![]() |
సహింపు(Patience) |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువును, రక్షకుడైన వాని పేరిట మా ప్రత్యేక వందనములు🙏
ప్రస్తుత కాలములో జరుగుతున్న పరిస్థితులను చూస్తే క్రైస్తవులలో సహింపు చాలా లోటుగా ఉన్నట్టుగా అగుపడుచున్నది. ఎక్కడ చూసినా పోరాటాలు, ఎటు చూసినా ఉద్యమాలే, ఎవరిని చూసినా వివాదాలే.
💢 సహింపు లోటుగా ఉండడమేంటి అసలు క్రైస్తవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి బలము సహింపే కదా.. మరి అదే నీలో లోటుగా ఉంటే నీవు క్రైస్తవుడిగా ఎలా ముందుకు సాగగలవు? .. ఎందుకంటే సహింపు లేనివాడు అపవాదిని జయించలేడు కదా.. సహింపు లేనివాడు లోకాన్ని ఎదిరించలేడు కదా.. సహింపు లేనివాడు క్రీస్తును ధరించుకోలేనట్టే కదా... సహింపు లేనివాడు పాపం మీద ఏలుబడి చేయలేడు కదా.. సహింపు లేనివాడు దేవుని ఆజ్ఞకు లోబడలేడు కదా.. సహింపు లేనివాడు పరలోకానికి అనర్హుడు కదా.. మరి నీలో సహింపు అనే ఆయుధము లేకుండానే ఈ లోకములో క్రైస్తవులుగా చలామణి అవుదామంటే దానికి పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోదు...
💪 క్రైస్తవ జీవితానికి సహింపు చాలా అవసరం. సహింపు లేకుండా ఆత్మీయంగా ముందుకు సాగలేము.. సహించడం మాకు కష్టతరంగా ఉంది మేము సహించాలనుకున్నా మేము ఆ సమయానికి అలా ఉండలేకపోతున్నాము అని అనుకునేవారికి, దేవుని భయం ఉన్నప్పటికీ బలహీన సమయాలలో అపవాదిని ఎదిరించలేని వారికి ఈ అంశము ద్వారా బలపరచబడాలని తలస్తున్నాము..
👀 దేవుని పరిశుద్ధ గ్రంథములో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోకుండా అన్యుల మధ్యను దేవుని నామాన్ని మహిమపరచి, గొప్పచేసి, దేవుని చేత మెప్పు పొందుకొని ముందుకు సాగిన అనేకమంది భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు.
నోవహు :-
అదివరకు ఎన్నడూ చూడని, జరగని సంగతులు గూర్చి దేవుడు అజ్ఞాపించినప్పుడు ఎటువంటి సందేహము లేకుండా, ఆయనను ఎదిరించకుండా దేవునికి లోబడి, సహింపుతో ఓడను సిద్ధపరచి, భక్తిహీనులకు నీతిని చాటి, ఏమాత్రమును తాను ఈ లోకములో పడిపోకుండా, సహింపుతో దేవుని చిత్తానికి లోబడ్డాడు. తాను రక్షింపబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించాడు. (ఆది. కాం. 6:8-9, 18, 1పేతురు 3:20, హెబ్రీ 11:7)
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు :-
తాము చూడని దేశమును గూర్చి వాగ్దానమును పొందుకున్నప్పుడు నా తండ్రి అబ్రహాము వాగ్దాన ఫలము అనుభవింపలేదు కదా నేనలా పొందుకుంటాను అని ఇస్సాకు సహనం కోల్పోలేదు, నా తండ్రి ఇస్సాకు అనుభవింపలేదు కదా నేనెలా పొందుకుంటాను అని యాకోబు సహనం కోల్పోలేదు.. విశ్వాసంతో నిరీక్షించారు. దేవుని నమ్మారు, సహింపుతో ఉన్నారు తమ తరవాతి తరాలకు దేవుని గూర్చిన వాగ్దానము తెలియజేశారు.. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని దేవుడే స్వయంగా చెప్పుకునేవిధంగా దేవుని మహిమపరిచారు.... (ఆది. కాం. 17:1-9, 26:23-25, 28: 12-16, హెబ్రీ. 6:13-15; 11:8-21)
