నృత్యం!? (Dance)💃


నృత్యం (Dance)



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 


నృత్యం పాపమా!? అనే ఈ ప్రశ్నకు సమాధానం "అవును & కాదు". ఇదేంటి రెండు రకాలుగా అవును మరియు కాదు అంటున్నారేంటి అనే నీ సందేహం వాక్య ఆధారముగా నివృత్తి చేయబడాలంటే అటు పాత నిబంధనలోని ఇటు క్రొత్త నిబంధనలోని నృత్యం కోసం ఏమి వ్రాయబడిందో అనే విషయాలను ఈ అంశము ద్వారా వ్రాసి మీ యెదుట పెడుతున్నాం కావున మీరు చివరి వరకు జాగ్రత్తగా చదివి, వాక్య పరిశీలన చేసి, సత్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. 🙏🏿


1. నృత్యం యొక్క నిర్వచనం 

2. పాత నిబంధనలో నృత్యము?

3. క్రొత్త నిబంధనలో నృత్యము?



💃నృత్యం యొక్క నిర్వచనం 💃


🔖శరీరాన్ని మరియు పాదాలను లయబద్ధంగా.., ముఖ్యంగా సంగీతానికి అనుగుణంగా కదిలించడం.

🔖 ఉత్సాహంగా కదలడం లేదా దాటవేయడం, ఉత్సాహం లేదా భావోద్వేగం నుండి వణుకు.

🔖 పైకి క్రిందికి ఊగడం, తేలికగా మరియు త్వరగా కదలడం.

(ది న్యూ ఇంటర్నేషనల్ వెబ్‌స్టర్స్ కాంప్రహెన్సివ్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్: ఎన్‌సైక్లోపీడిక్ ఎడిషన్). 



🔴పాత నిబంధనలో ≈ నృత్యం🔴


మోషే నాయకత్వం క్రింద ఐగుప్తు దేశం నుండి నడిపించబడిన ఇశ్రాయేలీయులు సీనాయి కొండను సమీపించిన తరువాత దేవుడైన యెహోవా ఆ కొండమీదికి దిగి మోషే ద్వారా వారితో ఒక నిబంధన చేసుకొనెను. (నిర్గమ. 19, 20 అధ్యా; ద్వితీయో. 5:1-4; హెబ్రి. 8:9). ఇది అనాడు అన్య జనులతో లేదా నేటి క్రైస్తవులతో చేయబడిన నిబంధన కాదు. అనాడు ఇశ్రాయేలీయుల ప్రజలతో మాత్రమే చేయబడిన నిబంధన లేదా ధర్మశాస్త్రము. 


ఇటువంటి నిబంధన క్రిందనున్న ప్రజలు కొన్ని సందర్భాల్లో నృత్యం చేయుట మనం చూడగలమే కానీ ప్రత్యేకముగా యెహోవా దేవుడు వారిని ఆజ్ఞాపించినట్టుగా మనం చూడలేము. ఐతే ఎందుకు వేశారో? అక్కడ సందర్భం ఏంటో? ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. 


📖 నిర్గమకాండము 15:20 : యెహోవా బాహుబలం చేత ఐగుప్తీయుల నుండి విమోచన పొందినందుకు ఎర్ర సముద్రం దాటిన ఇశ్రాయేలీయులు ఆ ఆనందాన్ని ఒక వేడుకగా చేసుకొనుట మనం చూడగలం. నిర్గమకాండము 15 అధ్యాయం అంతయు మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవునికి పాడిన పాట. ఈ పాటలో  ప్రవక్త్రియునగు మిర్యాము ఒక తంబురను పట్టుకుని పాట పాడుతూ ఇశ్రాయేలీయుల స్త్రీలను తనతో పాటు పాడమని ప్రోత్సహించగా మిగతా స్త్రీలందరూ తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లినట్టుగా(20వ) మనం చూడగలం.


అక్కడి స్త్రీలు మిర్యామును వెంబడిచినట్టుగా చూడగలం కానీ స్త్రీలు అందరూ పురుషులతో కలసి నాట్యం చేసినట్టుగా, అలా మేము దేవుని ఆరాధన చేస్తున్నామని రూపొందించినట్టుగాని, దేవుడు వారికి ఇలా చేయమని ఆజ్ఞాపించినట్టుగా మనం చూడలేమని గమనించగలరు. 


