మరణము - ఆశీర్వాదం (Death - Blessing)

మరణము - ఆశీర్వాదం 


పాపముల విషయమై మరణించి క్రీస్తు నందు జీవిస్తున్న ప్రతి సహోదరునికి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో వందనములు. 🙏


మరణము గురించి వాస్తవాలు పూర్తిగా తెలియకుండా క్రైస్తవులుగా పిలవబడడం సరైనది కాదు.  మరణానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు అలాగే మరణానికి భయపడని వాడు కూడా క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు ఏ మరణానికి భయపడాలి ఏ మరణానికి భయపడకూడదు అలాగే మరణము ఎన్ని రకాలు ఏ విషయంలో మరణించాలి ఇలాంటి విషయాలు గూర్చి ఈ అంశంలో ఆలోచన చేద్దాం. 


✏️ మరణము అంటే "ఎడబాయిట" లేదా "ఎగిరిపోవుట" అని అర్థం. థెనాటోస్ అనే గ్రీకు పదము నుండి ఉద్భవించింది. 


✏️ పరిశుద్ధ గ్రంథంలో నాలుగు రకాలైన మరణాల గురించి వ్రాయబడ్డాయి.


𒐕. భౌతిక మరణము 

𒐖. ఆత్మీయ మరణము 

𒐗. క్రీస్తుతో పాటు మరణము 

𒐘. రెండవ మరణము లేక చివరి మరణము 


📝 భౌతిక మరణము


భౌతిక మరణం అంటే ఈ శరీరాన్ని లేక దేహాన్ని విడిచి పెట్టడం. (కీర్తన 90:10) దీనినే మృతి పొందుట అని కూడా అంటారు (మత్తయి 8: 22). ఈ శరీరము మనకు ఇల్లు వంటిది. భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మన కున్నదని యెరుగుదుము. (1కోరింది. 5:1) శరీరమనే ఈ ఇంటిలో ఆత్మ నివసిస్తుంది ఈ ఆత్మ తన దేహాన్ని లేక తన ఇంటిని విడిచి వెళ్లడమే శరీరమరణము. (మార్కు 5:38-39) 


📝 ఆత్మీయ మరణము 


నరుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం(ఆది.కాం. 1:24-27). దేవుడు ఎలా ఆత్మ స్వరూపియే/అక్షయుడో (యోహాను. 4:24;1 తిమోతి. 1:17) అలాగునే నరుడు కూడా ఆత్మ మరియు అక్షయుడు.(ఆది.కాం. ఆది.కాం. 2:7; సామెతలు. 20:17; ప్రసంగి 12:7) దేహమనే ఇంటిలో నివసించుచున్న ఆత్మ మరణించడమే ఆత్మీయ మరణం లేదా దేవునికి నీకు(ఆత్మకు) మధ్య ఎడబాటునే ఆత్మీయ మరణం అంటారు. ఇది ఎంతో భయంకరమైనది. 


ఈ లోకములో ఎవరైతే పాపపు జీవితంతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారు దేవుని నుండి కలుగు జీవములోనుండి వేరు పరచబడినవారైయుందురు(ఎఫేసి. 4:18) ఇట్టి వారు ఆత్మీయంగా మరణించిన వారైయుంటారు అంటే నీ శరీరము లేక దేహము ఈ భూమి మీద జీవించే ఉంటాది కానీ ఆ శరీరము లోపల ఉన్న నీవు(ఆత్మవి) చనిపోయి ఉంటావు. "...నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే. (ప్రకటన 3: 1) నీవు చేసే పాపపు క్రియలు నీ దేహంలో ఉండే నిన్ను (ఆత్మను) చంపేస్తాయి. నీ దేవునికి విరోధంగా నీవు ఏమి చేసినా నిబంధనానుసారంగా బ్రతకకపోయినా నువ్వు చచ్చిన వాడివే ఇదే ఆత్మీయ మరణం.(ఎఫెసీ 2:1; 4:17-18) దీనిని పొందిన వారు భౌతికముగా మరణించిన వెంటనే పాతాళ లోకములో యాతన అనుభవిస్తారని ప్రభువే సెలవిచ్చెను కదా!! (లూకా 16:19-31 చూడుము). "మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?" (కీర్తన. 89:48)



📝 క్రీస్తుతో పాటు మరణము


క్రీస్తుతో పాటు మరణము అంటే, క్రీస్తు సిలువపై మరణించినప్పుడు, ఆయనతో పాటుగా విశ్వాసి కూడా పాపం విషయమై మరణించి,(బాప్తిస్మం కార్యక్రమం ద్వారా...) నీతి విషయముగా బ్రతుకుటకు క్రీస్తుతో పాటుగా నూతన జీవితంలోకి ప్రవేశిస్తారని అర్థం. ఇది క్రైస్తవ విశ్వాసంలో ఒక ముఖ్యమైన భావన, దీని ద్వారా విశ్వాసి తన పాపాల నుండి విముక్తి పొంది, దేవునితో నూతన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. పాపం పట్ల అతనికున్న పాత కోరికలు, అలవాట్లు చనిపోతాయి. క్రీస్తుతో పాటు మరణించి, తిరిగి లేచిన విశ్వాసి, క్రీస్తు యొక్క దేవునితో సమాధానపడి, ఆయన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది పాపానికి దూరంగా, నీతి మార్గంలో జీవించడానికి ఎంతో దోహద పడుతుంది. 


