"ప్రభురాత్రి భోజనము" |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ప్రియులారా, నేటి సమాజములో అనేకమంది క్రైస్తవులు ప్రభురాత్రి భోజన విషయంలో వివిధ ఆలోచనలు, పద్దతులు కలిగియున్నారు. కొన్ని సంఘాల వారు ప్రభురాత్రి భోజనమును నెలకొకసారి తీసుకోవాలని, మరికొందరు సంవత్సరానికొకసారి తీసుకోవాలని, ఇంకొంతమంది క్రిస్టమస్ పండుగరోజు తీసుకోవాలని, పాప క్షమాపణ కలుగుటకు ప్రభువు బల్లలో చేయి పెట్టాలని సొంత అభిప్రాయాలు కలిగి 1 కొరింధి 11వ అధ్యాయము 23 నుండి 34 వచనములను సరిగ్గా అర్థము చేసుకోలేకపోతున్నారు.
ఈ ప్రభురాత్రి భోజనము అంశము ద్వారా పైన చెప్పబడిన విషయములను మరియు కొన్ని అతి ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి పరిశుద్ధ గ్రంధమును పరిశీలన చేసి అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము.
★ "ప్రభురాత్రి భోజనము" అనగా రాజ్య సంబంధమైన భోజనము. రాజ వంశీకులకు మాత్రమే అనుగ్రహింపబడినది ఇంకా చెప్పుకోవాలంటే రాజు యొక్క సముఖములో ఆయనతో కలిసి పాలు పంచుకొనుటకు అర్హత కలిగిన భోజనము లేదా రాజుతో మరియు సంఘముతో సహవాసము కలిగిన భోజనము.
ఉదాహరణకు :-
1) ఏ మాత్రము అర్హత లేని మెఫీబోషేతుకు రాజైన దావీదు సముఖములో భోజనము చేయుటకు కలిగిన అవకాశము.
» అందుకు దావీదునీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా. అతడు నమస్క రించిచచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను. – (2 సమూయేలు. 9:7-8).
2) షేబదేశపు రాణి రాజైన సొలోమోను భోజన బల్లను చూసి ఆశర్యపడుట.
» షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై. – (1 రాజులు. 10:4-5).
ఇటువంటి గొప్ప రాజ విందులో పాలు పొందుటకు ఎటువంటి అర్హత లేని మనకు తండ్రియైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సహవాసమును ఏర్పాటు చేసి (1 కొరింధి. 1:9), తన కుమారుని రాజ్యములో వారసులునుగా చేసి (1 పేతురు. 2:9), ఆ రాజు యొక్క విందులో అనగా ప్రభురాత్రి భోజనములో చేయి పెట్టుటకు అవకాశమును దయచేసెను (1 కొరింధి. 11:23-32). కాని ప్రియ సహోదరుడా, పైన పేర్కొనబడిన రాజ విందులో పాలు పంచుకొనుట నామమాత్రమే గానీ క్రీస్తువారి ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ రాజ విందు శాశ్వతమైనది, నిత్యమూ క్రమము తప్పకుండా కొనసాగించేదని క్రైస్తవులమైన మనము మొదట గ్రహించాలి.
NOTE:- మన ప్రభువైన యేసుక్రీస్తువారు తాను అప్పగింపబడిన రాత్రి తన శిష్యులతో కలిసి రెండు రకాల భోజనాలలో పాలు పొందుట మనము చూడగలము.
● ఒకటి పస్కా భోజనము,
● రెండవది ప్రభురాత్రి భోజనము.
● ఒకటి పస్కా భోజనము,
● రెండవది ప్రభురాత్రి భోజనము.
» వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. – (మత్తయి. 26:26-27).
» వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. – (మార్కు. 14:22-23).
ప్రభురాత్రి భోజనము ఎప్పుడు తీసుకోవాలి..?
ఈ ప్రభురాత్రి భోజనమును ఒక్కొక్క సంఘము ఒక్కోరోజు తీసుకుంటుంది. కాని ఆదిమ అపొస్తలులు "ప్రతి ఆదివారము" తీసుకున్నట్లు పరిశుద్ధ గ్రంధములో స్పష్టముగా కనబడుచున్నది..
» "ఆదివారమున" మేము రొట్టె విరుచుటకు కూడినపుడు. - (అపొ.కార్య. 20:7).
