యేసు దేవునితో సమానుడు!?


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 


1️⃣. పరిచయం

"యేసు తన దేవునితో సమానుడా?" అనే ప్రశ్న క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైనది మరియు అలాగే అందరిలో ఎక్కువగా అపార్థం చేయబడుతున్న అంశమని కూడా చెప్పవచ్చును. ముఖ్యంగా ఫిలిప్పీయులకు 2:6 వంటి వచనాలను ఆధారంగా చేసుకొని, యేసు దేవునితో అన్ని విషయాలలో సమానుడే, నూటికి నూరుపాళ్లు సమానుడే అనే భావనను కొందరు బోధిస్తున్నారు. ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని వారి బోధలు నిజమే అని నిర్ణయించడానికి ముందు… మనమైతే అపోస్తలుల బోధ వెలుగులో — బైబిల్ అంతటిని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మొదటగా గుర్తించుకోవాలి. 


“లేఖనాన్ని లేఖనంతో పోల్చాలి” (1 కొరింథీ 2:13). అందువల్ల “సమానుడు” అనే పదం ఏ విషయంలో, ఏ పరిమితిలో, ఏ సందర్భంలో ఉపయోగించబడిందో స్పష్టంగా తెలుసుకోవాలి. 


ఈ అంశంలో... యేసు ఏ విషయాలలో తన దేవునితో సమానుడు?, ఏ విషయాలలో సమానుడు కాదు? అనే విషయాలను భావోద్వేగాలు, మనుషుల సాంప్రదాయాలు, సిద్ధాంతాల ఆధారంగా కాకుండా, కేవలం అపోస్తలుల బోధ వెలుగులో మాత్రమే పరిశీలించబోతున్నాము.


💥 Note : ఈ అంశము ద్వారా మీరు ఊహించినట్టుగా యేసును తక్కువ చేయడం లేదు. మన తండ్రియైన దేవుని మహిమను నిలబెట్టుతూ, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము అపోస్తలుల బోధ ప్రకారం అర్థం చేసుకొనుటకు ప్రయత్నించుటయే ఈ అంశం యొక్క ఉద్దేశం. 🙏🏿 


2️⃣. సమానత్వం 

సమానత్వం (Equality) అనగా — రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు, వస్తువులు, స్వభావాలు లేదా స్థితులు

👉 ఒకే ప్రమాణం ప్రకారం పోల్చినప్పుడు

👉 ఒకే స్థాయిలో, ఒకే విలువలో, ఒకే స్వరూపంలో ఉండుట.

అంటే, పోలిక చేసే అంశంలో తేడా లేకపోవడమే సమానత్వం.


ఉదాహరణ:

✨  రెండు తూకాలు ఒకే బరువు చూపితే — అవి సమానం.

సమానత్వం అనేది “అన్ని విషయాలలో ఒకేలా ఉండటం” కాదు, పోల్చబడే అంశంలో మాత్రమే ఒకేలా ఉండటం.

ఉదాహరణ:

👥 తండ్రి – కుమారుడు ≈ స్వరూపంలో సమానం, అధికారంలో కాదు, జ్ఞానంలో కాదు.

💸   రెండు నాణేలు ≈ వాటి యొక్క విలువలో సమానం

🧑‍🎓👩‍🎓  ఇద్దరు విద్యార్థులు ≈ మానవత్వంలో సమానం, జ్ఞానంలో కాదు.



3️⃣. యేసు ఏ విషయాల్లో సమానుడు?


🔎 దేవుని స్వరూపము/దైవత్వములో సమానుడు

▪️ "ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి,..." (ఫిలిప్పీ. 2:6- 7)

▪️ "ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;౹" (కొలొస్సి. 2:9)

▪️"ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹" (కొలొస్సి 1:15)

▪️ "ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, …." (హెబ్రీ. 1:3)


💥 μορφή - morphē - మోర్-ఫే

💥 రూపం, ఆకారం


➡️ నిర్ణయం : స్వరూపము/దైవత్వములో  సమానత్వం ఉంది.