📖 న్యాయాధిపతులు 11:34 : న్యాయాధిపతి యెఫ్తా యుద్ధం నుండి సురక్షితంగా మరియు విజయవంతంగా తిరిగి వచ్చినందుకు వేడుకలో భాగంగా తన కుమార్తె మాత్రమే  నృత్యం చేస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తాము. ఆమె మరెవరితోనూ కలసి నృత్యం చేయుట లేదు, స్వయంగా ఆమె నృత్యం చేస్తోంది. 


📖 న్యాయాధిపతులు 21:19-23 : ఈ వచనంలో బెన్యామీను తెగకు సంబంధించిన వివాహ సమస్యను పరిష్కరించడానికి ఇశ్రాయేలీయులు చేసిన ఒక వ్యూహాత్మక మరియు బలవంతపు చర్య. అదేమనగా, పండుగ సమయంలో షిలోహు కుమార్తెలు మాత్రమే నృత్యం చేస్తునప్పుడు వారి మధ్యకి వెళ్ళి ఆ స్త్రీలను అక్రమంగా పట్టుకొని, వారిని బెన్యామీనులకు భార్యలుగా ఉండుటకు చేసిన వ్యూహం. ఇది బెన్యామీను తెగను కొనసాగించడానికి మరియు ఇశ్రాయేలీయుల తెగల మధ్య ఐక్యతను కొనసాగించడానికి చేసిన ప్రయత్నం.


📖 1 సమూయేలు 18:6-7 (cf. 21:11; 29:5) : ఈ వచనంలో దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతు పైన విజయం సాధించి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు స్త్రీలు మాత్రమే తంబురలతోను సంభ్రమముతోను వాయిద్యములతోను పాడుచు నృత్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చినట్టుగా చూడగలం.


📖 2సమూయేలు 6:12-22 (cf. 1 దినవృత్తాంతములు 15:29) : దేవుని మందసము మూడు నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించాడని దావీదుకు తెలుస్తుంది. దీంతో దేవుని మందసము యెరూషలేముకు సంతోషంగా తీసుకురావాలని దావీదు నిర్ణయించుకుని, దేవుని మందసము మోసేవారు ఆరు అడుగులు వేసిన తరువాత, దావీదు బలి అర్పించి, దేవుని సన్నిధిలో తన శక్తి మేరకు గంతులు లేదా నృత్యం వేస్తాడు(14వ) లేదా ఆట ఆడుతాడు (21వ). ఇశ్రాయేలీయులందరూ డప్పులు, కొమ్ముల ధ్వనులతో దేవుని మందసము తీసుకువస్తారు. దావీదు తన రాజవస్త్రాలను పారవేసాడు కానీ ఏఫోదు ధరించి ఉన్నాడు.(13వ) కొందరు ఆరోపించినట్లు అతను నగ్నంగా లేడు.


దావీదు ఒక్కడే నృత్యం(ఆట) చేసినట్టుగా చూడగలం కానీ తనతో మరికొందరు కలసి వేసినట్టుగా మనం చూడలేము. ఇది ఒక దైవ ఆజ్ఞగా మరియు తాను నృత్యం చేస్తూనే దేవున్ని ఆరాధన చేశాడని, తనతో పాటు మరికొందరిని ఇలాగే నృత్యం చేసే దేవున్ని ఆరాధించమని కోరాడని గాని నేడు మనం తలంచకూడదు.


📖 (కీర్తనల 30:11-12; 149:3; 150:4) : ఈ దావీదు కీర్తనలో తాను ఈ మూడు చోట్ల నృత్యం ద్వారా యెహోవా యెడల తన యొక్క ఆనందమును మరియు దేవునికి స్తుతిని వ్యక్తపరిచేదిగా దావీదే ప్రస్తావించెను. దావీదు యొక్క సొంత ఆలోచనే. 


📖 (ప్రసంగి 3:4) : మనకు "నృత్యం చేయడానికి ఒక సమయం" ఉందని చెబుతుంది, ఇది ఎల్లప్పుడూ సముచితం కాదని సూచిస్తుంది.


📖 (పరమగీతము 6:13) : తన వధువు తన కన్యల మధ్య నృత్యం గురించి ప్రస్తావించింది.


📖 (విలాపవాక్యములు. 5:15) : యెరూషలేము పతనం సమయంలో ఇలా సెలవు ఇస్తుంది "మన నృత్యం దుఃఖంగా మారింది". ఇది నృత్యం చేసే సమయం కాదు.


