క్రైస్తవులు ఖచ్చితంగా పాపమును ద్వేషించాలి |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన
యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ఈ లోకములో చాలామంది ద్వేషము అంటే చాలా ప్రతికూలమైన పదమని, పగలు,
ప్రతీకారాలు ఉన్నవారు మాత్రమే ద్వేషము కలిగి యుంటారని, మనము ఏ విషయములోను ద్వేషము
కలిగి ఉండకూడదనీ, ప్రేమ - ద్వేషము రెండు కలిసి ఉండవనీ అలా ఉంటే అతడు మనిషి కాదనీ
ఇలా పలు రకాలుగా ఆలోచిస్తారు.
ప్రియులారా ఈ విధముగా ఆలోచించుట మంచిదే కానీ క్రైస్తవులమైన మనకీ ఈ
రెండూ ఉండాలి. క్రైస్తవులమైన మనము ప్రేమను మాత్రమే కలిగియుండాలి కదా ద్వేషము
ఉండకూడదు కదా అని ఆలోచన రావచ్చు అయితే పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, మనము నిజమైన
క్రైస్తవులమైతే మనము దేవుని యెడల , సహోదరుల యెడల ప్రేమ కలిగి ఉండాలి అలాగే పాపమును
ఖచ్చితంగా ద్వేషించే వారముగా ఉండాలి. కానీ మనలో చాలామంది ప్రేమ, ద్వేషము ఈ రెండిటిని
ఒకే విషయములో చూపిస్తూ దేవునికి విరోధులవుతున్నారు.
★ క్రైస్తవుడైన నీవు చెడుతనమును
అనగా పాపమును ద్వేషిస్తేనే దేవుని ప్రేమించగలవు.
» యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. – (కీర్తన. 97:10).
★ ఒకవైపు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మరోవైపు పాపముకు దాసులైన
యెడల అట్టివారిని దేవుడు తృణీకరిస్తాడని గ్రహించాలి.
» ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు; అతడు
ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి
యొకని తృణీకరించును.
మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. –
(మత్తయి. 6:24).
★ క్రైస్తవుడవైన నీవు పాపమును ద్వేషిస్తేనే దేవుని యెడల భయభక్తులు చూపగలవు.
» యెహోవాయందు భయభక్తులు
గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత
కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. – (సామెతలు. 8:13).
» నీతిమంతునికి కల్ల మాట
అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. – (సామెతలు. 13:5).
అబద్ధము నాకసహ్యము అది
నాకు హేయము. – (కీర్తన. 119:163).
★ క్రైస్తవుడవైన నీవు సత్యమందు నిలిచియుండక
పాపమును ద్వేషించని యెడల నీవు అపవాది సంబంధివని తీర్పు తీర్చబడుతుంది కనుక అపవాది
క్రియలను ద్వేషించాలి.
» మీరు మీ తండ్రియగు అపవాది
సంబంధులు, మీ తండ్రి దరాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు. – (యోహాను. 8:44).
» ఆయనను ఎరిగియున్నానని
చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు. – (1 యోహాను. 2:4).
★ యేసు, క్రీస్తు కాడని
అనుచూ, ఆయన మనకు ఏమై ఉన్నాడో పరిపూర్ణ విశ్వాసముతో నీవు నమ్మని యెడల నీవు అబద్ధికుడవుతావని
గ్రహించి తండ్రిని, కుమారుని సరియైన విధానములో ఒప్పుకొని పాపమునకు దూరముగా ఉండాలి.
» యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని
వీడే క్రీస్తువిరోధి. – (1 యోహాను. 2:22).
» అదేమనగా యేసు ప్రభువని
నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. – (రోమా. 10:9).
★ క్రైస్తవుడవైన నీవు దేవుని
ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచూ నీ సహోదరుని ద్వేషించిన యెడల నీవు పాపమును
అసహ్యించుకొనువాడవు కావు.
» నేను దేవుని ప్రేమించుచున్నానని
చెప్పి తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని
ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. – (1 యోహాను. 4:20).
