లోతు కుమార్తెల గర్భధారణ సరైనదేనా!?(Is the pregnancy of Lot's daughters correct!?)

 

లోతు కుమార్తెల గర్భధారణ సరైనదేనా!?


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.


📖 పరిశుద్ధ గ్రంథము(బైబిల్ - 66 పుస్తకాలు) అనగా దేవుడు తన చిత్తాన్ని లేదా యావత్తు అనాది సంకల్పమును నరునికి బయలు పరిచే గ్రంథమని అర్థం. 

✅  NOTE : బైబిల్లో కేవలం దేవుని మాటలే లేవు. తొందరపడి నిర్ణయం తీసుకోక చివరి వరకు చదువుము. 


పరలోకమందున్న దేవుడు ఆదియందు తన పోలిక, తన స్వరూపమందు నరుని సృజించి, ఏదెను తోటలో ఉంచి, ప్రేమించి, స్వేచ్ఛను అనుగ్రహించి, జగత్తు పునాది వేయబడక మునుపే తన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి సంకల్పించిన సంకల్పం ప్రకారంగా నరుడును తన కృపలో నడిపించు దినాల్లో... కాలక్రమేనా దేవున్ని విడిచిపెట్టి వెనువెంటనే నరుడు చేయు ప్రతి దుష్కార్యములను, చెడు కార్యాలను, వ్యభిచారమును, విగ్రహారాధనను, భక్తిహీనతను, నరుని చేష్టలను, అపవాది యొక్క మాటలను, నరుని సొంత జ్ఞానమును, సొంత అభిప్రాయాలను...Etc. వీటితో పాటుగా తాను నరుని కొరకు అనాదిగా సంకల్పించిన సంకల్పము సహితం వేటిని విడిచి పెట్టకుండా ఆది నుండి జరిగిన వాటిని ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడిన 40 మంది గ్రంథకర్తల ద్వారా పరిశుద్ధ గ్రంథమును(66 పుస్తకాలు) నేడు మన కొరకు ఎంతో స్పష్టంగా దేవుడే వ్రాయించెను కదా. (2 తిమోతి. 3:15-17; 2 పేతురు. 1:20-21) 


📖నేడు మనకు ఇలా తన గ్రంథమును వ్రాయించి ఇచ్చుటలో గల ముఖ్య ఉద్దేశ్యం ప్రతి నరుడు దేవుని గూర్చిన జ్ఞానం కుమారుని గూర్చిన జ్ఞానం పొందుటకును, సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకొనుటకు, దేవుని పక్షాన నడుచుటకును, క్రీస్తును విశ్వాసించి బాప్తిస్మము పొంది క్రీస్తు సంఘముగా చేర్చబడి క్రీస్తు ద్వారానే నిత్యజీవం పొందుటకును, లోపముతో కూడిన జీవితాన్ని దిద్ధుబాటు చేసుకొనుటకును, అపవాదిని ఓడించుటకును, మానవుని యెడల దేవుని అపారమైన ప్రేమను గుర్తించుటకును, చివరిగా నరునికి బుద్ధి మరియు బోధ కలుగుటకై ఇచ్చెను కదా!!  


📖 కావున బైబిల్ చదువు ప్రతివారు అందులో నరులు చేయు వాటి గుండా దూసుకొంటూ వెళ్తున్న దేవుని చిత్తం/సంకల్పం కనుగొన్నప్పుడే మనకు పరిశుద్ధ గ్రంథం అర్థం అయ్యే అవకాశం ఉంది. "ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కే గాని మరి ఎవనికిని తెలియవు.౹ దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.౹ మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.౹"(1కోరి.  2:11-13)


📖 మనం బైబిల్ ను సరిగ్గా విభజన చేస్తూ(2 తిమోతి. 2:15) గ్రంథాన్ని చూడలేని పక్షాన ఏ మాత్రం అర్థం కాదు మరియు తన స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకొనే అవకాశం కూడా కలదు. "...వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు" (2 పేతురు. 3:16).


ఇలా అపార్థం చేసుకొనే అనేక విషయాల్లో ఒకటైన "ఆది.కాం. 19:30-38 వచనములు అనగా లోతు కుమార్తెల గర్భధారణ" ఈ విషయాన్ని గూర్చి బైబిల్ ఎటువంటి స్పష్టత నిస్తుందో ఈ అంశము ద్వారా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. 


