ఆందోళన (లేక) చింత |
ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన
యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ప్రియులారా, ఈ లోకములో ఏదైనా సమస్య వచ్చినప్పుడు
ఆందోళన పడడము, ఎక్కువగా ఆలోచించి బాధ పడడము మానవ సహజం. ఆహార విషయములోను, కుటుంబాన్ని
పోషించే విషయములోను, పిల్లల చదువు విషయములోను, ఉద్యోగ విషయములోను, అనారోగ్య
విషయములోను, etc... ఇలా పలు రకాల సమస్యలను మనుష్యులందరూ వారి జీవితాలలో రుచిచూస్తూ
ఉంటారు. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అన్యులైనటువంటి వారు చింత పడటంలో అతిశయోక్తి
లేదు ఎందుకనగా వారు నిజమైన దేవుడెవరో గ్రహించలేని స్థితిలో ఉన్నారు, దేవుడు తగిన
సమయమందు అన్నిటిని దయజేయువాడని వారు ఎరుగరు. కాని క్రైస్తవులైనటువంటి వారు కూడా ఇబ్బందులు
ఎదురైనప్పుడు దేవుని మీద భారం వేయకుండా అతిగా ఆలోచిస్తున్నారు, ఆందోళన
పడుతున్నారు. ఈ ఆందోళన (లేక) చింత విషయములో క్రీస్తు శరీరము”లోనికి” (క్రీస్తు
సంఘము) చేరిన మనకు గ్రంథము ఈ విధముగా సెలవిస్తుంది.
■ నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చియైనను, చింతింపకుడి, ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?. – (మత్తయి.
6:25).
■ ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్టులు కారా?. – (మత్తయి.
6:26).
మనుష్యులవలె ఆకాశపక్షులు పని చేయవు. వాటికంటూ ఒక
స్థిరత్వము ఉండదు. ఏ స్థితిలో ఎలా ఉంటాయో, ఎక్కడుంటాయో తెలిదు, అన్నిటికీ మించి
దేవుని స్వరూపములో లేవు. మరి వాటినే మన పరలోకపు తండ్రి ఎంతో చక్కగా పోషిస్తున్నప్పుడు
తన స్వరూపమందు, తన పోలికలో మనలను
నిర్మించిన (ఆది. 1:26) దేవుడు మనకు అంతకంటే శ్రేష్టమైన ఈవులనివ్వడా?. ఆలోచన
చేయాలి.
■ వస్త్రములనుగూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఒడకవు. – (మత్తయి. 6:28).
■ రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. నీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్టులు. – (మత్తయి. 10:29-31).
■ తన స్వకీయకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?. – (రోమా. 8:32).
★ సాధారణముగా మనుష్యులు మూడు రకాలైన విషయాలలో ఆందోళన
చెందుతారు.
కొంతమంది ఇంతకు మునుపే జరిగిపోయిన విషయాలను ప్రస్తుతము తలచుకుని
విపరీతమైన చింత కలిగియుంటారు, మరి కొంతమంది కొన్ని విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి
వాటిని మనము మార్చలేమని బాగుగా తెలిసి కూడా ఆందోళన చెందుతారు, ఇంకొంతమంది జరగని
విషయములు ఒకవేళ ఎప్పుడైనా జరుగుతాయేమో అని ముందుగా భావించి విచారిస్తారు.
లోకస్థులు ఈ విధముగా ఆలోచన చేసారంటే వారికి పరిశుద్ధ గ్రంథము తెలీదు. కాని దేవుని
జ్ఞానము తెలిసిన నేటి క్రైస్తవులు కూడా ఈ విధమైన చింత కలిగియుండడం చాలా బాధాకరం. అటువంటి
వారికి దేవుని గ్రంథము ఇలా చెప్తుంది.
■ సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి ( చేయుచున్నాను), వెనుక ఉన్నవి లక్ష్యపెట్టక ముందట ఉన్నవాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను. – (ఫిలిప్పి.
3:13-14).
■ నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. – (సామెతలు. 55:22).
■ మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచున్నాడు. – (1 కొరింధి. 7:32).
■ దేనిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. – (ఫిలిప్పి. 4:6).
■ ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. – (1 పేతురు. 5:7).
ప్రియ సహోదరుడా,
సహోదరీ ఒక్కొక్కసారి చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి సమయములో
నీ చింత యావత్తు దేవుని మీద వేసి విశ్వాసముతో ప్రార్ధన చేసిన యెడల దేవుడు
ఖచ్చితంగా సహాయము చేయగలడు. నీవు చేయవలసినది ఒక్కటే, ఎంత మాత్రమును నీ విశ్వాసమును
కోల్పోకుండా ధైర్యముతో నీ భక్తిని కొనసాగించడమే.
■ రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును. – (మత్తయి. 6:34).
ప్రియులారా, దేవుడు తన పిల్లలమైన మనలను ఏ విధముగా పోషించగలడో గ్రంధములో
ఒక దైవజనుని జీవితమును చూస్తే మన దేవుడు ఎంత గొప్పవాడో, తన రూపములో నిర్మించుకున్న
మన యెడల ఎంత ప్రేమ కలిగియున్నాడో తెలుస్తుంది.
★ పిమ్మట యెహోవా వాక్కు అతనికి (ఏలియాకు) ప్రత్యక్షమై నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము; ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. – (1 రాజులు.
17:2-6).
కరువు కాలములో
ఉన్నపుడు కాకుల చేత ఏలియాకు ఆహారము పంపించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు
విడిచిపెడతాడు?.
■ నేడు ఉండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి - ఏమి తిందుమో యేమి త్రాగదుమో యేమి ధరించకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి; అప్పడవన్నియు మీకనుగ్రహింపబడును. – (మత్తయి. 6:30-33).
ఆనాడు మన పితరుల
జీవితములో అనేక అద్భుత కార్యములు చేయుటకు కారణము వారి విశ్వాస జీవితము. మరి మన
విశ్వాసము ఎలా ఉంది? మన దేవుడు నమ్మదగిన వాడని విశ్వసిస్తున్నామా? అనుదినము గ్రంథము
చదివి ప్రార్ధన చేసి ఆయనను సంతోషపెడుతున్నామా? ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది.
● మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. – (యోహాను. 14:1).
● సమాధానము మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా సమాధానము మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. – (యోహాను. 14:27).
● మనము నమ్మదగనివారమైననుఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. – (2 తిమోతి. 2:13).
కాబట్టి ప్రియ
సహోదరులారా, ఈ ఇహలోక భౌతిక సంబంధమైన విషయములలో ఎంత మాత్రమును మనము చింతపడక, ఇంత
గొప్ప నమ్మదగిన దేవుడు మనయెద్ద ఉన్నప్పుడు మనము ఏ విషయములును గూర్చి అతిగా ఆలోచన
చేయక, విశ్వాసముతో, దైర్యముతో దేవుని రాజ్యమును, నీతిని వెదుకుతూ (మత్తయి.
6:33) ఆయన చిత్తములో నడిచిన యెడల మన జీవితములో ఎటువంటి సమస్య వచ్చిన క్రీస్తునందు
విశ్వాసముతో జయించగలమని, దేవుడు తన కుమారుని ద్వారా చేసిన వాగ్ధానము నిత్యమూ నిలిచుయుంటుందని ఎరుగవలెనని నన్ను
నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com