మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏
క్రైస్తవులనబడిన వారి జీవితాల్లో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు కష్టాలను, ఆరోగ్య/ఆర్ధిక/భౌతిక/ఆధ్యాత్మిక సమస్యలను, బాధలను, పోరాటాలులను, అంతర్గత సంఘర్షణలను ఎదుర్కొంటారు. అటువంటి సందర్భాల్లో చాలాసార్లు వారి నోట నుండి సహజంగా వచ్చే మాట ఏమిటంటే — “దేవుడు నన్ను శోధిస్తున్నాడు” అని. ఈ మాట వినడానికి భక్తిగా, సహనంగా, దేవుని చిత్తానికి లోబడినట్టు అనిపించవచ్చు. కానీ ఈ మాట నిజంగా బైబిల్ బోధకు అనుగుణమా? లేదా మనం తెలియకుండానే దేవుని స్వభావంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నామా? అలాగే ఈరోజుల్లో సత్య వాక్యమును సరిగ్గా విభజన చేయలేక, సరైన తర్ఫీదు లేక, తమకు తామే బోధకులము అనుకొనుచు సంఘములో తమ ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి బోధలు శ్రోతలకు వినిపించేవారు కూడా లేకపోలేదు.
ఐతే పరిశుద్ధ గ్రంథం మన తండ్రియైన దేవుడును(YHWH) ఎలా ప్రకటిస్తుంది అంటే — ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు, ప్రేమామయుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, తీర్పరి, కీడుకు అతీతుడు. అలాంటి దేవుడు మనలను పాపానికి లాగుతాడా? తప్పు చేయమని ప్రేరేపిస్తాడా? మన విశ్వాసాన్ని కూల్చడానికి శోధిస్తాడా? మనలను పరీక్షించుటకు శోధిస్తాడా? శోధనలోకి పంపుతారా? అనే సంగతులను బైబిల్ దృష్ట్యా ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం.
1️⃣. దేవుని స్వరూపం
మన దేవుడు(YHWH) నాలుగు స్వరూపాలు గలవాడు.
A). అదృశ్య స్వరూపి(యోహాను 4:24; 1 తిమోతి 1:17; హెబ్రీ 11:27).
B). నీతి స్వరూపి (యోహాను 17:25)
C). ప్రేమా స్వరూపి (1 యోహాను. 4:8)
D). సత్యా స్వరూపి (ప్రకటన. 6:10)
పైన పేర్కొన్న వాటి గూర్చి మరింత విశ్లేషణ కొరకు 𝟭𝟰𝟵 : "మానవ నిర్మాణం" అనే అంశము చదవగలరు. కావున ఇక్కడ వివరించపోవడం లేదు.
📖 (యాకోబు. 1:13): "దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు– నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.౹"
2️⃣. దేవుని స్వభావం – కీడుకు అతీతుడు
యాకోబు 1:13 ఇలా చెబుతుంది:
దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు;
❌దేవునిలో చెడు లేదు
❌దేవునిలో పాపపు ఆకర్షణ లేదు
❌దేవుడు కీడుతో సంబంధం కలిగినవాడు కాదు
✔️ ఆయన స్వభావమే పరిశుద్ధత
అందుకే బైబిల్ చెబుతుంది:
"నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా;.." (హబక్కూకు 1:13) దేవుడు కీడును చూడలేని పరిశుద్ధుడు.
👉 కాబట్టి,
పాపానికి/కీడునకు దారితీసే ఏ శోధనయైనా పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుండి రాదు అనే సంగతి గుర్తుంచుకో…
2️⃣. దేవుడు ఎవ్వరినీ శోధించడు
ఆయన ఎవనిని శోధింపడు (యాకోబు. 1:13)
అంటే:
✔️ దేవుడు మనలను తప్పు చేయమని ప్రేరేపించడు
✔️ దేవుడు పాపంలో పడేయడు
✔️ దేవుడు చెడు చేయడానికి అవకాశం సృష్టించడు
✔️ ఇది దేవుని వాగ్దానం కాదు — ఇది దేవుని స్వభావ ప్రకటన.
