ఐగుప్తు దేశము (The land of Egypt)

ఐగుప్తు దేశము - The land of Egypt


         అబ్రాహాము, తన కుమారుడైన ఇస్సాకు, అతని కుమారులైన యాకోబు ఏశావులు కానాను దేశములో నివసించిరి. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకు పోవుచున్న ఇష్మాయేలీయులకు బానిసగా అమ్మబడెను. కాని దేవుడతనికి తోడైయున్నందువల్ల అతడు అన్ని శ్రమల నుండి రక్షింపబడి తుదకు ఆ దేశమునకు ప్రధానమంత్రి అయ్యెను.

          ఖల్దియ దేశమువలె ఐగుప్తుకూడ నవనాగరికతలు గల దేశము. పురాతన వస్తు శాస్త్రజ్ఞులు ఆ దేశములో కూడా త్రవ్వకాలు సాగించి అనేక విలువగల వస్తువులను కనుగొనిరి. ఐగుప్తీయులు 'పిరమిడ్స్' అను గొప్ప గోరీలు, ఐగుప్తు రాజుల సమాధుల కొరకై కట్టించిరి. అవి నేటి వరకు నిలిచియున్నవి. ఆ సమాధులలో ఒకదానియందు అంటే 'టూటన్ కామెన్' అను యువరాజు యొక్క సమాధిలో విస్తారమైన బంగారు వస్తువులు దొరికినవి. బంగారముచే పొదిగించబడిన ఒక సింహాసనము, బంగారు ఆయుధములు, అద్దము, కలము, నగలు మొ||నవి.

          ఆ దేశ ప్రజలు సూర్యారాధన చేసెడివారు. మరియు అన్నిరకాల క్రిమికీటకాదులను, ముఖ్యముగా పెంకు పురుగును పూజించెడివారు, భారత దేశములో ముఖ్య నదులను పుణ్యనదులని పూజించుచున్నట్లే వారు నైలునదిని పూజించెడివారు. ఎందుకనగా ఆ దేశ సిరిసంపదలన్నియు దానిలో గుప్తమైయున్నవని వారి నమ్మకము. నైలు నీరు ప్రవహించని భూములు కేవలము యిసుకమయమైన ఎడారిగా నున్నవి. దేవుడు ఐగుప్తీయుల మీదికి ఆ పది తెగుళ్ళు పంపించినపుడు వారి ఆరాధ్య దేవతలన్నిటిపై అధికారము యెహోవాకే కలదని వారికి తెలియ పరిచెను. సూర్యుడు, నైలునది అందులో నివసించెడి జలచరములు, కప్పలు కీటకములను ఆయన మొత్తెను. ఇవి వారి ఆరాధ్య దేవతలు. కాని మోషే రప్పించిన పది తెగుళ్ళును ఆ దేవతలకు తలవంపులు తెచ్చినవి.  ఐగుప్తు శకునగాండ్రు సహితము ఆ పరాభవమును ఆపుచేయలేకపోయిరి. తద్వారా ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా సర్వశక్తిమంతుడని గ్రహించుకోగలిగిరి.
 
"సార్కా పగస్
          ఐగుప్తు దేశములోని ప్రతి రాజుకు ఫరో అను బిరుదు ఇవ్వబడెను. ఫరో అను మాటకు గొప్ప వంశస్థుడు, చక్రవర్తి అని అర్థము. ఆ కాలములోని రాజులందరు దేవుండ్లుగా ఎంచబడిరి. అందున వారు తమ యిష్టము వచ్చినట్లుగా శాసనములు గావించినను ఎవరును వారికి ఎదురు చెప్పలేకపోయిరి. వారు సూర్యకుమారులని కూడా పిలువబడిరి. కనుక వారు చనిపోయినపుడు వారి ఆత్మలు నెలునది మీద ప్రయాణము చేసి సూర్యభగవానునిలో లీనమైపోవునని ఐగుప్తీయులు తలంచేవారు. అందున ఒక మహారాజు మరణించినపుడు అతని మృత కళేబరముతోపాటు, జీవనోపాధి కొరకై ఒక పడవ, ఒక రథము, ఆహార సామాగ్రి, దుస్తులు వారు వాడుకొను బంగారు ఆభరణములు, అతని రత్నఖచిత సింహాసనము వారి గోరీలలో ఉంచెడివారు. ఒక రాజు చనిపోయినపుడు అతని సేవకులు కూడా విషము త్రాగి మరణించు అలవాటు ఆరంభములో కలదు. అప్పుడు వారి మృత కళేబరములను కూడా రాజు మృత దేహముతో నుంచెడివారు. అయితే రాను రాను ఆ ఆచారమును ఆపివేసి, మట్టితో చేయబడిన దాసదాసీల బొమ్మలు, మృతమైన రాజు సేవలకు సమాధలో నుంచెడివారు మరియు రాజుల మృతదేహములను విలువగల సుగంధ లేపనములు పూసిన గుడ్డతో చుట్టెడివారు. తదుపరి ఆ మృత దేహమును మనిషి ఆకారముగల శవపేటికలోనుంచి ఆ రాజు ముఖమును, అతని దేహ నిర్మాణమును వున్నది వున్నట్లు రంగులతోను,  వెలగల రాళ్ళతోను, ఆ పేటికపైన చిత్రించెడివారు. ఆ పెటెల పేరు "సార్కా పగస్. సుగంధ లేపనములతో చుటబడిన దేహమును మమ్మి అంటారు. (ఆది 50:2-3). సామాన్యమైన ప్రజలు కూడా తమ కుటుంబములో చనిపోయిన వ్యక్తుల శవములకు అదేవిధముగా సుగంధ ద్రవ్యములు పూసిన బట్ట చుట్టెడివారు.
ఐగుప్తు దేశములో వర్షపాతము కడు అల్పము. అందువల్ల అప్పటి రాజుల మృతదేహములు 2000 క్రీ.పూ. నుంచి నేటివరకు చెక్కు చెదరక అలాగే నిలిచియున్నవి. అనగా దాదాపు 4000 సం.లు పురావస్తు శాస్త్రజ్ఞులు వాటిని గోరీలనుండి తీసి అనేక యితర దేశములకు వంటి వస్తు ప్రదర్శనశాలలలో వాటిని వుంచిరి. టూటాన్ ఖామెన్ యువరాజు యొక్క సమాధిలో లభ్యమైన అపారసంపద, వస్తువులు ఐగుపు దేశములో నేటికిని చూడగలము.
          