యోసేపు :-
అన్నలు ద్వేషించినా సహించాడు, వారు చంపేద్దామని కుట్ర పన్నినా సహించాడు, వారిచేత అమ్మివేయబడిన సహించాడు, చేయని తప్పుకు చెరసాలలో వేసినా సహించాడు.. సహనంతో దేవుని మెప్పించాడు ఆశీర్వదింపబడ్డాడు. (ఆది. కాం. 39:1-10, హెబ్రీ. 11:22)
మోషే :-
తాను ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించే దినాలలో వారు ఎంత శోధనకు గురి చేసినా సహించాడు. అంత శ్రమపడి తాను కనాను దేశంలో అడుగుపెట్టనప్పటికీ సహనంతో దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. (హెబ్రీ 11: 23-28)
యోబు :-
అపవాది ఎంత శోధించిన వాడికి లొంగలేదు. దేవుని దూషించలేదు. తన భార్య శోధించినపుడు మూర్ఖురాలివలే అని అన్నాడు కానీ మూర్ఖురాలు అని ఆమెను సూటిగా నిదించలేదు. తన సర్వస్వం కోల్పోయిన సహించాడు. సహనంతో అపవాదిని జయించాడు దేవుని దయ పొందిన వాడయ్యాడు. (యోబు 1: 1,8, 2:3, 42: 12.16; యాకోబు. 5:11)
స్తెఫను :-
యేసుని గూర్చిన సాక్ష్యం తెలియజేస్తున్నపుడు రాళ్ళతో కొట్టివేయబడ్డాడు. ఏ రాయి ఎక్కడ తగులుతుందో అని లెక్కచేయలేదు. ప్రాణానికి భయపడి క్రీస్తుని గూర్చిన సత్యం తెలియజెప్పక మానలేదు. సహించాడు. సహింపుతోనే తనను కొడుతున్నవారిని క్షమించమని వేడుకుని క్రీస్తుని మెప్పించాడు. క్రీస్తులాంటి మనస్తత్వం కలిగి జీవించాడు. - (అపో.కార్య 7వ అధ్యాయము)
పౌలు :-
తన విశ్వాస జీవిత ప్రయాణంలో ఎన్నో శ్రమలు, శోధనలు, హింసలు ఎదురయిన సహించాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. సహనం కోల్పోకుండా తన జీవిత అంతం వరకు బ్రతికాడు. తన కొరకు నీతికిరీటము ఉంచబడియుందని నమ్మకంతో చెప్పగలిగాడంటే మామూలు విషయం కాదు. (2కోరింది 11:21- 33, 13:4, 2 తిమోతి 4:6-8)
👀 మన పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి భక్తులు ఇంకేదరో ఉన్నారు. వీరందరి జీవితాలను నీవు ఎంత లోతుగా చూడగలుగుతావో తెలీదు కానీ ఒక్కరి జీవితాన్ని నీవు బాగుగా, చాలా లోతుగా ఎరగవలసిన అవసరం ఉంది. ఆయన జీవితం ఎరుగకుండా నీవు క్రైస్తవుడివి కాలేవు. ఆయన గూర్చిన జ్ఞానము లేకుండా క్రైస్తవునిగా బ్రతకలేవు. అసలు ఆయనలాంటి స్వభావాన్ని నీవు ధరించుకోకపోతే నిన్ను ఆయన ఎరుగడు, ఒప్పుకోడు. ఆయనే సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు.
మన ప్రభువైన యేసుక్రీస్తు :-
𒐕 యేసు సహనాన్ని నీవు ఎరిగితే హక్కుల కోసం పోరాటం చేయవు. - (మత్తయి. 26-53; 27:1-2,11-14; యోహాను. 19:10-11; ).
