![]() |
క్రైస్తవులు, వేటిపైనా పోరాటం చేయాలి? |
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏽
నిజ క్రైస్తవుడి వ్యక్తిత్వమే నిరంతర పోరాట యోధుడు.(2 తిమోతి. 2:1-5). దీని అర్థం క్రైస్తవుడు ఆధ్యాత్మిక పోరాటం చేయువాడే కానీ బాహ్య పోరాటం చేయువాడు కాదు. బాహ్య పోరాటంలో నిరంతరం గొడవలు, కేకలు, వివాదాలు, కుల/ మత విద్వేషాలు, ప్రభుత్వాలను ఎదిరించడం, నినాదాలు చేయడం, చర్చలు చేయడం, లేని వార్తను కల్పించడం, రోడ్లు ఎక్కడం, హక్కుల కోసం పోరాటం చేయడం, కుట్రలు పన్నడం, శత్రువును చంపమని/శిక్షించమని కోరడం...Etc. వంటివే ఉండును కదా ఇటువంటివి క్రైస్తవ విశ్వాస, ప్రేమ, క్రమశిక్షణ జీవితానికి చాలా కీడు చేకూర్చేవే కానీ మేలు చేసేవి కావు. మరి క్రైస్తవుల వేటిపైనా పోరాడాలి? అనే విషయాన్ని ఈ అంశము ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
🔎 క్రైస్తవులు మూడు రకాల వాటి పైనే ఆధ్యాత్మిక పోరాటం చేయవలసిన వారై యున్నారు.
①. శరీరముతో
②. పాపముతో
③. అపవాదితో
🔴 శరీరముతో :
మొదటిగా.., నీ శరీరముతో పోరాటం, అంటే నీ శరీర కోరికలతోనూ, నీ శరీర స్వభావముతోనూ జరిగే అంతర్గత పోరాటమని దీనికి అర్థం. వాస్తవానికి మనం ఈ శరీరము'లో' నివాసం చేస్తున్న దేవుని పోలిక, దేవుని స్వరూపం గల ఆత్మలమే(ఆది.కాం. 1:27; 2 కోరింది. 5:1-2). ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. (యోహాను. 6:63). శరీరమునకు మరియు ఆత్మకు మధ్య పరస్పర పోరాటమనేది ఉంది. శరీరము ఆత్మకు విరోధముగాను, ఆత్మ శరీరమునకు విరోధముగాను కోరినప్పుడు మనం నిర్ణయించుకొన్న వాటిని చేయకుందురు.౹"(గలతీ. 5:17).
శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. (రోమా. 8:7). శరీరానుసారమైన కోరికలు గల మనస్సు దేవునికి లోబడదు. శరీర స్వభావులు దేవుని సంతోష పెట్టలేరు. అప్పుడు నీకు(ఆత్మకు) విరోధముగా పోరాడే మనస్సు అపవాది మనస్సే కాబట్టి నీ ఆత్మకు విరోధముగా పోరాడు నీ శరీర కోరికల పైనే అనుదినం పోరాటం చెయ్యాలి.(1 పేతురు. 2:11). శరీర కోరికలు ఏమనగా.., జారత్వము/వ్యభిచారం, అపవిత్రత, కాముకత్వము,౹ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు... వీటిపై మనం పోరాడి గెలవాలి లేకపోతే దేవుని రాజ్యమును పొందలేము (గలతీ. 5:19-21) కాబట్టి ప్రతి విశ్వాసి తన శరీరముతో పోరాడి జయించాలంటే క్రీస్తు మరణం ద్వారా అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే సాధ్యం. (గలతీ. 5:16).
📖 నీవు నీ శరీరముతో ఎంతగా పోరాడాలనేది మన ప్రభువైన యేసు మాటల్లో చూచుటకు ప్రయత్నం చేద్దాం. "నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులుకలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములుకలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసి పారవేయుము; రెండు కన్నులుకలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు." (మార్కు. 9:43-48)
✅ నిత్యత్వమునకు నీ చెయ్యి, నీ పాదములు, నీ కన్నులు అభ్యంతర పరిస్తే దానిని నరికి వేయాలని యేసు చెప్పెను కదా.