ప్రియులారా, ఆదివారము నెలకొకసారి వస్తుందా లేక సంవత్సరానికొకసారి వస్తుందా లేదా వారమునకు ఒకసారి వస్తుందా నేటి క్రైస్తవులు గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చాలామంది ఆదివారము సెలవు దినము కాబట్టే ఆరోజు నిర్ణయింపబడిందనే ఆలోచనలో ఉన్నారు కాని ఆదివారమునకు ఉన్న ప్రాముఖ్యతను దేవుని గ్రంధములో చూడగలిగితే,
» యేసు పునరుత్థానుడై తిరిగి లేపబడిన దినము "ఆదివారము". – (మత్తయి. 28:1; మార్కు. 16:2; లూకా. 24:1; యోహాను. 20:1).
» క్రీస్తు సంఘము ప్రారంభమైన దినము "ఆదివారము". – (అపొ.కార్య. 2:38-41).
» క్రీస్తు వారు పరలోకమునకు కొనిపోబడిన పిమ్మట అపొస్తులులు, ఆదిమ సంఘస్థులు ప్రభురాత్రి భోజనము మొదటిగా తీసుకున్న దినము "ఆదివారము". – (అపొ.కార్య. 20:7).
గమనిక : ప్రియులారా క్రింద వ్రాయబడిన వచనమును బట్టి కొందరు క్రైస్తవులు అనుదినము రొట్టె విరవాలని తప్పుగా అర్థము చేసుకుంటున్నారు కాని ఇక్కడ వారు చేసిన భోజనము అత్మానుసారమైనది కాదు శరీరమునకు కావలసిన ఆహారమని గ్రహించాలి.
» ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్థితించుచు. – (అపొ.కార్య. 2:46).
ప్రభురాత్రి భోజనము ఎవరు తీసుకోవాలి..?
సహోదరులారా ప్రభురాత్రి భోజనమును ఎవరు పడితే వారు తీసుకునే కార్యక్రమమని పరిశుద్ధ గ్రంథము తెలియజేయట్లేదు. ఈ ఆర్హత కేవలము క్రీస్తు శరీరములోనికి అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) బాప్తీస్మము పొందిన వారికే మాత్రమే అనుగ్రహింపబడిందని తెలుసుకోవాలి.
» ఆ సంఘము ఆయన శరీరము. – (ఎఫెసీ. 1:23).
» క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? – (రోమా. 6:3).
» క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. – (గలతీ. 3:27).
» ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు. – (1 కొరింధి. 12:13).
ప్రభురాత్రి భోజనముయొక్క ముఖ్య ఉద్దేశ్యము :
అపొస్తులుడైన పౌలు గారు కొరింధి పట్టణములో ఉన్న క్రీస్తు సంఘమును హెచ్చరిస్తూ, వారి లోపాలను వారికి గుర్తుచేస్తూ ప్రభువైన క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో కలిసి పుచ్చుకున్న భోజన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్క స్థానిక క్రీస్తు సంఘము ఇట్టిరీతిగానే ఆ క్రీస్తు సహవాస భోజనములో పాలు పొందాలని కొన్ని విశేష సంగతులను తెలియజేయడమైనది.
A). "జ్ఞాపకము" : (1 కొరింధి. 11:23-25).
» నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి. దానిని విరిచి యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
★ జ్ఞాపకము అనగా స్మృతి, జ్ఞప్తి.
1). సమస్త మానవాళి తమ పాపములు విషయములో పరిహారము పొందాలంటే క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే సాధ్యమని మన తండ్రియైన దేవుడు ముందుగానే ఎరిగి తాను నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయనను నియమించెనని, ఇప్పుడు ఆయన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలమందు మనయెదుట ప్రత్యక్షపరచబడెనని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్ఞాపకము చేసుకోవాలి. – (అపొ.కార్య. 2:23, 1 పేతురు. 1:18-21).
2). మన పాపముల నిమిత్తమై మరణించుటకు రక్తమాంసములలో పాలివాడై, ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అపవాదిని నశింపజేసి, మరణభయము నుండి విడిపించి, సకల ప్రజల పాపములకు పరిహారము కలుగజేసి, సిలువపై ఎంతో శ్రమ పొంది, తనతో సమాన వారసత్వమును కలుగజేసి, మనలను రక్షించిన క్రీస్తు మరణ త్యాగమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్ఞాపకము చేసుకోవాలి. – (హెబ్రీ. 2:14-17).