మునుపు మన ప్రాచీన పురుష జీవితాన్ని  క్రీస్తుతో కూడా సిలువ వేసిన వాడు క్రీస్తు తో పాటు మరణించినవాడు. ఎవరైతే  క్రీస్తుతో కూడా మరణం పొందుతారో వారు క్రీస్తు కూడా లేపబడతారు. క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన వాడు ఆయన మరణములోనికి బాప్తీసము పొందినవాడు. ఇలా క్రీస్తు నందు కొత్త జీవితాన్ని పొందుకొని, పాపానికి బానిసలుగా కాకుండా, దేవునికే విధేయులుగా జీవించేడివారైయుంటారు. (రోమా 6:1-13).


మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.(1 పేతురు. 2:24). అందుకు యేసు అతనితో —ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.౹ … యేసు ఇట్లనెను– ఒకడు నీటిమూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను. 3:3,5)



📝 రెండవ మరణం


రెండవ మరణం అంటే నీవు(ఆత్మ) నిత్యమైన శిక్షకు వెళ్లడం. ఎవరైతే క్రీస్తు సువార్తకు లోబడక(2 దెస్స 1:6), దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి(రోమా. 1:18), తమ భూనివాసకాలాన్ని దేవునికి విరోధముగా నడుచుకొని(1 పేతురు 3:12), జీవితాన్ని ముగిస్తారో వారికి రెండో మరణం సంభవిస్తుంది దీనినే దేవుని ఉగ్రత అని అంటారు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. (ప్రకటన. 20:14)


ఈ రెండవ మరణం లో ఆత్మకు చావు ఉండదు. నీవు బ్రతికే ఉంటావు కానీ ఆ బ్రతుకుకి సమాధానం ఉండదు. మరణాన్ని కోరుకున్న మరణం రాదు. "నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు." (మార్కు. 9:48). అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. (మత్తయి. 25:41)



👤 ఓ చదువరి... పైన వ్రాయబడిన విషయాలలో నాలుగు మరణాల గురించి తెలుసుకున్నాం కదా అయితే ఈ నాలుగు మరణాలలో ఏ మరణం నీకు ఆశీర్వాదకరం? అని ప్రశ్నించుకొని నీవు ఆలోచించగలిగితే అది కచ్చితంగా క్రీస్తుతో పాటు మరణమే అగును కదా!! నీవు క్రీస్తుతోపాటు మరణిస్తే ఆయనతో పాటు లేపబడతావు, పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యమై ఉంటావు.(రోమా. 6:5cf) క్రీస్తు యేసులోనికి మరణం పొందిన వారికి భౌతికమైన లేక శరీరమరణం ఆశీర్వాదకరం. అంతట– ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. (ప్రకటన. 14:13) ఎవరైతే తమ జీవితాన్ని ఈ భూమి మీద దేవుని కొరకు నిబంధనానుసారంగా బ్రతుకుతారో, ఎవరైతే అపోస్తుల బోధలో తమ జీవితాన్ని కట్టుకుంటారో, వారికి భౌతిక సంబంధమైన మరణం ఆశీర్వాదకరం. వారు భౌతికంగా మరణించినప్పటికి బ్రతికే ఉంటారు(ప్రకటన. 22:5) వారు సజీవులు(రోమా 6:11). వారు ధన్యులు(ప్రకటన 20:6; 22:14). వారే దేవుని వారసులు. (రోమా 8:17)


కనుక ప్రియులారా నీ మరణము నీకు ఆశీర్వాదకరంగా లేనప్పుడు నువ్వు జీవించిన జీవితము వ్యర్థమే అగును కదా. నీవు జీవించుచున్నావు అనే పేరు అయితే ఉన్నది గాని నీవు మృతుడవే. ఇలా బ్రతుకుట కంటే క్రీస్తు కొరకు సమర్పించుకొని బ్రతకడం మేలు కదా!! 


📖 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. (కీర్తన 116:15)

📖 దుష్ఠుల మరణము దేవుని సంతోషపరచదు. (యెహెజ్కేలు 18:23)

మీ ఆత్మీయులు👪

1. పరలోకమునకు ఎవరు వెళ్తారు?క్లిక్ చేయు

2. బాప్తిస్మముక్లిక్ చేయు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16