"ఆత్మీయ ఎదుగుదల" (Spiritual Growth)

ఆత్మీయ ఎదుగుదల


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రియులారా, బాప్తీస్మము పొందిన మనమందరమూ ఆత్మీయంగా బలపడి, క్రీస్తు స్వారూప్యములోనికి అనగా ఆయనలాంటి వ్యక్తిత్వమును కలిగి ఈ లోకములో భౌతికమైన మరణము పొందువరకు నమ్మకముగా జీవిస్తేనే తండ్రియొద్దకు చేరుకోగలమని మనకందరికీ బాగుగా తెలియును. ఈ లోకములో ఉంటున్న మనము ఆత్మీయ విషయములో అనేక విధాలుగా శోధింపబడుతుంటాము. అలా శోధింపబడినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మనిని దుఃఖపరచకుండా పరిశుద్ధ గ్రంథములోని లేఖనానుసారముగా కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే ఖచ్చితముగా మన ఆత్మను రక్షించుకోగలము, అపవాదిని జయించగలము.


మొదటి దశ : హృదయమును సిద్ధం చేసుకోవాలి 


ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలంటే హృదయము చాలా ప్రాముఖ్యమైనదని మొదట గ్రహించాలి. హృదయములోని తలంపులను బట్టే మన జీవితము ఆధారపడి ఉంటుంది. మన మనస్సు సరిగ్గా లేకపోతే మనం చేసే ప్రతి పనిలోనూ విఫలమవుతూ ఉంటాము  కాబట్టి మన హృదయములో ప్రభువును ప్రతిష్టించుకుని, ఆయన ఆలోచనలవైపు మనస్సును మలచుకోగలిగితే ఆత్మీయంగా బలపరచబడగలము.

» మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. – (1 పేతురు. 3:15).

» నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు,... – (మత్తయి. 22:37-40, మార్కు. 12:30-31, లూకా. 10:27).

» నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. – (సామెతలు. 4:23).

» నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. – (సామెతలు. 23:19).

» నీవు జాగ్రత్తపడుము నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. – (ద్వితియో. 4:9).

» హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? – (యిర్మియా. 17:9).

» సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. – (హెబ్రీ. 3:12).


రెండవ దశ : దేవుని నియమాలను వెతకాలి 


ప్రియులారా, భౌతిక సంబంధమైన జీవితములో ఏదైనా ఒక క్రొత్త పనిలో చేరితే ఆ పనికి సంబంధించిన విషయములన్ని తెలుసుకుని ఆ పనిని మొదలుపెడతాము అంతేకాకుండా పనిలో భాగముగా అనేకమైన క్రొత్త క్రొత్త విషయములను తెలుసుకుంటూ మనం చేసే పనిలో అభివృద్ధి చెందుతాము. అలాగే  ఆత్మీయ జీవితములో అభివృద్ధి చెందాలంటే దేవుడు మనకు దయచేసిన పరిశుద్ధ గ్రంథములోని మాటలను దిన దినము అభ్యాసము చేస్తూ ఆయన నియమాలను వెతకాలి.

» నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. – (కీర్తన. 119:10-12).

» బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. – (కీర్తన. 119:127).

» ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి. – (మత్తయి. 6:33).

» దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. – (2 తిమోతి. 2:15).

» క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దాని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. – (యోహాను. 6:27).

» నీ (యెహోవా) మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. – (యిర్మియా. 15:16).

» ఈ జీవిత కాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరికంటె దౌర్భాగ్యులమై యుందుము. – (1 కొరింధి. 15:19).


మూడవ దశ : దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి


ప్రియులారా క్రైస్తవులమైన మనము దేవుని నియమాలను తెలుసుకుంటే సరిపోదు ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని వెతికి తెలుసుకున్నంత మాత్రము మన ఆత్మ రక్షింపబడుతుందంటే పొరబడినట్లే,.. మనము తెలుసుకున్న వాటిని ఆచరించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే మన ఆత్మను రక్షించుకోగలము.

» సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా? అయితే స్వాతంత్ర్యము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడవును. – (యాకోబు. 1:21-25).

» నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?. – (లూకా. 6:46).

» ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. – (మత్తయి. 7:21). 

» మీరు సంపూర్ణులును, ప్రతివిషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని,... – (కొలస్సి. 4:12).

» తండ్రినైనను తల్లినైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. – (మత్తయి. 10:37-39).

» కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, (యింటివలె) కట్టబడుచు, మీరు నేర్చుకొనినప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. – (కొలస్సి. 2:6-7).


నాల్గవ దశ : సత్యమును ప్రకటన చేయాలి 


క్రీస్తు శరీరములోనికి బాప్తీస్మము పొంది, మన హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుకుని, ఆయన నియమాలను వెతికి, ఆజ్ఞలను పాటించి, సత్యమందు అనగా “అపోస్తులుల బోధ”యందు నిలకడగా ఉంటే మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. అయితే మనము నేర్చుకున్న సత్యమును ఉన్నది ఉన్నట్టుగానే ఇతరులకు ప్రకటన చేయుట వలన లేదా సహోదరులతో సంభాషించగలిగితే మన ఆత్మ మరింత ఎక్కువగా బలపడుతుంది కాబట్టి ఇతరులకు ప్రకటన చేసే అవకాశమును ఎంత మాత్రమును వదిలిపెట్టక దేవుని చిత్తములో కొనసాగాలి. విశ్వాసులకు మాదిరిగా జీవించాలి.

» మీరు వెళ్లి సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. – (మార్కు. 16:15).

» నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ ప్రవర్తనమీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. – (1 పేతురు. 3:15-16).

» నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. – (2 తిమోతి. 2:2).

» మీరు యేసునుగూర్చి విని ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైనయెడల మీరాలాగు క్రీస్తును (గూర్చి) నేరుచుకొన్నవారుకారు. – (ఎఫెసీ. 4:20-21).

» వీటినిగూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో (దుర్భోధను) ఖండించుచునుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము. – (తీతుకు. 2:15).

» మేము సత్యమునకు వ్యతిరేకముగా ఏమియు చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. – (2 కొరింధి. 13:8).

» ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదుము. – (ఎఫెసీ. 4:15).

» ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండ వలెనని యిచ్ఛయించుచున్నాడు. – (1 తిమోతి. 2:4).

ప్రియ సహోదరుడా, సహోదరీ పాపపు జీవితమును విడిచి క్రీస్తునందు నూతనంగా జన్మించిన మనము ఒక్కసారే అన్ని విషయములలో మార్పు చెందడం కష్టము కనుక క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నెమ్మది నెమ్మదిగా వాక్యమనే పాలను ఆపేక్షిస్తూ, బుద్ధి పూర్వకముగా పాపము చేయక, తెలియక అవిశ్వాసము వలన చేయు లోపాలను సరి చేసుకుంటూ మనలో ఉన్న ఆత్మను బలపరచుకోవాలి.

» ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణవిషయములో ఎదుగునిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. – (1 పేతురు. 2:1-3).


» మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. – (రోమా. 12:2).


పైన తెలుపబడిన సంగతులను ఆలోచన చేసి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది (ఎఫెసీ. 4:11), మన అంతర్యపురుషుడు ఆత్మీయంగా ఎదుగుటకు దిన దినము నూతనపరచబడాలని  (2 కొరింధి. 4:14) నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16