భస్మ బుధవారం - శ్రమ దినాలు (Ash Wednesday - Lent Days)

భస్మ బుధవారం - శ్రమ దినాలు 

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


💥 భస్మ బుధవారం : శ్రమ దినాలు(లెంట్) యొక్క ప్రారంభ దినమును (లేదా) ఏటేటా వివిధ తేదీల్లో వచ్చే ఈస్టర్ పండుగకు సరిగ్గా 40 దినాలకు ముందు వచ్చే బుధవారమును భస్మ బుధవారం అంటారు. 

▪️ దీని అధికారిక నామం - The Day of Ashes అనగా నొసటిపై బూడిద వ్రాసుకొనే రోజని అర్థం. 

▪️ ఆరోజు ప్రతి ఒక్కరు నుదుట పైన బూడిదతో శిలువ గుర్తును ధరిస్తారు.

▪️ విభూతి బుధవారం, బూడిద బుధవారం అని అందురు.


💥 శ్రమ దినాలు/ శ్రమ కాలం : ఈస్టర్‌కు ముందు 40 రోజుల కాలమును శ్రమ కాలం అని పిలువబడేది. దీని అధికారిక నామం - Lent అనగా బుధవారం నుండి అనగా భస్మ బుధవారం ఈస్టర్ వరకు 40 వారపు రోజులలో పాటించే ఉపవాసం మరియు ఒకరి పాపాలకు పశ్చాత్తాపం చెందే కాలం.


🔴 భస్మ బుధవారమనేది శ్రమ దినాలలో ప్రారంభ దినం.


✅  ఎవరు చేస్తారు?

నేటి సమాజంలో క్రైస్తవులమని పిలువబడుతున్న లూథరన్లు, సి.ఎస్.ఐ, మెథడిస్టులు, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, రోమన్ కాథలిక్కులు, వీరి నుండి వివిధ శాఖలుగా వ్యాప్తి చెందినవారు, ఆంగ్లికన్ తెగలకు చెందిన ఆంగ్లికన్ క్రైస్తవులు, తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవులు వీరు "గ్రేట్ లెంట్" అని పిలువబడే లెంట్‌ను పాటించేవారు. నేటికి ఇతర ప్రొటెస్టెంట్ సంఘాలవాళ్ళు కూడ వీటిని ఆచరించుట మనం చూస్తున్నాము.


ఏ రోజు చేస్తారు?

ఈస్టర్ యొక్క ఆదివారానికి ముందు 40 రోజులు లెక్కించి(6 ఆదివారాలు మినహాయించి అనగా లెక్కించకుండా) చేస్తారు. ఇవి ఏటేటా ఫిబ్రవరి 4 నుండి మార్చి 11 మధ్య అనగా ఈస్టర్ యొక్క తేదీని బట్టే నిర్ధారణ చేసుకొని చేస్తారు. ఈస్టర్ కోసం తెలుసుకోవాలంటే మేము ముందుగా వ్రాసిన ఈస్టర్ క్లిక్ చేయు
అను అంశమును ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు.


ఎప్పుడు ప్రారంభం అయ్యింది?

మన పరిశుద్ధ గ్రంథములో ఎటువంటి ప్రస్తావన లేనప్పటికీ సంఘము ప్రారంభమైన 300సం. తరువాత అనగా 4వ శతాబ్దంలో ప్రారంభమైనదని నమ్మేవారు సంఖ్యా ఎక్కువగా కలదు. మరికొందరేమో 11వ శతాబ్దంలో ప్రారంభం అయ్యిందనీ చెప్తారు. ఇంకొందరు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రారంభించిన 5వ శతాబ్దపు పోప్ గ్రెగొరీ ది గ్రేట్ అనే వ్యక్తి ప్రవేశపెట్టారని చెప్పుకొనేవారు కూడా లేకపోలేదు.


▪️  శ్రమ దినాలు యొక్క మూలాలు మరియు ప్రారంభ చరిత్ర క్రీ.శ. 325లో నైసియా కౌన్సిల్ తర్వాతనే... 

▪️ క్రీ.శ. 333 ≈ 6 రోజులుగా చేసుకొనేవారు.

▪️ క్రీ.శ. 334 ≈ 46 రోజులుగా ప్రారంభం. 