📖 (యిర్మీయా 31:4, 13) : యెరూషలేము నగర పునర్నిర్మాణాన్ని ప్రవచించే సందర్భములో ఆమెను నాట్యంలో ఆనందించే కన్యగా చిత్రీకరిస్తాడుని దేవుడే ప్రస్తావించెను.


పైన పేరొన్నబడిన విషయాల్లో... "ప్రవక్త్రియునగు మిర్యాము మరియు అక్కడ స్త్రీలు, యెఫ్తా కుమార్తె, షిలోహు కుమార్తెలు" వీరు చేసిన నృత్యం ఎట్టిదో మనకు తెలియదు కానీ వారు మాత్రం పురుషులతో నృత్యం చేయలేదని స్పష్టముగా అర్థం అవుతుంది. అలాగే దావీదు విషయానికి వస్తే... తన పురమునకు దేవుని మందసము వస్తుందనే ఆనందములో రాజైన దావీదు తనకు తానుగానే నృత్యం(ఆట) చేశాడే కానీ స్త్రీతో గాని, తన తోటి పురుషులతో గాని చేయలేదు. 


పాత నిబంధన కాలములో ఎక్కడా కూడా నృత్యం ద్వారా దేవున్ని ఆరాధించటం అనే దైవ ఆజ్ఞను మనం చూడలేం. మిర్యాము, దావీదు ఇద్దరూ నృత్యం చేసినందుకు ఖండించబడలేదు. ఈ నృత్యాలు రెండూ లైంగిక ఉద్ఘాటనలకు ఉదాహరణలు కావు. వారు అలా నృత్యం చేయడంలో పాపము లేదా అనుచితమైనది ఏమీ లేదు. 


🔑 Note : వివాహేతర జంటలు కలిసి నృత్యం చేయకూడదు.  వేడుకల నృత్యాలు స్వాభావికంగా పాపం కాదు. 


🔵 ఐతే పాత నిబంధనలో రెండు సందర్భాలలో నృత్యం పాపముగా స్పష్టముగా కనిపిస్తుంది. 


🔎 మొదటిగా నిర్గమకాండము 32:6 లో ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించారు. ఇది వారు విడిపించబడిన ఐగుప్తులోని విగ్రహారాధన చేసే అన్యుల మాదిరిగానే తినుచు, త్రాగుచు, లైంగిక నృత్యం కలిగిన ఒక క్రూరమైన అనైతిక వేడుక. మోషే పర్వతం నుండి దిగి వచ్చినప్పుడు "ఆ దూడను, నాట్యాన్ని చూశాడు" (19వ). మోషే చాలా కోపంగా ఉన్నాడు, దేవుడు తనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన పలకలను పగలగొట్టాడు, కానీ వారి చర్యలు "చాలా గొప్ప పాపం", "దుష్ట", "నియంత్రణ లేని" మరియు "అవమానకరమైన" (19-25వ) గా వర్ణించబడ్డాయి. వీరు అందరూ గుంపుగా చేరి నృత్యం చేసినట్టుగా మనం గుర్తించగలం


🔎  *రెండివదిగా 1 సమూయేలు 30:16" ప్రకారం , అమాలేకీయులు ఫిలిష్తీయుల మరియు యూదా దేశాలపై దండయాత్రల సమయంలో దోచుకున్న వస్తువులను చూసి "తింటూ, త్రాగుతూ, నృత్యం చేస్తూ" ఉన్నారు, దావీదు వారిపై దాడి చేసి వారి దోపిడి మొత్తాన్ని తన కోసం తిరిగి పొందాడు (17-20వ). వారు తమ అన్యమత మరియు విగ్రహారాధనతో కూడిన ఆనందోత్సాహాలలో చిక్కుకున్నట్లు మనకు కనిపిస్తుంది.