మరింత వివరణ కోసం *𝟭𝟮𝟲. యేసుక్రీస్తు యొక్క దైవత్వము" అనే అంశమును చదవగలరు. 


🔎 స్వభావములో/పరిశుద్ధతలో సమానుడు

▪️బైబిల్ ప్రకారం యేసు పరిశుద్ధతలో, పాపరహితత్వంలో దేవునితో సమానుడు. (హెబ్రీ. 4:15; 1పేతురు. 2:22).

▪️ఆయన దేవునికి విధేయుడైన కుమారుడు (యోహాను 5:19; 8:28).

▪️పేతురు మాటల్లో " నీవు దేవుని పరిశుద్ధుడవు.” (యోహాను 6:69)

▪️గబ్రియేలను దూత మాటల్లో “పుట్టబోయే శిశువు పరిశుద్ధుడని పిలువబడును.” (లూకా 1:35)

▪️అపవిత్రాత్మపట్టిన మనుష్యుడు మాటల్లో "..... నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను." (మార్కు. 1:24)


➡️ నిర్ణయం : స్వభావ సమానత్వాన్ని విధేయత, ఆధీనత పరిధిలోనే అర్థం చేసుకోవాలి.


🔎 దేవుని మహిమలో సమానుడు

▪️ "తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను 17:5)

▪️ “ఆయన దేవుని మహిమకు ప్రతిబింబమై…" (హెబ్రీ. 1:3)

▪️ యేసును చూచినవాడు దేవుని మహిమను చూచినట్టే (యోహాను 14:9 భావం).


✅ యేసు దేవుని మహిమను కలిగినవాడు, ప్రకటించినవాడు, ప్రతిఫలించినవాడు — అందువల్ల దేవుని మహిమలో సమానుడు.


🔎 ఘనతలో సమానుడు

▪️ "తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.౹" (యోహాను. 5:23)

▪️ "అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును —సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.౹" (ప్రకటన. 5:13)

▪️ “అందుకే దేవుడు ఆయనను అత్యున్నతముగా హెచ్చించి… ప్రతి మోకాలి వంగునట్లు.” (ఫిలిప్పీయులకు 2:9–11)

▪️ “ఆయనను ఘనతయు మహిమయు తో కిరీటము పెట్టెను.” (హెబ్రీయులు 2:9)


✅ ఘనత అనగా timaō (honour) ఘననము/ గొప్ప చేయునది, విలువ గలది, గౌరవించదగినది. ఆరాధన(worship) కాదు సుమీ!

✅ దేవునికి ఘనత చెందాలి.

✅ యేసు కూడా ఘనతకు పాత్రుడిగా లేఖనములో ప్రకటించబడ్డాడు.

✅ తండ్రిని ఘనపరచునట్లే కుమారునిని ఘనపరచమని యేసే చెప్పాడు.


🔎 నీతి - న్యాయంలో సమానుడు

▪️ "యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును … అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును." (యెషయా 11:1,5)

▪️ “దావీదు సింహాసనముమీద ఆయన నీతి న్యాయములతో దానిని స్థిరపరచును.” (యెషయా. 9:7)

▪️“నేను తీర్పు తీర్చునప్పుడు నా తీర్పు న్యాయమైనదే.” (యోహాను. 5:30)

▪️ "వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను." (యోహాను. 7:24)


✅ దేవుడు నీతి, న్యాయం గలవాడు

✅ యేసు కూడా నీతి, న్యాయం గలవాడిగా ప్రకటించబడ్డాడు


🔎 కృపలో సమానుడు

▪️“యెహోవా కరుణగలవాడును కృపగలవాడును” (కీర్తనలు 103:8)

▪️“ఆ వాక్యము శరీరధారియై… కృపతోను సత్యముతోను నిండియుండెను.” (యోహాను. 1:14)