▪️ క్రీ.శ. 390 ≈  శ్రమ దినాలు కొనసాగించుట కొరకు ముందుగా భస్మం బుధవారంగా జరుపడం ప్రారంభించారు.

▪️ ఆనాటి నుండే బూడిదెకు ఓలీవనూనె కలిపి నుదిటిపై శిలువ గుర్తు ఆకారం వేసుకొనే ఆచారం మొదలైంది. 


ఎందుకు భస్మ బుధవారం అన్నారు?

ఈస్టర్ తేది నుండి వెనుకకు 40 రోజులు లెక్కిస్తే(ఆదివారాలు మినహా...) వచ్చే వారం బుధవారం కాబట్టి ఈ రోజును భస్మ బుధవారం అన్నారు. అదే మంగళవారం వస్తే భస్మ మంగళవారం అనుండేవారేమో! 


ఎందుకు శ్రమ దినాలు అన్నారు?

భస్మ బుధవారం నుండి  ఈస్టర్ వరకు వచ్చే 40 వారపు రోజులలో వారు పాటించే ఉపవాసం మరియు ఒకరి పాపాలకు పశ్చాత్తాపం చెందే, దాన ధర్మాలు చేసే ఈ కాలాన్ని శ్రమ దినాలు అన్నారు. మునుపు బాప్టిస్ట్ సంఘ సభ్యులు తమ బాప్తిస్మం రోజుకు ముందు 40 రోజులు ఉపవాసం ఉండాలని అనుకొని జరిగించే ఈ ఆచారం కాస్త ఇప్పుడు ఈస్టర్ కి ముందు 40 రోజులు ఉపవాసం ఉండటం ఆచారంగా మారిపోయింది. 


ఎందుకు చేసేవారు? 

 పైన తెలిపిన ఆయా సంఘాలు వారు నుదుటికి సిలువ గుర్తు బూడిదను పూసుకొని, 40 దినాలు ఉపవాస, ప్రార్థనలో, దాన ధర్మాలు వలన ఇలా తమ ఆత్మలను శుద్ధి చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరవుతారని, మన్నైన నీవు మరలా మంటికే చేరతావు గనుక నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది రక్షించబడమని ఒకరినొకరు హెచ్చరిక చేసుకొనుటకు చేస్తున్నారనే నానుడి కలదు. మరికొందరు ఏమో పాత నిబంధనలో కొంత మంది బూడిదలో కూర్చొని విలపించినట్లు, దుఃఖించినట్లు, గోనెపట్ట కట్టుకొని ఉన్నట్లు ఉండే ఆయా సందర్భాలను ఆధారం చేసుకుని చేస్తున్నామని చెప్పుకొనేవారు కూడా లేకపోలేదు.


ఎలా చేసేవారు?

మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు "ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి —జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి."(యోహాను. 12:13). ఇలా ఆనాడు ఆయనను యెరూషలేములోకి స్వాగతం పలికిన సందర్భాన్ని ఆధారం చేసుకొనే ఈ మట్టల ఆదివారాన్ని ఆచరిస్తారు. ఇది ఈస్టర్ కి ముందుగాను వచ్చే ఆదివారం నాడు మరియు భస్మ బుధవారం తరువాత జరిగే పండుగ. దీని కోసం ఇక్కడ చర్చించ బోవడం లేదు కానీ ముందుగా వ్రాసిన "మట్టల ఆదివారం" క్లిక్ చేయు
అనే అంశాన్ని క్లిక్ చేసి పూర్తిగా చదవగలరు.


ప్రస్తుతం మన ప్రాంతాల్లో కూడా ఆరోజున ఖర్జూరపుమట్టలు దొరకనందున వాటి స్థానములో ఈత మట్టలను లేదా తాటి ఆకులను పట్టుకొని వాటికి పూలు గుచ్చి, హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ పాటలు పాడుతూ, బోలో యేసు మహారాజుకు జయము అంటూ వీధుల్లో తిరుగుతారు. ఇలా పట్టుకొని తిరిగిన వాటిని తిరిగి వారి సంఘాల్లో, ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా ఉండటం వారికి శుభప్రదమని భావిస్తారు. 