✔️ దేవుడు చేయలేని పని ఒకటుంది: మనలను పాపములోనికి లాగడం.
👉 కాబట్టి,
“ఈ పాపంలో పడిపోయాను – దేవుడు నన్ను శోధించాడు” అని అనడం దేవునిపై నేరం మోపినట్టే అగును కదా!!
3️⃣. శోధనకు దేవుడిని కారణం చేయకూడదు
ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు గారు పండ్రెండు గోత్రములవారికి ఇలా హెచ్చరిక చేస్తున్నారు. "గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు– నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు". (యాకోబు. 1:13).
ఇది ఎందుకు అవసరమైంది? ఎందుకంటే మనిషి సాధారణంగా ఇలా చేస్తాడు తాను చేసిన తప్పుకు కారణం వెతుకుతాడు, తన పాపానికి బాధ్యత తప్పించుకుంటాడు, చివరికి దేవుణ్నే నిందిస్తాడు.
👉 కానీ బైబిల్ చెబుతుంది:
నీ పాపానికి దేవుడు బాధ్యుడు కాదు.
📝 “దేవుడు నన్ను శోధించాడు” అని అనడం వల్ల:
పాపానికి బాధ్యత తీసుకోము
మారుమనస్సు అవసరం తగ్గిపోతుంది
దేవుని పరిశుద్ధతపై అనుమానం కలుగుతుంది
ఇది నీకు భక్తిగా కనిపించినా, దేవుని స్వభావాన్ని వక్రీకరించే మాటే కదా.
4️⃣. శోధనకు మూలం
"ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.౹ దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.౹" (యాకోబు 1:14-15)
🔥 శోధన యొక్క క్రమం:
మనలో ఉన్న దుష్ట ఆశ — ఆ ఆశ ఆకర్షిస్తుంది — గర్భము దాల్చి — పాపమునకు జన్మిస్తుంది — ఆ పాపం ఎదిగి మరణాన్ని కలిగిస్తుంది.
👉 శోధన మన హృదయంలో మొదలవుతుంది
👉 దేవునిలో కాదు
📌 ఉదాహరణ : దావీదు
📖 2సమూయేలు 11వ అధ్యాయం
దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీని చూశాడు.
చూపు → ఆశ → పాపం → మరణ ఫలితాలు
❓ దేవుడు శోధించాడా?
❌ కాదు.
✔️ దావీదుని ఆశే అతన్ని శోధనలోకి/పాపములోనికి పడేసింది.
5️⃣. శోధనలో దేవుని పాత్ర
"తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.౹ సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును." (1కోరింది. 10:12-13).
దేవుడు శోధనను సృష్టించడు. శోధన అనేది ఆత్మీయులకు కొత్తది కాదు మరియు ప్రత్యేకంగా నీకు మాత్రమే వచ్చినదీ కాదు. ప్రతి మనిషి ఎదుర్కొనే అనుభవమే. శోధన వచ్చినప్పుడు “ఇది దేవుడు ప్రత్యేకంగా నాకే చేస్తున్న పని” అని అనుకోవద్దు సుమీ! శోధనను సృష్టించేవాడు అపవాది. శోధకుడు(tempter - pi-rad'-zo) (మత్తయి. 4:3). దేవుడు అట్టి శోధకుడు యొద్ద మనలను ఒంటరిగా వదలడు. శోధన వచ్చినా మనం పడిపోవాల్సిందే అని కాదు ఆ శోధకుడు నుండి దేవుడు బయటపడే మార్గం ఇస్తాడు.
👉 దేవుడు శోధనలో సహాయకుడు
👉 శోధనకు మూలం దేవుడు కాదు.
దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మోసగాడు కాదు. దేవుడు అబద్ధానికి కారణం కాదు. శోధన విషయములో దేవుని పాత్ర నమ్మదగిన సంరక్షకుడిగా మాత్రమే ఉంది శోధించేవాడిగా కాదు. “మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు” అంటే శోధకుడు నుండి శోధన వస్తుంది (మూలం దేవుడు కాదు) కానీ అది హద్దు దాటకుండా దానికి దేవుడు పరిమితి పెడతాడు. దేవుడు శోధనపై అధికారం ఉన్నవాడు. మనలను శోధనలో చిక్కుకోనివ్వడు, దాని బయటపడే మార్గం చూపిస్తాడు, నీకు నిలబడే శక్తిని ఇస్తాడు, పాపంలో పడేయక, శోధనలో రక్షణ మార్గం ఇస్తాడు. ఇది మన తండ్రియైన దేవుని యొక్క పరిశుద్ధ స్వభావం.
❌ “దేవుడు శోధిస్తాడు” అని లేదు
✅ “శోధింపబడ నియ్యడు” అని ఉంది.
📌 ఉదాహరణ : యోసేపు గారు
📖 ఆదికాండము 39వ అధ్యాయం
పోతీఫర భార్య రూపములో శోధన (39:6-12)
📖 యోసేపు పారిపోయాడు
👉 దేవుడు శోధించలేదు ✔️
👉 దేవుడు తప్పించుకొనే మార్గం ఇచ్చాడు🏃🏿
6️⃣. పరీక్షా ≠ శోధన
బైబిల్‌లో దేవుడు తన ప్రజలను పరీక్షించిన సందర్భాలు ఉన్నాయి కానీ శోధించే లేదా శోధనలో పడజేసే సందర్భాలు ఒకటి లేవు. ఈ పరీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం హృదయంలో ఏముందో వెల్లడించడం, విశ్వాసాన్ని బలపరచడం, విధేయతను పెంచడమే కానీ పాపములోనికి లాగేవి కావు, చెడు వైపునకు నడిపించేవి కావు, విశ్వాసాన్ని నాశనం చేసేవి కావు.
👉 పరీక్ష = శుద్ధి
👉 శోధన = పతనం
ఈ రెండింటిని కలపడం వల్లే గందరగోళం వస్తుంది. ఇందుకు పరీక్ష మరియు శోధన అనేవి ఒకటి కాదు అనేది గట్టిగా నమ్ముము.
ఐతే వివాదస్పందమైన ఒక విషయాన్ని మీ యెదుట పెట్టి దానిని వివరణ ఇవ్వనున్నాను. కాస్త జాగ్రత్తగా ఆలోచించగలరని మనవి 🙏🏿 అదేమనగా...
🔴 యాకోబు 1:13 — దేవుడు శోధించడు అంటుంది అయితే...
🔵 హెబ్రీ 11:17 — “శోధింపబడి” అని ఎందుకు ఉంది?
"అబ్రాహాము శోధింపబడి( విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను" (హెబ్రీ 11:17)
"ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన– అబ్రా హామా, అనిపిలువగా అతడు– చిత్తము ప్రభువా అనెను.౹" (ఆది.కాం. 22:1)
బైబిల్ చదువుతున్నప్పుడు చాలామందిని గందరగోళానికి గురి చేసే పదం “శోధింపబడుట”. ఇది విరుద్ధత కాదు — ఇది భాషా అర్థం (word meaning) తేడా... సమస్య దేవుని వాక్యంలో లేదు. సమస్య — ఒకే పదాన్ని ప్రతి చోట ఒకే అర్థంలో తీసుకోవడంలో ఉంది. అది ఏలాగున అనేది చూద్దాం.
📌 “శోధింపబడుట” అన్న పదం సందర్భాన్ని బట్టి రెండు అర్థాలలో వాడబడుతుంది.