▪️“ఆయన నోటినుండి బయలుదేరిన కృపాకరమైన మాటలకు అందరు ఆశ్చర్యపడిరి.” (లూకా 4:22)

▪️“మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు…” (2 కొరింథీయులు 8:9)


✅ దేవుడు కృపగలవాడు

✅ యేసు కృపతో నిండినవాడు, కృపను మనకు ప్రకటించినవాడు


🔎 నీతిని జరిగించుటలో వచ్చు రోషము విషయములో సమానుడు

▪️ "న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు." (కీర్తనలు. 7:11)

▪️“ఆయన కొరడాను చేసి… దేవాలయమునుండి వారిని బయటకు వెళ్లగొట్టెను.” (యోహాను. 2:15-16)

▪️“…సింహాసనముమీద కూర్చున్నవాని ముఖమునుండియు, గొఱ్ఱెపిల్ల రోషమునుండియు మమ్మును దాచుకొనుడి.” (ప్రకటన. 6:16-17)

▪️"సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?" (మత్తయి. 23:33)


✅ దేవుని రోషము = నీతి, న్యాయానికి ఆధారమైన కోపము

✅ యేసు రోషము = అదే నీతి–న్యాయానికి వ్యతిరేకమైన పాపంపై వచ్చిన కోపము


🔎 పాపిని ప్రేమించుటలో సమానుడు

▪️ “దుష్టుడు తన మార్గము విడిచి బ్రదికివుండుటనే నేను కోరుచున్నాను.” (యెహెజ్కేలు 33:11)

▪️“దేవుడు లోకమును ఎంతో  ప్రేమించెను” (యోహాను. 3:16)

▪️“నేనును నిన్ను శిక్షింపను; పోయి ఇక పాపము చేయకుము.” (యోహాను 8:10–11)

▪️“నశించినదానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చెను.” (లూకా. 19:10)


✅ దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు.

✅ యేసు కూడా అదే ప్రేమను, అదే కరుణను పాపుల పట్ల చూపించాడు.


🔎 సృష్టి/నరుని నిర్మాణములో సమానుడు

▪️“సమస్తమును ఆయన ద్వారా కలిగెను; ఆయన లేకుండా కలిగినది ఏదియు లేదు.” (యోహాను. 1:3)

▪️“ఆయన ద్వారా సమస్తమును సృష్టింపబడెను… సమస్తమును ఆయన ద్వారాను ఆయనకొరకును సృష్టింపబడెను.” (కొలస్సయులు 1:16)

▪️ “ఒక్కడే దేవుడు — తండ్రి… సమస్తము ఆయన నుండి; ఒక్కడే ప్రభువు — యేసుక్రీస్తు — సమస్తము ఆయన ద్వారా." (1 కొరింథీయులు 8:6)

▪️ “క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి" (2 కొరింథీయులు 5:17)


✅ సృష్టికి మూలకర్త — దేవుడు (తండ్రి).

✅ సృష్టి ద్వారా/లో కార్యరూపం దాల్చినవాడు — యేసు.

✅ ఉద్దేశం, సంకల్పం ఒకటే; కార్యం ఒకటే.


సృష్టి నిర్మాణములో దేవుని సంకల్పానికి అనుగుణంగా, ఆయన ద్వారా సృష్టి జరిగినందున యేసు దేవునితో సమాన పాత్రలో (కార్యపరంగా) ఉన్నాడు



4️⃣. యేసు ఏ ఏ విషయాల్లో సమానుడు కాదు?

