![]() |
క్రైస్తవులు, ప్రభుత్వ చట్టాలను గౌరవించాలా!? |
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
మన ఇహలోక ప్రభుత్వం వాటి అధికారాలు/చట్టాలను గౌరవించాలనేది బైబిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. ఇవన్నీ మొదటగా పరమతండ్రి యొద్ద నుండే వెలువడెను అనే విషయాలను "ఇహలోక ప్రభుత్వము విషయములో క్రైస్తవులు పాత్ర" Click Here అనే అంశమును మీరు చదువుట ద్వారా దైవ చిత్తమును గుర్తించియున్నారని అనుకోనుచున్నాము. ఐతే మరొక్క ఈ అంశము ద్వారా "క్రైస్తవులు, ప్రభుత్వ చట్టాలను గౌరవించాలా!?" అనే విషయాన్ని ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాము ముందుగా...
1. ప్రభుత్వ చట్టం
2. బైబిల్ చట్టం
3. ప్రభుత్వ చట్టాలను గౌరవించుట ≈ బైబిల్ బోధ?
4. లోక చట్టాలను ఎందుకు గౌరవించాలి?
5. లోక చట్టాలను ఎలా గౌరవించాలి?
6. దైవ ఆజ్ఞకు/చట్టానికి ≈ ఇహలోక చట్టాలు విరుద్ధంగా ఉంటే?
చదువరి... పైన పేర్కొన్న ఒక్కొక్క విషయాన్ని గూర్చి ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం.
1️⃣. ఇహలోక ప్రభుత్వ చట్టం :
భారత ప్రభుత్వ చట్టం(Government of India Act) 1935 ఆగస్టులో బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా ఆమోదించబడింది. ఈ 1935 చట్టమనేది 1950లో భారత రాజ్యాంగం(Indian Constitution) యొక్క నిర్మాణానికి ఒక పునాది వేసింది. భారత రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ/డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా రూపొందించారు, దీనికి బీఆర్ అంబేడ్కర్(చైర్మన్) నేతృత్వం వహించారు. ఇది 22 కమిటీ చేత మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో తయారు చేయబడింది. భారతదేశంలో దాదాపు 1248 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు వివిధ రూపాల్లో ఉంటాయి, అవి శాసనసభ ద్వారా ఆమోదించబడిన చట్టాలు(Statutory Laws), కోర్టుల తీర్పుల ద్వారా ఏర్పడిన చట్టాలు(Case Laws), రాజ్యాంగం(Constitution) మరియు ఇతర చట్టాలు(Regulatory Laws) ఉన్నాయి. ఈ చట్టాలు రాష్ట్రాల ద్వారా లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడతాయి. వీటిని అవసరమైనప్పుడు సవరించవచ్చు, మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు. భారత రాజ్యాంగంలో ఇప్పటివరకు 105 సవరణలు జరిగాయి.
ఇది కేవలం సమాజం యొక్క రాజ్యాంగ చట్టం. సామాజిక క్రమాన్ని మరియు ప్రవర్తనను నియంత్రిస్తుంది. ఈ చట్టం ఒక సమాజం యొక్క నియమాలను మరియు చట్టాలను సూచిస్తుంది, ఇది నిర్దిష్ట ప్రాంతానికి మరియు ప్రజలకు వర్తిస్తుంది. ఈ రాజ్యాంగ చట్టం మానవులచే నిర్మించబడినవి, సమాజానికి అవసరమైనవి, న్యాయం, శాంతి మరియు క్రమశిక్షణను కాపాడటానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయి, చట్టాల ద్వారా నేరాలకు శిక్షలు ఇవ్వబడతాయి.
2️⃣. బైబిల్ చట్టం :
📖బైబిలు అనగా గ్రంథము, పుస్తకము, పత్రిక అని అర్థం. (మత్తయి. 1:1; 19:7; లూకా. 3:4; యోహాను. 21:25; అపో.కార్య. 1:20; ప్రకటన. 1:11; 22:19cf).
