![]() |
మార్కు 16:14-18 |
ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా
హృదయపూర్వక వందనములు.
నేటి క్రైస్తవ సమాజములో అనేకమంది బోధకులు వాక్యమును సరియైన విధానములో
ఆలోచన చేయలేకపోవుట వలన పరిశుద్ధాత్ముడు అపోస్తులుల ద్వారా గ్రంథములో తెలియజేసిన
అనేక మర్మములను క్రమబద్ధంగా గ్రహించలేకపోతున్నారు. ఇటువంటి బోధకుల బోధనాశైలిని
మాదిరిగా తీసుకుని క్రైస్తవేతరులు దేవుని వాక్యమును
సరియైన రీతిలో అంగీకరించక పరిశుద్ధ గ్రంథమును అపార్థము చేసుకొనుచున్నారు. ఈ బోధకులు అనేకమైన భిన్న బోధలను ప్రజలలోనికి
తీసుకువెళ్ళి దేవుని వాక్యమును అనేక రకాలుగా వక్రీకరణ చేయుచున్నారు, వారు వక్రీకరణ
చేయుచున్నవాటిలో ఒకటైన మార్కు సువార్త
16వ అధ్యాయము 14 నుండి 18 వచనముల గూర్చి మనము గ్రంథమును పరిశీలన చేసి ఆలోచన
చేద్దాము.
★ పిమ్మట పదునొకండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి
ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచిన
వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని
గద్దించెను. – (మార్కు. 16:14).
★ నమ్మి బాప్తిస్మము పొందినవాడు
రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. – (మార్కు.
16:16).
★ నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు. – (మార్కు. 16:17).
★ పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి
హాని చేయదు, రోగుల మీద చేతులుంచి నప్పుడు వారు
స్వస్థత నొందుదురు అని వారితో చెప్పెను. – (మార్కు. 16:18).
ప్రియ సహోదరులారా, పైన చూపబడిన వచనములలో జరిగిన సంభాషణ యేసుక్రీస్తు
వారికి మరియు తన శిష్యులైనటువంటి అపోస్తులలకి మధ్య జరుగినదని మనము మొదట
గ్రహించాలి.
మార్కు. 16:14
యేసు వారు ఈ లోకములో సజీవుడిగా ఉన్నపుడు పెద్దల చేతను, ప్రధాన యాజకుల
చేతను, శాస్త్రుల చేతను తాను అనేక హింసలు
పొంది, చంపబడి, మూడవ దినమున తిరిగి లేపబడతాడని (మత్తయి. 16:21) తండ్రియైన
దేవుని యొక్క సంకల్పమును తన శిష్యులకు ముందుగానే
తెలియజేసినా, వారు మరిచి యేసు తిరిగి
లేచాడని నమ్మనందున యేసు వారిని గద్దిస్తూ మాటలాడిన మాటలు ఈ వచనములో చూడగలము.
» అప్పటి నుండి తాను (యేసు) యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన
యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన
శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా,... – (మత్తయి. 16:21,
మార్కు. 8:31).
» వారు గలిలయలో సంచరించుచుండగా యేసు తన శిష్యులతో - మనుష్య కుమారుడు
మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు, మూడవదినమున
ఆయన తిరిగి లేచును అని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. – (మత్తయి.
17:22-23, మార్కు. 9:31).
» వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచును'' అని
చెప్పెను. – (మార్కు. 10:34).
మార్కు. 16:15-16
అదేమనగా,
మీరు (అపోస్తులులు) సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి
సువార్తను ప్రకటించుడని ఆజ్ఞ ఇచ్చి ఎవరైతే వారు (అపోస్తులులు) చెప్పిన విషయములను
నమ్ముతారో, ఆ నమ్మిన విషయములను బట్టి ఎవరైతే బాప్తీస్మము ద్వారా క్రీస్తు శరీరములోనికి (Church of Christ) చేర్చబడతారో వారు రక్షింపబడతారని, నమ్మని వారు శిక్షకు పాత్రులని తెలియజేసెను.
★ నమ్ముట + బాప్తీస్మము = రక్షణ. – (మార్కు. 16:16).
» కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని
దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. – (యోహాను. 3:36).
» యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు
రక్షింపబడుదువు. – (రోమా. 10:9).
మార్కు. 16:17-18
మార్కు. 16: 17వ వచనమును జాగ్రత్తగా
పరిశీలన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ యేసు వారు తన శిష్యుల యొక్క హృదయ
కాఠిన్యము నిమిత్తము మరియు అపనమ్మకము
నిమిత్తము సందేహించిన వారిని గద్దిస్తూ, వారికి ఈలాగు తెలియజేసెను.
★ నమ్మినవారు = అపోస్తులులు.
» నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును అనగా మూలభాషలో- నమ్మినవారిని ఈ
సూచక క్రియలు వెంబడించును. – (మార్కు. 16:17).
ఈ వచనములో “నమ్మినవారు” ఎవరనగా “అపోస్తులులు” అని గ్రహించాలి.
ఎందుకనగా మునుపు వచనములను బట్టి ఇక్కడ సంభాషణ యేసు వారుకి మరియు తన శిష్యులకి అని
తెలుస్తుంది. యేసు శిష్యులలో కొందరు ఆయన మూడవ దినమున సమాధి నుండి లేచాడు అనే
విషయమును సందేహించుట చేత వారిని
ఉద్దేశించి మాట్లాడుతూ మీరు నమ్మిన యెడల మిమ్మల్ని సూచక క్రియలు వెంబడిస్తాయని
తెలియజేసెను.
తండ్రి
యొక్క వాగ్ధానమును అనగా పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి (యోవేలు.
