"క్రైస్తవుడు ఆరాధనలో వాయిద్యములు ఎందుకు వాడకూడదు?" (Why should a Christian not use instruments in worship?)

క్రైస్తవుడు ఆరాధనలో వాయిద్యములు ఎందుకు వాడకూడదు?


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

క్రైస్తవులు ఆరాధనలో వాయిద్యములు ఉపయోగించకూడదని లేఖనములను ఆధారము చేసుకొని, దేవుడు ఎటువంటి ఆరాధనను కోరుకుంటున్నాడో, నేటి క్రైస్తవులమైన మనము సత్య ఆరాధనలో వాయిద్యములు వాడవలసిన అవసరము లేదని వివిధ అంశముల ద్వారా తెలియజేసినప్పటికీ, కొంతమంది క్రైస్తవులు సత్య వాక్యమును సరియైన విధములో పరిశీలించకుండా, సరిగా విభజన చేయుకుండా, పరిశుద్ధ గ్రంథమును అపార్థము చేసుకుంటూ గ్రంథమును వ్రాయించిన పరిశుద్ధాత్మునే ప్రశ్నించే వారిగా ఉన్నారు.

ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంధమందున్న ఏ ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి. (2 పేతురు. 1:21). కాబట్టి క్రైస్తవుడవైన నీవు ఈ విషయమును చాలా ఖండితంగా నమ్మితీరాలి కానీ మన సొంత మాటలను చేరుస్తూ, గ్రంథములో  లేని విషయమును గూర్చి ఆలోచిస్తూ పరిశుద్ధాత్ముని ప్రశ్నించే వారిగా మనము ఉండకూడదు.

మొదటి ఆధారము :


● చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. – (ఆది. 6:14).

నోవాహుతో మన దేవుడు “చితిసారకపు మ్రానుతో” మాత్రమే ఓడను చేయమని ఆజ్ఞాపించారు. దీనికి అర్థము వేరొక మ్రానును ఉపయోగించకూడదని తెలుస్తుంది.

నోవాహు కూడా దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను బట్టి చితిసారకపు మ్రానుతోనే ఓడను నిర్మించెను కాని ఇంకొక మ్రాను ఎందుకు ఉపయోగించకూడదని అజ్ఞానముగా దేవుని ప్రశ్నించలేదు.

● దేవుడు అతని (నోవాహు) కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. – (ఆది. 6:22).

రెండవ ఆధారము :


● నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. – (నిర్గమా. 28:1).

ఈ వచనములో దేవుడు తనకు యాజకత్వము చేయుటకు ఆహారోను సంతతి వారు మాత్రమే అర్హులని మోషేకు సెలవిచ్చినప్పుడు  మోషే కాని మిగతా ఇశ్రాయేలీయులు కాని ఆహారోను సంతతి వారు మాత్రమే ఎందుకు యాజకత్వము చేయాలని అజ్ఞానముగా దేవుని ప్రశ్నించలేదు.

మూడవ ఆధారము :


● నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఒక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి, ఇది మీకొరకైన నా శరీరము - నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. – (1 కొరింధి. 11:23-25).

ఈ వచనములో క్రీస్తు వారు తన శరీరమునకు చిహ్నముగా రొట్టెను, తన రక్తానికి చిహ్నముగా ద్రాక్షారసమును తీసుకుని ఆయనను జ్ఞాపకము చేసుకోమని మనకు తెలియజేసారు అయితే రొట్టెగా బదులుగా మాంసమును, రక్తమునకు బదులుగా మరొక పానీయమును ఎందుకు తీసుకోకూడదని నీవు అజ్ఞానముగా ప్రశ్నించకూడదు.

నాల్గవ ఆధారము :


★ యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనెను. – (యోహాను. 4:23-24).

క్రొత్త నిబంధనలో పాడుట గూర్చి మాత్రమే చూడగలము కాని వాయిద్యములు లేవనుటకు క్రింది వచనములే మనకు సాక్ష్యమిస్తున్నాయి.

★ అంతట వారు కీర్తన "పాడి" ఒలీవల కొండకు వెళ్లిరి. – (మత్తయి. 26:30).

★ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు "పాడుచు"నుండిరి. -  (అపొ.కార్య. 16:25).