🔴ఒకచోట — పాపములోనికి లాగుట, చెడుకు ప్రేరేపించుట (Tempted/Temptation)
🔵 మరోచోట — పరీక్షించుట (Tested / Test/ proving) ఇక్కడే తేడాను జాగర్తగా పరిశీలన చేయగలం.
📖 “దేవుడు అబ్రహామును పరీక్షించెను(Tested)” (ఆది 22:1)
✔️ దేవుడు అబ్రహామును పాపానికి లాగలేదు
✔️ కుమారుని చంపమని చెడుకు ప్రేరేపించలేదు
✔️ చివరికి ఇస్సాకును చంపనివ్వలేదు
అయితే ఏమి చేశాడు?
👉 అబ్రహాము విశ్వాసాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చాడు
👉 దేవుని మీద అతనికి ఉన్న నమ్మకాన్ని పరిశుద్ధంగా నిరూపించాడు
అందుకే హీబ్రూ 11:17 లో “శోధింపబడి” అన్న మాట ➡️ పరీక్షించబడి(Tested)/ నిరూపించబడి(Proving) అన్న అర్థంలో ఉంది.
📝 దేవుడు అబ్రహామును పాపానికి లాగాడా?
📝 కుమారుడిని చంపమని పాపానికి ప్రేరేపించాడా? — ❌ కాదు.
🔎 అబ్రహాము విషయంలో దేవుడు మూడు విషయాలు సాధించాడు.
1. అబ్రహాము హృదయంలో దేవుని స్థానం చూపించాడు. ఇస్సాకును చంపనివ్వలేదు
2. దేవుని వాగ్దానంపై అతని విశ్వాసం ఎంత లోతైనదో వెల్లడించాడు
3. భవిష్యత్తులో రానున్న క్రీస్తు బలికి ఒక ఛాయను చూపించాడు. (ప్రత్యామ్నాయ బలిని ఇచ్చాడు)
👉 ఇది పాప శోధన కాదు
👉 ఇది విమోచన ప్రణాళికలో భాగమైన విశ్వాస పరీక్ష
🔎 ఉదాహరణ
🔥 అగ్ని బంగారాన్ని కాల్చదు, శుద్ధి చేస్తుంది
🔥 గడ్డిని కాల్చేస్తుంది
👉 అగ్ని చెడిది కాదు
👉 వస్తువు స్వభావం ఫలితాన్ని నిర్ణయిస్తుంది
🔵 దేవుడు ఇచ్చే పరీక్ష = విశ్వాసాన్ని శుద్ధి
🔴 మన ఆశల వల్ల వచ్చే శోధన = పాపం
📖🔎 హెబ్రీ. 11:17; ఆదికాండం 22:1 ప్రకారం చివరిగా అబ్రహాము శోధింపబడ్డాడు/పరీక్షించెను అనగా అతను పాపములోనికి లాగబడలేదు; విశ్వాసంలో నిరూపించబడ్డాడు. దేవుడు మనలను పడేయడానికి శోధించడు — నిలబెట్టడానికి పరీక్షిస్తాడు. ఇది చెవులు గలవాడు వినును గాక!
7️⃣. దేవుడు మోసం చేసే శక్తిని పంపుతాడా?
అవును💯
(2థెస్సలొనీకయులు 2:9-11) : "నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను౹ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును౹ ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు."
కొంతమంది బోధకులు అటు హెబ్రీ. 11:17; ఆదికాండం 22:1 వచనాలు మాత్రమే కాక 2 థెస్సలొనీకయులు 2:10–12 వాక్యాలను ఆధారంగా చేసుకొని ఇలా బోధించేవారు లేకపోలేదు అదేమనగా “దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించుటకు మోసం చేయు శక్తిని పంపి మనలను శోధిస్తాడు.” ఇది 💯 తప్పుడు బోధ. ఇంతకు వాక్యం ఇక్కడ ఏమి చెబుతుందో ఆలోచన చేద్దాం.