🔖 "లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతోకూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.౹ అట్లుండగా అక్క తన చెల్లెలితో– మన తండ్రి ముసలివాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.౹ మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.౹ ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.౹ మరునాడు అక్క తన చెల్లెలిని చూచి– నిన్నటి రాత్రి నా తండ్రితో నేనుశయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.౹ ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.౹ ఆలాగున లోతుయొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.౹ వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.౹ చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును." (ఆది.కాం. 19:30-38).


📢 వివరణ : 

🎯 లోతు మరియు తన ఇద్దరి కుమార్తెలతో  సొదొమా, గొమొర్రా పట్టణాల విధ్వంసం నుండి తప్పించుకున్న తరువాత(15-29వ) వారు ముగ్గురు ఒక గృహలో నివసించినట్టు చూడగలం(30వ). 


🎯 ఏ పురుషుడు లేడు అనుకొని, భవిష్యత్తులో ఎటువంటి వివాహాలు లేకపోతే తమ సంతానాన్ని ఎలా కొనసాగించాలనే భయంతో లోతు కుమార్తెలు తమ తండ్రికి శ్రమకు గురిచేయకుండా, అతని జీవితాన్ని కాపాడాలనుకొని, తమ తండ్రిని మత్తులో పడగొట్టి, అతన్ని శయనించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ చర్య ద్వారా వారు సంతానాన్ని కల్పించాలని అనుకున్నారు. ఆ ప్రకారంగానే జరిగించారు.(31-34వ).


🎯 ఇరువురు యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో లోతుకు తెలియలేదు.(35వ). లోతును తప్పు పట్టే అవకాశం ఎవరికీ లేదు. 

ఉదాహరణకు : క్షమించండి... ఈరోజు ఎవరైనా కామాంధుడు ఒక స్త్రీకి మధ్యం కానీ మత్తు మందు కానీ పట్టించి ఆమెపై అత్యాచారం చేస్తే ఆ స్త్రీని ఎలా నిందించలేమో అలానే లోతునూ నిందించలేము.


🎯 అటు పిమ్మట ఇద్దరు కుమార్తెలు గర్భధారణ పొంది(36వ)


🎯 పెద్దది - మోయాబను, చిన్నది - బెన్నమ్మి, అను ఇద్దరు కుమారులకు జన్మనివ్వడం చూడగలం. వీరు తరువాత "మోయాబీయలు మరియు అమ్మోనీయలు" అను రెండు వంశాలకు మూలమవుతారు. (37-38వ).


🔴 వారు చేసినది సరైనదేనా? కాదా?


𒐕. లోతు కుమార్తెల గర్భధారణ విషయములో  నైతిక దృక్కోణముతో సరైనదేనా? కాదా? అనేది ఆలోచన చేస్తే...  బైబిల్ ప్రమాణాల ప్రకారం వారు చేసేది 100% నైతిక తప్పే. "మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.౹ నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.౹ నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.౹" (లేవీ. కాం.18:6-8). ఇదంతా లోతు గారికి తెలిసిన తరువాత అతను తప్పకుండా మానసిక వ్యధకు గురయ్యుంటాడు అనేది ఈ రచయిత యొక్క అభిప్రాయం. దేవుడు‌ సొదొమ‌ పట్టణాలను నాశనం‌ చేసినప్పుడు(ఆది.కాం. 19: 24-25) ఇతను సోయరు నుండి పర్వతపు గుహలోకి కాకుండా అబ్రాహాము దగ్గరకు వెళ్ళుంటే(ఆది.కాం. 13:7-12); ఇలాంటి పరిస్థితి అతనికి రాకుండును. కాబట్టి మనం ఏదైనా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నపుడు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కంటే మనకోసం ఆలోచించే అబ్రాహాము వంటి భక్తుల సహాయాన్ని కోరడం చాలా శ్రేయస్కరం.