నృత్యం ఎలా పాపంగా మారుతుందో అలాగే ఇతరులు పాపం చేయడానికి కారణమవుతుందో మనకు పాత నిబంధనలో ఈ రెండు ఉదాహరణలు స్పష్టముగా తెలియజేస్తున్నాయి. ఇది ఒక వ్యర్థమైన ఆరాధన. జనులు తినుచు, త్రాగుచు, నృత్యం  జరిగించే ఏ కార్యక్రమైన దైవ దృష్టిలో వ్యర్థమైన ఆరాధన అగును.(1 కోరింధి. 10:7; మత్తయి 15:7-9)



🔴 క్రొత్త నిబంధనలో ≈ నృత్యం  🔴


"ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు."(మత్తయి 5:17) అని పలికిన మన ప్రభువైన యేసు శరీరధారియైయున్న దినాల్లో వాటిని పూర్తిగా నెరవేర్చి(లూకా 24:44) అటు నెరవేర్చిన పిమ్మటనే అవి తప్పిపోయే అవకాశం ఉందని తానే ముందుగా చెప్పెను కదా!!(మత్తయి. 5:18cf చూడు). ఇలా పాత నిబంధన విషయాలను తన శరీరము ద్వారా నెరవేర్చిన తరువాత... నేడు మనకు అనగా యావత్తు జనానికి ఋణముగాను, విరోధముగాను నుండిన ఆ పత్రమును అనగా పాత నిబంధనను మనకు అడ్డము లేకుండా ఉండుటకే పరమదేవుడే క్రీస్తు సిలువనందు దానిని కొట్టివేసి. (2 కోరింది. 3:14; కొలస్సి 2:13-15). ఉభయులను క్రీస్తునందు ఏకపరిచి వారితో చేయబడిన మరొక్క నిబంధనయే క్రొత్త నిబంధన లేదా నిబంధన రక్తము. (మత్తయి. 26:28; హెబ్రీ. 8:6-13; 9:15cf).


మన ప్రభువైన యేసు కాలములోని మరియు క్రొత్త నిబంధన అమలులోకి వచ్చిన పిమ్మట జరిగే కొన్ని నృత్యాలు కోసం ఆలోచన చేద్దాం. 


📖  (మత్తయి 11:17; లూకా 7:32) ఈ వచనములలో, తన తరం తనను ఎలా అంగీకరించడానికి నిరాకరించిందో వివరించడానికే వేణువు వాయించేటప్పుడు నృత్యం చేయని పిల్ల కాయలను గురించి యేసు పోల్చి(వర్ణనతో) మాట్లాడాడు కానీ తన తరము వారిని నృత్యం చేయమని లేదా ఆరాధనలో నృత్యం చేయమని దాని అర్ధము కాదు.


📖 (లూకా. 15:25) : యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలో, ఆయన తిరిగి రావడాన్ని "వాయిద్యములు మరియు నృత్యంతో" జరుపుకున్నారు(25వ) ఇది వేడుకలో ఒక భాగముగా చెప్పబడింది. ఆరాధన కార్యక్రమములో వాయిద్యములు మరియు నృత్యమనేది వేడుక భాగం కాదు/కాకూడదు.


📖  (అపొస్తలుల కార్యములు 3:8; 14:10)  లోని కుంటివాడిని పేతురు స్వస్థపరిచినప్పుడు, అతను "దేవాలయంలోకి ప్రవేశించాడు... గెంతులు వేస్తూ, దేవుణ్ణి స్తుతించాడు"(8వ). అదేవిధంగా, పౌలు స్వస్థపరిచిన కుంటివాడిని కూడా "గంతులు" వేసి(10వ). వారు పుట్టిననాటి నుండే కుంటివాళ్లు కావునే తాము పొందిన స్వస్థత ఇతరులకు కనపడుచుటకే గంతులు వేసి దేవున్ని స్తుతించారే తప్ప మరొక్క భావం తీసుకోవడానికి వీలులేదు. 


📖 చివరిగా... (మత్తయి 14:6-12) ఇలా చదువుతాం "అయితే హేరోదు జన్మదినోత్సవం జరుపుకున్నప్పుడు, హేరోదియ కుమార్తె వారి ముందు నాట్యం చేసి హేరోదును సంతోషపెట్టింది." ఇదంతా బాప్తిస్మమిచ్చు యోహానును చంపడానికి హేరోదియ చేసిన కుట్ర (1-12వ; cf.మార్కు 6:14-29వ). హేరోదియ కుమార్తె తన సవతి తండ్రి పుట్టినరోజును జరుపుకోవడానికి నృత్యం చేయలేదు; తన తల్లి మాటను నెరవేర్చుటకే అందరి మధ్య నృత్యం ఆడి అతన్ని మోహింపజేసింది.


