"పరలోకములో వాయిద్యములు?" (Instruments in Heaven?)

పరలోకములో వాయిద్యములు?


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి క్రైస్తవులమైన మనము వాయిద్యములు ఉపయోగించవచ్చా? ఈ  విషయమై పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేసి, క్రైస్తవులు వాయిద్యములు ఉపయోగించకూడదని ఇంతకు మునుపు వ్రాయబడిన  “పాత నిబంధనలో వాయిద్యములు”, “క్రొత్త నిబంధనలో వాయిద్యములు” అనే అంశముల ద్వారా తెలుసుకున్నాము. అయితే మనలో కొంతమంది సహోదరులు పై అంశములలో తెలిజేయబడిన వాటిని  అంగీకరించినప్పటికి, ప్రకటన గ్రంథములో తెలుపబడిన వచనములను (ప్రకటన. 5:8, 14:2, 15:2) ఆధారము చేసుకొని పరలోకములో వాయిద్యములున్నవని తలంచి ఆరాధనలో వాయిద్యములు ఉపయోగించవచ్చని అనుకొనుచున్నారు.

★ మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. – (ప్రకటన. 14:2).

★ మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై, ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని. – (ప్రకటన. 15:2).

పైన చూపబడిన రెండు వచనములలో “వీణెలు” అనే పదము ఉన్నది కనుక పరలోకములో వాయిద్యములో వాయిస్తున్నారని తప్పుగా అర్థము చేసికొనుచు పై వచనములను వక్రీకరణ చేయుచున్నారు.
పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకములలో ఒకటైన ప్రకటన గ్రంథము అనేకమైన దర్శనములతో నింపబడినది.

1) ఈ గ్రంథమును అపోస్తులుడైన యోహాను గారు రోమా చక్రవర్తి డొమి షియన్ కాలములో క్రీ.శ. 81 – 96 మధ్య  పరిశుద్ధాత్ముని ప్రేరణతో వ్రాయడము జరిగింది.

2) యోహాను గారు ఈ గ్రంథమును ఆత్మవశుడై (“అనగా దేవుని వశములో ఆత్మ మాత్రమే సంచారము చేయుట”) దేవుడు తనకు కనపరిచిన సంగతులను గురుతుల, సంఖ్యల భాషలలో వ్రాయడము జరిగినది.

3) పైన వచనములలో (ప్రకటన. 14:2, 15:2) తనకు చూపబడిన సంగతులను వివరిస్తూ, తాను  పరలోకములో నుండి ఒక శబ్దము రాగా విన్నారని, వినసొంపుగా ఉన్న ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినదని చెప్పుచున్నారు. ఇక్కడ గమనించాల్సినిది ఏమిటంటే యోహాను గారు విన్న వినసొంపైన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదము కాదు ఎందుకనగా ఆయన “పోలినది” అని మాత్రమే అన్నారు కాని విమోచింపబడిన వారు వాయిద్యములను వాయిస్తున్నట్టుగా తెలుపలేదు.

4) కాబట్టి, పరలోకములో భౌతిక సంబంధమైన వీణెలు వాయించుచున్నారని, ఇహలోక సంబంధమైన వాయిద్యములు పరలోకములో కలవని ఆ వచనములు యొక్క అర్థము కాదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు (1 కొరింధి. 15:50) కనుక భౌతికమైన వీణెలు పరలోకములో ఉండుట వీలుపడదు.

5) ప్రియ సహోదరులారా, “దేవుని వీణెలు గలవారై” (ప్రకటన. 15:2) అనగా దేవుని సేవార్థమైన వీణెలు. ప్రకటన 14:2 వ వచనములో విస్తారమైన జలముల  ధ్వనివలె లయబద్ధంగాను మరియు గొప్ప ఉరుము ధ్వనివలె గంభీరంగాను వీణెలు వాయించుచున్న వైణికుల నాదమువలె యోహాను గారు విన్న శబ్దము వివరణ అదేమనగా పరిశుద్ధుల యొక్క మధుర గీతములే.

6) దేవుని సేవార్థమైన వీణెలు హృదయ వీణెలై ఉండాలి. ఎఫెసీ. 5:19, కొలస్సి. 3:16 లో గానము లేదా పాటలు అనే దానికి  గ్రీకు పదము “paasllo”. వీణెలు అనే పదము ప్రకటన గ్రంథములో 2 సార్లు చిహ్నముగా వ్రాయబడినది. దీనికి అర్థము ఈ వీణెలు హృదయ వీణెలే కాని, జంత్ర (వాయిద్యము) వీణెలు కాదు.

★ ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలును, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱె పిల్ల యెదుట సాగిలపడిరి. – (ప్రకటన. 5:8).

పై వచనములలో (ప్రకటన. 14:2, 15:2)  తెలుపబడిన ఈ వీణెలు వాయిద్యములు కాదని ఇంత చక్కగా తేటపరచబడినప్పటికి ప్రకటన. 5:8 వ వచనమును బట్టి పరలోకములో వీణెలు కలవని, అక్కడ వాయిస్తున్నారు కదా  నేటి క్రైస్తవులమైన మేము కూడా  ఆరాధనలో వాయిద్యములు  వాయించవచ్చు అని నీవు అనుకుంటే నీవు చేయు ఆరాధనలో “నాలుగు జీవులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును” కూడా ఉపయోగించవలసి ఉన్నదని గమనించగలరు.

కావున ప్రియ సహోదరీ, సహోదరుడా వాక్యాన్ని వక్రీకరణ చేయు భిన్న బోధల నుండి తొలగి, సత్య వాక్యమును సరిగ్గా విభజన చేయు అపోస్తులుల బోధలో నిలకడగా ఉండి, మన తండ్రియైన దేవుని సత్యముగా మరియు యదార్ధముగా ఆరాధించాలని  ప్రేమతో మనవి చేయుచున్నాను. 

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16