3). యేసు తాను చేయని తప్పుకి మనకొరకు ఎన్నో శ్రమలనుభవించి, కొరడాలతో కొట్టబడి, ఎన్నో గాయములనొంది, తనను చెంపమీద కొట్టినా, తనను హేళన చేసినా, చివరికి తనపై ఉమ్మివేసినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనముగా తండ్రి చిత్తము చొప్పున సిలువ భారమును భరించాడంటే అది కేవలము నీ కోసము నాకోసమే అని గ్రహించి ఆయనను జ్ఞాపకము చేసుకోడానికే ప్రభురాత్రి భోజనమని తెలుసుకోవాలి. – (యెషయా. 50:6; 53:3-10, మత్తయి. 26:27; 27:26-31, మార్కు. 14:65, యోహాను. 18:22; 19:1, 1 పేతురు. 3:21-24).
4). మనలను ఎలాగైతే అపవాది లోబరుచుకున్నాడో అలాగే, యేసు ఈ లోకములో శరీరధారిగా నివసించినప్పుడు అపవాది చేత ఎన్నో రకాలుగా శోధించిబడినప్పటికీ తాను ఎంతమాత్రము లోబడక అపవాదిని దైర్యముగా ఎదుర్కొని ఈ లోకములో ఉన్నంత కాలము మనకొరకు అపవాదితో మహాయుద్ధము చేసి మనకు జయమును కలుగజేసాడన్న విశేష సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి. – (లూకా. 11:21, యోహాను. 1:14; 13:1-17, హెబ్రీ. 2:15).
5). దేవుని స్వరూపము కలిగినవాడైనప్పటికీ, ఆయనతో సమానముగా ఉండే గొప్ప బాగ్యమును విడనాడి, దేవదూతలకంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడి, మనుష్య పోలికగా పుట్టి, దాసుని రూపము ధరించుకుని, తనను తాను ఎంతమాత్రము హెచ్చించుకొనక శిష్యుల పాదములను సైతము కడిగి, అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడుదల చేయుటకు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తనను తాను ఎంతగానో తగ్గించుకుని, మనలను బ్రతికించిన ఆ యేసుని హృదయపూర్వకముగా జ్ఞాపకము చేసుకోవాలి. – (ఫిలిప్పి. 2:5-8, ఎఫెసీ. 2:1, హెబ్రీ. 2:9).
6). మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుటకు అనగా ఇహలోక మాలిన్యమును ఎంతమాత్రమును మనకంటకుండా ఆయనను పోలి నడుచుకోవాలని మనకు మాదిరి చూపించిన ఆ యేసుని జ్ఞాపకము చేసుకోవాలి. – (1 పేతురు. 2:21-24, యాకోబు. 1:27).
NOTE: ఇటువంటి ఎన్నో విశేష సంగతులన్నిటిని జ్ఞాపకము చేసుకొని ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందాలి.
B). "యేసు మరణ ప్రచురము" : (1 కొరింధి. 11:26).
» మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
★ ప్రచురము అనగా ప్రకటించుట.
ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తీస్మము పొంది, ఆ ప్రభువు యొక్క బల్లలో పాలుపంచుకునే నీవు మనకు అప్పగింపబడిన సువార్త పనిలో కొనసాగుతున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి.
సిలువను గూర్చిన వార్త మనకు దేవుని శక్తియై ఉన్నదని, నశించువారు రక్షింపబడుటకు క్రీస్తు సువార్తయే మార్గమని ఈ లోకములో ప్రకటన చేయాలి.
» సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. – (1 కొరింధి. 1:18).
1). సిలువను గూర్చిన వార్త ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించారని, సమాధి చేయబడెనని, మూడవ దినమున లేపబడెనని అపోస్తులులు ఎలాగైతే ప్రకటన చేసారో మనము కూడా ఈ లోకములో ప్రకటన చేయాలి.
» సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. – (1 కొరింధి. 15:1-4).
2). క్రీస్తు ఈ లోకమునకు రాకమునుపు మరణము ప్రతి మనుష్యుని యేలెను కాని ఆ క్రీస్తు రాక ద్వారా మరణము ఓడించి, అపవాదికి అపజయమునిచ్చియున్నాడని, పాతాళపు నోరు కట్టియున్నాడని, సువార్త ద్వారా ఆయనను అంగీకరించువారికి జీవమును, అక్షయతను కలుగుజేయువాడు ఆయన మాత్రమే అని ప్రకటన చేయాలి.
