోసేపు |
పరిశుద్ధ గ్రంథమునందు గల పాత నిబంధనలో తెలియజేయబడిన యాకోబు కుమారుడైన
యోసేపు గూర్చి క్రైస్తవులమైన మనకందరికీ తెలుసు అయితే ఆయన జీవితము నుండి మనము
నేర్చుకోవలసిన విషయములు, ఆయన దేవుని చిత్తములో నడిచిన విధానము ఇంకా అనేక విషయములు
ఈ అంశము ద్వారా మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
అబ్రహాము మనుమడును, ఇస్సాకు రెండవ కుమారుడును అయిన యాకోబు రెండవ భార్యయైన రాహేలునకు పుట్టిన మొదటి
సంతానము యోసేపు. యాకోబుకు కలిగిన కుమారుల వరుసలో చూస్తే యోసేపు స్థానము పదకొండు.
కుటుంబము :
● యోసేపు చిన్నతనములోనే తన తల్లియైన రాహేలు మరణము నొందుటచేత అతడు తన
తండ్రి భార్యలైన బిల్హా మరియు జిల్ఫా కుమారులతో పెరిగెను.
» అతడు చిన్నవాడై తన తండ్రి
భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. – (ఆది. 37:2).
● యోసేపుకు
పదకొండుమంది సహోదరులు, ఒక సహోదరీ.
» యోసేపు తర్వాత
రాహేలునకు పుట్టిన కుమారుడు బెన్యామీను, తన తండ్రి భార్యలైన లేయా, బిల్హా, జిల్ఫా అను వారికి పుట్టిన కుమారులు పదిమంది (10), కుమార్తె దీనా. – (ఆది. 35:23-27,
30:21).
● యోసేపు భార్య పేరు
ఆసెనతు, వీరికి ఇద్దరు కుమారులు, మనష్షే మరియు ఎఫ్రాయిము.
» ఫరో యోసేపునకు జప్నత్ప
నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు
నిచ్చి పెండ్లి చేసెను. – (ఆది. 41:45).
» అప్పుడు యోసేపు
దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి
తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ
కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. – (ఆది.
41:51-52).
ప్రేమ – ద్వేషం :
యోసేపు చిన్నతనము
నుండి తన జీవితములో ప్రేమను చూసాడు అలాగే ద్వేషమును చూసాడు.
● యోసేపు తన తండ్రయైన
యాకోబు ఇష్టపడి వివాహము చేసికొన్న రాహేలునకు పుట్టిన కుమారుడు మరియు యాకోబు
వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక యాకోబు మిగతా కుమారులందరికంటే ఎక్కువగా
యోసేపును ప్రేమించెను.
» యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు
పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన
నిలువు టంగీ కుట్టించెను. – (ఆది. 37:3).
● తమ తండ్రి తమ
తమ్ముడిని ఎక్కువగా ప్రేమించుట చేత సొంత అన్నలే యోసేపును ద్వేషించి పగను
పెంచుకున్నట్టుగా గ్రంథములో చూడగలము.
» అతని సహోదరులు తమ తండ్రి
అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి. – (ఆది. 37:4).
శోధన :
● యోసేపు సొంత
అన్నయ్యలే యోసేపు మీద పగపట్టి తమ తండ్రికి తెలియకుండా వర్తకులకు అమ్మివేసిరి.
» మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ
ఇష్మాయేలీ యులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. – (ఆది. 37:28).
● తన యజమానుడైన
పోతీఫరు భార్య విషయములో శోధింపబడ్డాడు.
» అటుతరువాత అతని యజమానుని
భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. – (ఆది. 39:7).
» దిన దినము ఆమె యోసేపుతో
మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు. – (ఆది. 39:10).
● యోసేపు చేయని తప్పుకు రెండు సంవత్సరములకు పైగా చెరసాలలో గడిపెను.
» అతనిని పట్టుకొని రాజు
ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెర సాలలో ఉండెను. – (ఆది. 39:20).
తగ్గింపు :
● తన సొంత సహోదరులు
తనని ద్వేషించినప్పుడు కానీ, తనని అమ్మివేసినప్పుడు కానీ ఎక్కడా ఒక్క మాటైన ఎదురు
చెప్పలేదు ఎందుకిలా చేస్తున్నారని కూడా అడగలేదంటే తను ఎంత తగ్గించుకుని జీవించాడో
మనకు తెలుస్తుంది.
