వైఖరి, పద్ధతి, ధోరణి (Attitude)

వైఖరి, పద్ధతి, ధోరణి (Attitude)


క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడిన వారై, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రతి మనిషికి వారి వారి జీవనశైలిని బట్టి వారికంటూ ఒక వైఖరి లేక పద్ధతి ఉంటుంది, వారి ఇష్టాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని కనపరుస్తుంటారు. కొందరి పద్ధతి తమ చుట్టూ ఉండేవారికి ఇష్టంగా ఉంటుంది కొందరి పద్ధతి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, ఈ లోకపు తీరును ప్రక్కన పెడితే ప్రభువునందున్న మనకందరికీ ఆత్మీయ విషయములో ఒకే రకమైన పద్ధతి ఉండాలి. అలా ఉండాలనే మన తండ్రియైన దేవుని కోరిక.
దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంధము ఆధారముగా మన వైఖరి ఏ విధముగా ఉండాలో ఐదు విషయములను బట్టి ఆలోచన చేద్దాము.

The attitude of Love :  ప్రేమ


ప్రేమ మనలను ధైర్యపరుస్తుంది, ప్రేమ మనలను నడిపిస్తుంది, ప్రేమ మనకు సమస్త విషయాలలో విజయాన్నిస్తుంది, ప్రేమ మనలను ప్రోత్సాహిస్తుంది. ప్రేమ మనలను రక్షిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతము వహిస్తుంది.

ప్రేమ వలన ఇన్ని లాభములు ఉన్నవి కనుక ప్రేమను మన జీవితములో ఒక వైఖరిగా మార్చుకోవాలి. ఎవ్వరు నన్ను ద్వేషించినా ప్రేమించుటయే నా పద్ధతి అనే భావన మన హృదయములో నాటుకుపోవాలి. ఎందుకనగా ప్రేమ లేనిదే ఎవరును దేవుని చూడలేరు.

» జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. (1 కొరింధి. 8:1).

» మనమొకనినొకడు ప్రేమింపవలెననునది మొదటినుండి మీరు వినిన వర్తమానమేగదా? (1 యోహాను. 3:11).

» ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది
ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు. (1 యోహాను. 4:7-8).

(Note: 1 కొరింధి 13వ అధ్యాయము చదువవలెను)  

The attitude of Respect : గౌరవం (లేక) ఆదరణ


నేడు సంఘాలలో, కుటుంబాలలో కాని ఎక్కడ చూసినా సహోదరుల మధ్య ఆదరణ లేదు. ఒకరి యెడల ఒకరికి గౌరవం లేదు.  ఒకరినొకరు గౌరవించుకోవడం వలన కలహములు తగ్గుతాయి, ప్రేమ ఉప్పొంగుతుంది. ఒకరినొకరం ఆదరించుకొనుట వలన ధైర్యము కలిగి ఉంటాము, ప్రభువునందు విశ్వాసములో ఆసక్తి కలవారమగుతాము. కాబట్టి ఇతరులను, సహోదరులను ఆదరించుట మన జీవనశైలిగా మార్చుకోవాలి.

» మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనికొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై యుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా, అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత ఇయ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. – (1 థెస్సలొనీ. 5:10-14).

» కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. (రోమా. 12:17).

» ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.  - (1 పేతురు 3:9)

The attitude of Service : పరిచర్య (లేక) సేవ


మన స్థాయిని బట్టి హెచ్చించుకొనకుండా, దేవుని నిమిత్తము సహోదరులకు పరిచర్య చేయుటలో వెనుకాడకూడదు. క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు తనను తాను ఎంతగానో తగ్గించుకుని శిష్యుల పాదములను సైతము కడిగాడు. మనము కూడా అంత గొప్ప తగ్గింపు కలిగి అన్ని విషయములలో మన సహోదరులకు సేవ చేయాలి. క్రీస్తు సువార్త ప్రకటింపబడు నిమిత్తము, దేవుని ప్రేమ వెల్లడిపరచు నిమిత్తము మనలను మనము  దాసునిగా ఎంచుకొనినా తప్పులేదు. కాని ప్రియులారా, నీవు ప్రేమ కలిగి ఉంటేనే నే సహోదరునికి దాసుడుగా ఉండగలవని గుర్తుంచుకోవాలి.

» మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. – (మత్తయి. 23:11-12).

» సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. (గలతీ. 5:13).

» ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. (యోహాను. 13:14-15).

» మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడైయుండవలెను. (మత్తయి. 20:26-27).

The attitude of Peace : సమాధానము


ఈనాడు క్రైస్తవులలో చాలామందికి సమాధానము లేదు. సమాధానము లేక క్రీస్తు సంఘాలు చెదిరిపోతున్నాయి, హృదయములలో గర్వానికి ప్రాధాన్యతనిస్తున్నారు గానీ సమాధానమును వెతుకుటలేదు. అయితే సమాధాన పడుటలో గల ఆనందము, సంతోషము గ్రహించక అలా చేయుచున్నారేమో కాని ప్రియులారా సహోదరుల మధ్య సమాధానము  నీ జీవితమును శాంతి పధములో నడిపిస్తుంది. నిన్ను నీ దేవునికి దగ్గర చేస్తుంది. సమాధాన పడుటలో ఎంత మాత్రమును సిగ్గుపడక, ముందుకు కొనసాగితే నీ జీవితములో కలహములు ఉండవు.

» సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. (రోమా. 14:19).

» శక్యమైతే సమస్త మనుష్యులతో మీ చేతనైనంతమట్టుకు సమాధానముగా ఉండుడి. (రోమా. 12:18).

» కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము. (కీర్తన. 34:14).

» కీడునుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకిదాని అనుసరింపవలెను. – (1 పేతురు. 3:11).

» సమాధానము మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా సమాధానము మీకనుగ్రహించుచున్నాను. – (యోహాను. 14:27).

» క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగునుగాక. ఆమేన్. (1 పేతురు. 5:14).

» మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. – (యూదా. 1:2).

The attitude of Cooperation : సహకారము


దేవుని వాక్యమును బోధించుటలోను, ప్రార్థించుటలోను, సంఘము అభివృద్ధి చెందుటలోను సహోదరులకు మంచి సహకారులుగా ఉండాలి. స్వప్రయోజనమును,  సొంత కార్యములను చూచుకొనుటయే కాదు ఇతరుల కార్యముల విషయములో కూడా మన తోటివారికి సహకారమును అందించాలి. తోటివారు రక్షింపబడుటకు అన్ని విషయములలో వారికి సహకరించి, దేవునిని సంతోషపెట్టేవారముగా ఉండాలి.

» తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైనదానియందు అతని సంతోషపరచవలెను. (రోమా. 15:2).

» వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటరొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము చేర్చుచుండెను. (అపో. కార్య. 2:46-47).

» మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వా సముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు. - (2 కొరింథీ. 1:24)

» ప్రతివాడును తన స్వకార్యములనుమాత్రమేగాక యితరుల కార్యములనుకూడా చూడవలెను. క్రీస్తుయేసుకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. (ఫిలిప్పి. 2:4-5).

ముగింపు:

కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరీ, క్రీస్తుకు కలిగిన ఈ ఐదు పద్ధతులను మన జీవితములో కూడా అనుసరిస్తేనే దేవుని దృష్టికి నిజమైన క్రైస్తవుడిగా అంగీకరింపబడతాము. ఈ లోకములో క్రైస్తవులమని చెప్పుకుంటున్న అనేకమంది వారి స్థాయిలను బట్టి గర్వమును, అహంకారమును కనపరుస్తుంటారు కాని నిజమైన క్రైస్తవ్యము పైన తెలుపబడిన ఐదు లక్షణములలోనే ఉంది.

★ ప్రేమ, ఆదరణ, పరిచర్య, సమాధానము, సహకారము ఈ ఐదింటిని నీ వైఖరిగా మార్చుకో. దేవుని రాజ్యమును స్వతంత్రించుకో. 
● అందరూ చేస్తే నేను చేస్తాను అనే భావనను నీనుండి తొలగించుకొని మొదట నీతోనే ప్రారంభించి విశ్వాసులకు మాదిరిగా జీవించు.  

ఆలోచన చేసి ప్రవర్తన సరిదిద్దుకోవాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ, మీకు మనవి చేయుచున్నాను. 


మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16