"కోపము" (Anger)


కోపము

తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, క్రీస్తుయేసునందు భద్రము చేయబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

మానవునికి కోపము సహజము. అలాగని అన్నివేళలా, అన్ని విషయాలలో కోపపడుట మరియు కారణం లేకుండా ఎదుటివారిపై చిరాకు పడటం వలన అనేక ఇబ్బందులకు గురవుతుంటాము. అయితే కొన్నిసార్లు కోపడుట చేత మంచి జరిగే అవకాశము కూడా ఉంది. కాని మన కోపము మనలను దేవునికి దూరము చేసే విధముగా ఉండకూడదు.   మానవుడు తన కోపాన్ని ఎప్పుడు ప్రదర్శించాలి మరియు ఎలాంటి సందర్భాలలో కోపమును అదుపు చేసుకోవాలో ఈ అంశము ద్వారా ఆలోచన చేద్దాము.

దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంథములో చాలామంది కోపము తెచ్చుకున్నారు కాని పాపము చేయనివారిగా ఉన్నారు, దేవునికిష్టులుగా జీవించారు. వారు ఏ ఏ సందర్భాలలో కోపడ్డారో లేఖనములు చూద్దాము.

మోషే :


» అతడు (మోషే) పాళెమునకు సమీపింపగా, దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. (నిర్గమ. 32:19).

యేసుక్రీస్తు :


» సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతిదినమున వాని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. నీవు లేచి మధ్యను నిలువమని ఊచచెయ్యిగలవానితో చెప్పి వారిని చూచి - విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారిహృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి - నీ చెయ్యి చాపుమని మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.(మార్కు. 3:1-5).

అపోస్తులుడైన పౌలు :


» పౌలు అతేనైలో వారికొరకు కనిపెట్టకొని యుండగా, పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.(అపొ.కార్య. 17:16).

ప్రియులారా, మనము ఖచ్చితముగా కోపపడాల్సిన సందర్భాలు కొన్ని వస్తుంటాయి అయినప్పటికీ పాపమునకు అవకాశమివ్వకుండా మన హృదయములను సమాధాన పరచుకోవాలి.

 ★ కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించిన పిమ్మట మీ కోపము నిలిచియుండకూడదు. (ఎఫెసీ. 4:26).

పైన సందర్భములో పౌలు గారు కోపము తెచ్చుకున్నారు కాని పాపము చేయుటకు ఎంతమాత్రమును అవకాశామియ్యక అతేనైలో ఉన్న జనులతో చాలా చక్కగా జ్ఞానముతో నడుచుకున్నట్టుగా అపో.కార్య. 17వ అధ్యాయము 17వ వచనము నుండి చివర వరకు చూడగలము.

మంచి కొరకు కోపపడినప్పటికీ దేవునికి విరోధముగా పాపము చేయకుండా తమ ఆత్మలను రక్షించుకున్న వారు అనేకమంది పరిశుద్ధ గ్రంధములో కలరు.

ప్రియ సహోదరుడా, సహోదరీ మన కోపము ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు, మన ఆత్మీయులను మనకు దూరం చేసేటట్టుగా ఉండకూడదు. కొన్ని సమయాలలో అతి కోపము వలన అపవాదికి అవకాశమిస్తూ, దేవుని పనిని అడ్డగించేవారిగా ఉంటాము. కాబట్టి కోపాన్ని అణిచివేసుకోగలిగితే మేలుకరమైన జీవితమును జీవించగలము.

» కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము. – (కీర్తన. 37:8).

» మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. (కొలస్సి. 3:8).

A). వివాహబంధముతో ఒక్కటైనా వారి మధ్య కోపము ఎంత తక్కువుగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు కారణము లేకుండా కోపడకూడదు.

» భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. (సామెతలు. 6:34).

» మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. (సామెతలు. 15:1).

» క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?. – (సామెతలు. 27:4).

B). తల్లితండ్రులు పిల్లల విషయములో కోపమును అణిచివేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మంచి మాటలతోనే వారిని సమాధానపరుచుట మంచిది.

» తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. (కొలస్సి. 3:21).

» తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.(ఎఫెసీ. 6:4).

» బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.(సామెతలు. 19:18).

C). మన కోపము మన ప్రార్థనా జీవితముకు ఆటంకము కాకుండా చూసుకోవాలి.

» కావున ప్రతిస్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. – (1 తిమోతి. 2:8).

D). తోటి సహోదరులపై కోపము తెచ్చుకుని విమర్శకు లోనవకూడదు.

» తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును. ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. (మత్తయి. 5:22).

E). క్రోధము గలవారితో సహవాసము చేయకుండుట మనకు మేలు.

» కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము. – (సామెతలు. 22:24).

» కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.(సామెతలు. 29:22).

» కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.(సామెతలు. 17:19).

F). శరీర కార్యములలో కోపము కూడా ఒక్కటై ఉన్నది కనుక కోపమును ఖచ్చితముగా విసర్జించాలి.

» శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పినప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.(గలతీ. 5:19-21).

మన నోరు తెరవాల్సిన సందర్భాలలో తప్ప మిగతా అన్ని సమయాలలో మనము మన నోటిని కాచుకున్నట్లయితే కోపముకు అవకాశమియ్యలేము పాపమూ చేయలేము. ఈ విషయముపై ఇబ్బందులు పడుతున్నవారు ఒకసారి ఆలోచన చేసి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని దేవునికిష్టులుగా జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.  నోరు తెరువవద్దు.

 ★ నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.  – (యాకోబు. 1:19).

మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16