ఇహలోక ప్రభుత్వము విషయములో క్రైస్తవులు పాత్ర (The role of Christians in local government)

 

ఇహలోక ప్రభుత్వము విషయములో క్రైస్తవులు పాత్ర


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏽 

                     అనంతజ్ఞానపూర్ణడగు పరమ దేవుడు ఆదిలోనే భూమ్యాకాశములు, సూర్యచంద్రాదులు, వృక్షాలు, జలచరములు, ఆకాశ పక్ష్యాదులు, భూజంతువులు, ప్రాకు పురుగులు సృజించాడు. సకల జీవులు ఏలికలేకయే  కాలము గడుపుచుండగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. (ఆది.కాం. 1:1-27). వాని పాదములు క్రింద ఉంచి, సమస్తముపై నరుడును ఏలుబడి చేయుటకు నియమించెను. (ఆది.కాం. 1:1-28; కీర్తనలు. 8:5-8). ఈయన అందరికి పైగా నున్నవాడే సదాకాలము మహాత్మ్యముగల మహారాజై యున్నాడు. (కీర్తనలు. 10:16; 95:3; యిర్మీయా. 10:10; ఎఫెసీ. 4:6). 

కాలక్రమేణ అనగా రమారమి 2500 సం.ల పిమ్మట చివరి న్యాధిపతియైన సమూయేలు కాలములో అప్పటివరకు ఇశ్రాయేలు ప్రజలకు నిరంతరం రాజైయున్న యెహోవా దేవుడు(కీర్తనలు. 10:16) తమకు రాజైయున్నాడని సంగతి జనులు గుర్తించక "...సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.౹"(1 సమూ. 8:5) దానిని గూర్చి సమూయేలు యెహోవాకు ప్రార్ధన చేయగా, యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.౹ వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.౹ అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము." (1 సమూ. 8:7-9)

యుగయుగములకు రాజైనున్న యెహోవా దేవున్ని యొక్క పరసంబంధమైన అధికారాన్ని ఇశ్రాయేలు జనులు విసర్జించి భౌతిక సంబంధమైన ప్రభుత్వం(లోక అధికారం చేయు రాజును) కోరినప్పుడు వారి రాజ్యాంగ చట్టం(ధర్మశాస్త్రం) సవరణ అవసరం లేకుండనే సాఫీగా సంగతులు కొనసాగేలా యెహోవా దేవుడు అట్టి ఏర్పాటును ముందుగానే వారి రాజ్యాంగ చట్టములో వ్రాయించి ఉంచెను. అదేమనగా... "నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి —నా చుట్టునున్న సమస్త జనమువలె నామీద రాజును నియమించుకొందుననుకొనినయెడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను.౹ నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.౹ అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా– ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.౹ తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగారములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసికొనకూడదు.౹ మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను;౹ అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలుమధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకుగాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను." (ద్వితీయో. 17:14-22).

తాము కోరుకొనిన భౌతిక సంబంధమైన రాజు తమ్మును పెట్టబోవు కష్టములన్నిటిని గూర్చి దేవుడు సమూయేలు ద్వారా ముందుగా ఆయా సంగతులు స్పష్టముగా తెలిపినను (1 సమూ. 8:10-18) ఇశ్రాయేలు జనులు దేవుని మాటలను చెవిని బెట్టనొల్లక "ఆలాగున కాదు,౹ జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.౹"(1 సమూ. 8:19-20). చివరిగా వారి మాటలు వినిన యెహోవా తన పర సంబంధమైన సింహానాన్ని భూమి మీదకి దించి సమూయేలు ద్వారా "తమ ప్రజలను ఏలుబడి చేయుటకు మొదటిసారిగా బెన్యామీను గోత్రపు వాడైనా సౌలు అను వ్యక్తిని సింహాసనం మీద కూర్చొండ బెట్టి, రాజుగా అభిషేకించి, ప్రజలకు అధిపతిగా నియమింపజేసెను. (1 సమూ. 8:21 నుండి 10:1).


✅ మొదటిగా దేవుని ప్రజలకు ఇహలోక ప్రభుత్వమనేది ఇక్కడే ప్రారంభం మయ్యింది. 

✅ ప్రభుత్వమైన, రాజునైన/అధికారులైన నియమించువాడు యెహోవా దేవుడు మాత్రమే. జనులు ఎంతమాత్రం కాదు. 

📖 "యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు." (యిర్మీయా. 10:10).


అనాడు తమ ప్రజల మధ్య ప్రారంభమైన అట్టి ప్రభుత్వమే నేడు కూడా భౌతిక సంబంధమైన రూపములో కొనసాగబడుతుందని నీవు గుర్తిస్తే... క్రైస్తవుడువైన నీవు ఇహలోక ప్రభుత్వము విషయములో నీ పాత్ర ఏమిటో గుర్తించుటకు ప్రయత్నం చేయుము. 


1️⃣. ప్రభుత్వాలను దేవుడే ఏర్పాటు చేస్తున్నారని నీవు ఎరగాలి. 

"మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను —ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి.౹ అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి.౹ ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.౹ ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.౹" (దానియేలు 4:13-17):

"రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.౹ దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్టములును జనులును ఆయా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.౹ అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను.౹ అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.౹" (దానియేలు 5:18-21):


2️⃣. దేవుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వమునకు నీవు లోబడవలసిందే.

"అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,౹ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.౹" (తీతుకు. 3:1-2)

"ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ.వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.౹ కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.౹ ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడుచేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారముచేయు దేవుని పరిచారకులు.౹ కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షినిబట్టియు లోబడియుండుట ఆవశ్యకము.౹" (రోమా. 13:1-5)

"మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి.౹ రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతి దండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.౹" (1 పేతురు. 2:13-14)


3️⃣. ప్రభుత్వమునకు నీవు పన్ను చెల్లించాలి.

 "ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.౹ ఇందుకే గదా మీరు పన్ను కూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి." (రోమా. 13:6-7).

 "వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి– బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ని చ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి– మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి, ఆయన– ఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారు– కైసరువి అనిరి. అందుకు యేసు — కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి." (మార్కు. 12:13-17)


4️⃣. అనుదినం ప్రభుత్వము కొరకు నీవు ప్రార్థన చెయ్యాలి. 

 "మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును౹ రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.౹ ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది.౹" (1 తిమోతి. 2:1-3).

మీ ఆత్మీయులు

WhatsApp Join Us   Telegram Join Us
వేటి పైన క్రైస్తవులు పోరాటం?

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16