"ధనము అశాశ్వతము" (Riches Are Temporary)

ధనము అశాశ్వతముపరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు.

నేటి కాలములో అనేకమంది క్రైస్తవులు ఈ లోకములో ధనము కోసము ప్రాకులాడుతూ, అధికంగా ధనము సంపాదించుకొనుటకు  వారి ఆలోచనలు, వారి సమయమును వినియోగిస్తూ, దేవునికి ఇవ్వవలసిన విలువైన సమయమును భౌతిక సంబంధమైన వాటి కొరకు కేటాయిస్తూ వారికి వారే నాశనమును కొనితెచ్చుకొనుచున్నారు.

ప్రియులారా ఈ లోకస్తులు భౌతిక సంబంధమైన జీవితము కోసము ధనము మీద ఆశపడుతున్నారు. ఎందుకనగా వారికి ధనము అశాశ్వతమని  తెలియదు.  నేటి క్రైస్తవులమైన మనకు ధనము అశాశ్వతమని తెలిసినా, ఈ భూమి మీద ధనము కూర్చుకొనకూడదని ఎరిగిన కూడా ఈ లోకస్తులవలె ఆలోచన చేసి, ధనము శాశ్వతమని భావిస్తూ కొన్ని సందర్భములలో క్రీస్తు మాటలను సైతము ప్రక్కన పెట్టి ధనము కొరకు మాత్రమే ప్రయాసపడటం చాలా బాధాకరం.

【 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును. 】– (సామెతలు. 23:4-5).

ధనము సంపాదించుకోవాలని కోరిక కలిగిన యెడల దానిని విడిచిపెట్టుము ఎందుకనగా ధనము అశాశ్వతము, ఆది ఎక్కువ కాలము మన దగ్గర నిలిచియుండదు, పక్షి ఎగిరిపోవునట్లుగా ఆది ఎగిరిపోవునని ఎంతో గొప్ప ధనవంతుడై, ఈ భూమి మీద ఏ రాజుకి లేనంత ఐశ్వర్యమును పొందుకున్న సొలోమోను సైతము ధనము సంపాదించుకకొనుట వ్యర్థమని తన ఆలోచనలను పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియజేయడము జరిగినది.

ధనమును గూర్చి పరిశుద్ధ గ్రంథములోని  అనేక వచనములు మనలను హెచ్చరిక చేయుచున్నవి వాటన్నిటిని ఆలోచన చేసి మనలో లోపాలను సరిచేసుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాము.

ఈ భూమి మీద ధనమును ఎందుకు సమకూర్చుకొనకూడదు?

1) ధనము అశాశ్వతము కనుక :

● ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?. – (సామెతలు. 27:24).

● మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. (కీర్తన. 39:6).

2) ధనము మనలను మరణము నుండి తప్పించాడు కనుక :

● భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.(సామెతలు. 10:2).

3) ధనము మనలను వంచకులుగా చేయును కనుక :

● వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.(సామెతలు. 28:6).

4) ధనవంతులగుటకు ప్రాకులాడే ప్రయత్నములో దేవునికి విరోధముగా ఆలోచన చేసే అవాకశమున్నది కనుక :

● మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును. (సామెతలు. 13:11).

● అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.(సామెతలు. 21:6).

5) ధనము మనలను గర్విష్టులుగా చేయును కనుక :

● బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. (కీర్తన. 62:10).

6) ధనము మనలను పరిపూర్ణులుగా చేయదు కనుక :

● అందుకు యేసు -పరిపూర్ణుడవగుటకు నీవు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును;నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. (మత్తయి. 19:21).

7) ధనము మనలను నాశనము చేయును కనుక :

● మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి. (యాకోబు. 5:3).

8) ధనము విస్తరించుట వలన మనకు జీవము కలుగదు కనుక :

● ఆయన వారితో - మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుటవలన అది వాని జీవమునకు మూలముకాదనెను. (లూకా. 12:15).

9) ధనము వలన శోధనలు కలుగును కనుక :

● ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. – (1 తిమోతి. 6:9).

10) పరలోకమునందు మనకొరకు సిద్దపరచబడిన ధనమును పొందుకోవాలంటే :

● యేసు అతని చూచి అతని ప్రేమించి - నీకు ఒకటి కొదువగా నున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. (మార్కు. 10:21, లూకా. 18:22).

11) ధనము వలన దేవునికి హృదయమును ఇవ్వలేము కనుక :

● నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. (మత్తయి. 6:22).


క్రైస్తవుడు ధనమును సంపాదించుకొనకూడదా?