మన ప్రభువైన యేసు కాలములో గాని లేదా అటు తరువాత అపోస్తలుల కాలములోనైనా(సంఘము స్థాపన అనంతరం...) తండ్రైన దేవున్ని ఆరాధించే విషయములో ఆత్మతో, సత్యంతో ఆరాధించమని ఆజ్ఞాపించెను కానీ నృత్యం ద్వారా ఆరాధించమనే అజ్ఞను యేసు మనకు తెలియజేయలేదు. (యోహాను. 4:21-24) యేసే కాదు... ఏ ఒక్క అపోస్తులడైన, ఏ ఒక్క విశ్వాసైన సంఘముగా లేదా ఆరాధనలో నృత్యం చేసినట్టుగా, చేయమని ఆజ్ఞాపించినట్టుగా ఎటువంటి ఆధారాలు కనపడవు. 


🔏 ఐతే అపోస్తలుల బోధలో రెండు విషయాలు మాత్రం ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరిస్తాయి : 


🔎 "మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,౹" (1 పేతురు. 4:3; గలతీ. 5:21)


గ్రీకులో G2970 కోమోస్  అనగా వినోదం, ఆనందించుట, అల్లరి చేయుట అని అర్థం. వాయిద్య సంగీతం ద్వారా వచ్చే నృత్యం లేదా త్రాగుబోతుల విందుల, మద్యపానము, విగ్రహపూజలు వలనే కలిగే నృత్యం. 


🔎 "అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.౹" (రోమా. 13:13) "కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.౹ వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.౹ వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.౹"(ఎఫేసి. 4:17-19)


నృత్యములో మార్పు ఉంటే...గ్రీకు పదం నుండి నృత్యం అనగా G766 అసెల్జియా - అతి లైంగికత, కాముకత్వము, సంయమనం లేకపోవడం, అసభ్యత, అనైతికత, సిగ్గులేని మరియు నియంత్రణ లేని ప్రవర్తన, అసభ్యకరమైన శారీరక కదలికలు (డబ్ల్యూఈ వైన్స్, ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ వర్డ్స్).


కావున అపోస్తలుడైన పౌలు గారు అల్లరితోకూడిన ఆటపాటలైనను అనగా వాయిద్య సంగీతం ద్వారా వచ్చే నృత్యం మరియు కామవిలాసములైనను/వినోదం/కాముకత్వము అనగా అసభ్యకరమైన శారీరక కదలికలు, సంయమనం లేకపోవడం, అసభ్యత కలిగించే నృత్యాలనేవి శరీర కార్యాలుగా పరిగణించి వీటిని చేయువారు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకొనరని స్పష్టముగా చెప్పారు. (గలతీ. 5:19-21).


అలాగే క్రొత్త నిబంధన ప్రకారం అదిమ క్రైస్తవులు తమ ఆరాధనలో వాయిద్యములను ఉపయోగించటం లేదా వాయిద్యములు ఉపయోగించి నృత్యం చేయుట గూర్చి క్రొత్త నిబంధన యందు లేదని  వినుట మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే దేవుడు క్రొత్త నిబంధన క్రిందినున్న వారికి బయలుపరచినది "పాడటం" గూర్చి మాత్రమే. చూడుము - (మత్తయి. 26:30; అపో.కార్య. 16:25; రోమా. 15:9; 1కోరింది 14:15; ఏపేసి. 5:19; కొలస్సి  3:16; హెబ్రీ. 2:12; యాకోబు 5:13).


ఈ విషయాలను ప్రతి యవ్వనస్తులు, తల్లిదండ్రులు, తమ ఆరాధనలో మినుకు మినుకు వెలుగులో వాయిద్య సంగీతముల మధ్య గంటల తరబడి నృత్యం చేయమని ప్రోత్సహించే నాయకులు ఈ విషయాలను ఆలోచన చేయాలి. "క్రైస్తవులకు ప్రామాణికం క్రొత్త నిబంధనే". ఇలా అంటే కొందరు తమ సంఘాల్లో నాయకులను తప్పుపట్టలేక పాత నిబంధన ఎందుకు ఉంచుకున్నావు, తీసేసి, క్రొత్త నిబంధన ఉంచుకో అనేవారు కూడా లేకపోలేదు. అట్టివారికి పాత నిబంధన నేడు క్రైస్తవులకు "బుద్ధి" (1 కోరింది 10:11) "బోధ" (రోమా 15:4)  కలుగుటకు ఇవ్వబడింది కానీ దాని యందలి విషయాలు అనుసరించడానికి కాదని తెలియకపోవుట చేతనే కదా!! ఏ ఒక్క విషయంలోనైనా ధర్మశాస్త్రమును ఆచరించబద్ధుడైన మానవుడు ధర్మశాస్త్రమంతటిని ఆచరించ ఋణస్తుడై యున్నాడు కదా (గలతీ. 5:3) ఎందుకు పాత నిబంధన అంతటిని ఎందుకు అనుసరించటం లేదు? ఉదాహరణకు: బలులు, నైవేద్యం, ధూపం, అమావాస్య.. etc ఆలోచించుకో...


