"విధేయత" (Obey)

విధేయత 
ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

విధేయత అనగా "లోబడుట, భయము కలిగి యుండుట, చెప్పిన పని చేయుట".  

ప్రియులారా నేటి క్రైస్తవులలో అనేకమంది దేవునికి విధేయత చూపించే విషయములో చాలా వెనకబడి ఉన్నారు. మన జీవితాలలో విధేయత చాలా ప్రాముఖ్యమైనది. ఉదా: ఒక ఉద్యోగి తన అధికారికి విధేయత చూపిస్తేనే తన జీతము తాను పొందుకోగలడు, కుటుంబములో పిల్లలు తమ తలితండ్రుల యెడల విధేయత కలిగియుంటేనే తాము ఆశపడినవి అనుభవించగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు కలవు. కేవలము ఈ భౌతిక సంబంధమైన జీవితమూ కొరకే ఈ లోకస్థుల యెడల మనము ఇంత విధేయత చూపించగలితే మనలను సృజించి, తన కుమారుని పంపి ఆయన ద్వారా రక్షణను అనుగ్రహించి, తన కుమారునితో సమాన వారసత్వాన్ని ఇచ్చిన దేవునికి మనమెంత విధేయత చూపించాలో ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది.  

మనము జ్ఞానయుక్తముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విషయాలలో మనము విధేయత చూపించి, లోబడాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి విధేయత చూపించాల్సిన విషయాలలో అతి ప్రాముఖ్యమైన సంగతులను ఈ అంశము ద్వారా ఆలోచన చేద్దాము.

A). క్రీస్తు సువార్తకు విధేయత చూపాలి :


తన కుమారుడైన క్రీస్తు సువార్తకు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము తన కుమారుని ద్వారా మరియు అపోస్తులుల బోధ ద్వారా ఏ ఏ సంగతులు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడియున్నవో వాటన్నిటికి విధేయత చూపి తండ్రిని సేవించాలని ఆశపడుతున్నాడు.

నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. – (1 కొరింధి. 15:3-4).

● ఏలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేతను,... (2 కొరింధి. 9:13).

మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్య మూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనినవారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. (1 పేతురు. 1:22).

●  మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వముగా లోబడిన వారై. (రోమా. 6:17).

B). దేవుని వాక్యము చదువుటలోనూ, నేర్చుకొనుటలోనూ విధేయత చూపాలి :


మనలో అనేకమంది దేవుని వాక్యము చదివే విషయములోనూ, వాటిని అభ్యసించి నేర్చుకొను విషయములోను అశ్రద్ధ చూపిస్తూ, తమ సొంత పనుల నిమిత్తము దేవుని పనిని వాయిదా వేస్తున్నారు. దేవునికి విధేయత చూపలేకపోతున్నారు అలాంటి వారికి గ్రంథము చెప్పే సమాధానము,

● వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. – (రోమా. 1:28).

● నా జనులు అవివేకులువారు నన్నెరుగరు, వారు మూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలుచేయుటకు వారికి బుద్ధి చాలదు. – (యిర్మియా. 4:22).

● యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. (సామెతలు. 1:7).

● నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను. – (1 కొరింధి. 15:34).

● దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. – (తీతుకు. 1:16).


C). దేవుని మాటలను బోధించే విషయములో విధేయత చూపాలి :


ప్రియులారా ఈనాడు అనేకమంది క్రైస్తవులు దేవుని వాక్యమును నేర్చుకొనుటలో చూపించే ఆసక్తి ఇతరులకి బోధించే విషయములో చూపించలేకపొతున్నారు. కాని మనలో ప్రతీ ఒక్కరు దేవునికి విధేయత చూపించి, ఆయన మాటలను లోకమునకు తెలియజేయు విషయములో పాలిభాగస్థులమవ్వాలని గ్రంథము సెలవిస్తుంది.

● నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము. (2 తిమోతి. 4:12).

● మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయ కులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి. – (హెబ్రీ. 13:7).

● ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును. – (1 కొరింధి. 4:12).

● పుర్రు కుమారుడును బెరైయదేశస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకైయలలో అరిస్తార్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమొథెయును, ఆసియ దేశస్థులైన తుకికును, త్రోపిమును అతనితో కూడ వచ్చిరి. (అపొ.కార్య. 20:4).