» క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. – (2 తిమోతి. 1:10).
★ జీవము అనగా క్రీస్తునందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకునని,
★ అక్షయత అనగా బ్రదికి క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడని ప్రకటన చేయాలి.
» అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. – (యోహాను. 11:25,26).
3). మృతులు అనగా యేసుక్రీస్తు సువార్తకు లోబడనివారు. ఆయన సువార్తకు లోబడనివారికి నీవు తెలియజేయవలసినది ఏమనగా “పాపముల విషయములో చనిపోయిన నీవు క్రీస్తు సువార్త ద్వారానే బ్రతుకుతావని అలా చెప్పుటకు సాక్షిని నేనే అని చెప్తూ, ఆ మృతుడు క్రీస్తు రాజ్యములో (CHURCH OF CHRIST) ప్రవేశించు వరకూ ఆయన మరణమును గూర్చి ప్రకటన చేయాలి.”
» మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. – (యోహాను. 5:25).
C). "స్వపరీక్ష" : (1 కొరింధి. 11:27-28).
» కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.
★ స్వపరీక్ష అనగా తనకు తాను పరీక్షించుకొనుట
మనస్సు మార్పునొంది, దుష్టత్వాన్ని మానుకొని చెడు కార్యములను విడిచి పెట్టుటకు, తన మనసాక్షి నిమిత్తము తప్పులను సరిచేసుకుని, క్రీస్తులాంటి జీవితమును జీవించాలని ఆలోచన కలిగి హృదయపూర్వకముగా కోరుకునేవారికి ప్రభురాత్రి భోజనము ఒక గొప్ప అవకాశము.
ప్రియ సహోదరుడా, క్రీస్తువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు తనని సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచన ముందుగానే ఎరిగి, మనస్సు మార్చుకునే అవకాశమును ఇవ్వడము జరిగింది కాని యూదా మాత్రము అయోగ్యముగానే క్రీస్తు బల్లలో పాలు పొందాడు, చివరికి క్షమాపణ లేకుండానే మరణించాడు. ఆనాడు యూదాకి ఎలాగైతే అవకాశామునిచ్చాడో ఈనాడు మనకు కూడా ప్రభురాత్రి భోజనము ద్వారా అవకాశమును కల్పించాడు. అయినప్పటికీ దానిని నీవు ఎంతమాత్రము లెక్క చేయకుండా అయోగ్యముగానే అందులో పాలు పొందితే ఇస్కరియోతు యూదాలాంటి స్థితిని కొరి కొనితెచ్చుకుంటున్నావేమో అని నిన్ను నీవు పరీక్షించుకుని ఆ బల్లలో పాలుపొందాలని కొరింధి పత్రికలో వ్రాయబడిన మాటల సారాంశమని గ్రహించాలి.
» సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవు చున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. – (మత్తయి. 26:20-25).
D). "వివేచన" : (1 కొరింధి. 11:29).
» ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.
★ వివేచన అనగా ఆలోచించుట లేక గ్రహించుట.
◆ సహోదరులారా, ప్రభురాత్రి భోజనములో భాగంగా రొట్టెను తీసుకునేటప్పుడు అది క్రీస్తు శరీరముకు సాదృశ్యమని, ద్రాక్షారసమును తీసుకునేటప్పుడు అది క్రీస్తు రక్తమునకు సాదృశ్యమనే భావన కలిగియున్నారు కాని వాస్తవానికి రొట్టె క్రీస్తు శరీరముకు, ద్రాక్షారసము ఆయన రక్తముకు చిహ్నమని గ్రహించలేకపోతున్నారు.
◆ నేటి సంఘాలలో చాలామంది ప్రభురాత్రి భోజనము కార్యక్రమము చేస్తున్నపుడు రొట్టెను, ద్రాక్షారసమును పంచిపెడుతూ అవి క్రీస్తు శరీరముకు మరియు రక్తముకు సాదృశ్యముగా చెప్తుంటారు కాని సహోదరుడా ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో సాదృశ్యమనే పదము వాడుట సరియైనది కాదు ఎందుకనగా సాదృశ్యము (figure ) అనగా ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము అని అర్థము వసున్నది. దీనినిబట్టి ఆలోచన చేయగలిగితే రొట్టె క్రీస్తు శరీర ఆకారము కాదు మరియు ద్రాక్షారసము ఆయన రక్తము కాదు కనుక సాదృశ్యమనే భావనతో ఆయన బల్లలో చేయి పెట్టకూడదు.
