Showing posts with label హృదయము. Show all posts
Showing posts with label హృదయము. Show all posts

"ఆత్మీయ ఎదుగుదల" (Spiritual Growth)

ఆత్మీయ ఎదుగుదల


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రియులారా, బాప్తీస్మము పొందిన మనమందరమూ ఆత్మీయంగా బలపడి, క్రీస్తు స్వారూప్యములోనికి అనగా ఆయనలాంటి వ్యక్తిత్వమును కలిగి ఈ లోకములో భౌతికమైన మరణము పొందువరకు నమ్మకముగా జీవిస్తేనే తండ్రియొద్దకు చేరుకోగలమని మనకందరికీ బాగుగా తెలియును. ఈ లోకములో ఉంటున్న మనము ఆత్మీయ విషయములో అనేక విధాలుగా శోధింపబడుతుంటాము. అలా శోధింపబడినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మనిని దుఃఖపరచకుండా పరిశుద్ధ గ్రంథములోని లేఖనానుసారముగా కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే ఖచ్చితముగా మన ఆత్మను రక్షించుకోగలము, అపవాదిని జయించగలము.


మొదటి దశ : హృదయమును సిద్ధం చేసుకోవాలి 


ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలంటే హృదయము చాలా ప్రాముఖ్యమైనదని మొదట గ్రహించాలి. హృదయములోని తలంపులను బట్టే మన జీవితము ఆధారపడి ఉంటుంది. మన మనస్సు సరిగ్గా లేకపోతే మనం చేసే ప్రతి పనిలోనూ విఫలమవుతూ ఉంటాము  కాబట్టి మన హృదయములో ప్రభువును ప్రతిష్టించుకుని, ఆయన ఆలోచనలవైపు మనస్సును మలచుకోగలిగితే ఆత్మీయంగా బలపరచబడగలము.

» మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. – (1 పేతురు. 3:15).

» నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు,... – (మత్తయి. 22:37-40, మార్కు. 12:30-31, లూకా. 10:27).

» నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. – (సామెతలు. 4:23).

» నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. – (సామెతలు. 23:19).

» నీవు జాగ్రత్తపడుము నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. – (ద్వితియో. 4:9).

» హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? – (యిర్మియా. 17:9).

» సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. – (హెబ్రీ. 3:12).


రెండవ దశ : దేవుని నియమాలను వెతకాలి 


ప్రియులారా, భౌతిక సంబంధమైన జీవితములో ఏదైనా ఒక క్రొత్త పనిలో చేరితే ఆ పనికి సంబంధించిన విషయములన్ని తెలుసుకుని ఆ పనిని మొదలుపెడతాము అంతేకాకుండా పనిలో భాగముగా అనేకమైన క్రొత్త క్రొత్త విషయములను తెలుసుకుంటూ మనం చేసే పనిలో అభివృద్ధి చెందుతాము. అలాగే  ఆత్మీయ జీవితములో అభివృద్ధి చెందాలంటే దేవుడు మనకు దయచేసిన పరిశుద్ధ గ్రంథములోని మాటలను దిన దినము అభ్యాసము చేస్తూ ఆయన నియమాలను వెతకాలి.

» నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. – (కీర్తన. 119:10-12).

» బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. – (కీర్తన. 119:127).

» ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి. – (మత్తయి. 6:33).

» దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. – (2 తిమోతి. 2:15).

» క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దాని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. – (యోహాను. 6:27).

» నీ (యెహోవా) మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. – (యిర్మియా. 15:16).

» ఈ జీవిత కాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరికంటె దౌర్భాగ్యులమై యుందుము. – (1 కొరింధి. 15:19).


మూడవ దశ : దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి


ప్రియులారా క్రైస్తవులమైన మనము దేవుని నియమాలను తెలుసుకుంటే సరిపోదు ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని వెతికి తెలుసుకున్నంత మాత్రము మన ఆత్మ రక్షింపబడుతుందంటే పొరబడినట్లే,.. మనము తెలుసుకున్న వాటిని ఆచరించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే మన ఆత్మను రక్షించుకోగలము.

» సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా? అయితే స్వాతంత్ర్యము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడవును. – (యాకోబు. 1:21-25).

» నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?. – (లూకా. 6:46).

» ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. – (మత్తయి. 7:21). 

» మీరు సంపూర్ణులును, ప్రతివిషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని,... – (కొలస్సి. 4:12).

» తండ్రినైనను తల్లినైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. – (మత్తయి. 10:37-39).

» కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, (యింటివలె) కట్టబడుచు, మీరు నేర్చుకొనినప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. – (కొలస్సి. 2:6-7).


నాల్గవ దశ : సత్యమును ప్రకటన చేయాలి 


క్రీస్తు శరీరములోనికి బాప్తీస్మము పొంది, మన హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుకుని, ఆయన నియమాలను వెతికి, ఆజ్ఞలను పాటించి, సత్యమందు అనగా “అపోస్తులుల బోధ”యందు నిలకడగా ఉంటే మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. అయితే మనము నేర్చుకున్న సత్యమును ఉన్నది ఉన్నట్టుగానే ఇతరులకు ప్రకటన చేయుట వలన లేదా సహోదరులతో సంభాషించగలిగితే మన ఆత్మ మరింత ఎక్కువగా బలపడుతుంది కాబట్టి ఇతరులకు ప్రకటన చేసే అవకాశమును ఎంత మాత్రమును వదిలిపెట్టక దేవుని చిత్తములో కొనసాగాలి. విశ్వాసులకు మాదిరిగా జీవించాలి.

» మీరు వెళ్లి సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. – (మార్కు. 16:15).

» నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ ప్రవర్తనమీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. – (1 పేతురు. 3:15-16).

» నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. – (2 తిమోతి. 2:2).

» మీరు యేసునుగూర్చి విని ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైనయెడల మీరాలాగు క్రీస్తును (గూర్చి) నేరుచుకొన్నవారుకారు. – (ఎఫెసీ. 4:20-21).

» వీటినిగూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో (దుర్భోధను) ఖండించుచునుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము. – (తీతుకు. 2:15).

» మేము సత్యమునకు వ్యతిరేకముగా ఏమియు చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. – (2 కొరింధి. 13:8).

» ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదుము. – (ఎఫెసీ. 4:15).

» ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండ వలెనని యిచ్ఛయించుచున్నాడు. – (1 తిమోతి. 2:4).

ప్రియ సహోదరుడా, సహోదరీ పాపపు జీవితమును విడిచి క్రీస్తునందు నూతనంగా జన్మించిన మనము ఒక్కసారే అన్ని విషయములలో మార్పు చెందడం కష్టము కనుక క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నెమ్మది నెమ్మదిగా వాక్యమనే పాలను ఆపేక్షిస్తూ, బుద్ధి పూర్వకముగా పాపము చేయక, తెలియక అవిశ్వాసము వలన చేయు లోపాలను సరి చేసుకుంటూ మనలో ఉన్న ఆత్మను బలపరచుకోవాలి.

» ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణవిషయములో ఎదుగునిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. – (1 పేతురు. 2:1-3).


» మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. – (రోమా. 12:2).


పైన తెలుపబడిన సంగతులను ఆలోచన చేసి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది (ఎఫెసీ. 4:11), మన అంతర్యపురుషుడు ఆత్మీయంగా ఎదుగుటకు దిన దినము నూతనపరచబడాలని  (2 కొరింధి. 4:14) నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"దేవునికి యివ్వవలసినవి" (God wants)

దేవునికి యివ్వవలసినవి


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాడు లోకములో క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకమంది దేవుడు మాకు ఉద్యోగము ఇవ్వాలి, మంచి ఇంటిని కట్టుకునే స్థోమతనివ్వాలి, పిల్లల్ని దయచేయాలి ఇలా పలురకాలుగా దేవుని నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు కాని దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో గ్రహించలేని స్థితిలో ఉండి తాము దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కాని వారి జీవితములు దేవునికి అయిష్టముగా ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు.

దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? అని మనల్ని మనము ప్రశ్నించుకుని గ్రంథమును చూసినట్లయితే గ్రంథము మూడు విషయములను సెలవిస్తుంది.

∆ "హృదయము"
∆ "సమయము"     
∆ "రాబడిలో భాగము"

హృదయము


» నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. - (సామెతలు. 23:26).

మానవుని జీవితములో లేక శరీరములో హృదయము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనగా మన ఆలోచనలు మన తలంపులు అన్ని హృదయములో పుట్టి మన నోటి ద్వారా బయటకి వస్తాయి మరియు మనము చేసిన పనులకు అవి మంచివైనా చెడ్డవైనా సరే మనము చేసే సమస్తమునకు మన హృదయమే సాక్షిగా ఉన్నది కనుక హృదయము చాల ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా మన బయట అలకారణను బట్టి కాదు కాని హృదయాలోచనలను బట్టి మనకి తీర్పు తీర్చబడును కనుక దేవుడు మన హృదయమును కోరుకుంటున్నాడు.