● క్రీస్తుయేసునందు నాతోటి ఖైదియైన ఎపఫ్రాయు, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకాయు వందనములు చెప్పుచున్నారు. – (ఫిలోమోను. 1:24).

● తీతు ఎవడని ( యెవరైన అడిగినయెడల) - అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునైయున్నాడనియు; - మన సహోదరులెవరని ( అడిగినయెడల) - వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను. (2 కొరింధి. 8:23).

D). క్రీస్తు నిమిత్తము శ్రమలు పొందే విషయములో విధేయత చూపాలి :


సహోదరీ, సహోదరులారా నేటి క్రైస్తవులమైన మనము చాలా విషయాలలో విధేయత చూపగలుగుతున్నాము కాని చిన్న శోధన కలిగినా, శ్రమలు కలిగినా దేవునికి విధేయత చూపకుండా, ఆ శోధనను మహా ఆనందమని ఎంచుకొనక అపవాదికి లోబడిపోవుచున్నారు. క్రీస్తు వలె ప్రతి యొక్క శ్రమను జయించి, క్రీస్తు ఏలాగైతే దేవునికి విధేయుడై మరణమును జయించాడో అలాగే మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.

● తాను (యేసు) శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. – (హెబ్రీ. 2:17).

● క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింస పొందుదురు. (2 తిమోతి. 3:12).
క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలనుబట్టి నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. (1 పేతురు. 2:21).

● శిష్యుల మనస్సులను దృఢపరచి - విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. (అపొ.కార్య. 14:22).

● కాబట్టి ఇకను సహింపజాలక అతేనైలో మేమెంటిగానైనను ఉండుట మంచిదని యెంచి, యీ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమొథెయును పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడినవారమని మీరెరుగుదురు. (1 ధేస్సలోని. 3:3).

● మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి. – (1 పేతురు. 3:14).

● క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. – (2 కొరింధి. 4:18).

నా ప్రియ సహోదరులారా, మనము అడిగిన ప్రతీ ఈవిని దేవుడు మనకు దయజేస్తున్నాడు, మన కుటుంబములోను, పనులలోను, ఆరోగ్యములోను, ఇలా ఇహ సంబంధమైన ప్రతి విషయములోను మనకు అన్నియు సమకూరుస్తున్నాడు. అంతేకాదు మన ఆత్మ నశించిపోకుండా క్రీస్తును ఈ లోకమునకు పంపి (యోహాను. 3:16-17), ఆయన సిలువ మరణము ద్వారా మనలను విమోచించాడు (కొలస్సి. 1:14). అటువంటి దేవుడు మన నుండి విధేయత మాత్రము కోరుకుంటున్నాడు, తన మాటలకు లోబడాలని ఆశపడుతున్నాడు.  

కాబట్టి ప్రియులారా, ఈ సంగతులు మాకెందుకు అని అనుకుని దేవుని యెడల అవిధేయత చూపిస్తూ దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో ఆ విషయములను ప్రక్కన పెట్టి దేవుని యెడల విధేయత లేకుండా ఆయనకు లోబడకుండా మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఒకానొక రోజున చాలా బాధపడే అవకాశము ఉంది కనుక పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన సంగతులను ఆలోచన చేయవలసినదిగా నన్ను నేను హెచ్చరిక చేసికొనుచున్నాను మీకు మనవి చేయుచున్నాను.

యేసు ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను. – (ఫిలిప్పి. 2:8). 

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

4 comments

comments
Naresh
September 25, 2017 at 8:27 PM delete

Good Post Brother KM

Reply
avatar
Suresh
September 25, 2017 at 9:28 PM delete

Thanks Brother. Vandanamulu

Reply
avatar
Anil
September 25, 2017 at 11:26 PM delete

బ్రదర్ మనోహర్ మీరు వ్రాస్తున్నా అంశములు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. PDF ఫైల్స్ కూడా ఇస్తాను అని అన్నారు. కొంచము ఆ ఫైల్స్ కూడా కావాలి.
వందనములు (h)

Reply
avatar
Teja
September 26, 2017 at 6:17 AM delete

Vandanamulu manohar anna. Chala bagundhi.

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16