2:28) యేసు ముందుగా తండ్రియొక్క వాగ్ధానమును తన శిష్యులకి జ్ఞాపకము చేసి
యెరూషలేములో వారు మాత్రమే పొందుకొనుటకు సహాయపడిరి. - (లూకా. 24:49; అపొ.కార్య.
1:4; 2:3-4).
» అప్పుడు
వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా వారు
కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు
విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ, అందరు పరిశుద్ధాత్మతో నిండిన
వారై, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది
అన్యభాషలతో మాటలాడసాగిరి. – (అపొ.కార్య. 2:2-4).
పరిశుద్దాత్మలో
బాప్తీస్మము పొందిన వారు అపోస్తులులు మాత్రమే అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది
కనుక పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందిన వీరు మాత్రమే ఈ సూచక క్రియలు
చేయగలరు.
» అనేక
మహత్యార్యములును సూచక క్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను. – (అపొ.కార్య.
2:43).
» వారు
(అపోస్తులులు) బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి, ప్రభువు వారికి
సహాకారుడైయుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన
వాక్యమును స్థిరపరచు చుండెను. – (మార్కు. 16:20).
గమనిక
: పరిశుద్దాత్మలో బాప్తీస్మము పొందకపోయినప్పటికీ దేవునిచేత అపోస్తలుడుగా
నియమింపబడిన పౌలుకి సూచక క్రియలు చేసే అధికారము ఇయ్యబడినది.
» మనుష్యుల
మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక, యేసుక్రీస్తు వలనను,ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన
పౌలను నేనును,... – (గలతీ. 1:1).
» యేసుక్రీస్తు
దాసుడును, అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. – (రోమా.
1:1).
» నేను
అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను. – (రోమా. 11:14).
సూచక క్రియలు :
◆ దయ్యములను వెళ్ళగొట్టుదురు. – (అపొ.కార్య. 19:11-12).
» దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు
తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని
విడిచెను, దయ్యములు కూడ వదలిపోయెను. – (అపొ.కార్య.
19:11-12).
◆ క్రొత్త భాషలు మాటలాడుదురు. – (అపొ.కార్య. 2:5-12).
వాస్తవానికి అపోస్తులులు గలిలయ దేశస్తులు అయినప్పటికీ పరిశుద్ధాత్మలో
బాప్తీస్మము పొందుట వలన వారియెడల ఈ సూచక క్రియ జరిగెను అదేమనగా 16 దేశములకు
సంబంధించిన వారితో వారికి తెలియని 9 అన్య భాషలలో మాట్లాడెను.
◆ పాములను ఎత్తి పట్టుకొందురు. - (అపొ.కార్య. 28:1-3)
» పౌలు మెలెతేలో మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసి
కొంటిమి. అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారమింతంత కాదు. ఏలయనగా అప్పుడు
వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరిని
చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు
బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. – (అపొ.కార్య. 28:1-3).
» పాములను తేళ్ళను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు (అపోస్తులులు)
అధికారము ననుగ్రహించి యున్నాను; ఏదియు మీ కెంత మాత్రమును హాని చేయదు. – (లూకా. 10:19).
◆ మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు.
పరిశుద్ధ గ్రంథములో ఏ అపొస్తులుడు మరణ కరమైనది త్రాగినట్టుగా మనము
చూడలేము కాబట్టి ఈ సూచక క్రియను గూర్చి గ్రంథము తెలియపరచలేదు.
◆ రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. - (అపొ.కార్య. 5:12-16).
» పేతురు
వచ్చుచుండగా, జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని
మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను, పరుపుల మీదను
వారిని ఉంచిరి. మరియు యెరూషలేము
చుట్టునుండు పట్టణములనున్న జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని
మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి. – (అపొ.కార్య. 5:12-16).
NOTE : మార్కు
సువార్త 16వ అధ్యాయము 17 మరియు 18 వచనములలో తెలియజేయబడిన సూచక క్రియలు
పరిశుద్దాత్మలో బాప్తీస్మము పొందిన అపొస్తులులు తప్ప మరెవ్వరును చేయలేదు మరియు చేయలేరు.
ఉదాహరణ:
» అపొ.కార్య.
2:37-41 వచనముల ప్రకారముగా అపోస్తులుల బోధను విని నమ్మి 3000 మంది క్రీస్తు
సంఘముగా (Church of Christ) చేర్చబడిరి.
» అపొ.కార్య.4:4
వచనముల ప్రకారముగా అపోస్తులుల బోధను విని నమ్మి 5000 మంది క్రీస్తు సంఘముగా (Church
of Christ) చేర్చబడిరి.
★ అపోస్తులల
బోధను విని + నమ్మి + బాప్తీస్మము = రక్షణ.
అపోస్తులుల
బోధ విని నమ్మి బాప్తీస్మము పొంది క్రీస్తు సంఘములో (Church of
Christ) చేర్చబడిన వారు అనేకమంది ఉన్నప్పటికీ వారెవ్వరూ కూడా మార్కు
సువార్తలో చెప్పబడిన సూచక క్రియలను చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా చూడలేము
దీనిని బట్టి మార్కు సువార్త 16వ అధ్యాయములో 1 7 మరియు 18
తెలుపబడిన సూచక క్రియలు కేవలము దేవుని చేత నియమింపబడిన అపోస్తులులకు మాత్రమే అని మనము
గ్రహించాలి.
కాబట్టి
ప్రియులారా వాక్యమును వక్రీకరణ చేసే భిన్న బోధలవైపు మరలకుండా గ్రంథమును జాగ్రత్తగా
పరిశీలన చేసి అపోస్తులల బోధలో ఉండి దేవుని యొక్క మర్మమును క్రమబద్ధంగా గ్రహించి,
క్రీస్తు సంఘములో (Church
of Christ) చేర్చబడి,
క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొందాలని మీకు మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్_నవీన.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com