ఇల్లు |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ఇల్లు అనగా మనకు రెండు విషయములు గుర్తుకువస్తాయి ఒకటి భౌతిక
సంబంధమైనది రెండు ఆత్మ సంబంధమైనది. అయితే ఆత్మ సంబంధమైన ఇల్లు
అనగా సంఘము (1 కొరింధి 3:9; గలతీ. 6:10) గూర్చి ఇంతకుముందు వ్రాసిన అంశము
ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు భౌతిక సంబంధమైన ఇంటిని గూర్చి తెలుసుకుందాము.
క్రైస్తవులమైన మనము పరిశుద్ధ గ్రంథము చెప్పిన విధముగా మంచి కుటుంబముగా లేక దేవుని ఇంటిగా కట్టబడుతున్నామా? దేవునికి యిష్టానుసారముగా మన కుటుంబములను మన
ఇంటిని ముందుకు నడిపిస్తున్నామా? ఒక క్రైస్తవుని కుటుంబము ఎలా ఉండాలో గ్రంధమును
పరిశీలన చేస్తున్నామా?
ఈ విషయాలను ఆలోచన చేసి మన కుటుంబము లేక ఇల్లు ఏ విధముగా ఉండాలని దేవుడు
ఆశ పడుతున్నాడో గ్రంధము ఆధారముగా వచనములను చూసి మార్పు చెందుదాము.
ఇంటిని గూర్చి గ్రంథ వివరణ
A). క్రైస్తవులమైన మనము, మన ఇల్లు దేవునికి సంబంధించిన ఒక వ్యవస్థ అని,
దానికి ఆయన అధికారియై యున్నాడని మొదట గ్రహించుకోవాలి. ఎందుకనగా ఆదాముని నిర్మించిన
దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని యెంచి హవ్వని నిర్మించి వారిని ఒక
కుటుంబముగా, ఒక యింటిగా కట్టెను.
● దేవుడైన యెహోవా నేలమంటితో
నరుని నిర్మించి,.. – (ఆది. 2:7).
● అప్పుడు దేవుడైన యెహోవా
ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి
ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను
స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. – (ఆది. 2:21-22).
B). ఇల్లు కుటుంబ సభ్యులతో
కూడిన ఒక విభాగము. దానికి అధికారి పురుషుడు లేక భర్త.
● ఆదాము (భర్త), హవ్వ
(భార్య), కయీను, హేబెలు (కుమారులు), etc... - (ఆది. 2:24; 4:1-2).
C). ప్రతి ఇంటిలోనూ భర్త
మాత్రమే నాయకుడుగా ఉండాలి మరియు తన భార్యను, పిల్లలను సరియైన పద్ధతిలో నడిపించే వాడుగా ఉండి దేవుని
నామాన్ని మహిమపరచాలి.
● క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున
పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. – (ఎఫెసీ.
5:23).
● ప్రతి పురుషునికి శిరస్సు
క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు
మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. – (1 కొరింధి. 11:3).
● సంపూర్ణమాన్యత కలిగి
తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగ ఏలువాడునైయుండవలెను. – (1
తిమోతి. 3:4).
D). ప్రతి ఇంటిలోనూ భర్త
తన కుటుంబమును పోషించేవాడిగా ఉండాలి. ఎందుకనగా మొదటి నుండి పురుషులే పని చేసి తమ
కుటుంబములను పోషించేవారిగా ఉన్నారని గ్రంథము తెలియజేస్తుంది.
● మరియు దేవుడైన యెహోవా
నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. – (ఆది.
2:15).
● ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై
అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును – (1 తిమోతి. 5:8).
E). ప్రతి ఇంటిలోనూ భర్త
భార్యను ప్రేమించేవానిగా ఉండాలి. క్రీస్తు ఎలాగైతే సంఘమును ప్రేమించి తన శరీరమును
అర్పించాడో అలాగే భర్త కూడా తన భార్యను ప్రేమించాలి.
● పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును
ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను
మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దాని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత
దాని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. – (ఎఫెసీ.
5:25).
● అటువలెనే పురుషులుకూడ
తమ స్వశరీలములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. – (ఎఫెసీ. 5:28).
F). ప్రతి ఇంటిలోనూ
భార్య గృహనిర్వాహకురాలై యుండి ఇంటనుండి పని చేసుకునేదానిగా ఉండాలి.
● కాబట్టి యౌవనస్త్రీలు
వివాహము చేసికొని, పిల్లలు కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. – (1 తిమోతి.
5:14).
● ఆలాగుననే వృద్ధస్త్రీలు
కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునైయుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు; దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడుచు, పతిప్రియులును శిశుప్రియులును
స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని.
– (తీతుకు. 2:5).
G). ప్రతి ఇంటిలోనూ
భార్య తన భర్తకు లోబడి విధేయత చూపడమే తనకు అలంకారముగా ఎంచుకుని కుటుంబము విషయములో
జాగ్రత్త కలిగి భర్తను గౌరవించాలి.
● స్త్రీలారా, ప్రభువునకువలె మీ స్వపురుషులకు లోబడియుండుడి. – (ఎఫెసీ. 5:22).
● భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.
– (కొలస్సి. 3:18).
● అటువలె పూర్వము దేవుని
ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల
ఆమెకు పిల్లలగుదురు – (1 పేతురు. 3:5-6).
● భార్యయైతే తన భర్తయందు
భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను. – (ఎఫెసీ. 5:33).
H). గర్భ ఫలము దేవుడిచ్చు
బహుమానము కనుక ప్రతి ఇంటిలోనూ తల్లితండ్రులు తమ పిల్లలను దేవుని జ్ఞానములో పెంచేవారిగా
ఉండి వారికి కోపము రేపక వారికి అన్నిటిని సమకూర్చే వారిగా ఉండాలి.
● కుమారులు యెహోవా అనుగ్రహించు
స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే. – (కీర్తన. 127:3).
● నీ పూర్ణహృదయముతోను నీ
పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
నేడు నేను నీకాజ్ఞాపించు
ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును
వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. – (ద్వితియో.
6:5-7).
● తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. –
(ఎఫెసీ. 6:4).
I). ప్రతి యింటిలోను
పిల్లలు అన్ని విషయములలోను తమ తల్లి
తండ్రుల మాటలు విని వారికి విధేయులై ఉండాలి.
● పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. – (ఎఫెసీ.
6:1).
● పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనదగినది.
– (కొలస్సి. 3:20).
కాబట్టి ప్రియులారా,
క్రైస్తవులమైన మన ఇల్లు ఏ విధముగా ఉన్నది? గ్రంథములో చెప్పిన విధముగా పురుషుడు
కుటుంబమును పోషిస్తున్నాడా? నీ ఇంటిలో పురుషుడే అధికారము చేయుచున్నాడా? నీ భార్య ఇంటి
బాధ్యతలు నెరవేర్చి భర్తకు లోబడుతున్నదా? నీ పిల్లలని దేవుని శిక్షలోను,
జ్ఞానములోను పెంచుతున్నావా?. ఆలోచన చేయు గ్రంధములో చెప్పబడిన మాటలను పరిశీలన చేసి
నీ కుటుంబము దేవుని విరోధముగా నడుచుకుంటున్నట్లయితే ఈ క్షణమే నీ మనస్సు మార్చుకుని
నీ కుటుంబమును సరియైన దారిలో నడిపించి దేవుని నామాన్ని మహిమ పరిచి ఆయన యిచ్చే
ప్రతి ఆశీర్వాదమును పొందుకో.
మీ ఆత్మీయ సహోదరుడు,
» మనోహర్ బాబు. ©
2 comments
commentsGood Topic Brother
ReplyThank you Brother
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com