ఇలా ఎండిపోయిన మట్టలన్నీ కాల్చి, బూడిద చేస్తారు.  ఇలా కాల్చి బూడిద చేయడం అనేది కొందరు ఈస్టర్ ఆదివారానికి మరుసటి రోజే చేస్తే, మరికొందరు ఈస్టర్ నుండీ 50వ రోజున జరిగే పెంతెకోస్తు పండుగ దినాన చేస్తారు. ఇలా కాల్చి బూడిద చేసి దానిని సేకరించి, నిలువ చేస్తారు. అలా నిల్వ చేసిన బూడిదను మరుసటి సంవత్సరమున భస్మ బుధవారం రోజున ఉపయోగించేవారు. 


🧍🏿‍♂️ ఎలా చేసేవారంటే?     గత సంవత్సరమున సేకరించిన  బూడిదనే ఈ భస్మ బుధవారం నాడు ఆయా సంఘాపు పాస్టర్ లేదా బిషప్ వ్యక్తులు సిలువ ఆకారంలో విశ్వాసుల నుదుటిపై పూసి, వారి తలపై చల్లుతూ "మన్నైన నీవు మరలా మంటికే చేరతావు గనుక నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది రక్షించబడమని" చెప్పుతారు. ఈ పని బిషప్పులూ, పాస్టర్లే చేస్తారు. మరికొన్ని సంఘాల్లో ఐతే అక్కడ  విశ్వాసులే బూడిదను హోలీ వాటర్ అని చెప్పబడే నీళ్ళని లేదా ఒలీవ నూనె ని కలిపి నుదుట తమ నుదుటిపై సిలువ ఆకారపు గుర్తుగా పూసుకొంటారు. ఇలా చేస్తూ ఈ బూడిద పశ్చాత్తాపానికీ, మారుమనస్సుకీ గుర్తు అనీ, అందుకే దీనిని ఆచరిస్తున్నాము అనీ చెప్తారు.


బైబిల్ ఏమి సెలవిస్తుంది?

                   ప్రియమైన సహోదరులారా... ఈ భస్మ బుధవారం & శ్రమ దినాలనేవి మాత్రమే కాక మనం ఏమి చెయ్యాలనుకున్నా, ఏమి చేసిన సరి ఈ క్రింది మూడు విషయాలను మన మదిలో పెట్టుకొని చేయాలి. అదేమనగా...,

1) యేసుక్రీస్తు బోధలలో చెప్పబడిందా?

2) ఆదిమ అపోస్తులుల బోధలో చెప్పబడిందా?

3) ఆదిమ క్రీస్తు సంఘము అనుసరించిదా?

                  మన పరిశుద్ధ గ్రంథములో వీటిని గూర్చి రవ్వంతైన సమాచారం లేదు. యేసు గానీ, అపోస్తులలు గానీ చేసినట్టు గానీ, ఆజ్ఞాపించినట్టుగా గానీ ఒక్క ఆధారం లేదు, కేవలం క్యాథలిక్ సంఘపు బోధలే కానీ దైవ బోధ కాదు. మరి నేడు కొన్ని సంఘాల్లో ఎలా ఇంతలా వ్యాప్తి చెందాయంటే కేవలం దైవ గ్రంథాన్ని సరిగ్గా విభజన చేసి ఆలోచన చేయకపోవటం/ నేర్చుకోకపోవడమే/ నేర్పించకపోవడమే దీని ప్రధాన సమస్య.


