![]() |
ఎస్తేరు |
పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన
యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
పరిశుద్ధ గ్రంధమందున్న పుస్తకములలో ఎస్తేరు పుస్తకము చదువుటకు
సుళువుగా ఉంటుంది కాని అందులో చూపబడిన లేక తెలుపబడిన దేవుని యొక్క సంకల్పమును
గూర్చి, అన్య దేశములో తన ప్రజలను దేవుడు ఏ
విధముగా రక్షించాడో క్రైస్తవులమైన ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలనే విశేష సంగతిని అందరు తెలుసుకోవాలని ఎస్తేరు పుస్తకమును గ్రంథమందు పొందుపరచట
జరిగినది.
ఈ పుస్తకములో ఎక్కడా కూడా యెహోవా మాటలాడినట్టుగా గానీ, తన దూతల ద్వారా
సందేశము పంపినట్టుగాని చూడలేము కానీ తన నిబంధనను ఏ విధముగా నేరవేర్చాడో చక్కగా
తేటపరచబడుచున్నది.
ఎస్తేరు పుస్తకమును ఎవరు రాసారో గ్రంథములో తెలుపబడలేదు కాని చరిత్రల
గ్రంథములో చూసినట్లేయితే మొర్దకై రాసాడని
తెలుస్తుంది.
ఎస్తేరు గ్రంథములో మనకు ముఖ్యముగా "నలుగురు వ్యక్తులు" కనబడతారు.
★ రాజైన అహష్వేరోషు
★ హామాను
★ రాణి ఎస్తేరు
★ మొర్దకై.
★ రాజైన అహష్వేరోషు
★ హామాను
★ రాణి ఎస్తేరు
★ మొర్దకై.
అహష్వేరోషు
ఇతడు
హిందూదేశము (INDIA) మొదలుకొని
కూషు దేశము వరకు నూట ఇరువది సంస్థానములను ఏలుచూ రాజుగా తన బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించినవాడిగా
ఉన్నాడు. తన మొదటి భార్యయైన వష్తి రాజాజ్ఞకు ఎదురు తిరిగినందుకు ఆమె యెడల కోపము
తెచ్చుకుని తన సంస్థానములో ఉన్న ప్రధానుల మాట చొప్పున తన రాజ్యములో పురుషుల మేలునుద్దేశించి రాణియైన వష్తిని తిరస్కరించి జనుల
కోరిక మేరకు వేరొక స్త్రీని వివాహమాడి ఆమె రాజు యెడల తనను తానూ తగ్గించుకునే విధము
చూసి ఆమెని ఘనపరిచినవాడిగా ఉన్నాడని ఎస్తేరు పుస్తకములో చూడగలము.
● అహష్వేరోషు దినములలో
జరిగిన చర్యల వివరము; హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువది యేడు
సంస్థానములను అహష్వేరోషు ఏలెను. – (ఎస్తేరు. 1:1).
● ప్రతి పురుషుడు తన యింటిలో
అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాష ననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు
ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష
ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. – (ఎస్తేరు. 1:22).
● రాజైన అహష్వేరోషు
రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెల విచ్చెనుహామాను ఇంటిని ఎస్తేరున
కిచ్చియున్నాను; అతడు యూదులను హతముచేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికొయ్యమీద
ఉరితీయబడెను. – (ఎస్తేరు. 8:7).
NOTE : రాజైన అహష్వేరోషు
రాజ్యములో ఉన్న ప్రజలందరి యెడల మేలు చేయుచూ తన భార్యయైన ఎస్తేరునకు ఇచ్చిన మాట
చొప్పున చివరి వరకు యూదులకు ఎటువంటి హాని చేయలేదు.
హామాను
ఇతడు హమ్మోదాతా కుమారుడైన అగాగీయుడు. రాజైన అహష్వేరోషు చేత ఘనపరచబడినవాడై, వాని పీఠమును తన
దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నియమింపబడెను.
● ఈ సంగతులైన తరువాత రాజైన
అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను. – (ఎస్తేరు. 3:1).
హామాను యొక్క స్థానమును
బట్టి రాజాజ్ఞానుసారముగా అందరు మోకాల్లూని హామానును నమస్కరించిరిగాని మొర్దకై
నమస్కరించలేదని చూచి, అతని జనులు యూదులని
తెలుసుకొని వీరు రాజాజ్ఞను గైకొనువారు కారని తలంచి మొర్దకైని, యూదులందరిని చంపనుద్దేశించెను.