 ●  లోపటనుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నియ లోపటనుండియే బయలు వెళ్లి మనుష్యుని అపవిత్ర పరచును (మార్కు. 7:21-23) 
కనుక మన హృదయము ఆయనకు దగ్గరగా ఉండి చెడ్డవాటికి దూరముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.

 ●  దేవుని  పూర్ణ హృదయముతో ప్రేమించాలి, ఆరాధించాలి.      
     
» నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు,.. - (లూకా. 10:27).

  దేవుడు మాత్రమే హృదయమును పరిశోధించువాడు కనుక హృదయము దేవునికివ్వాలి.

» హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను,... – (యిర్మియా. 17:9-10).

   దేవుని యెద్ద నుండి ఆశీర్వాదములు మరియు ఆయన స్వాస్థ్యములో పాలు పొందాలంటే మన హృదయము దేవునికివ్వాలి.

» నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.(అపో. కార్య. 8:21).

   మన పెదవులతో దేవుని ఘనపరిచినా మన హృదయము దేవునికి దూరముగా ఉన్న యెడల మనము ఆయనను వ్యర్థముగా ఆరాధించినట్టే కాబట్టి హృదయముతో దేవుని ఆరాధించి హృదయము దేవునికివ్వాలి.

» ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి,.. – (మత్తయి. 15:9).

» దేవుని వలన కలుగు జీవములోనుండి వేరు పరచకూడదంటే హృదయము దేవునికివ్వాలి.
వారైతే అంధమైన మనస్సుగలవారై, తమ హృదయకాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములోనుండి వేరు పరచబడినవారై, తమ మనస్సుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకొనుచున్నారు. – (ఎఫెసీ. 4:18).

   దేవుని వాక్యము హృదయము యొక్క తలంపులను శోధించును కనుక హృదయము దేవునికివ్వాలి.


» ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. – (హెబ్రీ. 4:12).


కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరీ నీ హృదయము దేవునికి దూరముగా ఉన్న యెడల ఈ క్షణమే మార్పునొంది నూతన హృదయము కావాలని నీవు కోరుకున్న యెడల నూతన స్వభావము ఇచ్చుటకు నూతన హృదయము ఇచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు.

» మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. – (యెహెజ్కేలు. 36:25-27).


 సమయము

                                                  
దేవునికి మనము ఇవ్వవలసినది మరియు దేవుడు మననుండి కోరుకున్న వాటిలో రెండవ ప్రాముఖ్యమైనది సమయము.
నిత్యమూ సాగే మన ఈ జీవనములో  పొట్ట కూటి కొరకు, మంచి నివాసము కొరకు, ధనము సంపాదించుకొనుటకు ఇలా భౌతిక సంబంధమైన వాటి కొరకే మన సమయమును ఎక్కువుగా ఖర్చు పెడుతున్నాము కాని ఆత్మ సంబంధమైన జీవితము కొరకు నిత్య జీవితము కొరకు సమయమును కేటాయించలేని స్థితిలో ఈనాటి క్రైస్తవులున్నారు. మనమెందుకు ఎక్కువ సమయము దేవునిలో గడపాలి ఎందుకు దేవునికి సమయమివ్వాలి అనే ప్రశ్నలకు గ్రంథము ఈ విధముగా సమాధానము తెలియజేస్తుంది.

   ప్రస్తుతమున్న దినములు చెడ్డవి కనుక దేవునికి సమయమివ్వాలి.

» దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియ్యక ఉపయోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. – (ఎఫెసీ. 5:15).

   ప్రభు దినము సమీపముగా ఉన్నది కనుక దేవునికి సమయమును యివ్వాలి.

» కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెననిఆలోచింతుము. – (హెబ్రీ. 10:24).

   రేపేమి సంభవించునో తెలియదు కనుక సమయమును దేవునికివ్వాలి.

» నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి(వంటివారే ) కారా. మీరాలాగనక - ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును. – (యాకోబు. 4:13).

   తమ కాలము ఎప్పుడొచ్చునో నరులు ఎరుగరు కనుక సమయమును వృధా చేయకూడదు.

» తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.(ప్రసంగి. 9:12).

   దుర్దినములు రాకముందే దేవుని జ్ఞాపకము చేసుకోవాలి.

» దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.(ప్రసంగి. 12:1-2).