🔖 అభ్యంతకరమైన పనులు చేసేది, తాకేది = "చేయి"
🔖 అభ్యంతకరమైన కార్యక్రమాలకు పరుగులు పెట్టేది = "పాదములు"
🔖 అభ్యంతకరమైన వాటిని చూసేది, ఆశించేది = "కన్నులు"
📖 నీ జీవాన్ని, నీ బాంధవ్యాన్ని నీ చేయి, నీ పాదములు, నీ కన్నులు అభ్యంతర పరిస్తే వాటిని నరకాలి. అంతేగదా... 🤔 వాస్తవానికి చేయు, పాదములు, కన్నులు అనగా శరీరమును(మాంసం) ఎవరు నరకరు. మరి ఏమి చెయ్యాలి? నీ శరీరముతో పోరాటం చేయాలి. దానిని లోబరుచుకోవాలి, వశపరుచుకోవాలి.
🔖 నీవు పోరాడునది శరీరులతో (మనుష్యులతో) కాదు. నీ సొంత శరీరముతో అని తెలుసుకోవాలి.
🔖 నీ శరీరమే, అనగా శరీర కోరికలు, శరీర స్వభావమే నీ మొదటి శత్రువు.
📖 (1 కోరింది. 9:26-27): "నేను గురిచూడనివానివలె పరుగెత్తు వాడను కాను,౹ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను."
📖 (గలతీ. 5:16): "నేను చెప్పునదేమనగా ఆత్మా నుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.౹"
🚹 Note : శరీరముతో పోరాడక పోతే క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు వారసులు కానేరరు, స్వతంత్రించుకోలేరు, హక్కుదారులుకాలేరు. (1 కోరింది. 6:9-10; గలతీ. 5:19-21; ఎఫెసి. 5:5).
🔴 పాపముతో :
రెండోదిగా.., పాపముతో పోరాటం. పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము.(1 యోహాను. 3:4); విశ్వాస మూలము కానిది పాపము. (రోమా. 14:23); మేలైనది చేయనెరిగి ఆలాగు చేయకపోవుట పాపము. (యాకోబు. 4:17); సకల దుర్నీతి పాపము. (1 యోహాను. 5:17); సత్క్రియ చేయకపోవుట పాపము. (ఆది.కాం. 4:7); మరణకరమైన పాపము & మరణకరము కాని పాపము కలదు. (1 యోహాను. 5:15-16)...Etc పాపము అంటే ఏంటో గుర్తించిన విశ్వాసి అనుదినం కచ్చితంగా పాపముతో పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాపముతో పోరాడాలి అనుకునేవారు తిరిగి పాపమునకు రాజీపడి చూసిచూడనట్టుగా (ఒక్కసారికి ఏమైందిలే అంటూ) ఉంటే ఎప్పటికీ పోరాడి గెలవలేరు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. (హేబ్రీ. 12:4). పాపముతో పోరాడినప్పుడు రక్తం కారుతుంది.
1. హేబేలు - ఆది.కాం. 4:1-12
సత్క్రియ చేయకపోవుట పాపము(ఆది. 4:7). సత్క్రియ అనగా దైవాజ్ఞ మేర ఆదేశించబడే పనులు నీవు చేయకపోతే పాపానికి నీ మీద మోజు ఉంటుంది. కయీను సత్క్రియ చేయనివాడు, హేబేలు సత్క్రియ చేసినవాడు. ఇందుచేత హేబేలు రక్తం కారునంతగా పాపముతో పోరాడాడు. పాపమునకు ప్రేమ ఉండదు. తమ్ముడు, అన్న అనే బేధం ఉండదు.
2. యోసేపు - ఆది.కాం. 39:1-23
పోతీఫరు భార్య రూపములో యోసేపు యొద్దకు వచ్చినది పాపం.(7వ) యోసేపు దినదినము పోరాటం చేసేవాడు.(10వ). మన జీవితములో కూడా పాపమమేది దినదినము ఏ రూపంలోనైనా రావచ్చు. కాబట్టి పాపముతో పోరాటం చేయుటకు సిద్ధముగా ఉండవలసిందే.
