![]() |
దేవునికి యివ్వవలసినవి |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసు
క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ఈనాడు లోకములో క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకమంది దేవుడు మాకు
ఉద్యోగము ఇవ్వాలి, మంచి ఇంటిని కట్టుకునే స్థోమతనివ్వాలి, పిల్లల్ని దయచేయాలి ఇలా
పలురకాలుగా దేవుని నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు కాని దేవుడు మన నుండి ఏమి
ఆశిస్తున్నాడో గ్రహించలేని స్థితిలో ఉండి తాము దేవునికి దగ్గరగా ఉన్నామని
చెప్పుకుంటున్నారు కాని వారి జీవితములు దేవునికి అయిష్టముగా ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు.
దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? అని మనల్ని మనము ప్రశ్నించుకుని
గ్రంథమును చూసినట్లయితే గ్రంథము మూడు విషయములను సెలవిస్తుంది.
∆ "హృదయము"
∆ "సమయము"
∆ "రాబడిలో భాగము"
హృదయము
» నా కుమారుడా,
నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము.
- (సామెతలు. 23:26).
మానవుని జీవితములో లేక శరీరములో హృదయము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనగా
మన ఆలోచనలు మన తలంపులు అన్ని హృదయములో పుట్టి మన నోటి ద్వారా బయటకి వస్తాయి మరియు మనము
చేసిన పనులకు అవి మంచివైనా చెడ్డవైనా సరే మనము చేసే సమస్తమునకు మన హృదయమే సాక్షిగా
ఉన్నది కనుక హృదయము చాల ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా మన బయట అలకారణను బట్టి కాదు
కాని హృదయాలోచనలను బట్టి మనకి తీర్పు తీర్చబడును కనుక దేవుడు మన హృదయమును
కోరుకుంటున్నాడు.
● లోపటనుండి, అనగా
మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును
మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నియ లోపటనుండియే
బయలు వెళ్లి మనుష్యుని అపవిత్ర పరచును (మార్కు. 7:21-23)
● దేవుని
పూర్ణ హృదయముతో ప్రేమించాలి, ఆరాధించాలి.
● దేవుడు మాత్రమే హృదయమును పరిశోధించువాడు కనుక హృదయము
దేవునికివ్వాలి.
● దేవుని యెద్ద నుండి ఆశీర్వాదములు మరియు ఆయన
స్వాస్థ్యములో పాలు పొందాలంటే మన హృదయము దేవునికివ్వాలి.
● మన పెదవులతో దేవుని ఘనపరిచినా మన హృదయము దేవునికి
దూరముగా ఉన్న యెడల మనము ఆయనను వ్యర్థముగా ఆరాధించినట్టే కాబట్టి హృదయముతో దేవుని
ఆరాధించి హృదయము దేవునికివ్వాలి.
» దేవుని వలన కలుగు జీవములోనుండి వేరు పరచకూడదంటే హృదయము దేవునికివ్వాలి.
● దేవుని వాక్యము హృదయము యొక్క తలంపులను శోధించును
కనుక హృదయము దేవునికివ్వాలి.
కనుక మన హృదయము
ఆయనకు దగ్గరగా ఉండి చెడ్డవాటికి దూరముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.
» నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు,..
- (లూకా. 10:27).
» హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల
ఫలము చొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను,... –
(యిర్మియా. 17:9-10).
» నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు
నీకు పాలుపంపులు లేవు.
– (అపో. కార్య. 8:21).
» ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము
నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను
వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో
చెప్పి,.. – (మత్తయి. 15:9).
» దేవుని వలన కలుగు జీవములోనుండి వేరు పరచకూడదంటే హృదయము దేవునికివ్వాలి.
వారైతే అంధమైన మనస్సుగలవారై, తమ హృదయకాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత
దేవుని వలన కలుగు జీవములోనుండి వేరు పరచబడినవారై, తమ మనస్సుకు
కలిగిన మాయను అనుసరించి నడుచుకొనుచున్నారు. – (ఎఫెసీ. 4:18).
» ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల
యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి,
ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. – (హెబ్రీ. 4:12).
కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరీ నీ హృదయము
దేవునికి దూరముగా ఉన్న యెడల ఈ క్షణమే మార్పునొంది నూతన హృదయము కావాలని నీవు
కోరుకున్న యెడల నూతన స్వభావము ఇచ్చుటకు నూతన హృదయము ఇచ్చుటకు దేవుడు సిద్ధముగా
ఉన్నాడు.
» మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము
చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను,
రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను
నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. – (యెహెజ్కేలు. 36:25-27).
సమయము
దేవునికి మనము ఇవ్వవలసినది మరియు దేవుడు మననుండి
కోరుకున్న వాటిలో రెండవ ప్రాముఖ్యమైనది సమయము.
నిత్యమూ సాగే మన ఈ జీవనములో పొట్ట కూటి కొరకు, మంచి నివాసము కొరకు, ధనము
సంపాదించుకొనుటకు ఇలా భౌతిక సంబంధమైన వాటి కొరకే మన సమయమును ఎక్కువుగా ఖర్చు
పెడుతున్నాము కాని ఆత్మ సంబంధమైన జీవితము కొరకు నిత్య జీవితము కొరకు సమయమును
కేటాయించలేని స్థితిలో ఈనాటి క్రైస్తవులున్నారు. మనమెందుకు ఎక్కువ సమయము దేవునిలో
గడపాలి ఎందుకు దేవునికి సమయమివ్వాలి అనే ప్రశ్నలకు గ్రంథము ఈ విధముగా సమాధానము
తెలియజేస్తుంది.
» దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియ్యక ఉపయోగము
చేసికొనుచు, అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. – (ఎఫెసీ.
5:15).
» కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెననిఆలోచింతుము.
– (హెబ్రీ. 10:24).
» నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక
సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు.
మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు
ఆవిరి(వంటివారే ) కారా. మీరాలాగనక - ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది
అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు.
ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయ
నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును. – (యాకోబు. 4:13).
» తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు,
పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా
తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. – (ప్రసంగి.
9:12).
» దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము
లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే
నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. – (ప్రసంగి.
12:1-2).
కాబట్టి సహోదరులారా కాలములు సమయములు తండ్రి తన
స్వాదీనమందు ఉంచుకున్నాడు కనుక ఏ సమయములో ఏమి జరుగునో మనకు తెలియదు కనుక
దేవుడిచ్చిన ఇటువంటి గొప్ప అవకాశమును దుర్వునియోగ పరుచుకోకుండా ఆయన సన్నిధిలో
నిత్యమూ గడిపి ఆయన ఘనపరిచి ఆయన కార్యములకు సమయమును ఇస్తే తప్పకుండా మన జీవితములో
మేలులను పొందుకోగలము.
» కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు.
– (అపో.కార్య. 1:7).
రాబడిలో భాగము
క్రైస్తవుడు దేవునికిచ్చె వాటిలో అన్నిటికంటే అతి
ప్రాముఖ్యమైనది కానుక లేదా మన రాబడిలో భాగము.
ప్రియ సహోదరులారా చాలామందికి ఈ విషయముపై సరియైన
అవగాహన లేక కానుకలు మనుష్యులకిస్తున్నాము అనే భావనలో ఉండి దేవునికివ్వవలసినది
దేవునికివ్వకుండా తమను తామే నస్టపరచుకుంటున్నారు.
మొదట మనమందరమూ గ్రహించాల్సిన విషయము ఏమిటంటే,
మనము ఈ లోకములో కానుకలు లేక బహుమతులు ఎవరికిస్తాము?. మనకిష్టమైన వాళ్లకి, మన
సన్నిహితులకు, మనకు సహాయము చేసిన వారికి కృతజ్ఞతా భావము కలిగి కానుకలు లేక
బహుమతులు ఇచ్చి మన ప్రేమను వారి యెడల వ్యక్తపరుస్తుంటాము.
అలాగే క్రైస్తవులైన మనము దేవుని యెడల ఎంత ప్రేమ
కలిగియున్నామో తెలుసుకొనుటకు, ఆయన యెడల మనము కృతజ్ఞతా భావము కలిగి యున్నామో లేదో
పరీక్షించుటకు, ఆయన ఎన్నుకున్న మార్గమే ఈ కానుకలు లేదా రాబడిలో భాగము.
● ఇయ్యుడి,
అప్పుడు మీకియ్యబడును. – (లూకా. 6:38).
● బీదల పోషణ కొరకు కానుకలివ్వాలి.
● ఆయన మందిరములో ఆహారముండునట్లు కానుకలివ్వాలి.
● దీవెనలు కావాలంటే కానుకలివ్వాలి.
● మనము అన్నిటియందు ఎల్లప్పుడు సర్వ సమృద్ధి
కలవారమై ఉత్తమమైన ప్రతీ కార్యము చేయుటకు దేవుడు తన కృపను మన యెడల విస్తరింపజేయాలంటే కానుకలివ్వాలి.
» బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేనునీ దేశములోనున్న నీ సహోదరులగు
దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. – (ద్వితియో.
15:11).
» నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా
మందిరపు నిధిలోనికి తీసికొనిరండి. – (మలాకీ. 3:10).
» దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను
విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా
సెలవిచ్చు చున్నాడు. – (మలాకీ. 3:10).
» కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా
ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాని జమచేయుటకై
వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకొయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. సణుగుకొనకను బలవంతముగా కాకను ప్రతివాడును
తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా
ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో
మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్తవిధములైన
కృపను విస్తరింపచేయగలడు. – (2 కొరింధి. 9:5-9).
మన దేవుడు మన నుండి కానుకలు కోరుకొనుటకు ఆయన
ఏమియు లేని వాడు కాడు కాని మన విశ్వాసమును పరీక్షించుటకు ఆయన మనయెద్ద నుండి
కానుకలు కోరుకుంటున్నాడని గ్రహించుకోవాలి.
» యెహోవా,
భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును
పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా,
రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా
హెచ్చించుకొని యున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును,
నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ
దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.
– (1దినవృత్తా. 29:11-12).
అయితే ఒక్క విషయము గుర్తు పెట్టుకోవాలి, మనము
దేవునికి ప్రేమతో యిచ్చిన కానుకలు ఆశీర్వాదముగా తిరిగి మనయొద్దకే వస్తాయని
గ్రహించి ఆయనకు కానుకలిచ్చే విషయములో వెనుకడుగు వేయకూడదు.
నా ప్రియులారా దేవుని నుండి విస్తారమైన
ఆశీర్వాదములు పొందుకుంటున్న మనము తిరిగి కృతజ్ఞతగా దేవునికి ఏమి ఇస్తున్నాము అని
ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది.
దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? మన హృదయము,
సమయము, రాబడిలో భాగము ఇవి యివ్వలేనంత కష్టతరమైనవి కాదు కనుక ఈ క్షణమే మార్పునొంది ఆయనకివ్వవలసిన మూడు
విషయములలో జాగ్రత్త కలిగి ఆయన మననుండి ఏమి కోరుకుంటున్నాడో అవి యిచ్చిన యెడల ఆయన
బహుగా సంతోషపడి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు క్రుమ్మరిస్తాడని నమ్మి ఆయనను
మహిమ పరచాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.
2 comments
commentsNice brother
ReplyChala bhaga chepparu sir praise the Lord sir
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com