మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻
పరిచయం
నేటి క్రైస్తవ విశ్వాసంలో యేసుక్రీస్తు స్థానం గురించి మరియు క్రీస్తును గూర్చిన జ్ఞానవిషయంలో ఏకత్వం గురించి స్పష్టత లేకపోవడం వల్ల, ఈ రోజుల్లో అనేక మంది యేసును ఎలా గౌరవించాలి, ఎలా విశ్వసించాలి, ఎలా స్పందించాలి, ఎలా స్వీకరించాలి అనే విషయంలో గందరగోళంలో ఉన్నారు. ఇలా ఉండుట వలనే క్రైస్తవ్యములో భావోద్వేగాలు, మనుషుల సంప్రదాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు, లేఖనాన్ని మించి నిలబడుతున్న/బోధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి క్రైస్తవ విశ్వాసం మనుషుల ఆలోచనలపై/బోధలపై కాదు, ఆదిమ అపోస్తలుల బోధ మరియు క్రొత్త నిబంధన లేఖనంపైనే ఆధారపడి ఉంది. అందుకే “క్రైస్తవులు క్రీస్తును ఏమి చేస్తారు?” అనే ప్రశ్నకు సమాధానం భావాల ద్వారా కాదు, లేఖనాధారంగా తెలుసుకోవడం అత్యవసరం. ఈ అంశం యేసుక్రీస్తును తక్కువ చేయుటకు కాదు; ఆయనకు దేవుడు ఇచ్చిన నిజమైన స్థానం, పాత్ర, అధికారాన్ని అర్థం చేసుకొని, క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు ప్రత్యక్షలో(యెదుట) నిజమైన క్రైస్తవ జీవితం కలిగి ఎలా ఉండాలనేది మనలను ఆలోచింపజేయుటకే ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యం 🙏🏻
గత అంశముగా “క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు?” అనే విషయాన్ని చదివి ఉండకపోతే చదువగలరని మనవి.
1️⃣. క్రైస్తవులు క్రీస్తును సేవిస్తారు
"ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.౹" (యోహాను. 12:26)
”....నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.౹" (అపో.కార్య. 20:19)
".... ప్రభువును సేవించుడి.౹" (రోమా. 12:11)
"...మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.౹" (కోలస్సి. 3:23)
సేవ అంటే క్రీస్తు ఆజ్ఞలకు లోబడుట, ఆయన బోధను ఆచరించుట, ఆయనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయుట “మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొనుదురు.” (యోహాను. 14:15) యేసు సేవ చేయమని పిలిచాడు, సేవలో మాదిరిగా నిలిచాడు, సేవలో నమ్మకులైన వారిని తండ్రి ఘనపరుస్తాడు అని చెప్పెను కదా (యోహాను. 12:26; మత్తయి. 20:26-28)
🛑 ఆరాధన → దేవునికి (తండ్రికి)
🛑 సేవ → క్రీస్తుకు
2️⃣. క్రైస్తవులు క్రీస్తును వెంబడిస్తారు
"అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను." (మత్తయి. 16:24)
"నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹" (యోహాను. 10:27
"క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.౹" (1పేతురు. 2:21)
క్రీస్తును వెంబడించుట అంటే స్వీయ ఇష్టాలను వదిలివేయుట, విధేయత చూపుట, జీవితం మొత్తం ఆయన మార్గంలో నడుచుట/మాదిరి కలిగి ఉండుట.
🛑 వెంబడించుట = జీవన విధానం
🛑 వెంబడించుట = నిజమైన శిష్యత్వం
3️⃣. క్రైస్తవులు క్రీస్తును స్తుతిస్తారు
"మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.౹ వారు– వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.౹ అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును —సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.౹" (ప్రకటన. 5:11-13)
👉 యోహాను గారు దర్శనంలో యేసుకు స్తుతి అర్పించబడుతోంది కానీ ఆరాధన సింహాసనముపై కూర్చున్న దేవునికే చెందుతుంది.
"కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.౹" (హెబ్రీ. 13:15)
👉 ఇక్కడ స్తుతి యేసుద్వారా దేవునికే అర్పించబడుతుంది.