🔵 భస్మ బుధవారాన్ని ఆచరించే వారు నుదుట బూడిద పూసుకునేవారు బూడిద అనేది పశ్చాత్తాపానికీ, మారుమనస్సుకీ గుర్తు అనీ భావించి అందుకే మేము దీనిని ఆచరిస్తున్నాము అనీ చెప్తారు. నిజానికి పశ్చాత్తాపం చెందడం కోసం, మారుమనస్సు పొందడం కోసం ఒక రోజు కేటాయించాల్సిన అవసరం ఏం ఉంది? అలా చెయ్యమని వాక్యంలో ఎక్కడ చెప్పబడింది?  క్రొత్త నిబంధన ప్రకారం ఏ మనుష్యుడైన పాపం విషయంలో పరిశుద్ధాత్మ చేతనే మొదటగా ఒప్పించబడతాడు. "అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.౹ ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.౹ లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును.౹" (యోహాను. 16:7-11). ఇలా ఆయన చేత ఒప్పించబడి, పశ్చాత్తాపంలోకి నడిపించబడి, మారుమనస్సు పొందుకునేలా ఆయనే నీ హ్రుదయములో పొడువబడే సందేశాన్ని వినిపిస్తారు. ఒక చక్కటి ఉదాహరణకు "వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని(పొడువబడి) —సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా౹ పేతురు– మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.౹" (ఆపో.కార్య. 2:37-38). ప్రతీ క్రైస్తవుడు మారుమనస్సు పొందటమనేది నిత్య దినచర్యగా ఉండాలి. అంతేకాని దాని ఒక రోజు కేటాయించి, ఆ రోజు మట్టుకు లేక ఆ నలభై దినాల మట్టుకూ ఆచార సంబంధమైనవేవో చేసేస్తే సరిపోతుంది అని చెప్పడమనేది పూర్తిగా బైబిల్ కి విరుద్ధమైన బోధ అగును కదా!


"యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది." (లూకా. 24:47) "ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.౹" (ఆపో.కార్య. 17:30) "...దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?౹" (రోమా. 2:4) "నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.౹" (ప్రకటన. 2:5) "మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని..." (ప్రకటన. 2:21). 


నేటి విశ్వాసుకులను వారి సంఘాల్లో భస్మ బుధవారం చేయుమని శోధించేవారు గ్రంధములో ఎన్నుకొనే కొన్ని వచనాలు ఏమనగా.., యోబు. 42:6; దానియేలు. 9:3; యోనా. 3:5-6; ఎస్తేరు. 4:1-3 వాటిని గూర్చి బోధిస్తూ వారికి వలె మేము నేడు చేస్తున్నామని తమ్మును తాము సమర్ధించుకొనే వారు లేకపోలేదు. అటువంటి వారికి సమాధానమేమనగా.., వారు కారణాలు బట్టి, పరిస్థితులు బట్టి, వారు దుఃఖిస్తూ, దేవున్ని వేడుకొంటూ, తమకు తామే బూడిదలో కూర్చొని మారుమనస్సు పొందే కార్యక్రమం చూడగలం. అంతేకాని సంవత్సరాంతం చేసే పనులకు మారుమనస్సు పొందుదాం అంటూ ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొని, అందరూ కూడుకొని, పశ్చాత్తాపపడట్లేదు. ఇలా చేయుటలో దైవ దృష్టికి శూన్యమే కదా!. మారుమనస్సు పొందాలి అనుకునే వ్యక్తి తనకు తాను వ్యక్తిగతంగా చేసే పని అది. అంతేకాని నేటి వలె "ఈ రోజు భస్మ బుధవారం కాబట్టే మనమంతా సంఘముగా కూడుకొని, అందరూ కలిసి పశ్చాత్తాపడదాం, ఈరోజే మారుమనస్సు పొందుదామని" ఇలా చేసినట్లుగా పైన పాత నిబంధనలో వచనములు చెప్పలేదని గమనించాలని కోరుచున్నాను. 


ఓ చదువరి... ఇన్ని మాటలడుకున్నప్పటికి కూడా ఇంకా పాత నిబంధన భక్తులకు వలె మేము చేస్తున్నాము, మా పాస్టర్ చెప్పేది చేస్తున్నాను, పాత నిబంధనలో ఉంది కదా ఇక తప్పేంటి అని నీకు నీవు సమర్ధించుకోవడానికి ప్రయత్నం చేస్తే... "మరి వారి వలె మీరెందుకు  గోనెపట్ట కట్టుకొని, బూడిదలో కూర్చుకోవడం లేదు? నుదుటికి సిలువ గుర్తు ఆకారములో బూడిద పూసుకొని అలా అందరూ తల మీద జల్లుకోమని బైబిల్లో ఎక్కడ ఉంది? గత సంవత్సరం మట్టల ఆదివారం లో ఉపయోగించే మట్టల యొక్క బూడిదనే భస్మ బుధవారం నాడు పూసుకోమని బైబిల్లో ఎక్కడ ఉంది?" వారికి వలె మేము చేస్తున్నామని అపోహ పడుతున్న మీ ఆలోచనలకి నా ప్రశ్నలను లేవనెత్తి ఆలోచింపజేశాను తప్పా మిమ్మల్ని అలా చేయమని కోరుట లేదని గమనించగలరు.