𒐖. లోతు కుమార్తెల గర్భధారణ విషయములో బైబిల్ దృక్కోణముతో సరైనదేనా? కాదా? అనేది ఆలోచన చేస్తే... వారు చేసేది దైవ ఆజ్ఞకు/దైవ చిత్తానికి వ్యతిరేకముగానే ఉంది. పరిశుద్ధ గ్రంథం ఈ చర్యలను ఆమోదించడం లేదు. ఆది.కాం. 19:30-38వ లోనున్న కథను చారిత్రాత్మకంగా జరిగిన సంఘటనగా దేవుడు తన గ్రంథమందు  ముద్రించుటకు గల ముఖ్య ఉద్దేశ్యం "మోయాబీయలు మరియు అమ్మోనీయలు" అను సంతతి మూలాన్ని వివరించడానికే లోతు కుమార్తెల చర్యను వ్రాశారే తప్పా నీతిగా లేదా ఆదర్శవంతంగా ఉండుటకు వ్రాయలేదు. ఆ రెండు జాతులు ఇశ్రాయేలీయులతో సంబంధాలు కలిగిన వారు. (ద్వితీయోపదేశకాండము. 2:9,18-19; న్యాయాధిపతులు. 11:15-28; 1 సమూయేలు. 10:1-8). 

🍃చివరిగా... లోతుకు జన్మించిన ఆ కుమారుల యొక్క సంతానపు చరిత్రను మనం ఒక్కసారి పరిశీలిస్తే వారి తల్లులవలే వీరు కూడా హేయక్రియలెన్నో జరిగించి దేవుని చేత శిక్షించబడుట మనం చూడగలం. (ద్వితీయోపదేశకాండము 23:3,4,6, సంఖ్యాకాండము 25:1-3, యెషయా. 15:1-9; యిర్మీయా. 48:1-47; 49:1-6; ఆమోసు 2:1-3, ఆమోసు 1:13,14).


𒐗. లోతు కుమార్తెల గర్భధారణ విషయములో నేటి క్రైస్తవ దృక్కోణముతో సరైనదేనా? కాదా? అనేది ఆలోచన చేస్తే... లోతు కుమార్తెలు‌ తమ తండ్రిద్వారా గర్భవతులు అయ్యేందుకు హేయమైన కార్యానికి పాల్పడడం క్రీస్తు సంఘము పాపపూరితనైనదిగానే పరిగణిస్తుంది. మానవ బలహీనతకు మరియు దేవుని పవిత్రతకు మధ్యనున్న వ్యత్యాసాన్ని కనపడేలా చేస్తుంది. ఇది నేటి క్రైస్త్యమునకు నీతిగా, ఆదర్శంగా తీసుకోకూడదు. అయితే ఈ లోతు ద్వారా జన్మించిన మోయాబు సంతానం నుండే యేసుక్రీస్తు వంశావళిలో బోయజు భార్యగా పేర్కోబడిన రూతు జన్మించింది. ఎందుకంటే ఆమె అపవిత్రమైన తన జాతితో సంపూర్ణంగా తెగదెంపులు చేసుకుని, కష్టమైనా నష్టమైనా ఇశ్రాయేలీయురాలిగా అనగా యెహోవా దేవుని భక్తురాలిగా జీవిస్తానని నయోమీని వెంబడించింది (రూతు 1:16,17 చూడుము). ఆ కారణంగా కనికరం కలిగిన దేవుడు ఆమెపై కృపచూపించి యేసుక్రీస్తు వంశావళిలో చోటుదక్కేలా చేసాడు.(మత్తయి. 1:5,16). ఇది మోయాబీయుల జాతి విషయంలో ఆమెకు మాత్రమే కల్పించబడిన మినహాయింపు. గొప్ప ధన్యత. పైగా యేసుక్రీస్తు పరిశుద్ధత, ఆయన వంశావళిని‌ బట్టి సంక్రమించిందో ఆ వంశావళిని బట్టి తగ్గిపోయేదో కాదు సుమీ!.


🙋 ఓ చదువరి... ఆదికాండము 19:30-38 అనేది లోతు కుమార్తెలు తమ కుటుంబ వంశాన్ని కాపాడుకోవడానికి చేసిన విషాదకరమైన ప్రణాళికను వివరించే ఒక కీలకమైన భాగమే కానీ దేవుని సంకల్పం కాదు. పరిశుద్ధ గ్రంథం ఈ చర్యలను ఆమోదించడం లేదు. ఈ సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి, బోధ కలుగుటకై వ్రాయబడెను. 

మీ ఆత్మీయులు..

WhatsApp Join Us   Telegram Join Us

WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Questions and Comments here!

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16