📖 “సత్యమును ప్రేమించుటకు వారు ఇష్టపడలేదు గనుక…”
అంటే:
1. సత్యాన్ని విన్నారు
2. తెలుసుకున్నారు
3. సత్యాన్ని ప్రేమించలేదు
4. సత్యాన్ని అంగీకరించలేదు
5. సత్యాన్ని తిరస్కరించారు
👉 వీరు అజ్ఞానం వల్ల మోసపోయినవారు కాదు
👉 విని, తెలుసుకొని కూడా సత్యాన్ని తిరస్కరించినవారు. వాళ్ల విధి రాతను వారే వ్రాసుకున్నారు.
ఇందుకు దేవుడే…
1. వారి దుష్టత్వంలో ఆనందించుట వలన
2. వారి ఎంపికకు(అసత్యాన్నికి) వదిలివేశాడు.
దీని అర్థం సత్యం వినపడినప్పటికి అసత్యాన్ని హత్తుకుంటే వారు శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని అర్థం.
📝 ఇది విశ్వాసాన్ని పరీక్షించడమా?
❌ కాదు.
📝 ఇది శోధించడమా?
❌ కాదు.
✅ ఇది న్యాయమైన తీర్పు (Judicial action).
❇️ సత్యం తెలిసినా తిరస్కరించారు
❇️ పాపంలో ఆనందించారు
❇️ మారుమనస్సు పొందలేదు
అందుకే:
“సత్యాన్ని నమ్మని వారందరు తీర్పు పొందునట్లు వారు కోరుకున్న అబద్ధానికి అప్పగించాడు”
👉 ఇది పరీక్ష కాదు
👉 ఇది శోధన కాదు
👉 ఇది తీర్పు అమలు ✔️
📌 మన తండ్రియైన దేవుడు:
— దేవుడు సత్యాన్ని అందరికీ ప్రకటిస్తాడు
— సత్యాన్ని తిరస్కరించే వారిని బలవంతం చేయడు
— వారు కోరుకున్న అబద్ధానికి అప్పగిస్తాడు
— చివరికి అది వారి తీర్పుకు దారి తీస్తుంది
ఇది దేవుని శోధన కాదు, దేవుని పరీక్ష కాదు —
👉 వారి తిరస్కరణకు వచ్చిన ఫలితం
👉 ఇది దేవుని న్యాయం.
కావున బోధించువారులారా మరియు బోధను వినువారులారా జాగ్రత్త సుమీ!! 🔎📖✔️🙏🏿
ముగింపు :
క్రైస్తవులుగా మనం స్పష్టంగా ఒప్పుకోవలసిన సత్యం ఇది:
* దేవుడు శోధించడు.
* అపవాదియే శోధకుడు.
* దేవుడు పాపానికి లాగడు.
* దేవుడు మోసం చేయడు.
* దేవుడు తన పిల్లలను సత్యం విషయములో విడిచి పెట్టడు.
* శోధకుడు యొక్క శోధన నుండి తప్పించుకొనే మార్గాన్ని ఇస్తాడు, సహించగలిగినంతకంటె ఎక్కువగా శోధనకు లోనుకానివ్వడు.
* దేవుడు పరీక్షిస్తాడు — నిలబెట్టడానికి
* దేవుడు మార్గం చూపిస్తాడు — రక్షించడానికి.
* దేవుడు మోసం చేయు శక్తిని పంపి శోధిస్తాడు” అని అనడం దేవుని న్యాయాన్ని, పరిశుద్ధతను వక్రీకరించినట్లే… బైబిల్ వెలుగులో అది శోధన కాదు — సత్యాన్ని తిరస్కరించినవారిపై వచ్చిన న్యాయమైన తీర్పు మాత్రమే.
శోధన మన హృదయం నుండి వస్తుంది;
రక్షణ దేవుని హృదయం నుండి వస్తుంది.


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com