(ఆదికాండము 37వ
అధ్యాయము చదువగలరు).
● మరొక గొప్ప సంగతి
ఏమిటంటే తన యజమానుని భార్య తనతో శయనించలేదని, అతనిపై తప్పుడు ఆరోపణ చేసినప్పుడు
కూడా తాను తప్పు చేయలేదని ఒక్కమాటైన ఎదురు చెప్పలేదు, మౌనముగా చెరసాలకు వెళ్ళాడు,
ఈ విషయములోనే తెలుస్తుంది తన జీవితములో ఎంతగా తగ్గించుకున్నాడో.
(ఆదికాండము 39వ
అధ్యాయము చదువగలరు).
● తనపై కుట్రపన్ని
తనని అమ్మివేసిన సహోదరులు కరువుకాలములో తన దగ్గరకు వచ్చినప్పుడు “నన్ను ఎందుకు
అమ్మివేసారు” అని అడగలేదు, తనని చంపుటకు చూసిన వారిపై కొంచెము కూడా కోపము
తెచ్చుకోలేదు, అప్పటికి ఐగుప్తు దేశములో తనకున్న అధికారమును బట్టి అతిశయించలేదు. చాలా గొప్పగా తగ్గించుకుని తనవారితో అతడన్న
మాటలు చూస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది.
★ అయినను నేనిక్కడికి వచ్చు
నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప
నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. – (ఆది. 45:5).
దేవుని సంకల్పము :
యోసేపు తన
సహోదరులచేత శోధింపబడ్డాడు ఒకానొక సమయములో తనని ఎక్కువగా ప్రేమించే తన తండ్రి కూడా
యోసేపు చెప్పిన కల విని కోపము తెచ్చుకున్నట్టుగా చూడగలము కానీ దేవుడు మాత్రము
అబ్రహామునకు చేసిన వాగ్ధానమును నెరవేర్చుటకు యోసేపును ఎన్నుకున్నాడని చాలా
స్పష్టముగా తెలుస్తుంది.
● ఐగుప్తు దేశములో
యోసేపు యొక్క స్థితిని మరియు తన కుటుంబమంతా యోసేపు దగ్గరికి వచ్చి అతనికి
సాగిలపడతారని దేవుడు ముందుగానే తన సంకల్పమును కల ద్వారా యోసేపునకు తెలియజేసెను.
» అతడు వారినిచూచినేను
కనిన యీ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచినిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను. – (ఆది. 37:6-7).
» అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో
నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును
నాకు సాష్టాంగ పడెనని చెప్పెను. తన తండ్రితోను తన సహోదరుల తోను అది
తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అత నితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి
నీకు సాష్టాంగపడుడుమా అని అతని గద్దించెను. – (ఆది. 37:9-10).
● ఐగుప్తు రాజైన ఫరో
కనిన కలకు అర్థము, దేవుడు యోసేపు ద్వారా బయలు పరచి, ఐగుప్తు దేశములో యోసేపునకు
అధికారమిచ్చి ఇశ్రాయేలు ప్రజలను కరువునుండి తప్పించెను.
(ఆదికాండము 41వ అధ్యాయము
చదువగలరు).
విజయము :
యోసేపునకు ఎన్ని
శోధనలు కలిగినప్పటికీ, ఎంత ద్వేషించబడినప్పటికీ, తన జీవితమునకు సంబంధించిన అన్ని
విషయములలోనూ విజయము పొందాడు.
● తన సహోదరుల చేత
అమ్మివేయబడినప్పటికీ తన స్థితి దిగజారలేదు. తనను కొనుక్కున్న యజమానుని ఇంటికి
విచారణకర్తగా నియమింపబడ్డాడు.
» యోసేపుమీద అతనికి కటాక్షము
కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద
విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను. – (ఆది. 39:4).
● తన యజమానుని భార్య
తప్పుడు ఆరోపణ వలన చెరసాలలో పెట్టబడినప్పటికీ ఆద్భుతంగా విడిపింపబడి ఐగుప్తు
దేశమంతటి మీద అధికారిగా నియమింపబడ్డాడు.
» నీవు నా యింటికి అధికారివై
యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే
నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరోచూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు
వేసి తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడువంద నము చేయుడని
అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను. – (ఆది. 41:40-43).
● ఏ సహోదరులైతే తనను
ద్వేషించి అమ్మివేసారో, వారే తన ముంగిట వంగి సాగిలపడేంత స్థాయికి చేరుకోగలిగాడు.