● కాబట్టి రాజు గుమ్మముననున్న
రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకైవంగకయు నమస్కారము చేయకయు నుండగా,.. – (ఎస్తేరు. 3:3).
మొర్దెకై ప్రాణము మాత్రము
తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దెకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు
ఆలోచించెను. – (ఎస్తేరు. 3:6).
రాజునకు తెలియకుండా
కపటముతో యూదులను చంపనుద్దేశించుయున్నాడని రాజునకు తెలిసి మొర్దకై స్థానములో
ఉరితీయబడ్డాడు.
● హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన
ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము
చల్లారెను. – (ఎస్తేరు. 7:10).
NOTE : ఇతనాలోచనా విధము
చూడగా గర్విష్టి అని చాల తేటగా తెలియబడుచున్నది అంతేగాకా రాజునకు లోబడనివాడిగా
ఉన్నాడు కనుకనే రాజాజ్ఞ చొప్పున ఉరి తీయబడ్డాడు.
ఎస్తేరు
ఈ పుస్తకము యొక్క
పేరు ఎస్తేరు అని పెట్టబడినది అంటే ఈమె ఎంత కీలకమైనదో మనకు అర్థమవుతుంది. హదస్సా
అను ఈ ఎస్తేరు సుందర ముఖము గలదై, తన తలితండ్రులు మరణము పొందిన తరువాత తనకు బంధువైన
మొర్దకై యెద్ద పెరిగి, లోబడుతూ, ఆయనకు కుమార్తెగా స్వీకరించబడెను.
● తన పినతండ్రి కుమార్తెయైన
హదస్సా అను ఎస్తేరు తలితండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము
పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. – (ఎస్తేరు. 2:7).
రాజైన అహష్వేరోషు
రాణియైన వష్తిని విడనాడిన తరువాత రాణిగా ఉండుటకు రాజాజ్ఞ చొప్పున కన్యకలు అనేకులు
హేగే వశమునకు అప్పగింపబడినప్పుడు ఈమె కూడా వారిలో ఒకతై ఉండి రాజనగరుకు తేబడి,
అక్కడున్న కన్యకలందరికంటే ఎక్కువగా రాజువలన దయాదాక్షిణ్యములు పొంది రాణిగా
నియమింపబడెను.
● స్త్రీలందరికంటె రాజు
ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను. – (ఎస్తేరు. 2:17).
తనను పెంచిన మొర్దకై
మాటకు లోబడి తన ప్రజలైన యూదులందరి నిమిత్తము తన పనికత్తెలతో సహా ఉపవాసముండి
దైర్యము తెచ్చుకుని రాజునొద్దకు ప్రవేశించి, రాజును విందుకు పిలిచి, రాజు వలన
దయపొంది, తన ప్రజలను కాపాడుకొనెను.
● అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో
మరల ఇట్లనెను. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా
నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.
– (ఎస్తేరు. 4:15-16).
● ఎస్తేరు రాజునకు యుక్తముగా
తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని
కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. – (ఎస్తేరు. 5:4).
● అప్పుడు రాణియైన ఎస్తేరు
ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజా, నీ దృష్టికి నేను దయపొందిన దాననైన యెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నాకనుగ్రహింపబడుదురు గాక. సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసు
రాండ్రముగాను అమ్మబడిన యెడల నేను మౌనముగా నుందును. – (ఎస్తేరు. 7:3-4).
● రాజైన అహ ష్వేరోషు రాణియైన
ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెలవిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను. – (ఎస్తేరు. 8:7).
NOTE : ఎస్తేరు
జీవితమును చూడగా ఒక స్త్రీ ఏ విధముగా జీవించాలి, తన స్వపురుషుల యెద్ద ఎలా
తగ్గించుకోవాలో చాలా చక్కగా తెలియుచున్నది మరియు రాజు మీద న్యాయకత్వము చేసినట్టుగా
లేదు.
★ స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను వారు లోబడియుండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవులేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. – (1 కొరింధి.
14:34).
● సాయంత్రమందు ఆమె లోపలికి
వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ
అంతః పురమునకు తిరిగివచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనే
గాని ఆమె రాజునొద్దకు మరల వెళ్లకుండెను. – (ఎస్తేరు. 2:14).
అంతే కాక స్త్రీలు
అలంకరణ విషయములో తగుమాత్రపుగానే ధరించుకోవాలని ఆమె జీవితములో కనపరిచింది. కాబట్టి
క్రైస్తవ స్త్రీ అయిన నీవు ఏ విధముగా అలంకరించుకొనుచున్నావో ఆలోచన చేయు.