🔵 శ్రమ దినాలు(లెంట్ డేస్) ఆచరించే వారుకి దాని అర్థం గానీ, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి... అనే విషయాలు గూర్చి బైబిల్ లో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. మరి క్రీస్తుయేసు నందు ఉన్నవారు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో అనే విషయాలను దేవుడే ఎంతో స్పష్టంగా గ్రంథము రూపములో వ్రాసి అనుగ్రహించినప్పుడు, అందులో ఉన్నవి తెలుసుకొని అలా చేస్తే సరిపోతుంది కానీ బైబిల్ లేనివాటిని తిరిగి బైబిల్ కి కలిపి, చెరిపి చేసే అధికారం ఎవరికి ఇవ్వబడలేదు. కాబట్టి బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించనది ఏదైనా సరి అది కేవలం మనుషులు కల్పించిన ఆచారాలే అగును కదా. "మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా — ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి" (మత్తయి. 15:6-7). మనుషులు కల్పించిన ఆచారమే ఈ శ్రమ దినాలు. ఇలా వీటిని చేయమని బోధించే వారు, వీటి ద్వారా ఆరాధన చేసేవారు వ్యర్థమైన ఆరాధికులై యుందురు.


 యేసు బాప్తీస్మం పొందిన పిమ్మట(మత్తయి. 3:14-17) పరిచర్య ప్రారంభించే ముందు ఆయన 40 దినాలు చేసిన ఉపవాసాన్ని(మత్తయి. 4:1-2) ప్రామాణికం చేసుకొని మేము నేడు శ్రమ దినాలను(లెంట్ డేస్) ఆచరిస్తున్నాం అని చెప్పుకొనే వారు లేకపోలేదు. "బాప్తీస్మం ముందు అనగా 30 సం. వ్యవధిలో గానీ మరియు బాప్తీస్మం అనంతరం అనగా 33 1/2  సం. కాల వ్యవధిలో ఏటేటా ఆయన 40 దినాలును(లెంట్ డేస్) పాటించినట్టుగా ఒక్క వాక్య రుజువు ఉందా? లేదు కదా" కాబట్టి యేసు చేశారు కాబట్టి మేము చేస్తున్నమని ఎలా సమర్ధించుకోగలరు? దయచేసి ఆలోచించమని మనవి. 


ప్రియ చదువరి... అనేకమంది బోధకులు గ్రంథాన్ని సరిగ్గా విభజన చేతకాకే(2 తిమోతి. 2:15) తమకు నచ్చిన రీతిలో వాక్య వక్రీకరించి, వారి పద్ధతులను, ఆచారాలను, ఆలోచనలను బైబిల్ కి కలపడం వలనే ఈ భస్మ బుధవారం, శ్రమ దినాలు, మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, సమాధుల పండుగ, క్రిస్మస్...Etc. వంటివి పుట్టుకు వచ్చాయి. యేసుక్రీస్తు బోధ కంటే, ఆదిమ అపోస్తులుల బోధ కంటే, ఆదిమ క్రీస్తు సంఘము అనుసరించే బోధ కంటే ఇంకా గొప్పగా దేవునికి భక్తి చెయ్యాలనే వారి ఆలోచనలు వలనే ఇలాంటి పండుగలు పుట్టుకు వచ్చాయని గుర్తించుకో. మీలో ఏ ఒక్కరూ కూడా పరమతండ్రిని వ్యర్థంగా ఆరాధించేవారయ్యుండకూడదనే ఈ సంగతులను మీకు వ్రాసి ఇచ్చుచున్నాము. 

▪️ 2 తిమోతి 3:14: "... నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.౹"

▪️ 2 థెస్స 2:15 - "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి."

మీ ఆత్మీయులు

WhatsApp Join Us   Telegram Join Us

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

Note: Only a member of this blog may post a comment.

The churches of Christ greet you - Roma 16:16