★ అన్యజనులలో నేను నిన్ను "స్తుతింతును"; నీ "నామసంకీర్తనము" చేయుదును. – (రోమా. 15:9).

★ ఆత్మతో "పాడుదును", మనస్సుతోను "పాడుదును". – (1 కొరి౦ధి. 14:15).

మీ హృదయములలో ప్రభువునుగూర్చి "పాడుచు" కీర్తించుచు. – (ఎఫెసీ. 5:19).

★ మీ హృదయములలో దేవునిగూర్చి "గానము" చేయుచు. - (కొలస్సి. 3:16).

★ సమాజముమధ్య నీ కీర్తిని "గానము" చేతును అనెను. – (హెబ్రీ. 2:12).

★ ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు "పాడవలెను". – (యాకోబు. 5:13).

క్రొత్త నిబంధనలో సంగీతము గూర్చి మాట్లాడుతూ “పాడుట” లేదా “పాడిరి” అని మాత్రమే  ఈ వచనములన్నియు తెలియజేస్తున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఆజ్ఞగా మనము చూడగలము. అపోస్తులులు కూడా ఏ సంధర్భములోను వాయిద్యముల ప్రస్తావన తీసుకురాలేదు వాటిని ఉపయోగించమని గ్రంథములో ఎక్కడా కూడా బోధించలేదు. కాబట్టి, ఈ వచనములలో పాడుట గూర్చి మాత్రమే ఉన్నది వాయిద్యములు వాడకూడదని చెప్పలేదు కదా అని క్రైస్తవుడవైన నీవు అటువంటి ఆలోచనా విధముతో మాట్లాడుతూ లేని విషయమును కలిపితే పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడినట్టే.

ఇలా చూసుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథమందు చాలా ఆధారములు ఉన్నవి అయితే ఇన్ని ఆధారములున్నప్పటికి, సొంత ఆలోచనలతో దేవుని ప్రత్యేకమైన ఆజ్ఞను మీరితే వాటి యొక్క ఫలితము కూడా గ్రంథమందు వ్రాయబడింది.

A) ఆహారోను కుమారులకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞను మీరినందుకు వారికి కలిగిన ఫలితము :

● అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. – (లేవీ. 10:1-2).

B) దేవుడు బండతో మాట్లాడమంటే మోషే బండను కఱ్ఱతో కొట్టగా అతనికి కలిగిన ఫలితము :

● నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. – (సంఖ్యా. 20:8).

● అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. – (సంఖ్యా. 20:11).

● ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. – (సంఖ్యా. 20:24).

C) దేవుడు ఆజ్ఞాపించని యాజకత్వపు పనిని రాజైన ఉజ్జియా చేయగా అతనికి కలిగిన ఫలితము :

● వారు రాజైన ఉజ్జియాను ఎదిరించిఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా" "ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. – (2 దినవృత్తా. 26:18-19).

D) పరిశుద్ధ గ్రంథములో వేటిని కలిపినా తీసివేసినా అతనికి కలుగు ఫలితము :

● ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు - అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. – (ప్రకటన. 22:18-20).

కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చి, దానిని ప్రత్యేకపరిచినప్పుడు ఆ ఆజ్ఞకు వ్యతిరేకముగా ఏమియు మాట్లాడకూడదు, వేరొక ఆలోచన చేయకూడదు.  దీనిని బట్టి “క్రైస్తవులు సత్య ఆరాధనలో సంగీత వాయిద్యములు ఎందుకు వాడకూడదో, ఏ విధముగా తండ్రియైన దేవుని ఆరాధించాలో  చెప్పబడిన ఆజ్ఞ”కు వ్యతిరేకముగా ఆలోచన చేసి పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడకూడదని (మత్తయి. 12:32)నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

5 comments

comments
October 29, 2017 at 9:49 PM delete

వందనములు బ్రదర్ గారు

Reply
avatar
January 29, 2018 at 5:28 PM delete

సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. (1 తిమోతికి 6:6)

పై వఛనం గూర్చి వివరణ కావాలి అన్న కొంచం సహాయపడగలరూ
వందనాలు అన్న!

Reply
avatar
June 1, 2020 at 10:45 PM delete

you are wrong brother all instruments and all music given by God Jesus

Reply
avatar
April 6, 2024 at 9:47 AM delete

Prasninchatam agnananama 😒

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16