 హిరోగ్లిఫిక్స్
          ఐగుప్తు దేశీయులు తమ వ్రాతలు మట్టి పలకల మీద వ్రాయలేదు. గాని జమ్ము, రెల్లు కలిపి అల్లి  వాటి మీద బొమ్మల సంకేతములతో వ్రాత వ్రాసి వాటిని  చుట్టగా చుట్టెడివారు. అది 'పెపరస్' అనబడెడిది. అయితే ఆ వ్రాత చాలాకాలము నిలువలసి వచ్చినప్పుడు వారు గోడలపై బొమ్మలను, బొమ్మల వ్రాతలను చెక్కిరి. ఆ విధముగా చెక్కిన స్థూపములకు అనగా మనుష్యులకు, పక్షులకు, జంతువులకు రంగులు పూయగా ఆ గోడలు ఎంతో రమ్యముగా కనబడెడిని, గోడలపై చెక్కబడిన స్థూపములను బట్టి  వ్రాతలనుబట్టి ఆనాటి పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసికొనవచ్చును.  ఆ కాలములో విద్య చాలమట్టుకు జ్యోతిష్కములతో కూడియుండెను. సంపన్న కుటుంబికులు మాత్రమే పూజారుల దగ్గర చదువు నేర్చుకొనగలిగిరి. గణిత శాస్త్రము విచిత్రమైన పద్దతిలో నేర్పబడెను. రానురాను వారు బొమ్మల వ్రాత మానివేసి గుర్తులు పెట్టుటను నేర్చుకొనిరి. ఆ బొమ్మల వ్రాతను హిరోగ్లిఫిక్స్ అందురు.

          యాకోబు తన కుమారుడైన యోసేపును కలుసుకొనుటకు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అతని కుటుంబములో 70 మంది ఉండిరి (ఆది. 46:27). వారు గొర్రెలను మేపెడి ప్రజలు. కాని గొర్రెలు ఐగుప్తీయులకు హేయమైన జంతువులు గనుక ఫరో వారిని గోషేను అను ప్రాంతములో నుంచెను. అది ఐగుప్తునకు ఫిలిష్తియుల దేశమునకును మధ్యనున్నది. అక్కడ యాకోబు సంతానము మిక్కిలి విస్తరించి వేలకొలదిగా అభివృద్ధి చెందిరి. సుమారు 250 సంవత్సరములు అయిన పిమ్మట రామసేసు 2 అను ఒక క్రొత్త ఫరో వారిని బాధింప మొదలు పెట్టెను. అతడు 60 సంవత్సరములు ఐగుప్తును ఏలెను (క్రీ.పూ. 1290-1224).

          అతడు వారిచే వెట్టి పనులు చేయించి తన పేరు చిరస్మరణీయముగా నుండుటకు పితోము, రామసేసు అనే పట్టణములను కట్టించుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు 150 సంవత్సరముల వరకు అనేక శ్రమలను అనుభవించినను వారింకను విస్తరించి గొప్ప జనాంగమైరి. దేవుడు పసిబాలుడైన మోషేను రక్షించి తుదకు అతని ద్వారా ఇశ్రాయేలీయులను ఎట్లు ఐగుప్తీయుల వశములో నుండి రక్షించెనో మనకు తెలిసిన విషయమే (నిర్గమ. 1 అధ్యా. 12 అధ్యా.,) ఆ సంఘటనలు రామసేసు -2 కాలములో జరిగినవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి క్రీ.పూ. 1280లో విమోచింపబడిరి.

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16