కాబట్టి సహోదరులారా కాలములు సమయములు తండ్రి తన స్వాదీనమందు ఉంచుకున్నాడు కనుక ఏ సమయములో ఏమి జరుగునో మనకు తెలియదు కనుక దేవుడిచ్చిన ఇటువంటి గొప్ప అవకాశమును దుర్వునియోగ పరుచుకోకుండా ఆయన సన్నిధిలో నిత్యమూ గడిపి ఆయన ఘనపరిచి ఆయన కార్యములకు సమయమును ఇస్తే తప్పకుండా మన జీవితములో మేలులను పొందుకోగలము.

» కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు. – (అపో.కార్య. 1:7).


రాబడిలో భాగము 


 క్రైస్తవుడు దేవునికిచ్చె వాటిలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది కానుక లేదా మన రాబడిలో భాగము.
ప్రియ సహోదరులారా చాలామందికి ఈ విషయముపై సరియైన అవగాహన లేక కానుకలు మనుష్యులకిస్తున్నాము అనే భావనలో ఉండి దేవునికివ్వవలసినది దేవునికివ్వకుండా తమను తామే నస్టపరచుకుంటున్నారు.

మొదట మనమందరమూ గ్రహించాల్సిన విషయము ఏమిటంటే, మనము ఈ లోకములో కానుకలు లేక బహుమతులు ఎవరికిస్తాము?. మనకిష్టమైన వాళ్లకి, మన సన్నిహితులకు, మనకు సహాయము చేసిన వారికి కృతజ్ఞతా భావము కలిగి కానుకలు లేక బహుమతులు ఇచ్చి మన ప్రేమను వారి యెడల వ్యక్తపరుస్తుంటాము.

అలాగే క్రైస్తవులైన మనము దేవుని యెడల ఎంత ప్రేమ కలిగియున్నామో తెలుసుకొనుటకు, ఆయన యెడల మనము కృతజ్ఞతా భావము కలిగి యున్నామో లేదో పరీక్షించుటకు, ఆయన ఎన్నుకున్న మార్గమే ఈ కానుకలు లేదా రాబడిలో భాగము.


   ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును. – (లూకా. 6:38).

   బీదల పోషణ కొరకు కానుకలివ్వాలి.

» బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేనునీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. – (ద్వితియో. 15:11).

   ఆయన మందిరములో ఆహారముండునట్లు కానుకలివ్వాలి.

» నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి. – (మలాకీ. 3:10).

   దీవెనలు కావాలంటే కానుకలివ్వాలి.

» దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. – (మలాకీ. 3:10).

   మనము అన్నిటియందు ఎల్లప్పుడు సర్వ సమృద్ధి కలవారమై ఉత్తమమైన ప్రతీ కార్యము చేయుటకు దేవుడు తన కృపను  మన యెడల విస్తరింపజేయాలంటే కానుకలివ్వాలి.


» కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకొయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. సణుగుకొనకను బలవంతముగా కాకను ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్తవిధములైన కృపను విస్తరింపచేయగలడు. – (2 కొరింధి. 9:5-9).

మన దేవుడు మన నుండి కానుకలు కోరుకొనుటకు ఆయన ఏమియు లేని వాడు కాడు కాని మన విశ్వాసమును పరీక్షించుటకు ఆయన మనయెద్ద నుండి కానుకలు కోరుకుంటున్నాడని గ్రహించుకోవాలి.

» యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. – (1దినవృత్తా. 29:11-12).

అయితే ఒక్క విషయము గుర్తు పెట్టుకోవాలి, మనము దేవునికి ప్రేమతో యిచ్చిన కానుకలు ఆశీర్వాదముగా తిరిగి మనయొద్దకే వస్తాయని గ్రహించి ఆయనకు కానుకలిచ్చే విషయములో వెనుకడుగు వేయకూడదు.
  
నా ప్రియులారా దేవుని నుండి విస్తారమైన ఆశీర్వాదములు పొందుకుంటున్న మనము తిరిగి కృతజ్ఞతగా దేవునికి ఏమి ఇస్తున్నాము అని ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది.

దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? మన హృదయము, సమయము, రాబడిలో భాగము ఇవి యివ్వలేనంత కష్టతరమైనవి కాదు కనుక  ఈ క్షణమే మార్పునొంది ఆయనకివ్వవలసిన మూడు విషయములలో జాగ్రత్త కలిగి ఆయన మననుండి ఏమి కోరుకుంటున్నాడో అవి యిచ్చిన యెడల ఆయన బహుగా సంతోషపడి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు క్రుమ్మరిస్తాడని నమ్మి ఆయనను మహిమ పరచాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.

The churches of Christ greet you - Roma 16:16