📖 Bible ≈ G975 - Biblion; G976 - Biblos ≈ Scroll, Book, Writting.
📖 బైబిల్లో రెండు చట్టాలు కలవు ≈ పాత నిబంధన రాజ్యాంగ చట్టం, క్రొత్త నిబంధన రాజ్యాంగ చట్టం. (హెబ్రీ. 8:13). ఈ రెండు చట్టాలను 40 మంది వ్యక్తులు 1600 సం. పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా వ్రాశారు (2పేతురు. 1:20-21)
📖 పాత నిబంధన - సీనాయి కొండ యొద్ద మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇవ్వబడిన రెండు పలకలు గల పది ఆజ్ఞలు మరియు ఇతర చట్టాలు గల రాజ్యంగ చట్టం.(నిర్గమ. 19 - అపో.కార్య. 1వ అధ్యాయం.)
📖 క్రొత్త నిబంధన - మునుపు ఇవ్వబడిన పాత నిబంధన చట్టాన్ని ఇశ్రాయేలు ప్రజలు మీరుట వలన(యిర్మీయా. 31:32; కీర్తన. 78:52-54; హెబ్రీ. 8:9). దానిని సవరించమని, రద్దు చేయమని, మార్చమని మానవులకు ఏ మాత్రం అనుమతి ఇవ్వక (ద్వితీయో. 4:1-2; 12:32; సామెతలు. 30:6) దేవుడే కల్వరి గిరిలో క్రీస్తు రక్తము చేత రెండు పలకలు అనగా క్రీస్తును విశ్వసించిన ప్రజల మనస్సు మరియు హృదయం అనే పలకలు మీద మరొక్క(క్రొత్త) రాజ్యంగ చట్టాన్ని(నిబంధన) వ్రాసెను. (యిర్మీయా. 31:31-34; మత్తయి. 26:26; హెబ్రీ. 8:10-11; 10:16; 2 కొరింది. 3:3cf). క్రీస్తు రాజై(లుకా. 1:32; అపో.కార్య. 2:36; 10:36). ఆయన పరిపాలన క్రింది ఉండి (అపో.కార్య. 2:37-41) జీవితాలను దిద్దుబాటు చేసుకొనబోవు రాజ్య పౌరులకు ఇవ్వబడిన ఈ క్రొత్త నిబంధన రాజ్యాంగ చట్టాన్ని ఏ మనుష్యుడు రద్దు పరచడానికైనా, సవరించడానికైన, మార్చడానికైనా, తప్పుగా ప్రకటన చేయుటకైన దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఏ మనుషుడైన సాహసించిన అట్టివారిని దేవుడే తన చట్టం ప్రకారం శిక్షించే అవకాశం ఉంది. (గలతి. 1:8-9; ప్రకటన. 22:18-19).
3️⃣. చట్టాలను గౌరవించుట ≈ బైబిల్ బోధ?
అవును...,
🌿 ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఇట్టి ఇహలోకపరమైన ప్రభుత్వ చట్టాలను గౌరవించాలని బైబిల్ ఖండితముగా బోధిస్తుంది. "నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు. నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు". (సామెతలు. 8:15-16). "ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ.వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.౹ కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.౹" (రోమా. 13:1-2). దేవుడు ప్రభుత్వాన్ని నియమించాడు కాబట్టి దానికి లోబడి నడుచుకోవడం క్రైస్తవుల బాధ్యత (వ. 2,5,7). ఇలా నియమించుటకు గల ముఖ్య కారణం వారు సమాజములో న్యాయమును మరియు శాంతిని కాపాడుటకు ఉన్నారని పౌలు గారు చెప్పుట మనం చూడగలం (వ. 3,4).