A.  కాల నిర్వహణలో సమానుడు కాదు — (అపో. 1:7; దాని. 2:20–21). కాలాలు/సమయాలు: తండ్రి స్వాధీనం. 

B.   ఆ దినము మరియు గడియ విషయములో సమానుడు కాదు — మత్తయి 24:36

C.  జన్మ సమయం నిర్ణయంలో సమానుడు కాదు — (గలతి 4:4)

D.  మరణ సమయం నిర్ణయంలో సమానుడు కాదు — (అపో. 2:23)

E. పునరుత్థాన అధికారంలో సమానుడు కాదు (దేవుడే లేపాడు) — (అపో. 13:26–30; కీర్త. 2:7)

F. సర్వాధికారంలో సమానుడు కాదు (ఇయ్యబడిన అధికారం) — (మత్తయి 28:18; యోహాను 3:27)

G.  న్యాయాధికార మూలంలో సమానుడు కాదు — (యోహాను 19:10–11; 3:27)

H.  అద్వితీయ సర్వాధిపత్యంలో సమానుడు కాదు — (1 తిమోతి 6:15) యేసు సర్వాధికారి మాత్రమే(మత్తయి. 28:18-19) అట్టి సర్వాధికారము ఇచ్చినది తన తండ్రియైన దేవుడే.

I.  స్వతంత్ర కార్యాచరణలో సమానుడు కాదు — (యోహాను 5:19)

J.  చిత్త స్వాతంత్ర్యంలో సమానుడు కాదు (తండ్రికి లోబడి) — (లూకా 22:42)

K. అంతకాలంలో స్థితిలో సమానుడు కాదు (తండ్రికి లోబడుట) — (1 కొరి. 15:27–28)

L. ఆరాధింపబడుటలో సమానుడు కాదు. (యోహాను. 4:21-24) యేసు కోరినది సేవించమని కానీ ఆరాధించమని కాదు.(యోహాను. 12:26).

M.  తండ్రికే ప్రార్థించేవాడు — సమానుడు కాదు. (మత్తయి 26:39; లూకా 11:2)

N.  దేవుని చేత బలపరచబడినవాడు — సమానుడు కాదు (లూకా 22:43)

O.  జ్ఞానం పొందినవాడు — సమానుడు కాదు. యేసు జ్ఞానములో ఎదిగాడు — (లూకా 2:52)

P.  దేవుని చేత బోధింపబడినవాడు — సమానుడు కాదు. (యోహాను 8:28; 12:49)

Q.  దేవుని చేత పంపబడినవాడు — సమానుడు కాదు — (యోహాను 5:23–24; 17:3)

R.  దేవుని చేత అభిషేకింపబడినవాడు — సమానుడు కాదు — (అపో. 10:38)

S.  దేవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు — సమానుడు కాదు — (1 తిమోతి 2:5)

T.  దేవుని కుడిచేతి వద్ద కూర్చోబెట్టబడినవాడు — సమానుడు కాదు (కూర్చోబెట్టినవాడు ≠ కూర్చోబెట్టిన అధికారి) (కీర్తన 110:1; అపో. 2:33)

U.  తండ్రిని ఊపిరిని తన స్వాధీనంలో ఉంచుకొని, జీవమును యేసునకు అప్పగించాడు. (అపో 17:25; యోహాను 14:6)


5️⃣. ముగింపు


✅  యేసు సమానుడు  స్వరూపంలో, దైవత్వములో, పరిశుద్ధతలో, దేవుని మహిమను ప్రతిఫలించుటలో, నీతిని జరిగించుటలో రోషములో, పాపిని ప్రేమించుటలో, దేవుని కృపలో, నీతి న్యాయంలో, ఘనతలో,..


యేసు సమానుడు కాదు  కాలంలో, అధికారంలో, అద్వితీయ సర్వాధిపత్యంలో, స్వతంత్ర చిత్తంలో, లోబడుటలో, ఆరాధింపబడుటలో, … 


👉 లేఖనాన్ని లేఖనంతో పోల్చినప్పుడు వచ్చే సమతుల్యమైన, స్పష్టమైన అపోస్తలుల బోధ ఇదే. 🙏🏿 






మీ ఆత్మీయులు 👪 


WhatsApp Channel - 2k Join Now
Telegram Group - 600 Join Now
Instagram Page - 500 Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16