◆ ప్రభురాత్రి భోజనములో పాలు పొందే ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, రొట్టె అనగా సిలువలో నలుగగొట్టబడిన క్రీస్తు శరీరముకు చిహ్నమని, ద్రాక్షారసమనగా ఆయన ఎన్నో గాయములనొంది సిలువలో కార్చిన రక్తముకు చిహ్నమని ఆలోచన కలిగియుండాలి, వివేచనతో ఆ పాత్రలో చేయి పెట్టాలి. (చిహ్నము అనగా గుర్తు).
◆ క్రీస్తు శరీరము అనగా సంఘము కాని రొట్టె కాదు. అపోస్తలుడైన పౌలుగారు శరీరమంటే సంఘమనే ఉద్దేశముతోనే మాట్లాడటం జరిగిందని గ్రహించాలి. ఎందుకనగా కొరింధిలో ఉన్న క్రీస్తు సంఘములో వివిధ భావాలు ఏర్పడి కక్ష్యలు, పేద, ధనిక అనే భేధాలు కలిగియున్నారు కనుక వారిని హెచ్చరిస్తూ ఈలాగు చెప్పెను..
◆ మనమంతా క్రీస్తు శరీరములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) అవయవములుగా చేర్చబడ్డామని, ఆయన శరీరమములో అవయవములన్ని ఏలాగైతే ఒక్కటిగా కలిసియున్నాయో అలాగే క్రీస్తు సంఘములో చేర్చబడిన మనము ఏక మనస్సును, ఏక ప్రేమ, ఏక భావము, ఏక తాత్పర్యమును కలిగియుండాలని, ఒకరితో ఒకరు సమాధానము కలిగి దేవునితో సమాధానపరచవలెనని అందుకే క్రీస్తు ఈ లోకములో మరణించాడని వారికి గుర్తుచేస్తూ ప్రభురాత్రి భోజనము యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయడమైనది.
» ఆ సంఘము ఆయన శరీరము. – (ఎఫేసీ. 1:23).
» కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. – (మత్తయి. 5:22-24).
» ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. – (ఎఫెసీ. 2:14-17).
» ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవ ములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. – (1 కొరింధి. 12:12).
కాబట్టి, ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో చేయి పెడుతున్న నీవు నీ సహోదరునితో సమాధానము కలిగియున్నావా?, అన్ని విషయములలో, అన్ని సమయాలలో క్రీస్తు సంఘముతో ఏకీభవిస్తున్నావా? అని వివేచన కలిగి ఆ పాత్రలో చేయి పెట్టాలనేది ఆ వచనముల ఉద్దేశమైయున్నది కాని బాప్తీస్మము తీసుకున్నాను కదా అందులో పాలు పంచుకోవాలి కదా అని వివేచన లేకుండా నిన్ను నీవు పరీక్షించుకొనకుండా ఒక ఆచారముగా తీసుకోవాలని సిద్ధపడితే అది శిక్షావిదికే కారకమగును కనుక ఆలోచన చేసి జాగ్రత్తగా ఆయన ఆజన ప్రకారము ప్రభువు బల్ల కార్యక్రమమును నెరవేర్చాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
4 comments
commentsఅయోగ్యముగా తీసుకోవడమేమిటి?
Replyఒక వేళ అయోగ్య పరిస్థితి ఉంటే తీసుకోవచ్చా లేక లేక యోగ్య పరిస్థితి వచ్చువరకు మనుకోవలేనా?
brother vandanalu the message very nice thank so much
Replyదేవుడు ముమల్ని దీవించును గాక
Replyప్రతీ ఆదివారంనాడు తీసుకున్నారా లేక ఆదివారం తీసుకున్నామని దాని అర్ధమా .... కొంచెం అర్ధం కాలేదు .అంటే మిద్దెపై మేము కూడినప్పుడు అని ఉంటది . పలానా రోజు , నెల అని ఉండదుగా అందుకు వేరేగా అనుకోవద్దు
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com