🌿 "మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.౹ రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతి దండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.౹" (1 పేతురు. 2:13-14). మనం ప్రభుత్వాలు, సంస్థలు మరియు అధికారుల ద్వారా నియమించబడిన ప్రతి కట్టడకు విధేయత చూపాలని(వ. 13). రాజులు మరియు నాయకులు దేవునిచేత నియమించబడ్డారని, వారు మనకు సేవలు అందిస్తూ, మనల్ని కాపాడతారని మనం గుర్తుంచుకోవాలి.(వ. 14) ఇలా మంచి పౌరులుగా బ్రతుకుట ద్వారా దేవున్ని మహిమ పరుచువారు అగుదురని పేతురు గారు చెప్పుట మనం చూడటం.
4️⃣. లోక చట్టాలను ఎందుకు గౌరవించాలి?
🍂 క్రైస్తవ విశ్వాసికి అనుదినం లోక చట్టాలను గౌరవించమనే బైబిలు నేర్పుతుంది. అందరికి మంచి చేయాలని మరియు ఇతరుల మేలు కోసం చట్టాలను ఉపయోగించాలని చెబుతుంది. మనం లోక చట్టాలను గౌరవించి, న్యాయంగా మరియు సత్యంగా జీవించి, ప్రతి ఒకరి పట్ల కుల, మత, వర్గం, బేధం లేకుండా మనమంతా దేవుని ప్రజలమే అనే విధమైన ప్రేమను కలిగి ఉండటం ద్వారా దేవునికి లోబడి, మహిమపరిచి, ఆయనకు సంతోషం కలిగించే వారమగుదుము అని బైబిల్ బోధిస్తుంది. (లూకా. 6:35; రోమా. 13:1-10; ఎఫేసి. 2:14-16; 2 తిమోతి. 1:13).
🍂 దైవ చట్టాన్ని అనుసరించే వెలుగు సంబంధమైన క్రైస్తవ విశ్వాసి.., ఈ లోకపరమైన ప్రభుత్వం చట్టాలను గౌరవించుట తద్వారా ప్రజలు దేవుని మహిమను, నీతిని, రాజ్యాన్ని, సత్ క్రియలును చూడగలరు. "మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి." (మత్తయి. 5:16).
🍂 ప్రజలందరి కోసం, ముఖ్యంగా సమాజంలో నాయకత్వం వహించే వ్యక్తుల కోసం ప్రార్థన చేయడం ద్వారా సమాజంలో శాంతి, న్యాయం మరియు రక్షణను నెలకొల్పడానికి సహాయపడతాయని బైబిల్ బోధిస్తుంది. "మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును౹ రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.౹ ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది.౹" (1 తిమోతి. 2:1-3).
5️⃣. లోక చట్టాలను ఎలా గౌరవించాలి?
🍃 చెడు ఆలోచనలు/పనులు చేయకుండా : నేటి సమాజములో మనుష్యుడిని నిజంగా అపవిత్రుని చేసే చెడు ఆలోచనలకు & చెడు పనులకు అనగా దొంగతనం, హత్యలు, వ్యభిచారం, మోసం, అబద్ధసాక్ష్యములు, లైంగిక అసహనం... Etc అను వాటికి దూరముగా/జాగ్రత్తగా ఉండుట వలన గౌరవించగలం. (మత్తయి. 15:19-20; మార్కు. 7:21-23).
🍃 పన్నులు చెల్లించడం ద్వారా : కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి అని యేసే చెప్పెను కదా. (మత్తయి. 22:21). ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లించుట వలన గౌరవించగలం.(రోమా. 13:7)
🍃 శాంతియుత వాతావరణం : ప్రతి ఒక్కరితోనూ సమాధానంగా ఉండాలని మనం నేర్చుకోవాలి మరియు ఆ సమాధానం మన సంబంధాలను మెరుగుపరుస్తుంది, మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు మనం దేవునికి నచ్చిన వారుగా ఉండడానికి సహాయపడుతుంది. మన చుట్టూ అనుకూలమైన శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతుంది. (రోమా. 12:18).