ప్రియులారా పైన వ్రాయబడిన వచనములను బట్టి క్రైస్తవులమైన మనము ఈ లోకస్తులవలె ధనము కొరకు ప్రాకులాడకూడదు అని తెలుస్తుంది. అయితే చాలామందికి ఒక సందేహము కలుగవచ్చును. ధనమును సంపాదించకుండా కుటుంబమును ఏ విధముగా పోషించాలి? ఈ లోకములో జీవితమును సంతోషంగా గడపాలంటే ధనము చాలా కీలకమైనది కదా అనే ఆలోచన కలుగవచ్చును. వాటన్నిటికి గ్రంథము ఈ విధముగా సెలవిస్తుంది.

దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా చేసిన వాగ్దానములు :

» భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. - (మత్తయి. 6:19).

» నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చియైనను, చింతింపకుడి, ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? (మత్తయి. 6:25).

» ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్టులు కారా? (మత్తయి. 6:26).

» మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తు మూరెడు ఎక్కువ చేసికొనగలడు? వస్త్రములనుగూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఒడకవు. – (మత్తయి. 6:27-28).

» నేడు ఉండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.(మత్తయి. 6:30).

» కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి; అప్పడవన్నియు మీకనుగ్రహింపబడును.(మత్తయి. 6:33).

» రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును. (మత్తయి. 6:34).

ప్రియ సహోదరీ, సహోదరులారా మన దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానములను మనయెడల చేసియుండగా  మనము కేవలము ఇహలోక సంబంధమైన జీవితము కొరకు ప్రయాసపడుతూ దేవునికి ఇవ్వవలసిన విలువైన సమయమును వృధాగా ఖర్చు చేస్తున్నాము. దేవుడు తన కుమారుని ద్వారా తెలియజేసినదేమనగా “మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని” వెదకండి అప్పుడు మీకు కావలిసినవన్నీ మీకు అనుగ్రహింపబడును.

ప్రియులారా మన కుటుంబమును పోషించుటకు, మన జీవితమును సంతోషముగా గడుపుటకు  ఆయన సమస్తమును దయచేయువాడు (అపొ.కార్య. 17:27), మన దేవుడు నమ్మదగినవాడు (2 కొరింధి. 1:18, 2 తిమోతి. 2:13). ఈ లోకపు ధనము అశాశ్వతము (సామెతలు. 27:24).

క్రైస్తవులమైన మనము కష్టపడి పని చేయాలి, అట్టి పని వాడు అట్టి జీతానికి పాత్రుడని (2 థెస్సలొనీ. 3:10, రోమా. 4:4) గ్రంథము సెలవిస్తుంది. నిజమే. కానీ అదేపనిగా ఈ జీవితకాలము మట్టుకే మన కొరకు, మన తోటి వారికొరకు ధనము సంపాదించుకునే పనిలో పడి, అశాశ్వతమైన దీనిని కూర్చుకుంటూ దేవున్ని దూరముగా పెట్టమని కాదు.

దేవుడు మనలను ఆశీర్వదించి మనకు ధనమును అనుగ్రహిస్తున్నాడంటే అందులో మొత్తము నీ భాగమని అనుకోకు కొంత కుటుంబమునకు, కొంత దేవుని పనికి లేదా అక్కర గలవానికి ఉపయోగించాలని లేఖనములు చెప్పుచున్నవి.

» మేము మీయొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయనొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా.(2 థెస్సలొనీ. 3:10).

» అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను. – (ఎఫెసీ. 4:27-28).

» భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మినవాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచువచ్చిరి. వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. (అపొ.కార్య. 4:34-35).

» అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని దివారాత్రము కష్టముచేసి జీవనముచేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.(1 థెస్సలొనీ. 2:9).

» మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలినవాడనైతిని. (2 కొరింధి. 11:8).

» వాస్తవమైన జీవమును సంపాదించుకొనునిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్ క్రియలు అను ధనముగలవారును, ఔదార్యముగలవారును, (తమ 
ధనములో) ఇతరులకు పాలి వారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము. (1 తిమోతి. 6:18).

» జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. – (లూకా. 19:8).

» ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును. (1 తిమోతి. 5:8).

కావున ప్రియులారా, పరలోకమందు ధనము కూర్చుకునే పనిలో కాకుండా ఈ లోకము మట్టుకు మాత్రమే ధనము కూర్చుకునే వారిగా ఉన్నచో, ఈ క్షణమే దేవుని హెచ్చరికను లక్ష్యపెట్టుము.

★ అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడువెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను. – (లూకా. 12:17-21).

★ ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి. మీ ధనము చెడి పోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పుపెట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి. – (యాకోబు. 5:1-3).

★ ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. – (లూకా. 18:24-25).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16