𒐖 యేసు సహనాన్ని నీవు ఎరిగితే ఆయన పేరిట ఉద్యమాలు చేయవు. (యోహాను. 10:18; రోమా. 13:1-2; 1 కోరింధి. 9:12)
𒐗 యేసు సహనాన్ని నీవు ఎరిగితే శ్రమ పొందుటకు ఇష్టపడతావు కానీ నిన్ను శ్రమ పెట్టిన వారిని దూషించవు. (యోహాను. 16:33; ఫిలిప్పీ. 2:7-8; రోమా. 8:35-37; 1 పేతురు. 3:9; హేబ్రీ. 2:17)
𒐘 యేసు సహనాన్ని నీవు ఎరిగితే నిన్ను హింసించువారి కొరకు ప్రార్థిస్తావు కానీ కీడు చేయవు. (మత్తయి. 5:15; లూకా. 6:27-28; 23:34; రోమా. 12:14)
𒐙 యేసు సహనాన్ని నీవు ఎరిగితే పాపుల కొరకు ప్రాణము పెట్టుటకు సిద్ధపడతావు కానీ వారు దేవునికి దూరమయ్యేలా నడుచుకోవు. (మత్తయి. 10:39; 16:25; యోహాను. 12:25; 15:13)
𒐚 యేసు సహనాన్ని నీవు ఎరిగితే నిన్ను రెచ్చగొట్టేవారిని నీ మౌనంతోనే త్రిప్పికొడతావు కానీ నీ మాటలను బట్టి అపవాదికి అవకాశమివ్వవు. (మత్తయి. 16:1-12; 27:40-44; 1 పేతురు. 2:23; )
𒐛 యేసు సహనాన్ని నీవు ఎరిగితే చావుకు సైతం భయపడవు. (మత్తయి. 16:21; 20:17-19; 27:27-31; హేబ్రీ. 2:13).
అయితే నీవు ఈ లోకాన్ని, అపవాదిని జయించలేక పోతున్నావంటే నీవు యేసుని బాగుగా ఎరుగలేదని అర్థం. నీకు యేసు మీద అభిమానం ఉండవచ్చు కానీ ఆయన కోరుకునేది అభిమానం కాదు ఆయనకు శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అభిమానం వేరు శిష్యరికం వేరు. (అభిమానం - శిష్యరికం) soon
📢 ఈ లోకంలో ఒక నానుడి ఉంది.. తప్పులేనప్పుడు ఎందుకు మౌనంగా ఉండాలి? రెచ్చిపో.. అని అంటుంటారు ఈ లోకస్థులు.. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా
అంతమువరకును సహించినవాడు రక్షింపబడును. (మత్తయి. 10:22).
ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా?... (1 కోరింది. 6:7).
ప్రేమ దీర్ఘకాలము సహించును.(1 కోరింది. 13:4).
మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. (2 కోరింది. 11:19).
ప్రేమతో ఒకనినొకడు సహించుచు,.(ఎపేసి. 4:1).
ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. (కోలస్సి 3:17).
సహించిన వారమైతే ఆయనతోకూడ ఏలుదుము. (2 తిమోతి. 2:12).
ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. (1 పేతురు. 2:19).
📖ఆత్మ సిద్ధంగా సహించేవాడు బలవంతుడు...: "బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు." (లూకా. 11:21-23)
📖 ఆత్మ సిద్ధంగా సహించడం చేతకాక రెచ్చిపోయేవాడు, రెచ్చగొట్టేవాడు బలహీనుడే...
కాబట్టి అపవాదిని జయించుటకు మనకున్న అతి బలమైన ఆయుధం సహనం అని ఎవరైతే గ్రహిస్తారో వారే నిజమైన క్రైస్తవులు.
💖 సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? (యాకోబు. 5:11).
మీ ఆత్మీయులు👪
WhatsApp Join Us Telegram Join Us
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com