🍃 ధర్నాలు, దూషణలు, గొడవలు, కేకలుకు దూరముగా ఉండుట ద్వారా : క్రైస్తవ విశ్వాసులు ఎల్లప్పుడూ మంచి చేయడానికి సిద్ధంగా ఉండాలని, మంచి పనులు చేయాలని, ప్రభుత్వానికి లోబడి ఉండాలని, అధికారులకు విధేయత చూపాలని, ఎవరినీ దూషించకూడదు, గొడవలకు దూరంగా ఉండాలని, శాంతితో, సానుకూలంగా ఉండాలని, ఎల్లప్పుడూ మంచి చేయడానికి సిద్ధంగా ఉండాలని బైబిల్ బోధిస్తుంది. (తీతుకు 3:1-2).
🍃 మంచి పనులు చేయటం : మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామో ఆలోచించి, అవి అందరికీ మంచిగా ఉంటాయో లేదో చూసుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయుట ద్వారా గౌరవించగలం. (తీతుకు 3:8; రోమా 12:17).
🍃 అంకితభావం : సమాజములోనున్న ప్రతి మనుషుడు(అధికారులకు) లోబడి ఉండాలని, బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా, మనసుతో లోబడాలని చెబుతున్నాడు. ఇలా దేవుని ఆజ్ఞలు, నియమాలు మరియు కట్టడాలకు అంకితభావంతో ఉండాలని చెబుతుంది. (1 పేతురు. 2:13).
🍃 సమాజానికి సహాయం పడుట ద్వారా : మనం చేయబోయే ప్రతి పనిలోనూ నిజాయితీ, పవిత్రత, మరియు మంచి మనసుతో వ్యవహరించాలి. మనస్సు దయ, కరుణ మరియు ప్రేమతో ఉండాలి, ఇతరులకు సహాయపడటానికి మరియు వారి కష్టాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మన శక్తి మేరకు సమాజానికి సహాయపడాలి. మనం ప్రతిచోటా మంచి మార్గదర్శకాలు తీసుకుంటూ, అందరికి ఆదర్శంగా ఉండాలి. (1 థెస్సలొనీకయులకు. 5:15).
6️⃣. బైబిల్ చట్టానికి ≈ ఇహలోక చట్టాలు విరుద్ధంగా ఉంటే?
క్రైస్తవ విశ్వాసి... ఇహలోక ప్రభుత్వ చట్టాలను గౌరవించాలనేది నియమం వర్తించినప్పటికి ఒక ముఖ్యమైన షరతు కలదు. అదేమనగా... దైవ ఆజ్ఞలకు (బైబిల్ చట్టానికి) ≈ ఇహలోక చట్టాలు విరుద్ధముగా ఉన్నప్పుడు విశ్వాసి ఖచ్చితముగా మొదటగా దేవునికే/దైవ ఆజ్ఞకు విధేయత చూపాలి, దేవున్ని హెచ్చించాలి, దేవున్ని గొప్పజేయాలి.
🔴 బైబిల్లో కొన్ని ఉదాహరణలు :
📌 యూదా రాజైన ఉజ్జియా తన మనస్సున గర్వించి, చెడిపోయి దైవ చట్టానికి వ్యతిరేకముగా నడుచుటకు ఆలోచన చేసి వచ్చినప్పుడు దైవ చట్టానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానయాజకుడైన ఆజర్యాయు మరియు ఎనుబది మంది యెహోవా యాజకులను రాజును ఎదిరించుట మనం చూడగలం. (2 దిన వృత్తా. 26:16-23).