» యోసేపు ఇంటికి వచ్చినప్పుడు
వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి. – (ఆది. 43:26).
ప్రియ సహోదరుడా,
సహోదరీ యోసేపు తన జీవితములో ఏ విధముగా ప్రేమించబడ్డాడు, ఏ విధముగా
ద్వేషించబడ్డాడు, ఏ విధముగా శోధించబడ్డాడు తెలుసుకున్నాము చివరికి ఏ విధముగా
విజయమును పొందుకున్నాడో కూడా పైన వ్రాయబడిన వచనముల ద్వారా తెలుసుకున్నాము కానీ
ఇక్కడ అతి ముఖ్యమైన సంగతిని గూర్చి నేటి క్రైస్తవులమైన మనము ఆలోచించాల్సిన అవసరము
చాలా ఉన్నది.
అదేమనగా ఇంతగా శ్రమలు పొంది, అనేకమార్లు అపవాదిచేత బాధింపబడిన యోసేపు
అంత గొప్పగా ఆశీర్వదింపబడుటకు గల కారణము, అతను నమ్మిన సిద్ధాంతము ఏంటో తెలుసా?
1) చిన్నప్పటి నుండి దేవుని
యెడల భయభక్తులు కలిగి యున్నాడు తప్పుని ఖండించినవాడిగా ఉన్నాడు.
★ యోసేపు వారి
(సహోదరుల) చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండువాడు. – (ఆది. 37:2).
2) యోసేపు దేవుని యెదుట
తనను తాను కనపరచుకున్న విధానమును బట్టి, దేవుని యెడల చూపిన భక్తిని బట్టి దేవుడు
ప్రతి విషయములోను యోసేపునకు తోడుగా ఉండెను.
★ యెహోవా యోసేపునకు తోడైయుండెను
గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతని
చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. – (ఆది. 39:2-3).
★ యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదిం చెను. – (ఆది. 39:5).
★ ఆ గోత్రకర్తలు మత్సరపడి
యోసేపును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేసిరిగాని దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి
తప్పించి,..... – (అపొ.కార్య. 7:9-14).
3) యోసేపు యౌవనములో ఉన్నప్పుడు పోతీఫరు భార్య శయనించమనగా దేవునికి విరోధముగా
పాపము చేయను అన్నాడంటే అతడు దేవుని ఎంతగా ప్రేమించాడో మనకు తెలుస్తుంది.
★ నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. – (ఆది. 39:9).
4) యోసేపు చేయని తప్పుకు
చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుని దూషించలేదు, దేవుని విడిచిపెట్టలేదు.
★ యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను. – (ఆది. 39:21).
5) ఐగుప్తు దేశములో
చాలా అత్యున్నత స్థానములో ఉన్నప్పటికీ తన సహోదరుల దగ్గర మరియు దేవుని దగ్గర
తగ్గించుకుని తన ప్రవర్తనను కనపరచుకున్నాడు.
★ మిమ్మును ఆశ్చర్యముగ
రక్షించి దేశ ములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు
ముందుగా నన్ను పంపిం చెను. – (ఆది. 45:6-7).
6) యోసేపు తన విశ్వాసమును
బట్టి ముందుకు కొనసాగాడు తన ప్రజలను రక్షించగలిగాడు.
★ యోసేపు తనకు అవసానకాలము
సమీపించినప్పుడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి
తన శల్యములనుగూర్చి వారికి ఆజ్ఞాపించెను. – (హెబ్రీ.
11:22).
ప్రియులారా, మనము
కూడా మన జీవితములో ఎన్ని శోధనలు వచ్చినా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా
యోసేపు వలె దేవునిని విడిచిపెట్టకుండా, ప్రతీ విషయములోను తగ్గించుకుని ఏది జరిగినా
ఆది దేవుని చిత్తమే అని తలంచి ముందుకు కొనసాగితే మనకు ఓటమి అనేది ఉండదు. ఒక్కటే
మనము నమ్మితీరాలి దేవుడు ఏమి చేసినా మన మేలు కొరకే చేస్తాడు మన విశ్వాసము తెలుసుకొనుటకే
పరీక్షిస్తాడని గ్రహించగలిగితే మన జీవితము కూడా యోసేపు జీవితము వలె అత్యున్నతంగా
ఉంటుందని నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ మీకు మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
నవీన మనోహర్.
1 comments:
commentsదేవుడు మిమ్మును దివించును గాక
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com