● స్త్రీలను కాయు రాజుయొక్క
షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను. – (ఎస్తేరు. 2:15).
మొర్దకై
ఇతడు యాయీరు
వంశస్థుడైన యూదుడు, ఇతని తండ్రి బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ.
● షూషను కోటలో బెన్యామీనీయుడగు
కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. –
(ఎస్తేరు. 2:5).
తన పినతండ్రి
కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరును కుమార్తెగా స్వీకరించి, ఆమె రాజనగరుకు
కొనుపోబడిన తరువాత ఆమె ఏలాగుండెనో, ఆమెకి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు అంతఃపురము యొక్క
ఆవరణము ఎదుట ప్రతిదినము తిరుగులాడు విధానము చూడగా ఎస్తేరు యెడల ప్రేమ
కలిగియున్నాడని తెలియుచున్నది.
● ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము
మొర్దెకై తిరుగులాడు చుండెను. – (ఎస్తేరు. 2:11).
రాజుయొక్క ఇద్దరు
షoడులైన ద్వారపాలకులు రాజును చంపాలని ఆలోచించుకొనుచుండగా విని ఆ విషయమును తన
కుమార్తెయైన ఎస్తేరునకు తెలియజేసి రాజును కాపాడెను.
● ఆ దినములలో మొర్దెకై
రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు
కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలో చించుకొని యుండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడి నందున అతడు దానిని రాణియైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకైయొక్క పేరట రాజునకు దాని తెలియ జేసెను. ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజ మాయెను. అందుచేత వారిద్దరును
ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను. – (ఎస్తేరు. 5:13-14).
తన ప్రజలైన యూదులను
చంపుటకు రాజు ఆజ్ఞ ఇచ్చియున్నాడని బహు
బాధపడి, రాణియగు తన కుమార్తెయైన ఎస్తేరునకు ఆ విషయమును తెలియజేసి వారిని
రక్షించుకొనుటకే నీవు రాజ్యమునకు వచ్చితివేమో, నీవు మాత్రమె మన ప్రజలను కాపాడగలవని
ఆమెను హెచ్చరించి తన ప్రజలను మరణము నుండి తప్పించెను.
● మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు
ప్రత్యుత్తరమిచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని
నీ మనస్సులొతలంచుకొనవద్దు; నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు
సహా యమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును
నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. – (ఎస్తేరు. 4:13-14).
రాజువలన
దయపొందినవాడై హామాను ఇంటిమీద అధికారిగా నిమింపబడ్డాడు.
● రాజు హామాను చేతిలోనుండి
తీసికొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను
ఇంటిమీద అధికారిగా ఉంచెను. – (ఎస్తేరు. 8:2).
NOTE : మొర్దకై విషయమును
గూర్చి ఆలోచన చేస్తే ఇతడు యాదార్ధముగా నడుచుకొని తన ప్రజలైన యూదులని
రక్షించుకున్నాడు రాజు చేత ఘనపరచబడ్డాడు. (ఎస్తేరు. 9, 10 అద్యాయములు.)
కాబాట్టి
ప్రియులారా, మన జీవితము ఏ విధముగా ఉన్నది, మన చుట్టూ ఉండే వారు రక్షింపబడాలని
కోరుకుంటున్నామా?, ఎస్తేరు వలె దైర్యము తెచ్చుకుని ముందుకు కొనసాగుతున్నామా?,
మొర్దకై వలె ప్రజల నిమిత్తము ఆలోచన కలిగి యున్నామా? ఆలోచన చేయుము.
ఈ ఎస్తేరు పుస్తకములో
యెహోవా అను పదము కానీ, దేవుడు అను పదము కానీ, ఆయన ఎవరితోనూ సంభాషణ చేసినట్టుగా
కాని, తన దూతల ద్వారా మాటలాడినట్టుగా చూడలేము కాని అన్య దేశములో ఉన్న తన ప్రజలను ఏ
విధముగా కాపాడుకున్నాడో ఆలోచన చేస్తే, మనము ఎక్కడున్నా ఎటువంటి స్థితిలో ఉన్నా
దేవుడు విడిచిపెట్టడని మన యెడల ఆయన చేసిన నిబంధనను
నేరవేర్చుతాడని తెలుసుకున్న యెడల మనకు ఓటమి అనేది ఉండదని దైర్యముగా ముందుకు
కొనసాగాగలము.
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
నవీన మనోహర్.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com
Note: Only a member of this blog may post a comment.