❌ Note : పాపముతో పోరాడక పోతే పాపము వలన వచ్చు జీతము మరణమే. (రోమా. 6:23; యాకోబు. 1:14-15; ప్రకటన. 20:14; 21:8).
🔴 అపవాదితో
మూడోదిగా.., అపవాదితో పోరాటమనేది విశ్వాసి జీవితములో ఆధ్యాత్మిక పోరాటంలో కీలకమైన విషయం. వీడు అబద్ధాలకు జనకుడు, నరహంతకుడు (యోహాను. 8:44), శోధకుడు (మత్తయి. 4:3), ఇహలోక అధికారి (యోహాను. 12:31; 14:30), దుష్టుడు (మత్తయి. 13:18-19), చీకటి రాజ్యానికి రాజు (కొలస్స. 1:13; మత్తయి. 12:26) అని బైబిల్లో వివిధ రకాలగా పిలువబడ్డాడు. ఇటువంటి దౌర్భాగ్యుడుతో నీవు అనుదినం పోరాటం చేయవలసిందే.
అపవాదితో పోరాటం అంటే "నీతికి vs దుర్నీతికి", "పరిశుద్ధతకు vs పాపమునకు", "వెలుగుకు vs చీకటికి", "విశ్వాసమునకు vs అవిశ్వాసమునకు" జరిగే నిరంతర పోరు. ఈ పోరులో వాడిని ఢీ కొట్టాలంటే క్రీస్తు పక్షముగ ఉండి మాత్రమే పోరాడాలి. వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును. (ప్రకటన. 17:14). ఆత్మ సంబంధమైన బలగాలతో అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన క్రీస్తు సంఘము (church of Christ) తోనే కలసి మాత్రమే అపవాదితో పోరాడాలి లేదంటే వాడితో పోరాడుట అసాధ్యము. (1 కోరింది. 1:2; 12:12; ఎఫెసి. 1:23; కొలసి. 1:18; రోమా. 16:16). ఇటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధములో మన ప్రభువైన యేసు జయశాలిగా నిరంతరం విజయం సాధిస్తూ ఉంటాడు. నీవు కూడా అట్టి విజయం సాధించాలని అనుకుంటే క్రీస్తు పిలుపుకు లోబడినవాడవై, ఏర్పరచబడినవాడవై, నమ్మకమైనవాడవై ఉండాలి. (1 కోరింది. 1:9; రోమా. 8:28-30; 1 పేతురు. 2:9; మత్తయి. 25:21-23; ప్రకటన. 17:14). అప్పుడు దేవునిపై ఆధారపడి మనస్సు కలిగినప్పుడు అపవాదిని ధైర్యంగా ఎదిరించి గెలవడం సాధ్యపడును కదా! కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. (యాకోబు. 4:7).
👤అపవాదితో పోరాడుటకు యుద్ధరంగంలో దిగే ముందు దేవుడు అనుగ్రహించే సంపూర్ణ కవచాన్ని ధరించుకోవాలని బైబిల్ సెలవు ఇస్తుంది. అవేమనగా...
🢡 సత్యమను దట్టి
🢡 నీతియను కవచము
🢡 సువార్తయను జోడు
🢡 విశ్వాసమను డాలు
🢡 రక్షణయను శిరస్త్రాణము
🢡 ఆత్మయను ఖడ్గము ..
వీటితో పాటుగా...
🢡 పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేయమని, పోరాటం విషయములో పట్టుదల కలిగి, దాని యందు మెలుకువగా ఉండమని కూడా చెప్పబడింది. ≈ (ఎఫెసీయులకు 6:13-18).
అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. (1 యోహాను. 3:8). మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రత్యక్షతమగుటకు గల ముఖ్య ఉద్దేశ్యం అపవాదిని ఓడించుటకు మాత్రమే. ఆయన వాడిని 33 ½ సం. ఎన్నో రూపాల్లో ఎదుర్కొని, చివరిగా సిలువలో ఓడించి. (కొలస్స. 2:15) మరణించి, సమాధి చేయబడి, మూడో దినం పరమ దేవుని చేత క్రీస్తు లేపబడెను కదా.(1 కోరింది. 15:1-4) ఇక్కడితో అయిపోయింది అన్నట్టుగా కాక క్రీస్తును అంగీకరించే వారి ద్వారా(సంఘము ద్వారా) సహితం అపవాదికి ఓటమి నిలుపుటకు పరమదేవుడే విశ్వాసికి అపవాది పైన పూర్తిగా విజయాన్ని ఇస్తాడనే విషయాన్ని బైబిల్ నొక్కి చెప్పుతుంది. "సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక." (రోమా. 16:20). ఇట్టి పోరాటాన్ని స్వయముగా దేవుడే ఆదిలో తన పోలిక, తన స్వరూపమును పునర్దించుకోవడానికే పెట్టెను కదా! "నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను...." (ఆది.కాం. 3:15).
📖 (ఎఫెసీ. 6:12): "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.౹"
📖 (2తిమోతి. 2:5): " జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.౹"
❌ Note : అపవాదితో పోరాడక పోతే అగ్నిగుండమే. (మత్తయి. 13:41-42; 25:41-46; ప్రకటన. 14:10; 19:20; 20:10; 20:14-15; 21:8,27; ).
📖 "మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటనుండి వినినది మీలో నిలిచినయెడల, మీరు కూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు.౹ నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.౹ మిమ్మును మోసపరచువారినిబట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను.౹" (1 యోహాను. 2:24-26)
ఓ చదువరి.., కాబట్టి ఇటువంటి మూడు అధ్యాత్మిక పోరాటలనేవి నీవు భూమి మీద ఉన్నంత కాలము కొనసాగుతూనే ఉంటాయి. ఒక క్రైస్తవునికి ఇది ఒక నిరంతర యుద్ధం... ఇది తెలియకుండా "నేను క్రైస్తవుడనని నీవు అనుకోవచ్చు అని దేవుని దృష్టిలో నీవు అపవాది సంబంధివే"...
మన పరమతండ్రి మనలను క్షమించు ప్రకారం(ఎఫెసీ. 4:32), అలాగే మన ప్రభువు మనలను క్షమించులాగున (కొలస్సీ. 3:13) వారిని క్షమించి, దీవించి(రోమా. 12:14-15), కీడు చేయక, పగ తీర్చుకొనక(రోమా. 12:17-21) సహించి(1 పేతురు. 2:19-20), నీతి-న్యాయము జరిగించు యెహోవా దేవునికే అప్పగించుకొనవలేను కదా!(యోబు. 37:23; కీర్తన. 9:8; 33:5; 103:6; యిర్మీయా. 9:24)
ఈ ఆధ్యాత్మిక పోరాటం విషయములో నీవు లేనివార్తను(సత్యము కానీ వాటిని) పుట్టించేవాడిగా(ప్రకటన చేసేవాడిగా) కాక(నిర్గమ. 20:16; ఎఫెసీ. 4:26), పరులజోలికి పోవువాడిగా కాక(1 పేతురు. 4:15), సత్య ప్రకటన విషయములో సిగ్గుపడని పిరికితనం లేనివ్యక్తిగా(2తిమోతి. 1:7; 2:15); క్రైస్తవుడిగా జీవించునప్పుడు అన్యాయముగా కొట్టబడిన, చంపబడిన, నిందించబడిన, శోధించబడిన, తిట్టబడిన, హింసించబడిన, దూషించబడిన సరి క్రైస్తవుడు అను పేరునుబట్టియే దేవుని మహిమపరచాలి,(1 పేతురు. 4:12-19; 1 కోరి. 11:23-31) తప్పా ఇహలోక బాహ్య పోరాటాలకు పోకుండా...
❤ ( 1 పేతురు. 2:21-23): "క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.౹ ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.౹ ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.౹"
👤యేసు మాటల్లో...
(లూకా. 23:34): "యేసు— తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.
👤స్తెఫను మాటల్లో...
(అపో. కార్య. 7:59-60): "ప్రభువునుగూర్చి మొరపెట్టుచు– యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.౹ అతడు మోకాళ్లూని — ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను."
మీ ఆత్మీయులు👪
WhatsApp Join Us Telegram Join Us
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com