📌 షద్రకు, మేషాకు, అబేద్నగో అనువారు ≈ బబులోను రాజగు నెబుకద్నెజరు తన బంగారు ప్రతిమయొకటి చేయించి ఆయా భాషలు మాటలాడువారందరికి సాగిలపడి, నమస్కరించమని ఆజ్ఞాపించినప్పుడు వారు రాజు చట్టానికి ఏమాత్రం లోబడక దైవ చట్టానికి లోబడుట వలన...దాని ఫలితము చివరిగా రాజు తన చట్టాన్ని వ్యర్థపరచుకొనెలా వారి క్రియలు ఆలోచింపజేయుట మనం చూడగలం. (దానియేలు. 3:1-30).
📌 ముప్పది దినములవరకు నీయొద్ద (రాజు యొద్ద) తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. అనే రాజు యొక్క చట్టాన్ని... దానియేలు అను దేవుని సేవకుడు దైవ చట్టానికి సానుకూలంగా లేకపోవడం వలన తన ప్రార్థన అలవాటును మార్చుకోలేదు, రాజు అతన్ని సింహాల గుహలో వేయాలని ఆజ్ఞాపించాడు. సింహాల గుహలో వేయబడినప్పుడు, దైవ దృష్టికి నిర్దోషిగానున్న దానియేలుకు, దేవుడే సింహాలు నోళ్లు మూయించుట వలన అతనికి ఏమీ చేయలేకపోయాయి. దాని ఫలితం రాజు తన చట్టాన్ని రద్దుపరచుకొనెలా మరొక్క చట్టాన్ని అనగా "నా రాజ్యంలోని సకల ప్రజలు దానియేలు యొక్క దేవునికి భయపడాలి, ఆయనను గౌరవించాలి" అని శాసనం చేయుట మనం చూడగలం. (దానియేలు. 6:1-28).
📌 పేతురుకు మరియు ఇతర అపోస్తలులకు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని అధికారులు ఆదేశించినప్పుడు... దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవునిదృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;౹ మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి.(అపో.కార్య. 4:18-20; 5:28-29,40).
🔎 క్రైస్తవులు భారత రాజ్యాంగాన్ని మరియు దేశ చట్టాలను గౌరవించాలానే ఆదేశింపబడినప్పటికి... భారత పౌరుడిగా ఇవ్వబడిన ఆరు ప్రాథమిక హక్కులు విషయములో (ముఖ్యముగా మత స్వాతంత్య్ర హక్కు - ప్రకరణలు 25-28) ఉల్లంఘించునప్పుడు బైబిల్ చట్టాన్ని విధేయత చూపడానికి తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు కానీ ధర్నాలు, కేకలు, గొడవలు, అబద్ధాలు పుట్టించడాలు, చర్చలు, తిరుగుబాటులు, హత్యలు వంటివి చేసి పగ తీర్చుకొనక... "–పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు – ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.౹" (హెబ్రీ. 10:30; రోమా. 12:19)
🔎 చదువరి... క్రైస్తవ విశ్వాసి తన భౌతిక చట్టాన్ని(రాజ్యాంగాన్ని) గౌరవించవలసిందే. ఎందుకంటే ఇది దేవుని వలన స్థాపింపబడినదని అని ఆత్మీయ చట్టం(బైబిల్ - క్రొత్త నిబంధన) స్పష్టముగా బోధిస్తుంది. దేవుని చట్టాలను మరియు మానవ చట్టాలను పాటించడం ద్వారా, సమాజంలో మంచి మార్పులు తీసుకురావచ్చు. ఒకవేళ చట్టం దైవ అజ్ఞాలకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు విశ్వాసి దైవ చట్టానికి విధేయత చూపడం ప్రధాన లక్ష్యం. ఇలా చేయుట వలన చట్టం పట్ల గౌరవం మరియు దైవం పట్ల భక్తి కలిగి ఉండుట వలన సమాజానికి మంచి పౌరులుగా మరియు దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాము.
✅ "ఇహలోక ప్రభుత్వము విషయములో క్రైస్తవులు పాత్ర" Click Here
✅ "క్రైస్తవులు, వేటి పైన పోరాటం చేయాలి?" Click Here
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com