మరికొందరు అదిగో దావీదు చేశాడు ఆయన్నే మాదిరిగా తీసుకుంటున్న అనేవారు లేకపోలేదు.  దావీదు మేడ మిద్దెల నుండి జారత్వముతో స్త్రీని చూసి ఆమెను వ్యభిచరించి, బహు భార్యలు కలిగిన దావీదు నీకు మాదిరి కాలేడు. నాకు నచ్చేది మెచ్చేది నృత్యమే.. కాబట్టి అదే తీసుకుంటా మిగతావి అనవసరం అని భావిస్తే ఇంకా నీవు క్రొత్త నిబంధన క్రింద లేవని అర్థం. 


క్రొత్త నిబంధన ప్రకారం దేవున్ని ఆరాధించే క్రమాన్ని పాడు చేస్తున్నావని గుర్తుంచుకో. కొంత పాతలో, కొంత క్రొత్తలో అనే ఆలోచన ఉంటే... రెండు నిబందనల క్రింద నివసించుటకు ప్రయత్నంచు ప్రతివాడు ఆత్మీయ వ్యభిచారము చేయుచున్నాడని అర్థం కదా!! (రోమా. 7:1-4) ఆలోచించుకో. ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు." (1 కోరింది. 14:33).


సారాంశము : 

🔎 ఓ చదువరి నృత్యం పాపమా!? గురించి బైబిల్ ఏమి చెబుతుందో మీకు అటు పాత నిబంధన ఇటు క్రొత్త నిబంధన ప్రకారం సత్యం ఏంటో ఇవ్వడానికి ప్రయత్నించాను,. దావీదు బట్టో మరొకరు బట్టో కాకుండా... క్రొత్త నిబంధన క్రింద ఉన్న మనం యేసు చెప్పారా? లేదా? ఆదిమ అపోస్తలలు బోధ యందు ఉందా? లేదా? ఆదిమ సంఘం లేదా విశ్వాసులు చేశారా? లేదా? అనే కోణంలో వాక్య పరిశీలన చేయుట వలన నృత్యమునకు దాస్యం కాలేము. అలా కాకుండా వేల మంది కలసి నృత్యం చేస్తున్నారు కాబట్టే ఇది సత్యం. ఇందులో తప్పేమీ లేదని నీవు అనుకుంటే... యేసు మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. "ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే." (మత్తయి. 7:13) మనమందరం జ్ఞానవంతులుగా మరియు వివేకవంతులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు (హెబ్రీయులు. 5:11-14). ప్రతి ఆత్మను నమ్మక పరీక్షించమని(1 యోహాను. 4:1-3). వాక్య పరిశీలన చేయమని(అపో.కార్య. 17:11) మనకు అప్పగింపబడిన ఆ ఒక్క బోధ యందు పోరాటం చేయాలని(యూదా. 1:3) చెడు చేసే జనసమూహాన్ని, నాయకులను అనుసరించి లోకసంబంధులు కాకూడదని గుర్తుంచుకోండి. (నిర్గమకాండము 23:2; యోహాను 17:11-19). మనం "లోకంలో" ఉన్నప్పటికీ వారి మధ్య నుండి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి (2 కొరింథీయులు 6:14-7:1). మీ ప్రవర్తన అంతటిలో పవిత్రంగా ఉండండి (1 పేతురు 1:13-2:3). మీ శరీరములను పరిశుద్ధమైనవియు దేవునికి అనుకూలమైనవియునైన సజీవ యాగముగా సమర్పించుకొనుడి; ఈ లోక మర్యాదను అనుసరింపకుడి (రోమా 12:1-2).

మీ ఆత్మీయులు

🍃 వాయిద్యములు? Click Here

🍂 ఆరాధన కోరిన దేవుడు ఎవరు? Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Questions and Comments here!

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16