★ నీవు క్రైస్తవుడవని చెప్పుకుంటూ ఈ క్రింది క్రియలు
కలిగియున్న యెడల నీవు పాపమును ప్రేమించువాడవు.
» పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండుగుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. – (ప్రకటన. 21:8).
★ మన దేవుడు ఏ ఏ విషయములను అసహ్యించుకుంటున్నాడో ఆయా
విషయములన్నిటిని మనము కూడా ద్వేషించాలి అప్పుడే నీవు దేవుని దృష్టికి యోగ్యుడవు.
» యెహోవాకు అసహ్యములైనవి
ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు, కల్లలాడు
నాలుకయు, నిరపరాధులను, చంపు చేతులును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి
పరుగులెత్తు పాదములును, లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. – (సామెతలు. 6:16-19).
» నీతిని అనుసరించి నడచుచు
యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ
తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు
మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును. – (యెషయా. 33:15).
★ క్రైస్తవుడవైన నీవు
దుష్టత్వమును ద్వేషించాలి.
» యెహోవా నీతిమంతులను పరిశీలించును.
దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు. – (కీర్తన. 11:5).
» దుష్టులు తమ మనోభిలాషనుబట్టి
అతిశయపడుదురులోభులు యెహోవాను తిరస్కరింతురు. – (కీర్తన. 10:3).
★ ఈ లోకములో అబద్ద
ప్రవక్తలున్నారు కనుక దేవుని సంబంధమైన వారెవరో గ్రహించి అబద్ద బోధలను ద్వేషించే
వారిగా ఉండాలి.
» ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను
నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. – (1 యోహాను. 4:1).
» అబద్ధ ప్రవక్తలుగూర్చి
జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన
తోడేళ్లు. – (మత్తయి. 7:15).
ప్రియ సహోదరుడా,
సహోదరీ క్రీస్తు కూడా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు కనుకనే దేవుడు
ఆయనను ఆనంద తైలముతో అభిషేకించాడు.
» నీవు నీతిని ప్రేమించితివి
దుర్ణీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీతోటివారికంటె నిన్ను ఎక్కువగా
ఆనంద తైలముతో అభిషేకించెను. – (హెబ్రీ. 1:9).
క్రైస్తవులమైన మనము
కూడా సహోదరుల యెడల ఎంత ప్రేమ కలిగి యున్నామో అలాగే పాపము యెడల మాత్రమే ద్వేషము కలిగి యుంటేనే
దేవుడు మనలను కూడా క్రీస్తుతో సమానమైన వారసత్వమునిచ్చి మనకు నిత్యజీవమును
అనుగ్రహిస్తాడు.
ప్రియులారా, నేటి
క్రైస్తవులలో అనేకమంది సహోదరుల యెడల ప్రేమను మాత్రము కాదు ద్వేషము కూడా కలిగియుండి,
సహోదరుల పట్ల పక్షపాతము చూపిస్తూ, పాపమును ప్రేమించేవారిగా ఉంటూ, అపవాది సంబంధులగా
ఎంచబడుతున్నారు. అంతేకాకుండా సందర్భమును బట్టి వారి ఆలోచనలు మార్చుకుంటూ దేవుని
యందు నిలకడగా ఉండలేకపోతున్నారు. అలా కాకుండా పాపమును పూర్తిగా
ద్వేషించినట్లయితే మన జీవితములో అనేక ఆశీర్వాదములు పొందుకోగలమని, దేవుని చెంతకు
చేరగలమని గ్రహించి సహోదరుల యెడల ప్రేమ, పాపము యెడల మాత్రమే ద్వేషము కలిగియుండాలని
నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ మీకు మనవి చేయుచున్నాను.
● ప్రేమ దుర్ణీతి విషయమై
సంతోషపడక సత్యమునందు సంతోషించును. – (1 కొరింధి. 13:6).
● కీడును ద్వేషించి మేలును
ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి,.. – (ఆమోసు. 5:15).
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
నవీన మనోహర్.
1 comments:
commentsgood post bro
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com