◾స్తుతి & స్తోత్రం = ఘనత, కృతజ్ఞత, వర్ణించుట, పొగడటం
◾ఆరాధన ≠ స్తోత్రం, స్తుతి
క్రైస్తవులు క్రీస్తును స్తుతిస్తారు ఎందుకంటే ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, మన రక్షణకు కారణమైనవాడు, దేవుడు ఆయనకు ఘనత ఇచ్చాడు కానీ ఆరాధన మాత్రం తండ్రికే చెందుతుంది.
4️⃣. క్రైస్తవులు క్రీస్తును మధ్యవర్తిగా నమ్ముతారు
క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుని వద్దకు చేర్చే మధ్యవర్తి. మధ్యవర్తి అనగా — ఇద్దరి మధ్య నిలిచి, ఒకరి పక్షాన మరొకరి ఎదుట వాదించువాడు అని అర్థం.
"దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹" (1 తిమోతి. 2:5)
👉 దేవుడు = తండ్రి
👉 మధ్యవర్తి = యేసుక్రీస్తు
👉 మధ్యవర్తులు అనేకులు కాదు—ఒక్కడే
👉 దేవుళ్లు అనేకులు కాదు — ఒక్కడే
"యేసు —నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹" (యోహాను. 14:6)
👉 యేసు = మార్గము
👉 తండ్రి = గమ్యం
"ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు.౹" (హెబ్రీ. 8:6)
👉 పాత నిబంధన → మోషే మధ్యవర్తి
👉 క్రొత్త నిబంధన → యేసుక్రీస్తు మధ్యవర్తి
"ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు." (హెబ్రీ 7:25)
👉 యేసు :
మన పక్షాన నిలుస్తాడు
తన రక్తాన్ని ఆధారంగా చూపిస్తాడు
తండ్రి ఎదుట మనకు మార్గం తెరుస్తాడు
క్రైస్తవులు క్రీస్తును మధ్యవర్తిగా నమ్ముతారు. యేసు ద్వారా మాత్రమే తండ్రిని చేరుతారు. మధ్యవర్తిని ఆరాధించరు. మధ్యవర్తి ద్వారా దేవునిని ఆరాధిస్తారు. యేసు తనకోసం కాదు తండ్రికి మన కోసం మధ్యవర్తిత్వం చేస్తున్నాడు.
5️⃣. క్రైస్తవులు క్రీస్తు మాటను వింటారు, లోబడతారు
క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవ జీవితం యొక్క అసలైన గుర్తు క్రీస్తు మాటను వినుట మరియు దానికి లోబడుట. యేసు తన శిష్యులను పిలిచినప్పుడు విధేయతతో కూడిన జీవనానికి పిలుస్తాడు.
"–ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును." (మత్తయి 7:21)
తండ్రి యొక్క చిత్తమే కుమారుని మాటకు లోబడటం 👇🏿
"మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹" (అపో కార్య 3:22-23)
"నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹" (యోహాను. 10:27)
6️⃣. క్రైస్తవులు క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తారు
క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవ విశ్వాసానికి పునాది యేసుక్రీస్తును “ప్రభువు”గా అంగీకరించుట. ఇది కేవలం మాటలతో చేసే ఒప్పుకోలు కాదు; జీవితమంతటిపై ఆయన అధికారాన్ని అంగీకరించుట.
"అదేమనగా– యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.౹" (రోమా. 10:9)
👉 “ప్రభువు” అంటే యజమాని, అధికారమున్నవాడు, పాలకుడు.
“దేవుడు(YHWH) ఈ యేసును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.” (అపోస్తల కార్యములు 2:36)
👉 ప్రభువుగా నియమించినది దేవుడే(YHWH)
👉 యేసు తనంతట తానే ప్రభువుకాలేదు
“ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనును— తండ్రి దేవునికి మహిమ కలుగునట్లు.” (ఫిలిప్పీయులకు 2:9–11)
👉 యేసును ప్రభువుగా ఒప్పుకొనుట
👉 తండ్రికి మహిమనిచ్చే కార్యం
క్రైస్తవులు క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తారు
ఆయన అధికారానికి లోబడతారు
ఆయన మాటకు విధేయులై జీవిస్తారు
7️⃣. క్రైస్తవులు క్రీస్తును రాజుగా గౌరవిస్తారు
క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు దేవునిచేత నియమింపబడిన రాజు. క్రైస్తవులు ఆయనను తమ ఆరాధనకు పాత్రుడిగా కాక, రాజ్యాధికారము కలిగిన ప్రభువుగా గౌరవించి, ఆయన అధికారానికి లోబడి జీవిస్తారు.
"రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.౹ సకల జనులును రాష్టములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు." (దానియేలు. 7:13-14)
👉 రాజ్యము ఇచ్చింది దేవుడే
👉 యేసు రాజుగా నియమింపబడినవాడు
"అయితే యేసు వారియొద్దకు వచ్చి– పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది." (మత్తయి. 28:18)
👉 యేసుకు సర్వాధికారము దేవుడే ఇచ్చారు.
👉 ఆయన దేవుడికి లోబడి రాజ్యము(సంఘమును) నిర్వహించుటకే/పరిపాలన చేయుటకే.
"వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.౹" (అపో కార్య 17:7)
👉 అపోస్తలుల బోధలో యేసు = రాజు
క్రీస్తును రాజుగా గౌరవించుట అంటే ఆయన అధికారాన్ని అంగీకరించుట, ఆయన ఆజ్ఞలకు లోబడుట, ఆయన రాజ్యపు(సంఘ) నియమాల ప్రకారం జీవించుట.
◾ రాజు = పాలకుడు/యేసుక్రీస్తు
◾ ఆరాధన = దేవునికి మాత్రమే
👉 రాజును గౌరవిస్తారు
👉 రాజుకు విధేయులై జీవిస్తారు
👉 రాజ్య అధికారానికి లోబడుతారు
👉 రాజును ఆరాధించరు
8️⃣. క్రైస్తవులు క్రీస్తును సాక్షిగా చూపుతారు
క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవుడి పిలుపు క్రీస్తును కేవలం మాటలతో కాక, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ తన జీవితంతో సాక్షిగా చూపుట. సాక్షి అంటే — వాక్యపు వెలుగులో తానే చూసినది, వినినది, అనుభవించినది నిజమని ప్రకటించువాడు. కానీ వ్యక్తిగతమైన సాక్ష్యాలు కాదు. క్రైస్తవులు తమ మార్పు, జీవితం, ప్రవర్తన ద్వారా క్రీస్తును ప్రజల మధ్య పరిచయం చేసేలా చేస్తారు. ప్రేమ, నీతి, పరిశుద్ధతతో జీవిస్తారు.
“మీరు నా సాక్షులై ఉండుదురు.” (అపోస్తల కార్యములు 1:8)
👉 యేసు శిష్యులను తనకు ఆరాధకులుగా కాక, సాక్షులుగా పంపించాడు.
అపోస్తులుల సాక్ష్యం 👇🏻
“మేము చూచినవాటిని, వినినవాటిని చెప్పకుండా ఉండలేము.” (అపోస్తల కార్యములు 4:20).
"జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.౹" (1 యోహాను. 1:1)
“మీ వెలుగు మనుష్యుల ఎదుట ప్రకాశించునట్లు చేయుడి.” (మత్తయి 5:16)
"దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.౹" (1 కోరింది 15:15)
"ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.౹" (1 తిమోతి 2:6)
"మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.౹" (1యోహాను 5:9)
క్రైస్తవులు క్రీస్తును సాక్షిగా చూపుతారు
క్రీస్తు సాక్ష్యం 👉 తండ్రికి మహిమ తెస్తుంది
ఆరాధన తండ్రికే చెందుతుంది.
✅ ముగింపు
క్రైస్తవులు క్రీస్తును…
సేవిస్తారు
వెంబడిస్తారు
స్తుతిస్తారు
మధ్యవర్తిగా ఆశ్రయిస్తారు
మాటలు వింటారు, లోబడతారు
క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తారు
రాజుగా గౌరవిస్తారు, అధికారానికి లోబడతారు
క్రీస్తును సాక్షిగా చూపుతారు.
కానీ
👉 ఆరాధన మాత్రం తండ్రికే అర్పిస్తారు
👉 యేసు ద్వారా తండ్రిని చేరుతారు
ఇది క్రొత్త నిబంధన ప్రకారం సంపూర్ణమైన క్రైస్తవ దృష్టికోణం.


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com